2, జూన్ 2017, శుక్రవారం

ప్రధమ కబళే మక్షికాపాతః

అంటే మొదటి ముద్దలోనే ఈగ పడిందని అర్ధం. నా పొరబాటు, గ్రహపాటు కారణంగా అదే జరిగిందివాళ. అందుకు ఆంద్ర జ్యోతి సంపాదకుడికి నా శతసహస్ర క్షమాపణలు. తెలంగాణా ఏర్పడి మూడేళ్ళు పూర్తయిన సందర్భంగా నేను రాసిన వ్యాసాన్ని ఆ పత్రిక వారు ఈరోజు ఎడిట్ పేజీలో ప్రచురించారు. అందుకు కృతజ్ఞతలు.
కాకపొతే, ఆ వ్యాసం తొలి వాక్యమే ఇలా మొదలవుతుంది.

“తెలంగాణా పంచాయతీరాజ్, ఐ.టీ. శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు....” (ఆయన మంత్రిత్వ శాఖ పంచాయతి రాజ్  కాదు).
చదువుకునే చిన్న పిల్లలకు కూడా చటుక్కున బోధపడే ‘తప్పు’ ఇది. తప్పు చిన్నదా పెద్దదా అన్నది ప్రశ్న కాదు, తప్పు తప్పే.
అందుకే అంటారు, తొందరపడి తప్పులు తొక్కితే తీరిగ్గా విచారించాల్సివస్తుందని.
అనుభవం వుందని విర్రవీగడం కాదు, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి.
కాకపొతే ఆ అనుభవమే వెంటనే నాచేత ఈ నాలుగు మాటలు రాయిస్తోంది.
ఎవరో తప్పు పట్టిందాకా ఊరుకోకుండా నా తప్పు నేనే ఒప్పుకుంటే సరిపోతుంది. అంచేతే.....
అందరికీ, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి యాజమాన్యానికీ, మంత్రి కేటీఆర్ కి మనఃపూర్వక క్షమాపణలు.

పొతే, మరో మనవి.
స్థలాభావం కావచ్చు. నేను రాసిన దాంట్లో ప్రచురణకు నోచుకోని ఒక పేరా వుంది. అదే ఇది.
కేసీఆర్ ఆంతరంగిక సమావేశాల్లో చెప్పేదేమిటో  తెలియదు కాని బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడినా ఆయన మాటల్లో తొంగి చూసేది ఒకే ఒక్క విషయం. అది బంగారు తెలంగాణా. ఆ దిశగా ఆయన చేయని ఆలోచన లేదు. వేయని పధకం లేదు. చర్చించని విషయం లేదు. 

ఆకాశ హర్మ్యాలు, ఆరు లేన్ల రహదారులు, హరితహారాలు, ప్రతి గడపకు  నల్లా నీళ్ళు, ప్రతి పొలానికీ సాగు నీళ్ళు, కనురెప్పపాటు కూడా పోని  కరెంటు, గొడ్డూ గోదాతో ఇంటిల్లిపాదీ హాయిగా కాపురం వుండే చక్కటి చిన్నారి లోగిళ్ళు, చదువుకునేవారికి దమ్మిడీ  ఖర్చులేని చదువు, చదువయిన వారికి కొలువు, చదువంటని వారికి తగిన ఉపాధి, ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి .......ఒకటా రెండా? ఇవన్నీ చదువుతున్నప్పుడు, వీటన్నిటి గురించి వింటున్నప్పుడు ఒక బక్కపలచటి మనిషి  మనస్సులో ఇన్నిన్ని  ఆలోచనలా! యెంత విడ్డూరం అనిపిస్తుంది. బంగారు తెలంగాణా తప్ప ఈ మనిషి కేసీఆర్ కు  వేరే ఏ ఇతర ఆలోచలు లేవా? రావా? అనికూడా అనిపిస్తుంది. ఇవన్నీ నెరవేరితే తెలంగాణా బంగారం కాకుండా ఉంటుందా! ఈ కలలు కల్లలు కాకూడదని కోరుకోనివారు తెలంగాణా గడ్డ మీద ఎవరయినా ఉంటారంటారా?

కామెంట్‌లు లేవు: