21, జనవరి 2011, శుక్రవారం

అంతా భ్రాంతియేనా! – భండారు శ్రీనివాసరావు

అంతా భ్రాంతియేనా! – భండారు శ్రీనివాసరావు


చిత్రం స్తిరంగా వుంటుంది. అయినా కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. అంతా భ్రాంతి.

ఇటీవల హస్తినలో రాజకీయపరిణామాలన్నీ ఈ కోవ కిందికే వస్తాయి.

ఎదో జరగబోతున్నట్టు వూహాగానాలు. ఏదో జరిగిపోతున్నట్టు సరి కొత్త సమాచారాలు. చివరికి జరిగిందేమిటి? సున్నకు సున్న హళ్లికి హళ్లి.

దేశంలో ఇంకా ఏమీ సమస్యలు లేనట్టు, కేంద్ర మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్తీకరణ గురించి మీడియాలో స్క్రోలింగులు బారులు తీరాయి. వూహాగానాలు గుప్పుమన్నాయి. ఆశావహులు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ ఎంపీలు, ఆంధ్ర, తెలంగాణా అనే తేడా లేకుండా కొద్ది రోజులపాటు ఆశల పల్లకీ దిగకుండా వూరేగారు. మీడియాలో పేర్లు వచ్చిన వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినట్టే సంతోషించారు. రాని వాళ్ళు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసారు. అధిష్టానం మనసులో ఏముందో అంజనం వేయకుండానే చెప్పగలం అని తరచుగా ధీమా వ్యక్తం చేస్తుండే ధీరులు కూడా, విషయం చివరికి ఇలా ముగుస్తుందనీ, విస్తరణలో ఆంధ్రప్రదేశ్ కు ఈసారి విస్తరి వేసి వడ్డన చేయడం లేదనీ ఏ మాత్రం పసికట్టలేకపోయారు. పైగా వారూ కలలుకన్న జాబితాలో చేరిపోయారు.

అయినా, ఎన్నికలకు ఇంకా మూడేళ్ళు వ్యవధానం వుంది. మంత్రులు కావడానికి ఇదే చివరాఖరు అవకాశం కాని మాట కూడా నిజమే. రాజకీయాల్లో ఈ లెక్కలు కుదరవు. ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ అనే భయమే రాజకీయుల్ని వెంటాడుతుంటుంది. ‘దూరాన మేఘం చూసి దోసిట్లో నీళ్ళు పారబోసుకునే’ తత్వం వారి రక్తంలో వుండదు. ‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమ’నే థియరీ వారిది. అందుకే మీడియాలో వస్తున్న తమ పేర్లు చూసి ఓ పక్క మురిసిపోతూనే, మరో పక్క లాబీ ప్రయత్నాలను బహుముఖంగా ముమ్మరం చేసారు.

అనుకున్న విధంగానే కొన్ని మార్పులతో, చిన్ని చేర్పులతో కేంద్ర మంత్రివర్గం పునర్వ్యస్తీకరణ జరిగింది. కానీ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలకు మాత్రం అనుకున్నదొక్కటీ, అయినది ఒక్కటీ అన్న చందంగా మొండి చెయ్యే మిగిలింది. ఆశల పల్లకీ అదృశ్యం అయింది. ఇప్పటికింతే అన్న వాస్తవం అర్ధం అయింది. అంతవరకూ వెలిగిపోయిన ముఖాలన్నీ ఆరిపోయిన మతాబుల్లా మారిపోయాయి. అధిష్టానం ఇలా ఎందుకు చేసింది అన్న దానిపై సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన దుస్తితి. ఇది మరింత దుర్భరం. అయినా చేయగలిగింది ఏమీలేదు. అధిష్టానమా! మజాకా! పైగా అదెంత శక్తివంతమయినదో జగన్ రెడ్డి ఉదంతం అప్పుడు ముందు వరసలో వుండి బాజా భజాయించి చెప్పిన వాళ్ళు వీళ్ళేనాయే. తేలుకుట్టిన దొంగల విధంగా వుంది వారి వ్యవహారం.

ఈ నేపధ్యంలో శ్రీ కృష్ణ కమిటీ నివేదికపై మాట్లాడుకుందాం రమ్మని అధిష్టానం నుంచి పిలుపు. నిజంగా ఇది పుండుపై కారం చల్లడమే. ‘రామనీ, రాలేమనీ’ ముందు సన్నాయి నొక్కులు నొక్కినా మొత్తం మీద అంతా కట్ట కట్టుకుని ( పేపరు వార్తల ప్రకారం ఎనిమిది మంది మినహా) అధిష్టానం ముందు హాజరు వేయించుకున్నారు.

‘చెప్పాల్సింది ఏమన్నా వుంటే చెప్పుకోవచ్చన్నా’రు అధిష్టాన దేవతలు. తాము మాత్రం పెదవి కదపకుండా, ప్రతి ఒక్కరు తమ వాదాన్ని తెలియచేసుకోవచ్చని ఉదారంగా అవకాశం ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీలు విడివిడిగా ఏమి చెప్పారో తెలియదుకానీ, బయటకు వచ్చి కలివిడిగా ఒకే మాట చెప్పారు. శ్రీ కృష్ణ కమిటీ చేసిన ఆరో సిఫారసు తమకు ఆమోదయోగ్యం అని పార్టీ పెద్దలకు తామంతా ముక్త కంఠంతో నొక్కిచెప్పామని తెలియచేసారు. తాము చెప్పినదంతా పార్టీ పెద్దలు సావధానంగా విన్నారనీ, తెలంగాణా ఎంపీ లతోబాటు మరోమారు మా అభిప్రాయాలను కూడా విని ఆ తరవాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారని వెల్లడించారు. అంటే ఆచి తూచి వ్యవహరించడమనే ‘నాన్చుడు’ ప్రక్రియ మరోసారి మొదలయిందనుకోవాలి.

ఇదంతా బయటకు కనబడే వ్యవహారం. సమావేశానికి హాజరయిన ఎంపీల్లో కొందరు ధైర్యం చేసి మంత్రివర్గ విస్తరణ సమయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టినట్టు భోగట్టా.

మంత్రివర్గ విస్తరణ విషయంలో తమని చిన్న చూపు చూసారన్న బాధ వారిని ఈ విషయంలో జంకూ కొంకూ లేకుండా మాట్లాడేటట్టు చేసివుంటుంది. వీరిలో చాలామంది చాలా సీనియర్లు. పాతిక ముప్పయ్యేళ్లనుంచీ పార్టీ ఎంపీ లుగానే కాలం వెళ్ళబుచ్చుతున్నారు. మంత్రి పదవి అనే మెట్టెక్కడానికి తమకు ఈ టరం దాదాపు ఆఖరిదన్న భయం కూడా వారిలో చాలామందిలో వున్నట్టు తోస్తోంది. దశాబ్దాల తరబడి పార్టీని నమ్ముకుని వున్నందుకు తగిన ప్రతిఫలం లేకపోగా కనీస గుర్తింపు కూడా లభించడం లేదన్న ఆవేదన వారి మనస్సుల్లో గూడుకట్టుకుని వుంది. ‘ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ముల వాడి’ వారి మనసులను కలవర పెడుతోంది. దీనికి తోడు తమ సామాజిక స్తితిగతులు కూడా తమ రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ లో అడ్డు వసున్నాయన్న అభిప్రాయం వారిలో వున్నట్టు వుంది. రాయపాటి సాంబశివరావు ఈ విషయాన్ని ఎలాటి భేషజం లేకుండా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసారు కూడా. తెలుగుదేశం హయాంలో తాము ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడడం కోసం ఎంతో కష్ట పడ్డామనీ, ఆర్ధికంగా కూడా నష్ట పోయామనీ, అయినా పార్టీ అధిష్టానం మాత్రం ఏ చిన్న అవకాశం దొరికినా మరో సామాజిక వర్గం వారికే పెద్ద పీట వేస్తోందనీ, ఇది తమనూ, తమను నమ్ముకున్న కార్యకర్తలను బాగా కలత పెడుతోందనీ తమ మనసులో మాట బయట పెట్టారు.


ఇక తెలంగాణా కాంగ్రెస్ ఎంపీల వ్యవహారం ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ప్రత్యేక తెలంగాణా అంశం తమ రాజకీయ భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నా – కార్యకర్తల మనోభావాలకు విరుద్ధంగా  తాము అధిష్టానం మాటను గౌరవించి నడుచుకుంటూ వస్తున్నా – పదవుల పందేరం దగ్గరకొచ్చేసరికి తమను ఆవల పెట్టడం ఏమిటన్న భావన, బాధ వారిలో వెల్లువెత్తుతోంది. వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదని కుమలడమే వారికి మిగిలింది.

అన్నింటికంటే ముఖ్యమయిన విషయం వెనుకబడ్డ తరగతులకు చెందిన ఎంపీలకు పదవుల ఆశ పెట్టి వారిని మరింత వెనక్కు నెట్టడం. వారి పేర్లు టీవీ తెరలపై వరుసగా వస్తున్నప్పుడు కూడా ఢిల్లీ పెద్దలు పెదవి విప్పకుండా చోద్యం చూడడం, ఈ సారి కొన్ని అనివార్య కారణాలవల్ల ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేయకపోవడం. ఇవన్నీ చూస్తుంటే, కేంద్రంలో యూ పీ ఏ ప్రభుత్వం ఏర్పడడానికి దన్నుగా 33 మంది లోకసభ సభ్యులను (వై ఎస్ జగన్మోహన రెడ్డి రాజీనామా తరవాత ఇప్పుడు 32) ఢిల్లీ కి పంపిన ఆంధ్ర ప్రదేశ్ కు హస్తినలో మిగిలిన గౌరవం ఏపాటిదో తెలిసిపోతోందని వెలువడే విమర్శలకు కాంగ్రెస్ చెప్పుకునే సమాధానం ఏమిటి?

ఆంధ్ర ప్రాంతంలో జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణాలో ప్రత్యేక రాష్ట్ర వివాదం - కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డం వచ్చి వుండవచ్చు. కొందరికి ఇచ్చి మరి కొందరిని కాదనడం వల్ల మరిన్ని సమస్యలను నెత్తికెత్తుకున్నట్టు కాగలదని ఆలోచన చేసి వుండవచ్చు. కాదనలేము. కానీ, విస్తరణలో ఆంధ్ర ప్రదేశ్ కు లభించబోయే ప్రాతినిధ్యం గురించి మీడియాలో ప్రచారం జోరున సాగుతున్నప్పుడు దాన్ని అడ్డుకోవడానికి అధిష్టానం ఎందుకు చొరవ చూపలేదన్నది, కారణాలు ఎందుకు చెప్పలేదన్నదీ కూడా ఆలోచించాల్సిన వ్యవహారమే. ‘పేర్లు బయటకు వచ్చి, చర్చలు జరిగి, పీర్లు గుండాన పడ్డప్పుడు చూసుకుందాంలే’ అన్నది అధిష్టానం ఆలోచన అయితే మాత్రం దాన్ని మించిన తప్పుడు విధానం మరోటి వుండదు. సొంత పార్టీ వారితోనే ఆటలు ఆడుకోవడం ద్వారా వారిని తమ చెప్పుచేతల్లో వుంచుకోవాలనుకుంటే అది ఎప్పుడో ఒకప్పుడు తమ చేయి కూడా దాటిపోయే ప్రమాదం వుంటుందని పార్టీ పెద్దలు గుర్తుంచుకోవాలి. బీహారు మొదలయిన రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎదుర్కున్న విషమ పరిస్తితి నేపధ్యంలో, మరి కొన్ని రాష్ట్రాలలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలను కళ్ళ ముందు పెట్టుకుని కూడా పార్టీ అధిష్టానం రాష్ట్ర నాయకుల పట్ల అనుసరిస్తున్న వైఖరి ఆ పార్టీకి ఎంతమాత్రం మేలు చేసేదిగా వుండదని ఆ పార్టీని అభిమానించే వాళ్ళే బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఇంకా ఎన్నికలకు మూడేళ్ళు వుందన్న ధీమాతో అధిష్టానం ఇలా ఒకటికి పది సార్లు తప్పులు తొక్కుకుంటూ వెడుతుంటే ముందు ముందు వాటిని సరిదిద్దుకునే వ్యవధానం కూడా దానికి వుండకపోవచ్చు. కారణం- కాంగ్రెస్ వారే తరచుగా ఇతర పార్టీలకు చేస్తుండే హెచ్చరిక “ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు” (21-01-2011)

కామెంట్‌లు లేవు: