3, జూన్ 2022, శుక్రవారం

సైకిళ్ళ రోజు – భండారు శ్రీనివాసరావు

  

(ఈరోజు ప్రపంచ సైకిళ్ళ దినోత్సవం అంటున్నారు) 

అదేమిటో ఒకానొక కాలంలో ప్రతివాడికి ఒక తీరని కల వుండేది. జీవితంలో ఒకసారి అయినా సైకిల్ తొక్కాలని. ఆ కోరిక నాకూ వుండేది. అది తీరాలి అంటే ముందు రెండు వుండాలి. సైకిల్ వుండాలి. అది తొక్కడం రావాలి. ఆ రోజుల్లో మన ఎత్తు చూస్తే సైకిల్ లో సగం. అంచేత చాలా కాలం అది తీరని కోరిక గానే వుండి పోయింది. అది తీరడానికి హై స్కూలు చదువు దాకా వేచి ఉండాల్సి వచ్చింది. 

ఖమ్మం రిక్కబజార్ స్కూల్లో చేరినప్పుడు దగ్గర్లో ట్రంక్ రోడ్డు మీద తాత కొట్టు వుండేది. అక్కడ జీళ్లు, నువ్వుండలు దొరికేవి. వాటికోసం వెళ్ళేవాళ్ళం.  ఆ షాపు ముందు వరసగా కొన్ని సైకిళ్ళు ఉండేవి. తర్వాత తెలిసింది. అవి అద్దెకు ఇచ్చే సైకిళ్ళు అని. దాంతో జీళ్లు, రంగు సోడాల డబ్బులు మిగిల్చి ఒక సైకిల్ అద్దెకు తీసుకునే వాడిని. గంటకు అణా. అది తీసుకుని తోసుకుంటూ మామిళ్ళ గూడెంలోని పెవిలియన్ గ్రౌండ్ కు వెళ్ళే వాడిని. అయితే సైకిల్ తొక్కడం నేర్పేదెవరు?  మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు గారిల్లు పక్కనే. అప్పుడు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ అనుకుంటా. నమ్మరు కానీ ఆయన కుమారుడు జలగం ప్రసాద రావు ఈ విషయంలో చాలా సాయం చేశారు. కింద పడడం, మోచేతులు, మోకాళ్లు గీసుకోవడం ఇత్యాది కష్టాల తర్వాత రోడ్డు మీద సైకిల్ నడిపే సామర్ధ్యం వచ్చింది.

ఖమ్మం ఎస్ ఆర్ అండ్ బీ జీ ఎన్ ఆర్ ఆర్ట్స్ అండ్  సైన్స్ కాలేజీలో పీయూసీ చదివేటప్పుడు కాలేజీకి సైకిల్ మీద వెళ్ళే వాడిని. అది మా పెద్ద బావగారు అయితరాజు రాం రావు గారిది. మామిళ్ళ గూడెం మొత్తంలో సొంత  సైకిల్ వున్న మొనగాడు. ఆయన ఊళ్ళో లేనప్పుడు ఆ సైకిల్ తీసుకుని కాలేజీకి వెళ్ళేవాడిని. అది గుట్టల బజార్ అవతల వుండేది. ఆ దోవ అంతా నిటారుగా వుండేది. ఆ బాటలో సైకిల్ తొక్కలేక చేతితో తోసుకుంటూ పైకి వెళ్ళే వాడిని. నా కాలేజి రోజులలో ఒకే ఒక అమ్మాయి, అదీ నా క్లాసు మేట్, అరుణ అనుకుంటా  సైకిల్ మీద వచ్చేది. ఎత్తు ఎక్కలేక సైకిల్ ని భారంగా తోసుకుంటూ గుట్ట ఎక్కుతున్న నన్ను చూసి ఆమె  సైకిల్ మీద వెడుతూ విలాసంగా ఓ అరనవ్వు నవ్వింది.

అంతే! అప్పటి నుంచి సైకిల్ మీద యావ, ధ్యాస రెండూ పోయాయి.   

(03-06-2022)

వీణ ముచ్చట్లు – భండారు శ్రీనివాసరావు

 పొద్దున్నే వీణ శ్యామ సుందర్ నుంచి ఫోను. బెజవాడ ఎస్సారార్ కాలేజీలో నాకు డిగ్రీలో సహాధ్యాయి.

వీణ ఆయన ఇంటి పేరు కాదు, అయ్యగారి అసలు ఇంటిపేరు. సదా వీణాధారి కనుక వీణ ఇంటి పేరుగా మారిపోయింది. వైణికుడిగా ఇంటాబయటా  మంచి పేరు ప్రఖ్యాతులు, బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చి విదేశాల్లో స్థిరపడిన సంతానం, పుట్టుకతోనే వడ్డించిన జీవితం కాకపోయినా స్వయం కృషితో తన జీవితాన్ని వడ్డించిన విస్తరిగా మార్చుకున్నారు. ఈ క్రమంలో, ఆయన భార్యగా  శ్రీమతి జయలక్ష్మి అందించిన తోడ్పాటును కూడా సతతం గుర్తు చేసుకుంటూ వుంటారు. ఈరోజు ఆవిడ పుట్టిన రోజు కాబట్టి శుభాకాంక్షలు తెలిపాను. ఈ సందర్భంలో శ్యామసుందర్ ఒక మాట చెప్పారు, ఫిబ్రవరి తొమ్మిది ప్రేమ పుట్టిన రోజు అని.

పూర్తిగా బోధ పడలేదు. అయినా కొంత అర్ధం అయింది. ఆరోజు మా ఆవిడ పుట్టిన రోజు.  ఈ ప్రేమ పుట్టిన రోజు ఏమిటి? ఆయనే విడమరిచారు. మిమ్మల్ని ప్రేమించడానికే  ఆమె పుట్టింది అన్నారు.

ఇవతల నా పరిస్థితి అధ్వాన్నం. నోరు పూడుకుపోయింది.  గొంతు పెగల్లేదు. బలవంతాన పెకిలించుకుని అన్నాను.

‘మన్నించండి శ్యామ సుందర్! మరోసారి నేనే ఫోన్ చేసి మాట్లాడుతాను

కింది ఫోటో:

2019 ఫిబ్రవరి తొమ్మిదో తేదీన తన చివరాఖరి పుట్టిన రోజున మా ఆవిడ నిర్మలకు కేక్ తినిపిస్తూ.  తరువాత ఆరుమాసాలకే తీవ్రమైన గుండె పోటుతో ఆగస్టులో ఆకస్మికంగా కన్నుమూసింది  





(03-06-2022)

     

2, జూన్ 2022, గురువారం

కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలన – భండారు శ్రీనివాసరావు

 (జూన్ రెండో తేదీ తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం)

తెలంగాణా పంచాయతీ రాజ్,  ఐ.టీ. శాఖల మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు, తండ్రి కేసేఆర్  లాగే చక్కని మాటకారి.

కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాదు ప్రెస్ క్లబ్  ఏర్పాటు చేసిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన ఒక మాటన్నారు, కోటి  ఆశలు, కోటి  అనుమానాల నేపధ్యంలో కొత్త రాష్ట్రంగా తెలంగాణా  ఆవిర్భవించిందని. నిజమే. తెలంగాణ కోరుకున్నవారు కోటి  ఆశలు పెట్టుకున్నారు. కోరుకోనివారు కోటి  అనుమానాలు పెంచుకున్నారు. ఆశలు, అనుమానాల సంగతేమో కానీ, తెలంగాణా రాష్ట్రం ఏర్పడడం మాత్రం జరిగిపోయింది. నీటిమీద రాత కాకుండా  రాతిమీద గీత మాదిరిగా  తెలంగాణా అనేది ఇప్పుడు  ఒక చెరగని నిజం. చెరపలేని సత్యం. ఎదురుగా నిలబడి, కనబడుతున్న ఓ వాస్తవం. 

తెలంగాణా రాగానే కొత్త రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకు పోతుందని అనుకున్నవారు వున్నారు. కరెంటు కొరతతో కొత్త రాష్ట్రం చీకటిమయం  అవుతుందని  అంచనాలు కూడా వేసారు.  కాలం గడుస్తోంది. కానీ వారనుకున్నట్టు మాత్రం  జరగలేదు. పైపెచ్చు,  కనీవినీ ఎరుగని విధంగా వేసవికాలంలో రాష్ట్రం నిప్పుల కొలిమిలా తయారయినా కూడా అధికారిక   కోతలు లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతోంది. ప్రత్యర్ధులు కూడా పరోక్షంలో అంగీకరిస్తున్న కేసీఆర్ సాధించిన అద్భుతం ఇది.

సమస్యలు అన్నింటికీ తెలంగాణా ఏర్పాటు ఒక్కటే సర్వరోగనివారిణి అనీ,  తెలంగాణా రాగానే ఏళ్ళతరబడి పేరుకునివున్న నీళ్ళూ, నిధులూ, ఉద్యోగాల వంటి ఈ ప్రాంతపు  సమస్యలన్నీ  మంత్రం వేసినట్టు  మాయం అయిపోతాయని  అనుకున్నవారూ వున్నారు. వారి అనుమానాలకు ప్రాతిపదిక కూడా వుంది. ఉమ్మడి రాష్ట్రంలో అదే పరిస్థితి.  అయితే,  వారనుకున్నట్టూ జరగలేదు. అలా అని రాత్రికి రాత్రే  సమస్యలు అన్నీ పరిష్కారం అయిపోనూలేదు.

అంటే  ఈ ఎనిమిదేళ్ల  కాలంలో ఏమీ జరగలేదా  అంటే, జరుగుతుందని 'చాలామంది' భయపడ్డ ఒక విషయం మాత్రం జరగలేదు. హైదరాబాద్ ప్రత్యేకత ఏదీ చెరిగిపోలేదు, అదొక్కటే ఊరట కలిగించే విషయం. ఈ కితాబు ఇచ్చింది కూడా ఆషామాషీ మనిషేమీ కాదు. మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా వున్నప్పుడు చాలాకాలం ఆయన వద్ద సమాచార సలహాదారుగా పనిచేసిన ఆర్ధిక  వ్యవహారాల పాత్రికేయుడు సంజయ్ బారు. నిజానికి ఈ బారు గారు ప్రత్యేక తెలంగాణాకు బద్ధ వ్యతిరేకి. కరడుగట్టిన  సమైక్యవాది. తన మనస్సులోని ఈ మాటని అయన ఏనాడూ  దాచుకోలేదు. అలాటి సంజయ్ బారు  తెలంగాణా కల సాకారం అయిన ఏడాది తరువాత  అన్నమాట ఇది. నిజానికి అక్షరాలా రాసిన మాట ఇది.

'డెక్కన్ హైదరాబాదు గురించి నేను భయపడ్డది ఏమీ జరగలేదు. ఇక్కడివారికి  అరమరికలు తెలియవు, ఆదరించి అక్కున చేర్చుకునే తత్వం ఇక్కడివారి సొంతం. అన్నింటికీ మించి ఈ నగరానికి వున్న ప్రత్యేక ఆకర్షణ, శోభ, సౌందర్యం  ఇవేవీ చెరిగిపోలేదు. ఇవన్నీ చరిత్ర పుటల్లో pచేరిపోతాయేమో అని నేను భయపడ్డాను. కానీ నా సందేహాలన్నీ  పటాపంచలయ్యాయి' అని ఒక ఆంగ్ల జాతీయ దినపత్రికలో రాసిన వ్యాసంలో  పేర్కొన్నారు.

సంజయ్ బారు  చెప్పినట్టు భయాలు, అనుమానాలు, సందేహాలు అన్నీ కాకపోయినా కొన్నయినా తొలగిపోయాయి. అయితే తెలంగాణాపై తెలంగాణా  ప్రజలు  పెంచుకున్న కోటి ఆశల మాటేమిటి? అవన్నీ నీటిమూటలేనా? నెరవేరే మాటలేనా? తెలంగాణా రాకముందు, వచ్చిన తరువాత తెలంగాణా సాధకుడిగా పేరు మూటగట్టుకున్న కేసీఆర్ చెప్పిన మాటలు ఏమిటి? చేస్తున్న ఆలోచనలు ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

'అన్నీ ఆలోచనలేనా? ఆచరణలో ఏవీ?' అని అడిగే సందేహాస్పదులు కూడా వుంటారు. ఇలాటి వారందర్నీ రాజకీయ ప్రతికక్షులుగా పరిగణించి తేలిగ్గా  కొట్టిపారేయడం తగదు.

కేసీఆర్ ఆంతరంగిక సమావేశాల్లో చెప్పేదేమిటో  తెలియదు కాని బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడినా ఆయన మాటల్లో తొంగి చూసేది ఒకే ఒక్క విషయం. అది బంగారు తెలంగాణా. ఆ దిశగా ఆయన చేయని ఆలోచన లేదు. వేయని పధకం లేదు. చర్చించని విషయం లేదు.   

ఆకాశ హర్మ్యాలు, ఆరు లేన్ల రహదారులు, హరితహారాలు, ప్రతి గడపకు  నల్లా నీళ్ళు, ప్రతి పొలానికీ సాగు నీళ్ళు, కనురెప్పపాటు కూడా పోని  కరెంటు, గొడ్డూ గోదాతో ఇంటిల్లిపాదీ హాయిగా కాపురం వుండే చక్కటి చిన్నారి లోగిళ్ళు, చదువుకునేవారికి దమ్మిడీ  ఖర్చులేని చదువు, చదువయిన వారికి కొలువు, చదువంటని వారికి తగిన ఉపాధి, ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి .......ఒకటా రెండా? ఇవన్నీ చదువుతున్నప్పుడు, వీటన్నిటి గురించి వింటున్నప్పుడు, ఒక బక్కపలచటి మనిషి  మనస్సులో ఇన్నిన్ని  ఆలోచనలా! యెంత విడ్డూరం అనిపిస్తుంది. బంగరు తెలంగాణా తప్ప ఈ మనిషి కేసీఆర్ కు  వేరే ఏ ఇతర ఆలోచలు లేవా? రావా? అనికూడా అనిపిస్తుంది. ఇవన్నీ నెరవేరితే తెలంగాణా బంగారం కాకుండా ఉంటుందా! ఈ కలలు కల్లలు కాకూడదని కోరుకోనివారు తెలంగాణా గడ్డ మీద ఎవరయినా ఉంటారంటారా?



ఏ రంగంలో అయినా   శాశ్వతంగా నిలదొక్కుకోవాలి అంటే నిజాయితీ, నిబద్దత, విశ్వసనీయత చాలా ముఖ్యం. రాజకీయాలకి ఈ సూత్రం మరింత బాగా అన్వయిస్తుంది.

అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, విమానాశ్రయాలు కాదు, మొత్తం ప్రజానీకం, వారి జీవితాలు  అభివృద్ధి చెందడమే నిజమైన అభివృద్ధి.






అవకాశం  ఆయన చేతుల్లోనే వున్నాయి. చూడాలి ఏం చేస్తారో!

1, జూన్ 2022, బుధవారం

హీరో కృష్ణతో డీజే టిల్లు డైరెక్టర్ విమల్ కృష్ణ – భండారు శ్రీనివాసరావు

 

కొన్నేళ్ళ క్రితం  ఆంధ్రజ్యోతి దినపత్రిక 'ఆదివారం పుస్తకం'లో 'స్పందన' శీర్షిక కింద 'దారి చూపిన దేవుడు' అనే పేరుతొ  సినీ నటుడు కృష్ణ గురించి మా మేనల్లుడు పింగిలి శ్రవణ్ కుమార్  రాసిన ఓ కధనం ప్రచురించారు. 1971 నాటి వృత్తాంతం అది. చిన్న వయస్సులో ఇంటి నుంచి  పారిపోయి మద్రాసులో కృష్ణ - విజయనిర్మల ఇంట్లో కొన్ని నెలలు తలదాచుకోవడం,  తిరిగివచ్చిన తరువాత తదనంతర కాలంలో ఆ పిల్లవాడే ప్రభుత్వ భీమా కంపెనీలో ఓ పెద్ద ఆఫీసరు కావడం - అంతా ఓ సినిమా కధలా నడిచిపోయింది. ఈ ఉదంతం సుఖాంతం కావడంలో  ఒకప్పుడు  నేను పనిచేసిన 'ఆంధ్రజ్యోతి'కి కూడా కొంత పాత్ర వుంది. ఆ రోజుల్లో నేను బెజవాడ ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను. సీ.బీ.ఐ. డైరెక్టర్ గా పనిచేసిన కే.విజయరామారావు గారు కృష్ణా జిల్లా  ఎస్పీ. వారిని కలిసి 'మిస్సింగ్ అప్లికేషన్' ఇచ్చాము. ఆంధ్రజ్యోతిలో పిల్లవాడి ఫోటోతో ఒక ప్రకటన ఇచ్చాము.  మూడున్నర మాసాలు శ్రవణ్ మద్రాసులో కృష్ణ గారింట్లోనే వున్నాడు. ఆ సంగతి మాకు తెలియదు. కళా దర్శకుడు రామలింగేశ్వర రావు గారి తల్లి తెనాలి వెళ్ళినప్పుడు  ఆంధ్రజ్యోతిలో ఫోటో చూసి కృష్ణ గారింట్లో ఉంటున్న శ్రవణ్ పోలికలను గుర్తుపట్టి మాకు కబురు పెట్టారు. మా బావగారు వాళ్ళు మద్రాసు వెళ్లి పిల్లవాడిని తీసుకువచ్చారు. 'బాగా చదువుకో, ఆ తరువాతే సినిమాలు' అని కృష్ణ గారు ఇచ్చిన సలహాని మావాడు తుచ తప్పకుండా పాటించాడు. బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చాడు.  హీరో కృష్ణ  పుట్టినరోజు సందర్భంగా కృష్ణగారి గురించి ఆంధ్రజ్యోతిలో మా మేనల్లుడు శ్రవణ్ రాసిన వ్యాసంలో ముగింపు వాక్యాలు - "కృష్ణ గారిని రోజూ నేను తలచుకుంటూనే ఉంటాను. ఎంతలా అంటే - నా కొడుకు పేరు 'విమల్ కృష్ణ, నా కూతురు పేరు 'రమ్య కృష్ణ' - మా కుటుంబంలో చాలామందికి నచ్చాయి. అది హీరో కృష్ణ దృష్టికి వెళ్లి శ్రవణ్ కుటుంబాన్ని ఓ రోజు తన ఇంటికి ఆహ్వానించారు.

మా మేనల్లుడు  శ్రవణ్ ఏకైక కుమారుడు విమల్ కృష్ణ   పెరిగి పెద్దయి, బీ టెక్ పాసయి కూడా ఉద్యోగాల జోలికి పోకుండా సినిమాల మీద మక్కువ పెంచుకుని అదే ధ్యాసలో ఉంటూ తనను తాను నిరూపించుకునే రీతిలో  డీ జె టిల్లు సినిమా డైరెక్ట్ చేసి మంచి విజయం సాధించాడు. ఒకప్పుడు వాళ్ళ నాన్న పెంచుకున్న సినిమా కోరికను ఈ విధంగా తీర్చాడు.

కింది ఫోటో: కృష్ణ దంపతులతో శ్రవణ్ కుటుంబం. డీజే టెల్లు డైరెక్టర్ విమల్ కృష్ణ కూడా ఫోటోలో వున్నాడు 




31, మే 2022, మంగళవారం

అన్నదాతా! సుఖీభవ!

ఆత్మీయ కలయికలకు  కరోనా మూడేళ్లు ముకుతాడు వేసింది. ఇప్పుడిప్పుడే నలుగుర్ని కలుసుకోవడాలు, ఒకరి  ఇళ్లకు మరొకరు వెళ్ళడాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మూడేళ్ళుగా ముఖాముఖి కలవని రాయపాటి సాంబశివరావు గారిని నిన్న చూడడం జరిగింది.

మొన్న రాత్రి, జ్వాలా ఇంట్లో రాయపాటి ప్రసక్తి వచ్చింది.  ఆయన ఎక్కడ వున్నారో తెలుసుకోవాలని జ్వాలా వెంటనే ఫోన్ చేశాడు. హైదరాబాదులోనే  వున్నట్టు తెలిసి,  చూడడానికి వస్తామని అంటే, మీరు ఎందుకు రావడం మీ ఇంటికి రేపు రాత్రి  నేనే వస్తాను అన్నారాయన. అన్నట్టే వచ్చారు. తెల్లటి అంగీ, తెల్లటి లుంగీ. 78 ఏళ్ళ వయస్సు అన్న విషయం పైకి తెలియక పోయినా (నాకంటే ఏడాది, జ్వాలా కన్నా రెండేళ్లు పెద్ద)  ఈ మధ్య చేసిన సుస్తీల కారణంగా ఆరోగ్య రీత్యా నియమబద్ధమైన జీవితం గడుపుతున్నానని చెప్పారు.

నన్ను చూడగానే  మనిద్దరిదీ ఇప్పుడు ఒకే పడవ అన్నారు. (వారి శ్రీమతి చనిపోయిన రెండేళ్లకే మా ఆవిడ కూడా చనిపోయింది)

రాయపాటి గారికి మా మేనకోడలు, జ్వాలా భార్య విజయలక్ష్మి  పెట్టే ఆవకాయ కారాలు బాగా ఇష్టం. బహుశా ఆయన మా ఇళ్ళ నుంచి అడిగి మరీ తీసుకువెళ్ళేవి ఈ కారాలు ఒక్కటే. మా ఆవిడ బతికున్న రోజుల్లో ఆయన ఎప్పుడు హైదరాబాదు వచ్చినా దోసావకాయ కారం అడిగి చేయించుకుని తీసుకువెళ్ళే వారు. మాస్కోలో ఇక సరేసరి. ఆయన వ్యాపారపు పనుల మీద ఎప్పుడు వచ్చినా, ఎన్నాళ్ళు వున్నా, ఎక్కడ బస చేసినా రాత్రి భోజనం మా ఇంట్లోనే. కారాలు, పచ్చళ్ళు అంటే ఆయనకు అంత ఇష్టం. మాస్కోలో మా అన్నదాత అని బాహాటంగా చెప్పడం మాకు ఇబ్బందిగా  అనిపించేది.

రాయపాటి గారితో జ్వాలా కుటుంబానికి, మా కుటుంబానికి స్నేహం దశాబ్దాలుగా సాగుతోంది. ఎక్కడ ఏ యాగం తలపెట్టినా మా కుటుంబాలను గుర్తు పెట్టుకుని తీసుకు వెళ్ళేవారు. అలాగే తిరుపతి, షిర్డీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా.

ఆయన రాజకీయాలు, వ్యాపారాలు మా స్నేహాలకు, పరిచయాలకు  ఏనాడు అడ్డం రాలేదు. వాటి ప్రసక్తి కూడా మా మధ్య మాటల్లో వచ్చేది కాదు.  జ్వాలా పిల్లల  పెళ్ళిళ్ళకే కాదు, మనుమడి ఉపనయనానికి కూడా వచ్చారు.

మా మేనకోడలు కొసరి కొసరి వడ్డించింది. మిగిలిన అధరవులు పక్కనపెట్టి, ఆవకాయ, మెంతికాయ, మాగాయ, వెల్లుల్లి ఆవకాయ, నీళ్ళావకాయలతోనే భోజనం ముగించారు. ముఖ్యంగా నూనె లేని నీళ్ళావకాయ  కారం ఆయనకు బాగా నచ్చింది. జ్వాలా  భార్య విజయలక్ష్మి ఆ కారాన్ని ప్యాక్ చేసి ఇచ్చింది. జ్వాలా కూడా కరోనా కాలంలో తాను రామాయణ, భారతాలపై  రాసిన అనేక ఆధ్యాత్మిక గ్రంధాలను బహుకరించాడు.

వెడుతూ వెడుతూ ఆయన ఎప్పుడూ అనే మాటే అన్నారు.

‘అన్నదాతా! సుఖీభవ!’



(30-05-2022)

30, మే 2022, సోమవారం

ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ల పాలన


2014 ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మొదటి ఏడాది పాలన ముగియవచ్చిన సందర్భంలో, లోకసభలో నాటి ప్రతిపక్షనేత రాహుల్ గాంధి ఒక వ్యాఖ్య చేశారు, ‘ఈఏడాది కాలంలో మోడీ దేశానికి ఒరగబెట్టింది ఏమీ లేద’ని. తన వ్యాఖ్యకు వత్తాసుగా రాహుల్ మరో మాటను జోడించారు. ‘మోడీ పాలనకు తాను సున్నా మార్కులు వేస్తున్న’ట్టు చెప్పారు. అదీ ‘ఉత్త సున్నా కాదు, గుండు సున్నా’ అని ఎద్దేవా కూడా చేసారు. కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్యలను బీజేపీ నాయకులు సహజంగానే తిప్పికొట్టారు. ఇటువంటి విషయాల్లో నాలుక పదును బాగా వున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రతివ్యాఖ్య చేస్తూ ఒకింత ఘాటుగానే స్పందించారు.
‘మోడీ ఏమీ చేయలేదంటున్న రాహుల్ గాంధీ, ‘తనను గెలిపించిన అమేథీ నియోజక వర్గానికి ఆ ఏడాది కాలంలో చేసింది సున్నా కంటే తక్కువ’ అనేశారు. అంతటితో ఆగకుండా, ‘పదేళ్ళ యూపీయే పాలన, ఏడాది రాహుల్ పార్లమెంటు సభ్యత్వకాలం పరిగణనలోకి తీసుకుంటే ‘సున్నకు సున్నా, హళ్లికి హళ్లి’ అంటూ కొట్టిపారేశారు.
ఇదలా ఉంచితే,
అప్పట్లో లండన్ వెస్ట్ మినిస్టర్ టౌన్ హాల్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ ఒక మాట చెప్పారు.
“ఈ దేశానికి ఇక నా అవసరం లేదు అన్న రోజున ఎంత నిశ్శబ్దంగా వచ్చానో అంతే నిశ్శబ్దంగా నిష్క్రమిస్తాను. నాకు చరిత్రలో స్థానం అక్కర లేదు. నాకు ఎవరున్నారు ఈ దేశం తప్ప, నూటపాతిక కోట్ల మంది ప్రజలు తప్ప..”
ఆయన ఈ మాట అంటున్నప్పుడు ప్రేక్షకులు విడవకుండా చేసిన కరతాళధ్వనులతో వెస్ట్ మినిస్టర్ హాల్ మారుమోగింది. అదో అపూర్వ దృశ్యం.
మరో ఏడాది గడిచింది.
“మోడీ లాంటి మొగాడు దేశానికి అవసరం”
ఈ మాట చెప్పింది మోడీ అభిమానీ కాదు, బీజేపీ కార్యకర్తా కాదు.
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నరోజుల్లో, ప్రత్యేకించి గోద్రా మారణ హోమం నేపధ్యంలో ఆయనను పూర్తిగా ఖండిస్తూ పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాసిన వ్యక్తి. పేరు సుహేల్ సేథ్.
ఈయనకు బహుముఖాలు వున్నాయి. ప్రచారకర్త, నటుడు, న్యూస్ టీవీ పండిట్, లాబీ ఇష్ట్, మార్కెటింగ్ గురు, ఇలా సొంతంగా తగిలించుకున్న విశేషణాలు అనేకం వున్నాయి. ఇవన్నీ పదేపదే చెప్పుకోవడం ఎందుకని అనుకున్నారో ఏమో, సుహేల్ సేథ్ గారి ఫేస్ బుక్ పేజీలో ఏకంగా ‘సర్వజ్ఞుడు’ అని సింపిల్ గా ఒకే పదంతో అయన తనను తాను అభివర్ణించుకున్నారు.
గుజరాత్ లో గోద్రా మారణహోమం అనంతరం నరేంద్ర మోడీ అభినవ హిట్లర్ అంటూ పలు విమర్శలు చేసిన చరిత్ర ఈయనకు వుంది. ఆ సంఘటన మోడీ జీవితంలో మాయని మచ్చ అన్నారు. అంతే కాదు, ఆ కారణంగా భారత రాజకీయ వ్యవస్థ భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
నరేంద్రమోడీ ప్రధాన మంత్రి అయిన రెండేళ్లకు ఆయన తన బాణీ మార్చుకుని ఈ దేశం అవసరం మోడీకి లేదు, మోడీ వంటి మొనగాడి అవసరం దేశానికే వుందని గొప్ప కితాబు ఇచ్చారు.
“మోడీ గుజరాత్ సీతయ్య. కాకపొతే కొంత తేడా వుంది. మన తెలుగు సీతయ్య ఎవడి మాటా వినడు. ఈ గుజరాత్ సీతయ్య అందరి మాటా వింటాడు కానీ చివరకు తాను అనుకున్నదే చేస్తాడు.”
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన్ని గురించి వినవచ్చే కధలన్నీ ఇలాగే వుండేవి. మోడీ లాంటి నాయకులు అయిదుగురు వుంటే చాలు, యావత్ ప్రపంచంలో భారత దేశం అగ్రగామి కావడానికి ఎంతో కాలం పట్టదు’ అంటూ గుజరాత్ ని సందర్శించిన వాళ్ళు చెప్పేవాళ్ళు.
అందరికీ గుర్తుండే వుండాలి. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజలకు మోడీ ఒక బహిరంగ లేఖ రాసారు.
“సేవా పరమో ధర్మః” అనే సూక్తితో మోడీ ఆ లేఖను మొదలు పెట్టారు. ప్రజలకు సేవ చేయడంలో వున్న తృప్తినీ, ఆనందాన్ని తను ఏడాది కాలంగా అనుక్షణం ఆస్వాదిస్తూ వచ్చానని ఆయన అందులో పేర్కొన్నారు.
“అంతులేని అవినీతి రాజ్యమేలుతున్నప్పుడు, నిర్ణయాలు తీసుకోలేని అసమర్ధ పాలనతో జాతి నవనాడులు కుంగిపోయి వున్న నేపధ్యంలో మీరు నాపట్ల ఎంతో నమ్మకంతో నాకు పగ్గాలు అప్పగించారు. మీ ఆశలను నిజం చేయడానికే గత ఏడాదిగా నేను అహరహమూ కష్టపడుతూ వచ్చాను’ అన్నారాయన ఆ లేఖలో ఆనాడు.
పేదల అభ్యున్నతికోసం ‘అంత్యోదయ’, పరిశుభ్రత, పారిశుధ్యం కోసం స్వచ్చ భారత్ మొదలయిన ప్రభుత్వ పధకాల జాబితాను ఏకరువు పెట్టారు.
ఈ మాటలు చెప్పిన తరువాత మరో ఏడాది కాలగర్భంలో కలిసింది. చూస్తుండగానే ఎనిమిదేళ్లు గతంలో కలిసి పోయాయి. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మోడీ అహరహమూ పడుతున్న కష్టం ఏమన్నా ఫలితాలు ఇచ్చిందా అంటే చప్పున జవాబు చెప్పడం కష్టం.
మొండివాడు రాజుకన్నా బలవంతుడంటారు. రాజే మొండివాడయితే ఇక చెప్పేది ఏముంటుంది?
మోడీకి మొండివాడనే పేరుంది. నిజానికి ఆ మొండితనమే ఆయన్ని ఇంతవాడ్ని చేసిందంటారు. ఆ మొండితనమే ఆయనకి ఇంతమంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. అయితే మొండితనం ఎల్లవేళలా అక్కరకు రాదు.
నిజానికి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చాలా సాహసోపేతమైనది. ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు మోడీ అభిమానులేకాదు అత్యధికులయిన దేశప్రజలు మోడీ చొరవను మనసారా స్వాగతించారు. మోడీ ఒక్కడే మొనగాడని, ఆయన మాత్రమే ఇటువంటి సాహసం చేయగలడని వేనోళ్ళ పొగిడారు. ఈ పొగడ్తలు ఒక దశలో మోతాదు మించి ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిరాగాంధీని ఆకాశానికి ఎత్తిన రోజుల్ని గుర్తుకు తెచ్చాయి. ఈ నిర్ణయం దేశానికి ఏ మేరకు మేలు చేసింది అనే విషయంలో, ప్రతిపక్షాల విమర్శలను పక్కన పెట్టినా, ఇప్పటికీ స్పష్టమైన అంచనా లేదు. అయితే మోడీ తీసుకున్న ఈ చర్యకు రెండోమారు ఘన విజయం కట్టబెట్టడం ద్వారా అధిక శాతం మంది ఆమోదముద్ర వేశారు.
ఇక ప్రస్తుతానికి వస్తే, 2019 లో జరిగిన ఎన్నికల్లో నభూతో నభవిష్యతి అన్నట్టుగా సాధించిన ఘన విజయంతో నరేంద్ర మోడీ మరో మారు భారత ప్రధాన మంత్రిగా ఈరోజుకు ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. అప్పటి పరిస్థితులు ఛాయమాత్రంగా ప్రస్తావించడం ఇప్పటి పరిస్థితితో పోల్చుకోవడానికే.
ప్రతి పార్టీకి ముఖ్యంగా బీజేపీ వంటి జాతీయ భావాలు కలిగిన పార్టీలకు కొన్ని మూల సిద్ధాంతాలు వుంటాయి. మెజారిటీ ప్రజలు తమకు సమర్ధ ప్రభుత్వం కావాలనే ఆలోచనతో ఓట్లు వేసి గెలిపిస్తారు. అలాగని తమ మూల సిద్ధాంతాలకు కూడా వారు పట్టం కట్టినట్టు కాదు. కానీ అలాంటి వారిని తమ పాలనతో, విధానాలతో ఆకర్షించి మెల్లగా తమ సిద్ధాంతాల పట్ల వారిలో సానుకూలత పెరిగేలా చూసుకోవాలి. ఈ ప్రజాస్వామ్య ధర్మాన్నిపాటిస్తే ఏ చిక్కూ వుండదు. ఏది చెప్పినా సుద్దుల మాదిరిగా మృదువుగా నచ్చచెప్పే ప్రయత్నం చేయాలి కానీ బలవంతాన రుద్దినట్టు ఉండరాదు.
రాజకీయాల్లో వున్నవాళ్ళు రాజకీయం చేయక తప్పదు. కానీ ప్రజలు, పరిపాలన కూడా పాలకులకు అంతే ప్రధానం. ఈ సత్యం ఎరుకలో వుంచుకుంటే పాలకులకూ మంచిది, ప్రజలకూ మంచిది.
(30-05-2022)



జగన్ మూడేళ్ల పాలన – భండారు శ్రీనివాసరావు


ప్రజలు ఇచ్చిన అయిదేళ్ళ అధికార గడువులో మూడేళ్లు ఈ నెల ముప్పయితో ముగుస్తాయి. ఇంకా రెండేళ్ల వ్యవధానం మిగిలి వుంది.
అంటే ఆగి నిలబడి వెనక్కి తిరిగి చూసుకుని ముందుకు సాగాల్సిన సమయం అన్నమాట.
గత మూడేళ్లను ఒకసారి గమనిస్తే, ముందే రాసిపెట్టుకున్న స్క్రిప్ట్ మాదిరిగా, జరిగేవన్నీ ఒక పద్దతి ప్రకారం చకచకా సాగిపోతూవుండడం జగన్ పాలనలోని ఓ ప్రత్యేకత.
అటు రాష్ట్ర పరిపాలకుడుగా, ఇటు రాజకీయ పార్టీ అధినేతగా జగన్ మోహన రెడ్డి తన రెండు చేతుల్లోను రెండు పగ్గాలు ధరించి పాలనారధాన్ని, పార్టీ రధాన్ని ముందుకు నడుపుతున్నారనేది కూడా సుస్పష్టం. ఒకపక్క సెహభాష్ అనిపించుకునే అధికారిక ప్రకటనలు. మరోపక్క తొందరపడుతున్నారేమో అనిపించే రాజకీయ నిర్ణయాలు.
ఎన్నికల ప్రణాళిక రూపంలో ప్రజలకు చేసిన వాగ్దానాలలో తొంభయ్ శాతానికి పైగా నేరవేర్చామని ప్రభుత్వం చెబుతోంది. కాదంటున్నాయి ప్రతిపక్షాలు. అది సహజం. ప్రశాంత చిత్తంతో పనిచేసుకుంటూ పోయే పరిస్థితి లేని , మాట కూడా నిజం. అయితే ఈ విషయంలో అసలు వాస్తవం ఏది, ఎంత అనేది ప్రయోజనం పొందిన లేదా అందని ప్రజలు మాత్రమే చెప్పగలుగుతారు. అంచేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మొదలు పెట్టిన గడప గడపకు అనే కార్యక్రమం ఒక్కటే ఈ విషయంలో ఒక అవగాహనకు రావడానికి గీటురాయి. ప్రజలను నూటికి నూరు శాతం సంతృప్తి పరచడం ఏ ప్రభుత్వానికి అయినా అసాధ్యం. అయితే పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు ప్రతి గడపకు వెళ్లి, క్షేత్ర స్థాయిలో వాస్తవాలని తెలుసుకున్న పక్షంలో పధకాలు బాగా అమలు జరుగుతున్న చోట పని తీరును మరింత మెరుగు పరుచుకోవడానికి, లేదా అసంతృప్తి వున్న చోట ఆ లొసుగులను తొలగించుకుని ముందుకు పోవడానికి ఈ కార్యక్రమాన్ని మించిన కొలమానం మరోటి వుండదు.
ప్రజల దినవారీ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఎంత తక్కువ వుంటే అది ఉత్తమ ప్రభుత్వం అనిపించుకుంటుంది అని చాణక్యుడు చెప్పాడు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాలు ఈ దిశగా మంచి అడుగు. ప్రజలు ప్రతి చిన్న పనికి గ్రామం దాటి వెళ్ళకుండా, వున్న ఊళ్లోనే వ్యవహారాలు చక్కబరచుకోవడానికి ఈ గ్రామ సచివాలయాలు ఉపయోగపడుతున్నాయి. అయితే వాలంటీర్ల వ్యవస్థ ప్రస్తుత ప్రజాప్రతినిధుల వ్యవస్థకు సమాంతరం కాకుండా జాగ్రత్త పడాలి.
కరోనా సమయంలో నవరత్నాల రూపంలో జరిగిన నగదు బదిలీలు కింది స్థాయి ప్రజలకు బాగా ఉపయోగపడ్డాయి. అన్ని నెలలు ఉపాధి కోల్పోయినా కూడా బడుగు బలహీన వర్గాల ఆర్ధిక స్థితి అతలాకుతలం కాకుండా ఈ నిధులు వారికి అక్కరకు వచ్చాయి. అమెరికా వంటి సంపన్న దేశాలలో సయితం కరోనా వేళ అక్కడి ప్రభుత్వాలు నగదు బదిలీ రూపంలో ప్రజలకు అందించిన సాయం జనజీవనం అస్తవ్యస్తం కాకుండా తోడ్పడిందని పత్రికలు రాశాయి.
వాగ్దానాల అమలుకోసం మరో ధ్యాస పెట్టుకోకుండా, విమర్శలను ఖాతరు చేయకుండా ముఖ్యమంత్రి ఏకాగ్రతతో పనిచేయడం వల్ల వాటి అమలు శాతం ప్రభుత్వానికి సంతృప్తి కలిగించే స్థాయిలో వుంది. ఇక రానున్న రెండేళ్ల కాలాన్ని అత్యంత జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి. పొరబాట్లు జరిగితే దిద్దుకోవడానికి, తప్పులు జరిగితే పునరావృతం కాకుండా చూసుకోవడానికి, ఇక ముందు ముందు ఎలాంటి పొరబాట్లు, తప్పులు జరగకుండా చూసుకోవడానికి రెండేళ్ల సమయాన్ని వాడుకుంటే ప్రభుత్వ పధకాల అమలు, ప్రజల సంతృప్త స్థాయి నూటికి నూరు శాతం చేరడానికి వీలుపడుతుంది.
“జగన్ ఓ సీతయ్య. ఎవరి మాటా వినడు” ఇలాంటివి వినడానికి బాగుంటాయి. పాలకుడు అనే వాడు తన కళ్ళతో చూడాలి. తన చెవులతో వినాలి. అంటే వాస్తవాన్ని మాత్రమే చూడగలగాలి. వినగలగాలి. ఎవరో చెప్పింది వినడం, ఎవరో చూసి చెప్పింది నమ్మడం వంటి లక్షణాలు పరిపాలనను బలహీన పరుస్తాయి.
అయితే ఈ మూడేళ్లు సాఫీగా గడిచిపోయాయి అనుకోవడానికి కానీ, మరో రెండేళ్లు ఇలాగే ఉంటుందన్న భరోసా కానీ లేదు. జగన్ ప్రభుత్వం పట్ల ప్రజావ్యతిరేకత రోజురోజుకూ పెరిగిపోతోంది అనేది ప్రతిపక్షాల వాదన. వాళ్ళు అలాగే అంటారు అని పైకి చెప్పుకోవచ్చు కానీ క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి ఎలా వుందని ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోవాలి. గడప గడపకూ కార్యక్రమంలో అందిన సమాచారాన్ని క్రోడీకరించుకుని ఎప్పటికప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకోని పక్షంలో పరిస్థితి చేయి దాటిన తర్వాత చేయగలింది ఏమీ వుండదు.
“అంతా బాగానే వుంది అని అనుకోవడానికి, అంతా సజావుగా వుంది అనడానికి చాలా తేడా వుంది. ప్రజల ఆలోచనా ధోరణి ఎల్లప్పుడూ ఒకే రీతిగా వుండదు. అది ఎప్పుడు ఏ క్షణంలో ఎలా మారుతుందో పసి కట్టి చెప్పగల మేధావులు లేరు. పరిస్థితి పూర్తిగా అధ్వాన్నంగా వుంది, లేదా పరిస్తితులు అత్యంత అనుకూలంగా వున్నాయి అనే ఈ రెండింటి నడుమ అసలు వాస్తవం దాగి వుంటుంది. దాన్ని ఒడిసిపట్టుకోగల చాకచక్యం కొరవడితే ఫలితాలు ఊహాతీతంగా వుంటాయి”
గత ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో రాసిన వాక్యాలే ఇవి.
ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి కూడా వర్తిస్తాయి.
గతం నుంచి పాఠాలు నేర్చుకుని, నేర్చుకున్న పాఠాలను వర్తమానంలో ఉపయోగించుకుంటే భవిష్యత్తు పదిలంగా వుంటుంది.
లేని పక్షంలో గతమే చరిత్రగా మారుతుంది.




(30-05-2022)