2, ఏప్రిల్ 2016, శనివారం

ఏం చెప్పారన్నది కాదు ప్రశ్న, ఎలా చెప్పారన్నది పాయింటు


సూటిగా.......సుతిమెత్తగా........
(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 03-04-2016, SUNDAY)

విలియం షేక్స్పియర్ రాసిన జూలియస్ సీజర్ నాటకంలో మార్క్ ఆంటోని సుప్రసిద్ధ ప్రసంగం గుర్తుందా?
“స్నేహితులారా! రోమన్ జాతీయులారా! నా దేశ ప్రజలారా! దయచేసి కాసేపు మీ చెవులు నాకు ఒప్పచెప్పి నే చెప్పేది శ్రద్ధగా వినండి” అంటూ ఆంటోనీ మొదలు పెట్టిన ఉపన్యాసం అప్పటికీ, ఇప్పటికీ ప్రపంచ ప్రసిద్ధ ప్రసంగాల్లో ఒకటిగా మిగిలిపోయింది.



మొన్న గురువారం నాడు తెలంగాణా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింటు ప్రెజెంటేషన్ ఇచ్చిన  సందర్భంగా చేసిన ప్రసంగాన్ని టీవీల్లో చూస్తున్నప్పుడు అలనాటి ఆంటోనీ ప్రసంగం స్పురణకు వచ్చింది. ఇళ్ళల్లో కూర్చుని టీవీల్లో   వీక్షించిన ప్రేక్షకులు బహుశా ఇండో  పాక్ వన్ డే మ్యాచ్ చూసినంత ఆసక్తిగా ఆసాంతం ఆస్వాదిస్తూపోయారని అనడం కొంత  అతిశయోక్తిగా అనిపించినా అందులో వాస్తవం లేకపోలేదు.
ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు అసెంబ్లీలో కేసీఆర్ ఉపన్యాసం మూడుగంటల పాటు విడవకుండా కురిసిన వర్షంలా సాగిపోయింది. పెద్దగా ఉరుములు, మెరుపులు లేకపోవడం కొసమెరుపు.
ఆయనకి ప్రసంగాలు చేయడం కొట్టిన పిండి. ఎదురుగా నిలబడి ఆయన వాదనను పూర్వపక్షం చేయగల సమకాలీన రాజకీయ నాయకులు ఎవ్వరూ వర్తమాన కాలంలో  లేకపోవడం ఆయనకు బాగా కలిసి వచ్చింది. ఈసారి ఆయన తన అంబులపొదిలో అస్త్ర శస్త్రాలను రెండింటినీ  సమకూర్చుకుని మరీ వచ్చారు. శస్త్రాలు అంటే మామూలు బాణాలు. వాటికి మంత్రోచ్చారణ ద్వారా అమితమైన శక్తిని సమకూరిస్తే అస్త్రాలుగా మారతాయి. అందుకే కేసీఆర్ తన వాగ్బాణాలకు పవర్ పాయింటు ప్రెజెంటేషన్ అనే అదనపు బలాన్ని తోడుతెచ్చుకుని వాటికి మరింత పదును పెట్టి మరీ సంధించారు. అసలే మాటల మాంత్రికుడనే పేరు. దానికి తోడు ఆధునిక సాంకేతిక  పరిజ్ఞానం. ఇక అడ్డేముంది, మరింత చెలరేగిపోయారు.
మరో విషయం చెప్పుకోవాలి. కేవలం మాటల గారడీ చేస్తూ పోకుండా, మాట్లాడుతున్న అంశంలో తనకు ఎంతటి విషయ పరిజ్ఞానం వుందో కూడా ఆయన చాటిచెప్పారు. ఆయన ఇంజినీరు కాదు, అయినా కాకలు తిరిగిన ఇంజినీర్లు కూడా విస్తుపోయేలా అనేక సాంకేతిక విషయాలను తేటతేట తెలుగులో విడమరచి చెప్పారు. ఆయన సాంకేతిక నిపుణుడు కాదు, కానీ ఆ నైపుణ్యాన్ని పుక్కిటబట్టిన ప్రవీణులు సైతం నివ్వెర పడేలా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్వయంగా నిర్వహించారు. ఇందుకోసం ఎన్ని గంటలు కష్టపడింది కూడా ఆయనే వివరించారు. శ్రమకు తగ్గ ఫలితం లభించింది. ఇంటా బయటా ప్రశంసల వర్షం కురిసింది. ఇంకా కురుస్తూనే వుంది. దీనికి దాఖలా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ, అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీలో చూస్తూ సుప్రసిద్ధ జర్నలిష్టు పొత్తూరి వెంకటేశ్వర రావు సీఎంఓ (ముఖ్యమంత్రి కార్యాలయం)కి  పంపిన అభినందనలతో కూడిన ఎస్.ఎం.ఎస్. (సంక్షిప్త  సందేశం), కేసీఆర్ వెనువెంటనే దాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించిన వైనం. అలాగే మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు కేసీఆర్  ని పొగుడుతూ రాసిన లేఖ.
ముఖ్యమంత్రి హోదాని దృష్టిలో ఉంచుకుని చూస్తే సరే ఇలాటివన్నీ సహజం అనుకోవచ్చు.
ఏదిఏమైనా, కేసీఆర్ తనకు తానుగా కల్పించుకున్న ఈ అపూర్వ, సువర్ణావకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకున్నారనే చెప్పాలి.
తెలంగాణాకు సంబంధించిన సేద్యపు నీటి వ్యవస్థ ప్రస్తుత పరిస్తితులను కళ్ళకు కట్టినట్టు, సామాన్యుడికి కూడా బోధపడే విధంగా అసెంబ్లీలో ఆవిష్కరించారు. గతాన్ని ప్రస్తావించి, వర్తమానాన్ని విశ్లేషించి, భవిష్యత్ దర్శనం చేసిన తీరు శ్లాఘనీయం. కేసీఆర్ అంటే ఒక సాధారణ ప్రాంతీయ పార్టీకి చెందిన రాజకీయ  నాయకుడి గానే పరిగణిస్తున్న అనేకమంది రాష్ట్రేతర ప్రజలు, ఆయనలో తమకు ఏమాత్రం తెలియని రాజనీతిజ్ఞుడిని చూసివుంటారు. అలా,  అందరినీ ఆకట్టుకునేలా సాగింది ఆనాటి ఆయన ప్రసంగం.
తెలంగాణలో సేద్యపు నీటి ప్రాజెక్టుల రీ డిజైన్ ఆషామాషీగా తలపెట్టింది కాదు, కోటి ఎకరాలకు నీరు అందించడం దాని లక్ష్యం అని ముఖ్యమంత్రి చెప్పారు. ఎవరు అడ్డొచ్చినా  ఆగేది లేదు, చేపట్టిన పనిని ఆపేది లేదు అంటూ వ్యతిరేక వాదం వినిపిస్తున్న వారికి హెచ్చరిక చేసారు.
మరో అయిదేళ్ళలో తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు అన్నీ పూర్తిచేస్తామని పునరుద్ఘాటించారు. తెలంగాణాకు ఎగువన, మహారాష్ట్ర, కర్నాటకల్లో నాలుగు వందల యాభయ్ కి పైగా బ్యారేజీలు కట్టిన విషయాన్ని కేసీఆర్ దృశ్యమానంగా వివరిస్తూ, భవిష్యత్తులో పైనుంచి కిందికి నీరు వచ్చే అవకాశం మృగ్యమనీ, అంచేతే ప్రాజెక్టుల రీ డిజైనింగ్ అవసరమైందనీ కార్యకారణ సహితంగా చెప్పిన తీరు  సభలో వున్నవారినే కాకుండా, ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నవారిని కూడా ఆకట్టుకుంది. రాష్ట్రాల నడుమ అనవసరమైన వివాదాలు రాకుండా నివారించడానికే ఈ ప్రయత్నం అంతా అని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే ఇంతటి సుహృద్భావం, ఇంతటి ఉదారవాదం  భవిష్యత్తులో న్యాయపరమయిన చిక్కుల రూపంలో  రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందేమో కూడా ఆలోచించుకోవడం అవసరం. దిగువన వున్న కొత్త రాష్ట్రం  ఆంధ్రప్రదేశ్ తో కూడా అదేవిధమైన సయోధ్య కోరుకుంటున్నామని చెప్పడం ఆహ్వానించతగ్గ విషయం.      
సరే! ఇదంతా నాణేనికి ఒక వైపు. ప్రసంగం చేయడం, అందరినీ మెప్పించడం ఒక ఎత్తు. ముందే తిరగేసి సుతిమెత్తగా చెప్పింది అందుకే,   ‘ఏం చెప్పారన్నది కాదు ప్రశ్న, ఎలా చెప్పారన్నది పాయింటు’ అని.
ప్రాజెక్టుల రీ డిజైనింగ్ ఆలోచనలో దాగున్న సందేహాలను కేసీఆర్ తన ప్రెజెంటేషన్ ద్వారా నివృత్తి చేసారు. కానీ అంతటి భారీ  వ్యయాన్ని భరించగలిగిన పరిస్తితి రాష్ట్రానికి ఉందా? మొదలయిన ప్రశ్నలకు సరయిన జవాబు దొరకలేదు.
ఎలా చెప్పారు. భేషుగ్గా చెప్పారు అని అందరూ అంటున్నారు.  ఏం చెప్పారు ? అదే తెలియడం లేదని కూడా కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.  
అందుకే ఆయన ధారావాహిక ప్రసంగంలో తడిసి ముద్దయి, మతులు పోయి మత్తులో తేలిపోయిన జనాల మెదళ్ళు నెమ్మదిగా తేరుకుంటున్నాయి. ఆయన ఏం చెప్పారు, మనం ఏం విన్నాం అనే ఆలోచనలో పడుతున్నాయి.
చక్కటి అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుని, ముఖ్యమంత్రి పవర్ పాయింటు ప్రెజెంటేషన్ కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ  మెల్లగా తేరుకుని విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టడం మొదలు పెట్టాయి. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతొ టీ.ఆర్.ఎస్. ప్రభుత్వం తలపెట్టిన లక్షలాది రూపాయల ప్రజాధనం వృధా చేసే కార్యక్రమంలో తామూ పాలుపంచుకున్నట్టు అవుతుందేమో అన్న సందేహంతోనే సభకు వెళ్లలేదని కాంగ్రెస్ పక్ష ఉపనాయకుడు మల్లు భట్టి  వివరణ ఇచ్చారు.  సభావేదిక మీద ధీటుగా జవాబు చెప్పడానికీ, లేదా ముఖ్యమంత్రి వాదనను తిప్పికొట్టడానికీ తమకు సమానమైన అవకాశం కల్పించలేదన్న వారి వాదన కూడా కొట్టిపారవేయతగింది కాదు. కానీ, అది సాకుగా చూపి సభకు గైరుహాజరు కావడం సమర్ధనీయం కాదేమో.  
ఉపశ్రుతి: కేసీఆర్ ప్రసంగాన్ని శ్రద్ధగా విన్న నా మిత్రుడు ఒకరు ఫోనుచేసారు. బహుశా కేసీఆర్  బద్ధ శత్రువులు కూడా ఆయన మాదిరిగా ప్రతి విషయంలో కేసీఆర్ నిర్ణయాలను వ్యతిరేకించలేరు అనేది నా నిశ్చితాభిప్రాయం. ఎందుకో ఏమో కారణం తెలవదు,  ఆయన నరనరానా కేసీఆర్ వ్యతిరేకత నిండిపోయింది.  అందుకే,  ఫోనులో ఆయన మాట్లాడిన తీరు నాకు విస్మయాన్ని కలిగించింది.
కేసీఆర్ పట్ల  తాను  ఇన్నేళ్ళుగా పెంచుకుంటూ వస్తున్న దురభిప్రాయాలన్నీ ఈరోజుతో దూదిపింజల్లా కొట్టుకుపోయాయని ఆయన చెబుతుంటే వింటూ నివ్వెరపోవడం నా వంతయింది.
శత్రువుల్ని సైతం తనవాళ్ళుగా చేసుకోవడం మెచ్చదగిన విషయమే. కానీ, ప్రసంగాలు, ప్రచారాలతోటే పొద్దు పుచ్చుతున్నారు అంటూ ఈరోజు ప్రతిపక్షాల నోట వినబడుతున్న మాటలు, ముందు ముందు  ప్రజలనోటంట కూడా వినబడే పరిస్తితి రాకుండా చూసుకోవడం విజ్ఞులయిన పాలకుల ప్రధమ కర్తవ్యం. (02-04-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595        
       
   




కామెంట్‌లు లేవు: