7, జనవరి 2022, శుక్రవారం
వావిలేని వరుసలు - భండారు శ్రీనివాసరావు
మూడు "తెలుగు" కధలు - భండారు శ్రీనివాసరావు
కలం కూలీ, ప్రముఖ పాత్రికేయులు,కీర్తిశేషులు జి. కృష్ణ ఒకప్పుడు చెప్పిన తెలుగు ముచ్చట్లు.
పూర్వపు మద్రాసు రాష్ట్రం నుంచి
వేరుపడి ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రకేసరి
ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా వున్న రోజులు. రమేశన్ అనే తెలుగు తెలిసిన తమిళ
అధికారి గుంటూరు కలెక్టర్ గా వుండేవారు. తెలుగువాడు కాకపోవడం వల్ల కావచ్చు, ఆయనకు తెలుగంటే వల్లమాలిన అభిమానం. అంచేత, జిల్లా
కలెక్టర్ కి పంపుకునే ఆర్జీలను తెలుగులో పంపుకోవచ్చని ప్రకటించాడు. ఇంగ్లీష్
వచ్చిన వాళ్లకు ఈ నిర్ణయం తలవంపులుగా అనిపించి పోయి ప్రకాశం గారికి పిర్యాదు
చేశారు. ఆంధ్రకేసరికి కోపం వచ్చింది. రమేశన్ ని సంజాయిషీ అడిగారు. ఆయన ఈనాటి
అధికారుల కోవలోని వాడు కాదు కాబట్టి ధైర్యంగా జవాబు చెప్పాడు, ‘ఆంద్ర రాష్ట్రం వచ్చింది కదా. అది ఏర్పడిన సిద్దాంతం ప్రకారం ఇట్లా
ప్రకటించాను’ అంటూ. మరి ఆంద్ర కేసరి కూడా ఈనాటి నాయకుల బాపతు కాదుకదా! అధికారి
చెప్పింది విని, సరే అని ఒప్పుకుని, తన చెవులు కొరికిన వాళ్ళను తరువాత చెడామడా ఉతికేసాడు.
ఆంగ్లంలో పెద్ద చదువులు చదవకుండానే
పెద్ద పెద్ద ఇంగ్లీష్ పత్రికల్లో పనిచేసిన కృష్ణ గారికి, రమేశన్ మాదిరిగానే తెలుగు అంటే మంచి అభిమానం. కాన్వెంటు స్కూళ్ళకు ఆయన
పెట్టిన ముద్దు పేరు మమ్మీ డాడీ బడులు.
ఆయన చెప్పినదే మరో తెలుగు కధ.
1990 లో కాబోలు, హైదరాబాదులోని అంతర్జాతీయ తెలుగు సంస్థ
కార్యాలయానికి దక్షిణాఫ్రికా నుంచి పీ.ఎం. నాయుడు అనే పెద్దమనిషి వచ్చాడు. ఆయన
అంతదూరం నుంచి వచ్చి మన ప్రభుత్వాన్ని అడిగింది ఏమిటో తెలుసా, ‘ఒకరిద్దరు తెలుగు పండితుల్ని ఇవ్వండి, ఆఫ్రికాలో
మా పిల్లలకు తెలుగు నేర్పుకుంటాము’ అని.
స్వతంత్రం వచ్చిన తరువాత ఏర్పడ్డ
భాషాప్రయుక్త రాష్ట్రాలలో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్. కృష్ణ గారు అనేవారు, అలాంటి ఆంధ్రప్రదేశ్ లో ఇంటాబయటా తెలుగు ‘హుష్ కాకి’.
అయితే, తెలుగు
భాష పరిస్తితి మునపటంత దయనీయంగా లేదు.
ఇంటర్ నెట్ ఆగమనంతో తెలుగు భాష మరో
మృతభాషగా మారిపోతుందనే భయాలు వట్టివని తొందర్లోనే తేలిపోయింది. భాష బతకాలంటే కేవలం
మాట్లాడితే సరిపోదు, రాయడం, చదవడం
వచ్చి తీరాలి అంటారు. ఈరోజు సోషల్ మీడియాలో అలాటి చక్కదనాల తెలుగు సౌరభం
వెల్లివిరుస్తోంది. తెలిసిన వారి నుంచి తెలియని వారు నేర్చుకునే వేదికగా కూడా ఈ
మీడియా ఉపయోగపడుతోంది. తెలుగు భాష ఈ మాత్రం ప్రాణంతో నిలబడి ఉన్నదంటే నిజానికి
బ్లాగర్, ఫేస్ బుక్, వాట్స్ ఆప్ వంటి అధునాతన మీడియాలే కారణం అనడం అతిశయోక్తి కాదు. ఇప్పుడు
అనేకమంది ప్రతి రోజూ తెలుగులో రాస్తున్నారు. తెలుగులో రాసింది చదువుతున్నారు.
తెలుగులో అభిప్రాయాలు పరస్పరం తెలుపుకుంటున్నారు. ఇదొక శుభ పరిణామం.
అయితే ఇదొక్కటే సరిపోదు.
భాషలను, సంస్కృతులను
పరిరక్షించాల్సిన బాధ్యత ఒకనాడు ప్రభువులది, ఈనాడు
మాత్రం ప్రజాప్రభుత్వాలది.
ఉపశృతి: 1980 లో కాబోలు మిమిక్రీ వేణుమాధవ్ కొంతమంది కళాకారులతో కలిసి మారిషస్, దక్షిణాఫ్రికా దేశాల్లో పర్యటించారు. అప్పుడు వారికి డర్బన్ నగరంలో
‘వరంగల్లు వీధి’ కనిపించింది. వివరం అడిగితే అక్కడివాళ్లు చెప్పారట. ఆ నగరంలో
తెలుగు వాళ్ళు వుండే వీధికి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండని నగరపాలక సంస్థ
సూచించింది. అంతే! అందరూ కలిసి మరో మాట లేకుండా వరంగల్ పేరు పెట్టుకున్నారట.
తెలుగుతనం, తెలుగు అభిమానం చూడాలంటే ముందుముందు విదేశాలకు వెళ్ళాలేమో!
6, జనవరి 2022, గురువారం
చిలక జోస్యం – భండారు శ్రీనివాసరావు
5, జనవరి 2022, బుధవారం
జంధ్యాల బ్యాచ్ గా పిలవబడే మిత్ర సప్తకం
మొన్న హైదరాబాదులో జరిగిన సుబ్బరాయ శర్మ గారి డెబ్బయ్ అయిదవ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న బెజవాడ ఎస్సారార్ కాలేజ్ జంధ్యాల బ్యాచ్ గా పిలవబడే మిత్ర సప్తకం:
సభ్యతకు పలుకే గీటురాయి
మా చిన్నప్పుడు ‘ఏం గురూ’ అనే మాట మా నోట వినబడితే పెద్దవాళ్ళు తొడపాశం పెట్టేవాళ్ళు. ఇప్పటి పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు కూడా అలా పిలుచుకుంటుంటే అది మరీ అంత చెడ్డ మాట కాదేమో అని అనుకోవాల్సి వస్తోంది. తరాలు మారిపోతున్న కొద్దీ మాటల్లో అర్ధం మారి ‘బూతు’ తగ్గి పోతూ వుంటుందేమో మరి.
"కొన్ని పదాలు పలకడం అంటే తగని అసహ్యం. వాటిని
అక్షరీకరించడం అంటే మరింత అసహ్యం. కోపాన్ని, ఆగ్రహాన్ని,అసహనాన్ని
వ్యక్తీకరించడానికి సభ్య సమాజంలో అటువంటి పదాల అవసరం ఉంటుందని అనుకోను. ఆ అవసరమే వస్తే, పర్యాయపదజాలానికి
తెలుగు భాష గొడ్డుపోలేదు.
“అయినా
కానీ టీవీ చర్చల్లో, ఫేస్
బుక్ రాతల్లో ఇంకా అలాంటి దుష్ట పదాలు అలవోకగా జారిపోతూ వుండడం చూస్తే చాలా బాధ
వేస్తుంది”
3, జనవరి 2022, సోమవారం
“శతాయుష్మాన్ భవ” శర్మ గారూ! – భండారు శ్రీనివాసరావు
పెద్ద చిత్రాల్లో చిన్న పాత్ర అయినా, చిన్న చిత్రాల్లో పెద్ద పాత్ర అయినా పాత్రోచితంగా నటించి మెప్పించే సుప్రసిద్ధ నటుడు శ్రీ ఉప్పలూరి సుబ్బరాయ శర్మ.
శర్మగారికి
నాకూ కొన్ని బాదరాయణ సంబంధాలు వున్నాయి. ఆయనదీ నాదీ డిగ్రీ బెజవాడ ఎస్సారార్
కాలేజి. ఆయనకు రేడియో అంటే రేడియో కాదు, ఆకాశవాణి అంటే చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే తన మొబైల్ కు రేడియో సిగ్నేచర్ ట్యూన్ ని కాలర్
టోన్ గా పెట్టుకునేంత. ( నా మొబైల్ లో
కూడా అదే ట్యూన్) నాకూ రేడియో అంటే ఇష్టమే
ఎందుకంటే అది నా మాతృసంస్థ కాబట్టి. ఆయనకు డెబ్బయి అయిదు సంవత్సరాలు. నా వయసు ఇంకొంచెం
ఎక్కువ.
సంబంధాలు, పోలికలు ఇంత వరకే. ఆయన పాటించే
స్నేహ ధర్మం విషయంలో కాని, ఆయనకు
వున్న మంచి పెద్ద మనసులో కాని, అబ్బే ఆయనతో నాకు సాపత్యమే లేదు. ఈ విషయంలో ఆయన
నాకంటే చాలా చాలా పెద్దవాడు. లేకుంటే
కలిసి దశాబ్దాలు గడిచిన తర్వాత ఈరోజు ఉదయం ఫోన్ చేసి సాయంత్రం కలుద్దాం అంటారా!
ఆయనకే చెల్లు.
వెళ్లాను.
అప్పుడు తెలిసింది సుబ్బరాయ శర్మ గారి అమృతోత్సవం ఈరోజు అని. 75వ పుట్టిన రోజు అన్నమాట. ఎప్పుడో
నలభయ్ యాభయ్ ఏళ్ళ నాటి పరిచయస్తులు,
చిన్ననాటి స్నేహితులు చాలామంది కలిసారు. ఎస్సారార్ కాలేజ్ మేట్స్
మాధవపెద్ది సురేశ్ (ప్రముఖ సంగీత దర్శకుడు), ఏమ్వీ రఘు (సినీ దర్శకుడు, ప్రసిద్ధ
సినిమాటోగ్రాఫర్) జెన్నీ (ప్రముఖ హాస్య నటుడు), ఒకనాటి ప్రముఖ కథారచయిత దేవరకొండ
మురళి, ధర్మవరపు
రామ్మోహన రావు, ఏలేశ్వరపు
ప్రసాద్,
అలనాటి ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కందుకూరి సూర్యనారాయణ గారు, దూరదర్సన్ ఓలేటి పార్వతీశం, చక్రవర్తి, ప్రసిద్ధ కార్టూనిష్ట్ శంకు,
కళాపోషకుడు మద్దాలి రఘురాం,
జమలాపురం రమణ, ఓపెన్
యూనివర్సిటీ చెన్నయ్య, కోవిడ్
నిబంధనలు లేకపోతే ఇంకా ఎక్కువమంది కలిసేవాళ్ళేమో!
ఇక
ఒకప్పటి నా రేడియో కొలీగ్ వాచస్పతి మురళీకృష్ణ ఈ మొత్తం కార్యక్రమానికి
సంధానకర్తగా సందడి చేశాడు.
సుబ్బరాయ
శర్మ గారి మీద వారి మనుమరాలు మహతి తీసిన చిన్న డాక్యుమెంటరీ అద్భ్తతః. సంస్కృత, ఆంగ్ల, ఆంధ్ర భాషల్లో అనర్ఘలంగా తాతగారి గురించి
చెప్పిన పలుగులు వింటుంటే సుబ్బరాయ శర్మ
గారు చాలా అదృష్ట వంతులు అనిపించింది.
మంచి
భోజనంలో బోలెడు ఆనందాన్ని కలుపుకుని, కడుపులో
నింపుకుని మళ్ళీ ఇంటిబాట పట్టాను.
వయసులో
కొంచెం పెద్దవాడిని అని ఈరోజే తెలిసింది కనుక,
“శతాయుష్మాన్ భవ” శర్మ గారూ!
(03—1-2022)
సర్వనామాలకు సర్వమంగళం – భండారు శ్రీనివాసరావు
పూర్వం కమ్యూనిస్టుల ఏలుబడిలో సోవియట్ యూనియన్ వర్ధిల్లిన కాలంలో రేడియో మాస్కోలో దాదాపు ఎనభైకి పైగా ప్రపంచభాషల్లో వార్తాప్రసారాలు జరిగేవి. నేను తెలుగు విభాగం బాధ్యుడిగా ఉండేవాడిని. అప్పుడు సోవియట్ అధినేత మిహాయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్.
ఇన్ని ప్రపంచ భాషలకు సంబంధించిన వార్తలను ముందు ఇంగ్లీష్ భాషలో తయారు చేసి వాటి ప్రతులను అన్ని విభాగాలకు పంపేవారు. వాటిని ఆయా భాషల నిపుణులు తమ భాషలలోకి అనువదించి ప్రసారం చేసేవాళ్ళు. నాకు సహాయకుడిగా కొద్దిగా తెలుగు తెలిసిన గీర్మన్ అనే రష్యన్ ఉండేవాడు.
‘మీరు అసలు ప్రతి ఇస్తున్నారు సరే. మీ వార్తల్ని మీరు అనుకున్నట్టు యధాతధంగా
అనువదిస్తున్నామా లేదా అనే సంగతి మీకెలా తెలుస్తుంది’ అని అడిగాను. దానికి ఆయన
చెప్పిన సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది.
‘ప్రతి వార్తలో దాదాపు మా నాయకుడి పేరు అనేకసార్లు వస్తుంది. మీరు ఎన్నిసార్లు ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ అంటారో దాన్ని మా వాళ్ళు విని, మా దగ్గర వున్న ఒరిజినల్ బులెటిన్లో ఆ పేరు ఎన్ని సార్లు వచ్చిందో సరిచూసుకుని అప్పుడు మీరు సరిగా అనువాదం చేస్తున్నారో లేదో మావాళ్ళు కనుక్కుంటారు’ అని కర్ణుడి జన్మ రహస్యం నా చెవిన వేశాడు.
అంటే ఇక ఎటువంటి పరిస్తితిలోనూ అతడు, ఆయన అనే సర్వనామాలు పనికిరావు అనేది బోధపడింది.
‘ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ప్రకటించారు, ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ఇంకా ఇలా అన్నారు, ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ పేర్కొన్నారు, ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ఉద్ఘాటించారు’ అంటూ ఒకే పేరాలో నాచేత అష్టోత్తరం చదివిస్తున్నారు అనే వాస్తవం ఎరుకలోకి వచ్చింది.
సరే! ఆ శకం ముగిసింది.
ఇలాంటిదే మరో విశేషం నా కంట పడింది.
ఆఫ్రికా దేశం అయిన ఉగాండాను ఇదీ అమీన్ అనే నియంత పాలించేవాడు. రేడియో కంపాలాలో ప్రతి రోజు అయన గురించిన వార్తలే ప్రముఖంగా ప్రసారం అయ్యేవి. ఆయనకు రేడియోలో తన పూర్తి పేరు చెప్పాలని మక్కువ. నియంత తలచుకుంటే కానిదేముంది. కాకపోతే ఒక ఇబ్బంది ఎదురయింది. పూర్తి పేరు అయితే పరవాలేదు కానీ తనకున్న బిరుదులు, మెడల్స్ కూడా జోడించి చెప్పాలని ఆదేశం. నియంత పాలించే ఆదేశంలో ఆయన ఆదేశం శిరోధార్యమాయే. దాంతో ఒకటికి పదిసార్లు రేడియోలో ఆయన పేరు వచ్చేది. ఒకటికి పదిసార్లు జనం దాన్ని వినాల్సివచ్చేది. ఎలా అంటే ఇలా:
“His Excellency the President of the Republic of
Uganda, General al Haji Idi Amin Dada, VC, DSO, MC……”