15, ఏప్రిల్ 2016, శుక్రవారం

ముందే కూసిన కోయిల


సూటిగా.....సుతిమెత్తగా..... 

1982 – 2001 - 2008 – 2014
తెలుగు జాతి ఆధునిక రాజకీయ  చరిత్రకు  సంబంధించి  ఈ సంవత్సరాలకు చాలా ప్రాధాన్యత వుంది. 1982, 2008, 2014 సంవత్సరాల్లో   తెలుగు సినీరంగ ప్రముఖులు మువ్వురు తెలుగునాట రాజకీయ రంగ ప్రవేశం చేసి రాష్ట్ర రాజకీయాలను కొత్త మలుపు తిప్పారు. పొతే, తెలుగుదేశం పార్టీని వీడి, 2001లో తెలంగాణా రాష్ట్ర సమితి పేరుతొ ఓ కొత్త ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి, ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం పుష్కర కాలానికి పైగా అలుపెరుగని ఉద్యమం సాగించి తెలంగాణా సాధించిన కేసీఆర్, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను  మలుపు తిప్పడమే కాదు రాష్ట్ర సరిహద్దులనే మార్చి కొత్త చరిత్రకు స్వీకారం చుట్టారు.
రాజకీయ రంగ ప్రవేశం చేసిన కొద్ది నెలల్లోనే అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న ఘన చరిత్ర అలనాడు తెలుగు చలనచిత్ర సీమలో ధృవతారగా వెలిగిన శ్రీ నందమూరి తారక రామారావుది. 1982 మార్చి 21 వ తేదీన ఆనాటి సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 'తెలుగుదేశం' పేరుతొ ఒక పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు నాటకీయ పక్కీలో ఒక ప్రకటన చేసి మొత్తం రాజకీయ వర్గాలను ఆశ్చర్య చకితులను చేసారు. అంతకుముందు  సినీ రంగానికి చెందిన జగ్గయ్య వంటి కళాకారులు ఎన్నికల్లో పోటీచేసినా  అది పరిమిత పరిధుల్లోనే జరిగింది. పొరుగున వున్న తమిళనాట మాదిరిగా సినీ రంగానికి చెందిన వారు రాజకీయ పార్టీలను ఏర్పాటుచేసే సంప్రదాయం మన రాష్ట్రానికి అప్పటికి కొత్త. పార్టీని స్థాపించిన  తొమ్మిది నెలల్లోనే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా  అధికార పగ్గాలు చేపట్టి దేశ రాజకీయ చరిత్రలోనే ఎన్టీఆర్   ఒక రికార్డు నెలకొల్పారు. చాలా ఏళ్ళు గడిచిన అనంతరం  2008 లో మరో అగ్రనటుడు చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి 'ప్రజారాజ్యం' పేరుతొ మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.  వరసగా అనేక సంవత్సరాలు తెలుగు చలనచిత్రసీమను వొంటి చేత్తో శాసించిన మెగా  స్టార్ చిరంజీవి  తన పార్టీని ఓ ప్రభంజనం మాదిరిగా జనంలోకి తెచ్చి మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటీకి నిలబెట్టారు. అయితే ఆయన ప్రయత్నాలు అనుకున్న విధంగా  ఫలించక పోవడంతో పద్దెనిమిది సీట్లు, పద్దెనిమిది శాతం వోట్లతో అధికారానికి ఆమడ దూరంలోనే ఆగిపోయారు. తన మనస్తత్వానికి ఈ రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు సరిపడవని నిర్ధారణకు వచ్చారేమో తెలియదు కాని, పార్టీని స్థాపించిన మూడేళ్ళలోనే దాన్ని కాంగ్రెస్ లో కలిపేసిన ఓ రికార్డును తన ఖాతాలో వేసుకుని  చేతులు దులుపుకున్నారు. దరిమిలా కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో  ఒక స్థాయి మంత్రి పదవితో సంతృప్తి పడి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తరువాత నామమాత్రంగా ఆ పార్టీలో కొనసాగుతున్నారు. అన్నగారి ప్రజారాజ్యం పార్టీ  యువజన విభాగం అయిన యువరాజ్యం నాయకుడుగా, 2009 ఎన్నికల్లో  రాష్ట్రం నలుమూలలు తిరిగి ప్రజారాజ్యం తరపున ప్రచారం చేసి, కాంగ్రెస్ వారి పంచెలు వూడదీస్తాననే తీరులో, తనదైన బాణీలో,  ఆవేశపూరిత ప్రసంగాలు  చేసి, ఎన్నికల అనంతరం అన్నగారు పార్టీతో సహా ఆ కాంగ్రెస్ పంచనే చేరడం హరాయించుకోలేక  పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా, మౌనంగా వుండిపోయారు.


మళ్ళీ 2014 ఎన్నికలకు ముందు  హఠాత్తుగా రంగ ప్రవేశం చేసి ఆ ఏడాది మార్చిలో జనసేన పేరుతో ఓ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసున్నట్టు ఆర్భాటంగా ప్రకటించి తన అభిమానులను అలరించారు. రాజకీయ ప్రత్యర్ధులను అదరగొట్టారు. అప్పటివరకు అన్నచాటు  తమ్ముడిగా పేరున్న పవన్, అదే  అన్నగారి పార్టీకి  వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేయడం అందరికీ ముఖ్యంగా అయన కుటుంబంలోని వారికే ఎంతో  ఆశ్చర్యం కలిగించింది. పేరుకు  పార్టీ అయితే పెట్టారు. కానీ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని మరో ప్రకటన చేసి అభిమానులను ఉసూరుమనిపించారు. ఈలోగా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.  రాష్ట్ర విభజన అంశం ఆయనకు బాగా కలిసివచ్చింది. జాతీయ రాజకీయాల్లో కొత్త మెరుపులు మెరిపిస్తున్న మోడీ ఆయనకు బాగా నచ్చారు.  పవన్ వంటి జనాదరణ వున్న సినీ హీరోల అవసరం మోడీకి లేదా ఆయన నాయకత్వం  వహిస్తున్న బీజేపీకి వున్న మాట కూడా కాదనలేనిది. ఆనాటి పరిస్తితులు అలాటివి. అది పవన్ కళ్యాణ్ కు మరింతగా కలిసివచ్చింది. మంచి డైరెక్టర్, చక్కని తారాగణం, గట్టి కధాబలం వున్న సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది అన్న సినీ సూత్రం వంటబట్టించుకున్న పవన్, తెలివిగా అడుగులు వేసి బీజేపీతో చేతులు కలిపారు. అంతే  కాదు, తాను కొత్తగా స్థాపించిన 'జనసేన' పార్టీని ఎన్నికలబరిలో దింపకుండా, సీట్లకోసం బేరసారాలు ఆడకుండా,  తాను కూడా పోటీ చేయకుండా ఒక కొత్త వ్యూహంతో మోడీ పార్టీకి ప్రచారం చేసిపెట్టారు. ఇది సినీ రంగంలో మామూలే. తాము వాడని షాంపూలకు , వేలేసి కూడా  తాకని సబ్బులకు, సినీ తారలు తమ ప్రకటనలతో లేని  గిరాకీ కలిగిస్తూ వుండడం కొత్తేమీ కాదు.   అదే వాణిజ్య సూత్రాన్ని పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక  ఎన్నికల్లో ప్రయోగించి,  అటు మోడీకి, మరోపక్క బీజేపీ మిత్రపక్షం అయిన టీడీపికి ఫలితాలను ప్రభావితం చేసే రీతిలో  ప్రచారం చేసిపెట్టారు. పవన్ ఆవేశం, సమాజంపట్ల  ఆవేదన ఆయన ప్రసంగాలలో ప్రతిఫలించడంతో  అభిమానులనే కాకుండా సాధారణ  జనాలను సయితం ఆకట్టుకోగలిగారు. ఫలితం గురించి వేరే చెప్పక్కర లేదు. ఆ ఎన్నికల్లో బీజేపీ కూటమికి లభించిన విజయంతో మోడీ దృష్టిలో  పవన్ నిజంగా ఒక హీరో అయిపోయాడు. ప్రధానిగా తను చేయబోయే  ప్రమాణస్వీకారానికి రావాల్సిందని  మోడీ స్వయంగా పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించడం దీనికి దృష్టాంతం.
సరే! ఎన్నికలు ముగిసాయి. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కొలువు తీరారు. ఎవరికి వారు తమ పనుల్లో తీరికలేకుండా మునిగి పోయారు. వారు అధికారంలోకి రావడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించిన  పవన్ కళ్యాణ్  మాత్రం అప్పుడప్పుడూ మీడియా తెరలపై కనిపిస్తూ తన ఉనికిని రుజువు చేసుకోవడం మినహా పెద్దగా  రాజకీయ కార్యకలాపాలు సాగించింది  లేదు. మళ్ళీ చలనచిత్రాలతో తీరిక లేకుండా వుంటూ, దొరికిన  తీరిక సమయాల్లో అమరావతి భూముల వ్యవహారం వంటి వివాదాంశాలలో తల దూరుస్తూ, రాజకీయ యవనికపై అప్పుడప్పుడూ మెరుస్తూ పార్ట్  టైం పొలిటీషియన్ మాదిరిగా  కాలక్షేప రాజకీయాలు నడుపుతున్నారన్న అపప్రధను మూటగట్టుకున్నారు.
ఈ కధ ఇలా సాగిపోతున్న నేపధ్యంలో....
మూడేళ్ళ తరువాత జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్ లో తన పార్టీ జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని ఇటీవల ప్రకటించి కొత్త రాజకీయ చర్చకు తెర లేపారు. రానున్న రోజుల్లో పవన్ పార్టీ జనసేన, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను ఏమేరకు ప్రభావితం చేయగలుగుతుందన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా తయారయింది. ఎన్నికలకు ఇంకా చాలా వ్యవధానం వున్న తరుణంలో పవన్ చేసిన ఈ ప్రకటన ఆయన సహజ శైలికి దగ్గరగా వున్నప్పటికీ, రాజకీయ కోణంలో పరిశీలించినప్పుడు ‘కోయిల ముందే కూసింది’ అనే భావన కలిగిస్తోంది. తెలంగాణా సంగతి  ఏమో కాని, పవన్ పార్టీ ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో వున్న మాట కాదనలేనిది. ఒంటరిగా పోటీ చేయడం అనే పవన్ నిర్ణయం  గత ఎన్నికల్లో మిత్ర పక్షాలుగా వున్న బీజేపీ, టీడీపీలపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది అన్నది కీలక అంశం. వచ్చే ఎన్నికల నాటికి   రాజకీయ సమీకరణాలు  కూడా  మారడం తధ్యం అన్న అభిప్రాయం కూడా నానాటికీ బలపడుతోంది.
ప్రస్తుతానికయితే దేశంలో మోడీ హవా బాగా సాగుతోంది. స్వయంగా ముందరి కాళ్ళకు తనకు తానుగా బంధాలు వేసుకోకపోతే చంద్రబాబు నాయుడికీ అంత ఇబ్బందికర పరిస్తితి ఏమీ కనబడడం లేదు. ప్రముఖ మీడియా సంస్థ ‘సీఎం ఎస్’  తాజాగా జరిపిన సర్వే కూడా చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్తితులు ఏమీ లేవనే చెబుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్  రాజకీయాల్లో బాబుకు ప్రత్యామ్నాయం లేదంటూ ఆ సర్వేలో వెలువడిన ప్రజాభిప్రాయం టీడీపీ అధినేతకు ఊరట కలిగించే విషయమే. అయితే అదే సమయంలో  ఆ పార్టీ తన పని తీరు కొంత మార్చుకోవాల్సిన అవసరాన్ని సూచించే హెచ్చరికలు కూడా  ఆ సర్వే ఫలితాల్లో  వెల్లడయ్యాయి. చంద్రబాబు పాలనపై ప్రజల అభిప్రాయం సానుకూలమా, ప్రతికూలమా అనే ప్రశ్నకు వచ్చిన జవాబుల నడుమ తేడా కేవలం రెండు శాతం మాత్రమే వుండడం గమనార్హం.  మరో మూడేళ్ళ తరువాత  సానుకూలత, ప్రతికూలతల్లో ఎంతో కొంత తేడా రావడం సహజం. ఆ తేడాపాళాలు ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం వుంటుంది.  అది అధికారాన్ని దూరం చేసేంత ప్రభుత్వ వ్యతిరేకతగా  మారుతుందా అన్నది  ఇప్పుడే ఊహించడం కష్టం. మరి, ఈ పరిస్తితుల్లో, అప్పుడప్పుడు  మెరిసి  మురిపించే పార్టీగా పేరు తెచ్చుకున్న పవన్ పార్టీ కి కొత్తగా లభించే అవకాశాలు ఏపాటివి?
భవిష్యత్ ఎన్నికల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో పవన్ సాయం తీసుకోవడానికి బీజేపీకి ఎలాటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. పవన్ వంటి ప్రజాకర్షణ కలిగిన నాయకుడు వొప్పుకోవాలే  కాని జనసేనను తమ పార్టీలో కలుపుకోవడానికి కూడా సిద్ధపడవచ్చు. ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో, ముందస్తు చూపుతో 'కాంగ్రెస్ రహిత భారత దేశం' అనే స్వప్నాన్ని  సాకారం చేసుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో, ప్రధానంగా దక్షిణాదిన,   ప్రజాదరణ వున్న స్థానిక నాయకులను దగ్గరికి తీసుకునేందుకు పావులు కదుపుతున్న విషయం రహస్యమేమీ కాదు.  మోడీకి దగ్గరవాడు కావడం, రాజకీయాలకు కొత్తకావడం పవన్ కు ఈ విషయంలో అదనపు అర్హతలు.
ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం లేని మాట నిజమే. అలాగే కొత్త పార్టీ దూసుకు పోవడానికి వీలైన రాజకీయ శూన్యత కూడా ఏమీ లేదు. టీడీపీ నిలదొక్కుకోవడానికి,  బీజేపీ కాలు కూడదీసుకోవడానికీ, మరో పక్క ప్రధాన ప్రతిపక్షం వైసీపీ  అదును చూసి అధికారంలోకి రావడానికీ ఇలా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళున్నారు. బలం పెంచుకోవడానికి, బలపడడానికి మాత్రమే కాకుండా ఎదుటి పక్షాన్ని బలహీనపరచి తద్వారా తాము బలం పుంజుకోవడానికి  ఆయా  పార్టీలు చేస్తున్న లోపాయికారీ ప్రయత్నాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి ఇప్పటి రాజకీయ సమీకరణలు ఇలాగే  వుండకపోవచ్చని కూడా అనిపిస్తోంది. గత ఎన్నికల్లో రెండు ప్రత్యర్ధి పార్టీల నడుమ జయాపజయాలను నిర్ణయించిన ఓట్ల శాతం తక్కువ కాబట్టి ఆ మేరకు మించి బలం పెంచుకోవాల్సిన అవసరం అన్ని పార్టీలకి వుంది. ఈ దిశగా అడుగులు వేసేటప్పుడు మార్పులు చేర్పులు తప్పకపోవచ్చు. ఆ విధంగా చూసినప్పుడు, పవన్ తన పార్టీని రంగప్రవేశం చేయించడం ద్వారా ఏదో ఒక మేరకు, కొందరికి నష్టం, మరికొందరికి లాభం చేకూరే అవకాశం వుంటుంది. ఆ ఎవరు, ఎవరన్నది అంత సులభంగా జవాబు చెప్పలేని ప్రశ్న. భవిష్యత్తులో  రాజకీయ పునరేకీకరణలపై  ఆ  సమాధానం  ఆధారపడి వుంటుంది. 
అయితే ఇక్కడ చిక్కుముడి ఎవరో కాదు.  పవన్ కల్యాణే.  పవనం అంటేనే గాలి. అది ఎటు  వీస్తుందో ఎవరికీ తెలియదు. పవన్ మనసులో ఏముందో పవన్ కే తెలియదని హాస్యోక్తిగా చెప్పుకుంటారు.
ఎన్నికలకు ముందు అట్టహాసంగా పార్టీ పెట్టారు. అప్పుడు పోటీ చేయలేదు. పెట్టిన రెండేళ్లకు స్పందించి, మరో మూడేళ్ళ తరువాత ఎన్నికల్లో  పోటీ చేస్తానని ఇప్పుడు తాజాగా  మరో ప్రకటన చేసారు. పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీకి సై అనడం మరో వింత.  రాజకీయాల్లో ఇవన్నీ కొత్త పుంతలు. ఆయనకి మాత్రమే ఇటువంటివి సాధ్యం. మరొకరెవరన్నా ఇటువంటి నిలకడ లేని ప్రకటనలు చేస్తుంటే అభాసుపాలయ్యే వారు. పవన్ కు వున్న అభిమానబలం ఆయన్ని విమర్శల బారినుంచి ఓ  రక్షరేకులా కాపాడుతోంది అనుకోవాలి. అయితే, ఈ సినీ అభిమానం అంతా మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగేవరకే. తరువాత సాధించే విజయాలే, రాజకీయాల్లో  మాట చెల్లుబడి కావడానికి  గీటురాయిగా మారుతాయి.   
రాజకీయ విశ్లేషణలు చేసేవారికి కూడా పవన్ కళ్యాణ్ ఒక పజిల్. ఒక పట్టాన  కొరుకుడు పడేరకం కాదు,  అందుకే అయన ఏం చెయ్యబోతున్నారన్నది ఊహకు అందని విషయం.
రాజకీయాల్లో వున్న తమాషా ఏమిటంటే, ముందు ఊహించినట్టు ఎప్పుడూ  నడవవు.  అవి తిరిగే మలుపులు అంచనా వేయడం చాలా  కష్టం. వాటి లెక్కలే వేరు.

కొసమెరుపు:
'జనసేన' వెబ్ సైట్ చూసిన వారికి ప్రముఖంగా ఒక వాక్యం కనిపిస్తుంది.
"నేను రాజకీయవాదిని కాను - పవన్ కళ్యాణ్"
(ఇప్పుడు వుందో లేదో తెలవదు)   

(16-04-2016)
రచయిత ఈ మెయిల్:  bhandarusr@gmail.com మొబైల్: 98491 30595






3 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...



సెహభాష్ ! అనిపించు చక్కని విశ్లేషణ !

జిలేబి

అజ్ఞాత చెప్పారు...

సార్. మీ ఆర్టికిల్స్ బాగున్నాయి కానీ. 10 మాటల్లో చెప్పేవిషయం సాగదీసి 100 మాటలు రాస్తున్నారు. సుత్తిగా అనిపిస్తుంది. ఇంతకీ ఈ వ్యాసంలో మీరుచెప్పేది ఏమిటి. థాంక్ గాడ్. జిలేబి పద్యంతో కొడుతుందేమోనని భయపడ్డాను.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ అజ్ఞాత - సెహభాష్ అన్నా, సుత్తి అన్నా అవి మీ మీ స్పందనలు. వాటితో నిమిత్తం లేదు. నాలాగే మీకూ అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్చవుంది. కాకపొతే, నేను పోస్ట్ చేసేవాటిల్లో చాలా భాగం పత్రికలకోసం రాసేవి. బ్లాగులో సంక్షిప్తత ఎలా అవసరమో, పత్రికలకు విషయ విపులీకరణ అంతే అవసరం. వివరణ కూడా సాగదీస్తున్నాని అనక ముందే ముగిస్తున్నాను.- భండారు శ్రీనివాసరావు