9, జనవరి 2013, బుధవారం

దేవుణ్ణి దూరం చేసుకుని పెద్ద పొరబాటే చేశా!




దేవుణ్ణి దూరం చేసుకుని పెద్ద పొరబాటే చేశా!

దేవుడంటే వుండాల్సింది భక్తా? భయమా?


చిన్నతనంలో నాకు దేవుడంటే భయంతో కూడిన భక్తి. తెల్లవారుఝామున లేచి స్నానం చేసి బెజవాడ గవర్నర్ పేట శివాలయం వీధిలో వున్న గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి విబూది పట్టీలు పెట్టుకుని దేవుడికి దణ్ణం పెట్టుకుని వచ్చేవాళ్ళం. అదేమిటో బడికి వెళ్ళిన తరువాత కూడా నుదిటిమీద విబూది రేఖలు అలాగే చెదరకుండా వుండేవి. ఇప్పట్లా గుడికి వెళ్ళినప్పుడల్లా కొబ్బరికాయలు కొట్టడం, హుండీలో డబ్బులు వేయడం ఎరగం. ఆ రోజుల్లో గుళ్ళు కూడా ఎంతో ప్రశాంతంగా వుండేవి. కాసేపు కూర్చోవాలని అనిపించేది.
ఇళ్ళల్లో కూడా ఇప్పటిమాదిరిగా విడిగా పూజ గదులు వుండేవి కావు, దేవుడి గూళ్ళు తప్ప. దేవుళ్ళందరూ గూటికే పరిమితం. అక్కడే గోడమీద పసుపూ సున్నం  కలిపి ఎర్రగా తిరుపతి వెంకన్న నామాల పట్టెడ వుండేది. ఇంటిల్లిపాదీ అక్కడే నిలబడి దణ్ణం పెట్టుకునేవారు. స్నానం చేసి దణ్ణం పెట్టుకోవడం మినహా ఇక ఎలాటి నియమాలు వుండేవి కావు. నాకు తెలిసి అది భక్తి. ఇప్పుడు పూజ గదుల్లో దేవుడి పట్ల భక్తి కంటే భయం ఎక్కువ కనిపిస్తోంది.
తరవాత్తరవాత ఏళ్ళు గడుస్తున్న కొద్దీ మనుషుల  మనస్తత్వాల్లో మార్పులు రావడం మొదలయింది. ‘దేవుడు లేదు’ అనే గోరాగారి ప్రభావం.(దేవుడు లేడు అనేవారు కాదు, ఎందుకంటే ఆయన దృష్టిలో దేవుడే లేడు కనుక ఆయన మగో ఆడో అనవసరం అనుకుని  ‘లేదు’ అని అంటుండేవారు. సరే! ఆయన మరణించిన తరువాత ఇప్పుడు ఆ కుటుంబానికి ఆయనే దేవుడు అనుకోండి. నిజానికి దేవుళ్ళు ఇలానే పుడతారేమో).
‘తెలుగునాట భక్తి రసం వరదలుగా పారుతోంది’ వంటి రచనల స్పూర్తి.
దేవుణ్ణి విమర్శిస్తే నలుగురిలో పెరుగుతున్న గౌరవం.
మొత్తానికి ఏమయితేనేం దేవుడు క్రమంగా దూరం అవుతూ వచ్చాడు. (ఇదీ ఒక భ్రమే! ఇందుగలడందులేడనేవాడు దూరం కావడం ఏమిటి? దూరం చేసుకోవడం ఏమిటి?)
తోటివాళ్ళు, సాటివాళ్ళు సావాసగాళ్ళు చాలామంది అదేబాటన వెడుతూ సంఘంలో మర్యాద,మన్నన పొందడం చూసి దేవుడికి మరింత దూరం జరిగాను. (ఈ నాస్తికులలో  చాలామంది దేవుడ్ని తమ బాగుకోసమే ఉపయోగించుకున్నారనీ, సాధారణ ఆస్తికులకంటే ఎక్కువగా దేవుడ్ని నమ్ముతారనీ చాలాకాలం తరువాత తెలిసింది). పెళ్లి వేడుకలకు స్వస్తిచెప్పాను. పిల్లలకు బాలసారలు చేసి పేర్లు పెట్టలేదు. మా పెద్ద పిల్లవాడు కడుపులో వున్నప్పుడు సూర్య గ్రహణం వస్తే, అప్పట్లో వున్న నమ్మకాలను కాదని  మా ఆవిడను చీకటి గదిలో పడుకోనివ్వలేదు. పైగా పిండి కలిపి రొట్టెలు చేస్తే, అవకరం కలిగిన  పిల్లలు పుడతారని భయపెట్టే జనం మధ్య సొంత ప్రయోగాలు ధైర్యంగా చేసాను. మా ఆవిడ సహకారం లేకపోతే ఇవి సాధ్యమయ్యే పనులు కాదు.
నా తరహా తీరూ చూసి మా వాళ్లల్లోనే చాలామంది నాకు నాస్తికుడనే ముద్ర వేసారు. పూజలు, పునస్కారాలతో దేవుణ్ణి మరింత దూరం చేసుకుంటున్నామన్నది నా ఉద్దేశ్యం. భక్త కన్నప్ప నాకాదర్శం. కానీ నా గోడు వినేవాళ్ళెవ్వరు ఆ దేవుడు తప్ప.  
సరే! దేవుళ్ళ గురించి తక్కువ మాట్లాడాలి ఎక్కువ ఆలోచించాలి అనే స్పృహ కలిగించింది మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు.  గోరాగారిని పరిచయం చేసిందీ ఆయనే. అనేక పరిశోధనలు చేసి నారసింహతత్వాన్ని బోధించింది ఆయనే. సమర్ధుడు కనుక ఈ ద్వంద్వ ప్రకృతిలో ఆయన నెగ్గుకు రాగలిగాడు. నేను కొట్టుకు పోయాను.
అయితే ఈ క్రమంలో సాగుతూ వచ్చిన సంభాషణల్లో, వాద ప్రతివాదాలలో అనేక ఆసక్తికర విషయాలు బోధపడుతూ వచ్చాయి. దేవుడ్ని నమ్మిన వారు, నమ్మని వారు కూడా తెలుసుకోదగ్గ సంగతులవి.
గుడిలో ఏముందీ?
గుడిలో దేవుడి విగ్రహం ఒక్కటే కళ్ళకు కనిపించేది. అంతకు మించి సామాజిక స్పృహ కలిగిన సూత్రం గుడిలో వుంది.
వెనుకటి కాలంలో అవిద్య, అనారోగ్యం, దారిద్యం తాండవిస్తున్న రోజుల్లో గుళ్ళల్లో పూజారులు మాత్రమే నాలుగు అక్షరం ముక్కలు తెలిసిన వాళ్లు. వూళ్ళో రోగం రొస్టు వస్తే వాళ్ళే దిక్కు. ఏదో కషాయాలు, చూర్నాలతో వైద్యం చేసేవాళ్ళు. ఆరోజుల్లో జనాలకు అదే పెద్ద వూరట.  
కష్టం,సుఖం చెప్పుకుని స్వాంతన పొందాలంటే పూజారులే జనాలకు ‘కౌన్సిలర్లు’’గా కానవచ్చేవారు. నాలుగు మంచిమాటలు చెప్పో , తెలియని దేవుడి పేరు చెప్పో, మానసికంగా అవసరమయిన స్వాంతన వారికి కలిగించేవారు.
ఇక, మనిషికి కావాల్సింది ఆహారం. దానికి మిక్కిలి కొరతగా వుండే ఆ రోజుల్లో గుళ్ళో పులిహారో, పాయసమో చేసి జనాలకు ప్రసాదంగా పంచేవారు. కూటికీ, గుడ్డకూ మొహం వాచిన ఆ రోజుల్లో అదే మహా ప్రసాదం.
వూళ్ళల్లో వయోవృద్దులకు,  అభాగ్యులకు గుడి ప్రసాదమే మహా భాగ్యం. ఈ రోజుల్లో ప్రభుత్వాలు అలాటి పేద వృద్ధులకు నెలకు ఇంత అని డబ్బు చెల్లించి తమ బాధ్యత దులుపుకుంటున్నాయి. నా అనేవాళ్ళు ఎవ్వరూ లేని, వంటావార్పూ సొంతంగా చేసుకోలేని ఆ అభాగ్యులకు డబ్బు ఇస్తే ఏం ప్రయోజనం. వండి వార్చేవాళ్ళు లేని నిస్సహాయులకు గుడిలో లభించే పులిహారో, దద్దోజనమో  మించింది ఏముంటుంది. ఆ రోజుల్లో గుళ్ళు ఈ  సామాజిక బాధ్యతను గొప్పగా పోషించాయి. మరి  ఇప్పుడో! వీ.ఐ.పీ.ల సేవలో తరిస్తున్నాయి.
ఈరోజుల్లో చదువుకునే పిల్లలకు ప్రభుత్వాలు ఎంతో డబ్బు ఖర్చు చేసి  మధ్యాహ్న భోజన పధకాలు అమలు చేస్తున్నాయి. పూర్వపు రోజుల్లో ప్రభుత్వాలపై భారం లేకుండా దేవాలయాలే ఈ పని చూసుకునేవి. నిలవవుండే పులిహోర, పోషకాలు సమృద్ధిగా వుండే దద్దోజనం, పాయసం వీటికి మించిన మధ్యాహ్న భోజనం ఏముంటుంది.
గుడి అంటే కేవలం ఆస్తికత్వానికి ప్రతిరూపం అనుకోకూడదు. వాటిని సరిగా వాడుకోగలిగితే, ఎన్నో సామాజిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గుడిలో ఏముందీ అని వ్యంగ్యంగా పాటలు పాడుకునే అవసరం వుండదు.
అయితే, ప్రతిదీ రాజకీయమయమయిపోతున్న ఈ రోజుల్లో  ఇది సాధ్యమా అంటే అనుమానమే. (09-01-2013)                              

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఆస్తికత్వానికి, నాస్తికత్వానికి మధ్య ఏదొ కొంత లోపం కనిపిస్తొంది. సంగీతంద్వారా భగవత్ దర్శనం కలిగింది అన్న ముస్లిం మతస్తులు ఉన్నారు. గ్రహాంతరాలకు పోయినా భగవంతుడిని కొలిచేవారూ ఉన్నారు.వీరిద్దరూ ఉదహరించింది హిందూ దేవుళ్ళనే. దేముడు అనేది కేవలం ఒక నమ్మకం అని కొట్టివేయలేం. అలా అని దానిని ఏ లేబ్‌లలోను నిరూపించలేము.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత - దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఆస్తికులందరూ నిజమైన ఆస్తికులుకారు. దేవుడి పేరు చెప్పుకుని పబ్బం గడుపుకునే వారు వీరిలో వుంటారు. అలాగే నాస్తికులందరూ దేవుడ్నినమ్మని వారేమీ కాదు. వారికి దేవుడు లేడనడం కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు, ఒకరకం సంపాదన, మరోరకం ఉపాధి కూడా.