28, మే 2011, శనివారం

కూడలిలో రాష్ట్ర రాజకీయాలు – భండారు శ్రీనివాసరావు

కూడలిలో రాష్ట్ర రాజకీయాలు – భండారు శ్రీనివాసరావు

(28-05-2011 తేదీ సూర్య దినపత్రికలో ప్రచురితం) 

రాష్ట్ర రాజకీయాలు దశాదిశా తెలియని స్తితిలో నాలుగు రోడ్ల కూడలిలో చతికిలపడి వున్నాయి.

ప్రధాన పార్టీల్లో పాలక పక్షం కాంగ్రెస్ ది ఒక విచిత్రమయిన స్తితి. అధికారంలో వున్నామా లేదా అని ఎప్పటికప్పుడు గిల్లి చూసుకోవాల్సిన పరిస్తితి. ప్రజలు పగ్గాలు ‘చేతి’కిచ్చి రెండేళ్లు గడిచిపోయాయి. మామూలుగా అయితే మన్నూ మిన్నూ ఏకమయ్యేలా సంబరాలు చేసుకోవాల్సిన సందర్భం. రెండేళ్ళ పాలనలో సాధించిన విజయాలు గురించి గొప్పలు చెప్పుకోవాల్సిన తరుణం. పత్రికలనిండా ప్రకటనలతో హోరెత్తించాల్సిన సమయం. కానీ అంతా గుప్ చుప్. అంతటా నీరవ నిశ్శబ్ధం. దీనికి కారణాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మొన్నటికి మొన్న కడప గడపలో మాడు బొప్పికట్టేలా తగిలిన దెబ్బ. దెబ్బ తగులుతుందని తెలిసినా కాచుకోలేని దుస్తితి. ఇంత గట్టిగా తగులుతుందని ఊహించలేని నిస్సహాయ స్తితి. ఏదయితేనేం దెబ్బకు ఢిల్లీ దిగివచ్చింది. కేంద్రంలో ఆరోగ్య శాఖ చూస్తున్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ పార్టీకి సోకిన అనారోగ్యాన్ని సరిచేయడానికి హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు. ఆ రెండ్రోజులు రాష్ట్ర రాజధానిలో సందడే సందడి. గొంతెమ్మ కోర్కెలతో కొందరు, గొంతువరకు దిగమింగుకున్న ఆగ్రహంతో మరికొందరు. వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో, చిన్నాచితకా నాయకులతో ఆజాద్ మంతనాలు ఏకధాటిగా సాగాయి. ఏదో జరగబోతోందన్న భ్రమలు కల్పించాయి. కానీ ఆయన చేతిలో మాత్రం ఏముంది. అసలు మంత్ర దండం హస్తినలో వుంది. రోగ నిర్ధారణ చేయగలరేమోకానీ, రోగనిదానం తన చేతులో లేదన్న విషయం ఆయనకూ తెలుసు. అందుకే చెప్పాల్సిన నాలుగు ముక్కలు పర్యటన చివర్లో ముక్తసరిగా మీడియాకు చెప్పేసి ఢిల్లీ విమానం ఎక్కేసారు. కాంగ్రెస్ కధ తెలిసిన వారికి ఇక చెప్పే కధ ఏముంటుంది. షరా మామూలు ప్రకటనలు. షరా మామూలు ఊహాగానాలు. ముఖ్యమంత్రికి క్లాసు తీసుకున్నారనీ, సహచర మంత్రులతో వ్యవహార శైలిని మార్చుకోవాలంటూ సలహా ఇచ్చారనీ రకరకాల కధనాలు. అసలు ముఖ్యమంత్రినే మారుస్తున్నారంటూ పలురకాల ప్రచారాలు. ఇంతాచేసి ఆజాద్ వచ్చి సాదించింది ఏమిటంటే సున్నకు సున్న హళ్లికి హళ్లి. ఆయన పరిస్తితీ అంతంత మాత్రమే. ఆజాద్ ఇంచార్జ్ గా వున్న తమిళనాడు ఎన్నికల్లో ఏమిజరిగిందో ఎవరికి తెలియంది కనుక.ఇక తెలంగాణా వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి వొదలని మరో తలనొప్పి. అయితే ఇది కాంగ్రెస్ కు ఒకరకంగా శాపం. ఒకరకంగా వరం. ప్రధాన ప్రత్యర్ధి తెలుగుదేశం పార్టీని మరింత ఇరుకున పెట్టడానికి రాష్ట్ర విభజన వ్యవహారం ఆ పార్టీకి కొంతమేరకు కలసివస్తోంది. తెలంగాణాను కోరుకుంటున్న టీఆర్ఎస్ కూడా ఈ విషయం లో టీడీపీ పైనే ఎక్కువగా బాణాలు ఎక్కుపెడుతోంది. ఇది ఒకరకంగా కాంగ్రెస్ కు ఊరటే. కానీ సొంత పార్టీ నాయకులు కలిగిస్తున్న ఇబ్బందులే కాంగ్రెస్ ను ఎక్కువగా ఇరకాటం లోకి నెడుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య రగిలిన రగడే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఈ సచివుల సమరానికి ఇంకా తెర పడక ముందే కేంద్రం లో మరో ఇద్దరు మంత్రులు- కపిల్ సిబాల్, జై రాం రమేష్ ల నడుమ కీచులాట తెరపైకి వచ్చింది. ఇక చెప్పేదేముంది. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? కల్ల.

స్తానిక సంస్తల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతున్న మరో అగ్ని పరీక్ష. ఎన్నికలు వాయిదా వేయడానికి వీలులేకుండా సుప్రీం ఆంక్షలు. మారిన, మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో గెలుపు మీద సన్నగిల్లుతున్న ఆశలు. ఏమిచేయాలో పాలుబోని స్తితి. మధ్యేమార్గంగా పార్టీ గుర్తులు లేకుండా ఎన్నికలు జరిపితే పోలా అన్న ఆలోచనలు. గెలిచినవాడే మనవాడు అనుకుంటే చిక్కేలేదు. వోడినా వోడిపోయామన్న బాధా వుండదు. వోటమికి బాధ్యతా వుండదు.


ఇక, సొంత పార్టీలో లుకలుకలా కాంగ్రెస్ కు కొత్తేమీ కాదు. పోతే, తెలంగాణా పార్టీ ప్రజాప్రతినిధుల వ్యవహారం, వాళ్లు పెడుతున్న డెడ్ లైన్లు. వాటి విషయం అధిష్టానమే చూసుకుంటుందన్న ధీమా. ఏ పార్టీకి లేని అదనపు సౌలభ్యం కాంగ్రెస్ కు మరోటి వుంది. మరో మూడేళ్లదాకా అధికారం చేతిలో వుంటుంది, చేజేతులా చేజార్చుకుంటే తప్ప. అందుకే, ప్రజా సమస్యలను గాలికి వొదిలేసి రోడ్డు కూడలిలో మరో మూడేళ్ళు నిశ్చింతగా వేచి వుండొచ్చు.

పోతే తెలుగు దేశం. తెలంగాణా ప్రాంతంలో జరిగిన ఉపఎన్నికల్లో ఎదురయిన పరాభవం నుంచి పూర్తిగా తేరుకోకముందే కడప ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కని వైనం ఆ పార్టీని మరింత కుంగ తీసింది. ప్రధాన ప్రతిపక్షంగా వుంటూ ప్రజా సమస్యలను పట్టించుకుంటున్న పార్టీగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా అవన్నీ నీరు కారిపోతున్నాయన్న బాధ ఆ పార్టీది. ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న చందంగా కొత్తగా పుట్టుకొచ్చిన వైఎస్ఆర్ పార్టీ ఆ గుర్తింపును ఎగరేసుకుపోతున్నతీరును టీడీపీ ఓ పట్టాన జీర్ణం చేసుకోలేకపోతోంది. దీనికి తోడు పులి మీది పుట్రలా సొంత పార్టీలో తెలంగాణ రగిల్చిన చిచ్చు. రాష్ట్రం చీలకముందే దాదాపు అన్ని పార్టీలు నిట్టనిలువుగా ఈ అంశంపై చీలిపోయాయి. రెండు కళ్ళ సిద్ధాంతంతో నెట్టుకొస్తున్న తెలుగుదేశం కూడా మినహాయింపు కాదు. నాగం ఉదంతమే దీనికి ఉదాహరణ. గండిపేట తెలుగు విజయం ఆవరణలో అట్టహాసంగా ప్రారంభమయిన ముప్పయ్యో మహానాడు లో కూడా తెలంగాణా చిచ్చు రాజుకోకతప్పేట్టు లేదు. ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన స్తితి. తేల్చుకోలేని పరిస్తితి. నాలుగు రోడ్ల కూడలిలో నిలబడ్డ తెలుగుదేశం ఎదుర్కుంటున్న అవస్త ఇది. దీనికి తోడు వారసత్వ వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తూ పురుడుపోసుకున్న తెలుగుదేశం పార్టీలో వారసత్వ రాజకీయాలను గురించి వార్తా కధనాలు వెలువడుతూ వుండడం మరో విచిత్రమయిన పరిస్తితి. నిజమే, తెలుగు దేశం పార్టీ వయస్సులో చిన్నదేమీ కాదు. యువకులుగా వుంటూ ప్రారంభంలోనే పార్టీలో చేరిన వారు ఇప్పటికి షష్టిపూర్తి చేసుకుని వుంటారు. కొత్త రక్తం ఎక్కించాల్సిన అవసరం ఆసన్న మయింది. అలాగని, ఈ ‘వార్’సత్వం వ్యవహారాన్ని మరింత ముదరనివ్వడం అసలే పీకల్లోతు కష్టాల్లో వున్న ఆ పార్టీకి మేలు చేయదు. మహానాడు లోనయినా దీనికి ముగింపు పలికితే ఆ పార్టీని ఆదినుంచీ అభిమానిస్తున్నవాళ్ళు సంతోషిస్తారు. ఎవరో అన్నట్టు రాజకీయం అంటే వారసత్వం కాదు, పౌరసత్వం. పార్టీని పునరుజ్జీవింప చేయాలనుకునే వాళ్లు ఈ విషయాన్ని గమనం లో పెట్టుకోవాలి.

క్రాస్ రోడ్డులో వున్న మరో పార్టీ టీ ఆర్ ఎస్. నిజానికి ఉద్యమ పార్టీ అయిన టీ ఆర్ ఎస్ కు కూడలిలో నిలబడి ఎదురుచూపులు చూడాల్సిన పని లేదు. తెలంగాణా ఒక్కటే లక్ష్యం కనుక పక్క దారి పట్టాల్సిన అవసరమూ లేదు. కానీ, కలుపుకుపోతేనే తప్ప విడిపోవాలన్న ప్రధాన ధ్యేయం నెరవేరని స్తితి దానిది. ఎప్పటికప్పుడు గమ్యానికి దగ్గరగా వస్తూ దూరం జరిగిపోతున్న అనుభవాలు ఈ పార్టీ సొంతం. బలమూ, బలహీనతలు తెలిసిన నాయకత్వం కనుక విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ, వైఫల్యాలకు ఇతర పార్టీలను బాధ్యులను చేయడం టీ ఆర్ ఎస్ ప్రధానమయిన ఎత్తుగడగా చేసుకుంది. కిందపడ్డా పైచేయి అనిపించుకోవడంలో ఈ పార్టీకి ఎవ్వరూ సాటి కాదు. పోటీ కాదు. నిర్దేశించిన గడువులను పెంచుకుంటూ పోగల వెసులుబాటు ఈ పార్టీకి వున్నట్టుగా మరొకరికి లేదు. ప్రజల భావోద్వేగాలే పునాది కాబట్టి నాలుగు రోడ్ల కూడలిలో ఎన్నాళ్ళయినా వేచివుండగల అవకాశం వుంది.

అన్న ప్రాసన రోజునే ఆవకాయ తిని అరిగించుకోగల పుష్టి పుష్కలంగా వున్నట్టు రుజువు చేసుకుంది వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం లోని వై ఎస్ ఆర్ పార్టీ. కడప ఉప ఎన్నికల్లో లభించిన అపూర్వ విజయం ఆ పార్టీలో అనూహ్యమయిన ఆత్మ స్తయిర్యాన్ని నింపితే, ఇతర పార్టీలలో న్యూనతా భావాన్ని పెంచి పోషించింది. తనది వాపు కాదు బలుపు అని నిరూపించుకోవాలనో ఏమో వై ఎస్ జగన్ స్వరం పెంచి మరీ సవాళ్లు విసురుతున్నారు. తన విజయం కడప గడప వరకే పరిమితం కాదని నిరూపించుకునే ప్రయత్నాలను ప్రారంభించారు. పాలక పక్షాన్ని ఎదుర్కొంటూ ప్రజా సమస్యలపై పోరాడే ప్రధాన ప్రతిపక్ష పాత్రను తనకు తానుగా భుజానికెత్తుకున్నట్టు కనిపిస్తోంది. కడప సమరంలో కకావికలయిన కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలను మరింత ఉక్కిరిబిక్కిరి చేసే క్రమంలో తన రాజకీయ ఎత్తుగడలకు రూపకల్పన చేసుకుంటున్న తీరు స్పష్టం అవుతోంది. ఏనాటికయినా జగన్ కాంగ్రెస్ పంచన చెరక తప్పదని కాంగ్రెస్ అధినాయకత్వం స్తాయిలో వెలువడుతున్న సంకేతాలను, ప్రచారాన్ని తిప్పికొట్టడాని కేమోనన్నట్టుగా జగన్ అప్పటికప్పుడు పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించిన తీరు గమనార్హం. కాపురం చేసే కళ కాలిమెట్టెలు చెబుతాయన్నట్టుగా నూతన కార్యవర్గం లో తనదయిన బలమయిన సామాజిక వర్గానికే జగన్ పెద్దపీట వేసి, బడుగు బలహీన వర్గాలను చిన్న చూపు చూసారన్న సణుగుళ్ళు, సన్నాయి నొక్కులు అప్పుడే మొదలయ్యాయి. పార్టీ పదవుల పంపకం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నో ధక్కామొక్కీలు తిన్న పార్తీలే ఈ విషయంలో తల బొప్పిళ్ళు కట్టించుకున్న దాఖలాలు అనేకం. అయినా అనుభవం నేర్పే పాఠాల ముందు మరొకరు నేర్పే నీతి బోధలు బలాదూరే. అయితే, జనాన్ని నమ్ముకుని నాలుగు రోడ్ల కూడలిలో నిలబడ్డ వై ఎస్ జగన్ కు లక్ష్యం కడు దూరం లో వుంది. మధ్యలో కాడి వొదిలేయ్యకుండా ముందుకు సాగాల్సిన బరువయిన బాధ్యత కూడా ఆయన భుజస్కందాలపై వుంది. జారిపోతే, పార్టీనే జావకారిపోతుంది.

సామాజిక న్యాయం నినాదంతో ప్రజల ముందుకు వచ్చి, ప్రజా తీర్పుకు కట్టుబడివుండే ఓరిమి లేకుండా కాంగ్రెస్ లో విలీనం కావడానికి సిద్ధపడిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ దశా దిశా కోల్పోయి నాలుగు రోడ్ల నడుమ దిక్కులు చూస్తోంది. నిర్దేశించుకున్న గమ్యం వైపు ప్రయాణం కొనసాగించడానికి వీలులేకుండా ఇంజను పాడయి, ఇంధనం కరువయిన స్తితిలో ఆ పార్టీ అయోమయావస్తలో వుంది.

పోతే, వామపక్షాలు - పశ్చిమ బెంగాల్ లో ఎదురయిన ఘోర పరాభవంతో దిక్కు తోచని స్తితిలో వున్నాయి. రాష్ట్రం లో మారిపోతున్న రాజకీయ సమీకరణాల్లో తమను ఇముడ్చుకోగల రాజకీయ ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్నాయి. ఏదో ఆసరాతో కూడలి దాటినా ఎక్కబోయే అధికార పీఠం అంటూ ఏమీ లేదు కనుక వేచిచూసే సహజ వైఖరిని కొనసాగిస్తున్నాయి.

రాష్ట్రం లోని రాజకీయ పక్షాలన్నీ మొత్తం మీద దిశా నిర్దేశనం దొరకని స్తితిలో వున్నాయనే చెప్పాలి. కానీ, దీనివల్ల వాటికి వాటిల్లే తక్షణ ప్రమాదం ఏమీ లేదు. కానీ, జనం మాటేమిటి? వాళ్ళిలా ఎన్నాళ్ళు ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడాలి? (27-05-2011)
3 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

Well Written !

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ అజ్ఞాత -THANKS - భండారు శ్రీనివాసరావు

అజ్ఞాత చెప్పారు...

nice blog.