25, ఫిబ్రవరి 2017, శనివారం

నిజాయితీకి ఇచ్చే నజరానా ఇదా? – పార్ధ సేన్ శర్మ ఐ.ఏ.ఎస్.


(ఒక ఐ.ఏ.ఎస్.అధికారి అంతరంగ ఆవిష్కరణ)
అతనొక నిఖార్సయిన అధికారి. ప్రభుత్వంలో కార్యదర్శి హోదా కలిగిన సీనియర్ అధికారి. అయితే మాత్రమేం  ఒక ట్రయల్ కోర్టులో ముద్దాయిగా నిలబడక తప్పలేదు. తప్పు లేదు, చట్టం ముందు అందరూ సమానులే. కానీ ఇతడి విషయం వేరు. కోర్టులో నిలబడి న్యాయమూర్తిని ఏమి కోరాడో తెలుసా?
“కోర్టు ఖర్చులు భరించగల స్థోమత లేదు, నన్ను జైలుకు పంపించండి’ అని.
అయితే ఏ దశలోనూ ఆ అధికారి మీద నేరం రుజువు కాలేదు. అంటే ఏమిటి అర్ధం? యావత్ దేశం తలవంచుకోవాల్సిన సందర్భం. అలా జరిగిందా. లేదు. ఎందుకంటే మనది మహాత్ములు పుట్టిన పుణ్యభూమి.
సీనియర్ అధికారులు, మీదు మించి సమర్ధులు, నిజాయితీపరులు ఇలా కోర్టు గుమ్మాలు ఎక్కాల్సిన స్తితి దాపురించడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైనది ఒక చట్టం. దానిపేరు అవినీతి నిరోధక చట్టం, 1988. ఎంతో సమున్నత లక్ష్యం కలిగిన ఈ చట్టాన్ని లోతుగా పరిశీలిస్తే అందులో దాగున్న ‘విషపు కోరలు’ కానవస్తాయి. మరీ ముఖ్యంగా ఈ చట్టంలోని 13 వ సెక్షన్. ఒక అధికారి తీసుకునే నిర్ణయం వల్ల ఎవరయినా లబ్ది పొందితే ఆ అధికారి కూడా నేరంలో భాగస్వామి అవుతాడని ఈ సెక్షన్ నిర్దేసిస్తోంది.
ప్రభుత్వం అంటేనే పనులు చేసిపెట్టడం. ఎవరికీ ఎలాంటి ప్రయోజనం కలగని పనులంటూ వుండవు. ఉదాహరణకు ఒక ఋణం మంజూరు చేసినా, భూమిని కేటాయించినా, ఒక కాంట్రాక్టు ఇచ్చినా, కొనుగోలు ఒప్పందం చేసుకున్నా ఎవరో ఒకరు ఖచ్చితంగా లబ్ది పొందడం ఖాయం. అలా జరగకుండా పనులు చేయాలంటే అసలు పనులనేవే జరగవు.  పాలన స్థభించి పోతుంది. ఇటువంటి సందర్భాలలో ఒక పదం వాడుతుంటారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని. మరి ఇలా తీసుకునే ఈ నిర్ణయాలన్నీ ప్రజా ప్రయోజనాలకోసమేనా అంటే అదొక సమాధానం రాని  ప్రశ్న అనడం కంటే జవాబు లేని ప్రశ్న అంటే సముచితంగా ఉంటుందేమో!
యావత్ దేశం అభివృద్ధి దిశగా పయనిస్తున్న తరుణం. రాజకీయ వైరుధ్యాలు, నా మాటే చెల్లుబడి కావాలనే తత్వాలు, మీడియా పరిశోధనలు, నైతికపరమైన సంశోధనలు, న్యాయపరమైన అంశాలు ఈ దారిలో ఎదురై ఒక రకమైన అపనమ్మక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. దానితో అధికారులు తీసుకునే ప్రతి నిర్ణయం పరీక్షకు గురవుతోంది. అంతే నిర్ణయం వెనుక ఉద్దేశ్యాలను ఆపాదించడం జరుగుతోంది. క్రికెట్ మైదానంలో నిలబడ్డ బాట్స్ మన్ ప్రతి బంతినీ సిక్స్ గా ఎందుకు మలచడం లేదు అని గేలరీలనుంచి చూస్తూ ప్రశ్నించడం తేలికే. అదే ఇరవై రెండు గజాల దూరంలో బ్రెట్ లీ బంతిని విసురుతున్నప్పుడు అది ఎంతకష్టమైన కార్యమో అర్ధం అవుతుంది.
ఇప్పుడు దేశంలోని సివిల్ సర్వీసు అధికారులు కోరుతున్నది ఒక్కటే. వారు తీసుకునే నిర్ణయం వల్ల అయాచిత ప్రయోజనం ఎవరికయినా కలిగిందని సందేహం కలిగినప్పుడు, అతడిమీద క్రిమినల్ కేసు పెట్టడానికి ముందు, ఆ నిర్ణయం కారణంగా ఆ అధికారికి వ్యక్తిగత ప్రయోజనం లభించిందని రుజువు చేయాలి. యిందుకు అనుగుణంగా అవినీతి నిరోధక చట్టాన్ని సవరించాలి. సమర్దుడయిన, నిజాయితీ పరుడయిన అధికారి ఎవరయినా సరే తన విధులను, కర్తవ్యాలను నిర్భయంగా నిర్వహించాలంటే చట్ట సవరణ ఒక్కటే మార్గం.నిబద్దతతో వ్యవహరించే అధికారులు అనవసరమైన వేధింపులకు గురికాకుండా చూడాలంటే ఇది తప్పనిసరి. రాజ్యసభ సెలెక్ట్ కమిటీ ఇప్పటికీ ఇందుకు సంబంధించి ఒక నివేదికను రూపొందించి సభకు సమర్పించింది కూడా. సెక్షన్ పదమూడును మార్చాలని ఈ కమిటీ సూచించింది. 2013లోనే ఈ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కానీ ఇంతవరకు దానికి మోక్షం సిద్దించలేదు.

సివిల్ సర్వీసుకు ఎన్నికయిన యువ అధికారులకు సీనియర్ అధికారులు ఒక సలహా ఇస్తుంటారు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోమనీ,  ప్రజల ప్రయోజనాలకోసం తీసుకునే ఏ నిర్ణయమైనా మంచి నిజాయితీ కలిగిన అధికారులకు ఎలాంటి హాని చేయదనీ, వారి నిబద్దతే వారిని కాపాడుతుందని. వాస్తవంగా అలా జరుగుతోందా అంటే అనుమానమే. ఇంకొక విచిత్రం ఏమిటంటే, ఇలా నిర్ణయాలు తీసుకుని చిక్కుల్లో పడ్డ అధికారులలో ఎక్కువమంది మంచి నిజాయితీపరులు వుండడం.
(టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో)

4 వ్యాఖ్యలు:

Jai Gottimukkala చెప్పారు...

"మరీ ముఖ్యంగా ఈ చట్టంలోని 13 వ సెక్షన్. ఒక అధికారి తీసుకునే నిర్ణయం వల్ల ఎవరయినా లబ్ది పొందితే ఆ అధికారి కూడా నేరంలో భాగస్వామి అవుతాడని ఈ సెక్షన్ నిర్దేసిస్తోంది."

ఈ వ్యాఖ్యానం సరి కాదు. సెక్షనులో dishonestly, fraudulently లాంటి పదాలను విరివిగా వాడారు. ఎటువంటి తప్పూ చేసే ఉద్దేశ్యం లేకుండా పొరపాట్లు చేస్తే సెక్షన్ వర్తించదు.

Zilebi చెప్పారు...


Jaigotti Garu

The onus of proving honesty and non-fraud lies on the officer concerned rather than on the person pititioning for it providing proof of dishonesty in the current times;

that crack goes always against the civil servant standing before the court again and again

జిలేబి

Jai Gottimukkala చెప్పారు...

@Zilebi:

నిజం కాదండీ. ఎక్కడయినా నేరం (అవసరం అయినప్పుడు నేర ఉద్దేశ్యంతో సహా) నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ వారిదే.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

Onus గురించి కరక్ట్ గా చెప్పారు గొట్టిముక్కల గారు. Burden of proof ప్రోసిక్యూషన్ వారిదే. చాలా మటుకు నిందితుడికి Presumption of innocence అన్వయిస్తారు, నేరం ఋజువయ్యేంత వరకు. అలా కాకపోతే న్యూసెన్స్ అయిపోదూ - మనకి నచ్చని వాడి మీద కేసు బనాయించి, నువ్వు నిర్దోషివని నువ్వే నిరూపించుకో అనే ప్రమాదం ఉంటుందిగా !