14, జనవరి 2023, శనివారం

దివికేగిన ఆధ్యాత్మికవేత్త -భండారు శ్రీనివాసరావు

 (జనవరి 14 మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారి ప్రధమ వర్ధంతి)

నా మొదటి ప్రవచన కార్యక్రమానికి హాజరై విన్నది ఇద్దరంటే ఇద్దరే’

నిరుడు  ఇదే రోజున హైదరాబాదులో తన తొంభయ్ ఆరో ఏట మరణించిన ప్రసిద్ధ ప్రవచనకారులు, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి, ఒక కార్యక్రమంలో స్వయంగా వెల్లడించిన విషయం ఇది.

మల్లాది వారి ప్రవచనం వుందని తెలిస్తే వేలాదిమంది విరగబడి హాజరయ్యే స్థితికి చేరుకున్న తర్వాత, అత్యంత వినయంతో శాస్త్రి గారు ఈ మాట చెప్పారని నా రేడియో సహోద్యోగి ఆర్వీవీ కృష్ణారావు గారు నాతొ చెప్పారు..

భగవంతుడి ఆదేశమో ఏమో తెలియదు, రామాయణ, భారతాలను గురించి ప్రవచనాల ద్వారా ప్రజాబాహుళ్యానికి తెలపాలని ఆయన చిన్న వయసులోనే ఆసక్తి పెంచుకున్నారు.

ఒకానొక సందర్భంలో శాస్త్రిగారు ఆ విషయాలను గురించి ఇలా ప్రస్తావించారు.

రేకు పెట్టెలో ఓ జత పంచెలు, కండువాలు పెట్టుకుని బస్ స్టాండ్ కి వెళ్ళేవాడిని. దొరికిన బస్సు, అది ఎటు పోతుందో కూడా చూడకుండా ఎక్కేసి, అది ఆగిన చోట దిగిపోయేవాడిని. ఆ వూర్లో గుడి ఎక్కడ వుందో వాకబు చేసుకుని వెళ్ళేవాడిని. అక్కడే అరుగుమీద కూర్చుని సాయంత్రాలు ప్రవచనాలు మొదలు పెట్టేవాడిని. జనాలకు బుర్రకదల మీద, నాటకాల మీదా వుండే అనురక్తి ప్రవచనాలపై ఉంటుందని అనుకోలేము. అయినా అలా పట్టువదలకుండా ఊళ్ళు తిరుగుతూ ప్రవచనాలు చెబుతూ ఉండేవాడిని. క్రమంగా ప్రజలకు వీటిపట్ల అనురక్తి పెరగడం మొదలయింది. అలా జీవితం చాలించేవరకూ ప్రవచనాలు చెబుతూ ఉండాలనేది నా కోరిక. ఆ భగవంతుడి అభీష్టం ఎలా వుంటుందో తెలవదు’

మల్లాది వారికి బాచంపల్లి సంతోష్ శాస్త్రి గారు ప్రియ శిష్యులు. వారు ఎక్కడ ప్రవచనాలు చెప్పినా గురుచరణులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి శిష్యుడనని మొదట్లోనే చెప్పి ప్రారంభించేవారు. ఒకసారి రవీంద్ర భారతిలో ఉగాది పంచాంగ శ్రవణం. అందులో పాల్గొంటూ, ఒకనాడు నా గురుదేవులు మల్లాది వారు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహించడం అంటే నా జీవితం ధన్యమే’ అన్నారు సంతోష్ కుమార్ శాస్త్రి.

సంతోష్ నా శిష్యుడే. గురువు శిష్యుడిని ఎలా చూడాలని కోరుకుంటాడో సంతోష్ కుమార్ శాస్త్రి అలానే తయారయ్యాడు’ అని శాస్త్రిగారు కూడా సగర్వంగా చెప్పుకునేవారు.

ఆధ్యాత్మిక ప్రవచనాల ప్రభావమో ఏమో కాని మల్లాది వారికి ఎటువంటి ఆరోగ్యసమస్యలు ఎదురుకాలేదు. ఒకసారి ప్రముఖ ప్రవచనకారులు గరికపాటి నరసింహారావు ఓ సందర్భంలో శాస్త్రిగారి ధాతుపుష్టి గురించి ప్రస్తావించారు.

అశోక్ నగర్ లోని వారి ఇంటికి సాయంత్రాలు ఎవరు వెళ్ళినా ఓ పెద్ద వెండి పళ్ళెం నిండా అరటికాయ బజ్జీలు తెచ్చి పెట్టేవారట. తాను తింటూ, వచ్చిన వారిని కూడా తినమని అంటుండేవారట. అప్పటికే వారి వయసు ఎనభయ్ దాటింది.

శాస్త్రి గారికి సద్గతులు కలగాలని కోరుకోనక్కర లేదు. ఎందుకంటే ధారావాహికంగా వేలాది ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏళ్ళ తరబడి చెబుతూ వచ్చిన మల్లాది చంద్ర శేఖర శాస్త్రిగారి కోసం ఆ సద్గతులే ఎదురు చూస్తుంటాయి. ఇది తద్యం.



(14-01-2023)

రుచి కాదు శ్రమ ముఖ్యం – భండారు శ్రీనివాసరావు

 “రుచి చూసి చెప్పాలి” అన్నారు గీత వెల్లంకి గారు పులిహోర డబ్బా చేతికి ఇస్తూ. దానితో పాటే తాను రాసిన  డార్క్ ఫాంటసి కవితా సంకలనాన్ని కూడా సంతకం చేసి ఇచ్చారు.

భోగి పండుగనాడు ఉదయమే డబుల్ ధమాకా అన్నమాట.

గీత గారెని ప్రత్యక్షంగా కలవడం ఇదే మొదటిసారి. చాలా ప్లెయిన్ మనిషి అని ఫేస్ బుక్ లో రాతలు బట్టి అర్ధం అయింది. నిజమే అని ఈ రోజది స్పష్టం అయింది. కల్మషం లేని ప్రవృత్తి. మా కోడలు, మనుమరాలి కేర్ టేకర్ నేహాతో హిందీలో మాట్లాడారు. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అదేమిటో హైదరాబాదులో యాభయ్ ఏళ్ళకు పైగా ఉంటున్నా సాట్, ఆట్ కు తేడా తెలియదు. గీత గారు  ఓ ఏడాదో ఎంతో ఢిల్లీలో ఉన్నారుట, ఆ కొద్ది కాలంలోనే హిందీ పట్టేశారు. నేను మాస్కో రేడియోలో పనిచేసేటప్పుడు నాకు రష్యన్ భాష నేర్పడానికి రేడియో వాళ్ళు ఓ పంతులమ్మను పెట్టారు. వారానికి  నాలుగు రోజులు ఇంటికే వచ్చి రష్యన్ ట్యూషన్ చెప్పేది. చివరికి జరిగింది ఏమిటి? ఆమెకు తెలుగు వచ్చేసింది. నాకు వచ్చిన రష్యన్ భాష సున్నకు సున్నా హళ్లికి హళ్ళీ.

ఇక రుచిపచుల సంగతి.

నాకు మొదటి నుంచీ  నాడీ మండలంలో ఈ భాగం పనిచేయదు.  పులిహోర చేసినప్పుడు బాగుందా, కారం ఉప్పూ సరిపోయాయా అని అడిగేది మా ఆవిడ. ఈరోజు శుక్రవారం, పులుపు నాలిక్కి తగలరాదు, అంచేతే అడుగుతున్నాను చెప్పండి అని ఖచ్చితంగా చెప్పాలి సుమా అనే సంకేతం జోడించేది. అయినా నేను మామూలు ధోరణిలో బాగుంది అనేవాడిని ముక్తసరిగా.  ఈ మాట ఆమెకు నచ్చేది కాదు. ఈ జవాబుకన్నా బాగాలేదు అని చెప్పినా సంతోషపడేదేమో.

అయితే నా కారణం నాకుంది.

అది పులిహోర కావచ్చు, మైసూర్ పాకం కావచ్చు. అవి చేయడానికి వెనుక ఎంతో శ్రమ దాగివుంది. బాగాలేదు అంటే ఆడవారి శ్రమను అవమానించినట్టే.

కానీ ఈ విషయం ఎప్పుడూ నేను పైకి చెప్పలేదు. ఇప్పుడు అనిపిస్తోంది, ఈ ఒక్క ముక్కా ఆమె ఉన్న రోజుల్లోనే ఎందుకు చెప్పలేకపోయానా అని.

గీత గారికి మరోమారు కృతజ్ఞతలు,  ఇంకా చదవని పుస్తకానికీ, తినని పులిహోరకీ.

(మా ఇంట్లో  అంతా అపరాహ్ణం.  మధ్యాహ్నం మూడు దాటాలి భోజనాలకి)



14-01-2023   

  

సంక్రాంతికి సొంతూరికి - ఓ జ్ఞాపకం



సంక్రాంతికి సొంతూరుకు వెళ్ళాలనే అభిలాషతో అయిదేళ్ళ క్రితం  హైదరాబాదు నుండి నాలుగు కార్లలో ఉదయమే బయలుదేరి మా వూరు కంభంపాడుకు బయలుదేరాము. టోల్ గేట్ల వద్ద కూడా ఎక్కువ ఆలస్యం కాకుండానే బయటపడ్డాము. ఒక్క   వాట్సప్ మెసేజ్ తో ఖమ్మం, రెబ్బారం, పెనుగంచిప్రోలు నుంచి కూడా చిన్నా పెద్దా యాభయ్, అరవై మందిమి మా వూరికి సంక్రాంతి అతిధులం.

ఇక మా ఇంట్లో సందడే సందడి. నగరాల్లో పుట్టి పెరిగిన కోడలు పిల్లలు, కొంగులు దోపుకుని అర్దరాత్రివరకు మేలుకుని ఇంటి ముందు రంగవల్లులు తీర్చి దిద్దారు. వీళ్ళల్లో సగానికిపైగా ఎప్పుడూ పల్లెటూరు మొహం చూసిన వాళ్లు కాదు.  మిధునం సినిమా చూసిన తరువాత  వీళ్ళందరికీ పల్లెటూరు చూడాలన్న కోరిక పుట్టుకొచ్చింది. ఎన్నడూ రుచి చూడని జొన్నన్నం వండడం కోసం నగరాల్లో పుట్టి పెరిగిన మా కోడళ్ళు జొన్నలు దంచేందుకు రోకళ్ళు చేతబట్టారు. మర్నాడు చుట్టూ పచ్చటి చేలు. పిల్లల హడావిడి చెప్పతరం కాదు. పెద్దవాళ్ళు కూడా వయసు మరిచి పోయి మొక్కజొన్న చేలో కలయతిరుగుతూ ఫోటోలు దిగారు. రేగుపళ్ళు ఏరుకుని తిన్నారు.

వూళ్ళో ఉన్న రెండు రోజులు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుని, కొత్త జ్ఞాపకాలను మూటగట్టుకుని మళ్ళీ అందరం కార్లెక్కి హైదరాబాదు రోడ్డెక్కాము.

మొత్తానికి పెద్దలకూ, పిల్లలకూ మంచి ఎనర్జీ టూర్!

వీడియో COURTESY:  మా అన్నయ్య కుమారుడు రమేష్ భండారు. 

https://youtu.be/T6zc-Yi1Jio



10, జనవరి 2023, మంగళవారం

NEWS – భండారు శ్రీనివాసరావు

 జర్నలిజం విద్యార్థి దశలో NEWS అంటే North (ఉత్తరం), East (తూర్పు), West (పశ్చిమం), South (దక్షిణం) ఇలా నాలుగు దిక్కుల నుంచి వచ్చే సమాచారం అని చెప్పేవారు. మా చిన్నప్పుడు ఆంధ్రపత్రిక దినపత్రికలో అనేక వార్తలు వచ్చేవి. నిజంగా నాలుగు దిక్కుల నుంచి అందే వార్తలు ఆ పత్రికలో కనబడేవి. పాట్రిస్ లుముంబా, డాగ్ హామేర్షేల్ద్, ఐసన్ హోవర్, స్టాలిన్, కృశ్చెవ్, నాసర్, మార్షల్ టిటో, చౌ ఎన్ లై, అరాఫత్ వంటి విదేశీ నాయకుల పేర్లు, లియోపాల్డ్ విల్లీ, కాంగో వంటి ప్రాంతాల పేర్లు చిన్న పిల్లలకు కూడా తెలిసేంతగా ఆ వార్తలు ప్రముఖంగా ప్రచురించేవారు. కాలక్రమంలో మనం ఉంటున్న ప్రాంతాలకు సంబంధించిన వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలయింది. ఇది ఎంతగా రెక్కలు విచ్చుకుంది అంటే హైదరాబాదు వంటి నగరాల్లో చిక్కడపల్లిలో అర్ధరాత్రి ఏదైనా సంఘటన జరిగితే పొరుగున వున్న అశోక్ నగర్ లో పంపిణీ అయ్యే పత్రికల్లో ఆ వార్త ప్రచురణకు నోచుకోనంతగా. అంతగా పత్రికల్లో వార్తలు ప్రాంతాల వారీగా పరిమితం అయిపోతున్నాయి. కాబట్టి NEWSకి వేరే భాష్యం చెప్పుకోవాలి ముందు ముందు.

ఇంత ఉపాధ్ఘాతం ఎందుకంటే మన పొరుగున ఉన్న తమిళనాడు అసెంబ్లీలో ఈ రోజు (సోమవారం) గవర్నర్ చేసిన ప్రసంగంపై పాలక పక్షం తీవ్ర అభ్యంతరం చెప్పినట్టు కొన్ని టీవీల్లో స్క్రోలింగులు గిరగిర తిరిగాయి. గవర్నర్ వాకవుట్ చేసినట్టు, పాలక పక్షం వాకవుట్ చేసినట్టు ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు స్క్రోలింగులు నడిపారు. రేపు తెల్లారి పత్రికలు చూడాలి ఏది వాస్తవమూ తెలుసుకోవడానికి.
అర్ధం అయినంతవరకు తెలియవచ్చింది ఏమిటంటే, తమిళనాడు మంత్రివర్గం ఆమోదించి పంపిన ప్రసంగం ప్రతిని యధాతధంగా చదవడం సాంప్రదాయం (Convention). అయితే గవర్నర్ , రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన ఆ ప్రసంగంలోని కొన్ని పేరాలు చదవకుండా, కొత్తగా కొన్ని వాక్యాలు చేర్చి చదివారు అన్నది స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకె ప్రభుత్వం అభ్యంతరం, అభియోగం కూడా. అసెంబ్లీలో గవర్నర్ చేసే ప్రసంగం సాంప్రదాయానికి (క్యాబినెట్ ఆమోదించిన ప్రసంగానికి) అనుగుణంగా వుండాలి, అసెంబ్లీ వెలుపల చేసేవి, (రిపబ్లిక్ డే రోజున చేసే ప్రసంగాలు) కొంత మూల ప్రతిని దాటి చదివినా పర్వాలేదన్నది మరో సాంప్రదాయం.
నిజంగా ఇది రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య తలెత్తిన ఓ వివాదం. సాంప్రదాయం (Convention) నిబంధన (Rule) కాదన్నది ఒక వాదన. సాంప్రదాయాలను పాటించడం ప్రజాస్వామ్య స్పూర్తి అనేది మరో పక్షం వాదన. ఈ రెండు వాదనలు చేసే వాళ్ళు వేర్వేరు రాజకీయ పార్టీల వాళ్ళు కావడం వల్ల చిక్కుముడి విడివడడం అంత సులభం కాదు.
ఇలాంటి సంఘటనలు మరీ కొత్తవి ఏమీ కాదు.
పూర్వం కమ్యూనిస్టుల ఏలుబడిలో వున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ధర్మవీర అనే పెద్దమనిషిని గవర్నర్ గా పంపింది. ఆయన కూడా నేటి తమిళనాడు గవర్నర్ రవి గారి లాగానే క్యాబినెట్ ఆమోదించిన ప్రసంగం ప్రతిని పక్కన పెట్టి, అసెంబ్లీలో సొంత ప్రసంగం చేయడంతో అప్పటి కమ్యూనిస్ట్ ప్రభువులు భగ్గుమన్నారు.
ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కలిగిన భారత ప్రజాస్వామ్యంలో అన్ని చోట్ల ఒకే పార్టీ పాలించే రోజులు చెల్లిపోయాయి.
కాబట్టి అరుదుగా చోటు చేసుకునే ఇటువంటి సంఘటనలు ముందు ముందు తరచుగా తలెత్తే అవకాశాలు మెండుగా వుంటాయి కనుక, వీటికి రాజ్యాంగబద్ధమైన పరిష్కారం ఎంత త్వరగా కనుక్కుంటే అంత శ్రేయస్కరం.
(09-01-2023)
Like
Comment
Share

9, జనవరి 2023, సోమవారం

ఆ మాట చెప్పాల్సింది నేను – భండారు శ్రీనివాసరావు

 అత్తగారు చేటలో బియ్యం పోసుకుని చెరుగుతూ వరండాలో కూర్చుని వుంటే ఓ బిచ్చగాడు వచ్చి అమ్మగారు బిక్షం అని కేక పెట్టాడు. లోపల పనిచేసుకుంటున్న కోడలు పిల్ల, ‘చేయి ఖాళీ లేదు, రేపు రా’ అని మరో కేక పెట్టింది. బిచ్చగాడు వెళ్లిపోతుంటే అత్తగారు ‘ఇటురా అబ్బీ’ అని ఇంకో కేక పెట్టింది. వాడు ఆశగా వచ్చి నిలబడితే ‘చేయి ఖాళీ లేదు రేపు రా’ అంది. ‘అదేమిటమ్మ గారూ మీ కోడలు గారు చెప్పిందే మళ్ళీ చెప్పడానికి నన్నెందుకు వెనక్కి పిలిచారు’ అని అడిగాడు.

ఎందుకా చేయి ఖాళీ లేదు అని చెప్పడానికి అదెవత్తె! ఏ మాటైనా చెప్పే అధికారం ఈ ఇంట్లో నాదే’ అన్నది అత్త గారు చేతిలో చేట విదిలిస్తూ.

ఇది చిన్నప్పుడు చదువుకున్న కధ. ఇప్పుడు కూడా ఇలాంటి కధలు పునరావృతం అవుతున్నాయి వేరే రూపాల్లో.

కాకపొతే ఈ కొత్త కధల్లో కోడలు పాత్ర లేదు. ఇద్దరూ అత్తలే.

నేరాలు, శిక్షలు - భండారు శ్రీనివాసరావు

 (Published in ANDHRAPRABHA on 8-1-2023, SUNDAY)

 

కాలమాన పరిస్తితులను బట్టి, అమల్లో వున్న చట్టాలను బట్టి, నేరాల  నేర స్వరూప, స్వభావాలు మారిపోతుంటాయి. వేసే శిక్షలు మారిపోతుంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో మద్య నిషేధం అమల్లో ఉన్నరోజుల్లో అత్యంత సమర్ధుడయిన ఒక అధికారి తన వాహనంలో మద్యం సీసాతో పోలీసులకు పట్టుబడి, కొద్ది రోజులు జైల్లో వుండాల్సివచ్చింది. ఆ అవమానం భరించలేక ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసారు. ఆ తరువాత కొద్ది రోజులకే మద్యనిషేధం ఎత్తి వేసారు. కానీ ఆయనకు జరిగిన నష్టాన్ని ఎవ్వరూ పూడ్చలేరు. ఆ రోజుల్లో తాగడం తప్పు. ఇప్పుడు ఖజానా నింపడం కోసం, ప్రభుత్వాలే పట్టుబట్టి జనాలచేత అదేపనిగా తాగిస్తున్నాయి. మారిన పరిస్తితులను బట్టి తప్పు ఒప్పుగా, ఒప్పు తప్పుగా మారిపోతున్నాయి. ఈ మార్పులను సమాజం అతి సహజంగా పరిగణిస్తోంది.

పలుకుబడి కలిగిన పెద్దలు మాదక ద్రవ్యాలతో పోలీసులకు పట్టుబడి, బయటపడిన వార్తలు అప్పుడప్పుడు వింటుంటాము. అదే నేరానికి థాయిలాండ్ వంటి దేశంలో మరణశిక్ష విధించే వీలుంది. మానభంగాలు సరేసరి. మన దగ్గర, సకాలంలో విచారణ పూర్తయి నిందితులకు శిక్షపడితే అబ్బురం అనుకోవాలి. అదే కొన్ని మధ్య ప్రాచ్య దేశాల్లో ఇదే నేరానికి పాల్పడ్డ వారికి చేతులు నరికేస్తారు. మానభంగం ఒక్కటే కాదు, దొంగతనం కూడా ఆ దేశాల్లో పెద్ద నేరమే. ఆ నేరం ఘోరం అనుకునేవారికి ఆ శిక్ష తప్పనిపించదు. అయ్యో పాపం అనుకునేవారికి అంత శిక్ష అవసరమా అనిపిస్తుంది.

చిన్న నేరాలకు చిన్న శిక్షలు, పెద్ద నేరాలకు పెద్ద శిక్షలు వేయడం కొన్ని దేశాల్లో సంప్రదాయం అయితే, చిన్న నేరానికి కూడా పెద్ద శిక్ష వేయడం కొన్ని దేశాల్లో అనూచానంగా వస్తోంది. జీవిత ఖైదు అంటే జీవితాంతం జైల్లో ఊచలు లెక్క పెట్టనక్కరలేదు. సత్ప్రవర్తనతో బయట పడేవాళ్ళు కొందరయితే రాజకీయ ఔదార్యాలతో శిక్షాకాలం పూర్తి కాకుండానే ఇళ్ళకు చేరేవారు చాలామంది. చైనాలో మాత్రం జీవిత ఖైదు అంటే బతికి ఉన్నంత కాలం కారాగారంలోనే వుండాలి. ఎలాటి మినహాయింపులు రాయితీలు వుండవు. అమెరికాలో కూడా దాదాపు ఇంతే. కాకపోతే శిక్షాకాలం తగ్గించే అధికారం ప్రెసిడెంటు ఒక్కరికే వుంటుంది.

రాజకీయ కారణాలతో ఏళ్ళ తరబడి జైళ్లలో మగ్గినవారు అనేకమంది వున్నారు. దక్షిణాప్రికాలో నెల్సన్ మండేలా సుదీర్ఘకాలం అంటే ఇరవై ఏడేళ్ళపాటు జైల్లోనే గడిపారు.

పాలస్తీనా జాతీయుడు నేల్ బార్గౌతి ఏకంగా అక్షరాలా   నలభయ్ నాలుగేళ్ళుగా ఇజ్రాయెల్ జైల్లో ఉంటున్నాడు. ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు ఆయన వయస్సు ఇరవై ఒకటి. స్వేచ్చాజీవిగా కంటే ఖైదీగానే ఆయన ఎక్కువ కాలం గడిపాడన్నమాట. ఆయనకు శిక్ష వేసిన న్యాయమూర్తి ఇన్నేళ్ళని శిక్షాకాలాన్ని నిర్దారించకపోవడం వల్ల ఎప్పుడు విడుదలయ్యేది ఆయనకీ తెలియదు. ఇది మరో విషాదం.

బర్మా(మియన్మార్) లో సైనిక ప్రభుత్వం తమ విధానాలను వ్యతిరేకించిన బొమిన్ యోకో అనే ఇరవై ఒక్క ఏళ్ళ వ్యక్తికి ఏకంగా నూట నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష వేసి తన కక్ష తీర్చుకుంది.

పొతే, ఇది జరిగింది అమెరికాలో. 2006 లో జార్గియాలోని ఒక న్యాయస్థానం ఇద్దరు నేరస్తులకి ఏడేసి చొప్పున జీవితకాలపు జైలు శిక్షలను విధించింది. అంతటితో వారిని ఒదిలిపెట్టలేదు. అదనంగా ఒక్కొక్కరికీ రెండువందల అరవై అయిదేళ్ళు చొప్పున కఠిన కారాగార శిక్ష విధించింది. ఇంత పెద్ద శిక్ష వేయడానికి వారు చేసిన గొప్ప నేరాలు ఏమిటంటే సాయుధ దొంగతనాలకు పాల్పడడం.

దీన్ని మించిన శిక్షను ఒక ఇరాన్ న్యాయమూర్తి వేసారు.

1969 లో ఇద్దరు నేరస్తులను విచారించిన ఆ న్యాయమూర్తి వారికి ఒక్కొక్కరికీ ఏడువేల నూట తొమ్మిదేళ్ళు జైలు శిక్ష విధించి నేరగాళ్లకు సింహస్వప్నంగా మారారు.

ఇలా ఏళ్ళకు ఏళ్ళు జైలు శిక్షలు వేసే క్రమంలో అమెరికా న్యాయమూర్తి ఒక రికార్డు నెలకొల్పారు. 1981 లో అలబామా రాష్ట్రంలో డుడ్లె వెన్ కైజర్ అనే వ్యక్తి ఉబుసుపోక తన భార్యను హత్య చేసాడు. అడ్డంపడ్డ అత్తగారినీ హతమార్చాడు. పనిలో పనిగా తన నేరాన్ని చూసిన ఒక కాలేజీ కుర్రవాడిని కూడా ప్రాణాలతో ఒదిలిపెట్టలేదు. న్యాయస్థానం కూడా కైజర్ మహాశయుడ్ని తేలిగ్గా ఒదలలేదు. పదివేల సంవత్సరాల జైలు శిక్ష వేసి మొత్తం అమెరికా న్యాయవ్యవస్థ చరిత్రలో ఒక రికార్డు తన ఖాతాలో వేసుకుంది.

అత్యంత తక్కువ కాలం శిక్ష అనుభవించిన నేరస్తుడు ఒకడు వున్నాడు. అతగాడు జైల్లో ఉన్న సమయం ఎంతో తెలుసా! ఒకే ఒక్క నిమిషం. అతడి పేరు జోసెఫ్ మంచ్ (1874-1907). అమెరికాలోని సియాటిల్ లో  సైనికుడిగా  పనిచేస్తున్న జోసెఫ్, ఓ రోజు  పీకలదాకా   మద్యం సేవించి, ఆ మత్తులో  అల్లరిచిల్లరగా  ప్రవర్తించిన కారణంగా న్యాయమూర్తి అతడికి ముప్పయి రోజులు జైలు శిక్ష, వంద డాలర్ల జరిమానా విధించారు. అతడు పై కోర్టుకు అప్పీలు చేసుకున్నాడు. అక్కడి న్యాయమూర్తి కింది కోర్టు విధించిన నెల రోజుల శిక్షకు  బదులు  అతడ్ని ఒకే ఒక్క నిమిషం జైల్లో ఉంచితే సరిపోతుందని తీర్పు చెప్పారు. దరిమిలా పోలీసులు జోసెఫ్ మంచ్ ని  కారాగారానికి తీసుకువెళ్లి  సెల్ లో వేసి, తాళం వేసి, ఒక్క  నిమిషం కాగానే విడుదల చేశారు.

పొతే,  అసలు విషయానికి వస్తే, కోర్టు శిక్షలనుంచి బయటపడ్డ ప్రముఖులు వున్నారు. వాటిని తప్పించుకోలేక జైళ్లల్లో మగ్గుతున్న గొప్పవారూ వున్నారు.

కొన్నేళ్ళ క్రితం అమెరికాలోని వర్జీనియా మాజీ గవర్నర్ రాబర్ట్ మెక్డోనెల్, తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని విలువైన కానుకలు స్వీకరించాడు అనే అభియోగాన్ని విచారించిన న్యాయమూర్తి, ఆయన్ని దోషిగా నిర్ధారించి కటకటాల్లోకి పంపాడు. కానుకల వ్యవహారం కనుక సహజంగానే అయన గారి భార్య గారి హస్తం వుండే వుంటుందన్న కోణంలో విచారించి ఆవిడను కూడా భర్తతో పాటు జైలుకు సాగనంపారు.

సరే! నేరం చేసి జైలుకు వెళ్ళడం మామూలే. తెలిసీ తెలియని చిన్నతనంలో చిన్ననేరాలు చేసి జైలు పాలయి తరువాత జీవితంలో చాలా గొప్పవాళ్ళయిన వాళ్ళు కూడా వున్నారు.

ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ పేరు తెలియని వాళ్ళు వుండరు. అయితే ఆయన్ని గురించి చాలామందికి తెలియని విషయం ఒకటుంది. బాల్యంలో ఆయన ఒక రాత్రల్లా జైల్లో ఉండాల్సిన పరిస్తితి ఏర్పడింది. ఆ రాత్రి జైలు వాతావరణం, పోలీసుల ప్రవర్తన చూసిన హిచ్ కాక్ కు ఆ భయం జీవితాంతం వెంటాడుతూ వచ్చింది.

ఉపశృతి : అనగనగా ఒక రాజ్యం. దాన్ని ఒక నియంత పాలిస్తున్నాడు. ఆ నియంతకు వ్యతిరేకంగా హాస్యోక్తిగా మాట్లాడుకోవడం కూడా శిక్షార్హమైన నేరం. అలాటి దేశంలో -

ఒక న్యాయమూర్తి ముద్దాయికి శిక్ష వేసి కడుపుబ్బా నవ్వుకుంటూ కోర్టు హాలు నుంచి బయటకు వస్తున్నాడు.

వెంట వున్న ఆయన స్నేహితుడు అడిగాడు ఎందుకలా నవ్వుతున్నారని.

'జీవితంలో ఇంత గొప్ప జోకు నేనెన్నడూ వినలేదు. అందుకే ఇంతలా నవ్వొస్తోంది'

'ఏమా జోకు? నాకూ చెప్పండి ఆనందిస్తాను' అన్నాడు మిత్రుడు.

'అలా ఎలా. ఆ జోకు చెప్పినందుకే కదా,  అతగాడికి పదేళ్ళు జైలు వేసింది'