7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

కాంగ్రెస్ కు కావాల్సింది ముఖ్యమంత్రి మార్పా? ముఖ్యమంత్రిలో మార్పా? – భండారు శ్రీనివాసరావు



కాంగ్రెస్ కు కావాల్సింది ముఖ్యమంత్రి మార్పా? ముఖ్యమంత్రిలో మార్పా? – భండారు శ్రీనివాసరావు
(11-09-2012 సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)
కలయో వైష్ణవ మాయయో అన్నట్టు ప్రభుత్వంలో ఏదో కదలిక. దాదాపు రెండేళ్ళకు పైబడి  నిర్వికారంగా, నిస్తేజంగా, నిస్సత్తువుగా,  చేష్టలుడిగి  నిష్క్రియాపరత్వానికి నిలువెత్తు నిదర్శనంగా వున్న రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఒక  చిన్న వూపు.
ఉప ఎన్నికల కదన రంగంలో వరుస పరాజయ పరంపరతో చావుదెబ్బలు తిని, కన్నులొట్టబోయిన కాంగ్రెస్ పార్టీకి పూర్వ జవసత్వాలు కలిగించే సంకల్పంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  మొదలు పెట్టిన ఇందిరా పల్లె బాటకు జనాలనుంచి నీరాజనాలు లభించకపోయినా వ్యతిరేకత కూడా పెద్ద స్తాయిలో ఎదురుకాకపోవడం  చాలాకాలం తరువాత కిరణ్ సర్కారుకు దక్కిన  ఊరట.
ఆ వూరట కలిగించిన ధైర్యమో యేమో కానీ మరో ఆరు  నెలల కాలానికి ఈ కార్యక్రమాన్ని ఖరారు చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం రాజకీయవర్గాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల రెండో వారం తరువాత ముఖ్యమంత్రి మార్పు తధ్యం అని వస్తున్న వూహాగానాలను పటాపంచలు చేసేందుకే ముఖ్యమంత్రి ఈ అస్త్రాన్ని ప్రయోగించారని చెప్పుకుంటున్నారు.
ముఖ్యమంత్రి మార్పు, పీసీసీ అధ్యక్షుడి మార్పు గురించి వాళ్లు కుర్చీలో కూర్చున్న రెండో రోజునుంచే వార్తలు వదంతులు చెలరేగడం అన్నది కాంగ్రెస్ పార్టీలో మామూలే. అందుకే కాబోలు ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చే చోటా మోటా అధిష్టాన ప్రతినిధులు తిరిగి వెడుతూ ‘ప్రస్తుత ముఖ్యమంత్రే ఎన్నికల వరకు వుంటారని’ ఓ కితాబు ఇచ్చి ఢిల్లీ విమానం ఎక్కుతుండడం  ఈ మధ్య పరిపాటిగా మారింది. అలాగే, పనిలో పని అన్నట్టు పీసీసీ అధ్యక్షుడి మార్పు గురించి వస్తున్న వార్తలు కూడా  ‘కేవలం మీడియా  సృష్టి’ అని షరామామూలు సంక్షిప్త ప్రకటనలు చేస్తుంటారు.
ఇలా ఎప్పటికప్పుడు పదవీ కాలం పొడిగింపు గురించి తరచుగా చేసే ప్రకటనల ప్రభావం  ప్రభుత్వ యంత్రాంగంపై  పడే అవకాశం గురించి వాళ్లు లేశమాత్రం కూడా ఆలోచిస్తున్నట్టు కనబడదు. వారి బాధ్యతా రాహిత్యానికి ఇది  అద్దం పడుతుంది. రాష్ట్ర నాయకులపట్ల వారికున్న చులకన భావాన్ని తెలియచెప్పుతుంది.
ఇటీవల కాలంలో రాష్ట్రానికి చెందిన ఈ ఇద్దరు నాయకుల భవిష్యత్తు గురించి ఒక రోజు రోజల్లా ఆందోళన కలిగించే వార్తలు షికారు చేసినప్పుడు వారి పదవీ గండం ఖాయమనే అనుకున్నారు. పీసీసీ అధ్యక్షుడి మార్పు గురించిన వదంతులు ఏమేరకు వెళ్ళాయంటే, అ పదవికి ఖాళీ ఏర్పడడం తధ్యం అని నమ్మిన నాయకులు కొందరు తమ పేరును పరిశీలించాల్సిందిగా విలేఖరుల సమావేశాలు పెట్టి మరీ అధిష్టాన దేవతలకు విన్నపాలు చేసుకున్నారు. అలాగే కాబోయే ముఖ్యమంత్రి గురించిన వూహాగానాలు కూడా ముప్పిరిగొనడంతో ఆశా వహులందరూ కొన్నాళ్ళపాటు హస్తిన లోనే మకాం వేసి, అనుకున్నది ఏదీ జరక్కపోవడంతో  నిరాశతో హైదరాబాదుకు  తిరిగొచ్చేశారు.  ఈ పరిణామాలన్నీ సహజంగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డినీ, పీసీసీ నేత  బొత్స సత్యనారాయణనూ  ఒకరకమైన నిర్వేదంలోకి నెట్టివేసి వుండాలి. బహుశా,  ఈ నేపధ్యంలోనే, ఈ వదంతులను  గట్టిగా తిప్పికొట్టడానికే  ముఖ్యమంత్రి తన పల్లెబాట కార్యక్రమం షెడ్యూలును మరో ఆరుమాసాల కాలానికి ప్రకటించి వుండాలి.
రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రలో మున్నెన్నడు కనీ వినీ ఎరుగని స్వేచ్ఛనూ, వాక్స్వాతంత్ర్యాన్ని కాంగ్రెస్ వాదులు ఈనాడు  అనుభవిస్తున్నారనుకోవాలి. ముఖ్యమంత్రి అంటే  లెక్కలేనట్టు వ్యవహరించే మంత్రులు ఓ పక్క, మంత్రులకు మంత్రులకు నడుమ గిల్లికజ్జాల వార్తలు మరోపక్క – ఇలా రాష్ట్ర కాంగ్రెస్ కట్టడి లేని విధంగా తయారయింది. ఈ పరిస్తితిని చక్కదిద్దాల్సిన అధిష్టానం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన  సీనియర్ నాయకులు టీవీ తెరలపై  చేసే వాగ్యుద్ధాలు చూసేవారికి ఈ అభిప్రాయం కలగడం సహజం.  మెడలో వేసుకున్న మువ్వన్నెల కాంగ్రెస్ కండువాలను మినహాయిస్తే,  వారంతా  ఒకే పార్టీకి చెందినవారంటే నమ్మకం కుదరడం కష్టం.
ఇక కిరణ్ కుమార్ రెడ్డి  విషయానికి వస్తే,  కాంగ్రెస్ పార్టీలో ఆయన అంత అదృష్టవంతుడూ వుండడు. అంత దురదృష్టవంతుడూ వుండరు. నిజానికి ఆయన మంచి సమయంలో ముఖ్యమంత్రి అయ్యారు. చిన్న వయస్సులో  అధిష్టానం ఆయనకు పెద్ద పదవిని అయాచితంగా అప్పగించింది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ వ్యవధానం వున్న తరుణంలో ముఖ్యమంత్రి కావడం వల్ల అనుకున్న పనులు అనుకున్న వ్యవధిలో పూర్తిచేసే అవకాశం వుంటుంది. పైగా అధిష్టానం మద్దతు పూర్తిగా వుంది. ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రికయినా ఇది గొప్ప వరం. కిరణ్ ఈ వరాన్ని చక్కగా వినియోగించుకున్న దాఖలాలు లేవని  ఆయన సన్నిహితులే పరోక్ష సంభాషణల్లో వొప్పుకుంటూ వుంటారు.
కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి అధిష్టానం పరిగణన లోకి తీసుకున్న యువకుడు, విద్యాధికుడు అన్న రెండు అంశాలను – రుజువు చేసుకోవడంలో ఆయన చాలావరకు   వైఫల్యం చెందారనే చెప్పాలి. ఆయనకు ముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి వ్యవహార శైలితో పోల్చి చూసుకుని  కిరణ్ పని తీరును అంచనావేయడం సహజంగా జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా, ఏ చిన్న సంఘటన జరిగినా - వారిద్దరూ  తక్షణం  హెలికాప్టర్ లో రెక్కలు కట్టుకుని వాలిపోయేవారు. ఇలా చేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయా అన్నది సందేహమే. కానీ, ఈ ఆకస్మిక పర్యటనల ద్వారా వారిరువురికీ ప్రజాదరణ అనే రాజకీయ లబ్ది లభించింది. ప్రజలకు సంబంధించిన ప్రతి అంశం పట్ల వెంటనే స్పందిస్తారన్న నమ్మకం జనంలో ఏర్పడింది. యువకుడయిన కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం  ఈ విషయంలో
అధిష్టానం తన మీద వుంచిన భరోసాను నిలబెట్టుకోలేకపోయారనే చెప్పాలి. ఇటీవలి కాలాన్ని మినహాయిస్తే , ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరవాత ఆయన ఎక్కువ సమయం సచివాలయంలో, సీ.ఎం. క్యాంప్ కార్యాలయంలోనే గడుపుతూ వచ్చారు. అధికారులతో సమీక్షా సమావేశాలు జరుపుతూ పాలన సాగిస్తున్నారని ఆయన పార్టీవారే ఎద్దేవా చేస్తుంటారు. క్షేత్ర స్తాయిలో సమాచారం తెలుసుకోవడానికి ఆయన అధికారులమీదనే ఎక్కువ ఆధారపడతారని కాంగ్రెస్ నాయకులు బాహాటంగానే చెబుతారు.
అయితే, ముఖ్యమంత్రిని మార్చడం వల్ల కాంగ్రెస్ పార్టీకి అదనంగా వొనగూడే లాభం ఏమిటి? ఈ ప్రశ్నకు జవాబు దొరక్కుండా అధిష్టానం ఆయన్ను మార్చే ఆలోచన చేయకపోవచ్చు. తరచుగా ముఖ్యమంత్రులను మార్చడంవల్ల కలిగే అనర్ధం ఏమిటన్నది కాంగ్రెస్ అధినాయకులకు తెలియంది కాదు.  ముఖ్యమంత్రిని మార్చడం వల్ల వచ్చే లాభం కన్నా  ఒనగూడే నష్టం ఎక్కువ అన్న వాస్తవం తెలుసు కనుక వాళ్ళూ కిమ్మిన్నాస్తిగా వుండిపోతున్నారు. అధిష్టానం నిస్సహాయత,  ప్రధాన  ప్రతిపక్షం అయిన తెలుగు దేశం నిష్క్రియాపరత్వం కలసి  వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని భాష్యం చెప్పేవారికి కూడా ఆ పార్టీలో కొదవ లేదు.
కిరణ్ కుమార్ రెడ్డి నెమ్మది నెమ్మదిగా కుదురుకుంటున్నారనీ,   క్రమంగా,  పార్టీపై,  ప్రభుత్వంపై  గట్టి పట్టు చిక్కించుకుంటున్నారనీ  ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నప్పటినుంచి ఆయన ఎదుర్కుంటూ వస్తున్న  సమస్యలను ఏకరువు పెడుతూ,  వాటన్నింటినీ ఆయన  యెలా వరుస క్రమంలో పరిష్కరిస్తూ వస్తున్నారో అన్న విషయాన్ని నొక్కి చెబుతూ,  ఎలాటి  ‘మచ్చా, మరకా’ లేకుండా చేస్తున్న పరిపాలనే ఆయనకు జనంలో మంచి పేరు తీసుకు వస్తుందనీ,  అదే కాంగ్రెస్ నావని ఎన్నికల విజయ  తీరానికి  చేరుస్తుందనీ   మూస బాణీలో మాటలు వల్లెవేస్తున్నారు. కాకపొతే ఇలా ముఖ్యమంత్రిని సమర్ధిస్తూ మాట్లాడే కాంగ్రెస్ నాయకుల సంఖ్య గతంతో పోలిస్తే తక్కువ. పైగా వారికి ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కూడా  తక్కువని  ముఖ్యమంత్రి వ్యతిరేకులు  సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.          
నిజమే. ఇప్పుడు  ఆయన ఎదుర్కుంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కానీ, నమ్మి అధికారం వొప్పగించిన ప్రజల సమస్యల మాటేమిటి? ప్రజలకు సమస్యలను  దూరం చేసిన నాడు  పాలకులకు వారు  దగ్గరవుతారు. ఇది చరిత్ర చెప్పే సత్యం. 
పదవి తాత్కాలికం అనుకున్నప్పుడు పదిమందికి శాశ్వితంగా పనికొచ్చేపనులను  ఆ  పదవిని లెక్కచేయకుండా   ధైర్యంగా చేయడానికి వీలుంటుంది. పదవినే శాశ్వితం చేసుకోవాలనుకున్నప్పుడు నలుగురికీ పనికొచ్చే పనులు చేయడానికి అవసరమయిన సంకల్పం కొరవడుతుంది.
ఇది దృష్టిలో వుంచుకుంటే  సమర్ధవంతమయిన పాలన సాగించేందుకు మార్గం సులువవుతుంది.
ఇప్పుడు జరగాల్సింది ముఖ్యమంత్రి మార్పా? ముఖ్యమంత్రిలో మార్పా ? అనేది  కాంగ్రెస్ అధిష్టానమే తేల్చుకోవాల్సివుంది. (07-09-2012)

కామెంట్‌లు లేవు: