20, అక్టోబర్ 2010, బుధవారం

కరివేపాకు కధ - భండారు శ్రీనివాసరావు

కరివేపాకు కధ - భండారు శ్రీనివాసరావు

అనగనగా ఓ అమ్మ. ఆ అమ్మకు ఒక్కగానొక్క కొడుకు. పిల్లలు మంచిగా చదువుకుని వృద్ధిలోకి రావాలనుకునే కన్నతల్లులందరి మాదిరిగానే ఈవిడా తన కన్నకొడుకు విషయంలో తెగ ఆరాటపడింది. చదువు చెప్పే మేష్టార్ని వెదికిపట్టుకుని కొడుకును అప్పగించింది. పొద్దున్నే చద్దన్నం తిని చదువుకోవడానికి వెళ్ళే పిల్లాడిని చూస్తూ ఆ మాతృహృదయం మురిసిపోయేది. నాలుగు మంచి ముక్కలు వొంట బట్టించుకుని ప్రయోజకుడు అవుతాడని కలలు కంటున్న తల్లికి అసలు విషయం అర్ధం కాలేదు. ఆ పిల్లాడేమో – చదువుకు ఎగనామం, పంతులుగారికి పంగనామం పెట్టేసి పగలంతా గాలికి తిరిగేవాడు. పొద్దుగూకేవేళ ఇంటికి తిరిగొస్తూ – పొరుగు పెరట్లోని కరివేపాకు రెబ్బలు నాలుగు దొంగతనంగా కోసుకుని – బుద్ధిమంతుడిలాగా అమ్మ చేతిలో పెట్టేవాడు. దాంతో ఆ కన్నతల్లి మరింత మురిసిపోయేది. ‘నా బాబే! నా తండ్రే!’ అంటూ గారంగా ఓ బెల్లం ముక్క నజరానాగా అతడి చేతిలో పెట్టేది. తల్లి మురిపెం ముచ్చట చూస్తూ పెరిగిన పిల్లాడికి తాను చేస్తున్న తప్పేమిటో అర్ధం చేసుకునే వీలు లేకుండా పోయింది. అతగాడు పెద్దయి- పెద్ద దొంగగా మారి పోలీసుల చేతిలో చిక్కిన తరవాత కానీ తల్లికి కూడా తాను చేసిన తప్పు గ్రహింపుకు రాలేదు.’ఇదేమిట్రా! మన ఇంటావంటా లేని ఈ దొంగతనాలేమిట్రా! దొంగతనం చేయడం తప్పురా తండ్రీ ‘ అంటూ ఆ అమ్మ తల్లడిల్లిపోతుంటే – ‘ ఈ ముక్క కరివేపాకు తెచ్చిననాడే చెప్పివుండాల్సిందమ్మా’ అనేసి ఆ దొంగ పిల్లాడు చక్కా జైలుకు పోతాడు.

ఈ నీతికధ అందరికీ తెలిసిందే. గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలు, మీడియాలో వస్తున్న కధనాలు గమనిస్తున్నప్పుడు ఈ కధని మరోమారు నెమరు వేసుకోవాల్సిన ఆవశ్యకత వుందనిపిస్తోంది.

వార్తకు, వ్యాఖ్యకు నడుమ వున్న సన్నటి విభజనరేఖను చెరిపేసి, తాము అచ్చేసిందే సరయిన వార్త అంటూ కొన్ని పత్రికలు నిస్సిగ్గుగా సాగిస్తున్న పరోక్ష యుద్ధాలు పతాక స్తాయికి చేరుకుంటున్నప్పుడు –

శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ‘బూతుమయం’ అంటూ బుల్లితెరలపై అభూత ఆరోపణలు చేస్తున్నప్పుడు-

ఇంటి నాలుగ్గోడల నడుమ గుంభనగా వుండాల్సిన భార్యాభర్తల గొడవలు గడప దాటి ఛానళ్ళ రూపంలో ఇంటింటికీ ప్రవేశించి ప్రశాంతతను భగ్నం చేస్తున్నప్పుడు -

ఏడాదిక్రితం దాకా భజన చేసిన నోటితోనే విమర్శల జడివాన కురిపిస్తున్న రాజకీయ చద్మవేష ధారులను చూస్తున్నప్పుడు -

అమ్మను ‘ఒసే’ - నాన్నను ‘ఒరే’ అనే దుష్ట సంస్కృతిని పెంచి పోషిస్తూ తెలుగునాట వీరవిహారం చేస్తున్న సినిమాలను విధిలేక భరిస్తున్నప్పుడు –

ఇవన్నీ కంటూ, వింటూ –

వొళ్ళుమండుతున్నా నిలదీయలేని నిస్సహాయులను గమనిస్తుంటే –

ఈ ‘నీతికధ’ మనసు మూలల్లో కదలాడుతుంది. ‘కరివేపాకునాడే చెప్పవయితివేమమ్మా!’ అనే అన్న దొంగ మాటే వినబడుతుంది.

సమాజంలో నేడున్న సమస్త సమస్యలకు, నాయకుల మానసిక వైకల్యాలకు, మీడియా చిత్త చాంచల్యాలకు, ఆదిలోనే కళ్ళెం వేయగలిగిన శక్తివుండీ ఆ పని చేయలేకపోయిన జనాలకు –
అదేమిటి అని ప్రశ్నించలేకపోయిన ప్రజలకు –

ఇప్పుడు అడిగే హక్కు ఎక్కడిదంటే - చేయగలిగిందేమిటి?

1 కామెంట్‌:

karlapalem Hanumantha Rao చెప్పారు...

మంచి శక్తివంతమయిన ధార తో ప్రస్తుత సామజిక దుర్భర పరిస్థితి ని తూర్పార పట్టేసారండి మీరు!నా బ్లాగ్ నా లోకం లో "అన్నమో రామచంద్రా " చదివి స్పందించమని కోరుతున్నాను సార్ !