13, మే 2011, శుక్రవారం

కడప ఉపఎన్నికల పోరు తీరు – భండారు శ్రీనివాసరావు

కడప ఉపఎన్నికల పోరు తీరు – భండారు శ్రీనివాసరావు


మే పదమూడు తరువాత ఏ జరగబోతోంది?

ఇప్పుడీ కొత్త ప్రశ్న ఒకటి జనం ముందు వచ్చి నిలుచుంది.

నిరుడు చివరాఖర్లో శ్రీ కృష్ణ కమిటీ నివేదిక సమర్పించే సమయంలో ‘డిసెంబర్ ముప్పై ఒకటి తరవాత ఏం జరుగుతుందన్న’ విలేకరుల ప్రశ్నకు గవర్నర్ నరసింహన్ జవాబిస్తూ ‘ఏం జరుగుతుంది జనవరి ఒకటి వస్తుంది’ అని పేర్కొన్న విషయం స్పురణకు వస్తుంది.

కడప ఉపఎన్నికలు ముగిసాయి. చెదురుమదురు స్వల్ప సంఘటనలు మినహాయిస్తే, మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పదమూడో తేదీన వోట్ల లెక్కింపు జరుగుతుంది. ఫలితాల గురించి ఎవరికీ సందేహాలువున్నట్టులేదు. మెజారిటీ గురించిన ఊహాగానాలే అంబరాన్ని తాకుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన అనేక విలక్షణ లక్షణాల్లో ఇదొకటి.



ఈ ఎన్నికలతో పాటు దేశంలో మరో అయిదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దేశాన్ని సంకీర్ణ ధర్మంతో పాలిస్తున్న యూపీయే సర్కారు ముఖ్యంగా సోనియా గాంధీ నాయకత్వం లోని కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ఫలితాలకోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఎందుకంటె మరో రెండేళ్ళల్లో రాబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో లోకసభకు సాధ్యమయినన్ని ఎక్కువ స్తానాలు గెలుచుకుని రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేయాలన్న అభిమతం నెరవేరడానికి ఈ ఎన్నికల్లో సాధించే విజయాలే ఆ పార్టీకి కొత్త ఊపిరి పోస్తాయి. అయినా కానీ, అయిదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను తలదన్నేలా కడప ఉప ఎన్నికలు యావద్భారత దృష్టిని ఆకట్టుకోగలిగాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సయితం ఈ ఉప ఎన్నికలపై ఓ కన్ను వేసే వుంచింది. ఎందుకంటె, ఈ ఉపఎన్నికల ఫలితాల వల్ల ఇటు రాష్ట్రంలో అటు జాతీయ స్తాయిలో ప్రభుత్వాలపై కానీ, పార్టీపై కానీ ఎలాటి ప్రభావం వుండదని ఎన్నికలకు ముందూ, పోలింగ్ తరవాత కూడా కాంగ్రెస్ నాయకులు పైకి బీరాలు పోతున్నప్పటికీ లోలోపల ఎవరి సందేహాలు వారికి వున్నట్టున్నాయి. ఏదో రెండు స్తానాలకు జరిగే ఉపఎన్నికల్లో గెలిచినా ఓడినా పోయేదేమీ వుండదని ఎంతమాత్రం ఉపేక్షించకుండా సర్వశక్తులు వొడ్డి పోరాడిన విధానమే ఈ వాస్తవాన్ని వెల్లడిస్తోంది. ఇక్కడే ఆ పార్టీ వ్యూహకర్తలు తప్పులో కాలేసినట్టు వుంది. ఈ ఉప ఎన్నికలకు అనవసర ప్రాముఖ్యత ఇచ్చి కొరివితో తల గోక్కున్నట్టు అయిందని పోలింగ్ ముగిసిన తరువాత రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను ఏళ్లతరబడి పరిశీలిస్తూవస్తున్న తలపండిన మేధావులు, రాజకీయ పరిశీలకులు కూడా ఆ పార్టీలో అంతర్గతంగా వున్న ఒక విలక్షణ తత్వాన్ని మెచ్చుకోవడం కద్దు. మరే పార్టీలో కూడా కానరాని

అంతర్గత ప్రజాస్వామ్యం, దానితోపాటే నిగూఢంగా నిబిడీకృతమైన అధినాయక స్తాయి నియంతృత్వం – ఈ రెండూ కాంగ్రెస్ పార్టీకి బలమూ, బలహీనత. సీతారాం కేసరి కానివ్వండి, సోనియా గాంధీ కానివ్వండి పార్టీ అధ్యక్ష స్తానంలో వుంటే చాలు - ఒకేరకమయిన భక్తిప్రపత్తులు ప్రదర్శించగల నాయకులకు, కార్యకర్తలకు కొదవ లేని పార్టీ అది. అదే సమయంలో పదవికి దూరమయిన అధినాయకులకు దూరం జరగడంలో ఎంతమాత్రం సంకోచం చూపనివారు ఆ పార్టీలో కనబడడం కష్టం. క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా పార్టీ ఆదేశాలను శిరసావహిస్తామని నోటితో ఓ పక్క చెబుతూనే మరోపక్క నొసటితో వెక్కిరించగల సమర్ధులు కాంగ్రెస్ లో లెక్కకు మిక్కిలిగా కనబడతారు. వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం అంటూనే, కీలక స్తానాల్లో వున్నవారి పట్ల వ్యక్తిఆరాధన బహిరంగంగా ప్రదర్శించేవారయితే కోకొల్లలు. ఇంతటి వైచిత్రం, వైవిధ్యం కాంగ్రెస్ కే చెల్లు. విశ్వసనీయతకంటే విధేయతకే పెద్ద పీట వేస్తారని పార్టీలో కొత్తగాచేరినవారికి కూడా తెలుసు. సొంత నిర్ణయాలు తీసుకోగలిగీ తీసుకోనివారంటే పార్టీ పెద్దలకు చాలా ముద్దు. పైవారిని పల్లెత్తు మాటనకుండా పార్టీని పలుచన చేసే వ్యాఖ్యలు ఎన్ని చేసినా అడిగేవారుండరు.కలహిస్తూ కలసివుండడం అనేది ఈ పార్టీ లోని మరో విలక్షణ లక్షణం. అందుకే, ఇన్నేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ , కిందపడ్డా పైచేయి తనదే అన్న తీరులో దేశ రాజకీయాలను శాసించగలుగుతోంది. బలహీనతలను బలంగా మార్చుకుని నూతన జవసత్వాలతో శ్వాసించ గలుగుతోంది. వెయ్యిన్నొక్క లుకలుకలున్న పార్టీగా ముద్రవున్నా అవసరం వచ్చినప్పుడు పైనుంచి కింద దాకా ఒకే మాటగా వ్యవహరించగలుగుతోంది. పార్టీకి చేటు చేస్తాయనుకునే తప్పులను కూడా పదేపదే చేస్తూ నిభాయించుకోగలుగుతోంది. పార్టీలో కరడుగట్టుకుపోయిన ఈ స్వభావమే కడప ఉపఎన్నికల విషయంలో సయితం తన ధోరణిని ఎంతమాత్రం సడలించుకోనివ్వకుండా అడ్డుపడివుంటుంది. అభ్యర్ధుల నిర్ణయం నుంచి, ప్రచార సరళి వరకు ఇదే వరస. అదే తీరు. ప్రాణాంతకంగా మారగలదని తెలిసికూడా ప్రతిష్టాత్మకంగా పోరాడింది. దీనితో, బరిలోవున్న మిగిలిన రెండు పార్టీలు కూడా దానితో పోటీ పడడంతో ఈ ఉపఎన్నికలకు స్తాయిని మించిన ప్రచారం లభించడంతో కడప ఎన్నికలు రగిల్చి మిగిల్చి వెళ్ళిన వేడి ఇంతా అంతా కాకుండా పోయింది. సాధారణంగా జరగాల్సిన ప్రచారం అవధులు మించి సాగింది. విమర్శలు ఆరోపణలుగా, ఆరోపణలు వ్యక్తిగత నిందారోపణలుగా మారి కొండొకచో మాన్యులను సామాన్యులను ఏవగించుకునేలా చేసాయి. ఓ పక్క డబ్బు వెదజల్లుతూనే, మద్యం పంచుతూనే ఎదుటి పక్షం అదేపని చేయడాన్ని తూర్పార పట్టడాన్ని యెలా అర్ధం చేసుకోవాలో తెలియని పరిస్తితి. అన్నహజారే అవినీతి వ్యతిరేకపోరాటానికి బాసటగా వుంటాం అన్న వాళ్లందరూ ఇలా నిస్సిగ్గుగా వోటర్లను ప్రలోభపరిచే విధంగా అవినీతి కూపంలో కూరుకుపోవడం చూస్తున్న వారికి ‘భళా! రాజకీయం’ అనిపించింది. ‘మీలో పాపం చేయని వాడు ఎవరో చెప్పండి!’ అని నిలదీయాలని అనిపించివుంటుంది.

వోటరు తలకు విలువకట్టి, అతడు ప్రజాస్వామ్యబద్ధంగా వేయాల్సిన వోటుకు ధరకట్టి, వేలంపాటలో మాదిరిగా కొనుక్కుంటూ పైపెచ్చు వోటర్లను కొనుగోలు చేస్తున్నారని వైరి పక్షంపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం



వోటరును నిలబెట్టి అవమానించడమేనని వారికెందుకు అనిపించలేదో అర్ధం కాని విషయం. అయినదానికీ, కానిదానికీ ప్రజాప్రయోజన వ్యాజ్యాలువేసే ప్రచారకండూతులకు ఇలా వోటర్లను అవమానించడం అన్న విషయం పెద్ద విషయంగా అనిపించలేదేమో. ఏ న్యాయస్తానమో, న్యాయమూర్తో కలిపించుకుని ప్రజాస్వామ్యానికి పునాదిరాయి అయిన వోటరును మీడియాలో, బహిరంగసభల్లో కొనుగోలు వస్తువుగా చూపిస్తూ అవమానించే పద్ధతికి స్వస్తి చెప్పేలా చేస్తే బాగుంటుందని ప్రజాస్వామ్య ప్రియులు ఎవరయినా కోరుకుంటారు.





నిజానికి ఉపఎన్నికల పోలింగ్ కడప జిల్లా గురించి ప్రచారం లో వున్న అపోహలకు, అపప్రధలకు భిన్నంగా జరిగింది. ఒక్క బాంబు పేలకుండా, ఒక్క పోలీసు తూటాకు కానీ, లాఠీకి కానీ పనిచెప్పకుండా, ఒక్క నెత్తురు చుక్క నేల రాలకుండా ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ‘వోటు మాకున్న ఏకైక హక్కు దాన్ని వాడుకుని తీరతాం’ అన్న పద్ధతిలో పోలింగ్ ప్రారంభం కావడానికి కొన్ని గంటలముందే పోలింగ్ కేంద్రాలముందు బారులుతీరి నిలబడ్డ కడప వోటర్లు శతధా అభినందనీయులు. ఎర్రటి ఎండను కూడా లెక్కచేయకుండా స్త్రీలు, పురుషులు, వృద్ధులు, వికలాంగులు గంటల తరబడి వేచివుండి తమ వోటుహక్కు వినియోగించుకున్న తీరు టీవీల్లో గమనించిన వారికి ‘పరవాలేదు. మన దేశంలో ప్రజాస్వామ్యానికి ధోకా లేదనిపించివుంటుంది. కానీ, అదేసమయంలో మన రాజకీయనాయకులు ప్రచార వ్యవధిని సద్వినియోగం చేసుకోకుండా ఒకరిమీద మరొకరు దుమ్మెత్తి పోసుకోవడం చూసినప్పుడు మన ప్రజాస్వామ్య సౌధంలో సేదదేరేవారు ఇలాటి వారా అన్న ఆవేదన కలుగుతుంది. బహిరంగ సభల్లో ప్రసంగించినా, రోడ్ షో లల్లో మాట్లాడినా, మీడియా సమావేశాల్లో ముచ్చటించినా, టీవీ చర్చల్లో పాల్గొన్నా అందరిదీ ఇదే తంతు.

చింతించి వగచడమే చివరికి మిగిలింది. (09-05-2011)



కామెంట్‌లు లేవు: