8, జూన్ 2017, గురువారం

ఆకాశవాణిలో డి. వెంకట్రామయ్య అనుభవాలు

నా జీవితంలో రేడియో ఉద్యోగం ఓ ప్రధాన అధ్యాయం అనుకుంటే అందులో అన్ని పేజీల్లో కనిపించే పేరు  డి. వెంకట్రామయ్య.
నేను అభిమానించే ఈ  కధా రచయితే నాకు సహోద్యోగి కాగలడని నేను ఎన్నడు వూహించలేదు.
'డి వెంకట్రామయ్య' కధలపై నేను మరింతగా యిష్టం పెంచుకుంటున్న రోజుల్లోనే  ఆయన రాయడం బాగా తగ్గించారు.  తగ్గించారు అనడం కంటే రాయడం మానేశారు అంటే బాగుంటుందేమో! 
వస్తున్న కధల్లో రాశి పెరిగి, వాసి తగ్గి - ఆ బాపతు వాటిని 'చదవడం మానేస్తే పోలా' అని అనేకమంది చదువరులు అనుకుంటునట్టే , 'కాగితంపై కలం పెట్టగలిగినవాళ్ళందరూ కధలు రాయడం మొదలుపెట్టేసరికి- 'రాయడం మానేస్తే పోలా' అనిపించి రచనా వ్యాసంగానికి ఆయన దూరమయ్యారేమోనని నా అనుమానం. 
రచయితగా నాకు తెలిసిన వెంకట్రామయ్య గారు- నాకు వృత్తిపరంగా తెలిసివచ్చేనాటికే  'కలం సన్యాసం' స్వీకరించినట్టున్నారు.  అడిగినవారి కోసం అడపా దడపా రాయడం తప్పిస్తే- అప్పటినుంచీ కధా రచయితగా ఆయన రాసిందీ, రాస్తున్నదీ ఏమీ లేదనే చెప్పాలి.

1975 నవంబర్లో - తొలిసారి వెంకట్రామయ్యగారిని హైదరాబాద్ ఆకాశవాణి వార్తా విభాగంలో సహోద్యోగిగా కలుసుకున్నాను.  ప్రాచుర్యం పొందిన రచయితతో  ఏ అభిమానికయినా సాన్నిహిత్యం ఉండవచ్చుకానీ,  పాతికేళ్ళకు పైగా ఒకే కార్యాలయంలో కలిసి పనిచేయడం మాత్రం  అరుదు.
వృత్తిరీత్యా కలసి పనిచేసే ఉద్యోగాలు. ప్రవృత్తి రీత్యా  మావి ఉత్తర దక్షిణ ధృవాలు.  ఆయనకూ, నాకూ నడుమ శతసహస్ర వైరుధ్యాలు.
ఆయనకు నిశ్శబ్దం యిష్టం. వార్తలు ఎంపిక చేసేటప్పుడూ, వాటిని అనువాదం చేసేటప్పుడూ పనిచేసే వాతావరణం ప్రశాంతంగా వుండాలని  ఆయన కోరుకుంటారు.
నేను ఇందుకు  పూర్తిగా విరుద్ధం. పనిచేసేచోటపనిచేసేవాళ్ళందరూ హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ పనిచేస్తుంటే అలుపూ సొలుపూ వుండదన్నది నా థియరీ.
వైరుధ్యాలు ఇంతేనా అంటే ఇంతే కాదు ఇంకా వున్నాయి.
టేబుల్ పై కాగితాలన్నీ ఒక పధ్ధతి ప్రకారం సర్దిపెట్టుకోవడం ఆయనకలవాటు.
చెత్తబుట్టకూ, రాతబల్లకూ తేడా తెలియనంతగా, నానా చెత్త మధ్య కూర్చుని చెత్త రాతలు రాస్తూ వుండడం నా ప్రత్యేకత.
ఆ రోజుల్లో ఎవరయినా వార్త పట్టుకు వస్తే, అది ఆయన చేతులో పడితే ఇంతే సంగతులు. రేడియో మార్గదర్శిక సూత్రాలనూ, ఆనాటి బులెటిన్ ప్రాధాన్యతలనూ అప్పటికప్పుడు బేరీజు వేసుకుని 'ఈ వార్త యివ్వడం కుదరద'ని మొహమ్మీదే చెప్పేసేవారు. అంత నిష్టూరంగా అలా చెప్పకపోతే ఏం’  అనిపించేది కానీ ఆయన మాత్రం లేనిపోని భేషజాలు తనకు సరిపడవన్న తరహానే ప్రదర్శించేవారు. స్నేహితులనో, పరిచయస్తులనో, మొహమాటపడిపోయి  వ్యవహరించడం ఆయనకు చేతకాని పని. ఇలాంటి విషయాల్లో ఆయనకూ నాకూ మధ్య కొన్నిసార్లు అభిప్రాయ బేధాలు బయటపడేవి. బయట తిరిగే విలేకరులకు కొన్ని కొన్ని రకాల మొహమాటాలు  ఉండడానికి అవకాశం ఉండొచ్చన్న అభిప్రాయంతో ఆయన ఏకీభవించేవారు కాదు. దానితో, వార్త ఎందుకు యివ్వలేకపోయామో అన్నది సంజాయిషీ ఇచ్చుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్తితి నాది.
పని పట్ల ఆయన చూపే నిజాయితీ, నిబద్దతా అందర్నీ కట్టిపడేసేవి. బులెటిన్ ఆయన తయారుచేసారంటే,  దానిపై ఆయన ముద్ర స్పష్టంగా వుండేది. అందులో యితరుల జోక్యాన్ని ఆయన అనుమతించేవారు కాదు. ప్రజాసంబందాలకు పెద్దపీట వేసే మా బోంట్లకు ఆయన ఈ మొండి వైఖరి కొండొకొచొ కొన్ని చిక్కులు తెచ్చి పెట్టేది. అయినా ఆయన ధోరణి ఆయనదే. సిద్దాంతాలూ, సూత్రాలూ వల్లించే వాళ్ళల్లో, వాటికి కట్టుబడి వ్యవహరించేవాళ్ళని చాలా తక్కువమందిని చూస్తాం! వెంకట్రామయ్యగారు దీనికి పెద్ద మినహాయింపు. వార్తల విషయంలో ఎటువంటి మడులూ, దడులూ కట్టుకోకుండా, ఎటువంటీ దడుపూ లేకుండా నిర్భయంగా,  స్వేచ్చగా రేడియో వార్తలు ఇచ్చే నేను ఒక్క వెంకట్రామయ్య గారి విషయంలో కాస్త వెనుకా ముందూ చూడడానికి కారణం ఆయనలోని ఈ నిబద్దతే.  

ఆకాశవాణి ప్రాంతీయ వార్త విభాగంలో చేరిన చాలా కాలం తర్వాత నాకు ఆయన కధలు రాయడం పూర్తిగా తగ్గించిన సంగతి తెలిసింది. పత్రికల్లో, మీడియాలో పనిచేసే 'రచయితల'కు సొంత రచనలు చేసే తీరిక తక్కువన్న అభిప్రాయం ఒకటి ఉంది.నిజమేనేమో!
'పని రాక్షసుడి'గా పేరు పడ్డ వెంకట్రామయ్యగారు,
విధి నిర్వహణకు మాత్రమే ప్రాధాన్యం యిచ్చే వెంకట్రామయ్యగారు,
ఉద్యోగిగా తన కర్తవ్యాన్ని వొదిలిపెట్టి,
'వెంకట్రామయ్య'గా కధలు రాసుకోగలరని అనుకోవడం భ్రమ. అందుకే ఆయన 'రాయని రచయితగా మిగిలిపోయారు.
ఆయన మిత్రుల్లో చాలామంది మాదిరిగానే నాకూ ఇది ఏమాత్రం నచ్చలేదు. ఆయనతో పెంచుకున్న చనువునీ, సాన్నిహిత్యాన్నీ, స్నేహాన్నీ ఉపయోగించుకుని- వీలుదొరికినప్పుడల్లా కధలు రాయమని పోరేవాడిని. అలా వెంట పడగా పడగా బద్ధకం వొదుల్చుకుని  చివరికి ఒక కధ రాసారు.దాన్ని గురించి స్నేహితులతో చెబుతూ- 'యిది శ్రీనివాసరావు పుణ్యమే' అని, పాపపుణ్యాల పైనా, దేవుళ్ళూ దెయ్యాల పైనా  ఏమాత్రం నమ్మకం లేని వెంకట్రామయ్యగారన్నట్టు గుర్తు.
అతికొద్ది 'మంచి' కధలు రాసిన రచయితగా 'డి వెంకట్రామయ్య' అసంఖ్యాక చదువరులకు పరిచయం. కానీ ఆయన తన పేరుపెట్టు కోకుండానో, లేదా కలం పేరులాగా  'గళం'పేరుతోనో (కార్మికుల కార్యక్రమం లో రాంబాబు) రేడియోకి అసంఖ్యాకంగా రచనలు చేసిన సంగతి అందులో పనిచేస్తున్నవారికే తెలియదు. పేరు మీద వ్యామోహం పెంచుకోకపోవడంవల్లనే ఆయనకు రావాల్సిన పేరు ప్రఖ్యాతులు రాలేదని అనుకునేవారు కూడా వున్నారు. రాసినవి 'కొద్దే' అయినప్పటికీ, పుస్తక ప్రియులను 'పెద్దగా' ఆకట్టుకున్నవే ఆయన ఖాతాలో చేరాయి. అందుకే 'ఎన్ని' రాసారన్నది కాకుండా, 'ఏమి' రాసారన్నదానికి విలువ కట్టి పురస్కారాలు ఇస్తారనే మంచి పేరున్న 'రాచకొండ రచనా పురస్కారం' ఎంపిక కమిటీ  ఒక ఏడాది తన వార్షిక  పురస్కారాన్ని డి వెంకట్రామయ్యగారికి ప్రకటించింది.  పురస్కారానికి వున్న విలువ పురస్కార గ్రహీతను బట్టి మరింత పెరుగుతుంది అనడానికి ఇదో మంచి ఉదాహరణ. అలాగే, రావిశాస్త్రి గారికి వీరాభిమానిగా చెప్పుకోవడానికీ, ఒప్పుకోవడానికీ సంకోచించని వెంకట్రామయ్యగారికి ఇదో కలికితురాయి. మరెన్నో మంచి రచనలు చేయడానికి ఈ పురస్కారం ఆయనకి తగిన ప్రోత్సాహకారకం కాగలదని  ఆశించాను కాని, (రచన ఇంటింటి పత్రికలో సాయిగారు పట్టుబట్టి  నెలనెలా  రాయిస్తున్న రేడియో అనుభవాలు తప్పిస్తే) నాది పేరాశ అనే ఆయన తేల్చేసారు.
కాకపోతే, రచన సాయి గారి పుణ్యమా అని ఆయన రాసిన రేడియో అనుభవాలను ఎమెస్కో వారు ఒక పుస్తకంగా వేశారు. సంతోషం.
చక్కటి విషయాలు, ఎవరికీ తెలియనివి అనేకం రాసారు. మరింత సంతోషం.
ఈ పుస్తకాన్ని ఏకబిగువున చదివినప్పుడు చాలా మంచి పుస్తకం అనిపించక తప్పదు. అయితే  అదే సమయంలో స్వోత్కర్ష కొంత మోతాదు మించింది అనే అభిప్రాయం కూడా కలగక తప్పదు. తనని తాను  ఎలివేట్ చేసుకునే క్రమంలో కొందరు రేడియో సహోద్యోగులను చిన్న చూపు చూసారా అని కూడా కొండొకచో అనిపించక మానదు.
నిర్మొహమాటంగా వుండడం తన సహజ లక్షణమని నమ్మే వెంకట్రామయ్య గారు నా ఈ విమర్శను సరయిన రీతిలో స్వీకరిస్తారనే నమ్మకం నాకు  వుంది.
   


2 కామెంట్‌లు:

prasadklv చెప్పారు...

వెంకట్రామయ్య గారి గురించి చాలా నిర్మొహమాటంగా రాశారు మీరు.ఆయన రాసిన అనుభవాల పుస్తకం చదవాలని అనిపించేలా రాశారు.ఆయన వార్తలు విన్న అనుభవం నాకుంది.ఆయన రాంబాబు పాత్ర గుర్తుంది.ఆయన మా అన్నయ్య స్వర్గీయ కె.కె.మీనన్ కు ఇచ్చిన కథల పుస్తకం చదివాను.మీకు కృతజ్ఞతలు.

Andhra Talkies చెప్పారు...

గుడ్ ఆర్టికల్ సర్! చాలా బాగుంది
ఫుల్ ఎంజాయ్ మెంట్ బ్లాగ్... వీలయితే ఒకసారి ఇది కూడా చూడండి.