5, మే 2011, గురువారం

సీఎం కిరణ్ - యధా రాజా తధా భాష - భండారు శ్రీనివాసరావు


సీఎం కిరణ్ - యధా రాజా తధా భాష

హైదరాబాదులో జనసమ్మర్ధం బాగావుండే ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య విగ్రహం కూడలిలో ఒక పెద్ద హోర్డింగ్ వద్దనుకున్నా కంట్లోపడి పలకరిస్తుంది. అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి తనదయిన తెల్లని పైజామా లాల్చీ మార్కు దుస్తులు ధరించి కనబడుతుంటారు. ఇంతవరకు బాగానే వుంది. కాకపొతే ముఖ్యమంత్రి నిలువెత్తు చిత్రంతో పాటు కనబడే తెలుగు కవిత్వమే వెగటు కలిగించేదిగానేకాదు, అర్ధంపర్ధం లేకుండా కూడా వుంది. అంత్య ప్రాసలకోసం ఆరాటపడి రాసిన ఈ కవిత (?) ముఖ్యమంత్రి హోదాకు ఎంతమాత్రం అనుగుణంగా లేదని చెప్పడానికి ఈ నాలుగు పంక్తులు చదివితే చాలు.

“ప్రజా సంస్కరణల సారధి

అవినీతిజ్ఞుల విరోధి

------------------స్తిత ప్రజ్ఞతి

ఓ హైదరాబాదీ! ఇక నీవే మా బాదరబందీ!!”

బాదరబందీ అంటే అర్ధం తెలిసే ఇది రాసారా అని ఎవరయినా అనుకుంటే ఎవరిది తప్పు?

7 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

:))

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) చెప్పారు...

:)) మేమూ చూశామండీ ఆ హోర్డింగ్. కొద్దిసేపు పడీ పడీ నవ్వుకున్నాంగానీ, తరవాత అందులో నిజాన్ని గ్రహించగలిగాం.

అవును, నిజంగానే ఆయనే మన బాదరబందీ ;)

కృష్ణప్రియ చెప్పారు...

Prasads ముందు ఇదే హోర్డింగ్ చూసి తెగ నవ్వుకున్నాం.. మేమూనూ..

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత,కృష్ణప్రియ,Weekend Politician - మీ అందరికీ ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

సుజాత వేల్పూరి చెప్పారు...

ఇంతకు ముందు కూడా బ్లాగర్లలోనే ఎవరో దీని గురించి రాశారండీ!

ఏదో ప్రాస కోసం కాస్త ప్రయాస పడ్డట్టున్నారు. ఎంతమంది మనలాగా నవ్వుకున్నారో దాన్ని చూసి!

స్థిత ప్రజ్ఞతి అంటే ఏమిటండీ? భండారు గారూ, మీరైనా చెప్పాలి నాకు!

అవినీతిజ్ఞులు____:-))

రాజనీతిజ్ఞులు లోంచి పుట్టిందా ఈ పదం!

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@సుజాత గారు- మీరన్నది నిజమే. లోగడ ఏదో బ్లాగులో వచ్చిందని నేనూ విన్నాను. సాధారణంగా వ్యక్తిగతంగా పరిచయం వున్నప్పుడు బ్లాగులోకి లాగడం నాకు ఇష్టం వుండదు. పేషీ వారికి చెప్పి చూసిన తరవాత కూడా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇలా రాయాల్సివచ్చింది.మీరు అడిగినవాటికి విడిగా మెయిల్ పంపుతాను.-భండారు శ్రీనివాసరావు

PRASAD చెప్పారు...

గతంలో నగరంలో కొన్ని చోట్ల KASS అనే రోశయ్య గారి అభిమాని (పేరు లక్ష్మి పతి అనుకుంటాను) ఒకాయన కొన్ని హోర్డింగులు ప్రసాద్ ఈ మ్యాక్స్ నుంచి ఖైరతబాద్ జంక్షన్ వరకు, అబిడ్స్, మలక్పేట మొదలైన కొన్ని చోట్ల పెట్టారు. రోశయ్యగారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే రీతిలో వున్నాయి ఆయన వ్రాసిన వ్యాఖ్యలు. రోశయ్యగారు పదవీ విరమణ చేశాక కూడా ఆయన సేవలు శ్లాఘిస్తూ పెట్టిన హోర్డింగులు చాలా హుందాగా వున్నాయి. బహుశా పులిని చూసి మరో ప్రాణి అలానే అవుపించాలని యేదొ ఛెసిందన్న ఉపమానం ఞాపకం వస్తుంది.

ప్రసాద్ శర్మ.