6, సెప్టెంబర్ 2012, గురువారం

నమ్మలేని నిజం


నమ్మలేని నిజం
కంప్యూటర్ యుగంలో చదవడం బాగా తగ్గిపోయిందనేవాళ్లున్నారు. కానీ నాకెందుకో ఈ మధ్యనే  చాలా ఎక్కువగా చదివేస్తున్నానని అనిపిస్తోంది. నెట్ ప్రపంచంలో విహరిస్తుంటే కాలం ఇట్టే గడిచిపోతోంది. నా ముందు తరం వాళ్ళు ఎన్నో విషయాల్లో నాకంటే అదృష్టవంతులని ఒప్పుకుంటాను కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం దురదృష్టవంతులని  చెప్పాలి. అయితే, నెట్లో కంటికి కనబడ్డ రచనలన్నీ  గొప్పవి కాకపోవచ్చు. వాటిల్లో నిజానిజాలేంటో తెలియకపోవచ్చు. కానీ కొన్నింటిని మాత్రం వెంటనే ఇతరులతో పంచుకోవాలనిపిస్తుంది. పరాయి భాషల్లో వాటిని కాస్త వీలు చేసుకుని తెనిగించి తెలుగువాళ్ళకు తెలియచెప్పాలనిపిస్తుంది. ఇదిగో అలాటిదే ఒకటి ఈనాటి ఈ రచనకు ప్రేరణ.
ఇక చదవండి.  వీలయితే, చదివించండి.
“జర్మనీ చిన్న దేశమయినా పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన దేశం. బెంజ్, బి ఎం డబ్ల్యు వంటి ఖరీదయిన మోటారు వాహనాలన్నీ అక్కడే తయారవుతాయి.   సంపన్నులు మాత్రమే వాడే ఇలాటి వాహనాలు  తయారుచేసే దేశం అంటే దాని గురించి జనం అంచనాలు కూడా ఎక్కువగానే వుండడం సహజం.  అక్కడి ప్రజలు  విలాసవంతమయిన జీవితాలను గడుపుతుంటారని భావించడం అంతే  సహజం.  ఈ మధ్య ఆఫీసు పని మీద    ఆ దేశానికి వెళ్లే  సందర్భం తటస్థ పడేవరకూ నాకు కూడా అలాటి అభిప్రాయమే వుండేది.
“ నేను జర్మనీలోని హాంబర్గ్ నగరానికి చేరుకున్న రోజు మా కంపెనీ లోని భారతీయ  సహోద్యోగులు కొందరు కలసి ఒక హోటల్లో విందు భోజనం ఏర్పాటు చేశారు. మేము వెళ్లేసరికి చాలా టేబుళ్లు  ఖాళీగా కానవచ్చాయి. భారత దేశం నుంచి వెళ్ళిన నాకు ఇది కొంత విచిత్రంగా అనిపించింది. శనాదివారాల్లో  ఖరీదయిన రెస్టారెంట్లలో టేబులు దొరకడానికి చాలాసేపు వేచివుండిన సందర్భాలు అనేకం.మేము కూర్చున్న టేబుల్ దగ్గర్లో ఓ యువ జంట మినహా దాదాపు అంతా ఖాళీ. నేను గమనించిన మరో విషయం మరింత విచిత్రంగా  అనిపించింది. అదేమిటంటే  మాకు దగ్గర్లో కూర్చుని వున్న ఓ యువజంట తీరు. ఆ యువతీ యువకులిరువురూ మంచి పరువంలో వున్నారు.  సాధారణంగా స్నేహితురాలిని హోటలుకు తీసుకువచ్చే యువకులు  ఆహార పానీయాలను ఆర్డర్ చేయడంలో అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ వుంటారు.  ‘గాళ్ ఫ్రెండ్’ ని మెప్పించడానికి, మురిపించడానికి  లేని పోని  భేషజాలకు పోయి   అవసరం వున్నా లేకపోయినా   అనేక ఐటంలు  ఆర్దరిస్తుంటారు. ఇలాటి అనుభవాల నేపధ్యంలో చూసినప్పుడు  అక్కడి దృశ్యం నాకు వింతగా అనిపించింది. వాళ్ళిద్దరూ  చాలా మితంగా భోజన పదార్ధాలు ఆర్డర్ చేసినట్టు ఆ టేబుల్ చూస్తేనే తెలుస్తోంది.  ఆ యువకుడి పిసినారి తనాన్ని ఆ అమ్మడు ఎంతో కాలం భరించలేదనీ,  రెండు చేతులతో ధారాళంగా ఖర్చుపెట్టే  మరో శాల్తీని  వెతుక్కుని త్వరలోనే  అతడితో స్నేహానికి స్వస్తి చెబుతుందనీ   అప్పటికప్పుడే మనసులో ఏదేదో వూహించుకున్నాను.
ఇంతలో మరో ఇద్దరు వృద్ధ వనితలు ఆ రెస్టారెంటులో ప్రవేశించి  ఇంకో టేబుల్ దగ్గర కూర్చున్నారు. వాళ్లు కూడా తమకు కావాల్సిన భోజన పదార్ధాలను మితంగా ఆర్డర్ చేసుకున్నారు. వెయిటర్  వడ్డించే పద్దతి  కూడా అలాగే వుంది. ప్లేటులో పదార్ధాలు వాళ్లు తిన్నదాకా ఆగి మరీ మారు వడ్డన చేస్తున్నాడు.
ఇక వాళ్ల మానాన వాళ్ళను వొదిలేసి మేము మాకు కావాల్సినవి ఆర్డర్ చేసే ప్రయత్నంలో పడ్డాము. మా అందరికీ బాగా ఆకలిగా వున్న మాట నిజమే.  కానీ మేము మెన్యూ ఆర్డర్ చేస్తున్న  విధానం  చూసి వెయిటరే  కొంత కంగారు పడుతున్నట్టు అనిపించింది. అలవాటు ప్రకారం  మెన్యూ కార్డులో వున్న వాటన్నిటినీ  పట్టుకు రమ్మన్నాము, రుచిగా వున్నవి తిని మిగిలినవి వొదిలేయొచ్చనే ఉద్దేశ్యంతో.
కస్టమర్లు అంతగా లేకపోవడం వల్లనో యేమో మేము ఆర్దర్ చేసినవన్నీ వెంటనే  సర్వ్ చేశారు. వాటన్నిటినీ బల్ల మీద సర్డుతున్నప్పుడు వెయిటర్ కళ్ళల్లో అనుమానంతో కూడిన ఆశ్చర్యం లీలగా కనిపించింది. వీటన్నిటికీ బిల్లు యెంత అవుతుందో తెలిసి ఆర్డర్ ఇచ్చారా లేక తెలియక  చెప్పారా అని అతడి భావానికి మేము భాష్యం చెప్పుకున్నాము. కానీ, అతగాడి ఆశ్చర్యంతో కూడిన అనుమానానికి అసలు కారణం త్వరలోనే మాకు తెలిసిపోయింది.
మొత్తం  మీద మా భోజనం పూర్తయింది. వడ్డించే ‘పోర్షన్ల’  పరిమాణం యెంత వుంటుందో ఒక అవగాహన లేక ఆర్డర్ ఇచ్చినట్టున్నాము.  తినుబండారాలు చాలా మిగిలిపోయాయి. వాటిని అలాగే వొదిలేసి బిల్లు పట్టుకురమ్మని బేరర్ ను కోరాము.
లేచివస్తుండగా వెనుకనుంచి  ఏవో గుసగుసలు వినిపించాయి.  మాకు దగ్గర్లో కూర్చుని భోజనం చేస్తున్న ఆ ఇద్దరు ముసలి ముదితలు మమ్మల్ని చూపిస్తూ రెస్టారెంట్ మేనేజర్ తో ఏదో చెబుతున్నారు. అంతటితో ఆగిపోకుండా మా వద్దకు వచ్చి, టేబుల్ మీద మేము తినకుండా  వొదిలిపెట్టిన పదార్ధాలను చూపిస్తూ తమ మనసులోని మాటను బయట పెట్టారు. వచ్చీరాని ఇంగ్లీష్ లో వాళ్లు చెబుతున్నది మాకు బాగానే అర్ధం అయింది.  మేము ఆ విధంగా ఆహారాన్ని వృధా చేయడాన్ని వారు ఇష్టపడడం లేదని తెలిసిపోయింది. అయినా  ‘మా డబ్బు , మాయిష్టం . తింటాం, పారేస్తాం. బిల్లు మీరేమీ కట్టడం లేదుగా’ అనేది మా ధీమా.  దాన్నే కొద్దిగా మార్చి వాదనగా కూర్చి వాళ్ళను వొప్పించాలని చూసాం.
అప్పుడు  చూడాలి ఆ ముసలి వాళ్ల కళ్ళల్లో కోపం. ఒకావిడ ఆగ్రహాన్ని అదుపుచేసుకుంటూ  సెల్ ఫోన్ తీసింది.  ఎవరితోనో  మాట్లాడింది. మాకు ఏమి జరిగిందో అర్ధం కాలేదు కానీ ఏదో జరగబోతోందన్న విషయం బోధపడింది. జర్మనీలో వుంటున్న మా భారతీయ సహచరుడు ఒకడికి  అప్పటికి  మత్తు దిగిపోయినట్టుంది. ‘ప్రమాదంలో పడ్డాం గురూ’  అని సైగలతో హెచ్చరించాడు.
మేము బిత్తరపోయి చూస్తుండగానే  యూనిఫారం వేసుకున్న అధికారుల బృందం అక్కడికి చేరుకుంది. అందులో ఒకతను తన గుర్తింపు కార్డు చూపించి పరిచయం చేసుకున్నాడు.  ఆహారం వృధా చేసినందుకు యాభయ్ మార్కులు (కొంచెం అటూ ఇటుగా  రెండు వేల     రూపాయలు)  జరిమానా విధించాడు. మాకు నోట మాట రాలేదు.
కట్టిన జరిమానా మొత్తానికి రసీదు ఇస్తూ అతడన్నాడు.
‘జెంటిల్మన్ – హోటల్లో యెంత  తినగలరో అంతే ఆర్డర్ చేయండి. అంతే కాని డబ్బు మీది కదా అని ఇష్టం వొచ్చినట్టు  ఆర్డర్ చేసే అధికారం, వృధా చేసే హక్కు మీకు లేవు. డబ్బు మీది కావచ్చు కానీ వనరులు సమాజానివి. అవి మీ సొత్తు కాదు.’                                    

ఆ దెబ్బతో మా మొహాలు తెల్లగా పాలిపోయాయో, అవమానంతో ఎర్రగా కందిపోయాయో తెలియదు. తెలిసిందల్లా ఒకటే!  ఇంత ధనిక దేశానికి చెందిన పౌరుల  ఆలోచనావిధానంలోని ఓ కొత్త కోణం.
మనకన్నా జర్మనీ  ఎంతో సంపన్న దేశం. కానీ వృధాను ఏమాత్రం  సహించలేని  దేశం. మరి మనం. అంత సంపన్నులం కాదు.  వృధాను అరికట్టడం మాత్రం  మన రక్తంలో లేదు.”
గమనిక : ఇది యెంత వాస్తవమో తెలియదు. నెట్లో ఇంగ్లీష్ లో తిరుగాడుతున్న వ్యాసం ఇది. నిజమయినా కాకపోయినా ఒక వాస్తవాన్ని అర్ధం చేసుకోవడానికి, ఆచరించడానికి ఓ ‘నీతి కధ’ మాదిరిగా ఉపయోగపడగలదన్న ఉద్దేశ్యంతో అనువదించి బ్లాగులో పెడుతున్నాను. – భండారు శ్రీనివాసరావు  (06-09-2012)      

18 కామెంట్‌లు:

సుభ/subha చెప్పారు...

చెంప మీద ఛెళ్ళున కొట్టినట్టుంది సార్ ఇది చదవగానే..మంచి కథని(నిజాన్ని) అనువాదం చేసారు..ధన్యవాదాలు మీకు.

అజ్ఞాత చెప్పారు...

అవును, మీరు చెప్పింది నిజమే. ఇక్కడ ఎవరు ఆహార పదార్ధాలని వృధా గా పారేయ్యారు. మా ఆఫీసు లో లంచ్ చేసేటప్పుడు, plates లో ఫుడ్ ని వదిలేయడం చాలా అరుదు, అది రుచి గా లేకపోతేనే అలా చేస్తారు.
మీరు చెప్పడం వల్ల ఇంకో కొత్త విషయం తెలిసింది.
ఇక్కడ చెత్త ని recycle చేసే పద్దతి great. ప్రతీ ఇంట్లో చెత్త ని వేరు వేరు గ పెడతారు. అంతే ఆహార పదార్దాలవి ఒక బాక్స్ లో, అట్టపెట్టెలు ఒక బాక్స్ లో, గాజు సీసాలు ని ఒక బాక్స్ లో, ఇలా categorize చేసి పెడతారు. వేరే countries లో ఎలా ఉందొ నాకు తెలియదు. కాని ఇక్కడ చుస్తుంటే అందరు పద్ధతి గా follow అవుతారు. ధనిక దేశం అయ్యిందంటే కారణం ఏంటో తెలిసింది. రూల్స్ ఫాలో అవ్వడం, ఇవన్ని చుస్తుంటే నాకు చాలా exiting గా ఉంది. ఇండియా లో నేను ఊహించలేను కుడా ఇవి.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@SUBHA and @ అజ్ఞాత ధన్యవాదాలు - THANKS

Murthy K v v s చెప్పారు...

European nations are far ahead in every aspect compared to America.But these nations maintain low profile.See...by their dress,conversation,knowledge sharing we can't assume their real entity.their every move,every news about their countries are well monitored. America is just like a young kid,showing their giggling with fun.But europe is just like an older one who knew how to restrain himself,though he had everything inside.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Murthy - THANKS

www.apuroopam.blogspot.com చెప్పారు...

చాలా మంచి పోస్టు.మన దేశంలోనే మనం పారేసే ఆహార పదార్థాలతో ఒక కోటి మంది పొట్టలు నిండుతాయి.సందర్భం వచ్చింది కనుక నేను చిన్నప్పుడు చందమామలో చదివిన కథ ఒకటి చెబుతాను.ఇద్దరు అన్నదమ్ములకి ఆస్థి సమానంగా పంచిపెట్టి తండ్రి చనిపోయాడట.కొంత కాలం గడిచేసరికి తమ్ముడి ఆస్థి కరిగి పోయి పేదవాడైపోయాడట. అన్న మాత్రం ఆస్థిని రెట్టింపు చేసుకుని సుఖంగా ఉన్నాడట.ఆ రహస్యం ఏమిటో అన్నని కనుక్కుందామని తమ్ముడు అన్న ఇంటికి ఒక రోజు రాత్రి వెళ్లి అడిగాడట.అప్పుడు ఆ అన్న గారు ఈ ముచ్చటలు చెప్పుకోవడానికి దీపమెందుకు ఉండు ఆర్పేసి వస్తానన్నాడట.అప్పుడా తమ్ముడు మరేం చెప్పనక్కర లేదు అర్థమైందిలే అని వెళ్ళి పోయాడట.పొదుపు ఎక్కడైనా అవసరమేనని తెలియజెప్పే కథ ఇది.

చంద్ర చెప్పారు...

శ్రీనివాసరావు గారు, మంచి విషయాన్ని ఆదరికికి తెలిసేలా రాసినందుకు ధన్యవాదాలు. ఇంగ్లీష్ లో ఉన్న దీనిని ఈ ఉదయమే మా స్నేహితుడు కుడా ఈమెయిలు లో పంపించాడు. ఇది చదివిన తరువాత జర్మనీ మరియు గ్రీక్ ఆర్ధిక పరిస్థితులలో ఉన్న తేడా కు గల కారణాల గురించి , కొద్ది రోజుల కిందట టీవీ లో చూసిన ఒక కార్యక్రమం గుర్తు వచ్చింది.
అందులో, జర్మనీ లో ఉన్న ఒక మధ్యతరగతి ఫ్యాక్టరీ ఉద్యోగి ఒకరు ఇలా చెప్పారు we never spend money we have not earned yet.
అక్కడ సింపుల్ లైఫ్ స్టైల్ ప్రిఫెర్ చేస్తారు, చాల రోజులు జీతాలు పెరగకపోయినా కంప్లైంట్ చెయ్యరు అని చెప్పారు ప్రోగ్రాం లో.
German economy is in surplus as other European economies are in deficit దీనికి ప్రజల జీవిత విధానం కూడా ఒక ముఖ్యకారణం అనిపిస్తుంది.

MONEY IS YOURS BUT RESOURCES BELONG TO THE SOCIETY
ఫుడ్ కు ఒకదానికే కాకుండా , ఆయిల్, పవర్ ఇంకా అన్ని రిసోర్సెస్ కు ఇదే వర్తిస్తుంది కదా?

durgeswara చెప్పారు...

మనవాల్లకు కూడా భారీజరిమానాలు విధిస్తేగాని వృధా ఆగదు

Jwala's Musings చెప్పారు...

Nicely described in telugu. Jwala

అజ్ఞాత చెప్పారు...

మంచి కథ. విందుల్లో, హోటల్స్లో తిండి దుబారా తగ్గించడానికి అలాంటి ఫైన్లు వుంటే బాగుంటుంది.

కథకు వస్తే, మీరు ఆ మిగిలిపోయిన తిండిని కట్టించుకుని రూముకు తీసుకెళ్ళివుంటే 50మార్కులు(జరిమానా) దక్కేవి కావు. ఆదా చేసి వుండేవారు.

రెస్టారెంట్ వాడు పెట్టిన చెత్తంతా తిని తీరాలన్న నిబంధనలు, మానవహక్కుల భంగం కిందికి వస్తాయేమో కనుక్కోవాల్సింది. తగుదునమ్మా అని తలదూర్చిన, ఆ ఇద్దరు ఆవలి టేబుల్ ముసలాళ్ళకు చెరో 100మార్కులు వేసి మీ కిప్పించేవారేమో. వెరసి, మీకు 150మార్కులు దక్కేవి. :D

Rao S Lakkaraju చెప్పారు...

Murthy గారు అమెరికా గురిచి కొంచెం చిన్న చూపుగా చెప్పారు కాబట్టి నేను స్పందిస్తున్నాను.
అమెరికా హోటళ్ళ ల్లో మిగిలిపోయినవి ఇంటికి తీసుకు వెళ్ళటానికి హోటల్సు లో బాక్సు లు ఇస్తారు. తినగా మిగిలిపోయిన ఆహారాన్ని ఇంటికి తీసుకువెళ్ళి లంచ్ లేక డిన్నర్ కి తింటారు.

vnkr చెప్పారు...

snkr....ikanaina nii profile chuupinchukunea dhairyam cheyalevaa...chii..yentraa..baabu...

buddhamurali చెప్పారు...

అది నిజంగా జరిగి ఉండవచ్చు , కల్పితం కావచ్చు కానీ బాగుంది . అనువాదం చేసి మంచి పని చేశారు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Murthy,@Pantula gopala krishna rao,@Jwla _ Thanks you all. I have already mentioned this is a translation._ Bhandaru Srinivas Rao

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@durgeswar,@SNKR,@Lakkaraju,@VNKR,@Buddha Murali and @ చంద్ర - ధన్యవాదాలు.-భండారు శ్రీనివాసరావు

Jai Gottimukkala చెప్పారు...

ఇది ఖచ్చితంగా కట్టుకథ. మార్కులు కాలగర్భంలో కలిసిపోయి ఎన్నో ఏళ్లయినా ఇంకా ఈ కథ ప్రచారంలో ఉండడం విడ్డూరం.

ఇకపోతే సర్వర్లు తినేదాక ఆగి మళ్ళీ వడ్డించే పద్దతి హామ్బర్గులోనే కాదు, యూరోప్ ఎక్కడా లేదు. మనం ఆర్డరు ఇచ్చిన వస్తువులను టేబుల్ మీద పెడతారు కానీ వడ్డించడం వారి పని కాదు.

మన గోల మితి మీరనంత వరకు పక్కవాళ్ళు మనను పట్టించుకోరు. ఇతరుల విషయాలలో తల దూర్చడం అనేది పాశ్చాత్యుల దృష్టిలో అమర్యాద (intrusion of privacy). పోలీసులు వ్యక్తిగత విషయాలలో తల దూరిస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం ఖాయం.

ఈ కట్టు కథ రాసిన వ్యక్తి జర్మనీకి ఎప్పుడూ వెళ్లలేదని నా అనుమానం.

ఇంటర్నెట్లో ఎన్నో కట్టు కథలు తిరుగుతున్నాయి. వాటిని ప్రోత్సహించడం మానేస్తే మంచిది. చెప్పదలుచుకున్న విషయం మంచిదే అయినా దానికి ఇలాంటి గాలి వార్తల సహాయం తీసుకోకుండా చెబితే ఇంకా బాగుంటుంది.

అజ్ఞాత చెప్పారు...

నా colleagues ని అడిగితే అటువంటి rule ఏమి లేదు అని చెప్పారు, కాని అలా ఫుడ్ ఎవరు వేస్ట్ చేయరు.అది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నారు.
నేనేదో ఆ రులే కి భయపడుతున్నట్టు నాకు ధైర్యం చెప్తున్నారు, అసలు సంగతి చెప్పేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ jai Gottimukkala - ee vyaaasamlo aakharu peraa idi. veelayite maromaaru chadavandi.గమనిక : ఇది యెంత వాస్తవమో తెలియదు. నెట్లో ఇంగ్లీష్ లో తిరుగాడుతున్న వ్యాసం ఇది. నిజమయినా కాకపోయినా ఒక వాస్తవాన్ని అర్ధం చేసుకోవడానికి, ఆచరించడానికి ఓ ‘నీతి కధ’ మాదిరిగా ఉపయోగపడగలదన్న ఉద్దేశ్యంతో అనువదించి బ్లాగులో పెడుతున్నాను. – భండారు శ్రీనివాసరావు (06-09-2012)