https://www.facebook.com/bhandarusrinivasrao/posts/pfbid0kjWRcGPrgcrf8iGGJ39XQVNYGJFTj4uSgpBQiLMH6V4iX26DcYb2iMxgktWQzFacl?notif_id=1659951284361307¬if_t=feedback_reaction_generic&ref=notif
https://www.facebook.com/bhandarusrinivasrao/posts/pfbid0kjWRcGPrgcrf8iGGJ39XQVNYGJFTj4uSgpBQiLMH6V4iX26DcYb2iMxgktWQzFacl?notif_id=1659951284361307¬if_t=feedback_reaction_generic&ref=notif
ఈరోజు తొలి వెలుగు రేఖలు విచ్చుకుంటూవుంటే, నా కంటి ముందు మరో వెలుగు కనబడింది. కనబడడమే కాదు నాతో మాట్లాడింది కూడా.
‘నా పొరబాటో,
నీ గ్రహపాటో తెలియదు. మొత్తం మీద 77 లోకి వచ్చావు. నువ్వు అడగకుండానే నీకో
అపూర్వమైన వరం ఇవ్వాలని అనిపించింది.
అయితే ఓ షరతు. దానికి ఒప్పుకుంటేనే సుమా!’
‘.............’
‘చెబుతా
విను. నువ్వు ఆనందంగా వుండు. ఇతరులని
సంతోషంగా ఉంచు. ఇలా చేస్తే ఇచ్చే వరమేమిటో తెలుసా? సంతృప్తి. ఇంగ్లీషులో కంటెంట్ మెంట్ అంటారుట. అది సాధిస్తే ఇక నాకిది కావాలి అని నన్ను ఎప్పుడూ సాధించవు.
ఇలా తెల్లవారకుండానే వచ్చి నీకు వరాలు ఇచ్చే
పని నాకూ వుండదు. తెలిసిందా! డెబ్బయి ఏడేళ్లు వచ్చిన తర్వాత కూడా తెలియకపోతే నీ
ఖర్మ. వస్తా!’
(07-08-2022)
(Published in Andhra Prabha on 07-08-2022, Sunday, today)
‘నేను ఎవర్నీ పనికట్టుకుని చెడగొట్టలేదు, చెడిపోయిన వాళ్ళే నా దగ్గరకు
వస్తారు’ అంటుంది ఓ విజయవంతమైన సినిమాలో ఓ వేశ్య పాత్ర.
అలాగే మోసపోవాలని కోరుకున్నవాళ్ళే కోరి, మోసగాళ్ళ చేతుల్లో మోసపోతుంటారని అనిపిస్తుంది ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే.
నమ్మకానికి అపనమ్మకానికి నడుమ జరిగేదే మోసం అని కొందరు నమ్మి మోసపోయినవారు చెబుతుంటారు. ఒకర్ని నమ్మడానికి, ఆ ఒకర్ని జన్మలో మళ్ళీ నమ్మరాదు అనే అపనమ్మకం పెంచుకోవడానికి కారణం నమ్మి మోసపోవడమే కదా!
మోసగించడాలు, మోసపోవడాలు ఏదో కలియుగానికి మాత్రమే పరిమితం కావు. త్రేతా యుగంలో కూడా ఈ మాయల మరాఠీలు వున్నారు. శ్రీరాముడి వనవాస సమయంలో మారీచుడు గొంతు మార్చి హా లక్ష్మణా అని పెట్టిన కేకలు విని సీతాదేవి, తన భర్త శ్రీరామచంద్రుడు ఏదో చిక్కుల్లో చిక్కుకున్నాడు అని నమ్మి మోసపోయే కదా మరిది లక్ష్మణుడిని ఆశ్రమం నుంచి బయటకు పంపి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నది.
మా చిన్నప్పుడు వారపత్రికల్లో ఓ చిన్న ప్రకటన బాక్స్ కట్టి ప్రచురించేవారు, చదరపు గడులను అంకెలతో నింపి పంపండి, విజేతలకు పన్నెండు బ్యాండ్ల రేడియో వీపీపీలో పంపుతాము, పోస్టల్ ఖర్చుల కోసం కొంత పైకం పంపండి అని. చాలామంది ఆ ప్రకటనలు నమ్మి, డబ్బు పంపేవాళ్ళు. అన్నట్టుగానే పార్సెల్ వచ్చేది. విప్పి చూస్తే ఆ కార్డు బోర్డు పెట్టే నిండా గడ్డీగాదం, కాగితం ముక్కలు ఉండేవి.. అలాగే పువ్వు మీ అదృష్టం చెబుతుంది అనే ప్రకటనలు కూడా. చిరునామా మాత్రం పలానా పోస్ట్ బాక్స్ నెంబరు, లూధియానా అనో, జలంధర్ అనో వుండేది. వాటిని నమ్మి డబ్బు పంపినవాళ్ళ అదృష్టం ఎలా వుందో చెప్పడానికి ఏ పువ్వులు అక్కరలేదు. చెవిలో పువ్వు పెట్టడం అంటే ఇదేనేమో!
చాలా ఏళ్ళ క్రితం ఎవరో ఉత్తరాది నుంచి వచ్చి ఊళ్ళో ఖాళీగా వున్న దుకాణం అద్దెకు తీసుకునేవారు. స్టీలు సామాన్లు, రేడియోలు, ఇలా అనేక రకాల సామాన్లు ఆ దుకాణంలో ఉండేవి. ఇక పత్రికల్లో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చేవాళ్ళు. ‘మా దగ్గర ఏదైనా ఒక వస్తువు కొనండి. అదే వస్తువు మరోటి ఉచితంగా తీసుకువెళ్ళండి’ ఇదీ వాళ్ళ ప్రచారం. వరిగడ్డికి నిప్పు అంటుకున్నట్టు త్వరలోనే ఈ ప్రచారం ఆ నోటా ఈనోటా పడి నలుగురికీ చేరేది. ఇక ఆ షాపు ముందు మైళ్ళ కొద్దీ క్యూలు. మొదట్లో కొన్న వస్తువుకు మరో వస్తువు ఉచితంగా ఇచ్చేవారు. రోజులు గడుస్తున్నకొద్దీ జనంలో వేలంవెర్రి బాగా పెరిగిపోయేది. అందుకు తగ్గట్టుగానే ఆ షాపు ముందు క్యూలు పెరిగేవి. జనంలోని బలహీనతను ఆసరాగా చేసుకుని, ‘రావాల్సిన స్టాకు సమయానికి రాలేదు, రేపో ఎల్లుండో వస్తుంది అనుకుంటున్నాం. డబ్బు కట్టి వెళ్ళండి, సరుకు రాగానే ఇస్తాము’ అని నమ్మబలికేవారు. జనం నమ్మే వారు. చివరికి ఓ శుభ ముహూర్తంలో వాళ్ళు బిచానా ఎత్తేసిన తర్వాత కానీ జనాలకు తత్వం బోధ పడేది కాదు. తమకు జరిగిన మోసం గురించి కధలు కధలుగా చెప్పుకునే వాళ్ళు. ఎప్పటిదాకా! మరో మోసం విషయం వెలుగు చూసేవరకు.
మనమూ ఓ కధ చెప్పుకుందాం! ఇదీ మోసం కధే!
అనగనగా ఒక వూరు.
వున్నట్టుండి ఓ రోజున ముక్కూమొహం తెలియని వ్యక్తి ఒకడు తన సహాయకుడిని వెంటబెట్టుకుని ఆ వూరు వచ్చాడు. వచ్చీరాగానే రచ్చబండ దగ్గర వూళ్ళో వాళ్ళతో భేటీ అయ్యాడు.
‘నాది కోతుల వ్యాపారం. ఒక్కో కోతికీ పది వరహాల చొప్పున ఇస్తాను. పోయి కోతుల్ని పట్టుకు రండి.’ అని చెప్పాడు.
గ్రామస్తులకి మతి పోయింది. వూరికి వున్నదే కోతుల బెడద. పట్టుకువచ్చి ఒప్పచెబితే పది వరహాలంటున్నాడు. బేరం భేషుగ్గావుంది. కోతుల పీడా వొదలడంతో పాటు నాలుగు రాళ్ళు కూడా వొళ్ళో పడతాయి.
వూరి జనమంతా పొలోమని కోతుల వేటలో పడ్డారు. మాట ఇచ్చినట్టే ఆ కోతుల బేహారి, కోతికి పది వరహాల చొప్పున లెక్కకట్టి మరీ చేతులో పెడుతున్నాడు. తెచ్చిన కోతిని తెచ్చినట్టు ఒక పెద్ద బోనులో పడేసి మేపుతున్నాడు.
కొన్నాళ్ళకు వూళ్ళోనే కాదు చుట్టుపక్కల కూడా కోతుల సంఖ్య తగ్గడం మొదలయింది. దాంతో బేహారి ధర పెంచాడు. ఒక్కో కోతి రేటు ఇప్పుడు అక్షరాలా పదిహేను వరహాలు.
కొన్నాళ్ళకి కోతుల కొరత మరీ ఎక్కువయింది. పదిహేను కాదు పాతిక వరహాలన్నాడు. జనం పెరుగుతున్న ధర చూసారు కానీ, అందులోని మర్మం ఏమిటో ఎవ్వరికీ అర్ధం కాలేదు. బేహారి కూడా కొన్న కోతుల్ని మారు బేరానికి అమ్మడం లేదు. తెచ్చిన కోతుల్ని తెచ్చినట్టు బోనులోనే వుంచుతున్నాడు. మనకు రావాల్సింది మనకు చెల్లిస్తున్నప్పుడు అతడా కోతుల్ని ఏం చేసుకుంటే మనకెందుకు అని జనమే సర్దిచెప్పుకున్నారు
అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఆ వ్యాపారి రేటు యాభయి వరహాలకు పెంచాడు.
తమ పంట పండిందనుకున్నారు గ్రామస్తులు.
ఓ రోజు ఆ వ్యాపారి కోతుల కొనుగోలు వ్యవహారం సహాయకుడికి ఒప్పచెప్పి వ్యాపారపు పనులమీద పట్నం వెళ్లాడు.
అతడలా వెళ్ళగానే అతడి సహాయకుడు ఊళ్ళో వాళ్లని పిలిచి చెప్పాడు.
‘ఆ బోనులో మేం కొన్న కోతులన్నీ అలాగే వున్నాయి చూశారు కదా. నేను మీకు వాటిని ముప్పయ్ అయిదు వరహాల చొప్పున అమ్ముతాను. మా వాడు వూరినుంచి రాగానే మీరు వాటిని యాభయికి అమ్మేయండి. శ్రమలేకుండా మీకు పదిహేను వరహాలు మిగులుతాయి.’
గ్రామస్తులకు మతులు పూర్తిగా పోయాయి. కోతులు అమ్మి సంపాదించిందే వారి దగ్గర చాలా వుంది. ఇక ఇప్పుడు ఇలా ఇచ్చి అలా తెచ్చుకోవడమే. వ్యాపారి సహాయకుడు చెప్పిన మాటలతో వారికి కోతికి కొబ్బరికాయ దొరికినంత సంబరమైంది. పెళ్ళాం నగలు కుదువబెట్టీ,, హెచ్చు వడ్డీలకు అప్పులు తెచ్చి కోతికి ముప్పయి అయిదు వరహాల చొప్పున ఆ సహాయకుడికి చెల్లించి వున్న కోతులనన్నింటినీ కొనుగోలుచేశారు.
అంతే. మర్నాటి నుంచి ఆ వ్యాపారి కానీ అతడి సహాయకుడు కానీ మళ్ళీ వాళ్లకు కనిపిస్తే వొట్టు.
ఆనాటి వరహాల రోజులనుంచి ఈనాటి రూపాయల కాలం దాకా మోసం చేసేవాడిదీ, మోసపోయేవాడిదీ ఇదే తంతు. ఏమీ మారలేదు. ఈ ఆట అలా అనంతంగా సాగుతూనే వుంది.
ఉపశ్రుతి:
“నగరంలో ఒక పెద్ద పారిశ్రామిక వేత్త ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు గత రాత్రి దాడిచేసి పెద్దమొత్తంలో నల్ల డబ్బు స్వాధీనం చేసుకున్నారు. దాడిలో పట్టుబడిన సొమ్ము, నగలు తదితర వివరాల జాబితా ఇలా రాశారు.
‘ఇరవై కోట్ల రూపాయల కరెన్సీ నోట్లు. పాతిక కిలోల బంగారం ఆభరణాలు, నాలుగు అతి ఖరీదైన కార్లు, కోట్ల విలువచేసే స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, నాలుగు బల్లితోకలు, మూడు జిల్లేడు మొక్కలు’
చివర్లో ఈ బల్లితోకలు, జిల్లేడు మొక్కలు ఏమిటి? ఒక వెబ్ సైట్ లో బాగా ప్రాచుర్యం పొందిన ఓ వీడియో మీద ఇది సెటైర్ అన్నమాట.
ఆ వెబ్ ఛానల్ లో ఓ పెద్దాయన చెప్పాడట, బల్లితోకని జిల్లేడు మొక్కకి కట్టి చూడండి, మీకున్న అప్పులన్నీ అణాపైసలతో సహా తీరిపోతాయని. అది నిజమో కాదో తెలియదు కానీ, ఆ వీడియోకి మాత్రం వేలల్లో వ్యూస్ వచ్చిన మాట నిజం.
కాబట్టి, కావున మనం తెలుసుకోవాల్సిన నిజం ఏమిటంటే, ఈ లోకంలో మోసపోయేవాళ్ళు ఉంటేనే, మోసం చేసేవాళ్ళ ఆటలు సాగుతాయి. (07-08-2022)
అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటింది. ఆగస్టు ఆరు దాటి ఏడో తేదీ వచ్చింది, అంతటా నీరవ నిశ్శబ్దం.
మా మీడియాలో వచ్చిన వార్త ఎఫెక్ట్ అనే ఈరోజుల్లో తరచుగా టీవీ తెరలపై చూస్తుంటాం. అలాంటిదే ఓ పాత సంగతి ఇది. కాకపొతే ఆ పత్రిక ప్రచారం చేసుకోలేదు.
ఇది ఇప్పటి మాట
కాదు. యాభై ఏళ్ళ పైమాటే.
మద్రాసు జనరల్
ఆసుపత్రి బీట్ చూసే ఒక విలేకరికి ఒక రోజు స్కూటర్ ప్రమాదంలో గాయపడి మరణించిన
వ్యక్తి శవం కనిపించింది. పక్కనే ఎవరికోసమో ఎదురు చూస్తున్న లక్ష్మి అనే వ్యక్తి
అతడికి తారసపడింది. ఆమె ఒక నిర్మాణ కూలీ. స్కూటర్ పై వెడుతున్న ఓ ఇద్దర్ని అటుగా
పోయే వాహనం కొట్టేసి ఆగకుండా అందరూ చూస్తుండగానే వెళ్ళిపోయింది. కిందపడి గిలగిలా
కొట్టుకుంటున్నవారిని అందరితో పాటు ఈమె కూడా చూసింది. అందరూ వింత చూసేవారే కాని
ఒక్కరూ కలగచేసుకోలేదు. ఈమే
పరిగెట్టుకువెళ్లి వాళ్ళను లేవదీయాలని ప్రయత్నించింది. ఓ టాక్సీని
ఆపింది. అప్పటికే ముగ్గురు నలుగురు ఆపకుండా పోయారు. మరి కిరాయి ఎవరిస్తారని
టాక్సీవాడు అడిగాడు. డబ్బులేదు. ముక్కుపుడక చూపించింది. టాక్సీలో ఇద్దరినీ జనరల్
ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. అయిన ఆలస్యం వల్ల
ఒకడు అప్పటికే చనిపోయాడు. ఈ స్తితిలో విషయం తెలుసుకున్న విలేకరి హృదయం
ద్రవించింది.
నిరక్షురాస్యురాలయిన
ఓ కూలీ వనిత తన రోజుకూలీ కూడా వొదులుకుని, ముక్కుపుడక
టాక్సీవాడికి ఇచ్చి ఆసుపత్రికి చేర్చిన వైనాన్ని ఆ విలేకరి మరునాడు తన పత్రికలో
రాసాడు. ‘క్వాలిటీ ఆఫ్ మెర్సీ’ అనే శీర్షికతో రాసిన ఆ వార్త మద్రాసులో చర్చనీయాంశం
అయింది. పోలీసు కమీషనర్ లక్ష్మికి పాతిక రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. ఆమె రోజు
కూలీ రూపాయన్నరతో పోల్చుకుంటే ఆ రోజుల్లో అది పెద్ద మొత్తమే. పత్రికా పాఠకులనుంచి
కూడా మంచి స్పందన వచ్చింది. అనేకమంది ఆమెకు కానుకలు పంపారు. మధురై నుంచి
వెంకటేశ్వరన్ అనే వ్యక్తి ఒక పార్సెల్ పంపాడు. గాయపడ్డవారి రక్తంతో తడిసిన ఆమె
చీరెకు బదులుగా ఒక కొత్తచీరెను కానుకగా పంపించాడు. పత్రిక పాఠకులనుంచి దాదాపు
వెయ్యి రూపాయల సాయం అందింది. వందరూపాయలు మించి వస్తే ఒక ఇత్తడి గిన్నె
కొనుక్కుంటానని ఆ యువతి తరువాత అదే పత్రికకు ఇచ్చిన
ఇంటర్వ్యూ చదివిన కంచి కామకోటి పీఠాధిపతి, పరమాచార్య ఒక
ఇత్తడి గిన్నెను కానుకగా పంపించారు.
ఇంతకీ అసలు విషయం
ఏమిటంటే -
ఆ వార్త రాసిన
పత్రిక హిందూ. ఆ వార్త రాసింది ఆ పత్రికలో కొత్తగా విలేకరిగా చేరిన ఆర్.జే.
రాజేంద్రప్రసాద్. ప్రసాద్ గారు రాసిన ‘డేట్ లైన్ ఆంధ్ర’ అనే పుస్తకంలో ఈ సమాచారం
వుంది.
(Published in SAKSHI daily on 04-08-2022, SUNDAY, today)
ఆల్
ఖయిదా అగ్రనేత ఆల్ జవహరీని అమెరికా వేటాడి, వెంటాడి ప్రాణాలు తీసిన వార్త కొంచెం ఆలస్యంగా వెలుగు చూసింది.
గురికి బారెడు దూరంలో ఉన్న ఆస్తులకు, మనుషులకు ఏమాత్రం హాని కలిగించకుండా కేవలం లక్ష్యాన్ని మాత్రమే
చేధించగల ఆధునిక క్షిపణి సాయంతో, ఆఫ్ఘనిస్థాన్
లో తలదాచుకున్న ఆ ఉగ్రవాదిని
మట్టుబెట్టింది.
ఇరవై
ఏళ్ళ క్రితం 2001 సెప్టెంబర్ పదకొండో తేదీన (9/11) నాటి ఆల్ ఖయిదా చీఫ్ ఒసామా బిన్
లాడెన్ కారణంగా జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 2997 మంది అమెరికన్ కుటుంబాల బాధకు, ఆవేదనకు జవహరి మరణం ఓ ముగింపు అని
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
9/11 గా
ప్రసిద్ధమైన ఆనాటి విధ్వంసానికి ప్రతీకారంగా, అమెరికా పదేళ్ల తర్వాత, 2011లో బిన్ లాడెన్ ని వధించి పగ తీర్చుకుంది. అప్పుడు లాడెన్ కు కుడి భుజంగా వ్యవహరించిన జవహరీని
కూడా వదిలిపెట్టలేదు. మరో పదేళ్ల తర్వాత
ఇప్పుడు ఆల్ జవహరీని చంపి, తమది పాము పగ అని అమెరికా యావత్ ప్రపంచానికి మరోమారు చాటి చెప్పింది.
ఈ
నేపధ్యంలో గతంలోకి తొంగిచూసి నాటి
విషయాలను పునశ్చరణ చేసుకుందాం.
ఒసామా
బిన్ లాడెన్ – బరాక్ హుస్సేన్ ఒబామా
వీరిద్దరి
మధ్యా నామసారూప్యత మాత్రమే కాదు, భావ
సారూప్యత కూడా వుంది.
‘మతం
కోసం ఎలాటి మారణహోమానికయినా సిద్ధం’ అనే సిద్ధాంతం అల్ ఖయిదా అధినేత ఒసామా బిన్
లాడెన్ ది.
‘ప్రపంచం
మీద పెత్తనం కోసం ఎంతటి దురాగతానికయినా సంసిద్ధం’ అనే తత్వం అలనాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామాది.
అయితే, ఆలోచన ఒక్కటే అయినా ఆచరణలో కొద్ది
తేడా వుంది.
‘పాముకు
పాలుపోసి పెంచుతాను, కానీ ఆ పాము తనను తప్ప ఎవరిని కాటేసినా పరవాలేదు అనే థియరీ’
ఒబామాది.
‘కోరల్లో
దాచుకున్న విషం కక్కేటప్పుడు స్వపర భేదాల ప్రసక్తి పనికిరాదనే భావజాలం’ ఒసామాది.
ఒకానొక
కాలంలో అమెరికా తన అవసరాలకోసం పెంచి పోషించిన ఒసామా బిన్ లాడెన్ అనే ఈ విషనాగు,
ఇరవై ఏళ్ళ క్రితం అమెరికాపైనే ఎదురుతిరిగి, పాలు పోసి పెంచిన చేతినే
కాటేసింది. సోవియట్ యూనియన్ అంతర్ధానం తరువాత ఏర్పడ్డ ఏకధృవ ప్రపంచానికి లేని
పెద్దరికాన్ని ఆపాదించుకుని, తనకు
తానుగా అమెరికా పెంచుకుంటూ వచ్చిన అహంభావాన్ని బిన్ లాడెన్ తనదయిన శైలిలో దెబ్బ
తీసినప్పుడుకానీ, ‘పాము-పాలు’
కధ లోని అంతరార్ధం అమెరికాకు అవగతం
కాలేదు. తనదాకా వస్తేగాని తత్వం బోధపడదన్నట్టుగా, 2001, సెప్టెంబర్ 11 దుర్ఘటన తరవాత గాని ఉగ్రవాదం
వల్ల పొంచివున్న ముప్పు ఎలావుంటున్నన్నది ఆ అగ్ర దేశానికి అర్ధం కాలేదు.
ఆనాటి
పరాభవం అమెరికాలో పట్టుదలను పెంచింది. ఆ దురాగతానికి రూపశిల్పి అయిన ఒసామా బిన్
లాడెన్ అంతం చూడడానికి దశాబ్ద కాలంగా అమెరికా చేయని ప్రయత్నం అంటూ లేదు. చిట్టచివరికి,
పదేళ్ల సుదీర్ఘ
నిరీక్షణ తర్వాత, పాకిస్తాన్
భూభాగంలో ఆ దేశ పాలకులకే తెలియకుండా తలదాచుకుంటున్న ఒసామా బిన్ లాడెన్ ను, జల్లెడ పట్టి గాలించి పట్టుకుని
మట్టు పెట్టేదాకా అగ్రరాజ్యాధినేత బరాక్ హుస్సేన్ ఒబామాకు కంటిమీద కునుకులేకుండాపోయింది. ఒసామా మరణించిన
విషయాన్ని స్వయంగా అమెరికన్ అధ్యక్షుడే ప్రకటించిన అంశాన్ని గమనిస్తే ఈ విషయానికి ఆ దేశం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో
విశదం అవుతుంది. లాడెన్ మరణ వార్తను ధృవ పరచుకోవడానికి వీలుగా అమెరికా వ్యూహకర్తలు
పకడ్బందీగా అమలు చేసిన హై టెక్ పద్ధతులు టీవీల్లో చూసినవారికి జేమ్స్ బాండ్
సినిమాలను జ్ఞప్తికి వచ్చాయి. వైట్ హౌస్ లో కూర్చుని పధకం అమలవుతున్న
తీరుతెన్నులను ఎప్పటికప్పుడు ఉపగ్రహ సాయంతో గమనిస్తున్న ప్రెసిడెంట్ ఒబామా హావభావాలనుబట్టి అన్ని దేశాలలోని టీవీ
వీక్షకులు లాడెన్ మృతి పట్ల ఆ దేశానికి వున్న పట్టుదలను అర్ధం చేసుకోగలిగారు.
బరాక్
హుస్సేన్ ఒబామా అమెరికా 44వ
అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అన్నది, 2001
సెప్టెంబర్ 11వ తేదీన అల్ ఖయిదా విసిరిన పంజా దెబ్బకు అమెరికా గడగడ లాడిన తరువాతనే
జరగడం గమనార్హం. తమ పోరు ఉగ్రవాదం మీదనే కాని ఒక మతం మీద కాదన్న పద్ధతిలో అమెరికన్
ఓటర్లు తీర్పు ఇచ్చినట్టు అప్పట్లో
పత్రికలు పొగడ్తల వర్షం కురిపించాయి. అధ్యక్ష ఎన్నికకు ముందూ, ఆ తరువాతా ‘నేను క్రైస్తవుడినే’ అని
బరాక్ హుస్సేన్ ఒబామా బహిరంగంగా ప్రకటించుకున్నప్పటికీ, ముస్లింగా ధ్వనించే తన పేరును మాత్రం
మార్చుకోలేదు. అధ్యక్షుడిగా ఎన్నికయిన తరువాత చేసిన తొలి విదేశీ పర్యటనలో
మసీదులోకి పాదరక్షలతో ప్రవేశించడం అప్పట్లో వివాదాస్పదమయింది కూడా. అయినా ఒబామా
విశ్వ శాంతికి చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.
ఇక, అమెరికన్ల ప్రతీకారేచ్ఛకు బలయిన
ఒసామా బిన్ లాడెన్ పూర్వీకులు ఎమెన్ లో కడునిరుపేదలు. అతడి తండ్రి మహమ్మద్ బిన్
లాడెన్, ఎమెన్
నుంచి ఉదరపోషణార్ధం సౌదీ అరేబియాకు వలస వెళ్లి నిర్మాణ రంగంలో కాలుపెట్టాడు.
అక్కడినుంచి అతడు పట్టింది బంగారమయింది. సౌదీ రాజ్య కుటుంబీకులతో ఏర్పరచుకున్న
సన్నిహిత సంబంధాలు అతడి స్తితి గతుల్ని పూర్తిగా మార్చివేశాయి. అనతికాలంలోనే
కోట్లకు పడగలెత్తాడు.
సౌదీ
అరేబియాలో దాదాపు ఎనభయ్ శాతం రహదారులను మహమ్మద్ కంపెనీయే నిర్మించింది. అతడికి
అనేకమంది భార్యలు. పదో భార్య సిరియన్ దేశీయురాలు. ఆమెకు జన్మించినవాడే ఒసామా బిన్
లాడెన్. మహమ్మద్ సంతానం 52 మందిలో
ఒసామా 17వ
వాడు. ఆరడుగులు ఎత్తు. అయినా మనిషి బక్క పలచన. సంపన్న కుటుంబంలో పుట్టి విలాసాలకు
అలవాటుపడాల్సిన ఒసామా మనసు మతం వైపు మళ్ళింది.
గల్ఫ్ యుద్ధం సహాయక చర్యల్లో భాగంగా
తన భూభాగంలో అమెరికా మిలిటరీ
స్తావరం ఏర్పాటుకు సౌదీ ప్రభుత్వం
అనుమతించడాన్నిఒసామా జీర్ణించుకోలేకపోయాడు. ఆ సందర్భంలో అతడు చేసిన విమర్శలను
ప్రభుత్వం తప్పుపట్టింది. ఒసామా పౌర సత్వాన్ని, పాస్ పోర్ట్ ను రద్దు చేసింది.
అప్పటికే లాడెన్ కుటుంబం ఒసామాను తమ నుంచి వెలి వేసింది. దరిమిలా అల్ ఖయిదాకు అనేక
దేశాల్లో బలమయిన స్తావరాలు ఏర్పాటుచేసే కృషిని కొనసాగించిన ఒసామా మొత్తం ప్రపంచంలోనే
అతి పెద్ద ఉగ్రవాదిగా గుర్తింపు పొందాడు. అల్ ఖయిదా పేరు చెబితే పాశ్చాత్య దేశాల గుండెల్లో రైళ్ళు
పరిగెత్తేలా చేసాడు. ’భౌతికంగా నన్ను రూపుమాపగలరేమోకాని నా భావజాలాన్ని, నా లక్ష్యాన్ని ఏనాటికీ, ఎవ్వరూ రూపుమాపలేరు’ అని ఒసామా బిన్
లాడెన్ తరచుగా చెబుతుండేవాడు. ధనరాశుల నడుమ జన్మించి, సంపదలతో వచ్చే సుఖాలనన్నిటినీ
కాలదన్నుకుని, కొండలు, గుట్టల్లో జీవనాన్ని ఎన్నుకుని,
నిరంతర
పోరాటాలతో కాలం గడిపిన ఆయన తీరు ఎంతోమందిని ఆయన వైపు నడిపించింది. చేస్తున్నది
తప్పా వొప్పా అన్న విచక్షణ నుంచి వారిని దూరం చేసింది.
‘కత్తి తిప్పేవాడు ఆ కత్తి ఒరలోనే మరణిస్తాడు’ అన్నది
బైబిల్ సూక్తి. క్రైస్తవం ఒక్కటే కాదు,
ఇస్లాం అయినా
ప్రపంచంలో ఏ మతమయినా హింసామార్గాన్ని ఎంతమాత్రం అనుమతించదు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం
ఉపేక్షించదు. కానీ, ఈ
ప్రపంచంలో జరిగిన అనేక యుద్ధాలు మతం పేరిట మొదలు కావడం ఆ మతాలు చేసుకున్న
దౌర్భాగ్యం.
‘మతాన్ని
మీరు రక్షిస్తే మతం మిమ్మల్ని రక్షిస్తుంది’ అనే ప్రాధమిక సూత్రం ఈ తగవులకు
మూలకారణం. మతాన్ని రక్షించడం అంటే పరమతాలనుంచి దాన్ని కాపాడుకోవడం కాదనీ, ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ,
పరమతాలను సయితం
గౌరవించడమనీ మత పెద్దలు ఎంతగా మొత్తుకుంటున్నా, మత ఛాందసులు పట్టించుకోలేదు. ఫలితం
మతం పేరిట యుద్ధాలు, రక్త
తర్పణాలు. ట్యూబ్ నుంచి పేస్ట్ బయటకు తీయగలమే కాని తిరిగి దానిని ట్యూబ్ లో
పెట్టడం అసాధ్యం. అలాగే, ఉగ్రవాదం,
తీవ్రవాదం ఏ
పేరుతొ పిలిచినా దాన్ని పెంచడం సులభం, తుంచడం కష్టం.
పవిత్ర
యుద్ధం పేరుతొ సంవత్సరాల తరబడి సాగించిన పోరాటంలో ఒసామా బిన్ లాడెన్ చివరకు తన
ప్రాణాలనే తర్పణంగా విడవాల్సివచ్చింది. కళ్లుచెదిరే సంపద కలిగిన కలవారి కుటుంబంలో
పుట్టి కూడా తను నమ్మిన సిద్ధాంతం కోసం కొండకోనల్లో దుర్భర జీవితం గడిపిన అనుభవం
ఒసామాది. నిరుపేద కుటుంబంలో పుట్టి అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడు కాగలిగిన
అదృష్టం ఒబామాది. తరాలకు పూర్వం మత మూలాలు ఒక్కటే అయినా, వేర్వేరు మతాలకు ప్రతినిధులుగా
వీరిద్దరూ పోరుబాటలో పయనించిన తీరు విధి వైపరీత్యానికి పరాకాష్ట.
ఒసామా
తర్వాత ఆల్ ఖాయిదా పగ్గాలు చేపట్టిన ఆల్ జవహారీ కూడా తన నాయకుడు లాడెన్ తరహాలోనే
మరణించడం కాకతాళీయం.