20, నవంబర్ 2022, ఆదివారం

ఆడవారిని పొగడండి! (కనీసం ఈ ఒక్కరోజయినా)

 


నిన్న అంటే నవంబరు పందొమ్మిది మగవాళ్ల దినం అంటూ సాంఘిక మాధ్యమాల్లో తెగ పోస్టులు చక్కర్లు కొట్టాయి.

మర్నాడే అంటే నవంబరు ఇరవయ్యో తేదీని ఏకంగా ఆడవాళ్ళకు వదిలేశారు. ఆ కధాకమామిషు క్రమంబెట్టిదనిన:

అవలోకించుడు.
నెల అంటే ముప్పయి రోజులు అని సెలవిచ్చాడు గతంలో హైదరాబాదు వచ్చిన ఓ కేంద్ర మంత్రి. ప్రస్తుతం మాజీ అనుకోండి. అల్లాగే ఏడాదికి అక్షరాలా మూడువందల అరవై అయిదు రోజులు అంటే కాదు కాదు ఇంకా ఎక్కువే అంటున్నారు కొందరు. ఆ సంఖ్య ఎల్లాగూ మారదు కాబట్టి ఒక్కో రోజుకూ రెండో మూడో పేర్లు తగిలించేస్తున్నారు ఈ మధ్య ఆ మరికొందరు. ఆ లెక్కన ఇవ్వాళ అంటే సెప్టెంబరు ఇరవయ్యో తేదీని ‘భార్యల్ని ప్రశంసించే రోజు’ పొమ్మన్నారు. దానికి సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. ‘ఈ ఒక్క రోజూ కట్టుకున్న ఇల్లాలిని మాటల్తో పొగిడి, మిగిలిన మూడువందల అరవై నాలుగు రోజులూ షరా మామూలుగా అష్టోత్తరాలతో వేధిస్తే పోలా’ అనుకునేవాళ్లు కూడా ఉండవచ్చు. ‘ఆ మాత్రం దానికి ఈ ఒక్క రోజూ మొగుడితో పొగిడించుకుని, ఏడాది పొడుగునా అనరాని మాటలు పడుతూ వుండడం ఏమంత భాగ్యం’ అని ముక్కు చీత్తూ మధన పడే మగువలకూ తక్కువలేదు. ఇది ఇక్కడ వదిలి అసలు ఈ ‘కొత్త రోజు ‘కధాకమామిషూ’ ఏంటో చూద్దాం.
ఒక ఆంగ్ల దినపత్రిక ఈ ‘దినం’ అనగా ‘భార్యల్ని ప్రశంసించే దినం’ ప్రచార బాధ్యతని తన భుజాలకు ఎత్తుకుంది. మక్కికి మక్కి కాకుండా తెలుగులో సాగదీస్తే అది ఇలా సాగుతుంది.
హల్లో! ఎలా వున్నావు. మీ ఆవిడ ఎలా వుంది?’
మా ఆవిడా! ఓకేరా!’
ఏమిటీ జస్ట్ ఓకేనా! అంతేనా!’
‘..........’
చాలా ఆశ్చర్యంగా వుందే! ఆవిడ అంటే ఎవరనుకున్నావు. నీ అర్ధాంగి. మీ ఇంటి దీపం. ఉదయం అందరికంటే ఇంట్లో ముందు నిద్ర లేచేది ఆవిడే. ఇంట్లో అందరూ నిద్ర మంచం ఎక్కిన తరువాత అన్నీ సర్దుకుని నిద్రపోయే మనిషి కూడా ఆవిడే! నువ్వు తొడుక్కునే చొక్కా సైజు కూడా నీకు తెలవదు. ఆవిడ కొంటే తప్ప నీకు దిక్కులేదు. పిల్లలు ఏం తింటారో తెలవదు. వాళ్ళ పుట్టిన రోజులు కూడా నీకు జ్ఞాపకం వుండవు. అన్నీ కంప్యూటర్ లాగా ఆవిడ గుర్తు పెట్టుకోవాలి. ఇంట్లోకి ఏ సరుకులు కావాలన్నా ఆవిడే తేవాలి. పోపులడబ్బా ఎక్కడుందో కూడా నీకు తెలవదు. సరుకులు ఉన్నాయా నిండుకున్నాయా జవాబు చెప్పమంటే నీకు పడేవి నిండు సున్నా మార్కులే. ఈ విషయంలో ఆవిడని మించిన ఇన్వెంటరీ ఉంటుందా చెప్పు. చెప్పు అంటే జ్ఞాపకం వచ్చింది. ఆవిడ వెంట వుండి కొనిపెట్టకపొతే నీ చెప్పు సైజు కూడా నీకు తెలవదు. పిల్లల స్కూలెక్కడో, వాళ్ళేం చదువుతున్నారో, అసలు చదువుతున్నారో లేదో మీ ఆవిడ చెబితే కానీ తెలవదు. నీకీ సినిమా ఇష్టమో, నీకు ఏ కూర ఎలా చేస్తే యెంత ఇష్టమో ఆవిడకు తెలిసినంతగా నీకు బొత్తిగా తెలవదు. అల్లాంటి మనిషి ఎల్లా వుందంటే సింపుల్ గా ‘ఓకే’ అంటావా! అడిగేవాడు లేక. ఆయ్!!’
కాబట్టి మొగుడు మిత్రాస్! (ఏవిటో నాకూ సోషల్ నెట్ వర్క్ భాష పట్టుబడుతోంది). ఒక్క రోజే కదా! మీరు మీరు కాదనుకుని, మీ ఆవిడ మీ ఆవిడే అనుకుని ఎంచక్కా నాలుగు మంచి మాటలు ఆవిడతో మాట్లాడండి. ఆదివారం వంట పని పెట్టుకోకుండా ఏదైనా హోటల్ కు తీసుకువెళ్ళి, ‘ఛా! ఈ కూరా ఒక కూరేనా, నువ్వు వండితే ఆ రుచే వేరు’ అంటూ కాకమ్మ కబుర్లు కమ్మగా చెప్పండి. ఆడవాళ్ళు నమ్ముతారని నమ్మకం నాకయితే లేదు కానీ, ఆడవాళ్ళ గురించి నాకో బలమైన నమ్మకం వుంది. వాళ్ళు అల్ప సంతోషులు. కనీసం మిమ్మల్ని నమ్మించడం కోసమైనా వాళ్ళు మీ మాటలు నమ్మినట్టు కనిపిస్తారు.
ప్రయత్నం చేస్తే పోయేదేమీ లేదు నాలుగు మాటలు తప్ప.

15, నవంబర్ 2022, మంగళవారం

ఓ అర్చకుడి కధ - భండారు శ్రీనివాసరావు

ఎప్పుడో కానీ నేను గుళ్ళకు పోను.

అక్కడ వుండే పాండురంగడు ఇక్కడ వున్నాడు అనే థియరీ నాది.

గుడికి పోవాలి అని నాకు అనిపిస్తే ముందుగా  వెళ్ళేది హైదరాబాదు శివార్లలోని  చిలుకూరు బాలాజీ దేవాలయానికి. అక్కడ కూడా భక్తుల  హడావిడి ఎక్కువే. కానీ హుండీ కనపడని ఆలయం అది. వీ.ఐ.పీ. బ్రేకులు, టిక్కెట్ల మీద ప్రత్యేక దర్శనాలు లేని దేవాలయం అది. పెద్దవాళ్లు, చిన్నవాళ్లు, ఉన్నవాళ్లు, లేనివాళ్లు  అనే తేడా లేకుండా అందరూ వరుసగా వెళ్లి దైవదర్శనం చేసుకోవడానికి వీలైన గుడి అది.  అందుకే నాకు ఆ గుడి అంటే మక్కువ ఎక్కువ. గర్భగుడిలో వున్న బాలాజీకి  వీసా దేవుడు అనే పేరుంది. అక్కడికి పోయి పదకొండు ప్రదక్షిణలు తర్వాత దర్శనం చేసుకుని మనసులో  కోరుకుంటే  అమెరికన్ వీసా దొరుకుతుంది అనే నమ్మకం ఆ గుడి విషయంలో వుంది అని విన్నాను.  కోరిక తీరిన వాళ్ళు మళ్ళీ ఆ గుడికి వెళ్లి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకుంటారు అంటారు. 

సువిశాల ప్రాంగణంలో  అనేక ఏళ్ళుగా నిద్రాణంగా ఉండిపోయిన ఆ దేవాలయానికి  ఇంతగా ప్రాచుర్యం లభించడానికి కారణం సౌందర రాజన్ అనే పెద్దమనిషి. ఉన్నత చదువులు అభ్యసించారు. కామర్స్ లెక్చరర్ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ స్థాయికి ఎదిగారు. చిలుకూరు గుడికి అనువంశిక ధర్మకర్త. రిటైర్ అయిన తర్వాత  అదే దేవాలయంలో ప్రధాన అర్చక వృత్తి స్వీకరించారు. దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండరాదని దశాబ్దాలుగా సాగిస్తున్న ఉద్యమానికి ఆయన వన్ మ్యాన్ ఆర్మీ. 

నేను రేడియోలో పనిచేసే రోజుల్లో ఆయన తరచుగా  మా దగ్గరకు వస్తుండేవారు. అనేక ఆధ్యాత్మిక  విషయాలు చర్చిస్తూ వుండేవారు. 

ఆయన కుమారుడే  సౌందర రాజన్ రంగరాజన్. ఈ వ్యాసానికి స్పూర్తి. 

తండ్రిలాగే ఆయన కూడా విద్యాధికుడు. ఎప్పుడైనా ఆ గుడికి వెళ్ళినప్పుడు తండ్రీ కొడుకులతో మాట్లాడడం నాకు ఓ వ్యాపకంగా మారింది. పెద్ద చదువులు చదివి ఈ వృత్తిని ఎంచుకోవడంలో ఏదైనా కారణం ఉందా అని అడిగినప్పుడు రంగరాజన్ ఎన్నో విషయాలు చెప్పుకుంటూ పోయారు. అవి ఆయన మాటల్లోనే.  

“మా ఇంట్లో ముగ్గురం అబ్బాయిలమే. నేను నడిమివాణ్ణి. నేను చదువుకున్నదంతా క్రైస్తవ మిషనరీ బడుల్లోనే. అక్కడి దేవుని ప్రార్థనా గీతాలు అలవోకగా పాడేవాణ్ణి. టీచర్లు నా చేత సంస్కృత శ్లోకాలు చెప్పించుకుని ఆనందించేవాళ్లు. నుదిటిమీద పెద్దగా నామాలు పెట్టుకునే బడికి  వెళ్లేవాణ్ణి. క్రైస్తవ పాఠశాలలైనాసరే ఈ విషయంలో అక్కడెవరూ నన్ను ఆక్షేపించింది లేదు. ఆ పరమత సహనమే నా వ్యక్తిత్వాన్నితీర్చిదిద్దిందని చెప్పాలి.

“ఇంజినీరింగ్ పూర్తయ్యాక చెన్నైలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. అక్కడ పనిచేస్తున్నంతకాలం చిలుకూరు గుడికి దూరమవుతున్నాననే బాధ పీడిస్తూనే ఉండేది. ఆరేళ్లు గడిచాయి. ఇక ఉండబట్టలేక ఉద్యోగం మానేస్తానని చెప్పాను. దాంతో నాకోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ప్రాంతీయ కార్యాలయం ఒకటి తెరిచారు.

“దక్షిణాది మొత్తానికి నన్ను హెడ్‌గా నియమించారు. 1999 లోనే సంవత్సరానికి పది లక్షల రూపాయల జీతం! 

“అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. 1987లో నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హిందూ దేవాలయాల్లో  వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేసింది.

“నాన్నగారు చట్టరీత్యా పోరాడి సుప్రీంకోర్టు నుంచి కొత్త మార్గదర్శకాలు తెప్పించుకోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. 1995 తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో దేవాదాయశాఖ దీన్ని సొంతం చేసుకోవాలనుకుంది.

“మా గుడిని యాదగిరిగుట్టకి అనుబంధ ఆలయంగా మార్చాలనుకుంది. అప్పుడు నాన్నగారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూపించి వాదించారు. అప్పుడు  ఓ అధికారి ఇలా అన్నారు.

‘సౌందర్‌రాజన్‌గారూ, మీ అబ్బాయిలు ముగ్గురూ ఇంజినీర్లు. వాళ్లు ఇక్కడికొచ్చి అర్చకత్వం ఎలాగూ చేయరు. ఇక దేనికండీ మీకీ వారసత్వపు హక్కుల గురించిన ఆరాటం!’ అన్నారు. ఆ మాటలు నన్ను ఓ కొరడాలా తాకాయి. ఆ రోజే నిర్ణయించుకున్నా, నాన్నగారి వారసత్వాన్ని నేనే ముందుకు తీసుకెళ్లాలని!

“నాకప్పుడు 35 ఏళ్లు. మంచి జీతం, ఇంకా మంచి భవిస్యత్తు వున్న ఉద్యోగం. ప్రేమించి పెళ్ళాడిన భార్య. చీకూ చింతాలేని సంసారం. 

‘ఇంతమంచి ఉద్యోగం వదులుకుని అర్చకత్వం చేస్తారా!’ అని నలుగురూ నవ్వారు. ఎవరేమన్నా, అర్చకుడిగా నా ఆహార్యం మార్చుకుని ఆలయంలోకి అడుగుపెట్టి హారతి పళ్లెం అందుకున్నాను. 

“రోజూ దేవుడికి సమర్పించిన నైవేద్యం మాత్రమే నా ఆహారం. ఆధునిక వస్త్ర ధారణ వదిలేసి అలా మారిపోయిన నన్ను చూసి మా ఆవిడ మొదట్లో వచ్చే కన్నీళ్లని దాచుకునేందుకు విఫలయత్నం చేసేది.

“ఆదాయం లేకపోవడంతో అప్పటిదాకా ప్రైవేటు బడుల్లో చదువుతున్న పిల్లల్ని తెచ్చి కేంద్రీయ విద్యాలయంలో చేర్చాను. 

“అర్చకుడిగా మారిన తొలి రోజుల్లోనే నాన్నగారితో మాట్లాడి ఆలయంలో హుండీని తీసేయించాను. వీఐపీ దర్శనాలూ, టిక్కెట్టు  దర్శనాలు లేకుండా ఆలయానికి వచ్చే భక్తులందరూ సమానమేనని ప్రకటించాను. ఇప్పటికీ అదే తు.చ.తప్పకుండా పాటిస్తున్నాం.

“ఏ ఆదాయమూ లేదు కాబట్టి దేవాదాయ శాఖకి మా ఆలయం మీద ఆజమాయిషీ చలాయించే అవకాశం లేకుండా పోయింది.

“1990కి ముందు మా ఆలయానికి వారం మొత్తం మీద వెయ్యిమంది వస్తే గొప్ప! ఇప్పుడు వారాంతాల్లో నలభై వేల మంది దాకా వస్తున్నారు. గుడికి వచ్చేవారికి సనాతనధర్మం గొప్పతనం గురించి చెబుతుంటాం. సనాతన ధర్మమంటే మూఢాచారాలు, స్త్రీలపట్ల వివక్ష, అంటరానితనాన్ని ప్రోత్సహించడం కానేకాదు. అవన్నీ నడమంత్రంగా వచ్చిన ఆచారాలు మాత్రమే.

“వాటిని పట్టుకుని వేలాడితే హిందూ మతానికే ముప్పు తప్పదు. అసలైన హిందూ ధర్మం మన చుట్టూ ఉన్న ప్రతి జీవినీ ప్రేమించడమే. మన వేదవేదాంగాలసారం అదేనని నేను నమ్ముతా. 

“ఓ దళిత సంఘం నన్నో సమావేశానికి పిలిచి ప్రసంగించాలని చెప్పింది.  దళితులని ఆలయ ప్రవేశం చేయించడం శ్రీవైష్ణవ సంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా ఉందంటూ ‘మునివాహన సేవ’ గురించి చెప్పాను.

(శ్రీరంగం దేవాలయంలో ఓ దళితుడు స్వామి దర్శనం కోసం అల్లాడుతుంటాడు. కానీ అతడికి ప్రవేశం దొరకక పోగా ప్రధాన అర్చకుడు అతడిని గులక రాయితో కొడతాడు. గుడిలోకి వెళ్లి చూస్తే స్వామి విగ్రహం నుదుటి నుంచి రక్తం స్రవిస్తూ వుంటుంది. దానితో పూజారికి జ్ఞానోదయం అవుతుంది. ఆ దళితుడిని తన భుజాల మీదకు ఎత్తుకుని దేవాలయంలోకి తీసుకువెళ్లి స్వామి దర్శనం చేయించి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. ఇలా భుజాలకు ఎత్తుకుని దళితుల చేత దేవాలయ ప్రవేశం చేయించడాన్ని మునివాహన సేవ అంటారు) 

“అప్పుడో సభ్యుడు లేచి ‘మీరయితే ఓ దళితుణ్ని అలా భుజాలపై మోసుకెళ్తారా!’ అని సవాలు విసిరాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. చేసి తీరతాననే చెప్పాను. చెప్పినట్టే చేశాను. ఓరోజు ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే..’ అని పాడుకుంటూ, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆదిత్య అనే  ఒక  హరిజన భక్తుణ్ణి గుడిలోకి మోసుకెళ్లాను.

“ఈ విషయం మీడియాలో రావడంతో, బౌద్ధ గురువు దలైలామా ప్రశంసాపూర్వక లేఖ రాసారు. అభినందనలు అనంతంగా సాగాయి. ఇవన్నీ ఆ బాలాజీ  దయ అని నేను నమ్ముతాను.

“వీటన్నింటి వెనక నా భార్య సుధ ఇచ్చిన నైతిక మద్దతు అంతాఇంతా కాదు. లక్షల రూపాయల జీతం వదులుకుని, అర్చకత్వం స్వీకరించిన  భర్త వెంట నడవాలంటే  గొప్ప మానసిక బలం కావాలి. బాగా చదువుకుని పైకి వచ్చిన నా పిల్లల్లో ఒకరిని బాలాజీ సేవకే అప్పగించాలని నేను తీసుకున్న నిర్ణయానికి కూడా అంగీకారం తెలిపింది”

ఇదీ ఒక అర్చకుని కధ. ఆచరించాల్సిన అంశాలతో కూడిన జీవనగాధ.





హీరో కృష్ణ ఇక లేరు - భండారు శ్రీనివాసరావు

 

ఈ సినిమా ఆడదు. రెండోవారం ఎత్తేస్తారు’

ఈ మాట అన్నది సూపర్ స్టార్ కృష్ణ.

అప్పట్లో అంటే సుమారు యాభయ్ ఏళ్ళ క్రితం, విజయవాడలో తన చిత్రం (పేరు గుర్తురావడం లేదు) రిలీజ్ కోసం వచ్చి మనోరమా హోటల్లో బస చేశారు. ఆ రోజుల్లో అదే నెంబర్ వన్ హోటల్. జ్యోతి విలేకరిగా వెళ్లి కలుసుకున్నాం. వున్నది కాసేపే అయినా ఆ కొద్ది సేపట్లో ఆయన లెక్క పెట్టలేనన్ని సిగరెట్లు తాగడం చూసి నేను విస్తుపోయాను.

ఆడే సినిమా కాదు అని కృష్ణ కామెంటు చేసింది తను హీరోగా నటించిన ఆ చిత్రం మీదనే. అదే విచిత్రం.

మా ప్రసాదం బాబాయి గుర్తుకు వచ్చాడు.

చిన్నప్పుడు మా వూళ్ళో కొత్త వడ్లు రాశులుగా కళ్ళాల్లో ఉన్నప్పుడే చూసి ‘ఇది ఇన్ని పుట్ల ధాన్యం’ అని ఉజ్జాయింపుగా చెప్పేవాడు. కొలిచి చూస్తే ఆయన మాటే నిజం అయ్యేది.

అలాగే ఏ సినిమా ఆడుతుందో, ఏ సినిమా డబ్బాలు వెనక్కి పోతాయో స్వపర బేధం లేకుండా చెప్పడంలో నటుడు కృష్ణ అందెవేసిన చేయి అని సినిమా వర్గాల్లో చెప్పుకునే వారు.

సినిమా రంగంలో లేనిది మంచితనం అంటారు. చీకట్లో చిరుదీపంలా ఇన్నాళ్ళు కృష్ణ గారు ఆ లోటు తీరుస్తూ వచ్చారు. ఈరోజు ఆయన మృతితో అది కూడా కొడిగట్టిపోయింది.



(15-11-2022)

 

30, అక్టోబర్ 2022, ఆదివారం

కహా గయే ఓ దిన్

(Published in ANDHRA PRABHA, on  30-10-2022, SUNDAY, Today)

మా తాతగారి కాలంనాటికి మా వూళ్లో కరెంటు లేదు. ఆముదపు దీపాలు మినహా,  కరెంట్‌ బల్బ్ ని కూడా చూడకుండానే ఆయన కాలం చేశారు.

మా నాన్నగారి కాలం వచ్చేసరికి కరెంట్‌ రాలేదు కానీ,  రేడియోలు, గ్రామఫోన్లూ ఉండేవి. కాకపోతే ఆ రేడియోలు, మోటారుకార్లలో వాడే పెద్దసైజు బ్యాటరీల సాయంతో పనిచేసేవి.

మావూరి మొత్తం జనాభాలో, యాభయి మైళ్ల దూరంలో వున్న బెజవాడకి వెళ్లి, సినిమా చూసొచ్చిన పెద్దమనిషి ఆయన ఒక్కరే. ఆ మాటకి వస్తే ఆయన తప్ప, రైలుని చూసిన వాళ్ళు కానీ, బస్సు ఎక్కిన వాళ్ళు కానీ మా వూళ్లో ఎవరూ లేరని కూడా చెప్పుకునే వారు.

ఇక మా అమ్మ,

పొగచూరిన వంటింట్లో, కట్టెల పొయ్యి ముందు కూర్చుని, ఒంటిచేత్తో  పదిమందికి వండి వార్చేది. ఆమె సామ్రాజ్యంలో రకరకాల పొయ్యిలు ఉండేవి. పాలు కాగబెట్టడానికి దాలిగుంట,  కాఫీ కాచుకోవడానికి బొగ్గులకుంపటి, వంట చేయడానికి మూడు రాళ్ల పొయ్యి, ఇలా దేనికి దానికి విడివిడిగా ఉండేవి. ఇక పెరట్లో బావి ప్రక్కన స్నానాలకోసం కాగులో నీళ్ళు మరగపెట్టడానికి మరో పెద్ద పొయ్యి సరేసరి. దాలిగుంట విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వంటింటి వసారాలోనే ఓ మూలగా ఉండేది. నిప్పంటించిన పిడకలను ఆ దాలిగుంటలో దొంతరగా వేసి, పాలకుండని వాటిపై ఉంచి,  పైన ఒక రాతిపలకని దాలిగుంటకు మూతలా కప్పేవారు. సన్నటి సెగపై ఆ పాలు తీరిగ్గా కాగేవి. ఎరగ్రా కాగిన ఆ పాలపై  అరచేతి మందాన మీగడ కట్టేది.  మర్నాడు  ఆ కుండలోని పెరుగుని నిలబడి వయ్యారంగా కవ్వంతో చిలికేవారు. మజ్జిగ నీటిపై తెట్టెలా కట్టిన తెల్లటి వెన్నని చేతుల్లోకి తీసుకుని, అరచేతిలో ఎగురవేస్తూ ముద్దగా చేసేవారు. పక్కన నిలబడి ఆశగా చూసే చిన్న పిల్లలకి చిన్న చిన్న వెన్న ముద్దలు పెట్టేవాళ్ళు. ఆహా ఏమి రుచి! అని లొట్టలు వేస్తూ తినేసి ఆటల్లోకి జారుకునే వారు. మగవాళ్ల సంగతేమో కానీ, ఆడవాళ్లకి ఆ రోజుల్లో చేతినిండా పనే. భోజనాలు కాగానే,  అంట్లగిన్నెలు సర్దేసి,  వంటిల్లు ఆవు పేడతో అలికేవారు. బాదం ఆకులతో విస్తళ్ళు కుట్టేవారు. రోకళ్లతో వడ్లు దంచేవారు. ఇంటికి దక్షిణాన ఉన్న రోటిపై కూర్చుని పప్పు రుబ్బేవారు. ఈ పనులు చేయడానికి విడిగా పనిమనుషులు ఉన్నా వారితో కలిసి ఈ పనులన్నీ చేసేవారు. శ్రమతెలియకుండా పాటలు పాడుతుండేవాళ్ళు. విలువ కట్టని వారి శ్రమా, విలువ కోరని వారి నిబద్ధతా చిన్న నాటి జ్ఞాపకాల దొంతర్లలో పదిలంగా ఉండిపోయాయి.

ఇక మా రోజులు వచ్చే సరికి,  రోజులు పూర్తిగా మారిపోయాయి. కట్టెల పొయ్యిలు పోయి  గ్యాస్‌ స్టవ్‌లు వచ్చాయి. నీళ్ల కాగుల్ని బాయిలర్లు భర్తీ చేశాయి. కరెంట్‌ దీపాలు వచ్చి లాంతర్లని వెనక్కి నెట్టేశాయి. కరక్కాయ సిరాలు,  పుల్ల కలాలు తరువాతి రోజుల్లో రూపాలు మార్చుకుని ఫౌంటెన్‌ పెన్నులుగా, బాల్‌పాయింట్‌ పెన్నులుగా అవతరించాయి. రూపాయికి పదహారణాలు అనే లెక్క కాస్తా మా చిన్నతనంలోనే నూరు నయాపైసలుగా మారిపోయింది. బేడలూ, అర్ధణాలూ, కానులూ, చిల్లికానులూ జేబుల్లోంచి జారిపోయి నిగనిగలాడే రాగి నయా పైసలు, నికెల్‌ నాణేలు చెలామణిలోకి వచ్చాయి. రామాయణ కాలంనుంచీ ఎరిగిన ఆమడలు, కోసులు, మైళ్ళు కాలగర్భంలో కలిసిపోయి, కిలోమీటర్‌ రాళ్ళు రోడ్లపై వెలిసాయి. ఏడాదికోమారు జరిగే తిరుణాళ్లు నిత్యకృత్యంగా మారి, అశ్లీల నృత్యాల వేదికలుగా మారిపోయాయి. కోలాటాలు, పందిరి నాటకాలు, హరికథలు, బురక్రథలు, పిట్టలదొర కథలు చరిత్రపుటల్లో చేరి కనుమరుగవుతున్నాయి.

ఆ రోజుల్లో సెలవులు ఇస్తే చాలు,  పిల్లలంతా పల్లెటూళ్లకి పరిగెత్తే వాళ్ళు. ఇన్ని రకాల ఆటలుంటాయా అనేట్టు అనేక రకాల ఆటలతో, పాటలతో కాలం గిర్రున తిరిగిపోయేది. అష్టాచెమ్మాలు, తొక్కుడు బిళ్లలు, వామన గుంటలు, వెన్నెలముద్దలు, వైకుంఠపాళీలు, పచ్చీసాటలు, చింతపిక్కలు, బావుల్లో ఈతలు, వాగు ఒడ్డున కబడ్డీ పోటీలు, ఒకటేమిటి, ఒక జీవితానికి సరిపడా ఆనందాన్ని గుండెల్లో నింపేసుకుని, ఇంకా ఇంకా ఇలాగే రోజుల్ని సరదాగా గడపాలన్న కోరికని మనసులోనే చంపేసుకుని, పాడు సెలవులు అప్పుడే అయిపోయాయా అని నిట్టూరుస్తూ బడిబాట పట్టేవాళ్ళు.

ఇక మా పిల్లల కాలం వచ్చేసరికి,  మాయాబజారు సినిమాలో మాదిరిగా, కళ్లముందు ప్రపంచం ఒక్క మారుగా మారిపోయింది. గతం తలచుకోవడానికే మిగిలింది. చిన్నతనంలో చూసినవేవీ, ఈనాడు కలికానికి కూడా కానరావడం లేదు. జీవితం, ఇంత చిన్నదా అనిపించేలా, విన్న పదాలు, చూసిన దృశ్యాలు, ఆడిన ఆటలు, పాడిన పాటలు కనురెప్పలకిందే కరిగిపోతున్నాయి. జ్ఞాపకాల పొరల్లోకి జారిపోతున్నాయి.

ఆ గురుతుల దారుల్లో వెనక్కి వెడుతుంటే,  జొన్న చేల నడుమ కాలిబాటలో పరుచుకున్న దోసతీగెలూ, లేత జొన్న కంకుల్ని వొడుపుగా కొట్టి తీసి వేయించిన ఊచ బియ్యం,

రోజూ తినే వరి అన్నానికి  ఎప్పుడో ఒకప్పుడు సెలవిచ్చేసి,  పని వాళ్ళు వండిన జొన్నన్నంతో కూడిన మృష్టాన్న భోజనం, వరికళ్లాల సమయంలో  కొత్త వడ్లు కొలిచి, కొనుక్కుతినే కట్టె మిఠాయి, సాయంత్రం చీకటి పడేవేళకు,  మైకులో ఊరంతా వినవచ్చే పంచాయితీ రేడియోలో సినిమా పాటలు, వెన్నెల్లో ఆరుబయట నులకమంచాలపై పడుకుని ఊ కొడుతూ వినే అమ్మమ్మ కథలూ,

ఏవీ ! అవేవీ! ఎక్కడా కనబడవేం! ఇవన్నీ ఒకనాడు వున్నాయని అన్నా,  కంప్యూటర్లతో ఒంటరిగా ఆడుకునే ఈనాటి పిల్లలు నమ్ముతారా? కళ్లతో చూసిందే నమ్ముతాం అని వాళ్లంటే మీరేం చేస్తారు?




28, అక్టోబర్ 2022, శుక్రవారం

మనసు పలికే పలుకు – భండారు శ్రీనివాసరావు

 

“నిజమని తెలిసినా నిర్ధారణ చేసుకునే వార్త ఇవ్వాలి” అనేది రేడియోలో బోధించిన మొదటి పాఠం.

ఇంగువకట్టిన గుడ్డకు వాసన ఎలా పోతుంది. అంచేత ఈరోజు  అధికారికంగా సర్కారు వారి నుంచి సమాచారం అందుకున్న తర్వాతనే ఈ పోస్టు పెడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మగారి పనుపున  ప్రిన్సిపల్ సెక్రెటరీ ముత్యాల రాజు గారు ఒక మనిషికి ఇచ్చి ఈరోజు ఒక లేఖను హైదరాబాదులోని మా ఇంటికి పంపారు.

నవంబరు ఒకటో తేదీన విజయవాడ లబ్బీపేటలోని  ‘A’ CONVENTION హాలులో జరిగే కార్యక్రమంలో గవర్నర్, ముఖ్యమంత్రుల సమక్షంలో మీడియా రంగంలో జీవిత సాఫల్య పురస్కారం నాకు అందచేస్తున్నట్టు  ఆహ్వానంతో కూడిన సమాచారం అందులో వుంది.

ఈ విషయం మీలో చాలామందికి ఈపాటికే తెలిసి వుంటుంది. అనేక మంది శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే నేరుగా  ఈ విషయాన్ని  తెలియపర్చక  పోవడం  పొరబాటే. ఒప్పుకుంటున్నాను.  ఇదే అవార్డు వచ్చిన మరో ముగ్గురు సీనియర్ జర్నలిస్టులు శ్రీయుతులు సతీష్ చందర్, మంగు  రాజగోపాల్, ప్రసాదరెడ్డి  గారలు  ఏ కోణంలోనుంచి చూసినా నాకంటే గొప్ప అనుభవం వున్న జర్నలిస్టులు. ఒక్క వయసులో తప్ప, వారితో పోలిస్తే నేను ఏ విషయంలో అధికుడిని కాను. వారికి నా అభినందన మందారమాల.

నన్నూ, నా పేరును సమాజానికి తెలియచేయడంలో తోడ్పడిన మన ఎమ్మెల్యే వారపత్రిక,  ఆంధ్రజ్యోతి, సూర్య, ఆంధ్రప్రభ, సాక్షి మొదలైన పత్రికలు, ఆకాశవాణి,  అన్ని తెలుగు న్యూస్ ఛానళ్లకు, అనేక వెబ్ ఛానళ్లకు,  ఫేస్ బుక్ వంటి మాధ్యమాలకు, ప్రత్యేకించి ఈ మాధ్యమంలో నన్ను అభిమానిస్తూ ప్రోత్సాహించిన మితృలకు, పెద్దలకు, మా కుటుంబ సభ్యులకు, బంధుమితృలకు ధన్యవాదాలు, నమోవాకాలు.

నన్ను ఎలా చూడాలని అనుకుందో ఆ క్షణం నా జీవితంలో తొలిసారి, ఆఖరిసారి వచ్చినప్పుడు నా తోడు వదిలి వెళ్ళిపోయిన నా భార్య నిర్మలకు, ఈ జీవిత సాఫల్య పురస్కారాన్ని నిండు మనసుతో అర్పిస్తున్నాను.  


 

(29-10-2022)  

23, అక్టోబర్ 2022, ఆదివారం

కట్టుబట్టలతో బయట పడ్డాం

 

కట్టుబట్టలతో

బయట పడడం అనేది కొద్దిసేపటి క్రితం అనుభవంలోకి వచ్చింది.

ఏడున్నర ప్రాంతంలో మనుమరాలితో ఆడుకుంటూ వుంటే కోడలు వచ్చి, పాపా జీవికను కిందికి తీసుకువెళ్లి ఒకటి రెండు మతాబాలు కాల్చి తీసుకువస్తాను అంది. నేనిక్కడ వుండి  చేసేదేమిటి నేనూ వస్తాను పదండి అంటూ లేచాను. నేను ఇంటి  కీ పట్టుకు వస్తాను మీరు వెళ్ళండి అని ద్రాయరులో వున్న  ఇంటి తాళం తీసుకుని నేనూ వారి వెంటనే కిందికి వెళ్ళాను. అప్పటికే ఒకటి రెండు చిచ్చు బుడ్ల వంటివి వాళ్ళు కాలుస్తున్నారు.  ఒక కాకర పువ్వొత్తి నాచేత కాల్పించారు. అందరం కలిసి పైకి వచ్చాము. తలుపు తెరవడానికి చూస్తే జేబులో తాళం చెవి లేదు. జేబులో వేస్తున్నప్పుడు  కింద పడివుంటుంది, నేను గమనించలేదు. నా దగ్గర వుందని చెప్పాను కనుక వాళ్ళూ తీసుకురాలేదు. అదేమో సెవెన్ లీవర్స్ గోద్రెజ్ లాక్. ఆ ఆటోమేటిక్  లాక్ పడితే ఇంతే సంగతులు. కొడుకూ కోడలు కారేసుకుని అమీర్ పేటలో చాబీవాలాలను వెతుకుతూ వెళ్ళారు. నేను పసిదానిని పెట్టుకుని ఇంట్లోనే, ఇంటి బయట  వుండిపోయాను.

తాళాలు తీసే వాడు ఈ రాత్రి దొరక్కపోతే అనే ఆలోచన చిన్నగా మొదలై కొద్దిసేపటిలో పెను భూతంగా మారింది.

పసిదానికి ఫీడింగ్ టైం అయితే ఏం చేయాలి? పెద్ద వాళ్ళ తిండీ తిప్పలు అంటే జొమాటో కాకపోతే మరోటో వున్నాయి. ఉన్నపాటున బయటకు వచ్చాము కాబట్టి పర్సులు, బ్యాంక్ కార్డులు లేవు. ఒక వేళ వున్నా,  ఈ ఆకారాల్లో వెడితే ఏ హోటల్ వాడు రూము కూడా ఇవ్వడు.  తెల్లవారితే మాకు దీపావళి హారతులు ఇవ్వడానికి మా అన్నయ్య పిల్లలు వస్తారు.

బాణాసంచా కాల్చడానికి కిందికి వెళ్ళాము కనుక ఫోటోలు తీయడానికి సెల్ ఫోన్లు మాత్రం చేతిలో వున్నాయి.

ఈ లోపల కోడలు ఫోన్ చేసింది. అమీర్ పేట లో వెతగ్గా వెతగ్గా ఓ షాపు దొరికింది. కానీ బాగుచేసేవాడు ఇంటికి వెళ్లి పోయాడు. అతడికి ఇలాంటి లాక్స్ తీయడంలో మంచి ప్రవేశం వుందని చెబుతూ అతడి నెంబరు ఇచ్చాడు షాపులోని వాడు. ఫోన్ చేస్తే అతడు అత్తాపూర్ లో ఉన్నాడని తెలిసింది. ఇప్పుడే ఇంటికి వచ్చాను మళ్ళీ అంత దూరం రాలేను అన్నాడు అతడు. అప్పుడు మా కోడలు ఫోన్ తీసుకుని చెప్పింది. చూడు భయ్యా. మాకు ఎనిమిది నెలల పాప, దాదాపు ఎనభయ్ ఏళ్ళ మామయ్య వున్నారు. ఈ రాత్రి చాలా కష్టం అవుతుంది. నీ కష్టం మేము వుంచుకోము, దయచేసి రమ్మని అడిగితె అతడు మెత్తబడి నేను వచ్చేసరికి గంట, గంటన్నర అవుతుంది, వెయిట్ చేయండి  అన్నాడు. ఈ లోపల మా అపార్ట్ మెంటు ఇరుగూ  పొరుగూ వచ్చి విషయం తెలుసుకుని  ధైర్యం చెప్పారు. ఏమీ పర్వాలేదు ఒకవేళ అవసరం అయితే మా ఇళ్ళల్లో వుండండి, సర్డుకుందాం అని భరోసా ఇచ్చారు. ఒకావిడ వెళ్లి మా మనుమరాలికి అరటి పండు మెత్తగా గుజ్జు చేసి ఇచ్చింది. ఒకళ్ళు చపాతీలు తెచ్చారు. మరొక ఇంటివారు పులిహోర తెచ్చారు.

ఈలోగా చాబీవాలా వచ్చాడు దేవుడిలా.

ఏం మంత్రం వేశాడో తెలియదు, చిన్న చేతి రంపం తీసుకుని తన దగ్గర వున్న తాళం చేతుల్లో  ఒకదాన్ని చిత్రిక పట్టాడు. పదే పది నిమిషాల్లో కొత్త తాళం చెవి తయారుచేసి తలుపు తెరిచాడు.

పది గంటలకి ఇంకా పది నిమిషాలు ఉందనగా మళ్ళీ కొడుకు, కోడలు, మనుమరాలితో కలిసి పునః గృహ ప్రవేశం చేశాను.

అంత దూరం నుంచి వచ్చిన ఆ చాబీవాలా మేము ఇస్తామన్న డబ్బు తీసుకోకుండా, తను తయారు చేసిన తాళం చెవిని మాకే ఇచ్చేసి  తన కూలీ మాత్రం తీసుకుని వెళ్ళిపోయాడు.

లోకంలో మంచి మనుషులు ఇంకా మిగిలే వున్నారు.   



23-10-2022

డబ్బు కావాలా? దరిద్రం పోవాలా? – భండారు శ్రీనివాసరావు

 (Published in Andhra Prabha on 23-10- 2022, SUNDAY, today)

పాత కాలపు తెలుగు నాటకాల్లో కాబూలీవాలా పాత్ర గుర్తుండే వుండాలి.  ఆ నాటకాల ప్రభావం కావచ్చు, కాబూలీవాలా అనే పేరు వినగానే  వడ్డీకి డబ్బులు అప్పులిచ్చి అసలు ఫాయిదాలను ముక్కుపిండి మరీ వసూలు చేసే ‘రౌడీ’రూపం కళ్ళల్లో మెదిలేది. అయితే ఒక్క వడ్డీ వసూళ్ళ విషయంలో తప్ప, కాబూలీవాలాలు చాలా మంచివాళ్ళన్న మంచి పేరు వారికి వుండేది. కాలక్రమంలో కాబూలీవాలాల శకం అంతరించి అప్పులిచ్చే మహారాజులు ఒకళ్ళయితే,  వాటిని గోళ్ళూడగొట్టి వసూలుచేసే వసూలు రాజాల పాత్రను  స్థానిక గూండాలు  పోషించడం మొదలు పెట్టారు. ఇక కార్పొరేట్ సంస్కృతి వూడలు దిగిన తరువాత ప్రైవేట్  బ్యాంకుల వాళ్ళు ఈ వసూలు రాజాలను మంచి ఆకర్షణీయమైన వేతనాలు, అలవెన్సులు ఇచ్చి పెంచి పోషిస్తూ రావడం ఇటీవలి కాలంలో ఆనవాయితీగా మారిపోయింది.

అసలు అప్పులు ఇవ్వడం వాటిని వసూలు చేసే క్రమంలో అనేక అవస్థలు పెట్టడం అనేది పురాణ కాలం నుంచి వింటున్న కధే. ఈ విషయంలో సత్య హరిశ్చంద్రుడు పడ్డ బాధలు అన్నీఇన్నీ కావు. ఎన్ని కష్టాలు పడ్డా చివరికి కధ సుఖాంతం అయ్యింది కాబట్టి పరవాలేదు.

యుగాలు మారినా మారని ఈ విషసంస్కృతి,  కాలక్రమంలో  బాగా ముదిరిపోయి, వూడలు దించుకుంటూ  రూపాలు మార్చుకుంటూ,  పేర్లు మార్చుకుంటూ  చివరకు తాజాగా  ‘మనీ యాప్ లు’  అనే నూతన నామం సంతరించుకుని   పేద, మధ్య తరగతి  ప్రజల ధన,మాన, ప్రాణాలతో ఆటాడుకునే అత్యంత హైన్య స్థితికి దిగజారి పోయింది. సరే! ఈ మనీ యాప్ ల కంటే ముందే కాల్ మనీ పేరుతొ  విచ్చల విడిగా సాగిన వ్యాపారపు ఉచ్చులో చిక్కుకుని అనేక నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి.  

మంచి విలువలతో కూడిన సమాజాలు విలసిల్లిన కాలంలో కూడా విలువలకు విలువ ఇవ్వని మనుషులు వుండేవాళ్ళు. మానవ సమూహాలు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా మంచి చెడుల సమ్మిశ్రితాలే. మంచి చెడుల నిష్పత్తి మాత్రమే  ఆ సమాజపు గుణగణాలను  అంతిమంగా నిర్ణయిస్తుంది.

అప్పు ఇవ్వడం, ఇచ్చిన అప్పుకు వడ్డీ వసూలు చేయడం అనేది అనాదిగా సమాజం అంగీకరించిన వ్యవహారమే. మా చిన్నతనంలో కూడా ఊళ్ళల్లో అప్పులు ఇచ్చే ఆసాములు వుండేవాళ్ళు. నగలు, వస్తువులు తాకట్టు పెట్టుకుని అవసరంలో వున్న  బీదాబిక్కీకి అప్పులిచ్చేవాళ్ళు. కొందరు ధర్మ ప్రభువులు ధర్మవడ్డీ  వసూలు చేస్తే, మరికొందరు అధిక వడ్డీలతో బాకీదారుల్ని పీల్చి పిప్పి చేసేవాళ్ళు. వర్తమాన కాలంలో కొన్ని ప్రైవేటు బ్యాంకులు కూడా అప్పుల వసూళ్ళ కోసం  గూండాల మాదిరిగా వ్యవహరించే సిబ్బందిని నియమించుకుంటున్న విషయం బహిరంగ రహస్యమే. 

ముందే చెప్పుకున్నట్టు అప్పులు, వడ్డీలు అనేవి చట్ట వ్యతిరేకం కావు. దేశాలు సయితం ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకుంటాయి, వడ్డీ చెల్లిస్తాయి. బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు నుంచి రుణాలు  తీసుకుంటాయి. ఐతే ఇవన్నీ చట్టం లేదా నిబంధనల పరిధిలో జరుగుతాయి. గ్రామీణ బ్యాంకుల ఆవిర్భావానికి పూర్వం, ఊళ్ళల్లో జనం తమ  రుణ అవసరాలకోసం స్థానిక వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడేవాళ్ళు. క్రమేణా, నోటి మాట మీద అప్పులిచ్చే రోజులు పోయి ప్రామిసరీ నోటు మీద సంతకం చేయించుకునో, వేలిముద్ర వేయించుకునో అప్పులిచ్చే కాలం  వచ్చింది. గతంలో కోర్టుల్లో చాలా కేసులు వీటికి సంబంధించినవే ఉండేవి. గ్రామీణ బ్యాంకులు రంగప్రవేశం చేసిన తరువాత చాలా చోట్ల వడ్డీ వ్యాపారుల ఆగడాలకు కళ్ళెం పడింది. అలా అని వారి పీడ పూర్తిగా విరగడ అయిపోయిందని చెప్పడానికి వీలులేదు. ఎందుకంటె మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల అవసరాలు పెరిగిపోతున్నాయి, మారిపోతున్నాయి. లోగడ ప్రాణం మీదకు వచ్చిన సందర్భాల్లో అప్పులు చేస్తే ఇప్పుడు ఆడంబరాలకోసం అప్పులు చేస్తూ వుండడం రివాజుగా మారిపోయింది. 

నిజానికి ఇలాంటి దందాలతో పెద్ద పెద్ద వారికి ప్రత్యక్ష ప్రమేయం ఉంటుందని అనుకోలేము. ఐతే వారి అండాదండా  తమకున్నదని చెప్పుకుంటూ , అలా నమ్మించే ఏర్పాట్లు చేసుకుంటూ ఇలాటి అక్రమ వ్యవహారాలకు తెర తీస్తూ తమ పబ్బం గడుపుకుంటూ వుండడం రివాజుగా మారింది. ఈ స్థాయిలో ‘నేర ప్రవృత్తి’ రెక్కలు విప్పుకుంటున్నదంటే, పెద్ద తలకాయల ప్రమేయం అంతో ఇంతో లేకుండా, పోలీసుల దన్ను లేకుండా ఈవిధమైన తంతు సాగించడం అసాధ్యం అని నమ్మేవాళ్ళూ వున్నారు. అందుకనే పాలకపక్షానికి ఇది కొంత ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పక తప్పదు. అవసరాలకు కాకుండా ఆడంబరాలకోసం అప్పులు చేసే  మనస్తత్వం జనాల్లో పెరగడం కూడా మరో కారణం.  

ఉపశృతి: మా పెద్దన్నయ్య, కీర్తిశేషులు  భండారు పర్వతాలరావు చాలా సంవత్సరాలక్రితం ఒక వ్యాసం రాసారు. “డబ్బు కావాలా? దరిద్రం పోవాలా” అనేది దాని శీర్షిక.

ఒకానొక గర్భ దరిద్రుడు దేవునిగూర్చి గొప్ప తపస్సు చేస్తాడు.

ఆయన ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. భక్తుడు తన పరిస్తితి చెబుతాడు.

దేవుడప్పుడు చిరునవ్వు నవ్వి, ‘’డబ్బు కావాలా ? దరిద్రం పోవాలా ?’ అని అడుగుతాడు.

దాంతో భక్తుడికి కళ్ళు తెరిపిళ్ళు  పడతాయి.

దరిద్రం అంటే డబ్బు లేకపోవడం కాదు, డబ్బున్న దరిద్రులు కూడా లోకంలో చాలామంది వున్నారు. వాళ్ళకంటే తానే మిన్న అని భక్తుడు తెలుసుకుంటాడు.