25, డిసెంబర్ 2022, ఆదివారం

కుంభకోణాల భారతం – భండారు శ్రీనివాసరావు

 (Published in ANDHRAPRABHA today, 25-12-2022, SUNDAY)

 

దినపత్రిక తెరవగానే  ఇక్కడ ఇన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది, అక్కడ ఇన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనే రాజకీయ ఆరోపణల వార్తలే.

వెనుక ఆకాశవాణి ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేసే రోజుల్లో తమిళనాడులోని కుంభకోణంలో సెటిలయిన, తెలుగు తెలిసిన ఒక పెద్దమనిషి నుంచి ఫోను వచ్చింది.

దేశంలో ఎక్కడ ఏ లాలూచీ జరిగినా, ఆర్ధికపరమైన గందరగోళాలు చోటుచేసుకున్నా, కుంభకోణం’ అంటూ మా వూరు పేరు ఎందుకు చెబుతారు? ఈసారి వార్తల్లో అల్లా చెప్పారంటే కోర్టులో కేసు వేస్తాను సుమా!’ అని సున్నితంగానే కాకుండా, సూటిగా కూడా హెచ్చరించాడు. దరిమిలా, నేను రేడియోలో పనిచేసినంత కాలం మళ్ళీ ఆ పదం వాడలేదు. కేసు వేస్తాడన్న భయం వల్ల కాదు, తన ఊరిపై అతగాడికి

వున్న వల్లమాలిన మమకారంవల్ల పెల్లుబికిన గౌరవంతో. కానీ, పత్రికలలో రాసేటప్పుడు తప్పడం లేదు. పత్రికల్లో ఆ పదం చదవగా తప్పడం లేదు. ఎందుకంటే ఈ మొత్తం ఇతివృత్తం కుంభకోణాల మయం కనుక. కుంభకోణం పెద్దమనిషి పెద్ద మనసు చేసుకుని నన్ను మన్నిస్తారని నమ్ముతున్నాను.

ఇంత సువిశాల దేశంలో ఎక్కడో ఏదో జరుగుతుంది. అన్నీ వెలుగులోకి రావు. కొన్ని వస్తాయి. కానీ అవి జనాలకు పూర్తిగా తెలిసేలోగా చప్పున తెరవెనక్కి తప్పుకుంటాయి. వీటికంటే చిన్న విషయాలు కొన్ని నలుగురి నోళ్ళలో పడి నాలుగు రోజులు జనం నోళ్ళలో నాని పెద్దవవుతాయి. వాటిని గురించి చర్చలు మొదలవుతాయి. వాటి వెనుకనే ఆరోపణలు, వాటిని వెన్నంటి ఖండనలు. వెరసి చిన్న విషయం పెద్దగా రూపు దిద్దుకుంటుంది. ఒక కుంభకోణంగా మారుతుంది. ఫలితాలు ఊహాతీతంగా వుంటాయి కూడా. కొండొకచో  ప్రభుత్వాలు పడిపోవచ్చు. లేదా ఎన్నికల్లో పాలక

పక్షం ఘోర పరాజయం పాలుకావచ్చు. ఇది మన దేశానికే కాదు, అమెరికా వంటి పెద్ద దేశాలకు కూడా అనుభవమే.

రాఫెల్.

ఇప్పుడు దేశంలో నలుగురి నోళ్ళలో నానుతున్న చిన్న మాట. ఇదొక యుద్ధ విమానం అనే అవగాహన లేని వాళ్ళు కూడా అదొక కుంభకోణం అనే నమ్ముతున్నారు.

అందుకే ఈ వివాదాన్ని తుదికంటా తీసుకువెళ్ళి రాజకీయ ప్రయోజనం పొందాలనేది కాంగ్రెస్ వ్యూహం. తప్పేమీ లేదు. గతంలో ప్రతిపక్షాలు కూడా ఇదే వ్యూహంతో బోఫార్స్ ఆయుధాన్ని వాడుకుని అప్పటి రాజీవ్ గాంధి ప్రభుత్వాన్ని చావుదెబ్బ కొట్టాయి. తేలిగ్గా తేలిపోతుందని మొదట్లో కాంగ్రెస్ భావించిన ఆ బోఫార్స్ యుద్ధ ఫిరంగుల కొనుగోలు వ్యవహారం, చిలికి చిలికి చివరకు కుంభకోణంగా మారి ఆ పార్టీ ఆయువుపట్టునే నిర్వీర్యం చేసింది. బోఫార్స్ చరిత్ర అయితే,  రాఫెల్ వర్తమానం. అంతే తేడా. కాకపొతే బోఫార్స్ మాదిరిగా రాఫెల్  కాంగ్రెస్ కు కలిసి వస్తుందా లేక దూదిపింజలా తేలిపోతుందా అనేదానికి సమాధానం కిందటి సార్వత్రిక ఎన్నికల్లో మోడీ అఖండ విజయం ద్వారా వెల్లడయింది. ప్రజలు పెద్దగా నమ్మలేదని తేలిపోయింది.

మన దేశంలో కుంభకోణాలకు కొదవేమీ లేదు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటినుంచీ ఇవి వెలుగు చూస్తూనే వున్నాయి.

నిన్నటివరకు జనం చెప్పుకున్నది, ఇంకా చెప్పుకుంటోంది లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థాపకుడు విజయ్ మాల్యా వ్యవహారం.

లక్షాధికారుల ఇంట్లో పుట్టి, కోట్లసంపద నడుమ పెరిగి, అత్యంత

సంపన్నులలోఒకడిగా ఎదిగి, ఆ క్రమంలో అందిన చోటల్లా అప్పులు చేసి, ‘పక్షిలా ఎగిరిపోవాలి’ అని పాడుకుంటూ  విదేశాలకు ఎంచక్కా ఎగిరిపోయిన విజయ్ మాల్యా గతంలోనూ, ఇప్పుడూ కూడా మీడియా వార్తలకు మంచి ముడిసరుకే.

బ్యాంకులకు అక్షరాలా తొమ్మిది వేల కోట్లు ఎగనామం పెట్టినట్టు అభియోగాలను ఎదుర్కుంటున్న చిద్విలాస పురుషుడు విజయ్ మాల్యా.

1947 లో దేశానికి స్వాతంత్రం రావడం తరువాయి, ఏకంగా మొదటి అడుగు పడింది జీపుల కుంభకోణంలో. భారత, పాకిస్తాన్ దేశాల నడుమ సంఘర్షణలకు కేంద్రం అయిన కాశ్మీర్ రాష్ట్రంలో సైనికదళాల కదలికలకు అక్కడి ఎగుడు దిగుడు మార్గాలు ప్రతిబంధకంగా ఉండేవి. దానితో అందుకు తగిన మోటారు వాహనాలు(జీపులు) దిగుమతి చేసుకోవాల్సిన అవసరం పడింది. అప్పట్లో ప్రధాని నెహ్రూకు బాగా సన్నిహితుడయిన వీకే. కృష్ణమీనన్, బ్రిటన్ లో మన దేశం తరపున హై కమీషనర్ గా పనిచేస్తుండేవారు. ఎక్కడ, ఏ మీట ఎవరు నొక్కారో తెలియదు, చాలా తక్కువ నాణ్యత కలిగిన, నాసిరకం జీపులు దేశంలోకి దిగబడ్డాయి. ఆ జీపుల కుంభకోణాన్ని ఆరాతీయడానికి అనంత శయనం అయ్యంగార్ నేతృత్వంలో ఒక దర్యాప్తు సంఘం

ఏర్పాటయింది. ఇప్పట్లా కాదు కనుక ఆయన త్వరత్వరగా దర్యాప్తు పూర్తిచేసి వెంటనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అది ఇంతవరకు వెలుగు చూసిన దాఖలా లేదు. కాకపోతే ఈ వ్యవహారంలో వెలుగులోకి వచ్చిన పేరు కృష్ణమీనన్. దరిమిలా మొత్తం దేశానికే ఆయన రక్షణ మంత్రి అయ్యారు. అదీ కొసమెరుపు.

1949 లోఉత్తరాది రాష్ట్రానికి పరిశ్రమల మంత్రిగా వున్న రావు శివ బహదూర్ సింగ్ కేవలం పాతిక వేలు లంచం తీసుకుని ఒక వజ్రాలగని లీజుని, తనకు

తెలిసిన వ్యాపారికి కట్టబెట్టారు. పాతిక వేలు ఎటుపోయాయో తెలియదు కాని, చట్టానికి దొరికిపోయిన మంత్రిగారు మాత్రం మూడేళ్ళు జైలు ఊచలు

లెక్కబెట్టాడు. పాలక పక్షం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు జైలు పాలు కావడం అదే మొదలు.

1951 లో ఎస్ ఏ వెంకట్రామన్ అనే మంత్రి కేంద్రంలో పరిశ్రమల శాఖ నిర్వహించేవారు. ఆ రోజుల్లో సైకిల్ విడిభాగాలను విదేశాలనుంచి దిగుమతి

చేసుకునేవారు. అలాటి ఒక లైసెన్సును మంత్రి మహోదయులు తనకు తెలిసిన కంపెనీకి గుండు గుత్తగా అప్పగించారు. ఫలితం, ఆరోపణలు, దర్యాప్తులు.

చివరకు అసలు వ్యవహారం బయట పడి ఆయన మూడేళ్ళు జైల్లో గడిపారు.

1956 లో దాల్మియా అనే వ్యాపార వేత్తకు అనేక వ్యాపారాలు, రాజకీయ నాయకులతో సంబంధాలు ఉండేవి. దాల్మియా జైన్ ఎయిర్ వేస్ కు ఆయన చైర్మన్. భారత బీమా సంస్థ అనే ప్రైవేటు బీమా సంస్థకు యజమాని. ఏదో డబ్బు అవసరంపడి ఆ సంస్థలో రెండు కోట్ల రూపాయల నిధులు ఆరగించారు. విషయం బయటకు పొక్కడం, విచారణ జరగడం, దాల్మియాను రెండేళ్ళు జైలుకు పంపడం చక చకా జరిగిపోయాయి. ఆ దెబ్బతో దేశంలో బీమా వ్యాపారాన్ని ప్రభుత్వం జాతీయం చేసి చేతులు దులుపుకుంది.

1957 లో కాన్పూరులో హరిదాస్ ముంద్రా అనే వ్యాపారి వుండేవారు. వ్యాపారం అన్నాక డబ్బుల అవసరం తప్పదు. అందులో కేంద్రంలో ఆర్ధిక మంత్రిగా వున్న టీ.టీ. కృష్ణమాచారి గారికీ, ఈ ముంద్రా గారికీ మంచి స్నేహం. మంత్రిగారు తలచుకుంటే ఎల్.ఐ.సి. (జీవిత బీమా సంస్థ) నుంచి రుణం ఇప్పించడం ఏమంత కష్టం? అందులోను అది ప్రభుత్వ రంగ సంస్థ. టీటీకే కార్యాలయం నుంచి ఫోను వెళ్ళగానే చిటికెలో ముంద్రా గారెకి కావాల్సిన కోటి రూపాయల రుణం మంజూరు అయిపోయింది. కానీ కధ అయిపోలేదు. పైగా కొత్తగా కేసు మొదలయింది. ముంద్రా ఇరవై రెండు నెలలు

జైల్లో వున్నాడు. సిఫారసు చేసిన పాపానికి టీటీ కృష్ణమాచారికి కృష్ణజన్మస్థానానికి వెళ్ళే ప్రమాదం రాలేదు కానీ, మంత్రి పదవికి నీళ్ళు

ఒదులుకోవాల్సివచ్చింది.

1962 లో మరో కుంభకోణం వెలుగు చూసింది. ఆర్ధికపరమయిన నేరాల్లో ఇరుక్కుంటే చక్కటి జీవితాలు కూడా ఎలాటి భయంకరమయిన మలుపులు తిరుగుతాయో అనడానికి ఇది చక్కని ఉదాహరణ. ఆయన పేరు చూస్తే ఉత్తర భారతం అనిపిస్తుంది కాని, జయంతి ధర్మతేజ అనే ఈ పెద్దమనిషి పదహారణాల తెలుగువాడు. తన సొంత తెలివితేటలతో ఒక సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించగలిగాడు. ఇప్పుడు ప్రభుత్వ రంగంలో వున్న

భారత షిప్పింగ్ కార్పొరేషన్ ఆవిర్భావానికి పూర్వం, దేశ నౌకానిర్మాణ రంగం ధర్మతేజ గారి ఆధిపత్యంలోనే వుండేది. స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో అప్పటి

ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూను ధర్మతేజ తెలివితేటలు బాగా ఆకట్టుకున్నాయి. కేవలం రెండు వందల రూపాయల పెట్టుబడితో ఆయన సంస్థ ప్రారంభం అయిందని చెబుతారు. నెహ్రూ పుణ్యమా అని ఇరవై రెండుకోట్ల అప్పు పుట్టింది. ఇకనేం, ఆయన వ్యాపారం మూడు పూవులు ఆరుకాయలుగా విలసిల్లింది. కాలక్రమంలో ధర్మతేజ వ్యాపారంలో అనేక అధర్మ కోణాలు వెలుగు చూసాయి. సుదీర్ఘ విచారణ అనంతరం ఆయన్ని లండన్ లో అరెస్టు చేసి ఆరేళ్లు  జైల్లో ఉంచారు. ఆ పిదప ఆయన్ని గురించి చెప్పుకోవడానికి ఏమీ మిగలలేదు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన జయంతి ధర్మతేజ మసకబారి కాలగర్భంలో కలిసిపోయాడు.

1964 ప్రాంతంలో అవిభజిత పంజాబు రాష్ట్రం ముఖ్యమంత్రిగా ప్రతాప్ సింగ్ ఖైరాన్ అనే కాంగ్రెస్ నాయకుడు ఏకచత్రాధిపత్యంగా పాలిస్తుండేవాడు.

ఎదురులేని పాలన అయినా, ఎదురు దెబ్బలు మాత్రం తప్పలేదు. అధికారంతో పాటే సంక్రమించిన అవినీతి తెగులు దేశం మొత్తంలో ఒక చర్చనీయాంశం అయింది. దాస్ కమీషన్ ఆయనపై అభియోగాలను నిర్ధారించడంతో ఖైరాన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

1971 లో నగర్ వాలా కేసు ఒక విచిత్రం. ఢిల్లీలోని ఒక స్టేట్ బ్యాంక్ శాఖలో పనిచేస్తున్న చీఫ్ క్యాషియర్ కి ఓరోజు ఫోన్ వచ్చింది. ‘నేను ప్రధాని

ఇందిరాగాంధీని మాట్లాడుతున్నాను’ అని అవతల నుంచి వినిపించింది. ఇవతల అధికారి భయంతో బిక్కచచ్చిపోయాడు. కానీ, ప్రధాని తనకు ఫోన్ చేయడం ఏమిటని క్షణం కూడా సందేహించలేదు. “నగర్ వాలా అని నా తరపున ఒకతను వస్తాడు. అతడికి వెంటనే అరవై లక్షలు ఇచ్చి పంపేయండి’ అని చెప్పేసి అవతల ఫోన్ కట్టయింది. చెప్పినట్టే రుస్తుం సోరబ్ నగర్ వాలాగారు విచ్చేశారు. ఆ నగర్ వాలాజీ ఒక మాజీ సైనికాధికారి. బ్యాంకు అధికారి అక్షరాలా అరవై లక్షలు లెక్కబెట్టి అతడి చేతిలో పెట్టాడు. అతగాడు లెక్కబెట్టుకోకుండానే దర్జాగా ఆ డబ్బు తీసుకుని అంతకంటే దర్జాగా వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో ఇదొక పెద్ద దుమారంగా, సంచలనంగా మారింది. ప్రధాని పేరు వినరావడంతో దర్యాప్తులు, విచారణలు ముమ్మరంగా సాగాయి. అయితే, కధ మరీ సాగిపోకుండా ఆగిపోయింది, నగర్ వాలా ఒక రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మరణించడంతో.

1974 లో పుదుచ్చేరికి చెందిన కొందరు వ్యాపారులు ఢిల్లీ వెళ్లి కేంద్ర వాణిజ్య మంత్రిని కలిసి తమకు దిగుమతి లైసెన్సు ఇవ్వాలని కోరుతూ ఒక మహజరు అందచేసారు. దాన్ని గట్టిగా సిఫారసు చేస్తూ ఇరవై ఒక్కమంది పార్లమెంటు సభ్యులు సంతకాలు చేసారు. తీరా లైసెన్సులు జారీ చేసిన తరువాత తెలిసినదేమిటంటే ఆ సంతకాలన్నీ ఫోర్జరీవని.

మహారాష్ట్రలో అబ్దుల్ రహమాన్ అంతులే అనే కాంగ్రెస్ నాయకుడికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అంటే అంతులేని అభిమానం. అంచేత ఇందిరా ప్రతిభా

ప్రతిష్టాన్ అనే స్వచ్చంద సంస్థను పెట్టి ముఖ్యమంత్రి హోదాలో ఒత్తిడి తెచ్చి అంతులేని విరాళాలు సేకరించి అందులో పెట్టారని ఆయనపై అభియోగాలు

వెల్లువెత్తాయి. ఫలితం ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్వాసన.

ఆర్ధిక కుంభకోణాల్లో జనం ఇప్పటికీ మరిచిపోలేనిది హర్షద్ మెహతా షేర్ల భాగోతం. సరళీకరణ ఆర్ధిక విధానాలు ఆరంభదశలో ఉన్నకాలంలో అవకాశాలను అంది పుచ్చుకుని పైకి ఎదిగిన ఈ షేర్ సింగ్ అనతికాలంలోనే అడ్డదార్లలో పదివేల కోట్ల రూపాయల కుంభకోణానికి తెర తీశాడు. ఇతడి దెబ్బకు యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చిగురుటాకులా అల్లల్లాడిపోయింది. దాన్ని ఒడ్డున పడెయ్యడానికి ప్రభుత్వం పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన ధనాన్ని 4,800 కోట్ల మేరకు వాడాల్సివచ్చింది.

ఇలా చెప్పుకుంటూ పొతే ఈ జాబితా చేంతాడు అంత అవుతుంది. నకిలీ స్టాంపుల

తెల్గీలు, కృష్ణ యాదవ్ లు, పశువుల దానా లాలూ యాదవ్ లు, షేర్ మార్కెట్లతో

గోలీ ఆటలు ఆడుకున్న చేతన్ పరేఖ్ లు.......ఒకటా, రెండా..... ఎన్నెన్నో

కుంభకోణాలు, ఒకళ్ళా, ఇద్దరా.... ఎందరెందరో మహానుభావులు, తమ వికృత

చేష్టలతో చరిత్రను సృష్టించి చరిత్రలో కలిసిపోయారు.

అయినా నేటి చరిత్ర చూస్తుంటే గత కాలము మేలు అనే అనిపిస్తోంది కదూ.



 

24, డిసెంబర్ 2022, శనివారం

జార, చోర, హంతక శిఖామణి ఛార్లెస్ శోభరాజ్

 


ఛార్లెస్ గురుముఖ్ శోభరాజ్ హోత్చంద్ భావ్నాని ఎవరో తెలుసా అంటే ఉహు అనే జవాబు వస్తుంది.

అదే ఛార్లెస్ శోభరాజ్ అంటే?

1970 ప్రాంతాల్లో ప్రాయంలో ఉన్న నాలాంటి వాళ్ళు అందరూ ‘తెలియకేం అతడో సీరియల్ కిల్లర్ అనేస్తారు. అంతే కాదు, శోభరాజ్ ఓ గజదొంగ,  మోసగాడు, కామపిశాచి, తడిగుడ్డతో గొంతుకోసే రకం అని కూడా అంటారు. కమల్ హసన్ నటించిన ఎర్రగులాబీ సినిమాలో హీరోయిక్ విలన్ మాదిరిగా ఆడవాళ్ళను అనుభవించి కడతేర్చే టైప్ అన్నమాట.  కమల్ ఆ సినిమాలో పెట్టుకున్న టోపీ కూడా ఛార్లెస్ మోడల్ టోపీనే.

1944 లో వియత్నాం లోని సైగాన్ లో జన్మించాడు. తండ్రి భారతీయుడు. తల్లి వియత్నాం దేశస్తురాలు. తర్వాత ఆవిడ భర్తనుంచి విడిపోయి ఓ ఫ్రెంచ్ జాతీయుడిని పెళ్లాడింది. ఈ నేపధ్యంలో పెరిగిన శోభరాజ్ భావి జీవితంలో మంచితనం మచ్చుకు కూడా కానరాని కర్కోటకుడిగా మారాడు. 1963 పారిస్ లో దొంగతనం చేసి పట్టుబడి జైలు ఊచలు లెక్కబెట్టడంతో ఇతడి నేర చరిత్రకు అంకురార్పణ జరిగింది. దానితో జైలు అంటే భయం లేకుండా పోయింది.

 ఆడపిల్లలను కట్టిపడేసే అందాన్ని అడ్డుపెట్టుకుని, తేనె పూసిన కత్తిలా  ఎందరెందరో పర్యాటక అతివలను ఆకట్టుకుని అనంతరం వారిని హతమార్చేవాడు. అందుకే బికినీ కిల్లర్ అనే పేరు కూడా సంపాదించుకున్నాడు.

దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో కనీసం ఇరవైమంది పర్యాటకులను  హత్య చేసినట్టు ఇతడిపై అభియోగాలు వున్నాయి. ఒక్క థాయ్ లాండ్ లోనే పద్నాలుగుమందిని హతమార్చాడట. అతడు నేరాలకు పూనుకున్న దేశాలను వేళ్ళమీద లెక్కించడం కష్టం.  ఫ్రాన్స్, గ్రీసు, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్, నేపాల్, ఇండియా, థాయ్ లాండ్, మలేసియా మొదలయిన దేశాల్లో ఇతడి నేర సామ్రాజ్యం విస్తరించింది. దొరికినట్టే దొరికి తప్పించుకుని పోయే ఒడుపు తెలిసిన శోభరాజ్ కి సర్పెంట్ (నాగుపాము) అనే మారుపేరు వుంది. ఆ పేరుతో ఎంతటి ప్రాచుర్యం పొందాడు అంటే ది సర్పెంట్ అనే పేరుతొ  బీబీసీలో  (నెట్ ఫ్లిక్స్) ఏకంగా ఒక టీవీ సీరియల్ వచ్చింది. ఇతడి జీవిత కధ ఆధారంగా పుస్తకాలు,  డాక్యుమెంటరీలు, మై ఔర్ ఛార్లెస్ అనే  సినిమా కూడా వచ్చాయి.  

ఇండియన్ పోలీసులకు చిక్కి 1976 నుంచి 1997 వరకు జైల్లో గడిపాడు. తర్వాత పారిస్ కు వెళ్లి 2003 లో నేపాల్ చేరుకున్నాడు. అక్కడ అరెస్టు అయి కోర్టు విచారణ ఎదుర్కుని జీవితకాల  ఖైదు శిక్షకు గురయ్యాడు.  ఇరవై ఏళ్ళ జీవిత ఖైదు శిక్షలో ఇంకా ఒక ఏడాది మిగిలి వుంది అనగా, నేపాల్ సుప్రీంకోర్టు ఈ నెల ఇరవై ఒకటో తేదీన, 78 ఏళ్ళ వయసులో  అతడిని విడుదల చేస్తూ తీర్పు ఇచ్చింది. దరిమిలా అతడిని డిసెంబరు ఇరవై మూడున ఫ్రాన్సుకు తిరిగి పంపారు.

కొసమెరుపు :

ఛార్లెస్ శోభరాజ్ గురించిన ఒక ఆసక్తికర విశేషాన్ని ఇండియా టుడే వంటి ప్రసిద్ధ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసిన  ప్రముఖ పాత్రికేయులు ఎస్. వెంకట నారాయణ గారు తెలియచేసారు.  ఆయన మాటల్లోనే సంక్షిప్తంగా:

“ఇది జరిగి రెండు దశాబ్దాలకు పై మాటే. అరెస్టు చేసిన ఛార్లెస్ ని పోలీసులు ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టుకు తీసుకువచ్చారు.  ఎవరినో కలవడానికి వెళ్ళిన నాకు అక్కడ  ఛార్లెస్ తారసపడ్డాడు. ఇంటర్వ్యూ అడిగాను. వెంటనే ఒప్పుకున్నాడు కానీ, కొన్ని షరతులు పెట్టాడు. నేను అడిగే ప్రశ్నలను లిఖితపూర్వకంగా  ఆయన న్యాయవాదికి ఇవ్వాలి. వాటికి జవాబులు రాసి తన లాయర్ కి ఇస్తాడు. అదీ ఒప్పందం.

“ఆ ఇంటర్వ్యూ  అనేక జాతీయ పత్రికల్లో వచ్చింది. దాని తెలుగు అనువాదాన్ని స్వాతి తెలుగు వారపత్రికలో కూడా విపులంగా ప్రచురించారు. తర్వాత ఓ నెల రోజులకి నేను మళ్ళీ ఛార్లెస్ ని కలిసాను. నన్ను చూడగానే థాంక్స్ నారాయణ గారూ అన్నాడు. నాకు అర్ధం కాలేదు. అదే అడిగాను.

“స్వాతి తెలుగు వార పత్రికలో నాతో  మీరు చేసిన ఇంటర్వ్యూ చదివి నన్ను పెళ్ళాడాలని వుందని ఆ తెలుగు రాష్ట్రం నుంచి వంద ఉత్తరాలు వచ్చాయి. ఒక్కసారి నేను జైలు నుంచి బయట పడనివ్వండి. వాళ్ళలో ఒకరిని పెళ్ళాడుతాను. భారతీయ పౌరసత్వం తీసుకుంటాను.  ఈ దేశంలో హాయిగా శేష జీవితం గడుపుతాను

“ఇదీ ఛార్లెస్ సమాధానం. నేను నవ్వి గుడ్ లక్ చెప్పేసి వచ్చేశాను.

“అదే ఆఖరిసారి నేను ఛార్లెస్ శోభరాజ్ ని చూడడం.  తర్వాత అతడ్ని నేపాల్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు పత్రికల్లో చదివాను.  ఛార్లెస్ ని పెళ్ళాడుతామని ఉత్తరాలు రాసిన యువతులు, ఈ పాటికి  పెళ్ళిళ్ళు చేసుకుని, అమ్మలై, బామ్మలై హాయిగా జీవితాలు గడుపుతూ వుంటారు.

“అలాంటి వాళ్ళలో ఎవరైనా తటస్థపడితే ఒక ప్రశ్న అడగాలని వుంది. ‘ ఇప్పుడు ఛార్లెస్ విడుదల అయ్యాడు. మరి ఛార్లెస్ గురించి ఏమనుకుంటున్నారు?’ (పెళ్ళాడే ఉద్దేశం అలాగే వుందా? మారిపోయిందా?)

ముగించారు నారాయణగారు.

కింది ఫోటో:

జైలు నుంచి విడుదలై ఫ్రాన్స్ వెడుతున్న ఛార్లెస్ శోభరాజు



(24-12-2022)

22, డిసెంబర్ 2022, గురువారం

నా గురించి నేను – భండారు శ్రీనివాసరావు



మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు...
నా గురించి నేను అని మొదలు పెట్టి మళ్ళీ ఇదేమిటి అనుకోనక్కర లేదు. మా భండారు వారింట ఆయన ప్రసక్తి లేకుండా చెప్పుకోవడానికి ఏమీ వుండదు.

ఆయన చేసినవి చిన్నా చితకా ఉద్యోగాలు కావు. అయిదుగురు ముఖ్యమంత్రులకు (చెన్నా టు అన్నా అంటే చెన్నారెడ్డి,అంజయ్య, భవనం, కోట్ల, ఎన్టీఆర్ ) చీఫ్ పీఆర్వో గా పనిచేశారు, వాళ్లకి మాట రాకుండా, తను మాట పడకుండా.

సమాచార శాఖ డైరెక్టర్ గా, ఆంధ్రా బ్యాంక్ చీఫ్ పీఆర్వో గా, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసి 1993లో రిటైర్ అయ్యారు. ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం పెన్షన్ లో మూడింట రెండు వంతులు ముందుగానే అమ్ముకున్నాడు. బహుశా ఆయన తనకోసం చేసుకున్న పైరవీ ఇదొక్కటేనేమో. సాధారణంగా ఒప్పుకోని రూల్స్ ని పక్కన పెట్టించి పెన్షన్ డబ్బులు తీసేసుకున్నాడు.

అప్పుడు ఆయన ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో ఉన్నతాధికారి. ఆయన దగ్గరకు వచ్చేది బడా నిర్మాతలు. ఎవరిని చేబదులు అడిగినా ఇంటికి తీసుకువచ్చి చేతిలో పెట్టేవారు. కానీ అలాంటి మనిషే అయితే ఇక్కడ రాయాల్సిన అవసరం ఏముంటుంది?

‘అరకొర పెన్షన్ డబ్బులతో ఈ హైదరాబాదులో జీవనం కష్టం అనుకుని పుట్టపర్తి వెళ్లి ఓ చిన్న గది అద్దెకు తీసుకున్నారు. ఆధ్యాత్మిక గ్రంధ రచనలు చేయడం కొనసాగించారు.

2006వ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీ ఉదయం

తెల్లవారుతుండగానే పుట్టపర్తి నుంచి హైదరాబాదు వచ్చారు. ఆయన మొహంలో ఎన్నడూ కనబడని ఆందోళన. రాత్రంతా నిద్ర లేకుండా బస్సులో. పైగా రిజర్వేషన్ కూడా లేకుండా డెబ్బయ్ ఏళ్ళ పైబడిన వయసులో చాలా దూరం నిలబడే ప్రయాణం. అంచేత అలసట వల్ల అలా వున్నారేమో అనుకున్నాం.

కానీ కారణం అది కాదు. ఆయన ఆందోళనకు కారణం దివాలా తీసిన ఒక ప్రైవేటు సహకార బ్యాంకు తాలూకు లీగల్ నోటీసు.
‘మీరు తీసుకున్న రుణం ఒక్క పైసా కూడా ఇంతవరకు చెల్లింపు చేయలేదు, కావున మీ మీద కోర్టు ద్వారా చర్య తీసుకోబోతున్నాం’ అనేది సారాంశం.

గతంలో ఆయన హైదరాబాదులో వున్నప్పుడు ఉన్న ఇంటి చిరునామా అందులో వుంది. జీవితంలో ఎవరికీ బాకీ పడరాదు అనే సిద్దాంతంతో బతికిన మనిషికి ఇది పెద్ద షాకే.

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ గా రిటైర్ అయిన మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు అందరం కలిసి నాంపల్లిలో సహకార బ్యాంకుల వ్యవహారాలు చూసే అధికారి కార్యాలయానికి వెళ్లాం. ఆఫీసులో సిబ్బంది పెద్దగా లేరు. సంబంధిత అధికారి ఆర్చుకుని తీర్చుకుని వచ్చేసరికి చాలా పొద్దు పోయింది. రాత్రంతా ప్రయాణం చేసి పొద్దున్న ఏదో పేరుకు ఇంత బ్రేక్ ఫాస్ట్ చేసి రావడం వల్ల మా అన్నయ్య మరీ నీరసించి పోయాడు. మొత్తం మీద ఆ అధికారి వచ్చాడు. మేము చెప్పింది విన్నాడు. ‘ఎక్కడో ఏదో పొరబాటు జరిగింది, మీరేమీ కంగారు పడకండి, మీకు ఈ అప్పుతో ఏమీ సంబంధం లేదు’ అనే ధోరణిలో మాట్లాడాడు. ‘మనలో మన మాట ఈ బ్యాంకులో ఇలాంటివి ఎన్నో జరిగాయి, ఒక్కొక్కటీ మెల్లగా బయట పడుతున్నాయి’ అని కూడా అన్నాడు.

మేమందరం ఊపిరి పీల్చుకున్నాం, ఒక్క మా అన్నయ్య తప్ప. బ్యాంకును మోసం చేశారు అని వచ్చిన తాఖీదే ఆయన్ని ఇంకా కలవరపెడుతున్నట్టుంది. మంచి మనిషికి ఓ మాట చాలు.

ఆ సాయంత్రమే మళ్ళీ పుట్టపర్తి ప్రయాణం. వద్దన్నా వినలేదు. వదిన ఒక్కతే వుంటుంది అన్నాడు. ఇక తప్పదు అనుకుని ఆర్టీసీ పీఆర్వో కి ఫోను చేసి డీలక్స్ బస్సులో సీటు పెట్టించాను. ఆ రాత్రే ఆయన వెళ్ళిపోయాడు. అదే ఆయన్ని ఆఖరుసారి ప్రాణాలతో చూడడం.
సరిగ్గా వారం గడిచింది. ఆగస్టు 21వ తేదీన కబురు వచ్చింది, మాట్లాడుతూ మాట్లాడుతూ దాటిపోయాడని.

మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారికి కూడబెట్టిన ధనం అంటూ ఏమీ లేదు.

కానీ జన్మతః వచ్చిన మానధనం మాత్రం పుష్కలంగా వుంది.

కింది ఫోటో: అలనాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీఆర్ కు ప్రధాన పౌర సంబంధాల అధికారిగా పనిచేసిన మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు (ఎన్టీఆర్ కి కుడి వైపు కూర్చున్న వ్యక్తి)



20, డిసెంబర్ 2022, మంగళవారం

జీవితమే మధురము రాగసుధా భరితమూ





జీవితం అంటే ఓ సరదా అనుకునే రోజులు ప్రతివారి జీవితంలో కొన్ని వుంటాయి.
అలాంటిదే ఇదొక రోజు. భలే మంచి రోజు.1995 నాటిది. 
అయిదేళ్ళ మాస్కో జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి 1992 లో హైదరాబాదు తిరిగివచ్చిన తరువాత పంజాగుట్ట దుర్గానగర్ కాలనీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాము.  రష్యా నుంచి ఓడలో వచ్చిన సామానుకు సరిపడిన ఇల్లు.  అదేమిటో కానీ ఆ ఇంట్లో అన్నీ విశాలమైన హాల్సే. గదుల బదులు హాల్స్ కట్టినట్టు వుంది. బాత్ రూములు పడక గది అంత విశాలంగా కట్టి అసలు ముఖ్యమైన వంట గదిని బాత్ రూమ్ సైజులో కట్టి, మమ అనిపించినట్టున్నారు. ఏదైతేనేం, వాస్తు సరిగా లేని ఆ పెద్ద ఇల్లు కొద్ది అద్దెలో దొరికిందని సంతోషించాము. ఆ రోజుల్లో మా ఇల్లు మగపిల్లల హాస్టల్ మాదిరిగా వుండేది.  మా పిల్లలు, వాళ్ళ స్నేహితులు, స్నేహితుల స్నేహితులు ఇలా చాలామంది. సత్తేపే సత్తా సినిమాలో హీరోల్లా  జుట్లు పెంచుకుని అందరూ మగపిల్లలే. ఆఖరికి ఇంట్లో పిల్లి కూడా మగ పిల్లే. 
వాళ్లకు కాఫీలు, టిఫిన్లు, కొండొకచో భోజనాలు, అదనంగా నా స్నేహితులు వాళ్లకు మంచింగులు వగైరా ఏర్పాట్లతో మా ఆవిడ 24 x 7 బిజీబిజీ.  24 x 7  అని ఎందుకు అంటే ఈ మగపిల్లలు అందరూ నిశాచరులు. అందులో నేను కూడా.  ఎవరు ఎప్పుడు ఇంటికి  వస్తారో వాళ్ళకే తెలియదు. ఎప్పుడూ పాటలు, డాన్సరులతో ఇల్లు మార్మోగుతూ వుండేది. మా పొరుగింటాయన బహు శాంతమూర్తి కావడం వల్ల మర్యాద దక్కింది.
అలాటి రోజుల్లో ఒకనాటి సరదా వీడియో ఇది. ఇందులో చనిపోయిన మా అక్కయ్యలు, మా ఆవిడ వున్నారు. మా అన్నయ్య వదినల చేత కూడా డాన్సులు చేయించారు.  నేనూ. మా ఆవిడ సరే. ఇష్టం వున్నా, ఇష్టం లేనట్టుగా రెండు స్టెప్పులు వేసింది.
ఆ నాటి బ్లాక్ అండ్ వైట్ వీడియోకి కొత్త సినిమా పాట ( డీజే టెల్లు సినిమాలోది)  రీమిక్స్ చేసి యూ ట్యూబ్ లోకి ఎక్కించాడు మా మూడో అన్నయ్య కుమారుడు భండారు రమేష్.
మరో విషయం చెప్పుకోవాలి. ఆరోజుల్లో మా ఇంట్లో రికామీగా తిరిగి పెరిగిన ఆ పిల్లలు అందరూ పెళ్ళిళ్ళు చేసుకుని, జీవితంలో చాలా మంచి స్థాయిలో స్థిరపడ్డారు. వాళ్ళలో అధిక శాతం విదేశాల్లోనే.
వాస్తు మహిమ కాబోలు.
20-12-2022

15, డిసెంబర్ 2022, గురువారం

పెళ్ళొద్దు! పెళ్ళాం కావాలి!! – భండారు శ్రీనివాసరావు

(Published in ANDHRAPRABHA on 18-12-2022, SUNDAY) 


‘మీ పెళ్ళయి యాభయ్ ఏళ్ళు. అంటే డైమండ్ జూబిలీ. కానీ మీరు పెళ్లి చేసుకోలేదు అంటుంటారు. ఏమిటి సంగతి?

‘పెళ్లి జరిగిన మాట నిజం. పెళ్లి చేసుకోని మాట కూడా నిజమే’

ఇదేం మతలబు అంటారా! యాభయ్ ఏళ్ళు వెనక్కివెళ్ళాలి!  


1971 డిసెంబరు 15 వ తేదీ   రాత్రి  మద్రాసు నుంచి అంబాసిడర్ కారులో తిరుపతి ప్రయాణం. దారి పొడుగునా భోరున వాన. అట్లా ఇట్లా కాదుఉరుములుమెరుపులు,  పిడుగులు. మధ్యమధ్యలో ఆగుతూ, 16 వ తేదీ  తెల్లారేలోపునే తిరుమల కొండపైకి  చేరాము.  ఎస్వీ కాటేజీలో పైన గదులు తీసుకున్నాము. పురోహితుడు ఎలా దొరికాడో తెలవదు.  మా ఆవిడ పిన్ని వసుంధర కొన్న నీలం రంగు ఫారెన్ నైలెక్స్ చీరె ఆ రోజు  పెళ్లి చీరె. నేను ధోవతి కట్టుకున్నానోప్యాంటు షర్టుతో పెళ్లి చేసుకున్నానో గుర్తు రావడం లేదు. ఎందుకంటే సందర్భంసన్నివేశం అలాంటివి.  తొమ్మిదీ పది గంటల  నడుమ పెళ్లి జరిగిపోయింది. వెంటనే వెళ్లి,  బాలాజీ దర్శనం చేసుకున్నాము. ఇప్పట్లోలా క్యూ లైన్లు లేవు. కొండ దిగి వచ్చి భోజనం చేసి, వచ్చిన కారులోనే మళ్ళీ మద్రాసు వెళ్ళాము. మా ఆవిడ స్నేహితులు  టీ నగర్ హోటల్లో విందు ఇచ్చారు. అటునుంచి మా మామగారి వద్దకు వెళ్లాం. కూతుర్ని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. కొడుకయినా, కూతురయినా  ఒకే సంతానం.  నీకు ఏం తక్కువ చేస్తానని అనుకుని ఇలా వెళ్లి  పెళ్లి చేసుకున్నావ’ని ఆ తండ్రి, మా ఆవిడను అడిగారు. కన్నీళ్ళే జవాబు.

రిజర్వేషన్ల గొడవ లేని రోజులు. అంచేత  16 వ తేదీ రాత్రి రైల్లో బయలుదేరి మర్నాడు ఉదయం బెజవాడ చేరుకున్నాము.  మా పెద్దన్నయ్య ఇంటికి వెళ్ళాము. మా అమ్మగారు కూడా అక్కడే వుంది. మమ్మల్ని  చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. కాళ్ళకు దణ్ణం పెట్టగానే దగ్గరకు తీసుకుని మనసారా ఆశీర్వదించింది.

అట్టహాసంగా చేసుకునే పెళ్ళిళ్ళు చూసి చూసి, మొహం మొత్తి,  పెళ్ళొద్దు! పెళ్ళాం కావాలి! అనే నా మొండి పట్టుదల ఫలితం మా ఈ  పెళ్లి. ఇరువైపుల పెద్దల చేత కళ్ళనీళ్ళు పెట్టించింది కూడా, బహుశా అదే ఆఖరిసారి  కావచ్చు.

మా పెళ్ళికి పెద్దల ఆమోదం లభించింది అన్న సంతోషంలో నేను పనిచేస్తున్న ఆంద్రజ్యోతి ఆఫీసుకు వెళ్లి ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారిని కలుసుకుని మా పెళ్లి వృత్తాంతం తెలియచేశాము. ఆయన మా ఇద్దర్నీ మెచ్చుకోలుగా చూస్తూ, ‘రోజూ ఎన్నో ఆదర్శాలు వల్లె వేస్తుంటాము.  నువ్వు చేసి చూపించావు. వెళ్ళండి. హాయిగా కాపురం చేసుకోండి. మళ్ళీ వచ్చి ఉద్యోగంలో చేరుతున్నాను, అని చెప్పేవరకు నీకు సెలవు ఇస్తున్నాను. ఇదే మీకు నా పెళ్లి కానుక’ అన్నారాయన.

ఇంతకీ మాది ప్రేమ వివాహమా!  రాక్షస వివాహమా! గాంధర్వ వివాహమా! ఏదైతేనేం! ఆనాడు అంత కఠినంగా వ్యవహరించకుండా వుండి వుంటే  బాగుండేది అని ఆ తర్వాత  చాలా సార్లు అనిపించింది. ఏం లాభం. గతజల సేతుబంధనం.

మా పెళ్లి రోజుకు నేటితో యాభయ్ ఏళ్ళు నిండాయి.  గోల్డెన్ జూబిలీ అంటారేమో! అదేమిటో చిత్రం.  మా ఆవిడకు బంగారం మీద వీసమెత్తు మోజులేదు. అందుకే కాబోలు, ఆ వేడుకకు  ముందే దాటిపోయింది.     

ఇలాంటి పెళ్లిళ్లకు దండలు, ఫోటోలు వుండవుజ్ఞాపకాలు తప్ప.

 

(16-12-2020)

 

కింది ఫోటో:




నా చూపు కెమెరా వైపు, తన చూపు నా వైపు

(మగవాళ్ల ప్రేమ ఇలాగే వుంటుంది)

మరో ఫోటో:

తిరుమలలో మా పెళ్లి జరిగిన కాటేజీ

(మొన్న సెప్టెంబరులో తిరుపతి వెళ్ళినప్పుడు ఆ కాటేజీ ముందు నిలబడి తీసుకున్న ఫోటో)  








13, డిసెంబర్ 2022, మంగళవారం

రద్దు రద్దయితే – భండారు శ్రీనివాసరావు

 అసందర్భంగా అనిపించినా ఆ సందర్భం ప్రస్తావించదలిచాను. 1970 ప్రాంతంలో నేను విజయవాడలో ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో పని చేసే రోజుల్లో జర్నలిష్టుగా సంఘంలో నా జీవితం ఒక మెట్టు పైన వుండేది. కానీ జీతభత్యాల రీత్యా చూసుకున్నప్పుడు దారిద్య్ర రేఖకు దిగువన వుండేది. జీతానికీ, జీవితానికీ పొంతనలేని ఆ రోజుల్లో ఒకరోజు, ఒక్క రూపాయంటే ఒక్క రూపాయి జరూరుగా కావాల్సి వచ్చింది. ఇల్లంతా గాలించినా పాతిక పైసలు కూడా లేవు. పిల్లవాడికి పోతపాలు. పాలసీసా పగిలిపోయింది. నేనూ మా ఆవిడా దిగులు మొహాలు వేసుకుని కూర్చుని వుంటే రామారావు అని కొత్తగా పరిచయం అయిన వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. అతడాసమయంలో అలా రావడం మా ఇద్దరికీ బాగనిపించలేదు. పరిస్తితి గమనించాడేమో వచ్చిన వాడు వచ్చినట్టే వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన వాడు ఇట్టే తిరిగి వచ్చాడు. అతడి చేతిలో పాలసీసా. మా ప్రాణాలు లేచి వచ్చాయి. కొద్దిరోజులుగా నానుంచి ఓ సాయం కోరుతూ అతడు నా వెంట తిరుగుతున్నాడు. అతనో పెయింటర్. సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలనే తపన. బ్యాంకులో పూచీకత్తు ఇచ్చేవాళ్ళు కావాలంటున్నారు. అతడు చేసిన సాయానికి ప్రతిగా బ్యాంకుకు వెళ్లి హామీ సంతకం చేసి పదివేలు అప్పు ఇప్పించాను. వెంటనే, హైదరాబాదు ఆకాశవాణిలో ఉద్యోగం రావడం, ఆ తరువాత మాస్కో రేడియోలో పనిచేయడానికి మాస్కో వెళ్ళడం ఈ హడావిడిలో నేను బెజవాడ బ్యాంకు అప్పు సంగతి మరచిపోయాను. ఈలోగా అప్పుతీసుకున్న వ్యక్తి వ్యాపారం సరిగ్గా నడవక రోడ్డున పడడం, బ్యాంకు వాళ్ళు హామీదారునయిన నా చిరునామా పట్టుకుని మాస్కోలోని ఇండియన్ ఎంబసీ ద్వారా లక్ష రూపాయలకు కోర్టు ఇచ్చిన డిక్రీ చేతిలో పెట్టడం సినిమాలోలా జరిగిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగిని కదా, అప్పు వసూలుకు నేను వారికి కనిపించి వుండడంలో ఆశ్చర్యం లేదు. ఆశ్చర్యం అల్లా ఇప్పుడు అలా జరగడం లేదేమిటని!

అల్లా ఈరోజు దాకా అనుకుంటున్నాను. కానీ ఇందాకనే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఓ బాంబు పేల్చారు. బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలు లక్షల కోట్ల రూపాయలు రద్దు చేసినట్టు అనుకుంటున్న రుణాలు రద్దయినట్టు  భావించరాదనీ, అప్పులు తీసుకున్నవాళ్లు ఏ దేశంలోవున్నా ముక్కు పిండి వసూలు చేస్తామని వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని అర్ధం వచ్చే రీతిలో మాట్లాడినట్టు టీవీల్లో స్క్రోలింగులు తిరుగుతున్నాయి.

పోనీ లెండి, పెన్షన్ అటాచ్ చేస్తామని అనలేదు. ఆస్తులు కదా! అవి ఎట్లాగో లేవు.


https://economictimes.indiatimes.com/industry/banking/finance/banking/bad-loans-worth-rs-10-lakh-crore-wrote-off-by-banks-in-last-five-financial-years-says-nirmala-sitharaman/articleshow/96196461.cms?fbclid=IwAR3rpQ6aHhZuvd9JGmcM_NWpJsrHjPB9RRRh1btCv8ZT5QFgnsDn75UJlQg&from=mdr

(13-12-2020)




(13-12-2020)

11, డిసెంబర్ 2022, ఆదివారం

నా బలమా! నీ నామ బలమా! – భండారు శ్రీనివాసరావు

(Published in Andhra Prabha today Sunday 11-12-2022)
‘పరీక్ష తప్పడానికి అయినా సిద్ధపడతాడు కానీ, పక్కవాళ్ళది చూసి కాపీ కొట్టడు’ అనే మంచి పేరు నాకు చదువుకునే రోజుల నుంచి వుంది. అయితే, చూసి కాపీ కొట్టకపోవచ్చు, కానీ విని రాసుకోవడం అనే కొత్త అలవాటు, యాభయ్ ఏళ్ళ క్రితం పాత్రికేయ వృత్తిలో ప్రవేశించిన నాటి నుంచీ తప్పనిసరి అవసరంగా అలవడింది. విలేకరి చేసే పనే అది కదా! ఇతరులు చెప్పింది విని, ముక్కున పెట్టుకుని వెళ్లి ఆఫీసులో ఒప్పగించడం. అందులోను నేను చేసింది రేడియో ఉద్యోగం. వార్తల వ్యవధే పది నిమిషాలు. అంచేత మూడు ముక్కల అప్పగింతతో విధినిర్వహణ బాధ్యత ఆ పూటతో ముగిసిపోయేది. మళ్ళీ ఇప్పుడు రిటైర్ అయి ఆంధ్రప్రభ దిన పత్రికలో వారం వారం ఆదివారం నాటికి ఓ వ్యాసం రాసే బాధ్యత నెత్తికి ఎత్తుకోవడం చేత మళ్ళీ పాత అలవాటు కొత్తగా వంటపడుతోంది. యింతకీ విషయం ఏమిటంటే:
బహుశా ఏడాది క్రితం అనుకుంటాను, కరోనా రెండో వేవ్ ఉదృతంగా సాగుతున్నప్పుడు మిత్రుడు జ్వాలా నరసింహారావు, ఆయన భార్యా ఇద్దరూ ఒకేసారి ఈ మాయదారి జబ్బున పడ్డారు. అప్పటికి ఇంట్లోనే వుండి డాక్టర్ సలహాలతో చికిత్స తీసుకునే వెసులుబాటు వచ్చింది. ఆ విధంగా ఓ రెండువారాలు ఇంట్లోనే ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు, రామనామ జపంతో తాను అస్తమానం కాలక్షేపం చేస్తుండేవాడినని తనకు పూర్తిగా స్వస్థత చేకూరిన తర్వాత జ్వాలా నాతో చెప్పాడు. కరోనా నయం కావడానికి రామనామం కూడా కొంతవరకు పనిచేసిందని ఆయనకో నమ్మకం. ఆలిండియా రేడియోలో నా సీనియర్ సహచరులు ఆర్వీవీ కృష్ణారావు గారికి ఈ విషయం చెబితే ఆయన రామజోగి మందు గురించి చెప్పారు. భక్త రామదాసు కీర్తనలలో ఇదొకటిట.
‘రామజోగి మందు కొనరే ఓ జనులారా!’ అంటూ రామదాసు పాడిన ఓ కీర్తనలో రామనామం ఓ మంచి ఔషధం అని పేర్కొన్నట్టు తెలిపారు.
ఫోన్లో మాట్లాడుతూ రాసుకోవడం వల్ల కొన్ని పదాలు తప్పిపోయాయేమో తెలియదు కానీ మొత్తం మీద భావం బోధపడేలా రాసుకున్న రామదాసు కీర్తన ఇది:
‘రామజోగి మందు కొనరే! ఓ జనులార! రామజోగి మందు కొనరే!
రామజోగి మందు కొని ప్రేమతో భజించుడన్న
కామక్రోధ లోభ మోహ ఘనమైన రోగాలకు మందు
కాటుక కొండలవంటి కర్మము లెడబాపే మందు
సాటిలేని జగమునందు
స్వామి రామజోగి మందు కొనరే!
ముదముతో భద్రాద్రియందు ముక్తిని పొందించే మందు
సదయుడైన రామదాసు ముదముతో సేవించే మందు
రామజోగి మందు కొనరే! ఓజనులార! రామజోగి మందు కొనరే!’
కొంచెం అటూ ఇటుగా ఇదీ రామదాసు గారు పాడిన కీర్తన
రామదాసుగారు చెప్పిన రామజోగి మందు (సతతం రామ రామ అని భజించడం) జ్వాలాకు కరోనా నుండి రక్షణ కవచం మాదిరిగా పనిచేసిందని కృష్ణారావు గారి ఉవాచ.
ఆయనతో పాటు నాకు అప్పుడప్పుడు మితృలు పాశం యాదగిరి, ఆర్వీవీ కృష్ణారావు, అమెరికా నుంచి వీవీ శాస్త్రి గారు, తరచుగా మా అన్నగారు రామచంద్రరావు ఫోన్లు చేస్తుంటారు. ఆ మాటల్లో ఎన్నెన్నో పాత ముచ్చట్లు దొర్లుతుంటాయి. చాలా మంచి సంగతులు. వాళ్లకు రాయాలని తోచదు. నాకు రాయకపోతే తోచదు. కానీ నాకు గంధర్వుల శాపం వుంది. అదేదో సినిమాలోలా విన్నది వెంటనే నోట్ చేసుకుంటే తప్ప, ఆ తర్వాత గుర్తుండదు. ఈ పాడు మతిమరపు వల్ల వెంటనే రాసుకుంటే సరి. లేకపోతె ఇంతే సంగతులు.
రామజోగి మందు గురించి చెప్పిన కృష్ణారావు గారు రాత్రి మళ్ళీ ఫోన్ చేశారు.
ఈసారి ఇదిగో ఈ నామ బలం గురించి చెప్పారు.
ఓసారి, అంటే అప్పుడెప్పుడో దశాబ్దాల కిందట మంగళంపల్లి బాల మురళీ కృష్ణ గారు బెజవాడ వచ్చారు. యథావిధిగా ఇండియన్ మెడిసిన్ హౌస్ డి.ఎల్. నారాయణ గారింట్లో మధ్యాన్న భోజనం. ఆ సాయంత్రం కచేరీ.
నారాయణ గారికి ఆయుర్వేద వైద్యశాల వారసత్వంగా వచ్చింది. వారి హయాములో మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లింది.
భోజనాల సమయంలో కృష్ణారావు గారు బాల మురళి గారితో అన్నారు. ‘నారాయణ గారి చవులూరించే విందు ఆరగిస్తున్నాం సరే! మరి వీనుల విందుగా మీ విందు (కచేరీ) మాత్రమే మిగిలింది’ అని.
ఈ మాటలు గుర్తుపెట్టుకున్నట్టుగా ఆ సాయంత్రం కచేరీలో బాల మురళి గారు ఆనంద భైరవి రాగంలో ‘ నా బలమా! నీ నామ బలమా’ అనే త్యాగరాయ విరచిత కీర్తన సుమధురంగా పాడారు. ఆయుర్వేద వైద్యంలో డి.ఎల్. నారాయణ గారి ఆనంద భైరవి అనే ఔషధం వుంది. అలాగే కృష్ణారావు గారు అడిగిన వీనుల విందు లాంటి ఆనంద భైరవి రాగం వుంది.
సరే ఇదలా ఉంచితే ..
ఒకానొక కాలంలో ఆయుర్వేద వైద్యం తెలుగునాట విలసిల్లింది. చింతలూరు వెంకటేశ్వర ఆయుర్వేద నిలయానికి ఆ రోజుల్లో వెయ్యి కోట్ల టర్నోవర్ ఉండేదని చెప్పుకునేవారు. దాదాపు ప్రతి గ్రామంలో ఆయుర్వేద వైద్యులు వుండే వాళ్ళు. మిస్సమ్మ సినిమాలో అల్లు రామలింగయ్య పాత్ర అటు స్కూలు టీచరు, ఇటు ఆయుర్వేద వైద్యం. పిల్లల చేత మందులు అరగదీయించడం గుర్తుండే వుంటుంది.
ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి గారికి భవిష్యత్ వాణి తెలుసల్లే వుంది. ఆయుర్వేదానికి ముందు ముందు కాలం చెల్లిపోతుందన్న అనుమానం కలిగిందేమో తెలియదు. దొంగ రాముడు సినిమాలో ఒక సన్నివేశం పెట్టారు.
చిన్ననాగేశ్వర రావు తల్లికి జబ్బు చేసి ప్రాణం మీదకు వస్తే, ఆయుర్వేద వైద్యుడుగా వేసిన వంగర వెంకట సుబ్బయ్య రోగి నాడి పట్టి చూసి ఒక మందు చీటీ రాసిచ్చి పట్రంమ్మంటాడు. చిల్లి కాణీ జేబులో లేకపోయినా చిన్న నాగేశ్వర రావు ఆయుర్వేదం మందులు అమ్మే షాపుకి పరిగెడతాడు. షాపు వాడు చీటీ చూసి మందుల అలమరా తెరిచి, ఓ సీసా తీసి దానిపై వున్న దుమ్ము ఉఫ్ అని ఊది పిల్లాడి చేతికి ఇస్తాడు. అంటే ఆయుర్వేద మందులకు భవిష్యత్తులో గిరాకీ తగ్గి దుమ్ము కొట్టుకు పోతాయనే సంకేతం అందులో ఉందంటారు కృష్ణారావు గారు.
పూర్వం పాసింజర్ రైళ్ళలో ఆయుర్వేదం మందులు అమ్మేవాళ్లు. కస్తూరి మాత్రలు, సువర్ణ సూర్యావతి, పైత్యాంతక రసం. వాటితో పాటు కాశీ దారాలు, ఇత్తడి పిన్నీసులు, పేల దువ్వెనలు వగైరా వగైరా. ఒక పొడవాటి కర్రకు వీటిని వేలాడగట్టి అటూ ఇటూ ఊపుతూ రైల్లో తిరిగి అమ్మేవారు.
వెనకటి రోజుల్లో వైద్యుడు అనేవాడు ముందు నాడి పట్టి చూసేవాడు. వున్న ఊళ్ళో వైద్యం కనుక రోగుల శరీర తత్వం వాళ్లకి బాగా తెలుసు. అందుకు తగ్గ మందులు కుప్పెల్లో అరగదీసి, కల్వంలో నూరి అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆయుర్వేదం వంటి దేశీయ వైద్య ప్రక్రియల్లో కూడా కార్పొరేట్ శక్తులు అడుగు పెట్టడంతో ఆకర్షణీయమైన ప్యాకెట్లలో అవి కూడా ఇంగ్లీష్ అలోపతి మందుల్లాగా మార్కెట్లో విరివిగా దొరుకుతున్న మాట వాస్తవమే అయినా, అందులో భారతీయ ఆత్మ లోపిస్తోంది. రోగికీ, వైద్యుడికీ నడుమ ఉండాల్సిన సున్నితమైన అనుబంధం చెరిగిపోతోంది. నాడి పట్టి చూడకుండానే చేసే వైద్యంలో డబ్బు ఉండవచ్చు కాని, జబ్బు నయం చేసే శక్తి క్రమంగా లోపిస్తోందేమో అని ఓ సందేహం.



(11-12-2020)