21, డిసెంబర్ 2021, మంగళవారం

మంచి ఎమ్మెల్యే – భండారు శ్రీనివాసరావు

 మంచి ఎమ్మెల్యేనా! అలాంటి వారు కూడా ఉంటారా అనకండి. ఇప్పటి సంగతి నాకు తెలియదు. వున్నారేమో! కానీ నేను విలేకరిగా పనిచేసే రోజుల్లో కొంతమంది  తటస్థపడ్డారు. ఒకరు బత్తిన సుబ్బారావు గారు, మరొకరు చప్పిడి వెంగయ్య గారు. ఇంకొకరు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. వేరొకరు చిక్కాల రామచంద్ర రావు గారు. ఇంకా వున్నారు కానీ ప్రస్తుతానికి ఈ నలుగురి గురించి చెప్పుకుందాం.

బత్తిన సుబ్బారావు గారు గోదావరి జిల్లానుంచి శాసన సభకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఒకానొక కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. అతి పేద దళిత కుటుంబం నుంచి మంత్రి స్థాయికి ఎదిగినా ఆయన ఆర్ధిక పరిస్తితిలో ఏమార్పూ లేదు. ఆయన తల్లిగారు కూలీపని చేసుకుని జీవనం గడిపేవారు. రాజ్యసభ ఎన్నికల్లో రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా డబ్బు తీసుకుంటారని ప్రచారం సాగే రోజుల్లో, అనారోగ్యానికి గురై, నిమ్స్ ఆసుపత్రిలో వుండి కూడా వీల్ చైర్ మీద వెళ్లి పైసా తీసుకోకుండా ఓటు వేసి వచ్చారు. చివరకు ఎంతటి గర్భదారిద్య్రంలో కూరుకు పోయారంటే చనిపోయినప్పుడు దహనం చేయడానికి డబ్బులు లేని దౌర్భాగ్య స్తితి.

ఈ విషయాన్ని అప్పటి బీజేపీ శాసనసభ్యులు శ్రీ వేమా, మరికొందరు గోదావరి జిల్లాల సభ్యులు అసెంబ్లీలో ప్రస్తావిస్తే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించి ప్రభుత్వం తరపున కొంత ఆర్ధిక సాయం ప్రకటించారు.

అలాగే, ప్రకాశం జిల్లాకు చెందిన చప్పిడి వెంగయ్య గారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ అభ్యర్ధిగా ఆయన 1994 లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చాలా సింపుల్ గా వుండేవారు.

‘ఎన్నిసార్లు మొత్తుకున్నా ఫలితం వుండడం లేదు, కనీసం ఈసారయినా నా పేరు సరిగా రాయండయ్యా’ అని అసెంబ్లీ కవరేజ్ కి వెళ్ళే పాత్రికేయులతో అనేవారు సరదాగా. ఆయన పేరు చప్పిడి వెంగయ్య. వెంగయ్య అయివుండదు, అది వెంకయ్య అయివుంటుందని  హైదరాబాదు రిపోర్టర్లు  తామే తీర్మానించుకుని, చప్పిడి వెంకయ్య అని రాసేవారు.

వెంగయ్య గారి ఎన్నికల ప్రచారాన్ని కవర్ చేయడానికి హైదరాబాదు నుంచి డెక్కన్ క్రానికల్ తరపున సుశీల్ కుమార్ (ప్రస్తుతం హైదరాబాదు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నతోద్యోగంలో వున్నారు) ప్రకాశం జిల్లాకు వెళ్ళారు. వెంగయ్య గారి ఇల్లు చూసి ఆశ్చర్యపోయారు. రెండే గదులు. టీవీ కాదుకదా, కనీసం రేడియో కూడా లేదు. కాలినడకనే ప్రచారం. అయినా గెలిచారు. కాదు ప్రజలు గెలిపించారు. సుశీల్ ఆ రోజుల్లో వెంగయ్య గారి గురించి క్రానికల్ లో రాసిన రైటప్ చాలా సంచలనాన్ని సృష్టించింది.

మరోసారి ఎన్నికల్లో పార్టీ ఫండ్ స్వయంగా అందచేయడానికి ఒక మంత్రిగారు వెళ్ళారు. కానీ ఆయన పైసా కూడా తీసుకోలేదు. చిత్రం! ఆ ఎన్నికల్లో ఓడిపోయారు’

రాజ్యసభకు ఎన్నికయిన శ్రీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ చాలా సౌమ్యులు. రేడియో విలేకరిగా నాకు కొంత పరిచయం వుంది. గతంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన రోజుల్లో కూడా ఆయన నిరాడంబరంగా వుండడం నాకు తెలుసు. వై.ఎస్.ఆర్.కు, ఆయన కుటుంబానికి బాగా కావాల్సిన వారు. గతంలో జగన్ మోహన రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేసిన జగన్ పార్టీలో చేరిపోయారు.

రాజ్యసభకు ఎన్నిక అయిన అనంతరం సుభాష్ చంద్ర బోస్ మాట్లాడిన విషయాలు విన్నప్పుడు తనని రాజకీయాల్లో ప్రోత్సహించిన వారిని ఆయన ఎలా గుర్తుంచుకున్నదీ తెలిసి ఆశ్చర్యం వేసింది. ఇలాంటి సందర్భాలలో ఎవరయినా సరే, ముందు తమ పార్టీ నాయకుడిని పొగడ్తలతో ముంచెత్తిన తర్వాతనే ఇతరులను తలుచుకుంటారు.

కానీ ఆయన ముందుగా తలచుకున్న రాయవరం మునసబు ఎవరన్నది ఈ తరం వారికి తెలియదు. ఆయనే తనకు రాజకీయాల్లో ఓనమాలు నేర్పించారన్నారు. ఒకానొక కాలంలో రాయవరం మునసబు అంటే జిల్లామొత్తానికి తెలిసిన పేరు. ఆయన జిల్లా దాటి రాజకీయాలు చేసింది లేదు. కానీ రాష్ట్ర రాజధానివరకు ఆయన ఎవరో తెలుసు.

తర్వాత తలచుకున్న పేరు వై.ఎస్. ఆయన తనను రాజకీయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ని చేశారని సుభాష్ చంద్ర బోస్ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆ పిదప వై.ఎస్. జగన్ వల్లనే తనకు ఇన్ని రాజకీయ పదవులు వచ్చాయని చెప్పుకొచ్చారు.

పదవిని అనుభవించిన రోజుల్లో నాయకుడే తమ అధినాయకుడని ప్రస్తుతించి పదవి పోగానే అతడెవరో తెలియనట్టుగా ప్రవర్తించే రాజకీయ నాయకులు కోకొల్లలుగా ఉన్న నేటి రాజకీయాలు మాత్రమే తెలిసిన ఈనాటి తరానికి ఈ రకం నాయకులు నిజంగా కొత్తే.

ఈ విధేయతలు అనేవి పార్టీ వ్యవహారాలు. అవి పక్కన పెడదాం. మరి ఆయన నిరాడంబరత్వం. దాన్ని గురించి తప్పనిసరిగా చెప్పుకోవాలి.

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పిల్లి సుభాష్ చంద్ర బోస్ మంత్రిగా వున్నప్పుడు మా అన్నయ్య భండారు రామచంద్రరావు గారు మా వదినె గారితో కలిసి వైజాగ్ నుంచి హైదరాబాదు రైల్లో వస్తున్నారు. ఇద్దరికీ ఏసీ సెకండ్ క్లాసులో అప్పర్ బెర్తులు దొరికాయి. కింద బెర్తులు ఖాళీగా వుంటే, టీసీని అడిగారు. రాజమండ్రిలో ఒక మంత్రి గారి కోసం రిజర్వ్ అయ్యాయి, లాభం లేదు అన్నాడాయన. మంత్రి గారికి ఫస్ట్ ఏసీ ఎలిజిబిలిటీ వుంటుంది కదా, ఈ సెకండ్ ఏసీ ఎందుకు అనేది మా అన్నయ్య అనుమానం.

రాజమండ్రి వచ్చేసరికి తొమ్మిది దాటింది. మంత్రిగారు భార్యతో కలిసి బోగీలోకి వచ్చారు. సామాన్లు సర్దుకున్న తరువాత ఆయన మా అన్నయ్యని అడిగారట. మీ మిసెస్ పైకి ఎక్కి పడుకోవడం కష్టం, ఆవిడ, మా ఆవిడ కింద బెర్తుల్లో పడుకుంటారు, మనం పైన సర్డుకుందాం అన్నారట ఆ మంత్రిగారు. ఇది విని మా అన్నయ్య ఎంతో ఆశ్చర్యపోయారు.

ఆయన ఎవరో కాదు, ఈనాటి రాజ్యసభ సభ్యులు అయిన పిల్లి సుభాష్ చంద్ర బోస్ గారు.

మంత్రిగారికి ఫస్ట్ ఏసీ ఎలిజిబిలిటీ వున్న మాట నిజమే. కానీ మా మేడం గారు ఆయనతో ప్రయాణం చేస్తే మాత్రం సెకండ్ ఏసీ బుక్ చేయమంటారు”

మర్నాడు ఉదయం సికిందరాబాదులో రైలు దిగిన తర్వాత మంత్రిగారి పియ్యే మా అన్నగారి అనుమానం తీర్చారు.

మరో ఉదంతం చెప్పుకుందాం.

మంత్రిగారు ఆఫీసులో రివ్యూ మీటింగులో వుండగా ఇంటర్ కం మోగింది.

అవతల పియ్యే.

సార్! ఇంటి నుంచి ఫోన్, మేడం గారు లైన్లో వున్నారు’

మంత్రిగారు విసుగ్గా ఫోన్ తీసుకున్నారు. మరింత విసుగ్గా అన్నారు.

ఎన్ని సార్లు చెప్పాను, ఆఫీసులో మీటింగులో వున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని. ఇంతకీ ఏమిటంత అర్జంటు పని’

‘........’

కారు పపించాలా! ఎందుకు ఈమీటింగు కాగానే నేనే ఇంటికి వస్తున్నాను. ఈ అరగంటలో కొంపలేం మునగవ్. డ్రైవర్ అటూ ఇటూ రెండు సార్లు తిరగడం దండగ. నేను వచ్చాక వెడుదువ్ కాని’

ఆరోజు మంత్రి ఛాంబర్లో దివాలా తీసిన ప్రూడెన్షియల్ సహకార పట్టణ బ్యాంకు గురించిన మీటింగ్ జరుగుతోంది. సీనియర్ ఐఏఎస్ అధికారులయిన సహకార శాఖ కార్యదర్శి శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సహకార శాఖ రిజిస్ట్రార్ శ్రీ గార్గ్, ఆ బ్యాంక్ లిక్విడేషన్ వ్యవహారాలను చూడడానికి నియమితులయిన ఎస్బీఐ రిటైర్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ అయిన మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు అందులో పాల్గొంటున్నారు.

నిజానికి మంత్రులు ఇంటి పనులకోసం అధికారిక వాహనాలను వాడుకోవడం అనేది సామాన్యంగా జరిగే విషయమే. అలాటి వాటిని చాలా సాధారణ విషయంగా తీసుకోవడానికి జనం అలవాటుపడ్డారు. ప్రతి మంత్రికీ ఆయన శాఖ కిందికి వచ్చే కార్పొరేషన్ వాళ్ళే వాహనాలు ఒకటో రెండో అదనంగా సమకూర్చడం అనేది బహిరంగ రహస్యమే. మరి ఇదేమిటి ఈ మంత్రిగారు భార్య కారు కావాలంటే ఇలా విసుక్కుంటున్నారు?

ఆయన అంతే! ఆయన మంత్రే కాని అందరివంటి వాడు కాదు. ఆయన పేరే చిక్కాల రామచంద్రరావు. అనేకమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవులు నిర్వహించారు. మంత్రి అయిన తర్వాత కూడా ఆయన తన సొంత అంబాసిడర్ కారునే వాడేవారు. ప్రభుత్వం ఇచ్చే అలవెన్స్ వాడుకునేవారు.

సింపుల్ గా వుండడం ఆయనకు ఇష్టం. మంత్రిగా వున్నప్పుడు ఈ ఇష్టాన్ని మహబాగా తీర్చుకున్నారు.

 

 

 

20, డిసెంబర్ 2021, సోమవారం

నేను హిందువుని

 

(హిందూ అనగానే మనువును గుర్తు చేసుకోవద్దు. మనువు పుట్టక ముందే హిందూ మతం వుంది. నిజానికి ఇది ఒక మతం కాదు, జీవన విధానం)

నేను ఆచరించి, పాటించే హిందూ మతం గురించి నాకు మా పెద్దవాళ్ళు చెప్పింది వేరు. నేనిప్పుడు చూస్తున్నది వేరు.

ఎందరు గజనీలు దండెత్తి వచ్చినా, ఎందరు ఘోరీలు యుద్ధాలు చేసినా హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం చేయగలిగారు కానీ హిందూ మత ధర్మాన్ని ఏమీ చేయలేకపోయారు. వందల వేల సంవత్సరాలు విదేశీయుల ఏలుబడిలో వున్నా హిందూ మతం చెక్కుచెదరలేదు. అదీ ఈ మతం గొప్పతనం. అంచేత ఎవరో ఏదో చేస్తారనీ, చేస్తున్నారనీ అనుకోవడంలో సహేతుకత వుందని నేననుకోను. సాధారణంగా నేను మతపరమైన, రాజకీయ పరమైన విషయాలపై వ్యాఖ్యానాలు చేయను. కానీ ఈ నడుమ సాంఘిక మాధ్యమాల్లో ఒకరకమైన మొండి ధోరణి కనబడుతోంది. ఇది మన మత విధానాలకే వ్యతిరేకం. హిందూ మతాన్ని మొండిగా సమర్ధించే వాళ్ళలో కనీసం కొందరు కూడా మతం చెప్పిన దాన్ని పాటించడం లేదు. సహనావతు అనేది వేదవాక్యం. ఆ సహనం ఇవ్వాళ కనబడడం లేదు. ఇతర మతాల వాళ్ళు ఏం చేస్తున్నారనే దానితో నిమిత్తం లేదు. ఏమి చేసినా ఏమీ కాదు. చరిత్రే ఇందుకు సజీవ సాక్ష్యం.

నా దృష్టిలో హిందూ మతం బలమైన పునాదులపై ఉద్భవించింది. తనని తాను కాపాడుకోగల సామర్ధ్యం, సత్తా ఈ మతానికి ఈనాటికీ పుష్కలంగా వుంది. అందుకు సందేహం లేదు.  (December, 2017)

19, డిసెంబర్ 2021, ఆదివారం

వెనకడుగు వేద్దాం రండి! –భండారు శ్రీనివాసరావు

 (ఈరోజు, 19-12-2021  ఆదివారం ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)  

జీవితమంటే శక్తి. బలహీనతకు మరోపేరే మృత్యువు. మన ఊహలు, ఆలోచనలు, ఆశలు, ఆశయాలు అన్నీ మన జీవితాల్లో భాగమే!” – స్వామి వివేకానంద

 

అరవయ్యోపడిలో పడ్డ చాలామంది, ఏదో తెలియని అభద్రతాభావంతో కలత చెందుతుండడం కద్దు. వయసు మీదపడుతోందన్న భావన కావచ్చు. జీవితం మలిసంధ్యలో అడుగు పెడుతున్నామన్న ఆందోళన కావచ్చు. సంఘంలో, కుటుంబంలో తమకున్న ప్రాధాన్యత, పెద్దరికం  క్రమంగా తగ్గిపోతున్నాయేమో అన్న బాధ కావచ్చు. కారణం ఏదయినా, వయసు మీరుతున్నవారిలో ఈ రకమయిన ఆందోళనలు సహజం. అయితే వీటిని అధిగమించి జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవడం అసాధ్యమేమీ కాదంటున్నారు జీవితాన్ని కాచివడబోసిన వాళ్లు.

 

ముందు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ముసలితనం వచ్చేసిందని చెప్పుకోకపోవడం.

వయసుల్లో మూడు రకాలున్నాయి. జననతేదీ ప్రకారం చెప్పుకునే వయసు ఒకటయితే, రెండోది శారీరక ఆరోగ్యం ఆధారంగా అంచనా వేసేది. ఇక మూడో వయస్సు అనేది మన భావనలు బట్టి, ఆలోచనలు బట్టి నిర్ధారణ అవుతుంది. ‘కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు’ అని శ్రీశ్రీ రాసింది ఇలాటివారి గురించే.

ఇందులో మొదటిదానిమీద మనకు కంట్రోల్ వుండని మాట నిజమే. నిజానికి ఆ వయసును ఏమాత్రం మార్చలేము, ఏమార్చలేము.

కాకపోతే రెండోదాన్ని మానవ ప్రయత్నంతో కొంతవరకు అడ్డుకోవడానికి వీలవుతుంది. అంటే సరయిన పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మనసును ఉల్లాసంగా వుంచుకోవడం ద్వారా కొంతమేరకు వయసు ప్రభావం శరీరం మీద పడకుండా చూసుకోవచ్చు. సానుకూల వైఖరి, ఆశావహ దృక్పధం పెంపొందింపచేసుకోవడం వల్ల మూడోరకం వయస్సును అదుపుచేసుకోవడానికి కుదురుతుంది.

ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తి చిన్నప్పటినుంచి వింటున్నదే. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ సూక్తిలోని ‘భాగ్యానికి’ నిర్వచనాన్ని మార్చుకోవాల్సి వుంటుంది.

భాగ్యం అంటే సంపద కాదు. బ్యాంకుల్లో వుండే డబ్బు కాదు. కుటుంబంలో  అందరూ ఆనందంగా, సంతోషంగా వుండడం నిజమైన భాగ్యం. వయసు మళ్లి  పెద్దవాళ్ళు అవుతున్నకొద్దీ ఆలోచించుకోవాల్సింది డబ్బు గురించి కాదు. ఆరోగ్యంగా వుండేట్టు చూసుకోవడం ముఖ్యం. వెనుకటి మాదిరిగా ఉమ్మడి కుటుంబాలకు కాలం చెల్లిపోయింది. ఉద్యోగాలు, ఉపాధులు వెతుక్కుంటూ పిల్లలు దూర ప్రాంతాలకు, ప్రదేశాలకు తరలివెడుతున్న కాలమిది. రోగం రొష్టూ పేరుతొ ఎక్కడో ఉన్నవారిని  ఇబ్బందుల పాలు చేయకుండా, ఆరోగ్యాలను మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఈనాటి పెద్దతరంపై వుంది. కొద్దిపాటి క్రమశిక్షణ అలవరచుకుంటే ఇదేమంత పెద్దపని కాదు. క్రమంతప్పకుండా ఆరోగ్యపరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్య భీమా పాలసీ తీసుకోవడం, డాక్టర్ రాసిచ్చిన మందులు సక్రమంగా వేసుకోవడం  ఇలా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోగలిగితే, దూరాన ఉన్న పిల్లల్ని అనవసర శ్రమలనుంచి రక్షించినవాళ్ళవుతారు.

 

ధనమూలం ఇదం జగత్!

డబ్బుతో ఆనందాన్ని కొనడం వీలుకాదు కాని ఆనందంగా జీవించడానికి మాత్రం ఎంతోకొంత  డబ్బు కావాలి.

అందుకే పశువుకు తిన్నది దండి, మనిషికి వున్నది దండి అంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, సమాజంలో గౌరవంగా జీవించడానికి, కుటుంబ సభ్యులనుంచి ప్రేమాదరాలు పొందడానికి, ఎంతో కొంత సొంత సొమ్ము ప్రతి ఒక్కరికీ అవసరం. వయస్సు మీదపడ్డ తరువాత, శారీరకశ్రమచేసి సంపాదించడానికి వీలులేని రోజుల్ని ముందుగానే అంచనా వేసుకుని, భద్రమయిన భవిష్యత్ జీవితం కోసం తమకంటూ కొంత మొత్తాన్ని కూడబెట్టుకోవడం చాలా అవసరం. దీన్ని స్వార్ధం అని ఎవ్వరూ అనుకోరు. మీ పిల్లలు మీ అవసరాలను కనుక్కోగలిగితే, అది బోనసుగా భావించాలి. మీ అవసరాలు కనుక్కోలేని అవసరాలు వాళ్లకు వుంటే, దాన్ని పెద్దమనసుతో అర్ధం చేసుకునే పెద్దరికం మీకుండాలి. అప్పుడే ముదిమి వయస్సులో చీకూ చింతా లేని జీవితం మీ సొంతమవుతుంది.

 

హాయిగా మనసెంతో తీయగా

మనసును హాయిగా వుంచుకోవాలి. ఇతరులను హాయిగా వుంచాలి. కుర్రవాళ్లల్లో కుర్రవాళ్ళుగా మసలగలగాలి. అంటే టీ షర్టులు వేసుకోవడం, షార్టులు ధరించడం కాదు. ‘మా రోజుల్లో అయితే...’ అంటూ నస పెట్టకుండా, వాళ్లకు నచ్చేరీతిలో మీ రోజుల్లోని సంగతులను మనసుకు హత్తుకునే పద్దతిలో చెప్పడం అలవరచుకోవాలి. వేళకు నిద్రపోవడం, చక్కటి సంగీతం వినడం, మంచి పుస్తకాలు చదవడం, నిత్య జీవితంలో హాస్యాన్ని ఆస్వాదించగలగడం  ఇవన్నీ మనసుకు హాయినిచ్చి వయసును తగ్గిస్తాయి.

 

సమయం అమూల్యం

ఈ జీవనయానంలో సంపాదించింది యెంత వున్నా, పోగొట్టుకున్నది, పోగొట్టుకునేది మాత్రం అమూల్యమయిన సమయాన్నే అని గుర్తు పెట్టుకోవాలి. ఇకనుంచీ ప్రతి రోజూ కొత్తగా మళ్ళీ పుట్టామని అనుకోవాలి. నిన్న అనేది క్యాన్సిల్ చేసిన చెక్కు. రేపనేది ప్రామిసరీ నోటు. పోతే, ఈ రోజు అనేది వుంది చూసారూ అది మాత్రం చేతిలో వున్న పైకం. దాన్ని జాగ్రత్తగా ప్రయోజనకరంగా వాడుకోగలగాలి. ప్రతి క్షణాన్ని జీవించడం, ఆస్వాదించడం నేర్చుకోవాలి.

 

మార్పు శాశ్వతం

మారుతూ వున్నప్పుడు అది శాశ్వతమెలా అవుతుందన్న అనుమానాలు పెట్టుకోకూడదు. మార్పును అంగీకరించడం అంటే వరదవాలులో కొట్టుకుంటూపోవడం కాదు. మార్పు అనివార్యం. ఈ సత్యం అంగీకరించగలిగితేనే యువతరంతో, రానున్న తరంతో సంబంధాలు బాగుంటాయి. పిల్లలు చెప్పేదేమిటి అని కొట్టిపారేయకుండా ఆ చెబుతున్న దానిలో కొత్తదనాన్ని గ్రహించగలిగితే ‘ముసలి వాసనలు’ మననుంచి తప్పుకుంటాయి. కాలక్రమంలో చోటుచేసుకున్న మార్పుల ఫలితంగానే మన జీవితాలు ఇప్పుడిలా సుఖప్రదంగా గడుస్తున్నాయన్న వాస్తవాన్ని గుర్తు పెట్టుకోవాలి.

 

నాకేమిటి?

స్వార్ధంలేని మనిషంటూ వుండడు. ఏమిచేసినా దీనివల్ల ‘నాకేమిటి’ అనేవాళ్ళే ఎక్కువగా తారసపడుతుంటారు. కానీ వున్న ఈ చిన్నిజీవితంలో, అవసరంలో వున్నవాడికి సాయపడడం వల్ల కలిగే సంతృప్తికి ఏదీ సమానం కాదు. ఇచ్చుటలో వున్న హాయిని కనీసం జీవితం చరమాంకంలో కూడా అనుభవించలేకపోతే, ఇక దానికి సార్ధకత లేనట్టే. ఆ జీవితానికి అర్ధం లేనట్టే.

 

మరచిపో !మన్నించు!!

ఈ రెండుపదాలు చాలా చిన్నవే అయినా నిజానికి ఎంతో గొప్పవి. ఇతరుల తప్పిదాలు గురించి అస్తమానం ఆలోచించడం వల్ల వొరిగేదేమీ వుండదు. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపడానికి మనం గాంధీలం కాకపోవచ్చు. కానీ వయసు మీదపడుతున్న దశలో మన ఆరోగ్యం కోసం, మన ఆనందం కోసం ఈ మాత్రం సర్దుబాట్లు అవసరం. లేకపోతే పెరిగేది మన ‘బీపీ’నే.

ఇక ఆఖరుదీ అతి ముఖ్యమైనదీ ఏమిటంటే:

 

మరణ భయం

జాతస్య మరణం ధృవం. పుట్టిన ప్రతి వ్యక్తీ గిట్టక తప్పదు. ఇది తెలియని వాళ్లు వుండరు. కానీ తెలియనట్టుగా వుంటారు. రేపు పదవీ విరమణ చేసే వ్యక్తి కూడా చేస్తున్న ఉద్యోగం శాశ్వతమే అన్న భ్రమలో వుంటాడు. అలాగే మరణం తధ్యమని తెలిసీ అది తన జోలికి రాదన్న భ్రాంతిలో మనుషులు బతుకుతారు. శరీరం బలహీనపడి, అభద్రతాభావం బలపడి ఒక్కసారి మరణభయం పట్టుకున్నదంటే చాలు, ఇక ఆ మనిషి మరణానికి చేరువయినట్టే. మనం చనిపోతే భార్యా పిల్లలు తట్టుకోలేరన్న మరో అర్ధంలేని అనుమానం మనిషిని పీడిస్తుంది. కానీ సకృత్తుగా తప్ప ఇది జరిగే పని కాదు. ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి కుటుంబంలోని వారు బాధ పడడం సహజం. కానీ ఆ బాధ, ఆ ఆవేదన  శాశ్వతంగా అలాగే వారిని అంటుకుని వుండవు. కాలమే అలాటి గాయాలు మానిపోయేలా చేస్తుంది. అది ప్రకృతి ప్రసాదించిన వరం.

అందుకే మరణం గురించి ఆలోచించడం శుద్ద దండుగ.

 

జీవితాన్ని అరవైల్లో కూడా మళ్ళీ మొదలు పెట్టవచ్చు. అది మన చేతుల్లోనే వుంది.

కాబట్టి, ఈ జీవన సంధ్యాసమయంలో వయస్సు మళ్ళిన స్నేహితుల్లారా రండి. దర్జాగా వెనుకడుగు వేద్దాం పదండి. మునుపటి జీవితాన్ని మళ్ళీ ఆస్వాదిద్దాం రారండి.



(EOM)