16, ఫిబ్రవరి 2017, గురువారం

విశిష్ట గుణాల సమాహారం కేసీఆర్ - భండారు శ్రీనివాసరావు

(ఫిబ్రవరి 17 కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని)
(PUBLISHED IN ANDHRA JYOTHY DAILY TODAY, 16-0202017, THURSDAY)
అద్భుతమైన తెలివితేటలతో రాణించాలంటే అమెరికా వెళ్లి హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకోనక్కరలేదని రుజువు చేసారు తెలంగాణా ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆ స్కూల్లో చదువుకుని వ్యవహారదక్షులయిన వారిని మించిన దక్షత  తనకుందని పలుమార్లు నిరూపించుకున్నారు. ఆ స్కూల్లో చదువుకుంటే కూడా  లభించని కామన్ సెన్స్ ఆయనలో పుష్కలం. అదే ఆయనకు శ్రీరామ రక్షగా నిలిచిందనుకోవాలి.
బిజినెస్ స్కూల్లో నేర్పే మోటివేషన్, డెలిగేషన్ మొదలయిన విషయాలు కేసీఆర్ కు పుట్టుకతోనే అబ్బాయి. రాజకీయాల్లో చేరి మంత్రిగా, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఈ లక్షణాలు ఎంతగానో ఆయనకు  ఉపయోగపడుతున్నాయి.
ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తిచేకున్నప్పుడు ఊహించని వ్యక్తి నుంచి  ఆయనకు దక్కిన  ఒక చక్కటి కితాబును ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
ఈ కితాబు ఇచ్చింది కూడా ఆషామాషీ మనిషేమీ కాదు. మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా వున్నప్పుడు చాలాకాలం ఆయన వద్ద సమాచార సలహాదారుగా పనిచేసిన ఆర్ధిక  వ్యవహారాల పాత్రికేయుడు సంజయ్ బారు. నిజానికి ఈ బారు గారు ప్రత్యేక తెలంగాణాకు బద్ధ  వ్యతిరేకి. కరడుగట్టిన  సమైక్యవాది. తన మనస్సులోని ఈ మాటని అయన ఏనాడూ  దాచుకోలేదు. అలాటి సంజయ్ బారు  తెలంగాణా కల సాకారం అయిన ఏడాది తరువాత  అన్నమాట ఇది. నిజానికి అక్షరాలా రాసిన మాట ఇది.  
డెక్కన్ హైదరాబాదు గురించి నేను భయపడ్డది ఏమీ జరగలేదు. ఇక్కడివారికి  అరమరికలు తెలియవు, ఆదరించి అక్కున చేర్చుకునే తత్వం ఇక్కడివారి సొంతం. అన్నింటికీ మించి ఈ నగరానికి వున్న ప్రత్యేక ఆకర్షణ, శోభ, సౌందర్యం  ఇవేవీ చెరిగిపోలేదు. (తెలంగాణా ఏర్పడ్డ తరువాత) ఇవన్నీ చరిత్ర పుటల్లో చేరిపోతాయేమో అని నేను భయపడ్డాను. కానీ నా సందేహాలన్నీ  పటాపంచలయ్యాయి' అని ఒక ఆంగ్ల జాతీయ దినపత్రికలో రాసిన వ్యాసంలో  పేర్కొన్నారు.
సంజయ్ బారు ఒక్కరే కాదు, హైదరాబాదు వాసులందరూ ఇదే అభిప్రాయంతో వున్నారు. కారణం ఏమిటంటేఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో అన్నట్టు వుండే కరెంటు సరఫరా గురించి వారు పెంచుకున్న ఆందోళన అనతికాలంలోనే  దూది పింజలా ఎగిరిపోయింది.  అయితే ఈ ఘనతను కేసీఆర్ ఏనాడూ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయలేదు. సరికదా, సమయం దొరికినప్పుడల్లా సంబంధిత మంత్రి, జెన్కో చైర్మన్, అధికారులు, సిబ్బంది  సమష్టి కృషి వల్లనే ఈ అద్భుతం’  సాధ్యం అయిందని పలుమార్లు బహిరంగంగా చెప్పుకొచ్చారు. పరిపాలనలో   ‘నేనుఅని కాకుండా మేముఅనే పదాన్ని మించిన  మోటివేషన్ ఏముంటుంది? అందుకే ఈ  విషయంలో ఇక ఆయన కొత్తగా నేర్చుకోవాల్సిన పాఠాలు లేకుండా పోయాయి. 
 అలాగే, బిజినెస్ గురువులు చెప్పే మరో అంశం డెలిగేషన్. అంటే అధికారాలు, బాధ్యతల బదిలీ. ముఖ్యమంత్రిగా ఎన్నో అధికారాలు తనవద్దనే కేంద్రీకృతం అయివున్నా వాటిని సంబంధిత మంత్రులకు, అధికారులకు కేసీఆర్  అప్పచెప్పేసారు. లక్ష్యాలు నిర్ణయించి, ఫలితాలు రాబట్టాలని నిర్దేశించారు. ఆన్నింటా తానయి, అన్నిట్లో వేలు దూర్చడం కాకుండా దశ, దిశలను నిర్దేశించడం వరకే తన పాత్రను పరిమితం చేసుకుని ఫలితాలు సాధించే పనిని ఎంచుకున్నారు. మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ ఇందుకు ఉదాహరణలు. ఇతర పరిపాలకులకు కూడా కేసీఆర్ చూపిన ఈ  బాట అనుసరణీయం.  తను బీపీ తెచ్చుకోకుండా, పనిచేయించేవారికి బీపీ తెప్పించకుండా పనులు జరిగేలా చూడడం వల్లనే రాష్ట్రంలో పరిపాలన నల్లేరు మీది బండిలా హాయిగా సాగిపోతోందనే అభిప్రాయం సర్వత్రా ఏర్పడడానికి కారణం ఇదే.
అనర్ఘలంగా ప్రసంగించేవారు రాజకీయుల్లో  చాలామంది కనబడతారు. కానీ ఆకట్టుకునేలా ఉపన్యసించడం కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య. తన ఎదురుగా వున్నశ్రోతలను బట్టి ఆయన ప్రసంగ శైలిని మార్చుకుంటారు. మహిళలు, ఉపాధ్యాయులు, మేధావులు, విలేకరులు ఇలా ఎవరికి తగ్గట్టు అప్పటికప్పుడు ఆయన ఉపన్యాస ధోరణి మారిపోతుంది. వారి వారి  అభిరుచులు,ఇష్టాఇష్టాలను గమనిస్తూ సంభాషణ కానీ ప్రసంగం కానీ కొనసాగించడం ఆయన ప్రత్యేకత. వేదిక ఎక్కి ఆశువుగా మాట్లాడితే ఇక దానికి అడ్డే వుండదు. అదే కాగితాలు చూస్తూ చదివితే పేలవంగా వున్నట్టనిపిస్తుంది. ఈ విషయం ఆయనే అనేక సందర్భాలలో స్వయంగా చెప్పారు. కాగితం చూస్తూ చదవడం తనకు ఇష్టం ఉండదని, అయినా కొన్ని కొన్ని అధికారిక కార్యక్రమాల్లో తప్పడం లేదని ఆయనే చెప్పారు. భోజనం వేళకు ఇంట్లో ఎంతమంది వుంటే అంతమందిని భోజనాలకు లేపడం ఆయనకు ఓ అలవాటని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. స్వతహాగా  భోజన ప్రియుడు కాకపోయినా ఇతరుల ఇష్టాఇష్టాలను గమనిస్తూ ఒక గృహస్తుగా భోజనాదికాలు కనుక్కుంటూ వుండడం ఆయనకు  అలవాటని కూడా చెబుతుంటారు. నాతొ సహా హైదరాబాదులోని చాలామంది విలేకరులకు ఇది అనుభవైకవేద్యమే. అంతే కాదు, దేశంలో ఏ ప్రాంతంలో ఏ వంటకాలు ప్రాచుర్యం పొందాయన్నది ఆయనకు కరతలామలకం. రాష్ట్ర విభజన తరువాత ఒకసారి బెజవాడ వెళ్ళిన కేసీఆర్  కు, అయన పరివారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విందు భోజనం ఏర్పాటు చేసారు. పొరుగు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాల ప్రత్యేకతలు అయిన పిండి వంటలు, ఇతర వంటకాలను కేసీఆర్ ఆ విందు సందర్భంగా సవివరంగా ప్రస్తావించారు. మా ప్రాంతపు వంటకాల గురించి మాకే ఇంతగా తెలియదు, ఆయన ఎప్పుడు ఇంత అధ్యయనం చేశారని ఆశ్చర్య పోవడం ఆంధ్రప్రాంతం మంత్రుల వంతయిందని మరునాడు పత్రికలు రాసాయి. అలాగే వివిధ ప్రాంతాల ఆచార వ్యవహారాల పట్ల కూడా ఆయనకున్న  అవగాహన అపరిమితం.
ఆయన దురదృష్టం ఏమిటంటే, కేసీఆర్ గురించి కొన్ని వర్గాల్లో ఒక అపోహ ఇప్పటికీ  వుంది, ప్రాంతీయ పార్టీ నాయకుడిగా ఆయన, తన ప్రాంత ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తారని. అంతవరకయితే పరవాలేదు. కానీ ఆయన్ని ఒక కరడు కట్టిన ప్రాంతీయ వాదిగా ముద్రవేసే ప్రయత్నం కూడా జరుగుతోందనేది కూడా వాస్తవం. కేసీఆర్  ప్రాంతీయవాది కావచ్చేమో కాని ప్రాంతీయ తత్వం మాత్రం ఆయన రక్తంలో లేదనడానికి ఎన్నో ఉదాహరణలు వున్నాయి.
సినీ నటుడు బాలకృష్ణ ఒకసారి ఓ పనిమీద తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుని కలుసుకుని ఒక వినతి పత్రం అందచేశారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఆయన శాసనసభ్యుడు. పైగా టీ.ఆర్.ఎస్. ప్రధాన రాజకీయ  ప్రత్యర్ధి తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన ముఖ్యమంత్రిని కలుసుకున్నది హైదరాబాదులోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రి చైర్మన్ హోదాలో, ఆ హాస్పిటల్ కు సంబంధించిన ఒక వ్యవహారంలో. అయినా కేసీఆర్ వెంటనే సానుకూలంగా స్పందించి అధికారులకు తదనుగుణంగా ఉత్తర్వులు ఇచ్చారు. బాలకృష్ణ గారు అడిగింది  ఆయన స్టూడియోకో, లేదా వ్యాపార వాణిజ్య అంశానికి సంబంధించిన విషయమో కాదు, ప్రజలకు ఉపయోగపడుతున్న దవాఖానా గురించి. అలాంటప్పుడు ఆలోచించాల్సింది ఏమిటన్నదికేసీఆర్ ప్రశ్న. అందుకే ఆయన ఏమాత్రం సంకోచించకుండా స్పందించారు. అటువంటి విషయాల్లో ప్రాంతీయ తత్వం పనికి రాదన్నది కేసీఆర్ సిద్ధాంతం.
రాజనేవాడికి స్పందించే గుణం వుండాలని కౌటిల్యుడు అర్ధశాస్త్రంలో చెబుతాడు. తెలంగాణా తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఈ లక్షణం అతికినట్టు సరిపోతుంది.
ప్రతిరోజూ క్రమం తప్పకుండా అన్ని దిన పత్రికలు చదవడం ఎన్నో ఏళ్ళుగా ఆయనకు వున్న అలవాటు.  పత్రికల్లో వచ్చే ముఖ్యమైన వార్తలను క్రోడీకరించి అనుదినం అందించే యంత్రాంగం ప్రతి ముఖ్యమంత్రికి వున్నట్టే కేసీఆర్ కి కూడా వుంది. అయినా ఆయన స్వయంగా ప్రతి పత్రికను ఆమూలాగ్రం చదువుతారు. చదివిన తరువాత ఆయా విషయాల మీద ఆయన తక్షణం స్పందించే తీరు కొన్ని సందర్భాలలో కొందరు అశక్తుల విషయంలో వరంగా మారుతోంది. అలా అయాచితంగా లబ్దిపొందిన కుటుంబాల్లో మాదీ ఒకటి.
మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు అయిదుగురు ముఖ్యమంత్రుల వద్ద వరుసగా  పీ ఆర్ ఓ గా (చెన్నా టు అన్నా, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకట్రాం, కోట్ల విజయ భాస్కర రెడ్డి, ఎన్టీ రామారావు) పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసి స్వచ్చంద పదవీవిరమణ చేసారు. ఉన్నతోద్యోగాలు చేసి కూడా  ఒక సొంత గూడంటూ ఏర్పాటు చేసుకోలేని స్తితిలో ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. కొన్ని వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఆయన పెన్షన్ మొత్తాన్ని అమ్ముకున్న ఫలితంగా మా ఒదినె సరోజిని గారికి కుటుంబ పెన్షన్ పదేళ్లుగా రాని పరిస్తితి. విన్నపాలు, వినతి పత్రాలు మినహా కోర్టు గుమ్మం తట్టకూడదనే  సంస్కారం కలిగిన కుటుంబం. ఈలోగా ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. సాయం చేయాలని వారికి  మనసులో యెంతగా  వున్నా, నిబంధనల కారణంగా  ఏమీ చేయలేని స్తితి. ఈ నేపధ్యంలో రాష్ట్రం రెండుగా విడిపోయింది. తెలంగాణా ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. కేసీఆర్ కు వున్న పత్రికలు చదివే అలవాటు దాదాపు మూసివేసిన  ఈ ఫైలుకు మళ్ళీ ప్రాణం పోసింది. మా అన్నగారి వర్ధంతిని పురస్కరించుకుని మిత్రుడు  జ్వాలా నరసింహారావు ఆంధ్రజ్యోతిలో రాసిన ఒక వ్యాసంలో ఈ పెన్షన్ వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఈ కేసులో దాగున్న  మానవతా కోణం ఒక్కటేముఖ్యమంత్రి కేసీఆర్  కంటికి కనిపించింది. అంతే! ఏళ్ళతరబడి ఎదురుచూస్తున్న ఆ డెబ్బయి ఎనిమిదేళ్ళ  వృద్దురాలికి నిబంధనలు సడలించి  పెద్దమనసుతో ఆయన పెన్షన్ మంజూరు చేశారు. శతమానం భవతి అని కేసీఆర్ ని మనసారా  ఆశీర్వదించడం  ఒక్కటే కృతజ్ఞతలు తెలపడానికి  ఆమెకు మిగిలిన దారి. ఇక ఈ క్రమంలో సహకరించిన ఆంధ్రజ్యోతితో సహా అందరికీ మా కుటుంబం తరపున ధన్యవాదాలు. (15-02-2017)


(Courtesy, Editor, Andhra Jyothy)

రచయిత మొబైల్: 9849130595 ఈ మెయిల్:  bhandarusr@gmail.com  


13 కామెంట్‌లు:

Lalitha చెప్పారు...

మనస్పూర్తిగా రాసిన ఇలాంటి మంచి మాటల వ్యాసాలు ఎంత బావుంటాయోనండి - that too in these days of negative publicity. పంచుకున్నందుకు ధన్యవాదాలు!

sarma చెప్పారు...

శతంజీవం శరదో వర్ధమానా ఇత్యపినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుత ఏనా వర్ధయన్తి శతమేనమేన శతాత్మానం భవతి శతమనంతం భవ తి శతమైశ్వరయం భవతి శతమితి శతం దీర్ఘమాయుః//

Chandrika చెప్పారు...

కెసిఆర్ గారి గురించి చాలా బాగా చెప్పారు. మీ వ్యాసాలు, వనం జ్వాలా గారి వ్యాసాలు చాలా బావుంటాయి. ఎంతయినా old is gold కదా :)

సత్తిబాబు చెప్పారు...

నమస్కారం,

అయ్యా! తెలంగాణా ఉద్యమం పేరు చెప్పి కెసిఆర్ గారు ఆంధ్రులందరినీ ఒకే గాటన కట్టి బూతులు తిట్టటం, ఆంధ్రుల వంటకాలను తిట్టటం మొదలైనవి మీకు యిప్పుడు కనిపించలేదా? గద్దె ఎక్కిన క్రొత్తలో ఆంధ్రా వాళ్ళ లెక్క తెలుస్తానన్న సర్వే తెలియదా? మీ అన్నగారికి న్యాయం చేశారన్న ఒక్కకారణం చేత, మీరు జర్నలిస్టు కావడం చేత, ఆంధ్రజ్యోతికి కెసిఆర్ ని సంతుష్టి పరచాలన్న కోరికచేత ఈ వ్యాసం ప్రచురించబడినది అనిపిస్తోంది. పేరు మోసిన జర్నలిస్టులు గానీ, నాయకులుగానీ, సినిమా వారు కానీ, పత్రికలు కానీ ఇప్పటికైనా ఆంధ్రను పట్టించుకున్నారా? ఉద్యమ సమయంలో తెలంగాణ వారు చేసే వాదనలలో నిజానిజాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగారా ఎవరైనా? సగటు ఆంధ్రా వాళ్ళకి తెలంగాణ కు జరిగిన అన్యాయమేమిటో కూడా తెలియదు. విభజన అయింది. విభజనే అయిన మూడేళ్లకు కూడా అన్నిటికి ఆంధ్రులే కారణమన్న పాతపాటే పాడుతున్నారు.

-సత్తిబాబు.

Zilebi చెప్పారు...ఏమండీ సత్తిబాబు గారు

బాగున్నారా ?

జిలేబి

సత్తిబాబు చెప్పారు...

నమస్కారమండీ జిలేబి గారూ! మీరు కులాశానా?

-సత్తిబాబు

Zilebi చెప్పారు...కులాశా యే నండీ

ఏమిటీ కొత్త అవతారం :)

జిలేబి

సత్తిబాబు చెప్పారు...

కులాశాల కాలక్షేపానికి భండారు వారు క్షమించాలి.

జిలేబిగారు: అవతారం?!??

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

అభినందించిన లలిత, శర్మ, చంద్రిక గార్లకు ధన్యవాదాలు. తమ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలియచెప్పిన సత్తి బాబు గారికి కూడా కృతజ్ఞతలు. - భండారు శ్రీనివాసరావు

అజ్ఞాత చెప్పారు...

jilebiki maa baagaa ayiMdi

అజ్ఞాత చెప్పారు...

జిలేబిగారు, జంతిక గారు, చేగోడీ గారు, జాంగ్రీ గారు, గులాబ్ జాం గారు. గారు అవసరమా?

భండారు సార్ దిల్ కుశ్.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@సత్తిబాబు: "గతంలో, ఒక ముఖ్యమంత్రి దగ్గర పీఆర్వో గా పనిచేసిన అధికారి, ఏదయినా పనిపై ముఖ్యమంత్రిని కలవాలని వచ్చిన వారికి ఒక మార్గం చెబుతుండేవారు. విజ్ఞప్తి పత్రాలు ఇచ్చేబదులు, యే జర్నలిష్టునయినా పట్టుకుని ‘ఆ విషయం’ పత్రికలో వచ్చేలా చూసుకోమని సలహా ఇచ్చేవారు. అలా వచ్చిన వార్తపై ముఖ్యమంత్రి స్పందించి ‘తక్షణచర్య’ తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు ప్రెస్ రిలీజ్ ఇచ్చేవారు. పత్రికల్లో పడే వార్తలకు గౌరవం ఇస్తారనే మంచి పేరు ముఖ్యమంత్రికి రావడం తో పాటు , ఆ వార్తలు రాసే జర్నలిష్టులకు ‘పలుకుబడి’ కూడా పెరిగింది. ఈ ‘ఉభయతారక విధానం’ ఆ పీఆర్వోకి ‘అత్యంత సమర్ధుడైన అధికారి’ అనే కితాబుని కట్టబెట్టింది.

ఒక పెద్ద పత్రికలో వార్త పడ్డప్పుడు జనం దాన్ని గురించి మాట్లాడుకుంటారు. చదివిన వాళ్ళు దానిపై మరింత చర్చించుకుంటారు. నిరక్షురాస్యులయిన వారు ఆ వార్త విని ‘ఔనా’ అనుకుంటారు. అధికారులు స్పందిస్తారు. అనధికారులు వీలునుబట్టి ఖండిస్తారు లేదా హర్షిస్తారు. సాధారణంగా జరిగే తంతు ఇది. నిజాయితీ, నిబద్ధత, విశ్వసనీయత వార్తకు ప్రాణం పోస్తాయి. ఇవి లేని వార్తకు ప్రాణం వుండదు. ప్రామాణికం వుండదు. కానీ, ఈనాడు ఈ మూడింటికీ ఏమాత్రం విలువ ఇస్తున్నారో తెలియని విషయం కాదు.

వార్తకు ప్రాణం పొయ్యడం కంటే పత్రికల మనుగడే ముఖ్యం అనుకున్నప్పుడు –పత్రికల ద్వారా సాధించాల్సిందీ, సంపాదించాల్సిందీ ఇంకేదో వుందనుకున్నప్పుడు – పత్రికా స్వేచ్చకు అర్ధమే మారిపోతుంది.

అజ్ఞాత చెప్పారు...


అనాని మెస్సు అరిసెల్ గారెల్