1, ఆగస్టు 2017, మంగళవారం

ఆంధ్రపత్రిక మళ్ళీ వస్తోంది!


యాభయ్ అరవై ఏళ్ళ క్రితం, మా వూళ్ళో గూడా సత్యనారాయణ సిద్ధాంతిగారనే ఏజెంటుకి మూడున్నర రూపాయలు చందా కడితే నెల రోజులపాటు ఆనాటి ఆంధ్రపత్రిక మా ఇంటికి వచ్చేది. కానీ, అది మా వూరు చేరేసరికి మర్నాడు  సాయంత్రం అయ్యేది. అయినా, సరే అది చదువుతుంటే  ఏ రోజు వార్తలు, ఆరోజే తెలుసుకుంటున్న ఫీలింగ్‌ కలిగేది. ఊరు మొత్తానికి కలిపి ఇద్దరు ముగ్గురు మాత్రమే చందా కట్టి పత్రిక తెప్పించుకునేవారు. పోస్ట్ మాన్ చేతిలో ఆంధ్రపత్రిక కనబడగానే మా అందరికీ ప్రాణాలు లేచొచ్చేవి.
‘అమెరికా అధ్యక్షుడిగా జాన్ ఫిట్జరాల్ద్  కెనెడీ ఎన్నిక, ఓటమి అంగీకరిస్తూ నిక్సన్ ప్రకటన’ అంటూ పత్రికలోని వార్తలను స్కూలు మేష్టరుగారు శివరాజు అప్పయ్య పంతులు గారు ఉచ్చైస్వరంతో చదివి వినిపిస్తుంటే ఊరి వారందరూ పోగయి చెవులప్పగించి వినేవారు.
బెజవాడ గాంధి నగరంలో ఆంధ్రపత్రిక ఆఫీసు వుండేది. దాన్ని మద్రాసు నుంచి బెజవాడ తరలించినప్పుడు మా దగ్గరి బంధువు పినపాక ప్రకాశరావు గారు పత్రిక సంపాదకత్వ బాధ్యతలు చూస్తుండేవారు. ప్రముఖ రచయిత వీరాజీ కూడా అప్పుడే  మద్రాసు నుంచి మకాం బెజవాడకు మార్చుకున్నారు. బెజవాడలో సమాచార శాఖ అధికారిగా పని చేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారి ఆఫీసుకు వస్తుండేవారు. సి.కనకాంబర రాజు (సికరాజుగా, ఆంద్ర భూమి వారపత్రిక సంపాదకుడిగా ప్రసిద్ధుడు) కూడా నాకు అక్కడే పరిచయం.
తదుపరి నేను హైదరాబాదులో రేడియోలో చేరిన తరువాత బషీర్ బాగ్ చౌరస్తాలో ఆంధ్రపత్రిక ఆఫీసుకు వెడుతుండేవాడిని. సీ.వీ. రాజగోపాలరావు గారు రెసిడెంట్ ఎడిటర్. బ్యూరో చీఫ్ ముక్కు శర్మగారు, పాపయ్య శాస్త్రి గారు, సుందరం, (ఇప్పుడు లేరు), పాశం యాదగిరి, కే.వేణుగోపాల్, ములుగు రాజేశ్వర రావు, చుట్ట రాంప్రసాద్, విద్యారణ్య అక్కడ పనిచేస్తూ వుండేవారు. ఆ భవనం అంతెత్తున ఒక రాజ మహల్ ని తలపించేదిగా వుండేది. అంతటి భోగం అనుభవించిన ఆంధ్రపత్రిక చివరికి  గగన్ మహల్ లో ఒక  అద్దె ఇంటిలో తలదాచుకోవాల్సి వచ్చింది. అప్పటికే అది అవసాన దశకు చేరుకున్నట్టే. కాశీనాధుని నాగేశ్వరరావు, శివలెంక సంభుప్రసాద్, శివలెంక రాధాకృష్ణ చేతుల్లో పెరిగి పెద్దదయిన తెలుగువారి మొట్టమొదటి పూర్తిస్థాయి దినపత్రిక  ఆంధ్రపత్రిక, విద్యారణ్య మాటల్లో చెప్పాలంటే, ‘శివ సాయుజ్యం’ పొందింది.

ఆంధ్రపత్రిక లేకుండానే తెలుగు పత్రికారంగానికి  ఏండ్లు గడిచిపోయాయి. ఆ పత్రికలో పనిచేసి పేరు తెచ్చుకున్న జర్నలిష్టులందరూ వేరే పత్రికలకు మరలిపోయారు.  మళ్ళీ ఇన్నాళ్టికి ‘మహానగర్’ అనే ఓ చిన్న పత్రికను యజ్ఞంలా నడుపుకుంటున్న మనసున్న మారాజు ‘పాంచజన్యం’,  పెద్ద మనసు చేసుకుని ఆంధ్రపత్రికకు ఊపిరులూదాడు. ఆంధ్రుల కొత్త రాజధాని అమరావతిలో ఈ మధ్యనే వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభమై  మళ్ళీ జనం మధ్యకు వస్తోంది. సంతోషం!         

5 వ్యాఖ్యలు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

"పాంచజన్యం" గారికి 👏. నేనూ ఆంధ్రపత్రిక మీద పెరిగిన తరం వాడినే. పత్రిక తిరిగి వస్తోందంటే ఆనందంగా ఉంది.

శ్యామలీయం చెప్పారు...

స్వర్గీయ శివలెంక శంభుప్రసాద్ గారిని మరచిపోయారు. ఆయన ఆంధ్రపత్రిక భారతి రెండింటికీ అధిపతిగా ఉండేవారు కదా.

అజ్ఞాత చెప్పారు...

ఊపిరి తీసుకుని మరో జన్మ ఎత్తడం వరకూ సరే. బతికి బట్టకట్టవద్దూ? అదీ ఈ హైటెక్ యుగంలో? వెబ్ సైటు ఉందాండి దానికి? ఎంతకి అమ్ముతున్నారు రోజూ విడి పత్రికని? ఏమైన శుభంభూయాత్ అనక తప్పదు కదా? :-)

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@శ్యామలీయం - నిజమే. ధన్యవాదాలు. అయ్యవారి (శివలెంక శంభుప్రసాద్) పేరు కూడా చేర్చాను.

శ్యామలీయం చెప్పారు...

రెండు మూడు విషయాలు.
మొదటిది. 'శివలెంక సంభుప్రసాద్' అని పొరపాటున వ్రాసారు. అక్షరదోషం సరిజేయ ప్రార్థన.
రెండవది. 'ఈ మధ్యనే వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభమై' అన్నారు. ఈ వెంకయ్య నాయుడు కూడా ఆంధ్రులని నమ్మించిముంచిన మహాఘనుడే. ఆయన నయవంచనాపరాక్రమానికి మురిసిన ఆయన పార్టీవారు అత్యున్నత పదవీపౌరస్కారంతో వెంకయ్యగారిని గౌరవించ నిశ్చయించిన విషయం తెలుసును. ఆయన చేతులమీదుగా ఈ‌పత్రిక పునఃప్రారంభం కావటం మాత్రం చాలా అనుచితంగా అనిపిస్తోంది.
మూడవది. ఇది హైటెక్ యుగం అయ్యేది కాకపొయ్యేది - పార్టీబాకాల పత్రికలయుగం అని మాత్రం ఒప్పుకోవాలి. ఈ పునఃప్రారంభిత ఆంధ్రపత్రిక కూడా ఏదో పార్టీకి బాకా ఐతే అది చిరస్మరణీయమైన ఆ పత్రిక పేరుని దిగజార్చటమే అవుతుంది. ఏదో ఒక పార్టీకి బాకా కాకపోతే దాని మనుగడ కొంత కష్టమే అన్నదీ నిజమే అని ఒప్పుకోకతప్పదు.