6, మార్చి 2011, ఆదివారం

వర్కింగ్ కమిటీ వాలకం – భండారు శ్రీనివాసరావు

వర్కింగ్ కమిటీ వాలకం – భండారు శ్రీనివాసరావు


(06-03-2011 నాటి సూర్య దినపత్రికలో ప్రచురితం)

- సంకీర్ణం పేరిట అన్నింటా అవమానాలే

- రాష్ట్ర ఎంపీల మనో వేదన

- పార్టీ పదవులకూ భంగపాటేనా?

- కల్లలైన సీనియర్ల కలలు

- సీడబ్ల్యుసీ ప్రాధాన్యతను తగ్గించిన ‘కోర్‌ కమిటీ’

‘ధర్మము ధర్మమటంచు వితండ వితర్కము లాడదేల ఆ ధర్మము నేనెరుంగుదు’ అంటాడు శ్రీరాముడు ఆంజనేయుడితో ఓసారి తగవు పడిన సందర్భంలో. బహుశా ధర్మకోవిదుడయిన రాముడికి కూడా సంకీర్ణ ధర్మం అనే ధర్మం తెలిసి ఉండదు. ఆయనకీ తెలియని ఈ ధర్మం ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులకి క్రమంగా తేటతెల్లం అవుతున్నట్టుంది. ‘మన రాష్ట్రం నుంచి అక్షరాలా ముప్పయి మూడు మందిమి కాంగ్రెస్‌ పార్టీ తరపున లోక్‌ సభలో కాలు పెట్టాము. నిజానికి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం మనుగడ సాగిస్తున్నదంటే దానికి ఆక్సిజన్‌ ఇస్తోంది మా ముప్పయి మూడు మందే. కానీ మనకు దక్కిన మంత్రి పదవులెన్ని? దక్కినవాటిల్లో పనికొచ్చేవెన్ని? రైల్వే బడ్జెట్‌లో కానీ, కేంద్ర బడ్జెట్‌లో కానీ రాష్ట్రానికి ఏమాత్రం గిట్టుబాటయింది? కేవలం ఒకరిద్దరు ఎంపీలతో మద్దతిస్తున్న చిన్నా చితకా పార్టీలకు ఇస్తున్న గౌరవ మర్యాదలు కానీ, పదవుల పంపకంలో వారికి ఇస్తున్న ప్రాధాన్యతలు కానీ ఇంతమంది సభ్యులు ఉన్న మన రాష్ట్రం వారికి ఎందుకు ఇవ్వడం లేదు? ప్రభుత్వం మనదన్నమాటే కానీ మన మాట ఏమాత్రం చెల్లుతోంది? ప్రతి చిన్న పనికీ ఢిల్లీలో అందరిముందూ సాగిలపడాల్సిన ఖర్మ ఎందుకు పట్టింది? సంకీర్ణ ధర్మం పేరుతో ఇంకా ఎన్నాళ్ళు ఈ అవమానాలు భరించాలి?’- ఢిల్లీలో మన కాంగ్రెస్‌ ఎంపీలు ప్రైవేటు సంభాషణల్లో పబ్లిక్‌గా చెప్పే మాటలు ఇవి. సరే, ప్రభుత్వ వ్యవహారాల్లో సంకీర్ణ ధర్మం పేరు చెప్పి దాటవేస్తున్నారు కానీ, పార్టీ పదవుల దగ్గర కూడా భంగపాటు తప్పకపోవడమే రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులను మరింత కుంగదీస్తోంది.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ పునర్వ్యవస్థీకరణ తరవాత వారి మాటల్లో వాడీ వేడీ మరింత పెరిగింది. కానీ ఏం లాభం? అధిష్ఠానం మాటే శిరోధార్యం అని అనునిత్యం వల్లించే వారికి, తమకు జరిగిన అన్యాయం గురించి నిలదీసే హక్కు ఎక్కడ ఉంటుంది? కాకపొతే, తనదాకా వస్తేగాని తత్త్వం బోధపడదు అన్న చందంగా ఇప్పుడు వారికి అధిష్ఠానం తమ పట్ల ప్రదర్శిస్తున్న చిన్న చూపు గురించి పెద్ద మనోవ్యధ పట్టుకుంది. ఢిల్లీ పెద్దల దృష్టిలో తమ స్థానం ఏమిటో వారికి బోధపడింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ అనిశ్చితి, తెలంగాణ అంశం పార్టీలో తెచ్చిన చీలికలు, జగన్‌ మోహన రెడ్డి తిరుగుబాటు- నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని మెరుగుపరచడానికి సీడబ్ల్యుసీలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం మరింత పెరగగలదని కన్న కలలన్నీ కల్లలయ్యాయి.

పునర్వ్యవస్థీకరణకు ముందు పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీలో సభ్యులుగా చక్రం తిప్పిన రాష్ట్ర నేతలు నలుగురికి కొత్త కమిటీలో మొండిచేయి చూపారు. పార్టీలో కురువృద్ధుడు అన్న ప్రాతిపదికపై దేశంలోనే అత్యున్నత పదవిపై ఆశ పెట్టుకుని అది నెరవేరకపోవడంతో నేరుగా పార్టీ అథినేత్రిపైనే నిప్పులు చిమ్మిన జి. వెంకటస్వామిని కమిటీ నుంచి తప్పించి, అవిధేయతను సహించేది లేదన్న స్పష్టమయిన సందేశాన్ని పార్టీ నాయకులకు పంపారు.

అలాగే, కె. కేశవరావు! పశ్చిమ బెంగాల్‌, అండమాన్‌, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాలకు పార్టీ ఇంచార్జ్‌గా పనిచేసిన కేకేను ఆ బాధ్యతలనుంచి తప్పించడమే కాకుండా, శాశ్వత ఆహ్వానితుడుగా కమిటీ సమావేశాలకు హాజరయ్యే అవకాశాన్ని కూడా ఆయనకు దూరం చేశారు. తెలంగాణ కోసం సీ డబ్ల్యుసీ పదవిని తృణప్రాయంగా త్యజిస్తానని లోగడ కేకే చేసిన గర్జింపుకు ఇది అధిష్ఠానం ఇచ్చిన జవాబుగా పరిశీలకులు భావిస్తున్నారు. పోతే, ఉద్వాసనకు గురయిన మరో నాయకుడు నేదురుమల్లికి మళ్ళీ పదవి రాకపోవడానికి ఆయన వయసు అడ్డుపడి ఉండవచ్చు.

మరో సీనియర్‌ నాయకుడు కిశోర్‌ చంద్రదేవ్‌కు కూడా చోటు లభించలేదు. అందుకు కారణం రెండు మూడు నెలల్లో జరగలదని అనుకుంటున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అవకాశం కల్పించాలన్న యోచనలో పార్టీ అథినాయకత్వం ఉండడమేనని చెబుతున్నారు. అధిష్ఠానం రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరి పట్ల కాస్త కరుణ చూపిందనుకోవాలి. పార్టీ కార్యదర్శులుగా ఉన్న వి.హెచ్‌. హనుమంతరావు, పి.సుధాకరరెడ్డి- లకు మరో మారు అవకాశం కల్పించారు. సుధాకర రెడ్డిని గోవాకు, హనుమంతరావును మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ గఢ్‌, హర్యానా రాష్ట్రాల పార్టీ ఇంచార్జి బి.కె. హరిప్రసాద్‌కు సహాయకుడిగా నియమించారు.

మన రాష్ట్రానికి సంబంధించినంతవరకూ మరో ప్రధానమయిన మార్పు వీరప్ప మొయిలీని ఇంచార్జిగా తప్పించి ఆ స్థానంలో గులాం నబీ ఆజాద్‌ను నియమించడం. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాలన్నీ ఆయనకు కొట్టినపిండి. గతంలో ఈ బాధ్యతను ఆజాద్‌ చాలా విజయవంతంగా నిర్వహించిన రికార్టు ఉంది. పార్టీని పట్టి కుదుపుతున్న జగన్‌ అంశం, తెలగాణ వాదంతో కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర పార్టీని ఆజాద్‌ తన వ్యూహ చతురతతో గట్టెక్కించగలరనే నమ్మకంతోనే అధినాయకత్వం ఈ మార్పు చేసి ఉంటుందని భావిస్తున్నారు.

ఇక ఈ మార్పు చేర్పులన్నింటినీ అధిష్ఠానం దృష్టితో పరికిస్తే చాలా ముందు చూపుతోనే పునర్వ్యవస్థీకరణ కసరత్తును అది పూర్తి చేసిందనుకోవాలి. మరో మూడేళ్లదాకా ఎన్నికలు లేని ఆంధ్ర ప్రదేశ్‌ పై దృష్టి సారించడం దండుగ అన్న భావనలో అధిష్ఠానం ఉండి ఉండవచ్చు. అందువల్ల అనవసరం అనుకున్న వారిని తప్పించేందుకు దీన్ని ఒక అవకాశంగా తీసుకుని ఉండవచ్చు. వచ్చే ఎన్నికల నాటికి వీరి అవసరంకూడా పార్టీకి ఉండకపోవచ్చు. కొన్ని విషయాలలో అధిష్ఠానాన్ని తప్పు దోవ పట్టించారన్న అనుమానం ఢిల్లీ పెద్దలకు కలిగి ఉండవచ్చన్న వాదన కూడా కొట్టిపారవేయతగినది కాదు. అలాగే పార్టీ అధినేత్రిపై గానీ, అధిష్ఠానం పై గానీ లేనిపోని వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్న హెచ్చరిక కూడా ఇందులో దాగి ఉండవచ్చు.

కాంగ్రెస్‌ పార్టీ నియమావళి ప్రకారం వర్కింగ్‌ కమిటీ అనేది అత్యున్నత విధాన నిర్ణాయక వ్యవస్థ. అయితే, కోర్‌ కమిటీ పేరుతొ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏర్పాటు చేసుకున్న మరో ప్రత్యామ్నాయ వ్యవస్థ సీడబ్ల్యూసీ ప్రాధాన్యాన్ని కొంతవరకు తగ్గించిందనే చెప్పాలి. వచ్చే ఎన్నికల అనంతరం రాహుల్‌ గాంధీని ప్రధానిగా ప్రతిష్ఠించాలనే లక్ష్యం నెరవేరడానికి సీడబ్ల్యూసీలో చేసిన ఈ మార్పులు, చేర్పులు ఏమాత్రం సహకరిస్తా యో చెప్పడం కష్టం. కొత్త కమిటీలో రాహుల్‌కు రెండు ప్రధాన బాధ్యతలు అప్పగించినప్పటికీ, యువతరాన్ని ఆకర్షించేవిధంగా దానిపై ఆయన ముద్ర లేదన్నది మరో అభిప్రాయం. అనుభవానికే పెద్ద పీట వేసి, కొత్త రక్తాన్ని పార్టీకి ఎక్కించడంలో అధినాయకత్వం అంతగా శ్రద్ధ చూపలేదని పరిశీలకుల ఉవాచ.

ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ వంటి రాష్ట్రాలలో రాహుల్‌ గాంధీ ప్రయోగం సత్ఫలితాలను ఇవ్వకపోవడం కూడా ఇందుకు కారణం అయి ఉండవచ్చు. కొత్త కమిటీలో స్థానం సంపాదించుకున్న వారందరూ వయసు మళ్లినవారే కావడం యాదృచ్ఛికం కాకపోవచ్చు. తలపండిన పెద్దల అనుభవ సారాన్ని ఉపయోగించుకుంటూ పార్టీని పటిష్ఠం చేయడం అన్న ఒక్క విషయమే అధినాయకత్వం ముందున్న ప్రాధాన్యం అయి ఉండాలి.రోజురోజుకూ చీమల పుట్టల్లా అనేక అవినీతి కుంభకోణాలు వెలుగు చూస్తూ, పార్టీ అస్తిత్వానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్న దశలో ఉడుకు నెత్తురు కంటే, అనుభవాన్ని నమ్ముకోవడమే మంచిదన్న నమ్మకానికి అధిష్ఠానం వచ్చి ఉంటుంది!



1 కామెంట్‌:

prasad sarma చెప్పారు...

సంకీర్ణ ధర్మమనే కాదు. కాంగ్రెసుకు పూర్తి స్థాయి మెజరిటి వున్నప్పుడు కూడా అందునా రాష్త్రం నుంచి 41 మంది యం పి ల ప్రాతినిధ్యం వున్నప్పుడు కూడా మన రాష్ట్రానికి ఒరగ బెట్టింది యెమి లెదు. కాంగ్రెస్ / యు డి యే ప్రభుత్వలే కా క చంద్ర బాబు చక్రం తిప్పిన యన్ డి యే ప్రభుత్వంలోనూ రాష్ట్రానికి గణనీయమైన ప్రయొజనలెప్పుడూ లభించలెదు. ఎందుకో తెలియదు గాని కెంద్రంలొ యె పార్టి/కూటమి అధికారంలొ వున్నా మనకు మొండి చెయ్యె.

దేశ ఆర్ధిక గతిని సమూలంగా మేలి మలుపు తిప్పిన స్వర్గీయ పి.వి.గారికి జరిగిన అవమానాల ముందు ఈ కాకాలు కె కె లు ఎంత. వీరి కంట్రిబ్యుషనెంత. మన నేతల దౌర్బల్యం మన దౌర్భాగ్యం.

ప్రసాద్ శర్మ, హైదరాబాదు.