3, ఆగస్టు 2022, బుధవారం
భారత స్వాతంత్ర అమృతోత్సవం
ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం
ప్రతి ఊళ్ళో, ప్రతి గుళ్ళో నాదస్వరం
(ఆగస్టు మూడు పినాకపాణిగారి జయంతి)
డాక్టర్లకే పాఠాలు చెప్పే డాక్టర్. కర్నాటక
సంగీతాన్ని ఆపోసన పట్టిన ఘనాపాఠీలకే గుగ్గురువు. బాడీ బిల్డర్. వెయిట్ లిఫ్టర్.
ఇలా ఒక్కొక్క రంగంలో నిష్ణాతులయిన వాళ్లు కానవస్తూనే వుంటారు. అయితే వీటన్నింటినీ
పుణికి పుచ్చుకుని అందరిచేతా ఔరా అనిపించుకుంటూ నిండు నూరేళ్ళ జీవితాన్ని గడిపిన
అరుదయిన వ్యక్తే డాక్టర్ శ్రీపాద పినాకపాణి. బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగుగడ్డ
గర్వించదగిన పదహారణాల తెలుగుబిడ్డ.
చాలా ఏళ్ళ క్రితం సంగతులు.
“జంటనగరాలలో రెండు సంగీత కళాశాలలు వున్నాయి. ఒకటి సికింద్రాబాద్ లో, రెండోది హైదరాబాద్ లో. సికింద్రాబాద్ కాలేజీకి నూకల చిన్న సత్యనారాయణ
ప్రిన్సిపాల్ అయితే, హైదరాబాద్ కాలేజీకి హిందుస్తానీ
విద్వాంసులు దంతాలే ప్రిన్సిపాల్. అప్పట్లో రెండు కాలేజీలు కలసి రవీంద్రభారతిలో
త్యాగరాజ స్వామి ఉత్సవాలు నిర్వహించేవారు. ఉదయం నుంచి ప్రసిద్ధ విద్వాంసుల కచేరీలు
మొదలయ్యేవి. ఇక రోజంతా అక్కడే గడపడం. పక్కనే వున్న గోపి హోటల్లో టిఫినూ, భోజనమున్నూ.
“ఈ ఉత్సవాల్లో ఓ రోజు సంక్రాంతి వచ్చింది. ఆవేళ ఉదయం పదకొండు గంటలకు కోటి
శ్రీ కృష్ణదేవరాయ ఆడిటోరియం లో పినాకపాణి గారి సోదాహరణ ప్రసంగం, కర్ణాటక సంగీతంలో నెరవు (అరవంలో నెరవల్) స్వరకల్పన ఈ రెండింటిపై. ఆ రోజు హాజరు కాని సంగీత అభిమానులది దురదృష్టమనే
చెప్పాలి. నాలుగు గంటలకు పైగా పాణి గారు అద్భుతమైన ప్రసంగం చేసారు. కళ్యాణి రాగంలో
‘మది దేహి’ అనే కీర్తనలో ‘పతిత పావన’ అనే చోట నెరవు, స్వరకల్పన
గురించి. నిజంగా అమ్మవారు ప్రత్యక్షమైన అనుభూతి కలిగింది అందరికి. పండగ విందు
అక్కడే దొరికింది. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ పినాక పాణి మీద కవర్ పేజి కధనం
ప్రచురించింది. జి ఎన్ ఎస్ రాఘవన్ గారు రాసారు. ఆయన ఆకాశవాణి వార్తా విభాగానికి
డైరెక్టర్ గా పని చేసారు. రాఘవన్ కు పినాకపాణి
సంగీతం అంటే అమిత ఇష్టం.
“మ్యూజిక్ అకాడెమి పినాక పాణి గారిని ‘సంగీత కళానిధి’ బిరుదుతో
సత్కరించింది. భారత ప్రభుత్వం ‘పద్మ విభూషణ్’ పురస్కారంతో గౌరవించింది. పినాక పాణి
గారికి రావలసిన సత్కారాలన్నీ వచ్చాయి. దీనితో పాటు భగవదనుగ్రహం కూడా. నూరేళ్ళు
పూర్ణాయుర్దాయం లభించింది. నేదునూరి, నూకల, వోలేటి, గోపాలరత్నం వంటి శిష్యులు, మల్లాది సూరిబాబు, శ్రీరామ్, రవి కుమార్ వంటి ప్రశిష్యులు ఆయన బాణీ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
ఇంతకన్న కావల్సినదేముంటుంది ? 1990 లో ఆయనకు తొంభయి ఏళ్ళు పూర్తయిన
సందర్భంలో కర్నూలులో కొంత మంది విద్వాంసులు వెళ్లి ఆయనకు పాదపూజ చేసారు. ఆయన పాడిన
ఓ కచేరి సీడీగా తెచ్చారు.
“పినాకపాణి గారికి కొన్ని నిర్దిష్టమయిన ప్రమాణాలు వున్నాయని సంగీత ప్రియుడు, రేడియో,
దూరదర్సన్ లలో న్యూస్ డైరెక్టర్ గా పనిచేసిన
ఆర్వీవీ కృష్ణారావు చెప్పారు. వాటితో
రాజీపడేవారు కారు అనడానికి ఓ ఉదాహరణ జోడించారు.
‘బెజవాడలో మా త్యాగరాజ సంగీత కళా సమితి
తరఫున ఆయన్ని 1986 లో ఘనంగా సత్కరించాము. అప్పుడు ఆయన
ధర్మపురి రామమూర్తితో కలసి కర్నూలు నుంచి బస్సులో వచ్చారు. సన్మానం అయిన తర్వాత
సుధారఘునాథన్ కచేరి పెట్టాము. చివరివరకు కూర్చున్నారు. మర్నాడు కూడా వున్నారు. ఆ
రోజు మరో ప్రసిద్ధ విద్వాంసులు మహారాజపురం సంతానం కచేరి. కచేరీకి రమ్మనమని
పిలిచాం. రానని మొండి కేసారు. ఎందుకని అడుగుతే ‘వాడు డబ్బు మనిషి. విద్వత్తుని
నిర్మొహమాటంగా అమ్ముకుంటున్నాడు. వాడు ఎంత గొప్పగా పాడినా అనవసరం’ అని కృష్ణారావు అన్నారు.
ఇక సంగీతానికి వస్తే ‘అసలయిన సంగీతం
కావేరి నది వొడ్డున వుంది’ అనేది పినాక పాణి గారి అభిప్రాయం. అందుకనే కాబోలు ‘పాణి
గారిది తంజావూరు బాణీ’ అంటారు. ‘మీ గురువు ఎవర’ని అడిగితే ‘నా తల్లి’ అని చెపుతూ
వుంటారు. చిన్నప్పుడు తల్లి పాడే తరంగాలు, ఆధ్యాత్మ
రామాయణ కీర్తనలే, డాక్టర్ అయిన తనని సంగీతం వయిపు
లాక్కుని వెళ్లాయని పాణి గారు చెపుతూ వుంటారు. సంగీతం ఆంధ్రదేశంలో వ్యాప్తి
చెందాలంటే ఒకే ఒక సూత్రం ఉందంటారు పాణిగారు. ప్రతి వూళ్ళోని దేవాలయంలో ప్రాతః కాలంలో నాదస్వర వాయిద్యం వినిపించాలన్నది ఆయన కోరిక.
నాదస్వరానికి మించింది మరోటి లేదన్నది ఆయన విశ్వాసం. ఉదయం పూట నాదస్వరం వింటే
సంగీతంపై అభిమానం కలుగుతుందని, అప్పుడే తెలుగునాట కర్నాటక సంగీతం
వైభవంగా పరిఢవిల్లుతుందని అనేవారు.
‘శతాయుష్మాన్ భవ’ అని దీవిస్తారు. కోటికి వొకరికి కూడా లభ్యంకాని ఆ అదృష్టం పినాకపాణి గారికి
భగవంతుడు ప్రసాదించాడు. దానితో పాటే మనందరికీ మరో వరం అనుగ్రహించాడు. అదేమిటంటే
ఆయనకు సమకాలికులుగా కొన్నేళ్ళు మనగలిగిన మహద్భాగ్యం.
(03-08-2022)
విందామయా నరుడ విందామయా - భండారు శ్రీనివాస రావు
చిన్నప్పుడు
చదివిన ముళ్ళపూడి వారి జోక్ గుర్తొస్తోంది.
"పెళ్ళయిన
కొత్తల్లో పెళ్ళాం మాట మొగుడు వింటాడట.
తరవాత్తరవాత -
మొగుడి మాట పెళ్ళాం వింటుందట.
పొతే, ఆ తరవాత మాత్రం -
ఆ ఇద్దరి మాటలు ఇరుగూ పొరుగూ వింటారట."
ఈ వినడం అన్నది
చెవికి సంబంధించిన విషయం. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే పోలా - అనే చెవలాయిలు-
వినదగునెవ్వరు చెప్పిన అని- ఎవరేది చెప్పినా చెవులు రెండూ వొగ్గించి, రిక్కించి మరీ
వింటారు.
కొందరు భార్యలు -
" నా (మా) మొగుడు నా (మా) మాట వింటాడు " అన్న తృప్తిలో అన్ని
అసంతృప్తులు మరచిపోతుంటారు. మగవాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి, మాట వినే పెళ్ళాం
దొరికిందని బయట చెప్పుకుంటూ, మురిసి
ముక్కచెక్కలవుతూ మగధీరులమని మీసం మెలేస్తుంటారు.
వినికిడి సమస్య
అంటూ లేకపోతె, ఈ వినకపోవడం అన్న ప్రసక్తే వుండదు. ఆ సమస్య వుంటే ఈ వినే సమస్యకు తావుండదు.
ఎంచక్కా, ఎవరేం చెబుతున్నా వింటున్న ఫోజు పెట్టి- చెప్పేవాళ్ళ నోటి దురద
వొదిలించవచ్చు.
విని, తలాడించే అలవాటు
మగవాళ్ళలో ముఖ్యంగా పెళ్ళయిన వాళ్లలో ఎక్కువన్న థియరీ ఒకటుంది. ఈ బాపతు మగాళ్ళు ఆ బాపతు
అపప్రధ వొదిలించుకోవడానికి ఆదర్శ పురుషుల అవతారం ఎత్తుతుంటారు. " భార్య మాట
వింటే తప్పేమిటి? ఆవిడా మనలాంటి మనిషే కదా." అంటూ తమకి తాము సర్ది చెప్పుకుంటారు.
కాగా మరో రకం
మగాళ్ళు- తమ మగాడితనాన్ని - వేరే రకంగా ప్రదర్శిస్తుంటారు.
" నన్నడిగితే అసలు
మగాళ్ళ మాటల్ని ఆడవాళ్ళు వినకపోవడమే కాదు, ఎదిరించమని కూడా
చెబుతాను. నా విషయమే తీసుకోండి. మామూలుగా మొగుళ్ళు రాగానే భార్యలు లేచినిలబడడం
ఆనవాయితీ కదా. మా ఇంట్లో అలా కాదు. నేను బయట నుంచి రాగానే మా ఆవిడ లేచి
నిలబడబోతుంది. పరవాలేదు కూర్చో అంటాను. నా మాట వినొద్దన్నది మా ఇంట్లో నా రూలు
కాబట్టి లేచి నిలబడుతుంది. చూసారా! అదీ నేను నా భార్య కిస్తున్న స్వేఛ్చ."
అంటుంటారు ఈ కోవలోకి వచ్చే మొగుళ్ళు.
బొత్తిగా మాట
వినని జనం -జనాభాలో ఎక్కువ. వీళ్ళని 'సీతయ్యలు' అంటారని కూడా ఈ
మధ్యనే తెలిసింది - ఓ సినిమా పుణ్యమా అని.
పొతే,వినడం వినకపోవడం అన్న
రూట్లో ముందుకుపోయే పని కాసేపు పక్కనపెడదాం.
హైదరాబాద్
ఆలిండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీ పీ ఎస్ గోపాల కృష్ణ -'విన్నవింత' అనే శీర్షికతో
రేడియో లో ఒక కార్యక్రమం కొన్నాళ్ళు నడిపారు. విన్న వింతలను శ్రోతలతో పంచుకోవడం
రచయిత ఉద్దేశ్యం. అయితే వినేవారికి పెద్దపీట వేసే పెద్ద మనసు వున్నవాడు కనుక, విన్నవించుకోవడం
అనే అర్థంతో దానికి "విన్నవింత" అని పేరు పెట్టారు.
మా బోటి రేడియోలో
పనిచేసిన వాళ్లకి వినే వాళ్ళే 'దేవుళ్ళు' కాబట్టి , పొద్దునపూట వచ్చే
ఆ ప్రోగ్రాం వాళ్ళకో 'నివేదన' గా భావించే వాళ్ళం. ఆయన చెప్పే వన్నీ మంచి విషయాలే కాబట్టి , ఆ రోజుల్లో
శ్రోతలు కూడా మంచి సంగతులు వినే బాపతు కాబట్టి- ఆయన కూడా రకరకాల పనికొచ్చే
కబుర్లతో దాన్ని తీర్చిదిద్దేవారు.(ఇన్ని కా'బట్టీలు' అవసరమా అంటే-
ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పకపోతే రేడియో వాళ్లకి తెలుగు రాదు అని అపోహపడే
ప్రమాదం సయితం లేకపోనూ లేదు) . శ్రోతలు కూడా 'రేడియోలోచెప్పడమేమిటి? మనం వినడమేమిటి?' అని భేషజాలకు
పోకుండా బుద్దిగా వినేవారు. ఆ విధంగా చెప్పేవారికి వినేవారు, వినేవారికి
చెప్పేవారు లేరనే కరువు లేకుండా పోయింది. ఆ మాటకు వస్తే ఆ రోజుల్లో రేడియోలో
ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఎన్నో వినేవాళ్ళం అని గుర్తు చేసుకునే ఆనాటి శ్రోతలు ఈ
రోజుల్లో కూడా తారసపడడం కద్దు.
మళ్ళీ అసలు
సంగతికొస్తే-
'వినంగానే సరిపోదు-
విన్నది ఆచరించాలనీ - అప్పుడే విన్నదానికి సార్ధకత' అనే వాళ్ళున్నారు.
'ఒరేయ్ కన్నా!
మోటార్ సైకిల్ పై అంత స్పీడ్ గా వెళ్లకురా!' అని తండ్రి అంటే-
పిల్లాడు విన్నట్టుగా తలాడిస్తే - నిజానికి అది వినడం కిందికి లెక్క రాదు.
విని
పాటించినప్పుడే - 'రాముడు మంచి బాలుడు, తలిదండ్రుల మాట జవదాటడు' అని కన్నవాళ్ళు -
వినే వాళ్లకు చెప్పుకునే వీలుంటుంది.
వినడంలో ఇంత విషయం
వుంది కాబట్టే- నోములు, వ్రతాలు చేసేటప్పుడు వ్రత కధలు విన్నవాళ్ళకు కూడా 'వ్రత ఫలం' లో భాగం
కల్పించారని - సూతుడు శౌనకాది మునులకు చెప్పగా-అది విన్నవాళ్ళలో ఒకడు
తెలియచేయడమైనదని సర్వజనులకు ఇందుమూలముగా తెలియపరచడమైనది.
NOTE: Courtesy Image Owner
