23, అక్టోబర్ 2022, ఆదివారం

కట్టుబట్టలతో బయట పడ్డాం

 

కట్టుబట్టలతో

బయట పడడం అనేది కొద్దిసేపటి క్రితం అనుభవంలోకి వచ్చింది.

ఏడున్నర ప్రాంతంలో మనుమరాలితో ఆడుకుంటూ వుంటే కోడలు వచ్చి, పాపా జీవికను కిందికి తీసుకువెళ్లి ఒకటి రెండు మతాబాలు కాల్చి తీసుకువస్తాను అంది. నేనిక్కడ వుండి  చేసేదేమిటి నేనూ వస్తాను పదండి అంటూ లేచాను. నేను ఇంటి  కీ పట్టుకు వస్తాను మీరు వెళ్ళండి అని ద్రాయరులో వున్న  ఇంటి తాళం తీసుకుని నేనూ వారి వెంటనే కిందికి వెళ్ళాను. అప్పటికే ఒకటి రెండు చిచ్చు బుడ్ల వంటివి వాళ్ళు కాలుస్తున్నారు.  ఒక కాకర పువ్వొత్తి నాచేత కాల్పించారు. అందరం కలిసి పైకి వచ్చాము. తలుపు తెరవడానికి చూస్తే జేబులో తాళం చెవి లేదు. జేబులో వేస్తున్నప్పుడు  కింద పడివుంటుంది, నేను గమనించలేదు. నా దగ్గర వుందని చెప్పాను కనుక వాళ్ళూ తీసుకురాలేదు. అదేమో సెవెన్ లీవర్స్ గోద్రెజ్ లాక్. ఆ ఆటోమేటిక్  లాక్ పడితే ఇంతే సంగతులు. కొడుకూ కోడలు కారేసుకుని అమీర్ పేటలో చాబీవాలాలను వెతుకుతూ వెళ్ళారు. నేను పసిదానిని పెట్టుకుని ఇంట్లోనే, ఇంటి బయట  వుండిపోయాను.

తాళాలు తీసే వాడు ఈ రాత్రి దొరక్కపోతే అనే ఆలోచన చిన్నగా మొదలై కొద్దిసేపటిలో పెను భూతంగా మారింది.

పసిదానికి ఫీడింగ్ టైం అయితే ఏం చేయాలి? పెద్ద వాళ్ళ తిండీ తిప్పలు అంటే జొమాటో కాకపోతే మరోటో వున్నాయి. ఉన్నపాటున బయటకు వచ్చాము కాబట్టి పర్సులు, బ్యాంక్ కార్డులు లేవు. ఒక వేళ వున్నా,  ఈ ఆకారాల్లో వెడితే ఏ హోటల్ వాడు రూము కూడా ఇవ్వడు.  తెల్లవారితే మాకు దీపావళి హారతులు ఇవ్వడానికి మా అన్నయ్య పిల్లలు వస్తారు.

బాణాసంచా కాల్చడానికి కిందికి వెళ్ళాము కనుక ఫోటోలు తీయడానికి సెల్ ఫోన్లు మాత్రం చేతిలో వున్నాయి.

ఈ లోపల కోడలు ఫోన్ చేసింది. అమీర్ పేట లో వెతగ్గా వెతగ్గా ఓ షాపు దొరికింది. కానీ బాగుచేసేవాడు ఇంటికి వెళ్లి పోయాడు. అతడికి ఇలాంటి లాక్స్ తీయడంలో మంచి ప్రవేశం వుందని చెబుతూ అతడి నెంబరు ఇచ్చాడు షాపులోని వాడు. ఫోన్ చేస్తే అతడు అత్తాపూర్ లో ఉన్నాడని తెలిసింది. ఇప్పుడే ఇంటికి వచ్చాను మళ్ళీ అంత దూరం రాలేను అన్నాడు అతడు. అప్పుడు మా కోడలు ఫోన్ తీసుకుని చెప్పింది. చూడు భయ్యా. మాకు ఎనిమిది నెలల పాప, దాదాపు ఎనభయ్ ఏళ్ళ మామయ్య వున్నారు. ఈ రాత్రి చాలా కష్టం అవుతుంది. నీ కష్టం మేము వుంచుకోము, దయచేసి రమ్మని అడిగితె అతడు మెత్తబడి నేను వచ్చేసరికి గంట, గంటన్నర అవుతుంది, వెయిట్ చేయండి  అన్నాడు. ఈ లోపల మా అపార్ట్ మెంటు ఇరుగూ  పొరుగూ వచ్చి విషయం తెలుసుకుని  ధైర్యం చెప్పారు. ఏమీ పర్వాలేదు ఒకవేళ అవసరం అయితే మా ఇళ్ళల్లో వుండండి, సర్డుకుందాం అని భరోసా ఇచ్చారు. ఒకావిడ వెళ్లి మా మనుమరాలికి అరటి పండు మెత్తగా గుజ్జు చేసి ఇచ్చింది. ఒకళ్ళు చపాతీలు తెచ్చారు. మరొక ఇంటివారు పులిహోర తెచ్చారు.

ఈలోగా చాబీవాలా వచ్చాడు దేవుడిలా.

ఏం మంత్రం వేశాడో తెలియదు, చిన్న చేతి రంపం తీసుకుని తన దగ్గర వున్న తాళం చేతుల్లో  ఒకదాన్ని చిత్రిక పట్టాడు. పదే పది నిమిషాల్లో కొత్త తాళం చెవి తయారుచేసి తలుపు తెరిచాడు.

పది గంటలకి ఇంకా పది నిమిషాలు ఉందనగా మళ్ళీ కొడుకు, కోడలు, మనుమరాలితో కలిసి పునః గృహ ప్రవేశం చేశాను.

అంత దూరం నుంచి వచ్చిన ఆ చాబీవాలా మేము ఇస్తామన్న డబ్బు తీసుకోకుండా, తను తయారు చేసిన తాళం చెవిని మాకే ఇచ్చేసి  తన కూలీ మాత్రం తీసుకుని వెళ్ళిపోయాడు.

లోకంలో మంచి మనుషులు ఇంకా మిగిలే వున్నారు.   



23-10-2022

డబ్బు కావాలా? దరిద్రం పోవాలా? – భండారు శ్రీనివాసరావు

 (Published in Andhra Prabha on 23-10- 2022, SUNDAY, today)

పాత కాలపు తెలుగు నాటకాల్లో కాబూలీవాలా పాత్ర గుర్తుండే వుండాలి.  ఆ నాటకాల ప్రభావం కావచ్చు, కాబూలీవాలా అనే పేరు వినగానే  వడ్డీకి డబ్బులు అప్పులిచ్చి అసలు ఫాయిదాలను ముక్కుపిండి మరీ వసూలు చేసే ‘రౌడీ’రూపం కళ్ళల్లో మెదిలేది. అయితే ఒక్క వడ్డీ వసూళ్ళ విషయంలో తప్ప, కాబూలీవాలాలు చాలా మంచివాళ్ళన్న మంచి పేరు వారికి వుండేది. కాలక్రమంలో కాబూలీవాలాల శకం అంతరించి అప్పులిచ్చే మహారాజులు ఒకళ్ళయితే,  వాటిని గోళ్ళూడగొట్టి వసూలుచేసే వసూలు రాజాల పాత్రను  స్థానిక గూండాలు  పోషించడం మొదలు పెట్టారు. ఇక కార్పొరేట్ సంస్కృతి వూడలు దిగిన తరువాత ప్రైవేట్  బ్యాంకుల వాళ్ళు ఈ వసూలు రాజాలను మంచి ఆకర్షణీయమైన వేతనాలు, అలవెన్సులు ఇచ్చి పెంచి పోషిస్తూ రావడం ఇటీవలి కాలంలో ఆనవాయితీగా మారిపోయింది.

అసలు అప్పులు ఇవ్వడం వాటిని వసూలు చేసే క్రమంలో అనేక అవస్థలు పెట్టడం అనేది పురాణ కాలం నుంచి వింటున్న కధే. ఈ విషయంలో సత్య హరిశ్చంద్రుడు పడ్డ బాధలు అన్నీఇన్నీ కావు. ఎన్ని కష్టాలు పడ్డా చివరికి కధ సుఖాంతం అయ్యింది కాబట్టి పరవాలేదు.

యుగాలు మారినా మారని ఈ విషసంస్కృతి,  కాలక్రమంలో  బాగా ముదిరిపోయి, వూడలు దించుకుంటూ  రూపాలు మార్చుకుంటూ,  పేర్లు మార్చుకుంటూ  చివరకు తాజాగా  ‘మనీ యాప్ లు’  అనే నూతన నామం సంతరించుకుని   పేద, మధ్య తరగతి  ప్రజల ధన,మాన, ప్రాణాలతో ఆటాడుకునే అత్యంత హైన్య స్థితికి దిగజారి పోయింది. సరే! ఈ మనీ యాప్ ల కంటే ముందే కాల్ మనీ పేరుతొ  విచ్చల విడిగా సాగిన వ్యాపారపు ఉచ్చులో చిక్కుకుని అనేక నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి.  

మంచి విలువలతో కూడిన సమాజాలు విలసిల్లిన కాలంలో కూడా విలువలకు విలువ ఇవ్వని మనుషులు వుండేవాళ్ళు. మానవ సమూహాలు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా మంచి చెడుల సమ్మిశ్రితాలే. మంచి చెడుల నిష్పత్తి మాత్రమే  ఆ సమాజపు గుణగణాలను  అంతిమంగా నిర్ణయిస్తుంది.

అప్పు ఇవ్వడం, ఇచ్చిన అప్పుకు వడ్డీ వసూలు చేయడం అనేది అనాదిగా సమాజం అంగీకరించిన వ్యవహారమే. మా చిన్నతనంలో కూడా ఊళ్ళల్లో అప్పులు ఇచ్చే ఆసాములు వుండేవాళ్ళు. నగలు, వస్తువులు తాకట్టు పెట్టుకుని అవసరంలో వున్న  బీదాబిక్కీకి అప్పులిచ్చేవాళ్ళు. కొందరు ధర్మ ప్రభువులు ధర్మవడ్డీ  వసూలు చేస్తే, మరికొందరు అధిక వడ్డీలతో బాకీదారుల్ని పీల్చి పిప్పి చేసేవాళ్ళు. వర్తమాన కాలంలో కొన్ని ప్రైవేటు బ్యాంకులు కూడా అప్పుల వసూళ్ళ కోసం  గూండాల మాదిరిగా వ్యవహరించే సిబ్బందిని నియమించుకుంటున్న విషయం బహిరంగ రహస్యమే. 

ముందే చెప్పుకున్నట్టు అప్పులు, వడ్డీలు అనేవి చట్ట వ్యతిరేకం కావు. దేశాలు సయితం ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకుంటాయి, వడ్డీ చెల్లిస్తాయి. బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు నుంచి రుణాలు  తీసుకుంటాయి. ఐతే ఇవన్నీ చట్టం లేదా నిబంధనల పరిధిలో జరుగుతాయి. గ్రామీణ బ్యాంకుల ఆవిర్భావానికి పూర్వం, ఊళ్ళల్లో జనం తమ  రుణ అవసరాలకోసం స్థానిక వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడేవాళ్ళు. క్రమేణా, నోటి మాట మీద అప్పులిచ్చే రోజులు పోయి ప్రామిసరీ నోటు మీద సంతకం చేయించుకునో, వేలిముద్ర వేయించుకునో అప్పులిచ్చే కాలం  వచ్చింది. గతంలో కోర్టుల్లో చాలా కేసులు వీటికి సంబంధించినవే ఉండేవి. గ్రామీణ బ్యాంకులు రంగప్రవేశం చేసిన తరువాత చాలా చోట్ల వడ్డీ వ్యాపారుల ఆగడాలకు కళ్ళెం పడింది. అలా అని వారి పీడ పూర్తిగా విరగడ అయిపోయిందని చెప్పడానికి వీలులేదు. ఎందుకంటె మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల అవసరాలు పెరిగిపోతున్నాయి, మారిపోతున్నాయి. లోగడ ప్రాణం మీదకు వచ్చిన సందర్భాల్లో అప్పులు చేస్తే ఇప్పుడు ఆడంబరాలకోసం అప్పులు చేస్తూ వుండడం రివాజుగా మారిపోయింది. 

నిజానికి ఇలాంటి దందాలతో పెద్ద పెద్ద వారికి ప్రత్యక్ష ప్రమేయం ఉంటుందని అనుకోలేము. ఐతే వారి అండాదండా  తమకున్నదని చెప్పుకుంటూ , అలా నమ్మించే ఏర్పాట్లు చేసుకుంటూ ఇలాటి అక్రమ వ్యవహారాలకు తెర తీస్తూ తమ పబ్బం గడుపుకుంటూ వుండడం రివాజుగా మారింది. ఈ స్థాయిలో ‘నేర ప్రవృత్తి’ రెక్కలు విప్పుకుంటున్నదంటే, పెద్ద తలకాయల ప్రమేయం అంతో ఇంతో లేకుండా, పోలీసుల దన్ను లేకుండా ఈవిధమైన తంతు సాగించడం అసాధ్యం అని నమ్మేవాళ్ళూ వున్నారు. అందుకనే పాలకపక్షానికి ఇది కొంత ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పక తప్పదు. అవసరాలకు కాకుండా ఆడంబరాలకోసం అప్పులు చేసే  మనస్తత్వం జనాల్లో పెరగడం కూడా మరో కారణం.  

ఉపశృతి: మా పెద్దన్నయ్య, కీర్తిశేషులు  భండారు పర్వతాలరావు చాలా సంవత్సరాలక్రితం ఒక వ్యాసం రాసారు. “డబ్బు కావాలా? దరిద్రం పోవాలా” అనేది దాని శీర్షిక.

ఒకానొక గర్భ దరిద్రుడు దేవునిగూర్చి గొప్ప తపస్సు చేస్తాడు.

ఆయన ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. భక్తుడు తన పరిస్తితి చెబుతాడు.

దేవుడప్పుడు చిరునవ్వు నవ్వి, ‘’డబ్బు కావాలా ? దరిద్రం పోవాలా ?’ అని అడుగుతాడు.

దాంతో భక్తుడికి కళ్ళు తెరిపిళ్ళు  పడతాయి.

దరిద్రం అంటే డబ్బు లేకపోవడం కాదు, డబ్బున్న దరిద్రులు కూడా లోకంలో చాలామంది వున్నారు. వాళ్ళకంటే తానే మిన్న అని భక్తుడు తెలుసుకుంటాడు.




17, అక్టోబర్ 2022, సోమవారం

నిశ్శబ్ద నిష్క్రమణ

 

కొద్ది నిమిషాల క్రితం ఫోను మోగింది.
‘నేనండీ సమతను’
ముందు పోల్చుకోలేక పోయాను. తటాలున గుర్తుకు వచ్చింది. సమత.
ముప్పయ్ అయిదు సంవత్సరాల క్రితం మేము మాస్కోలో వున్నప్పుడు సమత అక్కడ మెడిసిన్ చేస్తుండేది. మాస్కో వెళ్ళిన కొత్త రోజులు. మా ఆవిడకి గుండె వాల్వ్ లో జన్యు లోపం కారణంగా ప్రతి నెలా పెనిడ్యూర్ ఇంజెక్షన్ విధిగా తీసుకోవాల్సి వుంది. రష్యాలో వైద్యం ఉచితమే అయినా భాష సమస్య. ఈ సమస్యకు పరిష్కారం సమత రూపంలో వచ్చింది. ఆ విధంగా సమత, ఆమె ద్వారా పరిచయం అయిన అనేకమంది తెలుగు స్టూడెంట్స్ మా ఇంటి మనుషులుగా మారారు. శని ఆదివారాల్లో సందడే సందడి. భోజనాలు చేసి హాస్టళ్లకు వెళ్ళేవాళ్ళు.
‘హైదరాబాదు నుంచి రోజూ సిద్దిపేటకు షటిల్. ఉద్యోగం అక్కడ. నివాసం ఇక్కడ.నేను పనిచేసే చూట సిగ్నల్స్ సరిగా వుండవు. అందుకే ఇప్పుడు చేస్తున్నాను, మళ్ళీ రాత్రి ఏడు గంటలకి కానీ తిరిగిరాను’
సమత మాట్లాడుతూనే వుంది.
‘మీ లొకేషన్ షేర్ చేయండి. నిర్మల గారి చేతి వంట తిని చాలా ఏళ్ళు అయింది. వచ్చే ఆదివారం మీ ఇంట్లోనే భోజనం. ఒక సారి నిర్మల గారికి ఫోన్ ఇవ్వండి, సిగ్నల్ ఉన్నప్పుడే మాట్లాడాలి’
నాకు మాట పెగల్లేదు. సిగ్నల్ అందనంత దూరం వెళ్ళిపోయిందని ఎలా చెప్పను.
తేరుకుని విషయం చెప్పాను, మూడేళ్ల కిందట పోయిందని,
ఈసారి అటువైపు నుంచి మాట లేదు.
అవునూ! ఇంత నిశ్శబ్దంగా నిష్క్రమించిందా!
17-10-2022

పెద్దగీత

 

 

ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు.

ప్రాతఃస్మరణీయులు.

బీ.ఎస్.రామకృష్ణ.  జర్నలిస్ట్ సర్కిల్ లో బీ ఎస్ ఆర్ అంటారు.  ఫేస్ బుక్ లో  బుద్ధవరపు రామకృష్ణ. మంచి  జర్నలిస్టు. మంచి రాయసకాడు. చక్కని ధారణ శక్తి. నా కంటే వయసులో చిన్న అయినా, నేనూ జర్నలిస్టునే అయినా, అతనికి వున్న ఈ గొప్ప లక్షణాలు ఏవీ నాలో లేవు. నిన్ననో మొన్ననో ఫోన్ చేసి ఓ పెద్దగీత గీసి,  కొద్ది రోజులుగా నేను మధన పడుతున్న ఒక అంశాన్ని రబ్బరు పెట్టి చెరిపేసినట్టు చెరిపేసాడు. ‘ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారికే తప్పలేదు, ఈ ఇంటి పేరు గొడవ  ఇక మనమెంత’ అంటూ ఎంత పెద్దగీత  గీసి చూపెట్టాడో.

ఆంధ్రపత్రిక పెట్టిన కాశీనాధుని నాగేశ్వరరావు గారు భారతి సాహిత్య మాసపత్రిక మొదలుపెట్టి రెండు చేతులూ  మోచేతుల దాకా కాల్చుకున్నారు. మంచి సాహిత్య పత్రికని నడిపారనే మంచి పేరుతొ పాటు మంచి నష్టాలు కూడా ఆయన ఖాతాలో పడడానికి భారతి కూడా కారణమనేవారు. గొప్ప సాహితీవేత్త అయిన ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు భారతి సాహిత్య మాస పత్రికకి అడపాదడపా  చక్కటి వ్యాసాలు రాస్తుండేవారు. అయితే ఆయన ఇంటిపేరును ఎప్పుడూ ఇంద్రగంటి బదులు ఇంద్ర కంటి అని ప్రచురిస్తూ వుండేవారు.  ఆయన ఇంటి పేరులో వున్నది ‘గంటి’ నా, ‘కంటి’ నా అని విడమర్చి చెప్పడానికి ఆయన కుమారుడు, ప్రసిద్ధ రచయిత అయిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (గతంలో నేనూ శర్మగారు ఆంధ్రజ్యోతిలో సమకాలీకులం) ఇప్పుడు లేరు. అయితే అలనాటి భారతి పత్రిక సంచికలు కష్టపడి సేకరించానని రామకృష్ణ చెప్పాడు. చెబుతూ మరో మాట చెప్పాడు. మీ ఇంటి పేరు భండారు లేక  బండారు ఇలా ఎలా రాసినా చింతించడం అనవసరం  అంటూ గీతాబోధ చేశాడు.

ఇలాంటి సమాచారాలు బోలెడు సేకరిస్తూ వస్తున్నానని, ఎప్పుడో సమగ్ర  వ్యాసం రాస్తానని ఒక హామీ కూడా ఇచ్చాడు.

(17-10-2022)

 

 

16, అక్టోబర్ 2022, ఆదివారం

కొన్ని అంతే! ఊహకు అందవు

 కొన్ని అంతే! ఊహకు అందకుండా చకచకా జరిగిపోతుంటాయి. 

జర్నలిజంలో జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసినట్టు ఏపీ ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు ఫోను చేసి చెప్పడం, ఆ మరునాడే మేనల్లుడు, మా ఇంటిల్లిపాదికీ పిలవకుండానే పలికే డాక్టరు,  డాక్టర్ మనోహర్ కుమార్తె ప్రియ కుటుంబం విదేశాల నుంచి వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన బంధు మిత్రుల సమావేశంలో నన్ను సత్కరించడం వెంటవెంటనే  జరిగిపోయాయి. ఈ మధ్యనే అస్వస్థతకు గురయి కోలుకుంటున్న నాకు, మా కుటుంబ సభ్యుల నడుమ జరిగిన ఈ  వేడుక కొత్త ఊపిరులు ఊదింది. 

అనుకోకుండా వచ్చిన అవార్డు కన్నా, అనుకోకుండా జరిగిన ఈ కార్యక్రమంలో మా  అన్నయ్య రామచంద్రరావు గారు, మేనకోడలు భర్త రావులపాటి సీతారామారావు, మిత్రులు  జ్వాలా నరసింహారావు, విజయ శంకర్, పింగిలి శ్రవణ్ కుమార్, టి.ఎస్.ఎన్. మూర్తి,  వదిన విమల, మేనకోడళ్ళు శారద, విజయలక్ష్మి  ఇంకా పలువురు    నా గురించి   మాట్లాడిన మాటలు నాకు నా జీవితంలో లభించిన అతి పెద్ద అవార్డుగా భావిస్తూ వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనః పూర్వక ధన్యవాదాలు.

ఈ మొత్తం కార్యక్రమానికి కర్తా కర్మా క్రియ గా వ్యవహరించిన ప్రియ, డాక్టర్ మనోహర్, జ్వాలా, మా కుటుంబంలో  ఏకైక మహిళా జర్నలిస్ట్ బుంటి అని మేము ముద్దుగా పిలుచుకునే ప్రేమ మాలిని – వీళ్ళకు ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా అవి సరితూగవు.

అలాగే, ఫేస్ బుక్ లో, ఇతర మాధ్యమాల్లో  మితృలు అనేకమంది శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో  మహానుభావులు, అందరికీ పేరుపేరునా  వందనాలు.




 

16-10-2022

ఇంకానా! ఇకపై సాగదు!- భండారు శ్రీనివాసరావు

 

రాను రాను,   సామాన్యుడనే వాడికి  ఓటు వెయ్యడం మినహా  ఏ ‘హక్కూ’ లేకుండా పోతోంది. కానీ, అతడ్ని అడ్డం పెట్టుకుని బతికేవారికి మాత్రం అన్ని హక్కులూ  హక్కుభుక్తమై పోతున్నాయి.

నిజానికి, పార్టీలూ, పార్టీల నాయకులు, అమాత్యులు, అధికారులు, ఉద్యోగులు, పోలీసులు వీరందరూ ప్రజల్లో భాగమే. ప్రజల నుంచి వచ్చిన వీళ్ళే. ఎదిగో, ఎన్నికయ్యో  హక్కులు సాధించుకుని అధికారం చెలాయిస్తున్నారు. సామాన్యులు ఎలాంటి హక్కులూ లేకుండా కునారిల్లుతున్నారు. అదే తానులోనుంచి వచ్చిన వాళ్ళు మాత్రం వృత్తుల పేరిటా, ఉద్యోగాల పేరిటా సంఘాలు పెట్టుకుని, హక్కుల పోరాటాల పేరుతో లేని అధికారాలు అనుభవిస్తున్నారు. పై పదవులకు నిచ్చెనలు వేసుకుంటున్నారు.

సంఘాల కుంపట్లు పెట్టుకోని వర్గాలు ఈనాడు కాగడాలు వేసి గాలించినా కనిపించవు. ఎన్జీవోలకు సంఘాలున్నాయి. ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులకు అసోసియేషన్లు ఉన్నాయి. రిక్షాలు లాగేవారికే కాదు, విమానాలు నడిపేవారికీ యూనియన్లు ఉన్నాయి. అమ్మేవారికి, కొనేవారికి సమాఖ్యలున్నాయి. రాసేవారికి, ఆ రాసిన వాటిని  అచ్చేసేవారికీ సంస్థలు ఉన్నాయి. ఆడవారికీ, భార్యాబాధితులకు సయితం సమాజాలున్నాయి. వృత్తుల వారీగా, కులాలవారీగా, మతాలవారీగా ఎవరి సంఘాలు వారికి ఉన్నాయి. వీటన్న్టిటికీ, సొంతంగా ఏర్పరచుకున్న హక్కులు ఉన్నాయి. లేకపోయినా, వాటికోసం పోరాడగల యంత్రాంగ వ్యవస్తలున్నాయి. వారి భావాలను విప్పిచెప్పగల గళాలు ఉన్నాయి. వాటిని ప్రజలకు చేరవేసే మాధ్యమాలు ఉన్నాయి. హక్కుల సాధనకోసం సమ్మెలు, బంద్ లు, ఆందోళనలు, నిరసనలు, రాస్తారోఖోలు, రైల్ రోఖోలు, ఘెరావ్ లు, ముట్టడులూ, ఊరేగింపులూ, బైఠాయింపులూ, అటకాయింపులూ, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలు, ఇలా ఎన్నో రకాలుగా, ఎన్నెన్నో రూపాల్లో.. సామాన్యుడి సాధారణ జీవనాన్ని అతలాకుతలం చేస్తూ, మరింత దుర్బరంగా మారుస్తూ,  పై పెచ్చు తాము పడుతున్న ఈ పడరాని పాట్లన్నీ ఆ సామాన్యుడి కోసమే అని చెప్పి నమ్మించగల టక్కుటమార విద్యలన్నీ వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇవన్నీ లేనివాడు, అసలేమీ లేనివాడు మాత్రం రాజ్యాంగం తనకు కల్పించిన అన్ని రక్షణలకూ తూట్లు పొడుస్తున్న ఈ అస్తవ్యస్త వ్యవస్థల  మధ్య చిక్కుకుపోయి నానా అవస్థలు పడుతూ దిక్కుతోచక విలవిలలాడుతున్నాడు.

కారణాలు ఏమైనా, హేతుబధ్దత ఎంత ఉన్నా, బంద్ ల వల్లా, రాస్తారోఖోల వల్ల నష్టపోతున్నదీ, కష్టపడుతున్నదీ సామాన్యులే అన్నది నగ్న సత్యం. నిరసనలూ, ఆందోళనల పేరుతో రాజకీయపార్టీలు, వాటి అనుబంధ సంస్థలు, కార్మిక సంఘాలు, ఇతర సంస్థలూ, ఇష్టారాజ్యంగా నడిరోడ్లపై చేస్తున్న ధర్నాలు, బైఠాయింపులు నిత్యకృత్యంగా మారి జనజీవితాన్ని నరకప్రాయంగా మారుస్తున్నాయన్నది కూడా  అంతే నిజం.

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఒత్తిడి తెచ్చే నెపంతో రోడ్డెక్కుతున్న రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు తమ వైఖరులనూ, విధానాలను పునస్సమీక్షించుకోవాలి. ఏ సామాన్య జనం కోసమైతే ఉద్యమాలు, ఆందోళనలూ, నిర్వహిస్తున్నామని ఆయా పార్టీలూ, సంఘాలు అనుకుంటున్నాయో, ఆ సామాన్య జనాన్నే తమ ఈ విధివిధానాలు మరింత చీకాకు పరుస్తున్నాయన్న వాస్తవాన్ని అర్దం చేసుకోవాలి. పోరాటాల పేరుతోనో, ఇతరేతర రాజకీయ కారణాలతోనో బడుగుజీవి నడుం విరుస్తున్న ఈ అపభ్రంశపు విధానాలు ఏ నాగరిక దేశంలోనూ కానరావు. సాటి పౌరులకు ఇబ్బంది కలగని రీతిలో నిరసనలు ప్రకటించే పద్ధతులను సభ్యసమాజం పాటించి తీరాలన్న ప్రాధమిక స్పృహ మనదేశంలో కలికానికి కూడా కానరాదు.

ఒకసారి, సూర్యాపేట మీదుగా బస్సులో ఖమ్మం వెడుతుంటే నడుమ దారిలో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. కారణం వాకబు చేయడానికి వెడితే కొంతదూరంలో ఏదో పార్టీకి చెందిన కార్యకర్తలు, పట్టుమని పదిమంది కూడా లేరు,  జండాలు పట్టుకుని, నినాదాలు చేస్తూ నడిరోడ్డుపై ధర్నా చేస్తున్నారు. ‘ఇలా ఎంతసేపు మీ తమాషా చూడాలని గద్దిస్తే‘, ‘ఒక్క అరగంట ఓపిక పట్టండి సార్! ఫలానా టీవీ వాళ్ళు దోవలో ఉన్నామని ఇప్పుడే సెల్ ఫోన్లో చెప్పారు’ అని వాళ్ళ నాయకుడు జవాబిచ్చాడు. ఇలాంటి చిన్నాచితకా  ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోఖోలు ససేమిరా చూపించేది లేదని ఛానళ్ళన్నీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోగల్గితే మెరుగయిన సమాజం కోసం నిజంగా కృషి చేసినట్టవుతుంది. ప్రచారం కోసం కాకుండా ప్రజాక్షేమాన్ని కోరుకునే సంస్థలు కూడా తమ కార్యకర్తల్ని తక్షణం రంగంలోకి దింపి ‘ఇలా ప్రజలని ఇబ్బందుల పాలు చేసే వారికి దయచేసి ఓట్లు వెయ్యవద్దు’ అనే ప్లకార్డులను పట్టుకుని మౌనంగా ఆ పక్కనే  నిలబడితే, నవ్యత్వం కోసం పాటుపడే ఛానళ్ళన్నీ ఆ దృశ్యాలను ఒక్కమారైనా ప్రసారం చేయగలిగితే, ఇంకోసారి ఏపార్టీ, ఏ యూనియన్ కూడా ఇలాంటి ఆందోళనలకు  సాహసించదు. కానీ సంచలనం ఒక్కటే సమస్తం అనుకునే ఈ పోటాపోటీ ప్రచార వ్యాపార యుగంలో ఇది నెరవేరని కలే.

కానీ, ఏదో ఒకరోజు ‘సామాన్యుడి రోజు’ కూడా వస్తుంది. నిరసనలని వ్యక్తం చేయడానికి ఎంచుకున్న విధానాల ద్వారా వేలాది మంది ప్రజలను అకారణంగా ఇబ్బంది పెట్టే హక్కు వీరికెవరిచ్చారన్న ప్రాధమిక ప్రశ్న ముందుకు వస్తుంది.

అర్భకుడు, అమాయకుడు అనుకున్న ఈ సామాన్యుడే తిరగబడి ‘ఇంకానా’ ఇకపై సాగదు!’ అంటూ హూంకరిస్తూ, తన జీవితంతో ఆటాడుకుంటున్న ‘వర్గాల’ మెడలు వంచే రోజు తప్పక వస్తుంది.

 తస్మాత్ జాగ్రత్త!




12, అక్టోబర్ 2022, బుధవారం

దరిద్రం యెలా వుంటుంది? – భండారు శ్రీనివాసరావు

 

ఈ ముచ్చట ఇప్పటిది కాదు, ఎప్పుడో పదేళ్ల క్రితం 2012 లో నిజంగా జరిగింది. ఆంగ్ల దినపత్రిక హిందూలో ఈ కధనం వచ్చింది. దానికి నా స్వేచ్ఛానువాదం అన్నమాట.
చెడి బతకొచ్చుకాని, బతికి చెడడం అంత మా చెడ్డ కష్టం మరోటి వుండదంటారు.
కానీ అలాటి కష్టం మాకొక లెక్కే కాదు పొమ్మని నిరూపించారు ఇద్దరు కుర్రాళ్ళు.
తుషార్ హర్యానాలో ఓ పోలీసు ఆఫీసర్ కొడుకు. అమెరికా వెళ్లి పై చదువులు పూర్తిచేసుకున్నాడు. అమెరికా, సింగపూర్లలో మూడేళ్లపాటు బ్యాంకు ఉద్యోగాలు చేసాడు. డబ్బుకు లోటులేని జీవితం గడిపాడు.
మరో కుర్రాడి పేరు మట్. పేరు చూసి వేరే దేశం వాడని పొరబడేవీలుంది. కానీ మన తోటి భారతీయుడే. తలిదండ్రులతో కలసి చిన్నతనంలోనే అమెరికా వెళ్లాడు. అక్కడే చదువుసంధ్యలు గట్రా పూర్తిచేసుకున్నాడు.
ఈ ఇద్దరికీ ‘ఇండియా దటీజ్ భారత్’ కు తిరిగిరావాలని చిరకాల కోరిక. చివరికి ఎలాగయితేనేం మాతృదేశానికి వచ్చేసారు. బెంగళూరులో ఓ ప్రాజెక్టులో చేరారు. ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ‘ఒకే కంచం ఒకే మంచం’ అనే తీరుగా కలగలసిపోయి ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. ఇద్దరి ఆశలు ఒకటే. ఆశయాలు ఒకటే. ఇది మరో కారణం.
హాయిగా రోజులు గడిచిపోతున్నాయి. అలా గడవడం, గడపడం వారికి సుతరామూ ఇష్టంలేదు. అలా అయితే వారిని గురించి ఇంతగా రాయాల్సిన పనే లేదు.
ఒక ఐడియా జీవితాన్నిమారుస్తుందంటారు.
దేశంలో దారిద్యం గురించిన ఒక గణాంకం వారిని ఆకర్షించింది. అదేమిటంటే భారతదేశంలో పేదవారు చాలామంది రోజుకు అక్షరాలా ఇరవై ఆరు రూపాయల ఆదాయంతో బతుకు బండి లాగిస్తున్నారని. ‘అదెలా సాధ్యం?’ అన్నది వారి మదిలో మెదిలిన మొదటి ప్రశ్న. ‘అదెలా సాధ్యమో తెలుసుకోవాలన్నది’ కలిగిన కుటుంబంలో పుట్టిన వారిద్దరికీ కలిగిన మరో ఆలోచన.
అసలే మార్పు కోరే తత్వం. ఆలోచనలను అమలు చేయడంలో ఇద్దరిదీ ఏకత్వం. ఇక అడ్డేముంది. రాజభోగాలు వొదులుకుని సన్యసించిన బుద్ధుడిలా ఇద్దరూ కలసి సగటు భారతీయుడు యెలా బతుకుతున్నాడో అలా బతకాలని బయలుదేరారు. చదువుకున్నవారు కనుక ఈ ప్రయోగానికి ముందు అన్ని లెక్కలు వేసి చూసుకున్నారు.
సగటు భారతీయుడి సగటు ఆదాయం నెలకు 4,500 రూపాయలు. అంటే రోజుకు నూట యాభయ్ రూపాయలు. ప్రపంచ వ్యాప్తంగా జనం వారి నెలసరి ఆదాయంలో మూడో వంతు ఇంటి అద్దెకు ఖర్చు పెడతారు. ఆ లెక్కన రోజు రాబడి నూట యాభయ్ లో మూడో వంతు తీసేసి వందరూపాయలతో రోజు గడపాలనే ప్రయోగానికి పూనుకున్నారు. దేశ జనాభాలో 75 శాతం మంది ఇంతకంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న విషయం వారికి తెలియంది కాదు.
ఖరీదయిన అపార్టుమెంటును వొదిలేసారు. ఇంట్లో పనిచేసే పనిమనిషిని వొప్పించి ఆమె వుంటున్న ఇరుకు గదిలోకి మారిపోయారు. మొదట ఈ ఇద్దరి తరహా చూసి పిచ్చివాళ్లనుకుంది. కానీ, వారి దీక్ష, పట్టుదల చూసి చలించి పోయింది.
కొత్త జీవితంలో వారికి ఎదురయిన ప్రధాన సమస్య చౌకగా తిండి సంపాదించుకోవడం ఎలాగా అన్నది. అంత తక్కువ ఆదాయంలో బయట భోజనం చేయడం అన్నది అసాధ్యం. దాబాల్లో తినాలన్నా కుదరని పని. పాలూ, పెరుగు, నెయ్యి, వెన్న అన్నింటికీ స్వస్తి చెప్పారు. విదేశాల్లో చదువుకున్నారు కనుక స్వయంపాకం వారికి వెన్నతో పెట్టిన విద్య. కానీ వంట వండడం వచ్చుకాని, వండడానికి వనరు లేదు. అందుకని చౌకకు చౌక, మంచి పోషక విలువలు వుండే గింజలను ఉడకబెట్టి ఆహారంగా తీసుకునే పద్దతికి శ్రీకారం చుట్టారు. అలాగే పార్లే బిస్కెట్లు. కేవలం ఇరవై అయిదు పైసలు పెడితే ఇరవై ఏడు కేలరీలు. అరటి పండు ముక్కల్ని వేయించి బిస్కెట్లతో కలిపి తింటే ఆరోజు విందు భోజనం చేసినట్టు.
రోజుకు వందలో బతకాలి కాబట్టి వారికి వారే కొన్ని బంధనాలు, పరిమితులు విధించుకున్నారు. అయిదు కిలోమీటర్లకు మించి బస్సులో ప్రయాణం భారం అని తెలుసు. అంతకంటే ఎక్కువ దూరం వెళ్ళాల్సిన పరిస్తితి వుంటే నటరాజా సర్వీసే గతి. నెలవారీ విద్యుత్ వాడకాన్ని బాగా తగ్గించుకున్నారు. రోజుకు అయిదారు గంటలే లైట్లు, ఫాన్ వాడేవారు. కొంత విద్యుత్ ను కంప్యూటర్లు, మొబైల్ ఫోనులు చార్జ్ చేసుకోవడానికి వీలుగా పొదుపు చేసుకునే వారు. ఒక్క లైఫ్ బాయ్ సబ్బు కొని, దాన్ని రెండు ముక్కలు చేసి ఇద్దరు వాడుకోవాల్సిన పరిస్తితి. కోరి తెచ్చుకున్న కష్టాలే కనుక చింతించాల్సిన పరిస్తితి ఎదురు కాలేదు.
రోడ్డు వెంట వెడుతున్నప్పుడు అద్దాల అరమరాల్లోనుంచి అనేక రకాల వస్తువులను, దుస్తులను చూస్తూ వెళ్ళేవారు. వాటిని కొనగల తాహతు తమకు లేదని తెలుసు కనుక వాటిల్లో అడుగుపెట్టేవారు కాదు. ఇక సినిమాలు చూడడం అనేది స్తితికి మించిన పని. వారు కోరుకున్నది ఒక్కటే. అనారోగ్యం పాలు కాకుండా వుంటే చాలని.
వారు ఎదుర్కోవాల్సిన మరో పెద్ద సవాలు అలాగే వుండిపోయింది. అధికారికంగా ప్రణాళికా సంఘం సుప్రీం కోర్టుకు తెలియచెప్పిన వివరాల ప్రకారం దార్రిద్య్ర రేఖకు దిగువన వుండేవారి ఆదాయం పట్టణాల్లో రోజుకు 32 రూపాయలు అయితే, గ్రామాల్లో 26 రూపాయలు.
ఇదేదో తేల్చుకోవాలని ఇద్దరూ కలసి మట్ పూర్వీకుల గ్రామానికి వెళ్లారు. అది కేరళలో వుంది. రోజుకు 26 రూపాయలతో గడిపే జీవితాన్ని కరుకాచల్ అనే ఆ వూర్లో మొదలు పెట్టారు. చౌకగా దొరికే ఉప్పుడు బియ్యం, అరటి పండ్లు, పాలు కలపని బ్లాక్ టీ - ఇవే ఆహారం.
కానీ అంత తక్కువ డబ్బుతో జీవించడం చాలా కష్టమని వారికి తేలిపోయింది. అసలే అరకొరగా వున్న కొన్ని సౌకర్యాలను కూడా వొదిలేసుకున్నారు. దుస్తులు శుభ్రం చేసుకోవడానికి బట్టల సబ్బు కొనడం మానేశారు. మొబైల్, కంప్యూటర్ పక్కన పడేసారు. జబ్బున పడితే ఎలా అనే భయం ఒక్కటే వారిని అహరహం వేధించేది. సంపన్న కుటుంబంలో పుట్టి అల్లారు ముద్దుగా పెరిగిన ఆ ఇరవై ఆరేళ్ళ యువకులకి ‘దరిద్రంలో బతకడం’ అన్న ఈ అనుభవం భరించలేనిదిగా బాధించేది.
అయినా పట్టిన పట్టు విడవకుండా వారు తాము అనుకున్నది సాధించారు. దీపావళి నాడు వారి ప్రయోగం ముగిసింది. ఆ రోజున వారు తమ స్నేహితులకు ఉత్తరాలు రాశారు.
‘మేము మళ్ళీ మా మామూలు జీవితాల్లోకి అడుగు పెడుతున్నాం. మా ప్రయోగం ముగియడానికి ముందు రోజు, ఇన్నాళ్ళుగా మేము ఎవరితోనయితే కలసి మెలసి జీవించామో వారంతా కలసి మాకు వారి స్తాయిలో ‘విందు భోజనం’ ఏర్పాటు చేశారు. ఆ భోజనంలో ఎన్ని పదార్ధాలు వున్నాయో తెలియదు కాని ప్రతిదాంట్లో ప్రేమ, అభిమానం, ఆప్యాయతా కూరిపెట్టారని మాత్రం చెప్పగలం. ఇంతవరకు అలాటి భోజనం చేయలేదని కూడా చెప్పగలం.
‘కానీ, ప్రతి ముద్దా నోట్లో పెట్టుకుంటున్నప్పుడు ఒక వాస్తవం కనుల ముందు కదలాడేది. ఈ మాత్రం భోజనం అన్నది కలగా మిగిలిన మరో నలభయ్ కోట్ల మంది భారతీయులు ఈ దేశంలో మనతో పాటే జీవిస్తున్నారు. వారి కల నెరవేరడానికి ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో ఎవరికీ తెలియదు.
‘మేము మళ్ళీ మా విలాస జీవితాల్లోకి అడుగుపెడుతున్నాము. కానీ వాళ్లు మాత్రం ఆ ఆగర్భదారిద్ర్యంలోనే వుండిపోతున్నారు. రేపు గడవడం కాదు ఈ క్షణం గడవడం యెలా అన్న బతుకులు వాళ్లవి. తీరని కోరికలు, అపరిమితమయిన పరిమితుల నడుమ వారు తమ జీవన పోరాటాన్ని కొనసాగిస్తూనే వుంటారు. ఒక్కముక్కలో చెప్పాలంటే వారి ఆకలి పెద్దది. తీరే మార్గం అతి చిన్నది.
‘ఈ ప్రయోగం తరువాత మా ఆలోచనల్లో మరింత మార్పు వచ్చింది.
‘ఇన్నేళ్ళుగా అనేక వస్తువులు జీవితావసరాలుగా భావించి వాడుతూ వచ్చాము.
‘మనిషి బతకడానికి ఇన్నిన్ని సబ్బులూ, షాంపూలు అవసరమా? వారాంతపు సెలవు దినాల్లో బయటకు వెళ్లి ఖరీదయిన హోటళ్ళలో అతి ఖరీదయిన విందు భోజనాలు చేయకపోతే బతుక్కి అర్ధం మారిపోతుందా? బ్రాండెడ్ దుస్తులు ధరించక పోతే జనం మనల్ని గుర్తించరా?
‘స్తూలంగా ఆలోచిస్తే మనం ఇంత సంపన్న జీవితాలకు అర్హులమా? ఇన్నిన్ని వైభోగాలు అనుభవించి ఆనందించే అర్హత వుందా? కొందరు గర్భ దరిద్రులుగా, మరికొందరు ఆగర్భ శ్రీమంతులుగా జన్మించడానికి కేవలం వారి వారి అదృష్టాలే కారణమా?
‘సౌకర్యాలు, సదుపాయాలూ నిత్యావసరాలుగా పరిగణించే జనం ఒక పక్కా, పూటగడవడం యెలా అని అనుక్షణం మధన పడే ప్రజలు మరో పక్కా వుండడం సృష్టి విచిత్రమా? ప్రకృతి వైపరీత్యమా?
‘ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పగల వయస్సు మాకు లేదు. కానీ వున్న పరిస్తితిని అవగాహన చేసుకోవాలనే తాపత్రయం మాత్రం మాకుంది.
‘చివరగా మరొక్క మాట. ఈ ప్రయోగం ద్వారా సాధించింది ఏముంది అంటే వుంది. ఒక కఠోర వాస్తవం మాకు బోధపడింది.
‘ఇన్నాళ్ళుగా, ఇన్నేళ్ళుగా మేము పేదవారిని పరాయివారిగా చూసాము. కానీ మేము వారితో గడిపిన రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా వారు మమ్మల్ని అలా చూడలేదు సరికదా అక్కున చేర్చుకుని ఆదరించారు. నిజానికి పేదలం మనమే. అన్నింటికన్నా ముందు చేయాల్సిన పని ఏమిటంటే, మనలో వున్న ‘ఈ పేదరికాన్ని’ రూపుమాపుకోవడమే!’
పదేళ్లు గడిచిన తర్వాత వాళ్ళ ఆలోచనల తీరు ఎలా ఉందన్నది మళ్ళీ ఆ పత్రికే రాస్తే బాగుంటుంది.

https://www.thehindu.com/opinion/columns/Harsh_Mander/barefoot-the-other-side-of-life/article2882340.ece