15, ఆగస్టు 2017, మంగళవారం

బాల్యం నుంచి బాధ్యతల తుది అంచుల దాకా......(14)

భండారు వంశం – శ్రీ పర్వతాలరావు అముద్రిత రచన 


మా  బామ్మ రుక్మిణమ్మ గారికి ముగ్గురు కుమార్తెలు. ఆమె పెద్ద కుమార్తె అంటే మా పెద్ద మేనత్త రంగనాయకి భర్త, ఖమ్మం జిల్లాకు చెందిన కొలిపాక లక్ష్మీ నరసింహారావు గారు. నరసింహారావుగారి అన్నగారు కొలిపాక శ్రీరాం రావు గారు వరంగల్లులో పెద్ద వకీలు. ఈ అన్నదమ్ములకు ఇద్దరికీ ఖమ్మం, వరంగల్ జిల్లాలలో వందల ఎకరాల భూమి.  మా పెద్ద మేనత్త మొగుడు పెద్ద లాయరు కూడా. పిత్రార్జితంతో పాటు వకీలుగా మంచి పేరు, గట్టి ఆస్తులు సంపాదించారు. లక్ష్మీ నరసింహారావు గారి పెద్ద కుమారుడు రామచంద్ర రావు గారికి మా రెండో అక్కయ్య శారదను మేనరికం ఇచ్చారు. రెబ్బారంలో గ్రామంలో విద్యా సౌకర్యాలు విస్తరించడానికి ఆ గ్రామ సర్పంచుగా మంచి కృషి చేశారు. రెబ్బారం హైస్కూలు ఆవరణలో ఇటీవలే ఆయన స్మృత్యర్ధం శిలా విగ్రహం నెలకొల్పారు.
రెండో మేనత్త ఖమ్మం లో పెద్ద వకీలు, పెద్ద భూస్వామి అయిన పర్చా శ్రీనివాసరావు గారి భార్య. రైల్వే స్టేషన్ సమీపంలోనే ఆయనకు పెద్ద బంగ్లా వుండేది. అది పాత తెలుగు సినిమాల్లో జమీందారుల భవనంలా కనిపించేది. ఎత్తయిన మెట్లెక్కి పైకి వెళ్ళగానే ఎదురుగా ఒక పెద్దహాలు, దానికి ఇరువైపులా వరండాలు, మళ్ళీ వెనకవైపు మరో హాలు, ఇరువైపులా గదులు ఇలా చాలా విశాలంగా వుండేది. ఆయన ఆఫీసు గదిలో ఒక సీలింగు ఫ్యాను వుండేది. సీలింగు ఎత్తుగా వుండడం వలన అవసరం అయినప్పుడు ఫ్యానును కిందికి దించుకునే ఏర్పాటు వుండేది. మా మేనత్త మొగుడు కూర్చునే వకీలు కుర్చీ, దానికి ఎదురుగా పెద్ద మేజా బల్ల, అటూ ఇటూ క్లయింట్లు కూచోవడానికి కుర్చీలు చాలా అట్టహాసంగా ఉండేవి. ఆయన ప్రాక్టీసు కూడా అలానే వుండేది. ఇది కాక ఖమ్మం జిల్లాలో వాళ్ళ స్వగ్రామంలో భారీ ఆస్తులు ఉండేవి. దానికి ఆనుకుని ఉన్న కృష్ణా జిల్లాలోని గ్రామాల్లో కూడా భూములు ఉండేవి. వాటిమీద వచ్చే అయివేజు కూడా భారీగానే వుండేది. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. పీవీ నరసింహా రావు గారితో ఆయనకు మంచి సాన్నిహిత్యం వుండేది. ప్రధాని అయిన తరువాత కూడా పీవీని పేరుతొ సంబోధించే చనువు ఉన్న మనిషి శ్రీనివాసరావు గారు. ఆడపిల్లలకు విద్య ఆవశ్యకతను గుర్తించి ఆయన ఖమ్మంలో  బాలికల పాఠశాల ఏర్పాటుకు ఆయన దోహదపడ్డారు.
దాదాపు  తొంభై ఏళ్ళ వయస్సులో కూడా చెల్లమ్మగారు, మా బామ్మగారు పచ్చి మంచి నీళ్ళు సైతం ముట్టకుండా నిష్టగా ఉపవాసాలు చేసేవాళ్ళు. మళ్ళీ భారత భాగవతాలు చదవడం, యాత్రలు చేయడం అన్నీ ఉండేవి.  మా బామ్మ గారు కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉత్తర, దక్షిణ యాత్రలు అన్నీ చేసింది. చెల్లమ్మ గారు మాకు బుద్ధి తెలిసిన తరువాత ఎటూ వెళ్ళేది కాదు. ఎప్పుడూ కంభంపాడులోనే తావళం తిప్పుకుంటూ దైవ ధ్యానం చేసుకుంటూ, పిల్లలకు భారత, భాగవతాల్లోని పద్యాలు, కధలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేది. పొద్దుగూకేవేళకు  పిల్లలందరూ  ఆమె మంచం చుట్టూ మూగేవాళ్ళు. ఈ రోజు భండారు వంశంలో చాలామందికి పురాణాల మీద పట్టు చిక్కడానికి, సంస్కృతీ సంప్రదాయాలపట్ల అవగాహన కలగడానికి చెల్లమ్మగారి  ప్రవచనాలే కారణం. మా వూళ్ళో అప్పుడు పాతిక, ముప్పయిదాకా బ్రాహ్మణ గడప వుండేది. మూడు పంచాంగాలు మా వూరినుంచి వెలువడేవి. మా చిన తాతగార్లు ఇద్దరు సనాతన సంప్రదాయవాదులు. ఆ రోజుల్లో వైదికులు  చనిపోతే  వైదికులే మోయడం, నియోగులు పోతే నియోగులే మోయడం వుండేది. సామాన్యంగా ఒకరికొకరు శవవాహకులుగా వుండేవారు కాదు. అలాటిది చెల్లమ్మగారు పోయినప్పుడు వైదీకులు అయిన ఇంగువ వెంకటప్పయ్యగారు కూడా ముందుకు వచ్చి మోశారు. అప్పటికి మా నాన్నగారు పోయారు కాబట్టి నేనే (భండారు పర్వతాలరావు) అంత్యక్రియలు చేశాను. ఆమె ఎంతో పుణ్యాత్మురాలు. పరమ భాగవతోత్తమురాలు. సతతం రామనామ స్మరణలోనే జీవితం వెళ్ళతీసింది’ అని వెంకటప్పయ్య గారు అనేవారు.
ఇక మా అమ్మా నాన్నలు గురించి కొంత రాయాలి. మా నాన్న రాఘవరావు (వూళ్ళో అందరూ రాఘవయ్య గారు అని పిలిచేవాళ్ళు).
మా అమ్మగారి పేరు వెంకట్రామమ్మ. ఆమె కృష్ణా జిల్లా గండ్రాయిలో 1907  నవంబర్ ఒకటో తేదీన జన్మించింది. తండ్రి కొండపల్లి శ్రీనివాసరావు. తల్లి వెంకటమ్మ. పుట్టింటి వారిది శ్రీవత్స గోత్రం. చిన్న తనంలోనే తల్లీ తండ్రీ గతించారు. బాల్యం చాలా ఇబ్బందులతో గడిచిందని  చెబుతారు. ఆమె పెద్దన్న గారు కొండపల్లి రామచంద్ర రావు కష్టపడి చదువుకుని   ప్లీడరుగా బెజవాడలో ప్రాక్టీసు పెట్టి పేరుమోసిన న్యాయవాదిగా కీర్తి  గడించారు. ఆయన నివాసం వున్న రోడ్డుకు ఆయన పేరే పెట్టారు. రెండో అన్న కృష్ణారావు గారు గండ్రాయి కరణీకం చేస్తుండేవారు.
మా నాన్నగారు రాఘవరావుకు వివాహం చేయడానికి మా తాతగార్లు ముగ్గురూ గుమ్మడిదుర్రో మరే వూరో గుర్తులేదు, వెళ్లి పిల్లను చూసి సంబంధం అనుకూలంగానే వుందనుకుంటూ ఇంటికి తిరిగి వచ్చారుట. అదేసమయానికి, అప్పటికింకా ప్రాక్టీసు మొదలుపెట్టని మా పెద్ద మేనమామ రామచంద్రరావు గారు మా వూరు వచ్చి ఇంటి అరుగు మీద కూర్చుని మా తాతల రాకకోసం ఎదురు చూస్తున్నారు. మా నాన్న గారికి, ఆయన చెల్లెల్ని అంటే మా అమ్మగారిని ఇవ్వాలని వచ్చిన సంగతి అర్ధం చేసుకున్న మా తాతగార్లు అప్పుడేం చేయాలన్న మీమాంసలో పడ్డారు. వారు వెళ్లి వచ్చిన  సంబంధం వాళ్లు చాలా కలిగిన వాళ్లు. పదెకరాల తోట, సొమ్ములు పెడతాం అని చెప్పారట. ఇటు చూస్తే మా మేనమామ వాళ్ళది వేలు విడిచిన మేనరికం. బాగా లేమిలో వున్న కుటుంబం. యేది ఏమయినా రామచంద్రం వచ్చి కూర్చుని పిల్లను ఇస్తానంటున్నాడు. కనుక మేనరికం కాదని బయటకు పోవడం ఉచితం కాదని తీర్మానించుకున్న మా తాతగార్లు రామచంద్రరావును లోపలకు పిలిచి సంబంధం ఖాయం చేసారుట. అలా అయింది మా నాన్న గారితో మా అమ్మగారి పెళ్లి. ఈనాటిలా కాసులకు కాకుండా బంధుత్వాలకు ప్రాధాన్యం ఇచ్చే రోజులవి.
అలా కంభంపాడులో మా ఇంటి గడప తొక్కిన మా అమ్మ, దాదాపు అరవై ఏళ్ళపాటు ఆ ఇంటితో అనుబంధం పెంచుకుంది. మొత్తం పన్నెండు కాన్పులు. ఒక పిల్లవాడు (ఏడో కాన్పు) పురిటిలో పోగా, ఏడుగురు ఆడపిల్లలూ, నలుగురు మగపిల్లలు కలిగారామెకు.

కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు, ముని మనుమలు, ముని మనుమరాళ్లనే కాకుండా ముని ముని మనుమరాళ్లను కూడా కళ్ళారా చూసుకోగలిగిన  పూర్ణ జీవితం గడిపింది.”
(ఇంకావుంది)

5 వ్యాఖ్యలు:

శ్యామలీయం చెప్పారు...

మునిమనుమళ్ళ సంతానాన్ని ఇనిమనుమళ్ళంటా రనుకుంటాను. ఈ‌మాట మా అమ్మగారు వాడగా విన్నాను. ఈ అర్ధం కూడా అవిడ చెప్పినదే.

అజ్ఞాత చెప్పారు...

కుటుంబసభ్యులు

ముత్తాత, తాతమ్మ, జేజెమ్మ (తల్లి/తండ్రికి అమ్మమ్మ)
తాత, నానమ్మ లేదా, మామ్మ/బామ్మ మరియు అమ్మమ్మ
పెదనాన్న, పెద్దమ్మ (అమ్మక్క, ఆమ్మ, పెత్తల్లి, పెద్దతల్లి, డొడ్డమ్మ-గోదావరి జిల్లావారు)
తండ్రి, తల్లి
బాబాయి (చిన్నాన్న, పినతండ్రి), పిన్ని (చిన్నమ్మ, పినతల్లి, పింతల్లి)
సవతి
భార్య, భర్త
బావ, బావమరిది, మరిది
వదిన, మరదలు
మామయ్య, మేనమామ, మామగారు, అత్తయ్య, మేనత్త, అత్తగారు
కొడుకు, కూతురు
అల్లుడు, కోడలు
తోడికోడలు, తోడల్లుడు
మేనల్లుడు, మేనకోడలు
అన్న, తమ్ముడు (సహోదరుడు)
తోబుట్టువులు లేదా సహోదరులు
అక్క, చెల్లెలు (సహోదరి)
మనుమడు, మనుమరాలు
మునిమనుమడు, మునిమనుమరాలు
ఇనిమనుమడు, ఇనిమనుమరాలు
ఆడపడుచు

శ్యామలీయం చెప్పారు...

పెద్ద పట్టీయే యిచ్చారు. ధన్యవాదాలు.
పెదతల్లిని ఆమ్మ అనేవారు మా అమ్మగారు. 'సత్యవతి ఆమ్మ' అన్న మాట ఆవిడనోట చాలాసార్లే విన్నాను.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత: మీరు ఇచ్చిన జాబితా చాలా వివరంగా వుంది. కాకపొతే ఇని మనుమడు అనే పదం కొత్తగా వింటున్నాను ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

Chandrika చెప్పారు...

చాలా బావుంటున్నాయాండీ మీ బాల్యం, వంశం కబుర్లు. మీ ఊరిలో మీ ఇంటి ఫోటోలు పెడితే ఇంకా బావుంటుంది. మళ్ళీ వ్రాయలేదు. అయిపోయిందా లేక ఇంకొన్ని భాగాలూ ఉన్నాయా ?