21, డిసెంబర్ 2020, సోమవారం

పెద్దగీత ముందు చిన్నగీత – భండారు శ్రీనివాసరావు

 

కోపం వచ్చినప్పుడు, లేదా ఎవరి మీద అయినా అసహనం కలిగినప్పుడు మనసును నిగ్రహించుకోవడానికి ఒకటీ, రెండూ, మూడు అంటూ పది ఒంట్లు  లెక్కపెట్టమనేది మా బామ్మగారు.

సాక్షిలో నా వ్యాసం దరిమిలా రేగిన దుమ్ము సర్దుకున్న తరువాత రాద్దాము అని కొంత  వ్యవధానం తీసుకోవడానికి మా బామ్మ మాటే  కారణం.

ఇలా రాసి అలా క్షణంలో పోస్ట్ చేయడానికి ఫేస్ బుక్ అంత సులభం కాదు వార్తాపత్రికల్లో.

నేను  యాభయ్ ఏళ్ళ క్రితమే  నార్ల వెంకటేశ్వర రావు గారి సంపాదకత్వంలో ఆంధ్ర జ్యోతి దినపత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేసాను. కాబట్టి పత్రికల విషయంలో కొంత అవగాహన వుంది.

రాసే రచయిత ఎంతటి సుప్రసిద్ధుడైనా అతడి రచనను తమ పత్రికలో ప్రచురించే విషయంలో సంపాదక వర్గానికి కొన్ని బాధ్యతలు వుంటాయి. వచ్చిన వ్యాసాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రచురణార్హమని సంపాదకుడు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే అది వెలుగు చూస్తుంది. ఈలోగా ఎన్నో వడపోతలు వుంటాయి. విషయం రాజకీయ సంబంధమైనది అయితే ఈ ప్రక్రియ మరింత కట్టుదిట్టంగా వుంటుంది. పత్రికలో ప్రచురించడానికి, తిరస్కరించడానికి పత్రిక ఎడిటోరియల్ పాలసీ అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది. ఎడిటింగ్ అనే కత్తెర వాడేది ఇందుకే. రచయిత ఇష్టపడితే కొన్ని కత్తెర్లు వేసి ప్రచురిస్తారు. ఇది సర్వసాధారణంగా జరిగేదే.

మిగిలిన దిన పత్రికలను పక్కన పెడదాం. సాక్షిని తీసుకుందాం. ఆ పత్రిక మొదటి పుటలోనే కీర్తిశేషులు వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఫోటో వేస్తారు, శషభిషలకు తావు లేకుండా. అంచేత, తమ  విధానానికి తగ్గ రచనలును ప్రచురించే విషయంలో వాళ్ళు తీసుకునే జాగ్రత్తలను తప్పుపట్టలేము. అందుకు సిద్ధపడే రచయితలు తమ రచనలు పంపాల్సి వుంటుంది.

తమ పాలసీకి విరుద్ధంగా వుండే వ్యాసాలను ఎడిట్  పేజీలో ప్రచురించే పద్దతి గతంలో పత్రికలలో  వుండేది. చాలా పత్రికలు దీనికి ఎప్పుడో భరతవాక్యం పలికాయి. కాబట్టి ఈ విషయంలో ఆ ఒక్క పత్రికను ఒంటరిగా నిలబెట్టి వేలెత్తి చూపే పరిస్థితి ఈనాడు తెలుగునాట లేదు. ఇది చేదునిజం.

ఈ నేపధ్యంలో వైసీపీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడిని పరిమితంగానైనా ప్రశంసించే వాక్యాలు సాక్షి పత్రికలో కనబడితే అపూర్వం అనే చెప్పాలి. మొన్న ఆదివారంనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో  నా వ్యాసాన్ని, ఒక్క పదాన్నికూడా  ఎడిట్ చేయకుండా సాక్షి ప్రచురించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సంపాదకులను ఇందుకు అభినందిస్తున్నాను. నా అనుభవాన్ని బట్టి చెబుతున్నాను. గతంలో చంద్రబాబుకు కొంత వ్యతిరేకంగా వున్నాయని  వేరే పత్రికలు నా వ్యాసాలను  తిరస్కరించిన సందర్భాలను గుర్తు చేసుకుంటే సాక్షి సంపాదకులు చూపిన తెగువ ప్రశంసార్హం. ఉదాహరణకు సాక్షి ప్రచురించిన నా వ్యాసంలోని కొన్ని  వాక్యాలు చూడండి. 

“ఒకనాడు జగన్ మోహన రెడ్డి ఎదుర్కున్న కఠిన పరిస్థితులను చంద్రబాబు ఈనాడు ఒక స్థాయిలో ఎదుర్కుంటున్నారు. 2014 నుంచి  2019 వరకు (కొత్త) రాష్ట్రంలో అధికారం ఆయనదే. చంద్రబాబు ఏదో సాధిస్తాడని,  నూతన రాష్ట్రం ఆయన చేతుల్లో పదిలంగా ఉంటుందని జనంలో  అపరిమితమైన  నమ్మకం. ఆయన దక్షత పట్ల, శక్తియుక్తుల పట్ల చదువుకున్న వారిలో,  మేధావి వర్గాలలో సైతం అంతులేని విశ్వాసం. ఆయన ఏం చేసినా   గోరంతను కొండంత చేసి చూపే  మీడియా. కేంద్రంలో చాలా కాలం తన మాటకు ఎదురు చెప్పని మిత్ర ప్రభుత్వం.  నిజానికి ఏ పరిపాలకుడికి అయినా ఇంతకు  మించి ఏం కావాలి? 

“అయిదేళ్ళ తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు తన ఆత్మ విశ్వాసం పట్ల ఎనలేని నమ్మకం. నిజానికి నాయకుడు అనేవాడికి ఇది చాలా అవసరం కూడా.  అయితే  ఆత్మ విశ్వాసం పరిధి మించితే వచ్చేది  దుష్ఫలితాలే.

“జగన్ మాదిరిగా నెత్తి మీద కత్తిలా ఆయనకు కోర్టు కేసుల గొడవ  లేదు. గ్రామ స్థాయి కార్యకర్తల బలంతో పోల్చి చూసుకున్నా వైసీపీ కంటే టీడీపీ మెరుగైన స్థితిలోనే వుంది. ఆయన్ని సమర్ధుడైన నాయకుడిగా గుర్తించి, గౌరవించే రాజకీయేతర పెద్ద మనుషులకు కూడా కొదవ లేదు. ఈ రకమైన అభిమానులు చంద్రబాబుకు దేశ విదేశాల్లో అధిక సంఖ్యలో వున్న విషయం రహస్యమేమీ కాదు. ఇక రాజకీయ అనుభవమా! ఈ విషయంలో ఆయనది ఎప్పుడూ అగ్రస్థానమే. 

“ఒక ఎన్నికలో చతికిల పడిన పార్టీ  అంతటితోనే చితికి పోదు, అంతరించిపోదు.  దీనికి టీడీపీనే రుజువు. పార్టీ సంస్థాపక అధ్యక్షుడు జీవించి ఉన్న కాలంలో కూడా ఆ పార్టీకి  ఉత్థానపతనాలు  తప్పలేదు. అలాగే ఒకానొక రోజుల్లో టీడీపీకి ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఇదే. 1989లో అధికారంలో ఉన్న ఈ పార్టీ తరువాత ఎన్నికల్లో ఓడిపోయింది. 1994లో అసెంబ్లీలో ఈ పార్టీ బలం కేవలం 26.   అలాంటిది 2004 ఎన్నికల నాటికి  మళ్ళీ తన బలాన్ని 185 కి పెంచుకుంది.

“ప్రస్తుత అసెంబ్లీలో మొత్తం 175 స్థానాల్లో  టీడీపీకి 23  లభించాయి.  మొత్తం 294 స్థానాల్లో 26 గెలుచుకున్న అప్పటి కాంగ్రెస్ పరిస్థితితో పోలిస్తే ఇది మెరుగే. కాంగ్రెస్ మళ్ళీ పుంజుకొని తర్వాత పదేళ్లకు అధికారంలోకి వచ్చింది. మరి ఈసారి ఓటమితో టీడీపీ అంతగా కుంగిపోవడం ఎందుకు? వైఫల్యాల్లో అవకాశాలు వెతుక్కునే సమర్ధత కలిగిన నాయకుడు ప్రజాస్వామ్య బాటలో సాగి మరో విజయానికి ప్రయత్నం చేయకుండా కోర్టులు, కేసులు వంటి పరోక్ష పద్దతిలో కౌటిల్యం చేస్తున్నారనే నిందలు మోయడం ఎందుకు? వెనుకటి రోజుల్లో  అయితే, వీటిని జనంలో చాలామంది తేలిగ్గా తీసుకునేవారేమో కానీ ఇప్పటి సోషల్ మీడియా యుగంలో అలాంటి అవకాశం ఉంటుందా!

“ప్రధాన స్రవంతి మీడియాకు ధీటుగా, మరింత ఎక్కువ ప్రభావం చూపగల సోషల్ మీడియా పురుడుపోసుకున్న ఈ  కాలంలో పాత పద్దతులు పనికిరాకపోవచ్చు. కాలానుగుణంగా అప్ డేట్ కావాల్సిన అవసరాన్ని గురించి టెక్నో సావీ రాజకీయ నాయకుడైన చంద్రబాబుకు ఒకరు చెప్పేది ఏమీ వుండదు.

“ఎన్నికల సమరంలో  చదరంగపు ఎత్తులు, ఎత్తుగడలు అవసరమే. కానీ  సాంఘిక మాధ్యమాలు రాజ్యం చేస్తున్న ప్రస్తుత కాలంలో మరీ ఎక్కువ చాణక్యం మేలుచేయకపోవచ్చు.

“చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్నా, ఇప్పుడు కొత్తగా రాష్ట్ర విభజన అనంతరం తీసుకున్నా అత్యంత ఎక్కువ కాలం పాలించిన నాయకుడు.  సందేహం లేదు.  పరిపాలనా వ్యవస్థకు సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి,  వ్యవస్థల నడుమ ఘర్షణ వాతావరణం ఏర్పడడానికి కారణం అని ఎవరైనా లేశ మాత్రంగా అనుమానించినా కూడా చంద్రబాబు నాయుడికి శోభస్కరం కాదు.

“ఏదో సినిమాలో చెప్పినట్టుయుద్దం గెలవడం అంటే శత్రువును చంపడం కాదు.. ఓడించడం’ 

ఇది హితవచనం మాత్రమే.”

చంద్రబాబు నాయుడికి సలహాల రూపంలో ఇన్ని విషయాలతో కూడిన నా  వ్యాసం సాక్షి పత్రికలో రావడం నాకే విడ్డూరం అనిపించింది. ఎడిట్  పేజీ  వ్యాసాల విషయంలో  తమకు  వీలున్న మేరకు కొంత నిష్పాక్షిక ధోరణి ప్రదర్శించడానికి  కనీసం ఒక పత్రిక అయినా ముందుకు రావడం చూసి అయిదు దశాబ్దాల పాత్రికేయ అనుభవం కలిగిన  ఓ జర్నలిస్టుగా సంతోష పడ్డాను కూడా. పొతే, నా వ్యాసంలో సింహభాగం ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా లేకపోవడం, పైగా ప్రచురించింది సాక్షి పత్రిక కావడం దుమారానికి కారణం అయ్యాయేమో అనిపిస్తోంది.

కాలేజీలో చదువుకునే రోజుల్లో  మాకు ఇంగ్లీష్  నాన్ డీటెయిల్ క్లాసు వుండేది. ఆ లెక్చరర్ ని స్టూడెంట్స్ లెక్కపెట్టే వాళ్ళు కాదు. దానికి ప్రత్యేకమైన పరీక్షల్లో పాసు కావడానికి ఆ మార్కులు అవసరం లేకపోవడం కారణం కావచ్చు. అల్లరిచేసే పిల్లలతో ఆ క్లాసు లెక్చరర్ అంటుండేవారు “ లెస్  నాయిస్  ప్లీజ్!’ అని.

అంటే ‘ఎలాగూ మీరు అల్లరి చేయక మానరు. అంచేత ఆ చేసేదేదో కాస్త తక్కువ గోల చేయండి’ అని టీకా  తాత్పర్యం.

అలాగే ఈ పోటాపోటీ కాటా కుస్తీ యుగంలో మీడియా యాజమాన్యాలు మరీ మడి కట్టుకుని పత్రికలు, టీవీ ఛానళ్ళు నడపలేరు. అలా ఆశించడం అత్యాశే అవుతుంది.  కాకపోతే వీలు  వున్నంతలో కాస్త నిఖార్సయిన జర్నలిజానికి సాయపడగలిగితే అదే పదివేలు.

రాజకీయాలతో సంబంధం పెట్టుకుంటూనే రాజకీయులతో  అంటకాగకుండా ఉండడాన్ని నేను అభిలషిస్తాను. మీడియా ఒక్కటే నా ప్రధమ ప్రాధాన్యత. ఆ కోణంలోనే నేను ఏది రాసినా.

సరే! అదలా ఉంచితే..  

ఫేస్ బుక్ లో మిడుతల దండు  మాదిరిగా వెలువడ్డ వ్యాఖ్యలు, విమర్శలు, నిందారోపణలు చూసి చాలామంది మితృలు, హితులు చాలా ఖేదపడ్డారు. వారికి  పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపాల్సిన  బాధ్యత నా మీద ఉన్నప్పటికీ, ఈ విషయంలో నా అశక్తతను మన్నించే సహృదయత వారికి పుష్కలంగా వున్నదని నా నమ్మకం.

అసలు వ్యాసంతో సంబంధం లేకుండా  వ్యాఖ్యలు, పై వ్యాఖ్యలు చేస్తూ పోవడం వల్ల అసలు విషయం మరుగున పడి పోయిందేమో అనే శంకతో ఈ వివరణ.

వ్యక్తిత్వ హననం మాదిరి సాగిన ఆరోపణలు, విమర్శల విషయంలో బాధ అంటారా! నిజానికి నేను అలా  బాధ పడివుంటే, నాలో వాళ్ళు చూపించిన లోపం ఏదో నిజంగానే  వుందని నేనే నమ్మాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి బాధ నాకేదీ లేదు.

పొతే, బాధ ప్రసక్తి ఎలాగూ వచ్చింది కనుక  ఒక విషయం చెప్పి ముగిస్తాను.  బాధ అనేది సాపేక్షం. నిరుడు ఆగస్టులో మా ఆవిడను పోగొట్టుకున్న బాధ ముందు నిజానికి ఇవన్నీ ఏపాటి?   

పెద్ద గీత ముందు చిన్న గీత.

నమస్కారం!

 (21-12-2020)

20, డిసెంబర్ 2020, ఆదివారం

చంద్రబాబు నాయుడు జగన్ ను చూసి నేర్చుకోవాలి – భండారు శ్రీనివాసరావు

 (Published in AP edition of SAKSHI on 20-12-2020, SUNDAY today)

ఇదెప్పుడో క్రీస్తుకు పూర్వం చరిత్ర కాదు. యువకుల నుంచి వృద్ధుల వరకు గుర్తున్న గతమే.

ఒకప్పుడు జగన్ మోహన రెడ్డి ఎదుర్కున్నది ఎవరిని ? సాక్షాత్తు తను ఏ పార్తీకి లోకసభలో నాయకత్వం వహిస్తున్నాడో ఆ కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలిని. అప్పటివరకు తన నాన్నగారికి అనుయాయుల్లా, నమ్మిన బంటుల్లా, అనుచరుల్లా వ్యవహరిస్తూ వచ్చిన సొంత పార్టీ ముఖ్యమంత్రులు, మంత్రులు, నాయకులు  అధినాయకురాలికి భయపడిపోయి  తనకు దూరం జరిగినా, తనను దూరం చేసుకున్నా, రాజకీయ ప్రేరేపిత కేసుల్లో చిక్కుకుని పదహారు నెలలు జైల్లో గడిపినా జగన్ మోహన రెడ్డి వీసమెత్తు ఆదరలేదు, బెదరలేదు. దేశంలో ఉన్న అన్ని పార్టీలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తనకు వ్యతిరేకంగా వున్నప్పుడు, మీడియాలో అధిక భాగం తన పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నప్పుడు ఆయన  కాడి కింద పారేయలేదు. అదే ధైర్యం, అదే తెగువ జన సామాన్యంలో అతడ్ని హీరోను చేసాయి. ఆయనపై పడిన మచ్చలను జనం పట్టించుకోలేని విధంగా రక్షణ కవచంలా కాపాడాయి.

ఒకనాడు జగన్ మోహన రెడ్డి ఎదుర్కున్న ఈ కఠిన పరిస్థితులను చంద్రబాబు ఈనాడు ఒక స్థాయిలో ఎదుర్కుంటున్నారు. నిజానికి ఆ రోజుల్లో  జగన్ ఒక్కడూ ఒక పక్క,  మిగిలిన పార్టీలన్నీ మరోపక్క. చంద్రబాబు నాయుడికి ఈ పరిస్థితి లేదు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల వంటి కొన్ని రాజకీయ పక్షాలు ఇంకా ఆయనతో మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నాయి. బీజేపీతో ఆయన కొని తెచ్చుకున్న వైరం తప్పిస్తే  వాళ్ళంతట వాళ్ళు చంద్రబాబు చేతిని వదిలేసి పోయింది లేదు. 2014 నుంచి  2019 వరకు రాష్ట్రంలో అధికారం ఆయనదే. చంద్రబాబు ఏదో సాధిస్తాడని,  నూతన రాష్ట్రం ఆయన చేతుల్లో పదిలంగా ఉంటుందని జనంలో  అపరిమితమైన  నమ్మకం. ఆయన దక్షత పట్ల, శక్తియుక్తుల పట్ల చదువుకున్న వారిలో,  మేధావి వర్గాలలో సైతం అంతులేని విశ్వాసం. ఆయన ఏం చేసినా   గోరంతను కొండంత చేసి చూపే  మీడియా. కేంద్రంలో చాలా కాలం తన మాటకు ఎదురు చెప్పని మిత్ర ప్రభుత్వం.  నిజానికి ఏ పరిపాలకుడికి అయినా ఇంతకు  మించి ఏం కావాలి?  అయినా ఆయన తన  అయిదేళ్ళ పుణ్య కాలాన్ని రకరకాల ఆలోచనలు చేస్తూ, ప్రణాళికలు రచిస్తూ గడిపారే కాని వాటిల్లో అధిక భాగం అమలుకు నోచుకోలేదు. కొన్ని చేయగలిగినా వాటికి సంపూర్ణత్వం సిద్ధించలేదు.

అయిదేళ్ళ తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు తన ఆత్మ విశ్వాసం పట్ల ఎనలేని నమ్మకం. నిజానికి నాయకుడు అనేవాడికి ఇది చాలా అవసరం కూడా.  అయితే  ఆత్మ విశ్వాసం పరిధి మించితే వచ్చేది  దుష్ఫలితాలే.

జగన్ మాదిరిగా నెత్తి మీద కత్తిలా ఆయనకు కోర్టు కేసుల గొడవ  లేదు. గ్రామ స్థాయి కార్యకర్తల బలంతో పోల్చి చూసుకున్నా వైసీపీ కంటే టీడీపీ మెరుగైన స్థితిలోనే వుంది. ఆయన్ని సమర్ధుడైన నాయకుడిగా గుర్తించి, గౌరవించే రాజకీయేతర పెద్ద మనుషులకు కూడా కొదవ లేదు. ఈ రకమైన అభిమానులు చంద్రబాబుకు దేశ విదేశాల్లో అధిక సంఖ్యలో వున్న విషయం రహస్యమేమీ కాదు. ఇక రాజకీయ అనుభవమా! ఈ విషయంలో ఆయనది ఎప్పుడూ అగ్రస్థానమే.

మరి ఇన్ని సానుకూల పరిస్థితులు వున్న నేపధ్యంలో ఆయన నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీ ఎందుకు ముక్కుసూటి రాజకీయాలు కాకుండా వ్యూహ, ప్రతివ్యూహాలతో కూడిన రాజకీయ ఎత్తుగడలను ఆశ్రయిస్తోంది? చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర ప్రదేశ్ కి మొదటి ముఖ్యమంత్రిగా పదవీస్వీకారం చేసిన కొత్తల్లోనే కొత్త ప్రభుత్వానికి ఊపిరి పీల్చుకునే వ్యవధానం కూడా ఇవ్వకుండా నరకాసుర సంహారం వంటి బహిరంగ నిరసనలకు దిగిన వైసీపీ వ్యూహం ఎలా దారుణంగా విఫలం అయిందో టీడీపీ వ్యూహకర్తలు మరిచిపోయారా?  

ఒక ఎన్నికలో చతికిల పడిన పార్టీ  అంతటితోనే చితికి పోదు, అంతరించిపోదు.  దీనికి టీడీపీనే రుజువు. పార్టీ సంస్థాపక అధ్యక్షుడు జీవించి ఉన్న కాలంలో కూడా ఆ పార్టీకి  ఉత్థానపతనాలు  తప్పలేదు. అలాగే ఒకానొక రోజుల్లో టీడీపీకి ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఇదే. 1989లో అధికారంలో ఉన్న ఈ పార్టీ తరువాత ఎన్నికల్లో ఓడిపోయింది. 1994లో అసెంబ్లీలో ఈ పార్టీ బలం కేవలం 26.   అలాంటిది 2004 ఎన్నికల నాటికి  మళ్ళీ తన బలాన్ని 185 కి పెంచుకుంది.

ప్రస్తుత అసెంబ్లీలో మొత్తం 175 స్థానాల్లో  టీడీపీకి 23  లభించాయి.  మొత్తం 294 స్థానాల్లో 26 గెలుచుకున్న అప్పటి కాంగ్రెస్ పరిస్థితితో పోలిస్తే ఇది మెరుగే. కాంగ్రెస్ మళ్ళీ పుంజుకొని తర్వాత పదేళ్లకు అధికారంలోకి వచ్చింది. మరి ఈసారి ఓటమితో టీడీపీ అంతగా కుంగిపోవడం ఎందుకు? వైఫల్యాల్లో అవకాశాలు వెతుక్కునే సమర్ధత కలిగిన నాయకుడు ప్రజాస్వామ్య బాటలో సాగి మరో విజయానికి ప్రయత్నం చేయకుండా కోర్టులు, కేసులు వంటి పరోక్ష పద్దతిలో కౌటిల్యం చేస్తున్నారనే నిందలు మోయడం ఎందుకు? వెనుకటి రోజుల్లో  అయితే, వీటిని జనంలో చాలామంది తేలిగ్గా తీసుకునేవారేమో కానీ ఇప్పటి సోషల్ మీడియా యుగంలో అలాంటి అవకాశం ఉంటుందా!

ప్రధాన స్రవంతి మీడియాకు ధీటుగా, మరింత ఎక్కువ ప్రభావం చూపగల సోషల్ మీడియా పురుడుపోసుకున్న ఈ  కాలంలో పాత పద్దతులు పనికిరాకపోవచ్చు. కాలానుగుణంగా అప్ డేట్ కావాల్సిన అవసరాన్ని గురించి టెక్నో సావీ రాజకీయ నాయకుడైన చంద్రబాబుకు ఒకరు చెప్పేది ఏమీ వుండదు.

ఎన్నికల సమరంలో  చదరంగపు ఎత్తులు, ఎత్తుగడలు అవసరమే. కానీ  సాంఘిక మాధ్యమాలు రాజ్యం చేస్తున్న ప్రస్తుత కాలంలో మరీ ఎక్కువ చాణక్యం మేలుచేయకపోవచ్చు.

అధికార పక్షానికి న్యాయస్థానాల అక్షింతలు, మొట్టికాయలు అంటూ నిరంతరంగా సాగించిన ప్రచారం మరో రకంగా  జగన్ పట్ల సానుభూతిని పెంచేదిగా తయారు అయ్యే అవకాశాలను గురించి ఆలోచించకపోవడం టీడీపీ  వ్యూహకర్తల మరో వైఫల్యం. దీనికి తోడు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక న్యాయస్థానం ఇచ్చిన  తీర్పుల్లో అధిక భాగం పై కోర్టులో నిలవకపోవడం కూడా టీడీపీ పై వచ్చిన ఆరోపణలకు ఊతం ఇస్తోంది.

చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్నా, ఇప్పుడు కొత్తగా రాష్ట్ర విభజన అనంతరం తీసుకున్నా అత్యంత ఎక్కువ కాలం పాలించిన నాయకుడు.  సందేహం లేదు.  పరిపాలనా వ్యవస్థకు సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి,  వ్యవస్థల నడుమ ఘర్షణ వాతావరణం ఏర్పడడానికి కారణం అని ఎవరైనా లేశ మాత్రంగా అనుమానించినా కూడా చంద్రబాబు నాయుడికి శోభస్కరం కాదు.

ఏదో సినిమాలో చెప్పినట్టుయుద్దం గెలవడం అంటే శత్రువును చంపడం కాదు.. ఓడించడం” 

ఇది హితవచనం మాత్రమే.   (18-12-2020)



  

18, డిసెంబర్ 2020, శుక్రవారం

నిచ్చెన మెట్లు – భండారు శ్రీనివాసరావు

 చాలా కాలం క్రితం ఒకతను, వయసులో నాకంటే చాలా చిన్నవాడు, మా ఇంటికి వచ్చి కలిశాడు. టీవీ చర్చల్లో పాల్గొనాలనే అభిలాష వుందని, ఎవరికైనా చెబుతారా అనేది ఆయన చేసిన అభ్యర్ధన. అందులో తప్పేమీ లేదు. సిఫారసులు పనిచేయక పోవచ్చు,కాబట్టి మీరే మీ ప్రయత్నం చేసుకోవడం మంచిదని సలహా ఇచ్చాను.

ఆయన ఏ ప్రయత్నం చేసుకున్నారో నాకు తెలియదు కానీ ఒకరోజు ఏదో టీవీలో విశ్లేషకుడిగా కనిపించారు. మొదటి ప్రయత్నం అయినప్పటికీ బాగానే మాట్లాడాడు అని నాకు అనిపించింది.
ఆ తర్వాత మధ్య మధ్య ఫోన్ చేస్తూ వివిధ రాజకీయ అంశాల మీద నా అభిప్రాయం అడుగుతూ ఉండేవాడు. క్రమంగా నాలుగయిదు టీవీల వాళ్ళు ఆయనని చర్చలకు పిలిచే పరిస్థితి ఏర్పడింది. సొంత కారులో రావడం టీవీల వాళ్లకి కూడా కలిసొచ్చే అంశం అయివుంటుంది.
ఏడాది తిరక్క ముందే ఒక పార్టీకి అధికార ప్రతినిధి హోదాలో చర్చల్లో పాల్గొనడం మొదలు పెట్టాడు. ప్రతిపక్షంలో వుంటే కొన్ని విషయాల్లో వెసులుబాటు ఉంటుందని ఆయనే ఒక సారి నాతొ అన్నారు. ప్రతి అంశం మీదా ప్రభుత్వాన్ని ఝాడించే అవకాశం ఉంటుందని, తేలిగ్గా గుర్తింపు లభిస్తుందని ఓ సారి నాకు గీతాబోధ కూడా చేశారు. ప్రభుత్వం తరపున మాట్లాడే వాళ్ళు చాలామంది వుంటారు. దానివల్ల టీవీల్లో కనబడే అవకాశాలు అరుదుగా దొరుకుతాయి. అదే ప్రతిపక్షం తరపున అయితే చాలా టీవీల్లో కనిపించవచ్చు అనేది ఆయన థియరీ. సమర్థించే వాదనలు ప్రజలకు నచ్చవు, అదే ఘాటుగా విమర్శలు చేస్తుంటే అభిమానులు పెరుగుతారు. ఇలా ఉండేవి ఆయన అభిప్రాయాలు.
ఆయన అంచనా తప్పలేదు. కొన్నాళ్ళకు అధికార పార్టీ నుంచి పిలుపు వచ్చినట్టుంది. కొన్నేళ్ళు అలా అధికార పార్టీ అధికార ప్రతినిధిగా టీవీ చర్చలు కొనసాగించిన పిదప, ఆయన సేవలకు సంతోషించిన పార్టీ పెద్దలు ఏదో కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు.
ఆరంభంలో సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ స్టూడియోలకి వచ్చిన అతడు, అనతికాలంలోనే అధికారిక వాహనంలో రావడం మొదలు పెట్టాడు. అతడి ఎదుగుదల క్రమం, అతడి పట్టుదల, అతడి ప్రణాళిక చూసి ముచ్చట వేసేది.
నేను స్టూడియోలకు పోక చాలాకాలం అయింది. ఎప్పుడయినా ఏ టీవీలో అయినా కనబడతాడేమో అని చూస్తుంటాను.
బహుశా అతడు నిర్ణయించుకున్న తొలి లక్ష్యం నెరవేరిందేమో తెలియదు. అతడయితే కనబడడం లేదు. ఫోను కూడా చేయడం లేదు. (18-12-2020) టీవీ చర్చలు

17, డిసెంబర్ 2020, గురువారం

నా పేరులో నుంచి 'రెడ్డి' తీసేయండి..!

Journalist Diary || SATISH BABU ||




వెలుగు చూడని వార్తలు

 


చాలా ఏళ్ళ క్రితం అప్పటి ఉపరాష్ట్రపతి శ్రీ వెంకట్రామన్ హైదరాబాదు వచ్చి రాజ్ భవన్  గెస్ట్ హౌస్  లో మకాం చేశారు. అప్పుడు గవర్నర్ శ్రీమతి కుముద్ బెన్ జోషి. గవర్నర్ కార్యదర్శి గా వున్న కీర్తిశేషులు, సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ వి.చంద్ర మౌళిని వెంటబెట్టుకుని కుముద్ బెన్  గెస్ట్ హౌస్ కి  వెళ్లి మర్యాదపూర్వంగా ఉపరాష్ట్రపతిని కలిసారు.

మాటల సందర్భంలో గవర్నర్ కొంత ముభావంగా వుండడం గమనించి శ్రీ వెంకట్రామన్ ‘ఏమిటి అలా వున్నారు, ఒంట్లో బాగా లేదా’ అని పరామర్శించారు.

కుముద్ బెన్ అప్పుడు తన మనసు విప్పి ఇలా అన్నారు.

‘ఈ పత్రికల వాళ్ళు ఉన్నారే, వీళ్ళు ఏ మంచి పనిచేయబోయినా అందులో ఈకలు పీకే ప్రయత్నం చేస్తారు. మంచి పనిలో చెడు కోణం చూసే వీళ్ళ పద్దతి చూస్తుంటే పొద్దున్నే పేపరు చదవాలంటే చిరాకుగా ఉంటోంది’

దానికి వెంకట్రామన్ చిరునవ్వుతో ఇలా జవాబు చెప్పారు.

‘దీనికో చిట్కా వుంది. ఓ వారంపాటు ఏ పేపరూ చదవకుండా వుండండి. ఎనిమిదో రోజుకల్లా మనసుకు ప్రశాంతత చిక్కుతుంది

వామ్మో! సూర్యనారాయణా! – భండారు శ్రీనివాసరావు

 ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్జీవోల సమ్మె జరుగుతున్న రోజులు.

ఖమ్మంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టరు గారెకి చాలా దూరంలో వేరే జిల్లాకు బదిలీ అయింది. బదిలీ ఆపుకోవడానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉండగానే ఈ సమ్మె వచ్చి పడింది. ఖమ్మంలో ఉంటున్న మా బావగారు నాకు ఫోన్ చేసి చెప్పారు,  డాక్టరు గారు బాగా తెలిసిన వాడు, ఎవరయినా తెలిసిన వాళ్ళు వుంటే సాయం చేయమని.

 వైద్య శాఖ మంత్రి గారు బాగా పరిచయం వున్న మనిషే. వెళ్లి కలుస్తే ఆయన ముందు సమ్మె అయిపోనీ చూద్దాం అన్నారు. కాస్త ఆగి  మళ్ళీ ఆయనే అన్నారు, ‘నేను చెబుతాను కానీ ఆ సూర్యనారాయణ వున్నాడే,  ఓ మొండి ఘటం, ఓ పట్టాన ఎవడి మాటా వినడు.

ఆ సూర్యనారాయణ గారు సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి.  ఆ రోజుల్లో వైద్య శాఖ కార్యదర్శిగా వున్నారు. ఆయనని వేరే శాఖ నుంచి బదిలీ చేసి ఎక్కువ కాలం కూడా కాలేదు. ఎవరి మాట లెక్కపెట్టని  అధికారి అని పేరు. ముక్కుసూటి మనిషి. తోటి  ఐ.ఏ.ఎస్. అధికారులు కూడా ఆయనకు ఒక మాట చెప్పడానికి సంకోచించేవారు. ఇక మామూలు అధికారులు అయితే ‘వామ్మో! సూర్యనారాయణ గారా! ఆయన ఎవరి మాటా వినే రకం కాదు’ అని ముందే  తప్పుకునేవారు.

ఇక ఏమైతే అదే అయిందని నేనే సచివాలయానికి వెళ్లాను ఆయన్ని కలుద్దామని. సచివాలయం మొత్తం బోసిపోయి వుంది. ఎక్కడా చడీ చప్పుడు లేదు. ఉన్నతాధికారులు మాత్రం ఆఫీసులకు వస్తున్నారు. సూర్యనారాయణ గారి  చాంబర్స్ కు వెళ్లాను. చీటీలు ఇచ్చే అటెండర్లు లేరు. లోపల అధికారి వున్నారో లేరో చెప్పే పియ్యేలూ  లేరు. నీరవ నిశ్శబ్దంగా వుంది. నేనే తలుపు తట్టి  ‘మే ఐ క మిన్ సర్’ అన్నాను మెల్లగా. ‘యస్’ అని వినిపించింది లోపల నుంచి గంభీరంగా. తలుపు తోసుకుని వెళ్లాను.

తెల్లటి దుస్తుల్లో నల్లటి మనిషి ఒకరు కుర్చీలో కనిపించారు.

“ఎవరు మీరు? ఏం కావాలి” అన్నారాయన మరింత గంభీరంగా.

రేడియో కరస్పాండెంట్ ని అని చెప్పగానే ఆయన, నేను వచ్చింది సమ్మె సమాచారం కోసం అని అనుకుని అలాటి విషయాలు మీరు సీ ఎస్ ఆఫీసులో అడగాలి, నన్ను కాదు’ అన్నారు కరకుగా.

అప్పుడు  నేను వచ్చిన పని చెప్పాను. బదిలీ విషయంలో మీకు రికమెండ్ చేయడానికి పెద్ద పెద్దవాళ్లు కూడా జంకుతున్నారు. అంచేత నేనే మిమ్మల్ని అడుగుదామని వచ్చాను’ అని చెప్పాను మాటల్ని కూడగట్టుకుంటూ.

‘ఎవరా డాక్టరు ఎక్కడ పనిచేస్తారు అని అడిగితే  చెప్పాను వివరాలు. అవి రాసి ఉంచుకున్న చీటీ ఆయనగారి చేతికి అందించాను.

ఒకసారి చదువుకుని ఆయన కుర్చీలో నుంచి లేచారు బయటకు వెళ్ళడానికి. ఇక ఇది  అయ్యే పని కాదనుకుని నేనూ ఆయన వెంట బయటకు వచ్చాను.

చిత్రంగా ఆయన పెయ్యే టేబుల్ దగ్గర ఆగిపోయి  టెలిఫోన్ డైరెక్టరీ చేతిలోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా డి.ఎం.అండ్ హెచ్.ఓ. కి ఫోన్ చేశారు.

ఆయన లైన్లోకి రాగానే మా డాక్టరు గారి  వివరాలు చెప్పి, రిలీవ్ చేయవద్దని  అని నోటిమాటగా ఉత్తర్వులు ఇచ్చారు. ‘సార్! ఆర్డర్ టైప్ చేయడానికి స్టాఫ్ ఎవరూ లేరు’ అని అవతల నుంచి అన్నట్టు వుంది.

‘నా దగ్గర ఏమైనా వున్నారా!  నేనే డైరెక్టరీ వెతికి మీకు ఫోన్ చేశాను.. అర్ధం అయిందా’ అన్నారు సూర్యనారాయణ గారు తనదైన శైలిలో. 

అటు డి.ఎం.అండ్ హెచ్.ఓ. గారెతో పాటు ఇటు నాకూ అర్ధం అయింది, ఆయన వ్యవహార శైలి.

సూర్యనారాయణ గారెని చూడడం అదే నాకు మొదటి సారి. ఇలాంటి అధికారులు కూడా వుంటారా అని అనుకుంటూ బయటపడ్డాను.

నాకు తెలిసి ఆ డాక్టరు గారెని తర్వాత ఎవరూ కదల్చలేదు. ఖమ్మంలోనే రిటైర్ అయ్యారు.

ఇప్పుడు   ఆ అధికారీ లేరు, ఆ డాక్టరు గారూ లేరు, నా జ్ఞాపకాల్లో తప్పించి. (17-12-2020)                            

 

15, డిసెంబర్ 2020, మంగళవారం

పోట్లాడే పురోహితుడు – భండారు శ్రీనివాసరావు

 ‘‘ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి’ అన్నారు. అంటే ఒక బ్రాహ్మణుడు శాపం ద్వారా కానీ, శరం ద్వారా కానీ యుద్ధం చేయగలుగుతాడు.

అయితే ఈనాటి ఈ వ్యాస ప్రేరకుడు అయిన బ్రాహ్మణుడు యుద్ధాలు చేసేవాడు కాదు, శాపాలు పెట్టేవాడూ కాదు. కేవలం సంభావనల దగ్గర పోట్లాటకు దిగేవాడు. అదీ ఆయన అడిగినంత సంభావన ఇవ్వకపోవడం వల్ల కాదు, మనం ఇచ్చే సంభావన ఆయనకు నచ్చకపోవడం వల్ల.
ఇందులో విశేషం ఏముంది?
చాలా సందర్భాలలో విన్నదే కదా అనుకోవచ్చు. కానీ ఈ పురోహితులవారి తరహానే వేరు. అందుకే ఆయన గురించి రాయాలని అనిపించింది.
వీరి పేరు ఇంగువ వెంకయ్య గారు. మా స్వగ్రామంలో మా ఇంటి పురోహితులు. శుభాశుభ కార్యక్రమాలన్నింటికీ ఆయనే బ్రహ్మ. మా అక్కయ్యల పెళ్ళిళ్ళు, మా పెద్దన్నయ్య పెళ్లి, ఆయన నలుగురి పిల్లల పెళ్ళిళ్ళు, మా రెండో అన్నయ్య పెళ్లి ఆయన నలుగురి పిల్లల పెళ్ళిళ్ళు, మా మూడో అన్నయ్య పెళ్లి ఆయన నలుగురి పిల్లల పెళ్ళిళ్ళు ఆయనే దగ్గరుండి శాస్త్రోక్తంగా జరిపించారు. నా పెళ్లి నేనే చేసుకున్నా కాబట్టి ఆయన గారికి ఛాన్స్ దొరకలేదు. మా ఇంట్లో ఇన్ని పెళ్ళిళ్ళు చేయిస్తూ ఆయన తన పెళ్లి మాట మరచిపోయారేమో అలాగే చివరి వరకు ఘోటక బ్రహ్మచారిగానే వుండిపోయారు.
మనిషి మంచివాడే కానీ ఈయనతో రెండు సమస్యలు. అది వ్రతం కానీ, వడుగు కానీ, ఆబ్దీకం కానీ మొత్తం క్రతువు శాస్త్ర ప్రకారం జరిపించాల్సిందే. తూతూ మంత్రం వ్యవహారం కాదు. పూర్తిగా అంతా పద్దతి ప్రకారం చేయాల్సిందే. గంటలు గంటలు సాగే ఈ తంతు చూస్తూ బీపీలు, సుగర్లు వున్నవాళ్ళకు కళ్ళు తిరిగిపోయేవి. ‘అయ్యా వెంకయ్య గారూ, అందరూ పెద్దవాళ్లు, భోజనానికి ఆగలేరు, కాస్త త్వరగా లాగించండి’ అని మొత్తుకున్నా ఆయన వినిపించుకునే రకం కాదు.
మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారి కొడుకు పెళ్ళి హైదరాబాదులో జరిగితే ఆయనే వచ్చి చేయించారు. వడుగు ముందు ఇంట్లో చేసుకుని తర్వాత కళ్యాణ మంటపానికి వెళ్ళాలి. వెంకయ్య గారు తెల్లవారుఝామునే వడుగు కార్యక్రమం మొదలెట్టారు. బారెడు పొద్దెక్కినా వడుగు తంతు సాగుతూనే వుంది. అవతల పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. కానీ వడుగు ఓ పట్టాన తెమిలేలా లేదు. సాధారణంగా సంయమనం కోల్పోని మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు ఇక ఉండబట్టలేక ‘వెంకయ్యగారు మీరు ఇక్కడ వడుగు చేస్తూనే వుండండి, ఈలోపల మేము వెళ్లి ఆ పెళ్లి పని ముగించుకుని వస్తాం’ అనేసారు.
ఇక సంభావన దగ్గరికి వచ్చేసరికి వస్తుంది అసలు తంటా. ఇక్ష్వాకుల కాలం నాటి రేట్ల ప్రకారం పదో పరకో చాలనే తత్వం ఆయనది. (ఈ కధాకాలం ముప్పయ్యేళ్ళ నాటిది) తమతమ విభవానికి తగ్గట్టు ఎవరైనా వేయి నూట పదహార్లు ఇవ్వబోయినా ఆయన తీసుకోరు. తను తీసుకునే నూట పదహారు రూపాయలు లెక్కకట్టి తీసుకుని మిగిలిన డబ్బు గృహస్తుకు ఇచ్చేసి వెడతారు. కాదుకూడదు అంటే వస్తుంది తంటా. చూసేవారికి ఆయన అడిగినంత వీళ్ళు ఇవ్వడం లేదేమో, అందుకే పొట్టు పొట్టవుతున్నారు అని అపోహ పడే ప్రమాదం కూడా వుంది.
‘వెంకయ్య గారికి సంభావన ఇచ్చే వేళయింది. అందరూ లేచి అడ్డంగా నిలబడండి, ఆయనగారు సంభావన తీసుకోకుండా వెళ్ళిపోతారేమో” అని మా మూడో అన్నయ్య వెంకటేశ్వర రావు గారు అంటుండేవారు హాస్యోక్తిగా.
మా రెండో అన్నయ్య కుమారుడి పెళ్ళిలో సంభావన కింద మా అన్నగారు ఐదువేల నూట పదహార్లు ఇద్దామనుకుని కూడా వెంకయ్య గారితో తంటా ఎందుకని వేయి నూటపదహార్లు తాంబూలంలో పెట్టి ఇచ్చారు. ఆయన అది చూసి నాకు నూట పదహార్లు చాలు అని మిగిలిన డబ్బు తిరిగి ఇవ్వబోయారు. ‘మా తృప్తి కొద్దీ ఇస్తున్నాం. కాదనకండి’ అని మా అన్నయ్య ఆయనకు నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తే వెంకయ్య గారు ఇలా అన్నారు. ‘లడ్డూలు రుచిగా వున్నాయని ఐదో ఆరో తినం కదా! సంభావన కూడా అంతే. నేనెంత తీసుకోవాలో అంతే తీసుకుంటాను’ ఇదీ ఆయన వరస.
గోదానాల వల్ల లభించిన ఆవులతో వాళ్ళ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ వుండేది మా చిన్నప్పుడు. వాటిని మేపే శక్తిలేని వెంకయ్య గారి ఇంట ఆ కళకళలు ఎన్నాళ్ళు వుంటాయి. వాటిని అమ్మేయడానికి శాస్త్రం ఒప్పుకోదు. వాటిని పుష్టిగా మేపడానికి ఆదాయం సరిపోదు. అయినా సరే వెంకయ్య గారు తను నమ్మిన సిద్దాంతానికే జీవితాంతం కట్టుబడే వున్నారు. తన సంపాదనలో కొంత ఆవుల మేతకు ఖర్చు చేసేవారు. నోట్ల రూపంలో వచ్చే సంభావనలు మినహాయిస్తే నాణాలుగా వచ్చిన వాటిని ఖర్చుచేయడం వారి ఇంటా వంటా లేదు. చిల్లర డబ్బుల రూపంలో వచ్చిన సంభావనలు అన్నీ ఓ రేకు డబ్బాలో పడేసేవారు. వేయి రూపాయలుకు సరిపడా చిల్లర పైసలు ఆయన దగ్గర దొరుకుతాయని వూళ్ళో చెప్పుకుకుని నవ్వుకునేవారు. (15-12-2020)
(కింది ఫోటో: 1985లో మా పెద్దన్నయ్య పెద్ద కుమారుడు రఘు వివాహం, తర్వాత వ్రతం చేయిస్తున్న వెంకయ్య గారు)
Image may contain: 2 people, including Vani Veldurthy, people standing, child and indoor
Ramachandra Rao Bhandaru, Ramakrishna Jagarlamudi and 110 others
54 Comments
7 Shares
Like
Comment
Share
Comments