28, జనవరి 2011, శుక్రవారం

ఎంత హాయి ఈ టీవీ ! - భండారు శ్రీనివాస రావు

ఎంత హాయి ఈ టీవీ ! - భండారు శ్రీనివాస రావు

శీతాకాలంలో చలి మంట మాదిరిగా, ఎండా కాలంలో పిల్లతెమ్మర మాదిరిగా ఈ రాత్రి ఓ టీవీ ప్రోగ్రాం చూసాను.

ఎంత బాగుందో అని ఎన్నిసార్లు అనుకున్నానో.

మంచి మనుషుల్ని కలుసుకోవడానికి ఎంత దూరం అయినా వెళ్ళాలి. మంచి మనసుల్ని తలచుకోవడానికి ఎంత గతంలోకి అయినా వెళ్ళాలి. అందుకే ఓ ఎనభయ్ ఏళ్ళు వెనక్కు పోదాం.

కలకత్తా మునిసిపల్ కార్పొరేషనుకు ఆయన మొట్టమొదటి మేయర్ గా ఎన్నికయ్యారు. తన వద్ద పనిచేసేందుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఎంపిక చేసిన అధికారిని కాదని, నిండా పాతికేళ్ళు కూడా నిండని ఓ భారతీయుడిని కార్పొరేషన్ సీ. ఈ. వో. గా ఎంచుకున్నారు. మేయర్ నిర్ణయాన్ని అప్పటి ప్రభుత్వం సయితం వ్యతిరేకించలేదు.

సరికదా, ప్రజలచేత ఎన్నికయిన మేయర్ నిర్ణయాన్ని ఔదల దాల్చింది. ఈ నాటి స్వతంత్ర భారతంలో ఇలాటి ద్రుష్ట్యాంతం ఒక్కటి చూపగలమా. సందేహం అక్కరలేదు. ‘లేదు’ అని బల్ల గుద్ది చెప్పవచ్చు.

సరే, ఆ కుర్రాడు కొన్నాళ్ళు పని చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడనే రిపోర్టులు రావడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. అతడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ మన మేయర్ జవసత్వాలు లేని రాజకీయ నాయకుడు కాదు. అందుకే, ఆ నాటి ప్రభుత్వంతో పోరాడి అతడిని విడిపించారు. ఆయన గొప్పతనం కొలిచేందుకు కొలమానాలు లేవు సరే. మరి అంతటి ఉదాత్త వైఖరి ప్రదర్శించిన బ్రిటిష్ ప్రభుత్వాన్ని పొగిడేందుకు వేయి నాలుకలు సరిపోతాయా. స్తానిక సంస్తలకు బ్రిటిష్ పాలకులు ఇచ్చిన ప్రాధాన్యత అలాటిదన్నమాట.

ఆ మేయర్ మహాశయుల పేరు ‘దేశబంధు’ చిత్తరంజన్ దాస్. ఆ కుర్ర అధికారి ఎవరో వూహించగలరా. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగించిన పోరాటానికి హింసా మార్గం అయినా తప్పులేదని భావించి అజాద్ హింద్ ఫౌజ్ స్తాపించిన అమరవీరుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్. (షుబాషు చంద్రబోషూ అని ఉచ్చరించాలని గూగుల్ సెర్చ్ ఉద్ఘాటిస్తోంది.)

ఇంతకీ చరిత్రలోని ఈ ఘట్టాన్ని గుర్తుచేసిన వారెవరో తెలుసా! ఆయన పేరు జయప్రకాష్ నారాయణ్. సోషలిస్ట్ నాయకుడు, జనతా పార్టీ ఆదిపురుషుడు, కీర్తిశేషులు జయప్రకాష్ నారాయణ్ కాదీయన. లోక సత్తా పార్టీ పెట్టి ‘మార్పు’ కోసం కలలుకంటున్న మాజీ ఐ. ఏ. ఎస్. ఆఫీసర్ . ఇక సందర్భం అంటారా . జనవరి ఇరవైఎనిమిదో తేదీ రాత్రి, హెచ్ ఎం టీ వీ ప్రసారం చేసిన ‘కమాన్ ఇండియా’ ప్రోగ్రాంలో పాల్గొంటూ స్వయంగా జయప్రకాష్ నారాయణ్ నుడివిన చారిత్రిక సత్యాలు ఇవి. ఈ ప్రోగ్రాం ప్రెజెంట్ చేసిన ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, దానికి సహకరించిన హెచ్ ఎం టీ వీ బృందం, టెలివిజన్ ఛానల్ కార్యక్రమాలకే కొత్త రూపం, కొత్త సొగసు ఇచ్చారని చెప్పాలి. మిగిలిన ఛానళ్ళు కూడా కనీసం అప్పుడప్పుడయినా ఈ విధమయిన కార్యక్రమాలను చూపించడానికి ఇది ఉత్ప్రేరకం కాగలిగితే అంతకన్నా సంతోషించాల్సిన విషయం ఈనాటి టీవీ వీక్షకులకు మరోటి వుండదు. ఇదే జరిగితే, ఈ మధ్యకాలంలో టీవీ ఛానళ్ల తీరును ఎండగడుతూ వస్తున్నవిమర్శలలోని వాడినీ, వేడినీ కొంతవరకయినా తగ్గించడానికి వీలుపడుతుంది. (28-01-2011)

2 కామెంట్‌లు:

venkata subbarao kavuri చెప్పారు...

ఎంత హాయి

karlapalem Hanumantha Rao చెప్పారు...

మీ టపా సందర్భోచితంగా వుంది శ్రీనివాసరావు గారు!
మనకు ఓపిక వుండాలే గానీ మంచి మంచి కార్యక్రమాలు ఉప్మా లో జీడిపప్పులాగా అప్పుడప్పుడు పంటి క్రింద తగులుతూనే వుంటాయి.నేను ఈ-టివీ లో కొన్ని సార్లు ఇలాంటివి మంచి కార్యక్రమాలు చూశాను.వారం వారం శనివారం నాడు వారు ప్రసారం చేసే ప్రముఖుల పరిచయం ఒక గంట పాటు చాలా సమగ్రంగా వుంటుంది.ఇలాగే ఇంక వేరే వాటిలో కూడా వస్తుండ వచ్చు.కాకపోతే పలుగు రాళ్ల కార్యక్రమాలే అధికమవడం వల్ల పంటికి అవి ఎక్కడ హాని చేస్తాయేమో అని మనం ముద్దను నమలకుండానే మింగడం లో అలాంటి జీడిపప్పులు కూడా మనకు తేలియకుండానే గొంతులోకి జరుకుంటాయి.