6, మార్చి 2021, శనివారం

జీవితం నేర్పే పాఠాలు - భండారు శ్రీనివాసరావు

 ఆసక్తి వుండాలే కాని జీవితం నుంచి ప్రతిరోజూ ఓ కొత్త పాఠం నేర్చుకోవచ్చు. వయస్సు దీనికి ఎంతమాత్రం అడ్డంకి కాదు.

ఆకాశవాణి, దూరదర్శన్ లలో పనిచేసేరోజుల్లో ప్రైవేటు టీవీ చానళ్ళ చర్చాకార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలు వచ్చినా ఆసక్తి చూపలేదు. పదవీ విరమణ చేసిన అనంతరం మాత్రం గత కొద్దేళ్లుగా అనేక ఛానళ్ళు నిర్వహించే చర్చల్లో పాల్గొంటూ  ఉండేవాడిని. (వారానికి ఉదయం సాయంత్రం  కలిపి పద్నాలుగు టీవీ చర్చలు అలా  ఓ పదేళ్లకు  పైగా  జీవితం బిజీబిజీగా  గడిచిపోయింది)

వీటికోసం  ప్రతిరోజూ తెల్లవారుఝామునే లేచి తయారు కావాల్సివస్తోంది. నేనయితే మా ఆవిడ పొద్దున్నే లేచి ఇచ్చే కాఫీ తాగి వెడుతున్నాకాని, నన్ను స్టూడియోలకు తీసుకు వెళ్లడానికి వచ్చే ఛానల్ కారు డ్రైవర్ల సంగతి ఏమిటని ఆలోచించి అలా పొద్దున్నే వచ్చే డ్రైవర్లకు కొంత ‘టిప్పు’ ఇవ్వడం అలవాటు చేసుకున్నాను. ఈ డ్రైవర్లలో రకరకాల వయస్సులవాళ్ళు వుంటారు. పొరుగుజిల్లాలనుంచి హైదరాబాదు వచ్చి స్నేహితుల గదుల్లో తాత్కాలిక ఆవాసం ఏర్పరచుకుని బతుకు బండి లాగించే వాళ్ళే వీళ్ళల్లో ఎక్కువ. వాళ్లకు టిప్పు ఇవ్వడం మెహర్బానీగా నేను ఏనాడు అనుకోలేదు. వాళ్లు కూడా అపార్ధం చేసుకోలేదు. కొందరు యెందుకు సార్ ‘మా డ్యూటీ మేం చేస్తున్నాం’ అంటూ మృదువుగా అనేవారు.

కొంతకాలం క్రితం ఓ టీవీ స్టూడియో నుంచి తిరిగొస్తూ ఓ కూడలివద్ద సిగ్నల్ పడ్డప్పుడు నేను పర్సు తీసి డ్రైవర్ కు ఓ నోటు తీసి ఇచ్చాను. అతగాడు ఆ నోటు తీసుకుని జేబులో పెట్టుకోకుండా అదే చేత్తో స్టీరింగు పట్టుకుని నడుపుతూ ఒక చోట కారు వేగం తగ్గించి రోడ్డుపక్కన ఒక ముసలి బిచ్చగత్తె చేతిలో ఆ నోటు పెట్టాడు. అతని ప్రవర్తన చిత్రంగా అనిపించి నేను నోరు తెరిచేలోగా అతడు 'మాఫ్ కీజియే సాబ్’ అంటూ తన మనసులో మాట చెప్పాడు.

ఈ డ్రైవర్ ఉద్యోగం కోసం సిటీకి వస్తున్నప్పుడు మా అమ్మ ఓ మాట చెప్పింది. అవసరం అయితేనే ఎవరినుంచయినా డబ్బు తీసుకో. నీ దగ్గర డబ్బు వుంటే నీకంటే అవసరం ఎక్కువ వున్నవాళ్ళకు దాన్నివ్వు. తీసుకోవడం తేలిగ్గా అలవాటు అవుతుంది. ఇవ్వడం అనేదే కొద్దిగా కష్టం. అమ్మ మాట ప్రకారం మీరిచ్చిన డబ్బు ఆమెకు ఇచ్చాను. మీరు వేరే విధంగా అనుకోకండి’ అన్నాడు.

అనుకోవడానికి ఏముంది. ఓ కొత్త పాఠం నేర్చుకునే అవకాశం జీవితం నాకిచ్చిందనుకున్నాను.

సభకి నమస్కారం – భండారు శ్రీనివాసరావు

 

ఈ ఒక్క వాక్యం కనిపెట్టి నా కాలేజీ స్నేహితుడు, సినిమా దర్శకుడు 'జంధ్యాల', సభల్లో వృధా అవుతున్న ఎంతో విలువయిన సమయాన్ని ఆదా చేసాడు. వేదికమీద వున్న పెద్దల పేర్లను, ప్రతివక్తా ప్రస్తావిస్తూ వచ్చే ఒక ‘సుత్తి సంప్రదాయానికి జంధ్యాల ఆ విధంగా మంగళం పాడాడు.
సరే. విషయానికి వస్తాను. ఈ సభలో మాట్లాడమని నన్ను ఆహ్వానించిన క్షణం నుంచి నన్నో ప్రశ్న అదేపనిగా తొలుస్తూ వచ్చింది. ఇందుకు, నాకున్న అర్హత ఏమిటన్నది ఆ ప్రశ్న. రేడియోలో పనిచేసాడు కనుక ఏదో కొంత మాట్లాడకపోతాడా అన్న నమ్మకం కావచ్చు. అయితే రేడియో వాళ్ళతో ఓ ఇబ్బంది వుంది. వాళ్లకు అన్నీ టైం ప్రకారం జరగాలి. పదినిమిషాలు వార్తలు అంటే పిడుగులు పడ్డా ఒక్క క్షణం ఎక్కువ కాకూడదు, అలాగే పది నిమిషాలు దాటకూడదు. విషయం యెంత పెద్దదయినా క్లుప్తంగా చెప్పాలి. బ్రివిటీ ఈజ్ సోల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది రేడియోలో చెప్పే మొదటి పాఠం.
అంచేత క్లుప్తంగా మాట్లాడేవాళ్ళు ఇలాటి సభల్లో మాట్లాడడానికి పనికి రారేమో అనేది నాకు కలిగిన మరో సందేహం.
మాట్లాడ్డం అంటే గుర్తుకు వచ్చింది.
పశుపక్ష్యాదులు కూడా భావాలను పంచుకుంటాయి. కానీ మాటలతో వాటిని వ్యక్తీకరించలేవు. అయితే ఒకటినొకటి అర్ధం చేసుకుంటాయి. మాటలు రాని పాపాయి పలికే మాటలు తల్లి అర్ధం చేసుకున్నట్టుగా.
గుర్రం సకిలిస్తుంది. ఆవు అంబా అంటుంది. సింహం గర్జిస్తుంది. పాము బుస కొడుతుంది. అయితే ఈ చరాచర సృష్టి మొత్తంలో మాట్లాడగలిగే శక్తి ఒక్క మనిషికే దక్కింది.
అంటే ఏమిటన్నమాట. మాట్లాడే ప్రతిమాటా ఆచితూచి మాట్లాడాలి. ఆదీ మంచి మాట అయివుండాలి. మంచికోసమే మాట్లాడాలి. ఇతరులని నొప్పించడం కోసం కాకుండా సాధ్యమైనంతవరకు వారిని మెప్పించడం కోసం లేదా ఒప్పించడం కోసం మాట్లాడాలి. మంచిని చూసి, మంచిని విని, మంచినే మాట్లాడ్డం వల్ల మనలో పాజిటివ్ వేవ్స్ ప్రసరిస్తాయి. శరీరం మనస్సూ రెండూ తగిన శక్తిని సమకూర్చుకుంటాయి.
విద్యార్ధి దశలో ఇవన్నీ మీకు ప్రతిరోజూ అనుభవంలోకి వచ్చే విషయాలే. మంచి ఉపాధ్యాయులు, మంచి స్నేహితులు, మంచి వాతావరణం ఇంతకంటే మనిషీ, మనసూ ఎదగడానికి ఏం కావాలి చెప్పండి. ఉపాధ్యాయులు చెప్పే మంచి వినండి. స్నేహితులతో మంచి పంచుకోండి. మంచిగా మెలగండి. అప్పుడు  మంచిగా ఉండడానికీ, లేకపోవడానికీ వుండే తేడా ఏమిటో మీ మనసుకే తెలుస్తుంది. అంతేకాదు, అలా రోజల్లా పంచుకుని, పెంచుకున్న మంచిని ఇంటికి కూడా తీసుకువెళ్ళండి. ఇంట్లో కూడా అమ్మానాన్నతో, అక్కాచెల్లెళ్ళతో, అన్నాతమ్ములతో, ఇరుగూ పొరుగుతో మంచిగా ఉన్నారనుకోండి. ఇక పండగే పండగ. చెడు అన్నది దరి చేరనీయకుండా మంచినే పెంచుతూ పొతే ఇక ఆ సమాజానికి అంతా మంచే జరుగుతుంది. ఇందులో ఇంత మంచి  విషయం వుంది కాబట్టే నాకిచ్చిన ఈ సమయాన్ని ఇందుకోసం వాడుకుంటున్నాను.
షరామామూలుగా యేవో కొన్ని అనుభవాలు, యేవో కొన్నిఉద్బోధలు చెప్పి, చేసి నేను వెళ్లిపోవచ్చు. మాది గుంకే వయసు, మీది పొడిచే పొద్దు. మీరే సమాజానికి కావాల్సిన వాళ్ళు. మీ అవసరం సమాజానికి వుంది. నేను మాట్లాడుతోంది భావి పౌరులతోటి అన్న స్పృహతో మాట్లాడుతున్నాను. ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే వుంది. మీ చేతుల్లో మాత్రమే అది భద్రంగా వుంటుంది. సరయిన పౌర సమాజం మీవల్లనే రూపు దిద్దుకుంటుంది. అలా జరిగిన నాడు ఇక భవిష్యత్తు గురించి మాకెవ్వరికీ బెంగ అక్కరలేదు.
చదువుకునే మీరందరూ దీపాల్లాంటి వారు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తూ పొతే, ఇన్ని కోట్ల దీపాలున్న మన దేశం వెదజల్లే వెలుగులు ఎల్లల్ని దాటి, సమస్త ప్రపంచానికి విజ్ఞాన కాంతుల్ని ప్రసరింపచేస్తాయి. యావత్ లోకం ఓ విజ్ఞానఖనిగా తయారవుతుంది.
మరో మాట. నా పిల్లల చిన్నతనంలో, మా ఇంటికి దగ్గరలో వున్న అరోరా కాలేజీలో చదివించాలని అనుకున్నాను. కానీ ఆ ఆశ అప్పుడు తీరలేదు. అందుకే ఈనాడు మిమ్మల్ని అందర్నీ చూస్తుంటే నా కడుపు నిండినంత ఆనందంగా వుంది.
మంచి కాలేజీలో చేరారు. ఆరోరా విద్యార్ధిని అని గొప్పగా చెప్పుకునేలా మీ ప్రవర్తన వుండాలి. అంతే కాదు, పలానా విద్యార్ధి మా కాలేజీలో చదివాడు సుమా అని యాజమాన్యం కూడా చెప్పుకోగలిగితే ఇరువురూ ధన్యులే.
ఈ ధన్యత అరోరా కాలేజీ ఇప్పటికే సంపాదించుకుని ఉంటుందని నా నమ్మకం.
నా మాటలు ఓపిగ్గా విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు.
సభకి మరోమారు నమస్కారం.

 

(శనివారం ఇల్లు సర్దుతుంటే దొరికిన, ఎప్పుడో ఆరేళ్ల నాడు రాసుకున్న వ్యాసాన్ని  మా కోడలు తెచ్చి ఇచ్చింది. హైదరాబాదు ఆర్టీసీ కళ్యాణ మంటపం మందిరంలో అరోరా పీజీ కళాశాల వార్షికోత్సవంలో ఒక అతిధిగా నేను చేసిన ప్రసంగపాఠం ఇది)

తెలుగు పాత్రికేయ దిగ్గజం పొత్తూరి – భండారు శ్రీనివాసరావు

 

(5th March -  పొత్తూరి వారి వర్ధంతి ఆంధ్రప్రభ  దినపత్రికలో ప్రచురణ)

ఒక పత్రిక ఎడిటర్ అనేవాడు ఎలావుంటాడు? ఎలా వుండాలి?’ అని కళ్ళుమూసుకుని ప్రశాంతంగా ఆలోచిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరిచినప్పుడు కనబడే రూపమే శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు నేనూ కలిసి ఒకసారి పొత్తూరి వారి ఇంటికి వెళ్లాం. వారు రాసిన ‘బులేనా’ పుస్తకం సంతకం చేసి ఇచ్చారు. ‘ఎలా వున్నారు, ఆరోగ్యం ఇప్పుడు కులాసా కదా’ అని మేము అడగడం తప్పిస్తే ఆయన అంతట ఆయన తన అనారోగ్యం గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. ఎంతో ఖరీదయిన వైద్యం. మామూలు మందులు కాక అదనంగా మూడు వారాలపాటు రోజుకొక కాప్స్యూల్ వేసుకోవాలి. ఒక్కొక్కటి అక్షరాలా వెయ్యి రూపాయలు. సాదా సీదా అట్టపెట్టెలోవున్న ఆ మాత్రల బాటిల్ ఇరవై వేల రూపాయలు అంటే నమ్మ బుద్దికాలేదు, కానీ కళ్ళెదుట కనబడుతున్న వాస్తవం అది.

వున్న ఆ కొద్ది సమయంలోనే ఆయన ఎన్నో కబుర్లు చెప్పారు. ప్రత్యేకతెలంగాణా ఉద్యమం కొన్ని దశాబ్దాల క్రితం సికిందరాబాదులోని ఒక హోటల్లో ఎలా ఊపిరి పోసుకున్నదో చెబుతూ ఆనాటి విశేషాలు వివరించారు.

ఇంట్లో పెంచుకుంటున్న ఈశ్వర నామం కలిగిన ఒక మొక్కను చూపించారు. పచ్చటి వర్ణం కలిగిన ఆకులు. వాటి మీద కపిల వర్ణంలో ‘నాగుపాము పడగ’ మీద వుండే కృష్ణ పాద ముద్రలు. ఆ మొక్క చాలా అరుదుగా దొరుకుతుందట. ఆ మొక్క వుంటే పాములు ఆ దరికి కూడా రావట. ఆయుర్వేద వైద్యులు మాత్రమే ఈ మొక్కను గుర్తించగలరట. ప్రాచీన ఔషధీ శాస్త్రంలో ఇటువంటివి ఎన్నో వున్నాయని చెప్పారు.

నిజం కావచ్చు. నిజం కాదని నమ్మే వాళ్ళూ వుంటారు.

నమ్మేవారు మొక్కితే రాయే సాయి, నమ్మనివారు తొక్కితే అదే రాయి.

అదలా ఉంచి వెంకటేశ్వరరావు గారు స్వయంగా చెప్పిన కొన్ని విశేషాలు నెమరు వేసుకుందాం.

ఈనాటి పత్రికారంగం వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలు వాటిల్లో వున్నాయి.

పత్రిక యజమానికి తన పత్రిక గురించి ఆరా తీసే అధికారం ఉంటుందా?

ఇప్పటి రోజుల్లో అయితే ఇదొక ప్రశ్నే కాదు. ఆరా తీయడమేమిటి, వార్తలను అదుపు చేసే అధికారం కూడా వుంటుంది.

అయితే దాన్ని గురించి ఒక పాత విషయం చెప్పారు. కొంచెం అటూ ఇటూగా మూడు దశాబ్దాల నాటి సంగతి.

అప్పటి ఆంద్రప్రభ దినపత్రికకు పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఎడిటర్.

విజయవాడలో రంగా హత్య దరిమిలా జరిగిన విధ్వంస కాండపై, రామోజీరావు గారు చైర్మన్ గా ఉన్న ఎడిటర్స్ గిల్డ్ ఒక నిజనిర్ధారణ కమిటీ వేసింది. కుల్ దీప్ నాయర్, చెన్నై ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ జగన్నాధన్ తో పాటు ఆంధ్రప్రభ ఎడిటర్ హోదాలో పొత్తూరి వెంకటేశ్వర రావు గారు కూడా అందులో ఒక సభ్యులు. పొత్తూరివారు విడిగా బెజవాడ వెళ్లి పరిస్తితులను పరిశీలించి ఒక నివేదిక పంపారు. అది ఎలా చేరిందో ఇండియన్ ఎక్స్ ప్రెస్ అధినేత రామనాద్ గోయంకాకు చేరింది. అది ఆయనకు రుచించినట్టు లేదు. వెంటనే వెంకటేశ్వర రావు గారికి ఒక లేఖ పంపారు. ‘మీ నివేదిక నాకు దిగ్భ్రాంతితో కూడిన నిరుత్సాహాన్ని కలిగించింది’ అన్నది దాని సారాంశం. గోయంకా యజమాని. పొత్తూరి వారు ఆయన దగ్గర ఒక ఉద్యోగి. అయినా అలా ఉత్తరం రాయడం ఆయనకు నచ్చలేదు. వెంటనే నిరసనగా రాజీనామా లేఖ గోయంకాకు పంపించారు.

గోయంకా నుంచి పిలుపు వచ్చింది, మద్రాసు వస్తున్నాను అక్కడికి రమ్మని. పొత్తూరిగారు వెళ్ళారు.

నా ఎడిటర్ అభిప్రాయంతో విబేధించే స్వేచ్చ నాకు లేదా?” అని సూటిగా అడిగారు, రాజీనామా విషయం ప్రస్తావించకుండా గోయంకా.

ఇంకా ఇలా అన్నారు.

మన పత్రికలో పాఠకుల ఉత్తరాలు ప్రచురిస్తాము కదా. పత్రిక విధానాలతో విబేధించే ఉత్తరాలు కూడా వేస్తుంటాం. యజమానిగా ఒక విషయం మీ దృష్టికి తెచ్చాను. అది మీకు నచ్చలేదు. సరే! ఒక సాధారణ పాఠకుడికి వుండే ఈ వెసులుబాటు కూడా ఒక యజమానిగా నాకు లేదా చెప్పండి”

ఇలాంటి యజమానికి ఏ సంపాదకుడు అయినా ఏం జవాబు చెబుతారు.

అందుకే గుంభనగా వుండిపోయారు. రాజీనామా విషయం పట్టుబట్టలేదు.

గోయంకానే స్వయంగా రాజీనామా లేఖ పొత్తూరి వారి చేతిలో పెట్టి సాదరంగా సాగనంపుతూ అన్నారు.

మీరు ఎడిటర్ గా ఉన్నంత కాలం మీరు మీ అభిప్రాయాలనే రాస్తూ వుండండి”

పొత్తూరివారి ఆరోగ్యం బాగాలేదని జ్వాలా ద్వారా తెలుసుకున్న తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖరరావు స్వయంగా పొత్తూరి వారిని చూడడానికి విజయనగర్ కాలనీలోని వారి ఇంటికి వెళ్ళారు. అక్కడి పరిస్తితిని ఓ కంట గమనించిన కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. వారికి పూర్తి స్వస్థత చేకూరేవరకు ఆ బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు అయినప్పటికీ, సుదీర్ఘ కాలం ప్రాంతీయ ఉద్యమాన్ని నడిపిన నేత అయినప్పటికీ ప్రాంతీయతత్వం ఏ కోశానా లేని కేసీఆర్, పొత్తూరి వారిని ఒక పాత్రికేయుడుగా గుర్తించారు కాని, అయన ఏప్రాంతం వారనే వివక్ష చూపలేదు. ఆయనలోని ఈ విలక్షణత్వం పొత్తూరివారికి కూడా తెలుసు. కానీ మొదటే చెప్పినట్టు విలువలకు కట్టుబడి జీవిస్తూ వచ్చిన పాత్రికేయుడాయన. అంచేత కేసీఆర్ సాదరంగా ఇవ్వచూపిన సాయాన్ని వారు సున్నితంగా తిరస్కరించారు. అయితే వారిరువురి నడుమ సాగిన సంభాషణలో పొత్తూరి వారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.

రెండో ప్రపంచయుద్ధంలో నాయకత్వం వహించిన నాటి బ్రిటన్ ప్రధానమంత్రి విన్ స్టన్ చర్చిల్ ఆ తరువాత జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో ఆట్లీ చేతిలో ఓడిపోయారు. కానీ సుదీర్ఘకాలం ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి సారధ్యం వహించిన కేసీఆర్, తెలంగాణా రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలలోనే విజయబావుటా ఎగురవేసి తన నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు”

తెలుగు పత్రికా రంగంలో తరాల నడుమ నడుమ వారధిలా ఉంటూ వచ్చిన పొత్తూరివారి మరణం పాత్రికేయ లోకానికి ఎన్నటికీ తీరని లోటే. (EOM)




6th  March 2020

5, మార్చి 2021, శుక్రవారం

రాయని డైరీలో చినిగిన పేజీలు - భండారు శ్రీనివాసరావు

  

జీవించడానికే జీవితం కాదు, నేర్చుకోవడానికి కూడా ఉపకరిస్తుంది. బతుకు బాటలో కనిపించే దృశ్యాల నుంచి కనిపించని వాస్తవాలను చూడగలిగితే, మనిషి జీవితానికి ఒక సార్ధకత లభిస్తుంది. 

పండక్కి పుట్టింటికి వచ్చినట్టుగా  పది పదిహేనేళ్ళకోమారు ......మా ఆవిడకు తప్పని ఆసుపత్రి సందర్శన. పుట్టుకతో గుండెలో ఏర్పడ్డ లోపాన్ని సరిచేయడానికి 1989 లో  ఓ మారు, మళ్ళీ ఇన్నేళ్ళకు మరోమారు గుండె ఆపరేషన్. 

‘నీ గుండె గట్టిదమ్మా! ఇన్నేళ్ళు  తట్టుకుంది’ అన్నారు  డాక్టర్ వెంకటరామ రెడ్డి ఒకసారి మా ఆవిడను చూసి. ఆయనే మొదటి ఆపరేషన్ చేసి పుణ్యం కట్టుకున్న వైద్యులు. అప్పుడు ఇన్ని సౌకర్యాలు లేవు. పదిగంటలు పట్టింది. ఆసుపత్రిలో మూడు వారాలు ఉన్నాము. ఇప్పుడు అలా కాదు, ఐదో రోజున ఇంటికి వెళ్ళవచ్చంటున్నారు డాక్టర్  గోపీచంద్.  

ముక్కుచెవులకు అన్నింటికీ ఏడువారాల నగలు పెట్టుకున్నట్టు వొళ్ళంతా ఏవిటేవిటో ఆక్సిజన్ మాస్కులూ, ఈసీజీ వైర్లూ. నిశ్శబ్దాన్ని మరింత భయంకరం చేస్తూ లైఫ్ సేవింగ్ యూనిట్ల చప్పుళ్ళూ. క్షణం పాటు కూడా రెండు కాళ్లు ఒక చోట పెట్టకుండా అటూ ఇటూ తిరుగుతుండే మనిషి నిస్తాణగా ఆస్పత్రి మంచం మీద. చూడలేక, చూడకుండా వుండలేక అదో రకమైన అర్ధం కాని అర్ధం లేని మానసిక స్తితి. లోకంలోని జబ్బు మనుషులందరూ ఒక్క చోట చేరినట్టు వున్న ఐసీయూ నుంచి బయట పడి....

ఆ కార్పొరేట్ ఆసుపత్రి వెయిటింగు రూములో కూర్చున్న అందరి వదనాల్లో ఏదో తెలియని ఆందోళన. ఆత్మీయుల ఆరోగ్యం గురించిన మాటలు వినీ వినపడకుండా. ఎవడయినా సూపర్ మాన్ దుడ్డుకర్ర పట్టుకుని ఈ లోకం నుంచి రోగాలను అన్నింటినీ తరిమి కొడితే ఎంత బాగుంటుందో...

రోగాలు, రోష్టులు తెలియని ఓ చిన్న పాపఅక్కడే ఆడుకుంటోంది. తెలియని అందరి దగ్గరి దగ్గరకు వచ్చి తెలిసిన ఆరిందాలా పలకరిస్తోంది. ఆ పాపాయి నవ్వుతో మనసు కొద్దిగా తేరుకుంటోంది.

ఎవరో నలుగురు వచ్చారు. ఇద్దరు మగా మరో ఇద్దరు ఆడవాళ్ళు. వేసుకున్న దుస్తుల్ని పట్టి చూస్తే అంతా మగవాళ్ళు మాదిరిగా వున్నారు. గలగలా కాకపోయినా కాస్త పెద్దగానే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ రాకతో కొద్దిగా ఎబ్బెట్టుగా మారినట్టయింది అక్కడి వాతావరణం.

ఒకమ్మాయి అడుగుతోంది ఇంగ్లీష్ లో, కాఫీ కావాలా, టీ కావాలా అని. వారేమన్నారో తెలియదు. వారిలో ఫేషన్ గా జుట్టు వెనక్కి దువ్వి ముడి వేసుకున్న ఓ యువకుడు లేచాడు, కాఫీ కౌంటర్ వైపు కదిలాడు. అప్పుడు కనిపించింది. అతడికో కాలు లేదు. ఆ స్థానంలో యంత్రం సాయంతో కదిలించగల స్టీల్ రాడ్. ఒక లిప్త పాటు మనసు అదోలా అయింది. కాలు లేకపోయినా అంత మామూలుగా ఎలా వుండగలుగుతున్నాడు ? కాళ్ళూ చేతులూ వున్న ఓ మామూలు మనిషి లాగానే తోటివారికి కాఫీ తేవడానికి ఎలా లేచాడు ? వెంట వచ్చిన వాళ్ళలో కూడా అతడో అవిటిమనిషి అన్న భావం ఏమాత్రం కానరాలేదు. కాలు లేకపోయినా కాఫీ తెస్తాను అని లేస్తే, అదో సాధారణ విషయం అయినట్టు కిమ్మనలేదు, ‘నువ్వేం తెస్తావు, కూర్చో’ అంటూ లేనిపోని సానుభూతి ఒలకపోయ్యలేదు.

మనిషితో పాటే అవస్థలు పుడతాయి. వాటిని చూసి బెదిరి పోవడం కంటే వాటితో సహజీవనం చెయ్యగలిగితే.....

అర్ధం చేసుకోవాలే కాని, ఆసుపత్రులు కూడా బోధి వృక్షాలే!



4, మార్చి 2021, గురువారం

Senior Journalist Bhandaru Srinivasa Rao about Prashant Kishor | YS Shar...

గౌరవం హోదాకే ప్రతిభకు కాదు

 

చిన్నప్పుడు స్కూళ్ళల్లో మోరల్ క్లాస్ అని ఓ పీరియడ్ వుండేది. వారానికి ఒకటో రెండో తరగతులు.
నీతి కధలు, నీతి పాఠాలు బోధించేవాళ్లు.
ఆ రోజుల్లో విన్న కధ ఒకటి జ్ఞాపకం వుంది. ఓ పేద బ్రాహ్మణుడు. వేదవేదాంగాలు చదివాడు. తగిన గుర్తింపు లేకపోగా మాసిపోయిన దుస్తులతో ఉన్న అతడ్ని ఎవరూ పట్టించుకునే వారు కాదు.
పొరుగూళ్ళో పండిత సత్కారం జరుగుతోందని తెలిసి వెడతాడు. మాసిన దుస్తులతో ఉన్న అతడ్ని లోపలకు పోకుండా అడ్డుకుంటారు.
ఇలా పని కాదనుకుని తెలిసిన వారి ఇంటి నుంచి కొత్త బట్టలు అడిగి తీసుకుని వాటిని ధరించి వెడితే అతడికి ప్రవేశం సులభంగా దొరుకుతుంది. అతడి పాండిత్యానికి అక్కడివారు ముగ్ధులు అవుతారు. భోజనాలు చేసేటప్పుడు అడిగి అడిగి మరీ లడ్డూలు వగైరా వడ్డిస్తుంటారు. అతడు వాటిని చేతిలోకి తీసుకుని తను ధరించిన వస్త్రాలకు తినిపించే ప్రయత్నం చేస్తుంటాడు. అక్కడి వాళ్లకి అతడి ప్రవర్తన విచిత్రంగా అనిపించి అతడినే కారణం అడుగుతారు.
“మీరు నాకిచ్చిన గౌరవం నా పాండిత్యానికి కాదు, నేను ధరించిన ఈ దుస్తులకి. కాబట్టి వాటికి తినిపించే ప్రయత్నం చేస్తున్నాను” అని బదులిస్తాడు. దానితో అందరికీ కళ్ళు తెరిపిళ్ళు పడతాయి.
స్థూలంగా ఇదీ కధ.
నిన్న కోవిడ్ టీకా వేయించుకోవడానికి కారులో వెడుతున్నప్పుడు మా అన్నయ్య భండారు రామచంద్రరావు గారు చెప్పిన కొన్ని విషయాలు విన్నప్పుడు, చిన్నప్పుడు విన్న ఈ నీతి కధ గుర్తుకు వచ్చింది.
మా అన్నయ్య చెన్నై లో స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నప్పుడు ఆయనకంటే ముందు అదే హోదాలో అదే బ్యాంకులో పనిచేసిన అధికారి ఒకరు రిటైర్ అయిన తర్వాత చెన్నై వచ్చి, చూసిపోదామని మా అన్నయ్య ఇంటికి వచ్చారట. బ్యాంకు టైం కావడంతో ఆ రిటైర్డ్ అధికారిని కూడా వెంటబెట్టుకుని ఆఫీసుకు తీసుకు వెళ్ళారు. సీజీఎం వస్తున్నారు అని తెలియగానే అక్కడ సెక్యూరిటీ అలర్ట్ అయి లిఫ్ట్ ఆపి, ఆయన్ని రిసీవ్ చేసుకోవడం కోసం కొందరు సిబ్బంది వెయిట్ చేస్తూ వుండడం ఆనవాయితీ. లిఫ్ట్ లో వెడుతున్నప్పుడు తన వెంట వచ్చిన రిటైర్డ్ అధికారిని ఎవరూ గుర్తించక పోవడం మా అన్నగారికి విచిత్రంగాను, బాధగాను అనిపించింది. కొన్నేళ్ళ క్రితం ఇదే ఉద్యోగం ఆయన చేశారు. తనకు జరిగిన మర్యాదలే ఆ రోజుల్లో ఆయనకు జరిగివుంటాయి. ఇప్పుడు ఆయన పదవిలో లేరు. పదవినిబట్టి, హోదాను బట్టి అందుకునే మర్యాదలు చాలా తాత్కాలికం అని మా అన్నగారికి అనిపించిందట.
నిజమే అనిపించింది. (04-03-2021)

కోవిడ్ టీకా తీసుకోవాలంటే ..


1. www.cowin.gov.in లో పేరు నమోదు చేసుకోవచ్చు.
2. కొవిన్‌వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత అందులో Register Yourself అనే బటన్‌ ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేసి మొబైల్‌ నంబరు రాస్తే మన ఫోన్‌కు ఒక ఓటీపీ వస్తుంది.
3. ఆ ఓటీపీని ఎంటర్‌ చేస్తే రిజిస్ట్రేషన్‌ పేజీకి వెళ్తుంది. అక్కడ మీ పేరు, వయసు, పుట్టినతేదీ వంటి వివరాలు ఎంటర్‌ చేయాలి. దీంతో పాటు ఏదో ఒక ధ్రువీకరణ పత్రం (డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, ఓటరు కార్డు, ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు తదితర)ఎంచుకుని దాన్ని అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.
4. ఆ తర్వాత మీకు దీర్ఘకాల వ్యాధులు ఉన్నాయో లేదో అని అడుగుంది. 45 నుంచి 60ఏళ్ల లోపు వారైతే వ్యాధిని నిర్ధారించే డాక్టర్‌ సర్టిఫికేట్‌ను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.
5. ఇలా అన్ని వివరాలు నింపిన తర్వాత రిజిస్టర్‌ బటన్‌పైన క్లిక్‌ చేయాలి.
6. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత మీ అకౌంట్‌ వివరాలను చూపిస్తుంది. ఆ తర్వాత కుటుంబసభ్యుల వివరాలు కూడా యాడ్‌ చేసుకోవచ్చు.
7. ఒక వ్యక్తి ఒక మొబైల్‌ నంబరు మీద గరిష్ఠంగా ముగ్గురు వ్యక్తులను యాడ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ‘యాడ్‌ మోర్‌’ బటన్‌ను క్లిక్‌ చేయాలి.
8. ఆ తర్వాత టీకా కోసం అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకోవాలి. ‘Schedule appointment’ అని బటన్‌ క్లిక్‌ చేస్తే అపాయింట్‌మెంట్‌ పేజీకి వెళ్తుంది. అక్కడ మన రాష్ట్రం, జిల్లా, పిన్‌కోడ్‌ ఎంటర్‌ చేసి మనకు సమీపంలోని టీకా పంపిణీ కేంద్రాలను తెలుసుకోవచ్చు. ఆ జాబితా నుంచి ఒక కేంద్రాన్ని ఎంచుకుంటే అందుబాటులో ఉన్న స్లాట్స్‌ చూపిస్తుంది. వాటిలో నుంచి సమయం, తేదీని ఎంచుకుని కింద ఉండే Book బటన్‌ను క్లిక్‌ చేస్తే అపాయింట్‌మెంట్‌ లభిస్తుంది.
9. అవసరమైతే టీకా తేదీ, సమయాన్ని మార్చుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే, దీన్ని అపాయింట్‌మెంట్‌ తీసుకున్న తేదీ కంటే ముందే మార్చుకోవాలి. సిటిజన్‌ రిజిస్ట్రేషన్‌లో లాగిన్‌ అయితే రీషెడ్యూల్‌ ఆప్షన్‌ కన్పిస్తుంది.
మరిన్ని వివరాలు..
* టీకా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వ్యాక్సిన్‌ ఇస్తారు.
* తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాలి. మొదటి డోసు తీసుకున్నప్పుడే రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలో తెలుస్తుంది.
* రెండో డోసు తీసుకోవడం ద్వారా కొవిడ్‌ టీకా పొందినట్లుగా ధ్రువపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
* టీకా పొందేప్పుడు నమోదు సమయంలో అప్‌లోడ్‌ చేసిన సంబంధిత ధ్రువపత్రాల ఒరిజినల్స్‌ను వెంట తీసుకెళ్లాలి.