13, జులై 2011, బుధవారం

రేడియో తాతయ్య ఇక లేరు – భండారు శ్రీనివాసరావు

రేడియో తాతయ్య ఇక లేరు – భండారు శ్రీనివాసరావు


1938 జూన్ 16 వ తేదీ

మద్రాసులో మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన రేడియో కేంద్రాన్నిప్రారంభించిన రోజది. అప్పటికి ఆలిండియా రేడియో ‘ఆకాశవాణి’ గా రూపాంతరం చెందలేదు. మద్రాసు పేరు మార్చుకుని చెన్నైగా అవతరించనూ లేదు. ప్రారంభ కార్యక్రమంగా అనుకుంటా బిస్మిల్లా ఖాన్ గారి షెహనాయ్ కచ్చేరీ పెట్టారు. దాని గురించి అనౌన్స్ చేసే  బాధ్యత మల్లంపల్లి ఉమామహేశ్వర రావు గారిపై పడింది. మద్రాసు రేడియో కేంద్రం అధికారికంగా మొదలుకాక ముందు నుంచే ఆయన అక్కడ పనిచేస్తూ వచ్చారు. ప్రసారాలకు అవసరమయిన రచనలకు ప్రతులు రాయడం ఆయన ఉద్యోగం. రేడియో కేంద్రం పనిచేయడం మొదలు పెట్టేసరికి ఆయన్నే అనౌన్సర్ గా పనిచేయమన్నారు. ఆ విధంగా ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో తొలి అనౌన్స్ మెంట్ చేసిన ఘనత మల్లంపల్లి వారి ఖాతాలో చేరిపోయింది.

తదనంతర కాలంలో రేడియో తాతయ్యగా సుప్రసిద్దులయిన మల్లంపల్లి ఉమామహేశ్వరరావు గారు రేడియోలో పనిచేసిన వారందరికీ ప్రాతః స్మరణీయులు. ఈ రోజు ఉదయం ఆయన్ని గుర్తుచేసుకోవాల్సిన సందర్భం అత్యంత బాధాకరంగా మారింది. మల్లంపల్లి వారు తమ 99 వ ఏట చెన్నై లో ఈ తెల్లవారుఝామున కన్ను మూసిన సంగతిని హైదరాబాద్ రేడియో కేంద్రం డైరెక్టర్ గా పదవీ విరమణ చేసిన పీ ఎస్ గోపాల కృష్ణ గారు కన్నీళ్ళ పర్యంత మవుతూ నా చెవిన వేశారు. నిజానికి నేను ఆయన్ని గురించి వినడమే కాని చూసి ఎరుగను. 1975 లో నేను హైదరాబాదు రేడియో కేంద్రం లో చేరిన రెండు సంవత్సరాలకే మల్లంపల్లి వారు నలభై ఏళ్ళ సుదీర్ఘ రేడియో జీవితాన్ని విరమించి 1977 మే 31 వ తేదీన ఉద్యోగ విరమణ చేశారు.

ఆకాశవాణి అనౌన్సర్లు, న్యూస్ రీడర్లు, డ్రామా వాయిస్ స్టాఫ్ ఆర్టిస్టుల సంక్షిప్త జీవన రేఖలను స్పృశిస్తూ ‘వాచస్పతి’ పేరుతొ అంబడిపూడి మురళీ కృష్ణ, మడిపల్లి దక్షిణామూర్తి కలసి సంకలనం చేసిన గ్రంధంలో మల్లంపల్లి వారు తన గురించి రాసుకున్న కొన్ని జ్ఞాపకాలు ఈ సందర్భంగా నలుగురి దృష్టికి తీసుకురావడం సముచితంగా వుంటుందని భావిస్తూ వాటిని పేర్కొంటున్నాను.

“అప్పట్లో మద్రాసు, ఆంధ్ర, తమిళ, కన్నడ ప్రాంతాలు కలగలిపి అవిభక్తంగా ఉండడం వల్ల సంగీత కార్యక్రమాలకు నేను తెలుగులోనే ప్రకటనలు చేసేవాడిని.”

“రేడియో మొదటి రోజుల్లో ఆచంట జానకిరామ్ గారు నాటకాలు రూపొందించేవారు. రాత్రి తొమ్మిదిన్నర నుంచి పదిన్నర దాకా నాటకం ప్రసారమయితే ఆ తర్వాత నాటకంలో పాల్గొన్నవాళ్లు, తక్కిన ఉద్యోగులు అందరు ఆరుబయట ఆయన ఏర్పాటు చేసిన విందు భోజనం చేసికానీ కదిలే వీలు వుండేది కాదు. ఆ విందు ఖర్చులన్నీ ఆయనవే.”

“రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక రోజు ఉదయం సేట్ కాలనీలో వున్న మా ఇంటి నుంచి ఎగ్మూర్ మార్షల్స్ రోడ్ లోని రేడియో స్టేషన్ కు బయలుదేరి వస్తుంటే దారిలో పోలీసు ఒకాయన ఆపి ‘ఎక్కడికి’ అని అడిగాడు. చెప్పాను. ఆయన- ‘ఇట్లా వెడితే మునిగిపోతావు. పాంతియన్ రోడ్ వైపు వెళ్ళు’ అన్నాడు. తీరా వెడితే రేడియో స్టేషన్ గేటు దగ్గర గుండె లోతు నీళ్ళు పారుతున్నాయి. చెంగల్పట్ జిల్లా లోని చెరువుకట్ట తెగి ఆ నీళ్ళు నగర ప్రవేశం చేశాయన్నమాట. స్టేషన్ లోకి అడుగు పెడుతుండగానే అక్కడ డైరక్టర్ ఎస్. గోపాలన్ గారు గ్రామ ఫోన్ రికార్డులు తీసుకునిపోతూ కనిపించారు. ఆయన నన్ను చూసి చాలా సంతోషపడి వెళ్లి అనౌన్స్ చేయమన్నారు. ప్రసారానికి సంబంధించిన పరికరాలన్నీ బల్లలపైకి ఎక్కి కూచుని కనిపించాయి. రోజంతా నేనొక్కడినే అనౌన్సర్ని. నీళ్లలోనే నిల్చుని అలా అనౌన్స్ చేస్తుండగా సాయంకాలం అయ్యేసరికి కరెంట్ పోయింది. ఆ పోయిన కరెంట్ మర్నాడు పొద్దున్న కానీ సరిపడలేదు. ఈ లోగా రేడియో కార్యక్రమాలు వినబడక పోయేసరికి నగరంలో కొందరు ప్రజలు జపాన్ వాళ్లు రేడియో కేంద్రాన్ని కూల్చేసినట్టున్నారని భయపడ్డారు.”

“ఒక ప్రముఖ విద్వాంసుడు ఎప్పుడు తన గానం ప్రసారం చేయడానికి వచ్చినా సింహ స్వప్నంగా వుండేది. ఆయన పాడినంత సేపూ అందుకు తగ్గట్టు అనౌన్సర్ తల వూపకపోతే ప్రాణం మీదికి వచ్చేది.”

“బాలగురుమూర్తిగారు కార్యక్రమ నిర్వాహకులుగా వున్నప్పుడు పిల్లల కార్యక్రమానికి ఒక పాత్ర కావలసి వచ్చింది. ఆయన నన్ను గొంతు మార్చి ప్రయత్నించమని చెప్పారు. అట్లా నేను తాతయ్య అవతారం ఎత్తాను. తాతయ్యగా చాలా ప్రఖ్యాతి సంపాదించాను. రేడియో స్టేషన్ కు వచ్చిన వాళ్లు తాతయ్యను చూపమని నన్నే కోరేవాళ్ళు. మరికొందరు నేనే తాతయ్యను అంటే నమ్మలేక పోయేవాళ్ళు.”

“ఒకసారి ఒక తెలుగు పత్రికా సంపాదకులు ప్రసంగం చేయడానికి వచ్చారు. అప్పటికి రికార్డింగ్ సౌకర్యం లేదు. ఆయన ప్రసంగిస్తారని నేను అనౌన్స్ చేసి చూస్తే ఆయన చెమటలు కక్కుతూ,వణుకుతూ కనిపించారు. ఎంత ప్రయత్నించినా ఆయన నోరు విప్పక పోయేసరికి నెమ్మదిగా ఆయన చేతుల్లోనుంచి ప్రసంగం ప్రతి తీసుకుని నేనే చదివేశాను.”

నిండు జీవితం జీవించిన ఆ పూర్ణ పురుషుడికి ముకుళిత హస్తాలతో శ్రద్ధాంజలి ఘటిద్దాం. (13-07-2011)

5 కామెంట్‌లు:

మాగంటి వంశీ మోహన్ చెప్పారు...

Sad news. May his soul rest in peace.

prasad sarma చెప్పారు...

mee jeevana saili chooste chaala eejee going anipistaaru. kaani mee blagulu chadivite meelo inta loataina pariseelana cheyagala, anta nisita viShaya parignanam vunna manishi vunnaraa ani ascharyam vestundi. lekapote gayatri mantranni amta goppaga taatparya sahitamga vivaramga vivarimchagalaru. goppa samajika drukpadhamtoa ade chettoa padunaina rajakiya vyakhyalani vraayagalaru. meeru nijamga savyasaachi saar. "Vachaspati" loani story ni yemta samdarbhochitamga quote chesaru saar.

ramana చెప్పారు...

oka manchi vyakthi, commitment unna professional ika leru.
99 samvatsaralu brthakatamu goppa visesham...inko samvatsaramaithe century ayyedi?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@prasada Sarma and Sri Ramana _ thanks - bhandaru srinivasrao

Anil Atluri చెప్పారు...

రేడియో తాతయ్య - ఆట విడుపు - ఆ నాటి మద్రాసులోని తెలుగు పిల్లలు ఎలా మరిచిపోగలరు?
ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యేది. నేను కూడా పద్యాలు పాడేవాడిని. ముందే రికార్డ్ చేసే వారు.చేసేటప్పుడు..పిల్లలేవరైనా నట్లుకొడితే..సున్నితంగా మైకు కి అందకుండా ఆ పదమే..ఆ పాదమో అందించేవారు తాతయ్య.పిల్లవాడు ఆ పద్యాన్నో /గేయాన్నో పూర్తిచేసేవాడు.
"..ఆటలు, పాటలు, నాటికలు
నేటికి ఇక చాలిద్దామా..
వచ్చే ఆదివారం మళ్ళీ కలుద్దామా"
ఏదేని ప్రత్యేక కార్యక్రమం రికార్డింగ్ రోజునైతే వచ్చిన పిల్లలందరికి దగ్గిరుండి అల్పాహారం కాని చాక్లెట్లు, బిస్కట్లు ఇచ్చేవారు.
తెలుగు శతకాలు నేర్చుకుని..ఆ ఆటవిడుపు లో తప్పులేకుండా ఒప్పచెప్పడం, పదిమంది దానిని గుర్తించడం, పిల్లల్లో ఎంతో ఆత్మస్థయిర్యాన్ని పెంచేది. ఉమ - రేడియో తాతయ్య ఇక లేరు అన్నది కటిక నిజం.