1, జూన్ 2022, బుధవారం

హీరో కృష్ణతో డీజే టిల్లు డైరెక్టర్ విమల్ కృష్ణ – భండారు శ్రీనివాసరావు

 

కొన్నేళ్ళ క్రితం  ఆంధ్రజ్యోతి దినపత్రిక 'ఆదివారం పుస్తకం'లో 'స్పందన' శీర్షిక కింద 'దారి చూపిన దేవుడు' అనే పేరుతొ  సినీ నటుడు కృష్ణ గురించి మా మేనల్లుడు పింగిలి శ్రవణ్ కుమార్  రాసిన ఓ కధనం ప్రచురించారు. 1971 నాటి వృత్తాంతం అది. చిన్న వయస్సులో ఇంటి నుంచి  పారిపోయి మద్రాసులో కృష్ణ - విజయనిర్మల ఇంట్లో కొన్ని నెలలు తలదాచుకోవడం,  తిరిగివచ్చిన తరువాత తదనంతర కాలంలో ఆ పిల్లవాడే ప్రభుత్వ భీమా కంపెనీలో ఓ పెద్ద ఆఫీసరు కావడం - అంతా ఓ సినిమా కధలా నడిచిపోయింది. ఈ ఉదంతం సుఖాంతం కావడంలో  ఒకప్పుడు  నేను పనిచేసిన 'ఆంధ్రజ్యోతి'కి కూడా కొంత పాత్ర వుంది. ఆ రోజుల్లో నేను బెజవాడ ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను. సీ.బీ.ఐ. డైరెక్టర్ గా పనిచేసిన కే.విజయరామారావు గారు కృష్ణా జిల్లా  ఎస్పీ. వారిని కలిసి 'మిస్సింగ్ అప్లికేషన్' ఇచ్చాము. ఆంధ్రజ్యోతిలో పిల్లవాడి ఫోటోతో ఒక ప్రకటన ఇచ్చాము.  మూడున్నర మాసాలు శ్రవణ్ మద్రాసులో కృష్ణ గారింట్లోనే వున్నాడు. ఆ సంగతి మాకు తెలియదు. కళా దర్శకుడు రామలింగేశ్వర రావు గారి తల్లి తెనాలి వెళ్ళినప్పుడు  ఆంధ్రజ్యోతిలో ఫోటో చూసి కృష్ణ గారింట్లో ఉంటున్న శ్రవణ్ పోలికలను గుర్తుపట్టి మాకు కబురు పెట్టారు. మా బావగారు వాళ్ళు మద్రాసు వెళ్లి పిల్లవాడిని తీసుకువచ్చారు. 'బాగా చదువుకో, ఆ తరువాతే సినిమాలు' అని కృష్ణ గారు ఇచ్చిన సలహాని మావాడు తుచ తప్పకుండా పాటించాడు. బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చాడు.  హీరో కృష్ణ  పుట్టినరోజు సందర్భంగా కృష్ణగారి గురించి ఆంధ్రజ్యోతిలో మా మేనల్లుడు శ్రవణ్ రాసిన వ్యాసంలో ముగింపు వాక్యాలు - "కృష్ణ గారిని రోజూ నేను తలచుకుంటూనే ఉంటాను. ఎంతలా అంటే - నా కొడుకు పేరు 'విమల్ కృష్ణ, నా కూతురు పేరు 'రమ్య కృష్ణ' - మా కుటుంబంలో చాలామందికి నచ్చాయి. అది హీరో కృష్ణ దృష్టికి వెళ్లి శ్రవణ్ కుటుంబాన్ని ఓ రోజు తన ఇంటికి ఆహ్వానించారు.

మా మేనల్లుడు  శ్రవణ్ ఏకైక కుమారుడు విమల్ కృష్ణ   పెరిగి పెద్దయి, బీ టెక్ పాసయి కూడా ఉద్యోగాల జోలికి పోకుండా సినిమాల మీద మక్కువ పెంచుకుని అదే ధ్యాసలో ఉంటూ తనను తాను నిరూపించుకునే రీతిలో  డీ జె టిల్లు సినిమా డైరెక్ట్ చేసి మంచి విజయం సాధించాడు. ఒకప్పుడు వాళ్ళ నాన్న పెంచుకున్న సినిమా కోరికను ఈ విధంగా తీర్చాడు.

కింది ఫోటో: కృష్ణ దంపతులతో శ్రవణ్ కుటుంబం. డీజే టెల్లు డైరెక్టర్ విమల్ కృష్ణ కూడా ఫోటోలో వున్నాడు 




31, మే 2022, మంగళవారం

అన్నదాతా! సుఖీభవ!

ఆత్మీయ కలయికలకు  కరోనా మూడేళ్లు ముకుతాడు వేసింది. ఇప్పుడిప్పుడే నలుగుర్ని కలుసుకోవడాలు, ఒకరి  ఇళ్లకు మరొకరు వెళ్ళడాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మూడేళ్ళుగా ముఖాముఖి కలవని రాయపాటి సాంబశివరావు గారిని నిన్న చూడడం జరిగింది.

మొన్న రాత్రి, జ్వాలా ఇంట్లో రాయపాటి ప్రసక్తి వచ్చింది.  ఆయన ఎక్కడ వున్నారో తెలుసుకోవాలని జ్వాలా వెంటనే ఫోన్ చేశాడు. హైదరాబాదులోనే  వున్నట్టు తెలిసి,  చూడడానికి వస్తామని అంటే, మీరు ఎందుకు రావడం మీ ఇంటికి రేపు రాత్రి  నేనే వస్తాను అన్నారాయన. అన్నట్టే వచ్చారు. తెల్లటి అంగీ, తెల్లటి లుంగీ. 78 ఏళ్ళ వయస్సు అన్న విషయం పైకి తెలియక పోయినా (నాకంటే ఏడాది, జ్వాలా కన్నా రెండేళ్లు పెద్ద)  ఈ మధ్య చేసిన సుస్తీల కారణంగా ఆరోగ్య రీత్యా నియమబద్ధమైన జీవితం గడుపుతున్నానని చెప్పారు.

నన్ను చూడగానే  మనిద్దరిదీ ఇప్పుడు ఒకే పడవ అన్నారు. (వారి శ్రీమతి చనిపోయిన రెండేళ్లకే మా ఆవిడ కూడా చనిపోయింది)

రాయపాటి గారికి మా మేనకోడలు, జ్వాలా భార్య విజయలక్ష్మి  పెట్టే ఆవకాయ కారాలు బాగా ఇష్టం. బహుశా ఆయన మా ఇళ్ళ నుంచి అడిగి మరీ తీసుకువెళ్ళేవి ఈ కారాలు ఒక్కటే. మా ఆవిడ బతికున్న రోజుల్లో ఆయన ఎప్పుడు హైదరాబాదు వచ్చినా దోసావకాయ కారం అడిగి చేయించుకుని తీసుకువెళ్ళే వారు. మాస్కోలో ఇక సరేసరి. ఆయన వ్యాపారపు పనుల మీద ఎప్పుడు వచ్చినా, ఎన్నాళ్ళు వున్నా, ఎక్కడ బస చేసినా రాత్రి భోజనం మా ఇంట్లోనే. కారాలు, పచ్చళ్ళు అంటే ఆయనకు అంత ఇష్టం. మాస్కోలో మా అన్నదాత అని బాహాటంగా చెప్పడం మాకు ఇబ్బందిగా  అనిపించేది.

రాయపాటి గారితో జ్వాలా కుటుంబానికి, మా కుటుంబానికి స్నేహం దశాబ్దాలుగా సాగుతోంది. ఎక్కడ ఏ యాగం తలపెట్టినా మా కుటుంబాలను గుర్తు పెట్టుకుని తీసుకు వెళ్ళేవారు. అలాగే తిరుపతి, షిర్డీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా.

ఆయన రాజకీయాలు, వ్యాపారాలు మా స్నేహాలకు, పరిచయాలకు  ఏనాడు అడ్డం రాలేదు. వాటి ప్రసక్తి కూడా మా మధ్య మాటల్లో వచ్చేది కాదు.  జ్వాలా పిల్లల  పెళ్ళిళ్ళకే కాదు, మనుమడి ఉపనయనానికి కూడా వచ్చారు.

మా మేనకోడలు కొసరి కొసరి వడ్డించింది. మిగిలిన అధరవులు పక్కనపెట్టి, ఆవకాయ, మెంతికాయ, మాగాయ, వెల్లుల్లి ఆవకాయ, నీళ్ళావకాయలతోనే భోజనం ముగించారు. ముఖ్యంగా నూనె లేని నీళ్ళావకాయ  కారం ఆయనకు బాగా నచ్చింది. జ్వాలా  భార్య విజయలక్ష్మి ఆ కారాన్ని ప్యాక్ చేసి ఇచ్చింది. జ్వాలా కూడా కరోనా కాలంలో తాను రామాయణ, భారతాలపై  రాసిన అనేక ఆధ్యాత్మిక గ్రంధాలను బహుకరించాడు.

వెడుతూ వెడుతూ ఆయన ఎప్పుడూ అనే మాటే అన్నారు.

‘అన్నదాతా! సుఖీభవ!’



(30-05-2022)

30, మే 2022, సోమవారం

ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ల పాలన


2014 ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మొదటి ఏడాది పాలన ముగియవచ్చిన సందర్భంలో, లోకసభలో నాటి ప్రతిపక్షనేత రాహుల్ గాంధి ఒక వ్యాఖ్య చేశారు, ‘ఈఏడాది కాలంలో మోడీ దేశానికి ఒరగబెట్టింది ఏమీ లేద’ని. తన వ్యాఖ్యకు వత్తాసుగా రాహుల్ మరో మాటను జోడించారు. ‘మోడీ పాలనకు తాను సున్నా మార్కులు వేస్తున్న’ట్టు చెప్పారు. అదీ ‘ఉత్త సున్నా కాదు, గుండు సున్నా’ అని ఎద్దేవా కూడా చేసారు. కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్యలను బీజేపీ నాయకులు సహజంగానే తిప్పికొట్టారు. ఇటువంటి విషయాల్లో నాలుక పదును బాగా వున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రతివ్యాఖ్య చేస్తూ ఒకింత ఘాటుగానే స్పందించారు.
‘మోడీ ఏమీ చేయలేదంటున్న రాహుల్ గాంధీ, ‘తనను గెలిపించిన అమేథీ నియోజక వర్గానికి ఆ ఏడాది కాలంలో చేసింది సున్నా కంటే తక్కువ’ అనేశారు. అంతటితో ఆగకుండా, ‘పదేళ్ళ యూపీయే పాలన, ఏడాది రాహుల్ పార్లమెంటు సభ్యత్వకాలం పరిగణనలోకి తీసుకుంటే ‘సున్నకు సున్నా, హళ్లికి హళ్లి’ అంటూ కొట్టిపారేశారు.
ఇదలా ఉంచితే,
అప్పట్లో లండన్ వెస్ట్ మినిస్టర్ టౌన్ హాల్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ ఒక మాట చెప్పారు.
“ఈ దేశానికి ఇక నా అవసరం లేదు అన్న రోజున ఎంత నిశ్శబ్దంగా వచ్చానో అంతే నిశ్శబ్దంగా నిష్క్రమిస్తాను. నాకు చరిత్రలో స్థానం అక్కర లేదు. నాకు ఎవరున్నారు ఈ దేశం తప్ప, నూటపాతిక కోట్ల మంది ప్రజలు తప్ప..”
ఆయన ఈ మాట అంటున్నప్పుడు ప్రేక్షకులు విడవకుండా చేసిన కరతాళధ్వనులతో వెస్ట్ మినిస్టర్ హాల్ మారుమోగింది. అదో అపూర్వ దృశ్యం.
మరో ఏడాది గడిచింది.
“మోడీ లాంటి మొగాడు దేశానికి అవసరం”
ఈ మాట చెప్పింది మోడీ అభిమానీ కాదు, బీజేపీ కార్యకర్తా కాదు.
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నరోజుల్లో, ప్రత్యేకించి గోద్రా మారణ హోమం నేపధ్యంలో ఆయనను పూర్తిగా ఖండిస్తూ పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాసిన వ్యక్తి. పేరు సుహేల్ సేథ్.
ఈయనకు బహుముఖాలు వున్నాయి. ప్రచారకర్త, నటుడు, న్యూస్ టీవీ పండిట్, లాబీ ఇష్ట్, మార్కెటింగ్ గురు, ఇలా సొంతంగా తగిలించుకున్న విశేషణాలు అనేకం వున్నాయి. ఇవన్నీ పదేపదే చెప్పుకోవడం ఎందుకని అనుకున్నారో ఏమో, సుహేల్ సేథ్ గారి ఫేస్ బుక్ పేజీలో ఏకంగా ‘సర్వజ్ఞుడు’ అని సింపిల్ గా ఒకే పదంతో అయన తనను తాను అభివర్ణించుకున్నారు.
గుజరాత్ లో గోద్రా మారణహోమం అనంతరం నరేంద్ర మోడీ అభినవ హిట్లర్ అంటూ పలు విమర్శలు చేసిన చరిత్ర ఈయనకు వుంది. ఆ సంఘటన మోడీ జీవితంలో మాయని మచ్చ అన్నారు. అంతే కాదు, ఆ కారణంగా భారత రాజకీయ వ్యవస్థ భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
నరేంద్రమోడీ ప్రధాన మంత్రి అయిన రెండేళ్లకు ఆయన తన బాణీ మార్చుకుని ఈ దేశం అవసరం మోడీకి లేదు, మోడీ వంటి మొనగాడి అవసరం దేశానికే వుందని గొప్ప కితాబు ఇచ్చారు.
“మోడీ గుజరాత్ సీతయ్య. కాకపొతే కొంత తేడా వుంది. మన తెలుగు సీతయ్య ఎవడి మాటా వినడు. ఈ గుజరాత్ సీతయ్య అందరి మాటా వింటాడు కానీ చివరకు తాను అనుకున్నదే చేస్తాడు.”
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన్ని గురించి వినవచ్చే కధలన్నీ ఇలాగే వుండేవి. మోడీ లాంటి నాయకులు అయిదుగురు వుంటే చాలు, యావత్ ప్రపంచంలో భారత దేశం అగ్రగామి కావడానికి ఎంతో కాలం పట్టదు’ అంటూ గుజరాత్ ని సందర్శించిన వాళ్ళు చెప్పేవాళ్ళు.
అందరికీ గుర్తుండే వుండాలి. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజలకు మోడీ ఒక బహిరంగ లేఖ రాసారు.
“సేవా పరమో ధర్మః” అనే సూక్తితో మోడీ ఆ లేఖను మొదలు పెట్టారు. ప్రజలకు సేవ చేయడంలో వున్న తృప్తినీ, ఆనందాన్ని తను ఏడాది కాలంగా అనుక్షణం ఆస్వాదిస్తూ వచ్చానని ఆయన అందులో పేర్కొన్నారు.
“అంతులేని అవినీతి రాజ్యమేలుతున్నప్పుడు, నిర్ణయాలు తీసుకోలేని అసమర్ధ పాలనతో జాతి నవనాడులు కుంగిపోయి వున్న నేపధ్యంలో మీరు నాపట్ల ఎంతో నమ్మకంతో నాకు పగ్గాలు అప్పగించారు. మీ ఆశలను నిజం చేయడానికే గత ఏడాదిగా నేను అహరహమూ కష్టపడుతూ వచ్చాను’ అన్నారాయన ఆ లేఖలో ఆనాడు.
పేదల అభ్యున్నతికోసం ‘అంత్యోదయ’, పరిశుభ్రత, పారిశుధ్యం కోసం స్వచ్చ భారత్ మొదలయిన ప్రభుత్వ పధకాల జాబితాను ఏకరువు పెట్టారు.
ఈ మాటలు చెప్పిన తరువాత మరో ఏడాది కాలగర్భంలో కలిసింది. చూస్తుండగానే ఎనిమిదేళ్లు గతంలో కలిసి పోయాయి. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మోడీ అహరహమూ పడుతున్న కష్టం ఏమన్నా ఫలితాలు ఇచ్చిందా అంటే చప్పున జవాబు చెప్పడం కష్టం.
మొండివాడు రాజుకన్నా బలవంతుడంటారు. రాజే మొండివాడయితే ఇక చెప్పేది ఏముంటుంది?
మోడీకి మొండివాడనే పేరుంది. నిజానికి ఆ మొండితనమే ఆయన్ని ఇంతవాడ్ని చేసిందంటారు. ఆ మొండితనమే ఆయనకి ఇంతమంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. అయితే మొండితనం ఎల్లవేళలా అక్కరకు రాదు.
నిజానికి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చాలా సాహసోపేతమైనది. ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు మోడీ అభిమానులేకాదు అత్యధికులయిన దేశప్రజలు మోడీ చొరవను మనసారా స్వాగతించారు. మోడీ ఒక్కడే మొనగాడని, ఆయన మాత్రమే ఇటువంటి సాహసం చేయగలడని వేనోళ్ళ పొగిడారు. ఈ పొగడ్తలు ఒక దశలో మోతాదు మించి ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిరాగాంధీని ఆకాశానికి ఎత్తిన రోజుల్ని గుర్తుకు తెచ్చాయి. ఈ నిర్ణయం దేశానికి ఏ మేరకు మేలు చేసింది అనే విషయంలో, ప్రతిపక్షాల విమర్శలను పక్కన పెట్టినా, ఇప్పటికీ స్పష్టమైన అంచనా లేదు. అయితే మోడీ తీసుకున్న ఈ చర్యకు రెండోమారు ఘన విజయం కట్టబెట్టడం ద్వారా అధిక శాతం మంది ఆమోదముద్ర వేశారు.
ఇక ప్రస్తుతానికి వస్తే, 2019 లో జరిగిన ఎన్నికల్లో నభూతో నభవిష్యతి అన్నట్టుగా సాధించిన ఘన విజయంతో నరేంద్ర మోడీ మరో మారు భారత ప్రధాన మంత్రిగా ఈరోజుకు ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. అప్పటి పరిస్థితులు ఛాయమాత్రంగా ప్రస్తావించడం ఇప్పటి పరిస్థితితో పోల్చుకోవడానికే.
ప్రతి పార్టీకి ముఖ్యంగా బీజేపీ వంటి జాతీయ భావాలు కలిగిన పార్టీలకు కొన్ని మూల సిద్ధాంతాలు వుంటాయి. మెజారిటీ ప్రజలు తమకు సమర్ధ ప్రభుత్వం కావాలనే ఆలోచనతో ఓట్లు వేసి గెలిపిస్తారు. అలాగని తమ మూల సిద్ధాంతాలకు కూడా వారు పట్టం కట్టినట్టు కాదు. కానీ అలాంటి వారిని తమ పాలనతో, విధానాలతో ఆకర్షించి మెల్లగా తమ సిద్ధాంతాల పట్ల వారిలో సానుకూలత పెరిగేలా చూసుకోవాలి. ఈ ప్రజాస్వామ్య ధర్మాన్నిపాటిస్తే ఏ చిక్కూ వుండదు. ఏది చెప్పినా సుద్దుల మాదిరిగా మృదువుగా నచ్చచెప్పే ప్రయత్నం చేయాలి కానీ బలవంతాన రుద్దినట్టు ఉండరాదు.
రాజకీయాల్లో వున్నవాళ్ళు రాజకీయం చేయక తప్పదు. కానీ ప్రజలు, పరిపాలన కూడా పాలకులకు అంతే ప్రధానం. ఈ సత్యం ఎరుకలో వుంచుకుంటే పాలకులకూ మంచిది, ప్రజలకూ మంచిది.
(30-05-2022)



జగన్ మూడేళ్ల పాలన – భండారు శ్రీనివాసరావు


ప్రజలు ఇచ్చిన అయిదేళ్ళ అధికార గడువులో మూడేళ్లు ఈ నెల ముప్పయితో ముగుస్తాయి. ఇంకా రెండేళ్ల వ్యవధానం మిగిలి వుంది.
అంటే ఆగి నిలబడి వెనక్కి తిరిగి చూసుకుని ముందుకు సాగాల్సిన సమయం అన్నమాట.
గత మూడేళ్లను ఒకసారి గమనిస్తే, ముందే రాసిపెట్టుకున్న స్క్రిప్ట్ మాదిరిగా, జరిగేవన్నీ ఒక పద్దతి ప్రకారం చకచకా సాగిపోతూవుండడం జగన్ పాలనలోని ఓ ప్రత్యేకత.
అటు రాష్ట్ర పరిపాలకుడుగా, ఇటు రాజకీయ పార్టీ అధినేతగా జగన్ మోహన రెడ్డి తన రెండు చేతుల్లోను రెండు పగ్గాలు ధరించి పాలనారధాన్ని, పార్టీ రధాన్ని ముందుకు నడుపుతున్నారనేది కూడా సుస్పష్టం. ఒకపక్క సెహభాష్ అనిపించుకునే అధికారిక ప్రకటనలు. మరోపక్క తొందరపడుతున్నారేమో అనిపించే రాజకీయ నిర్ణయాలు.
ఎన్నికల ప్రణాళిక రూపంలో ప్రజలకు చేసిన వాగ్దానాలలో తొంభయ్ శాతానికి పైగా నేరవేర్చామని ప్రభుత్వం చెబుతోంది. కాదంటున్నాయి ప్రతిపక్షాలు. అది సహజం. ప్రశాంత చిత్తంతో పనిచేసుకుంటూ పోయే పరిస్థితి లేని , మాట కూడా నిజం. అయితే ఈ విషయంలో అసలు వాస్తవం ఏది, ఎంత అనేది ప్రయోజనం పొందిన లేదా అందని ప్రజలు మాత్రమే చెప్పగలుగుతారు. అంచేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మొదలు పెట్టిన గడప గడపకు అనే కార్యక్రమం ఒక్కటే ఈ విషయంలో ఒక అవగాహనకు రావడానికి గీటురాయి. ప్రజలను నూటికి నూరు శాతం సంతృప్తి పరచడం ఏ ప్రభుత్వానికి అయినా అసాధ్యం. అయితే పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు ప్రతి గడపకు వెళ్లి, క్షేత్ర స్థాయిలో వాస్తవాలని తెలుసుకున్న పక్షంలో పధకాలు బాగా అమలు జరుగుతున్న చోట పని తీరును మరింత మెరుగు పరుచుకోవడానికి, లేదా అసంతృప్తి వున్న చోట ఆ లొసుగులను తొలగించుకుని ముందుకు పోవడానికి ఈ కార్యక్రమాన్ని మించిన కొలమానం మరోటి వుండదు.
ప్రజల దినవారీ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఎంత తక్కువ వుంటే అది ఉత్తమ ప్రభుత్వం అనిపించుకుంటుంది అని చాణక్యుడు చెప్పాడు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాలు ఈ దిశగా మంచి అడుగు. ప్రజలు ప్రతి చిన్న పనికి గ్రామం దాటి వెళ్ళకుండా, వున్న ఊళ్లోనే వ్యవహారాలు చక్కబరచుకోవడానికి ఈ గ్రామ సచివాలయాలు ఉపయోగపడుతున్నాయి. అయితే వాలంటీర్ల వ్యవస్థ ప్రస్తుత ప్రజాప్రతినిధుల వ్యవస్థకు సమాంతరం కాకుండా జాగ్రత్త పడాలి.
కరోనా సమయంలో నవరత్నాల రూపంలో జరిగిన నగదు బదిలీలు కింది స్థాయి ప్రజలకు బాగా ఉపయోగపడ్డాయి. అన్ని నెలలు ఉపాధి కోల్పోయినా కూడా బడుగు బలహీన వర్గాల ఆర్ధిక స్థితి అతలాకుతలం కాకుండా ఈ నిధులు వారికి అక్కరకు వచ్చాయి. అమెరికా వంటి సంపన్న దేశాలలో సయితం కరోనా వేళ అక్కడి ప్రభుత్వాలు నగదు బదిలీ రూపంలో ప్రజలకు అందించిన సాయం జనజీవనం అస్తవ్యస్తం కాకుండా తోడ్పడిందని పత్రికలు రాశాయి.
వాగ్దానాల అమలుకోసం మరో ధ్యాస పెట్టుకోకుండా, విమర్శలను ఖాతరు చేయకుండా ముఖ్యమంత్రి ఏకాగ్రతతో పనిచేయడం వల్ల వాటి అమలు శాతం ప్రభుత్వానికి సంతృప్తి కలిగించే స్థాయిలో వుంది. ఇక రానున్న రెండేళ్ల కాలాన్ని అత్యంత జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి. పొరబాట్లు జరిగితే దిద్దుకోవడానికి, తప్పులు జరిగితే పునరావృతం కాకుండా చూసుకోవడానికి, ఇక ముందు ముందు ఎలాంటి పొరబాట్లు, తప్పులు జరగకుండా చూసుకోవడానికి రెండేళ్ల సమయాన్ని వాడుకుంటే ప్రభుత్వ పధకాల అమలు, ప్రజల సంతృప్త స్థాయి నూటికి నూరు శాతం చేరడానికి వీలుపడుతుంది.
“జగన్ ఓ సీతయ్య. ఎవరి మాటా వినడు” ఇలాంటివి వినడానికి బాగుంటాయి. పాలకుడు అనే వాడు తన కళ్ళతో చూడాలి. తన చెవులతో వినాలి. అంటే వాస్తవాన్ని మాత్రమే చూడగలగాలి. వినగలగాలి. ఎవరో చెప్పింది వినడం, ఎవరో చూసి చెప్పింది నమ్మడం వంటి లక్షణాలు పరిపాలనను బలహీన పరుస్తాయి.
అయితే ఈ మూడేళ్లు సాఫీగా గడిచిపోయాయి అనుకోవడానికి కానీ, మరో రెండేళ్లు ఇలాగే ఉంటుందన్న భరోసా కానీ లేదు. జగన్ ప్రభుత్వం పట్ల ప్రజావ్యతిరేకత రోజురోజుకూ పెరిగిపోతోంది అనేది ప్రతిపక్షాల వాదన. వాళ్ళు అలాగే అంటారు అని పైకి చెప్పుకోవచ్చు కానీ క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి ఎలా వుందని ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోవాలి. గడప గడపకూ కార్యక్రమంలో అందిన సమాచారాన్ని క్రోడీకరించుకుని ఎప్పటికప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకోని పక్షంలో పరిస్థితి చేయి దాటిన తర్వాత చేయగలింది ఏమీ వుండదు.
“అంతా బాగానే వుంది అని అనుకోవడానికి, అంతా సజావుగా వుంది అనడానికి చాలా తేడా వుంది. ప్రజల ఆలోచనా ధోరణి ఎల్లప్పుడూ ఒకే రీతిగా వుండదు. అది ఎప్పుడు ఏ క్షణంలో ఎలా మారుతుందో పసి కట్టి చెప్పగల మేధావులు లేరు. పరిస్థితి పూర్తిగా అధ్వాన్నంగా వుంది, లేదా పరిస్తితులు అత్యంత అనుకూలంగా వున్నాయి అనే ఈ రెండింటి నడుమ అసలు వాస్తవం దాగి వుంటుంది. దాన్ని ఒడిసిపట్టుకోగల చాకచక్యం కొరవడితే ఫలితాలు ఊహాతీతంగా వుంటాయి”
గత ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో రాసిన వాక్యాలే ఇవి.
ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి కూడా వర్తిస్తాయి.
గతం నుంచి పాఠాలు నేర్చుకుని, నేర్చుకున్న పాఠాలను వర్తమానంలో ఉపయోగించుకుంటే భవిష్యత్తు పదిలంగా వుంటుంది.
లేని పక్షంలో గతమే చరిత్రగా మారుతుంది.




(30-05-2022)

29, మే 2022, ఆదివారం

ఓన్లీ ఇన్ ఇండియా - భండారు శ్రీనివాసరావు

 ఆయనకు రామారావు సినిమాలు ఇష్టం. ఆవిడకు నాగేశ్వర్రావంటే పిచ్చి. ఆయనకు రంగనాయకమ్మ రచనలు ఇష్టం. ఆవిడ పొద్దస్తమానం యద్దనపూడి పుస్తకాలు ముందేసుకు కూర్చుంటుంది. ఆయనకు ఉల్లిపాయ పకోడీలు ఇష్టం. ఉల్లిపాయ పేరు చెబితే ఆమెకు వాంతి. ఆయనకు పేపర్లు ముద్దు. ఆవిడకి టీవీ సీరియళ్లు తప్ప వార్తలు పట్టవు. ఆయనకు ఐస్ క్రీం పడదు. కొంకర్లు పోయే చలికాలంలో కూడా ఐస్ క్రీం తినడం ఆవిడకి ఇష్టం. తీర్ధయాత్రలు చేయాలని ఆవిడ కోరిక. సాయంకాలపు 'తీర్ధ'యాత్రలు తప్ప పుణ్య క్షేత్రాల గొడవ ఆయనకు పట్టదు. ఇలా వారి అభిరుచులు, అభిప్రాయాలు ఒకదానికొకటి పొసగవు. ఇద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం. అయినా సరే వారి దాంపత్య జీవితం ఎలాటి ఒడిదుడుకులు లేకుండా యాభయ్ ఏళ్ళుగా సాగిపోతోంది.

అద్భుతాలు చూడాలంటే హాలీవుడ్ సినిమాలే కాదు, అప్పుడప్పుడూ జీవితాల్లోకి కూడా తొంగి చూస్తుండాలి సుమా!



(బాపూ గారికి వేనవేల కృతజ్ఞతలతో)

28, మే 2022, శనివారం

కాకతాళీయం కావచ్చు ..... భండారు శ్రీనివాసరావు


పాత తెలుగు సినిమాల్లో రానున్న ఘటనలను ముందు సూచనాప్రాయంగా చెప్పడానికి కొన్ని దృశ్యాలను చూపించేవారు. దేవుని గూట్లో వెలుగుతున్న దీపం హఠాత్తుగా ఆరిపోయినట్టు చూపిస్తే ఆ సినిమాలో ఒక పెద్ద  పాత్ర మరణించబోతున్నదని ప్రేక్షకులు ముందే  అర్ధం చేసుకునే వారు. ఇలాంటి షాట్లని సినిమా పరిభాషలో ఏమంటారో తెలియదు.

సినిమా రంగం నుంచి రాజకీయ రంగప్రవేశం చేసిన తర్వాత ఎన్టీఆర్ మాజీ  ముఖ్యమంత్రిగా 1990 లో కాబోలు బాపు దర్సకత్వంలో శ్రీనాధకవి సార్వభౌముడు అనే సినిమాలో నటించారు. గౌఢడిండిమభట్టు కంచుడక్క పగలగొట్టించి, తన కవితాపటిమతో తెలుగు నేల నాలుగు చెరగులా పేరు ప్రఖ్యాతులు ఆర్జించి ఓ వెలుగు వెలిగిన శ్రీనాధ కవిసార్వభౌముడు, తన అవసాన దశలో సమస్త భోగభాగ్యాలను పోగొట్టుకుని దయనీయ స్థితిలో కన్నుమూస్తాడు. అయినా ఆయన  గుండెధైర్యం ఆయనది. చెక్కు చెదరినది.

చివరి క్షణాల్లో కూడా 

“దివిజకవివరు గుండియల్ దిగ్గురనగ

నరుగుచున్నాడు శ్రీనాధుడమరపురికి” అంటూ మరణిస్తాడు.

తన భవిష్యత్తు ఎలా వుండబోతోందో తెలిసి ఎన్టీఆర్ ఈ సినిమాలో ఆ పాత్ర ధరించారని నేను అనుకోను. కానీ ముందు చెప్పిన సినిమా ఫార్ములా ఇక్కడ అచ్చుగుద్దినట్టు సరిపోయేలా, తదనంతర కాలంలో అనేక ఘటనలు ఆయన జీవితంలో చోటు చేసుకున్నాయి.




ఎక్కివచ్చిన మెట్లు -భండారు శ్రీనివాసరావు

నడిచి వచ్చిన జీవితం బాగా గుర్తుంది అని చెప్పడం పెద్ద అబద్ధం కాకపోయినా మన మనస్సుని మోసం చేసుకోవడమే.

1975లో హైదరాబాదు వచ్చిన కొత్తల్లో చిక్కడపల్లి లోని మా ఇంటికి రెండు ఫర్లాంగుల దూరంలో మెయిన్ రోడ్డుమీద, సుధా హోటల్ వద్ద సిటీ బస్ స్టాపు వుండేది. అక్కడి నుంచి నేరుగా రేడియో స్టేషన్ కు కాని, సెక్రెటేరియేట్ కు కానీ వెళ్ళాలంటే రామ్ నగర్ నుంచి విజయనగర్ కాలనీకి వెళ్ళే 139 నెంబరు బస్సు ఒక్కటే దిక్కు. ఒక్కటే అవటాన దానికి టెక్కు సహజం. అంచేత దాని రాకపోకలు అనూహ్యం. కావున, మన రూటుది కాకపోయినా మరో బస్సును పట్టుకుని ప్రయాణం చేయడం తప్పనిసరి. పైగా జేబులో ‘అన్ని సిటీ రూట్లలో ఉచిత ప్రయాణానికి సర్కారు (ఆర్టీసీ) వారిచ్చిన జర్నలిస్టు పాసు సిద్ధంగా వుండేది. అలా నిత్యం బస్సుల్లో తిరిగే రోజుల్లో సిటీ బస్సు ప్రయాణీకుల పాట్లు బాగా అర్ధం అయ్యేవి.
ఆ తరువాత కొన్నాళ్ళకు ఆటో శరణ్యం అయింది. అప్పుడు కానీ నాకు ఆటో బాధలు (ఆటో వారితో ప్రయాణీకుల బాధలు అన్నమాట) అర్ధం కాలేదు. రమ్మన్న చోటుకు రావడం వాళ్లకు ఇష్టం వుండేది కాదు. వాళ్ళు అలా రాననడం నాకు నచ్చేది కాదు. వాళ్ళతో ప్రతిరోజూ నా పొట్లాటలు మా ఆవిడకు నచ్చేవి కావు. సినిమాకని బయలుదేరి, ఆటోవాడు రానంటే, అతడు చెప్పిన చోటుకే తీసికెళ్ళమని అందులో ఎక్కి కూర్చుని మధ్యలో పోలీసు స్టేషన్లకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉండేవి. రోడ్డు మీద మన మాట చెల్లకపోయినా, పోలీసుల దగ్గర విలేకరిగా చెల్లుబాటయ్యేవి. ఇంతా చేసి మనం అడిగే ఫేవర్ ఒక్కటే, మీటరు మీద వచ్చే ఆటో మాట్లాడి పెట్టమని. వాళ్ళకది చిటికెలో పని. ఆ విధంగా ముందుకు పోతూ, కొంతమంది ఆటో డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేసేంతవరకు నా చేష్టలు శృతిమించడంతో, మా ఇంటిల్లిపాదీ స్కూటర్ కొనుక్కోవడం ఒక్కటే దీనికి తరుణోపాయమని ఒక ఏకగ్రీవ తీర్మానం చేసారు.
కొన్నాళ్ళకు ఆ ముచ్చటా తీరింది. స్కూటర్ నడపడం మొదలెట్టాక, ఇక ద్విచక్ర వాహనదారుల కడగండ్లన్నీ కళ్లకు కట్టినట్టు కనిపించడం మొదలయింది. హెల్మెట్ ఉదంతంతో ఆ అధ్యాయమూ ముగిసింది.
ఇప్పుడు పిల్లల పుణ్యమా అని కారు యోగం. ఈ దశలో, అదేమిటో కారు ఆసాముల కష్టాలమీదనే నా ధ్యాస.
జీవితం అన్నాక ఒక్కోమెట్టు నింపాదిగానో, హడావిడిగానో ఎక్కుతుంటాం.
మరి అదేమి చిత్రమో, చూపు ఎక్కేపై మెట్టు మీదనే కానీ, ఎక్కివచ్చిన కింది మెట్టు మీద వుండదు.