2, సెప్టెంబర్ 2016, శుక్రవారం

మరపురాని మనీషి వైఎస్ఆర్

ఈరోజు  వైఎస్ఆర్ వర్ధంతి

(PUBLISHED IN SAKSHI TELUGU DAILY ON 02-09- 2016, FRIDAY)
 “కాంతమ్మకు కాళ్ళూచేతులూ ఆడడం లేదు. మూడేళ్ళ పిల్ల వున్నట్టుండి కాళ్ళూచేతులూ కొట్టుకోవడం మొదలెట్టింది. సమయానికి మొగుడు కూడా ఊళ్ళో లేదు. టైము చూస్తె అర్ధరాత్రి. పొరుగూరుకు వెడితే కానీ డాక్టరు దొరకడు. దిక్కుతోచని కాంతమ్మకు ఏం చేయాలో తోచడం లేదు”
“రామనాధానికి సర్కారు మీద చెప్పరాని కోపం వస్తోంది. కూతురు, అల్లుడు పండక్కి వచ్చారు. ఒక్కగానొక్క  మనవాడికి వొళ్ళు కాలిపోయే జ్వరం.  వూళ్ళో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఉందన్న మాటే కానీ, డాక్టరు ఎప్పుడూ కంటికి కనిపించడు. మిగిలిన సిబ్బంది అందించే సేవలు అంతంతమాత్రమే. మందులు మచ్చుకు కూడా దొరకవు. ఆందోళనలో వున్న రామనాధం, వాకబు చేస్తే అలవాటయిన జవాబే వచ్చింది.  డాక్టరూ లేడు, సిబ్బందీ లేరు. దూరాన వున్న బస్తీకి టాక్సీ కారులో తీసుకువెళ్ళి వైద్యం చేయించాల్సి వచ్చింది. నానా హైరానా పడిన రామనాధానికి కోపం రాకుండా ఉంటుందా? కానీ ఎవరి మీద  చూపించాలి కోపం? ఎవరిమీద పిర్యాదు చేయాలి పాపం?”
“వెంకటరావు వుంటున్న వూరు ఒకమోస్తరుగా పెద్దదే. అక్కడ పెద్ద ఆసుపత్రులతో పాటు పెద్ద పెద్ద డాక్టర్లూ  వున్నారు. భార్యకి గుండె నొప్పి లక్షణాలు కనిపిస్తే,  పెద్ద డాక్టరు వద్దకి వెళ్లి, పెద్ద ఫీజులు చెల్లించి పెద్ద వైద్యమే చేయించాడు. కాస్త నెమ్మదించిన తరువాత ఆ పెద్ద డాక్టరు రాసిచ్చిన పెద్ద మందుల జాబితాలో కొన్ని ఆ వూళ్ళో ఎన్ని మందుల దుకాణాలు గాలించినా దొరకలేదు. దొరికే షాపు ఎక్కడ వుందో తెలియక తల పట్టుకున్నాడు వెంకటరావు.”
“జోగయ్యకు వున్నట్టుండి భరించలేని కడుపు నొప్పి పట్టుకుంది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్ళారు. అదృష్టం డాక్టరు వున్నాడు. వెంటనే  ఎక్సరే తీయించాలని అన్నారు. ఇంకో అదృష్టం అక్కడ ఎక్సరే యంత్రం వుంది. దురదృష్టం కూడా వెంటే వుంది. ఎక్సరే తీయాల్సిన టెక్నీషియన్  లేడు. పొరుగూరికి బస్సులో తీసుకువెళ్ళారు. దురదృష్టం అక్కడ కూడా  కాచుకుని వుంది. కరెంటు లేదు. ఎప్పుడు వస్తుందో తెలవదు. పూటంతా తిరిగినా పూట కూలీ పోయింది కానీ అవసరమైన వైద్యం మాత్రం దొరకలేదు. “ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి”
“మూర్తికీ, సైలజకూ కొత్తగా పెళ్లయింది. కొత్తగా కొన్న కారులో హానీమూన్  కి వెళ్లి వస్తుంటే దోవలో అడవిలాంటి చోట కారు ఆగిపోయింది.  దానికితోడు వర్షం. దగ్గరలో ఓ చిన్న టీ పాక కనిపిస్తే వెళ్ళారు. డ్రైవరు  కారు రిపేరు పూర్తిచేసే లోగా, తాగిన టీ వికటించిందో ఏమో మూర్తికి వాంతులు మొదలయ్యాయి. మనిషి  డీలా పడ్డాడు. కొత్త  పెళ్లి కూతురికి భయంతో దిగ చెమటలు పట్టాయి. ఏం చెయ్యాలో తెలియక విలపించడం మొదలు పెట్టింది”
ఇలాంటి కాంతమ్మలు, రామనాధాలు, వెంకట రావులు, జోగయ్యలు,  మూర్తులు, శైలజలు ఇంకా ఎందరో వున్నారు. అందరిదీ ఒకటే సమస్య. “ఏం చెయ్యాలి”
ఆనాడు ముఖ్యమంత్రిగా వున్న, స్వయంగా డాక్టరు అయిన వై ఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా ఈ ప్రశ్న వేసుకున్నారు. అధికారులతో, సంబంధిత వైద్య నిపుణులతో మాట్లాడారు. సమాధానం అన్వేషించారు. ఫలితంగా రూపు దిద్దుకున్నవే   108, 104, ఆరోగ్య శ్రీ.
104 నెంబరుకు ఫోను చేయగానే ఆ కాల్  సెంటరులో సిబ్బంది రేయింబవళ్ళు అందుబాటులో వుంటారు. సమస్య చెప్పగానే దాని తీవ్రతను బట్టి డాక్టరుతో మాట్లాడిస్తారు. లక్షణాలను బేరీజు వేసుకున్న వైద్యుడు రోగనిర్ధారణ చేసి  రోగి పరిస్తితిని బట్టి సూచనలు చేస్తారు. కొన్ని లక్షణాలు చిన్న చిట్కాలతో తగ్గిపోతాయి. కొన్నింటికి చికిత్స అవసరమవుతుంది. ఇవి నిర్దారించగలిగింది, సలహా  ఇవ్వగలిగిందీ డాక్టరు మాత్రమే. అర్ధరాత్రి అపరాత్రి వైద్యుడిని సంప్రదించగల అవకాశం కల్పించడమే కాల్  సెంటరు ధ్యేయం. ఏ వూళ్ళో డాక్టరు వుంది, లేదా సెలవులో వుంది, ఎక్కడ రోగ నిర్ధారణ పరికరాలు పనిచేస్తున్నాయి, ఎక్కడ పనిచేయడం లేదు, దగ్గరలో ఆ సదుపాయం ఎక్కడ వుంది, ఎక్కడ కరెంటు వుంది, ఎక్కడ ఏ సమయంలో వుండదు (కోతల సమయాలు గురించిన సమాచారం సంబంధిత విభాగాలనుంచి సేకరించి సిద్ధంగా ఉంచుకుంటారు) ఇటువంటి విషయాలు గురించి అడిగిన వారికి ముందే తెలియచేస్తారు కాబట్టి రోగి తాలూకు వారి  మనసుల్లో ఆందోళన సమసి పోతుంది. అనవసరంగా సమయం  వృధా చేసుకునే అవసరం, అక్కడకూ ఇక్కడకూ తిరిగే ప్రయాస కూడా  వుండవు.
రోగి పరిస్తితి బాగా లేదనుకుంటే 104 కాల్ సెంటరు వాళ్ళే ఆ విషయాన్నీ 108 కి తెలియచేస్తారు. అంబులెన్సు నిమిషాల్లో వచ్చి రోగిని ఆసుపత్రికి చేరవేస్తుంది. అప్పటి నుంచి ఆరోగ్య శ్రీ ఆదుకుంటుంది. యెంత ఖరీదయిన వైద్యం చేయాల్సివచ్చినా అదే రక్షణ కవచంలా, సంజీవనిలా అభయ హస్తం అందిస్తుంది.
మరోపక్క, సంచార వాహనాలు నెల నెలా ఒక నిర్దిష్ట దినం నాడు ఊళ్లకు వెళ్లి పరీక్షలు చేసి, అవసరమైన  మందులు ఇస్తాయి. ఆ విధంగా బీపీ,  చక్కర వంటి వ్యాధులు  ప్రాణాంతకంగా పరిణమించకుండా కట్టడి చేయడానికి వీలుపడుతుంది.   
పైగా ఇవన్నీ పూర్తిగా ఉచితం.
వై ఎస్ హయాములో అందుబాటులోకి వచ్చిన ఈ పధకాలు కొన్ని పూర్తిగా, కొన్ని అరకొరగా అమలు జరిగాయి. పూర్తిగా అమలు అయిన పధకాల్లో కొందరు స్వార్ధపరుల మూలంగా కొన్ని అవకతవకలు చోటుచేసుకున్నాయి. అధికారుల అలసత్వం కారణంగా మరికొన్ని సంపూర్ణ ఫలితాలను ఇవ్వలేకపోయాయి. ఈ లోగా ఈ  పధకాలకు రూప కల్పన చేసిన మనిషే అంతర్ధానం అయిపోయారు. ఆయన అనుకున్నట్టు ఇవి రూపుదాల్చి వుంటే వైద్య, ఆరోగ్య సేవలకు సంబంధించి సమాజంలో అన్ని వర్గాలకు చక్కని ప్రయోజనం దక్కి వుండేది.
నాకు బాగా గుర్తుంది. అవి 2004 లో మొదటిసారి వై ఎస్  ముఖ్యమంత్రిగా పరిపాలనా పగ్గాలు చేపట్టిన రోజులు. పార్టీల కార్యకర్తలు, అభిమానుల సంగతి తెలవదు కానీ చదువుకున్న కొందరిలో ఆయన పట్ల ఓ రకమైన వైమనస్యభావం వుండేది. నలుగురి నడుమ  సంభాషణల్లో అది కొట్టవచ్చినట్టు కనబడేది కూడా. మా బంధువర్గంలో ఒకాయనకు వై ఎస్ అంటే గిట్టేది కాదు. ఆయన బాగా  చదువుకున్నాడు, పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగమే చేసాడు. వూరికి దూరంగా పెద్ద ఇల్లే కట్టుకున్నాడు. పిల్లలు పెద్దయి రెక్కలొచ్చి విదేశాల్లో స్థిరపడ్డా ఆయన మాత్రం భార్యతో ఆ ఇంట్లో ఉంటూ  రోజులు వెళ్లబుచ్చుతున్న సమయంలో ఆయనకో పెద్ద కష్టం వచ్చిపడింది.  ఓ అర్ధరాత్రి భార్యకు గుండె పోటువచ్చి విలావిలా కొట్టుకుంటోంది. ఆయనగారికి కాళ్ళూ చేతులూ ఆడలేదు. ఇంట్లో కారు వుంది కాని ఆ సమయంలో డ్రైవర్  లేడు. తనకు డ్రైవింగు  రాదు. ఇరుగూ పొరుగూ వున్నా పట్టించుకునే తత్వం లేదు. జరూరుగా ఆసుపత్రికి తీసుకుకు వెళ్ళాలి.  ఆటోలు దొరికే  ప్రాంతం కాదు. ఎందుకో ఏమిటో  కాని ఆ సమయంలో ఆయనకు, వై ఎస్ బహిరంగసభల్లో ‘కుయ్ కుయ్’ అంటూ 108  అంబులెన్సు గురించి చెప్పే  మాట గుర్తుకువచ్చి ఫోను చేసాడు. ఆశ్చర్యం ఆ అర్ధరాత్రివేళ పదంటే పదే నిమిషాల్లో అంబులెన్సు వచ్చి, ఈ నిమిషమో, మరు నిమిషమో అనే పరిస్తితిలో వున్న ఆయన భార్యను నిమిషాల వ్యవధిలో ఆసుపత్రికి చేర్చింది. సకాలంలో,  అమృత ఘడియలలో తీసుకువచ్చినందువల్ల  ఆమె ప్రాణాలు కాపాడగలిగామని ఆ తరువాత డాక్టర్లు చెప్పడంతో వై ఎస్ పట్ల అప్పటివరకు ఆయన పెంచుకున్న అకారణ నిరసన  భావం అదృశ్యమై పోయింది. దాని స్థానంలో ఆరాధనాభావం  చోటుచేసుకుంది.
నాకు తెలిసి ఇటువంటి సందర్భం ఒక్కటే కావచ్చు. కానీ నిజానికి    ఇలాంటి వాళ్ళు ఎందరో! ఇటువంటి సందర్భాలు ఎన్నో!
అటువంటి ఇబ్బందుల్లో ఇరుక్కుని బయటపడ్డ జనాలు నిత్యం తలచుకునే ఆ మనిషి పోయి ఏడేళ్ళయింది. అయినా నేటికీ ఎక్కడ 108 అంబులెన్సు ‘కుయ్ కుయ్’ అంటూ వెడుతున్నా వెంటనే గుర్తుకు వచ్చేది వైయస్సారే!  
ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఆయన హయాములో రూపుదిద్దుకున్న పధకాలు 108, 104, ఆరోగ్యశ్రీ. వైఎస్ కలలు కన్నవిధంగా ఈ మూడు పధకాలు  సంపూర్ణంగా ఆచరణలోకి వచ్చి వుంటే పరిస్తితి ఎలా వుండేదో రాజకీయాలకు అతీతంగా  చెప్పడమే ఈ వ్యాసకర్త ఉద్దేశ్యం.
పధకాల ఉద్దేశ్యం మంచిదయినప్పుడు, అవి పదిమందికి మంచి చేస్తాయి అని గురి కుదిరినప్పుడు, వాటిని మంచిగా అమలుచేయడమే మంచి ప్రభుత్వాలకు మంచి చేస్తుంది.  (01-02-2016)

      

కామెంట్‌లు లేవు: