6, ఫిబ్రవరి 2021, శనివారం

ఇంగువ కట్టిన గుడ్డ – భండారు శ్రీనివాసరావు

 

ఇంగువ కట్టిన గుడ్డకు ఎన్ని రోజులైనా ఆ వాసన దాన్ని అంటిపెట్టుకుని ఉంటుందంటారు. అది అనుభవంలోకి వచ్చింది.

హైదరాబాదులో రోడ్డు దాటటడం అంటే వైతరణి దాటినట్టే. ఉదయం బ్లడ్ టెస్ట్ కి వెళ్లి తిరిగివస్తూ, రోడ్డు దాటడం ఎల్లా అనే సమస్యతో అటూ ఇటూ చూస్తుంటే ఒకాయన నా చేయిపట్టి దాటించాడు. థాంక్స్ చెప్పబోతుంటే ఆయనే కల్పించుకుని ‘ఈ మధ్య మీరు టీవీ చర్చల్లో రావడం లేదేమిట’ని అడిగాడు. దాదాపు  ఏడాది పైమాటే, 2019 ఆగస్టులో  మా ఆవిడ మరణం తదాదిగా నేను  టీవీ చర్చలకు వెళ్ళడం పూర్తిగా తగ్గించాను. ఆ సంగతి ఈయన గారు ఎలా గమనించారబ్బా అనుకుంటుంటే ఆయనే చెప్పారు.

ఆయన పేరు విశ్వనాధ రెడ్డి. ఊరు చిత్తూరు జిల్లా పీలేరు. అమ్మాయి అల్లుడు హైదరాబాదులో కాపురం. వారిని చూడడానికి వచ్చారట.

రోజూ అన్ని టీవీ చర్చలు చూస్తూ వుంటాను. అందరూ అరుస్తూ మాట్లాడుతుంటుంటే మీరు మాత్రం అలా మౌనంగా వుండిపోతారు. అడిగితె కాని జవాబు చెప్పరు. మొదట్లో ఎలాగో అనిపించేది. ఈయనేమి విశ్లేషకుడని. కానీ తర్వాత తర్వాత అర్ధం అయింది. అలా కల్పించుకోకపోవడమే మీ ప్రత్యేకత అని”

చర్చల్లోనే కాదు ఇక్కడ కూడా నాకు మౌనమే శరణ్యం. ఏం చెప్పను?

ఆ విధంగా మీకు అభిమానిని అయ్యాను” అన్నారాయన.

పొద్దున్నే దొరికిన పెద్ద కాంప్లిమెంట్ అనుకోవాలి.

వాదనకు, వాదులాటకు తేడా తెలిసిన వాడే నిజమైన విశ్లేషకుడు అని ఎప్పుడో రాసుకున్న వాక్యం గుర్తుకు వచ్చింది.

 

 

 

4, ఫిబ్రవరి 2021, గురువారం

గల్లీ వార్తలు – భండారు శ్రీనివాసరావు

 ఏదో పాత సినిమాలో డైలాగు- ‘Long long ago, so long ago, nobody can say how long ago’ మాదిరిగా ఇది కూడా చాలా చాలా పాత జ్ఞాపకం. సుమారు మూడున్నర దశాబ్దాల కిందటి సంగతి.

విలేకరులందరికీ బాగా తెలిసిన ఓ మంత్రి గారు వుండేవారు. తెలుగుదేశం అధికారానికి రావడంతో ఆయన మాజీ అయ్యారు. కానీ రాష్ట్రంలో  ఏ ఊరు వెళ్ళినా పేరు పెట్టి పలకరించేటంత చనువు కలిగిన పత్రికా మితృలు అనేకమంది ఆయనకి వుండేవారు.

రేడియోకి అన్నిచోట్లా విలేకరులు వుండరు. అంచేత ఆ మాజీ మంత్రిగారు ఏ ఊరు వెళ్లి ప్రెస్ మీట్ పెట్టినా, అది పూర్తి కాగానే హైదరాబాదులో రేడియోకి ఫోను చేసి స్వయంగా వార్త చెప్పేవారు.

‘నిన్న గుడివాడలో ఇదే పాయింటు చెప్పారు, మళ్ళీ గూడెంలో మాట్లాడుతూ అదే పాయింటు వార్తల్లో చెబితే బాగుండదు, కాస్త మార్చి వేరే పాయింటు చెప్పండి అనేవాడిని ఆయనతో వున్న చనువుతో.

‘వూరి ఊరుకీ పాయింటు ఏం మారుతుంది శ్రీనివాసరావ్. అసలీ పాయింటు చెప్పడానికే కదా ఇలా ఊరూరూ తిరుగుతోంది. ఈ పేపర్లతో పెద్ద చిక్కు వచ్చి పడింది. గల్లీ గల్లీకి ఓ ఎడిషన్ అంటారు. ఒక ఊళ్లోనే ఒక పేటలో వార్త మరో వాడలో కనబడదు. అందుకే ఇలా ఊళ్ళు పట్టుకుని తిరుగుతూ అదే పాయింటు అన్ని చోట్లా చెబుతున్నాను. అసలే మాజీలం. వేస్తారో వేయరో కూడా తెలియదు అంటూ ఆయన తన గోడు చెప్పుకున్నారు.

పాత కధ అన్నాను అందుకే. ఆ రోజుల్లో ఉదయం, మధ్యాన్నం, సాయంత్రం వార్తలు ఒక్క రేడియోలోనే వచ్చేవి. దూరదర్సన్ వుండేది కానీ  సాయంత్రం ఒక్కటే బులెటిన్. అది తప్పిపోతే మళ్ళీ మర్నాడు సాయంత్రమే. ఇక ఇప్పట్లా అప్పట్లో ఇన్ని రకాల ఇరవై  నాలుగ్గంటల టీవీ ఛానల్స్ లేవు. పత్రికలు కూడా మర్నాడు కానీ రావు. అంచేత ఆ రోజుల్లో రేడియో వార్తలకి మంచి గిరాకీ వుండేది. అదన్న మాట.  

1, ఫిబ్రవరి 2021, సోమవారం

ఎవరు ముందు ? ఎవరు వెనుక? –ప్రొటోకాల్ పేచీలు

 

ఈ ఇంగ్లీషు  వాడున్నాడే ఎంతయినా  గొప్పవాడు. పంతాలు, పట్టింపులు, అహంభావం, నేనే గొప్ప అనే రకరకాల భావనలను  అన్నీ కలిపి ఎంచక్కా ఈగో అనే ఒక్క చిన్న మూడక్షరాల పదంలో గుదిగుచ్చాడు.

ఈ మధ్య ఏ పేపరు తిరగేసినా అధికారులు, అనధికారులు, నాయకులు మంత్రులు, ముఖ్యమంత్రులు, చివరాఖరికి రాజ్యాంగ పదవుల్లో వున్నవాళ్ళు అందరూ ఈ ఈగో అనే విషవలయంలో చిక్కుకుని సంచలన వార్తలకు కేంద్ర బిందువులు అవుతున్నారు.

నిజానికి ఇవన్నీ కొత్తవేమీ కాదు. కాకపోతే గతంలో కంటే మీడియా విస్తృతి ఈనాడు ఎక్కువ కనుక వీటికి మరింత ఎక్కువ ప్రాచుర్యం లభిస్తోంది.

మచ్చుకు ఓ ఉదాహరణ చెప్పుకుందాం.

అప్పుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. మోహన్ కందా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. స్వర్ణజిత్ సేన్ పోలీసు డైరెక్టర్ జనరల్. దినేష్ రెడ్డి హైదరాబాదు నగర పోలీసు కమిషనర్.

ఆరోజుల్లో ఒకసారి రాష్ట్రపతి ఏ.పీ.జే. అబ్దుల్ కలాం హైదరాబాదు వచ్చారు. బేగం పేట విమానాశ్రయంలో  స్వాగతం. ఏర్పాట్లు అన్నీ జరిగాయి. రాష్ట్రపతికి స్వాగతం చెప్పడానికి అందరూ వరసగా నిలబడ్డారు. పోలీసు కమిషనర్ దినేష్ రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం కొంత వెనుక నిలబడాల్సి వచ్చింది. అది ఆయనకి  నచ్చలేదు. వరుస తప్పించి ముందుకు వెళ్లి డీజీపీ పక్కన నిలబడ్డారు.

సరే ఆ కార్యక్రమం ముగిసింది. కానీ దినేష్ రెడ్డి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రోటోకాల్  విషయంలో తనకు జరిగిన లోపాన్ని ఎత్తి చూపుతూ చీఫ్ సెక్రెటరీకి ఓ ఉత్తరం రాశారు.

“సీనియారిటీ రీత్యా నాకంటే జూనియర్ అయిన ఓ ఐ.ఏ.ఎస్. అధికారి (సీ.ఆర్. బిస్వాల్, ప్రిన్సిపాల్ సెక్రెటరి పొలిటికల్) వెనక నేను నిలబడడం కుదరదు. నగర పోలీసు కమిషనర్ గా నేను ఆయనకంటే ముందు వుండాలి” అంటూ ఆయన తన మనసులో మాట బయట పెట్టారు.

దీనికి జవాబుగా ఆయనకు చీఫ్ సెక్రెటరి నుంచి మెమో వచ్చింది. “రాష్ట్రపతి స్వాగత కార్యక్రమంలో మీరు  ప్రిన్సిపల్ సెక్రెటరి పొలిటికల్ ని దాటుకుని వెళ్లి డీజీపీ పక్కన నిలబడ్డారు. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన కిందికి వస్తుంది’ అనేది ఆ మెమో తాత్పర్యం.

ఈ మెమో ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారం ఇచ్చింది అని తెలియక దినేష్ రెడ్డి చీఫ్ సెక్రెటరీకి మరో ఘాటయిన లేఖ రాశారు, “నాకు మెమో ఇవ్వడానికి మీకెంత ధైర్యం? హైదరాబాదు నగర పోలీసు కమిషనర్ గా నా స్థాయి (హోదా) చీఫ్ సెక్రెటరీకి సమానం అంటూ.  

ఇది చిలికి చిలికి గాలివాన అయింది. స్టేట్ ఐ.పి.ఎస్. అధికారుల సంఘం కార్యవర్గం అత్యవసర సమావేశం జరిపి ప్రోటోకాల్ విషయంలో తమను కూడా ఐ.ఏ.ఎస్. అధికారులతో సమానంగా పరిగణించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది. ఈ సంఘానికి దినేష్ రెడ్డి కార్యదర్శి కావడం కాకతాళీయం కావచ్చు.    

తాను 1977 బ్యాచ్ ఐ.పి.ఎస్. అధికారినని, ప్రోటోకాల్ వ్యవహారాలు చూసే అధికారి 1981 బ్యాచ్ ఐ.ఏ.ఎస్.  కాబట్టి అతడు తనకు జూనియర్ అవుతాడు అనే ధోరణితో దినేష్ రెడ్డి ఉత్తరం రాసారు.  

నివురుగప్పిన నిప్పు మాదిరిగా ఈ వివాదం కొనసాగుతోంది కానీ ప్రభుత్వం పెదవి విప్పలేదు. కారణం నగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తి కావాల్సి వుంది. ఆ కార్యక్రమం సజావుగా అలా పూర్తయిందో లేదో నగర పోలీసు కమిషనర్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పటికి ఆయన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి పది నెలలు కూడా కాలేదు. నగర పోలీసు  కమిషనర్ ను బదిలీ చేస్తున్న సమాచారం డీజీపీకి కూడా తెలియదని వార్తలు గుప్పుమన్నాయి.

ఏదో కక్ష కట్టినట్టు బదిలీ చేసినట్టు కాకుండా అదే రోజు మరో ఆరుగురు ఉన్నత పోలీసు అధికారులకు  కూడా స్థాన చలనం కల్పిస్తూ  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అప్పుడు అలా అర్ధాంతరంగా కమిషనర్ పదవి నుంచి తప్పుకోవాల్సివచ్చిన దినేష్ రెడ్డి, ఆద్యతన కాలంలో పోలీసు డైరెక్టర్ జనరల్ అయ్యారు. సంబంధిత మంత్రికి కూడా తెలియకుండా ఆయన ఒకే ఒక్క రోజున రాష్ట్ర వ్యాప్తంగా యాభయ్ మంది డీ.ఎస్.పి. లను బదిలీ చేయడం ఓ కొసమెరుపు.

31, జనవరి 2021, ఆదివారం

భలే మామా భలే - భండారు శ్రీనివాసరావు

 

ఫోనొచ్చింది.
“చూస్తున్నారా! మావాడు వాళ్ళని భలేగా వాయించేస్తున్నాడు. ఈ దెబ్బతో అవతలవాళ్ళు మఠాష్!”
కాసేపట్లోనే మరో ఫోన్. మరో మనిషి నుంచి.
“చూశారా! అతగాడి వాదన. మాట్లాడిన దాంట్లో ఏవన్నా అర్ధం ఉందా!
ఇద్దరూ చూసింది ఒకే టీవీలో ఒకే దృశ్యం. ఇద్దరూ విన్నది ఒకే మాట.
అయినా ఆ చూపులో తేడా! అర్ధం చేసుకోవడంలో తేడా!
నిజానికి చూపులో తేడా లేదు. వాళ్ళు పెట్టుకున్న కళ్ళద్దాలలోనే.
ఇలాంటివి వింటుంటే మాయాబజార్ సినిమాలో ‘భలే మామా! భలే! మనవాడు కృష్ణుడి మీద ఎలా చమత్కార బాణం వేశాడో’ అనే డైలాగులు గుర్తుకురాకమానవు.
(31-01-2021)

30, జనవరి 2021, శనివారం

మా రోజుల్లో .....భండారు శ్రీనివాసరావు

 మా రోజుల్లో అని ఎవడైనా సంభాషణ మొదలు పెడితే ఇక ఆ వ్యక్తి ఈనాటి వాడు కాదు, పాత తరం మనిషి అని ఎవరికైనా ఇట్టే అర్ధమై పోతుంది. ఇవతల వ్యక్తి కూడా అదే బాపతు అయితే ఆ ముచ్చట్లకు అంతే వుండదు.

1975లో నేను రేడియోలో చేరిన కొత్తల్లో పరిచయం అయిన కె. వేణుగోపాల్ తో నా స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈనాడులో రాజకీయాలు రాసిన జర్నలిస్ట్ కాబట్టి సహజంగానే అతడికి వాటి పట్ల ఆసక్తి జాస్తి. రాజకీయులతో పరిచయాలు కూడా ఎక్కువే. వేణుగోపాల్ సలహాలు తీసుకోవడానికి వాళ్ళలో చాలామంది ఫోన్లు చేస్తుండేవాళ్ళు.
ఇక పొతే ఇప్పుడు మేమిద్దరం ముందు చెప్పిన ‘మారోజుల్లో...’ బాపతే. కాబట్టి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాము.
‘నిమ్మగడ్డ మీద సభాహక్కుల తీర్మానం ఇచ్చారని అంటున్నార్రు. ఏమైతుందని అనుకుంటున్నావ్’ అన్నాడు కొద్దిసేపటి క్రితం ఫోన్ చేసి.
‘ఏమవుతుందో నాకూ తెలియదు. ఆట ఆడేవాడిని బట్టి ఆట తీరు చెప్పొచ్చు. అలాగే ఒక రాజ్యాంగ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తి తీసుకునే నిర్ణయాన్ని బట్టి పరిణామాలు వుంటాయి’
‘........’
‘గతంలో కోర్టు తీర్పుల్ని కూడా లక్ష్య పెట్టని స్పీకర్లని మనం చూశాం. పట్టుదలతో ఆడే ఆట వేరు, పంతాలతో ఆడేది వేరు. ఇప్పుడు ఇరుపక్షాలదీ రెండో బాటే. ఒకరు తప్పు చేస్తున్నారేమో అని మనం అనుమానించేలోగా అవతల వాళ్ళు కూడా మరో తప్పు చేస్తున్నారు. తీర్పు చెప్పే ఛాన్స్ ఎవరిస్తున్నారు?ఎక్కడిస్తున్నారు?’
‘వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే వీళ్ళు ఒకప్పుడు మనకు తెలిసిన వాళ్ళేనా అనిపిస్తోంది’ అన్నాడు వేణు.
‘నిజమే! ఇప్పుడు టీవీల్లో వస్తున్న వార్తలలో వాడే భాష సంగతేమిటి అని అడుగుతున్నారు జనం. ఒకళ్ళకు చెప్పేముందు మనం కూడా ఒకసారి మనలోకి తొంగి చూసుకోవాలి కదా!’
‘అదీ నిజమే! పక్క పేపరు పేరు కూడా రాసే వాళ్ళం కాదు, ఒక పత్రిక అని తప్ప. ఇప్పుడో! ఒకర్ని మరొకరు కుత్తుకలు నరుక్కోవడం తప్ప అన్నీ చేస్తున్నారు.
‘కాబట్టి, కావున మనం ఇలా అప్పుడప్పుడూ మాట్లాడుకుంటూ గతం తిరగేసుకుంటూ ఉందాం. దాన్ని మించింది లేదు, ఈ వయసులో’
(30-01-2021)

మీడియాకు దూరంగా .... భండారు శ్రీనివాసరావు

 

“నేను పత్రికలు, చదవను, టీవీ చర్చలు చూడను” అని ఓ మిత్రుడు వాట్స్ అప్  సందేశం పంపాడు. నిజానికి ఈ మాటను ఒకప్పుడు మన దేశానికి ప్రధాన మంత్రిగా స్వల్పకాలం పనిచేసిన చరణ్ సింగ్ ఎప్పుడో చెప్పారు. కాకపొతే అప్పటికి ఈ టీవీలు లేవు. అంచేత ఆయన ఇలా అన్నారు.

“నేను పేపర్లు చదవను, రేడియో వినను. అదే నా ఆరోగ్య రహస్యం”

సరే అదలా వుంచి మా వాట్సప్ మిత్రుడి గురించి చెప్పుకుందాం.

టీవీలు, చూడకపోవడానికి, పత్రికలు చదవక పోవడానికి ఆయన చెప్పిన కారణం విచిత్రంగా వుంది. తనకు వచ్చిన ఓ మెసేజ్ తననీ నిర్ణయానికి ప్రొద్బలపరచిందని చెప్పాడు. నిజానికి ఈ సందేశం ఇప్పటికే  చాలా సార్లు చాలా మందికి చేరిపోయింది కూడా.

అదేమిటంటే, Nathan Zohner అనే పెద్దమనిషి, తనకు తెలిసిన  శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఇతరుల అజ్ఞానాన్ని అవహేళన చేయడానికి ప్రయోగిస్తుంటాడు. ‘డైహైడ్రోజన్ మోనాక్సైడ్ (diyhydrogen monoxide) అనేది చాలా ప్రమాదకరం అని, దాన్ని తక్షణం నిషేధించాలని ఆయన చెబుతుంటాడు. తీరా చేస్తే  diyhydrogen monoxide అంటే మామూలు నీళ్ళు (water). అదొక రసాయనిక నామం మాత్రమే. శాస్త్రవేత్తలు కూడా చాలా అరుదుగా వాడే పదం ఇది. అలాంటి శాస్త్రీయ పదాల పట్ల అవగాహన లేనివాళ్లు నిజమే, అది ప్రమాదకరం  కాబోలు అనుకుంటారు అమాయకంగా. ఇలా తమ ప్రజ్ఞతో సాధారణ విషయాలను కూడా మసిపూసి మారేడు కాయ చేసే వ్యవహారాలు ఈనాటి మీడియా చేస్తోందనేది ఆ మితృడి అభిప్రాయం. అందుకే ‘పేపర్లు చదవను, టీవీ చర్చలు చూడను అనే నిర్ణయానికి ఆయన వచ్చాడు.

కానీ మీడియా మీద ఎంత చెడుగా అనుకున్నా, అది necessary evil అంటాడు మరో మిత్రుడు. మొన్నీమధ్య ఆయన ఓ అయిదు రోజుల పాటు నగరానికి దూరంగా వున్న ఫాం హౌస్ లో గడిపివచ్చారు. ఆయనకీ పొద్దున్నే పత్రిక చూడనిదే గడవదు. అక్కడ పత్రిక దొరకదు. ఫాం హౌస్ లో ఉన్న టీవీకి నెట్ సమస్య వచ్చి మౌన ముద్రదాల్చింది. మొదటి రోజు కష్టంగా గడిచింది. మర్నాడు మనసుకు ప్రశాంతంగా వున్నట్టు తోచింది. ఆ మర్నాడు అప్పుడే రెండు రోజులు గడిచిపోయాయా అనిపించింది. అక్కడే అలానే వుండిపొతే బాగుండు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా అని కూడా అనిపించిందట. షుగర్, బీపీ అదుపులో వుందని పరీక్ష చేసుకుంటే తెలిసిందట.

అయితే ఇంటికి తిరిగి రాగానే ఆయన చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే, గుమ్మం  ముందు పడి వున్న పత్రికలను అన్నింటినీ వరసపెట్టి  తిరగేయడం.

మరొక మిత్రుడు మరీ విచిత్రమైన విషయం చెప్పాడు. నిరుడు ఫిబ్రవరిలో కరోనా గురించిన సమాచారం అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్న రోజులు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన పేపరు మొహం చూడలేదు. పొరబాటున కూడా పత్రికను చేతితో తాకలేదు. పుట్టడమే పత్రికాసమేతంగా పుట్టాడని ఆయన చుట్టపక్కాలు చెప్పుకొనేవారు. ప్రతిరోజూ  రోజూ మూడు నాలుగు పత్రికలు చదివే అలవాటు చిన్నప్పటి నుంచీ వుంది. అలాంటి మనిషి దాదాపు ఏడాదిగా పేపరు చేత్తో పట్టుకోలేదు, ముట్టుకోలేదు అంటే ఆశ్చర్యమే మరి.

ఈ విషయాలన్నీ తలచుకుంటూ వుంటే ఎప్పుడో జ్వాలా చెప్పిన ఓ విషయం జ్ఞాపకం వచ్చింది.

అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి కుముద్ బెన్ జోషీ గవర్నర్. తెలుగు దేశం అధికారంలో వుంది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో. కాంగ్రెస్ గవర్నర్ కాబట్టి  టీడీపీ అనుకూల పత్రికలు కొన్ని గవర్నరు ఏం చేసినా వాటిని తూర్పార పడుతూ కధనాలు రాసేవి. ఆవిడ వ్యవహార శైలి కూడా అందుకు దోహదం చేసి వుంటుంది. అది రాజ్ భవన్ కాదు, గాంధీ భవన్ (కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనం) అనే వారు. కాంగ్రెస్ నాయకులు చాలామందికి రాజ్ భవన్ ఓ అడ్డాగా మారింది అని గుసగుసలు వినిపించేవి.

ఒకసారి ఉపరాష్ట్రపతి వెంకట్రామన్ గారు హైదరాబాదు వచ్చి రాజ భవన్ గెస్ట్ హౌస్ లో బస చేశారు. గవర్నర్ కుముద్ బెన్ జోషీ, గవర్నర్ కార్యదర్శి చంద్రమౌళిగారు వెళ్లి ఉపరాష్ట్రపతిని   మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

మాటల సందర్భంలో వెంకట్రామన్ అడిగారు జోషీ గారెని, ‘ఏమిటి అలా వున్నారు ఒంట్లో బాగుండలేదా అని.

చంద్రమౌళిగారు గారు కల్పించుకుని అసలు విషయం చెప్పారు, ఆరోజు ఉదయమే ఒక పత్రిక గవర్నర్ కు వ్యతిరేకంగా ఒక కధనం ప్రచురించిందని.

అప్పుడు వెంకట్రామన్ గారు ఇచ్చిన సలహా ఇది.

‘ఓ మూడు రోజులు పత్రికలు చదవడం మానేసి చూడండి, మనసుకు ఎంతటి ప్రశాంతత లభిస్తుందో అర్ధం అవుతుంది”     

(30-01-2021)

 

29, జనవరి 2021, శుక్రవారం

సెంఛురీ దాటిన పెట్రోలు ధర – భండారు శ్రీనివాసరావు

 

 

పెట్రోలుకు మండే గుణం వుంది. గులాబీ సువాసన గులాబీ ముల్లుకు అంటినట్టు ఈ మండే గుణం పెట్రోలుతో పాటు దాని ధరకు కూడా అబ్బింది. అందుకే  పెట్రో ధరలు పెరిగినప్పుడల్లా పెట్రో మంటలు అని మీడియాలో చమత్కరిస్తుంటారు.

పెట్రోలు ధర వంద రూపాయలు దాటిందని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇంకా పెరగడానికి అవకాశం ఉన్న నిత్యావసర వస్తువుల్లో ఇదొకటి. అంచేత ఆశ్చర్యం అనిపించలేదు.

పెట్రో ధరలు పెరిగినప్పుడల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించడం పరిపాటి. నిజానికి ఈ ధరవరల వ్యవహారం ప్రభుత్వం చేతిలో లేకపోయినా ఆ నింద మోయక తప్పదు. ఎందుకంటే ఎంత చేతిలో లేని సంగతి అయినా, ప్రభుత్వం తలచుకోకుండా ఇలాంటివి జరగవు అని స్కూల్లో చదివే పిల్లాడు కూడా చెబుతాడు.

గతంలో ప్రభుత్వాలు ఈ విమర్శలు ఎదుర్కున్నాయి. ఇప్పటి ప్రభుత్వానికీ తప్పని తల నొపప్పే.

ఈ విమర్శకులు సాధారణంగా తమ వాదనకు మద్దతుగా చెప్పే విషయం ఒకటుంది. అది క్రమంగా ఓ పడికట్టు పదంగా మారిపోయింది. అదేమిటంటే అంతర్జాతీయ చమురు ధరలు, తగ్గుతున్నప్పుడు, లేదా మనం దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు ధరలు పడిపోతున్నప్పుడు, పెట్రో ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ఎలా పెరుగుతున్నాయి? ఎవరూ వంక పెట్టడానికి వీల్లేని వాదన.

ఒకానొక కాలంలో (అప్పటికే ఈ ఆటోమేటిక్ ధరవరల విధానం అమల్లోకి వచ్చింది, ఇదేమీ కొత్త విషయం  కాదు) అంటే నేను రేడియోలో విలేకరిగా పనిచేస్తున్నప్పుడే నేనూ ఇలాంటి వాదన నెత్తికెత్తుకుని పెట్రోలియం శాఖలో పనిచేసే ఓ ఉన్నతాధికారిని అడిగాను.

ఆయన ఏం చెప్పారు అంటే:

“దేశం ఇప్పుడు పెట్రో ఉత్పత్తుల స్వయం సమృద్ధి సాదా దిశలో వెడుతోంది. ముడి చమురు వెలికి తీయడానికి, దాన్ని శుద్ది చేయడానికీ ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నాయి. ఈ పెంచిన ధరల్లో కొంత మొత్తాన్ని ఆ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. ఒక్కసారి ఈ లక్ష్యం నెరవేరితే ఇక దిగుమతుల భారం లక్షల కొట్లలో తగ్గే అవకాశం వుంటుంది”

అంటే అప్పటిదాకా ప్రజలు ఈ పెంచిన ధరలు భరిస్తూ కొంత త్యాగం చేయాల్సి వుంటుంది.

‘బాగానే వుంది మీరు చెప్పిన సంగతి. కానీ భారతీయ పెట్రో సంస్థలు వ్యయ నియంత్రణ పాటిస్తున్నట్టు కనపడదు. పలానా బ్రాండు చమురు (వాహనాల్లో వాడేది) కొనండి అని పత్రికల్లో, మీడియాలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తుంటారు. ఆ ఖర్చు అవసరమా! ఏ ప్రచారం లేకపోయినా, అవసరానికి  కొనే ఉత్పత్తులు అవి. ఇది సరే! ఇంత పేద దేశంలో ఇన్ని రకాల ప్రభుత్వ సంస్థలు అవసరమా! చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, డైరెక్టర్లు సిబ్బంది, ఇవన్నీ వ్యయాన్ని పెంచేవే కదా!’

ఆ అధికారి నుంచి మందహాసం తప్ప సమాధానం లేకపోవడంతో నేను కాస్త రెచ్చిపోయాను.

‘పెట్రోలు బ్యాంకుల ఆధునీకరణ పేరుతొ చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. చైర్మన్లు మారినప్పుడల్లా లోగోలు దేశ వ్యాప్తంగా మారుస్తున్నారు. ఇవన్నీ అవసరమా! పెట్రో ధరలు పెంచడానికి ఇలాంటి అనవసరపు ఖర్చులు కారణం అని ఎవరైనా అనుకుంటే తప్పు పట్టగలరా”

సరే! ఆయన మాత్రం ఏం చెప్పగలరు?  

పదేళ్ల క్రితం అంటే 2010 లో ఒక పత్రికలో వచ్చిన నా వ్యాసంలో పేర్కొన్న మరికొన్ని విషయాలు. 

పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. కాదు పెంచారు. వడ్డన కూడా కొంత భారీగానే వుంది.ఒక్క పెట్రోలుతో సరిపెట్టకుండా, పనిలో పనిగా డీసెలు, కిరోసిన్, గ్యాస్ ధరలను కూడా ఒకేసారి పెంచి అనేకసార్లు ఆందోళనలకు దిగే పని లేకుండా ప్రతిపక్షాలకు కొంత వెసులుబాటు కల్పించారు. టీవీ ఛానల్లకే కొంత నిరాశ. పలుమార్లు చర్చలకు అవకాశం లేకుండా పోయింది. ఈ ధరల పెరుగుదల ఈ నాలుగింటితో ఆగిపోదు, ఈ ప్రభావం పలురంగాలపై పడుతుందన్నది అందరికి తెలిసిందే. ఏతావాతా సామాన్యుడి జీవితం, అలాగే అదనపు ఆదాయానికి ఏమాత్రం అవకాశంలేని స్తిర వేతన జీవుల జీవితం అస్తవ్యస్తమవుతాయి. అసలు ఆదాయాలే ఎరుగని నిరుపేదలకు ఈ ధరల పెరుగుదల గొడవే పట్టదు. పొతే, ఈ విషయంపై హోరాహోరి చర్చలు జరిపిన వాళ్ళు, తమ తమ పార్టీల విధానాలకు అనుగుణంగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసినవాళ్ళు యధావిధిగా టీవీ స్తుడియోలకు ఏసీ కార్లలో వెళ్ళివస్తుంటారు. ధర్నాలు, రాస్తా రోఖోలు ఎటూ తప్పవు. ధరల పెరుగుదలతో వాస్తవంగా దెబ్బతినే కష్ట జీవులను ఈ ఆందోళనలు మరింత కష్టపెడతాయి. కానీ, ఇది ఎవరికీ పట్టదు.

 

ధరలు పెంచినప్పుడల్లా ప్రభుత్వం తను చెప్పాల్సిన లెక్కలు చెబుతుంది. ఎందుకు పెంచాల్సి వచ్చిందో, ఏ పరిస్థితుల్లో పెంచాల్సి వచ్చిందో వివరిస్తుంది. దరిమిలా, పాలక పక్షానికి చెందిన ప్రతినిధులు టీవీ తెరలపై వాలిపోయి, ఇప్పుడు ఇలా అడ్డగోలుగా విమర్శిస్తున్న ప్రతిపక్షాలు అధికారంలో వున్నప్పుడు ఎన్నిసార్లు పెంచిందీ, యెంత ఎక్కువగా పెంచిందీ గణాంకాలతో సహా వివరించి వారి నిర్వాకాన్ని ఎండగట్టడం ఆనవాయితీగా మారింది. విపక్షాలు కూడా ఇదే అదనని, ఎడ్ల బళ్ళు, రిక్షా బళ్ళు ఎక్కి వూరేగింపులు నిర్వహిస్తూ తమ నిరసనను ఒకటి రెండు రోజుల్లో ముగిస్తారు. ఏనాడూ మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు, వెచ్చాలు కొనని ఆడంగులు కొందరు బుల్లి తెరలపై ప్రత్యక్షమై, ‘ఏమీ తినేట్టు లేదు-ఏమీ కొనేట్టులేదుఅంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. పెట్రోలు బంకుల దగ్గర టీవీ చానళ్ళకు ఇంటర్వ్యూ లు ఇచ్చేవాళ్ళు ఇదే ఆఖరుసారి బైకు పై తిరగడంఅన్న తరహాలో మాట్లాడుతారు. ఆటోవాళ్ళు మాత్రం ఇదేమీ పట్టించుకోరు. ప్రయాణీకుల ముక్కు పిండి, పెరిగిన ధరలకు రెండింతలు చార్జీలు వసూలు చేస్తారు.

 

ధరలు పెరిగినప్పుడల్లా ఇదే తంతు. తెల్లారితే మళ్ళీ అన్ని వాహనాలు రోడ్లమీదే. ట్రాఫిక్ జాములు మామూలే. ప్రత్యక్షంగా భారం పడ్డవాళ్ళు పది రోజుల్లో మరచిపోయి మామూలుగా మనుగడ సాగిస్తుంటారు. పరోక్షంగా భారం పడ్డవాళ్ళు మౌనంగా భరిస్తుంటారు. ప్రతిదీ రాజకీయం చేసేవాళ్ళు ప్రజలభారం అంతా మోస్తున్నట్టు నటిస్తుంటారు. పెంచి కూర్చున్న సర్కారువారు మాత్రం అంతా అదే సర్దుకు పోతుందిలే అన్న నిర్వికార ధోరణి ప్రదర్శిస్తూవుంటారు.

 

ఇదంతా ఎందుకు జరుగుతోంది ?

 

మన చేతుల్లో వున్నదాన్ని పక్కవాళ్ళ చేతుల్లోపెట్టి బాధ్యత నుంచి తప్పించుకోవాలనుకోవడంవల్ల.

 

వున్న దానితో సర్దుకుపోవడం మాత్రమె కాకుండా ఎంతో కొంత వెనకేసుకునే పాత తరం నుంచి, వున్నదంతా ఖర్చుచేసుకుంటూ జల్సాగా బతకాలనే మరో తరం నుంచి, ఖర్చులకు తగ్గట్టుగా సంపాదన పెంచుకోవాలనే ఇంకో తరం నుంచి, అలా పెంచుకోవడానికి అడ్డదారులతో సహా ఏ దారయినా సరయిన దారే అని అనుకునే ప్రస్తుత తరం దాకా విషయాలను విశ్లేషించుకోగలిగినవారికి ఇదేమంత వింతగా తోచదు. అమ్మేటప్పుడు ధర పలకాలి, కొనేటప్పుడు చవుకగా దొరకాలి అనే తత్వం నుంచి బయటపడగాలి. ధరలన్నీ చుక్కలు తాకుతున్నాయి, ఎగష్ట్రా ఇవ్వకపోతే యెట్లా అనే ఆటో డ్రైవర్ సిటీ బస్సుల స్ట్రయిక్ అనగానే చార్జీలు అమాంతం పెంచడం అందరికీ తెలిసిందే. అంటే, అవకాశం దొరికితే ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించడం తప్పుకాదనే ధోరణి ప్రబలుతోంది. ఇది సమాజం లోని అన్ని వర్గాలకు వర్తిస్తుంది, కాణీకి టిఖానా లేని దరిద్రనారాయణులకు తప్ప. (25-06-2010)