27, జనవరి 2011, గురువారం

డబ్బెవరికి చేదు? - భండారు శ్రీనివాసరావు

డబ్బెవరికి చేదు? - భండారు శ్రీనివాసరావు


దేశవ్యాప్తంగా ఇప్పడు ఒక ఆసక్తికరమయిన చర్చ జరుగుతోంది. అదీ నల్ల ధనాన్ని గురించి. కొందరివద్దే వుండే ఈ నల్ల డబ్బును గురించి ఇప్పుడు ప్రతివాళ్ళు మాట్లాడుతున్నారు. కారణం వికీ లీక్స్ అనే సంస్త బయటపెట్టిన వివరాలు.

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరవాత ఈ అరవై మూడేళ్ళ పైచిలుకు కాలంలో పోగుపడ్డ అవినీతి సొమ్ము అక్షరాలా కోటి కోట్ల రూపాయల పైమాటే అని ఒక అంచనా.ఈ డబ్బుతో మనదేశానికి వున్న యావత్తు రుణభారాన్ని అసలు వడ్డీలతో సహా రెండుసార్లు చెల్లు వేయవచ్చనీ ఒక వాదన వినిపిస్తోంది. సిగరట్ తాగే అలవాటు వున్నవాళ్ళు రోజుకొక్క సిగరెట్ తాగడం మానగలిగితే, ఆ ఒక్క సిగరెట్ కయ్యే ఖర్చును లెక్కలోకి తీసుకుంటే, వారి జీవితకాలంలో ఆదా అయ్యే డబ్బుతో ఏకంగా ఒక ఇల్లే కొనుక్కోవచ్చని అంటుంటారు. ఆ రీతిలోనే ఈ నల్లడబ్బుతో ఏమేమి చేయవచ్చో చెవికి ఇంపైన కధనాలు వెలువడుతున్నాయి. కోటి కోట్లు అంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలో చప్పున చెప్పడం కష్టం. కానీ ఆ నల్ల డబ్బును తెల్లగా మార్చగలిగితే దానితో ఏమేమి చేయవచ్చో కొంతమంది ఒక జాబితా తయారుచేసారు. అది ఇలా వుంది.

ప్రతి గ్రామానికి మూడేసి చొప్పున సకల సౌకర్యాలతో కూడిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు. అవినీతి మకిలి అంటిన సొమ్ముతో ఆరోగ్యం ఎందుకని ‘డౌటేహాలు’ వ్యక్తం అయితే, ఆ డబ్బుతో దేశ జనాభాలో అరవై కోట్లమందికి ఎంచక్కా తలా ఒక నానో కారు కానుకగా ఇవ్వవచ్చు. కారిస్తే సరిపోతుందా పెట్రోలు డబ్బులు ఎవరిస్తారు? అని ‘శంక’ర రావులు ప్రశ్నిస్తే - దేశంలో ప్రతి ఒక్కరికీ పిల్లా పెద్దా తేడాలేకుండా అక్షరాలా తలా యాభయి ఎనిమిది వేల విచ్చు రూపాయలు పంచిపెట్టి పండగ చేసుకోమనవచ్చు. లేకపోతే, రైతుల రుణాలన్నీకట్టగట్టి ఒక్క దెబ్బతో బాజాప్తాగా మాఫీ చేయవచ్చు. ప్రజలపై పన్నులు వేయకుండా కొన్నేళ్లపాటు ప్రభుత్వాలు జనరంజక పాలన సాగించవచ్చు.

ముందే చెప్పినట్టు ఇవన్నీ వినడానికి ఇంపుగా వుండే విషయాలు. అయితే, అడ్డమయిన అడ్డదార్లన్నీ అడ్డదిడ్డంగా తొక్కి ఇబ్బడిముబ్బడిగా సంపాదించిన డబ్బును ఎవరయినా అబ్బురంగా అవసరమయితే స్విస్ బాంకుల్లోనో, మరో మరో విదేశీ బాంకుల్లోనో భద్రంగా దాచుకుంటారు కానీ ఇలా దాన కర్ణుల మాదిరిగా, బలి చక్రవర్తుల మాదిరిగా, ఆ డబ్బుకు నీళ్ళు వొదులుకుంటారా! అంటే నమ్మడం ఒక పట్టాన కష్టమే.

దాచేవాడు వుంటేనే దోచుకునే వాడుంటాడని ఓ సామెత. ఎంత గజ దొంగ అయినా, తాను దొంగిలించిన సొత్తును దాచిపెట్టేవాడు లేకపోతె ధైర్యంగా దొంగతనానికి దిగడు. అలాగే, దేశసంపదను రకరకాల కుంభకోణాల ద్వారా, టక్కుటమార విద్యల ద్వారా దోచుకునే ‘స్కాముల స్వాములు’ అక్రమ మార్గాల్లో సంపాదించిన అవినీతి డబ్బును దాచిపెట్టడం కోసం స్విస్ బాంకుల లాటివి ఆవిర్భవించాయి. పేరయితే స్విట్జర్లాండుకు వచ్చిందికానీ ఈ మాదిరి బాంకులు ప్రపంచ వ్యాప్తంగా డెబ్బయి దాకా వున్నాయి. ‘టాక్స్ హెవెన్స్’ అని ముద్దుగా పిలుచుకునే ఈ బాంకులు అమెరికా, ఇంగ్లాండ్ దేశాలకు చుట్టుపక్కలవున్న దీవుల్లో పాగావేశాయి.

‘మా దగ్గర దాచుకునే డబ్బుకు పన్ను బాధ లేదు. పట్టుకుంటారనే భయం లేదు. మీ డబ్బుకు పూర్తిగా మాదే పూచీ’ అంటూ నల్ల కుబేరులకు ఇవి గాలం వేస్తున్నాయి. పనికొచ్చే డబ్బును, ఎందుకూ పనికి రాకుండా గోనె సంచుల్లో మూటలుకట్టి మూలన పడేయడం ఎందుకనుకునే కొందరు బడాబాబులకు ఈ బాంకులు వరప్రసాదాలుగా మారాయి.

ఈ బాంకుల్లో దాచుకునే డబ్బుకు ఎలాటి వడ్డీ ఇవ్వరు. అయినా కోట్ల కోట్ల డబ్బును ఆ బాంకుల్లోనే దాచుకుంటారు. ఎందుకటా! వడ్డీ ఇవ్వకపోయినా డబ్బుకు మాత్రం భద్రత వుంటుంది. అసలుకు మోసం వుండదు. అంతేకాదు డబ్బు దాచుకున్న వ్యక్తి పేరును ఎట్టి పరిస్థితుల్లోను, ఎవరు అడిగినా బయటపెట్టరు అన్న హామీ కూడా వుంటుంది. ఇలా తమ వద్ద దాచుకునే డబ్బు నిజాయితీతో సంపాదించింది కాదని తెలిసినా, ఇచ్చిన మాటకు కట్టుబడే నిజాయితీ ఈ బాంకులకు వుంది. మొక్కవోని ఈ నిజాయితీ ఒక్కటే- ప్రపంచ వ్యాప్తంగా వున్న ‘నల్ల డబ్బు దొరలను’ ఆ బాంకుల వైపు పరుగులు పెట్టిస్తూ వుంటుంది. అభివృద్ధి చెందిన దేశాలవారే కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాలవారే కాదు, రష్యా, చైనా వంటి కమ్యూనిస్ట్ దేశాల వారు కూడా ఈ బాంకుల్లో డబ్బు దాచుకుంటున్నారంటే ‘నల్ల డబ్బు’ ఎంత విశ్వ వ్యాప్తం అయిందో, దాని విశ్వరూపం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.

సాధారణ పౌరులు విదేశాలకు వెళ్ళేటప్పుడు తమ వెంట తీసుకువెళ్ళే డబ్బు విషయంలో నానా ప్రశ్నలు వేసి విసిగించే అధికారులు – ఇంతంత డబ్బు విదేశాలకు తరలి వెడుతుంటే ఎలా అనుమతిస్తున్నారన్న సందేహం కలగడం సహజం. అయితే, ఇలాటి అనుమానాలన్నీ నల్ల డబ్బు లేనివాళ్ళకే కాని వున్న దొరలకు రావు. ఎందుకంటే, డబ్బు సంపాదించే అడ్డ దారులు తెలిసినవారికి ఇలాటి ‘రహదారులు’ కూడా తెలిసే వుంటాయి.

మొత్తం మీద వికీ లీక్స్ పుణ్యమా అని దేశవ్యాప్తంగా మీడియాలో సాగిన చర్చోపచర్చల ఫలితంగా అయితేనేమి, సుప్రీం కోర్టు పెట్టిన ‘చివాట్ల’ వల్లనయితేనేమి, ఈ నల్లధనం వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రధాని మన్మోహన్ సింగ్ పూనికపై కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తనకు తానుగా విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి కొన్ని చర్యలు తీసుకోబోతున్నట్టు వెల్లడించారు. నల్ల డబ్బు పెరుగుదలను అరికట్టేందుకు అయిదంచెల వ్యూహాన్ని ప్రకటించారు. ఈ డబ్బు ఎంతవుంది అన్న అంచనాలు ప్రభుత్వం వద్ద లేవని చెప్పారు. ఇందుకోసం అధ్యయన బృందం ఏర్పాటుచేయడానికి సంసిద్దత వ్యక్తం చేసారు. విదేశీ బాంకుల్లో డబ్బు దాచుకుంటున్న వారి వివరాలు అంతర్జాతీయ వొప్పందాల కారణంగా వెల్లడి చేయడం సాధ్యం కాదని ప్రధాని లోగడ పాడిన పాత పల్లవినే ఆర్ధిక మంత్రి మరో మారు వల్లె వేసారు. పన్ను ఎగవేతదారుల వివరాలు తెలుసుకుందుకు అరవై అయిదు దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. నల్లధనం దాచుకున్నవారు స్వచ్చందంగా ఆ డబ్బును తిరిగి మన దేశానికి తీసుకురావడాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ‘ఆమ్నెస్టీ’ పధకాన్ని ప్రవేశపెట్టే విషయం కూడా ప్రభుత్వ పరిశీలనలో వుందన్నారు. కానీ ఇలా అక్రమార్కులకు క్షమాభిక్ష ప్రసాదించే ఇటువంటి పధకాలవల్ల నిజాయితీగా పన్నులు చెల్లించేవారినుంచి విమర్శలు ఎదురయ్యే అవకాశం వుందని ప్రణబ్ అన్నారు.

ఆర్ధిక మంత్రి వెల్లడించిన అంశాలను బట్టి చూస్తే ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే ఏదో ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటుందనే ఆశలు సన్నగిల్లాయి. విదేశీబాంకుల్లో మూలుగుతున్న నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చే విధాన రూపకల్పన పట్ల ఇంకా ఆచి తూచి వ్యవహరించాలన్నదే ప్రభుత్వ పోకడగా అనిపిస్తోంది. సచ్చీలుడు, నిజాయితీపరుడు అన్న పేరున్న మన్మోహన్ సింగే స్వయంగా నల్లడబ్బు ఆసాముల గుట్టు రట్టు చేయడం కుదరదన్నారంటే – అందులోని లోగుట్టు కనుక్కోవడం కొంత కష్టమే. కానీ, మన దేశంలోనే గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న నల్లడబ్బును బయటకు తీయడానికి అంతర్జాతీయ ఒప్పందాలు అడ్డు రావుకదా. మరి దీనికి అడ్డం పడుతున్నదెవరు?

పరిపాలనా యంత్రాంగంలో అతి చిన్న హోదా కలిగిన ఉద్యోగి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేసినప్పుడు బయటపడే డబ్బు లెక్కపెట్టడానికి ‘కౌంటింగ్ యంత్రాలు’ అవసరమవుతున్నాయంటే, దేశంలో దొంగ డబ్బు ఎంత దర్జాగా దొరతనం చెలాయిస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ దండాల్లో చేతులుమారుతున్న డబ్బును గురించి వార్తలు వింటుంటే నల్లడబ్బు చేస్తున్న స్వైర విహారాన్ని అవగాహన చేసుకోవచ్చు. ఉయ్యాలలో పాపను పెట్టుకుని ఊరంతా వెతుక్కున్నట్టు, నల్లడబ్బుకోసం విదేశీ బాంకుల దాకా పోనవసరం లేదని ఈ వివరాలే విశదం చేస్తున్నాయి.

ఓ నలభై యాభయ్ ఏళ్ళక్రితం ఎలిమెంటరీ స్కూళ్ళల్లో వారానికి ఓ మారయినా ‘మోరల్’ క్లాసు పేరుతొ నీతి పాఠాలు బోధించేవాళ్ళు. చిన్నప్పటి నుంచే ఏది తప్పో ఏది ఒప్పో చెప్పేవాళ్ళు. స్కూలుకు వెళ్ళే వీలులేనివాళ్లకి ఇలాటి మంచి మాటలు కధలుగా చెప్పి సరయిన దారిన పెట్టే పెద్దవాళ్ళు ఇళ్ళల్లో వుండేవాళ్ళు. తప్పును తప్పని చెప్పేవాళ్ళు లేక, ఆ తప్పులే తాము చేస్తూ పిల్లలకు అవి తప్పని చెప్పే తలిదండ్రులు లేక, దాదాపు ఒకతరం ఈ స్వతంత్ర భారతంలో పెరిగి పెద్దదయింది. ఎంత సంపాదించావు అన్నది ప్రధానం కానీ ఎలా అన్నది ముఖ్యం కాదనే మరో తరం మన కళ్ళెదుటే పెరిగి పెద్దదవుతోంది. ఈనాడు ప్రధానంగా ఆలోచించుకోవాల్సింది మానసికంగా మురికిపట్టిపోయిన ఈ నల్ల తరాన్ని గురించి.

విదేశీ బాంకుల్లో మనవాళ్ళు దాచుకున్న నల్ల డబ్బును స్వదేశానికి తీసుకురావదానికి ఏ ప్రయత్నం జరిగినా అది హర్షించదగిందే. ఆహ్వానించదగిందే. కానీ, అంతకు ముందు, నైతికంగా దిగాజారిపోయిన జాతి జనులకు నీతులు నేర్పాలి. తడబడుతున్న వారి నడవడికను సరిదిద్దాలి. కానీ, ఇది కాదు శాశ్విత పరిష్కారం. ఇవన్నీ ఎవరో నేర్పితే అలవడేవి కావు. ఎవరికి వారే నేర్చుకోవాలి. అలాకాని పక్షంలో, విదేశీ బాంకుల్లోకి అక్రమంగా తరలివెళ్లిన డబ్బును పట్టి బలవంతాన దేశంలోకి లాక్కు వచ్చినా, అది నల్ల ధనాన్ని మరింత పెంచుతుందే కానీ అందరూ అనుకుంటున్నంత మేలు ఆ ప్రయత్నం వల్ల వొనగూరదు. (26-01-2011).