6, అక్టోబర్ 2020, మంగళవారం

మాటలు మింగే తిమింగలాలు

 'మీ గొంతు పీలగా అనిపించింది’  

‘మొదలు పెట్టినప్పుడు దూకుడుగా మొదలెడతారు. పోను పోను తేలిపోతున్నట్టుగా వుంటుంది. ఇక వాక్యం ముగించేటప్పుడు ఆఖరు పదాలు మింగేస్తునారు’ 

నాలుగు దశాబ్దాలకు పూర్వం నేను రేడియో ఉద్యోగంలో చేరి వార్తావాహిని కార్యక్రమాన్ని వారానికి ఒకసారో, రెండుసార్లో సమర్పిస్తున్నప్పుడు దాన్ని రేడియోలో విని నాతో మా ఆవిడ అన్న మాటలు ఇవి.

నా ప్రోగ్రాం వినే అవకాశం నాకు  లేకపోవడం వల్ల మా ఆవిడ మాటలే వేదం అనుకుని కొంత బాణీ మార్చుకునే ప్రయత్నం చేశాను. ఈలోగా వారం వారం ‘జీవన స్రవంతి మొదలయింది. ‘తినగ తినగ వేము తియ్యనగును అన్నట్టు నా గొంతుకు శ్రోతలు అలవాటు పడిపోవడంతో నా భార్య మాటలు చెవిన పెట్టడం మానేసాను.

ఇప్పుడు టీవీల్లో కొందరి స్వరాలు వింటుంటే ఈ పూర్వపు రోజులు గుర్తుకొస్తున్నాయి. ఒక్కోసారి అనిపిస్తుంది, వీళ్ళకు మంచీచెడూ చెప్పే  భార్యలు లేరా, లేక చెవికి ఎక్కించుకుపోవడం అనే నా చెడ్డ అలవాటు వీరికీ ఉందా అని. (2020)   

 

5, అక్టోబర్ 2020, సోమవారం

వ్యక్తులు – వ్యవస్థలు – భండారు శ్రీనివాసరావు

 ఒక వ్యక్తి అన్నాక ఏదో ఒక వ్యవస్థలోని వాడే అవడానికి అవకాశాలు ఎక్కువ.

ఉదాహరణకు ఎవరో ఒక జర్నలిస్టు ఎవరినో బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఒక పోలీసు అధికారి పెద్ద మొత్తంలో లంచం తీసుకుని పట్టుబడతాడు. ఒక బ్యాంకు అధికారి ఫ్రాడ్ కేసులో దొరికిపోతాడు. ఒక ఆధ్యాత్మిక గురువు లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కుంటాడు. ఒక కులానికి చెందిన వ్యక్తిపై ఇలాంటివే ఏవో అపనిందలు వస్తాయి. ఈ విషయాలపై మీడియాలో చర్చలు జరుగుతాయి. చర్చల్లో పాల్గొనే వాళ్ళు అసలు విషయం వదిలిపెట్టి ఆరోపణలు ఎదుర్కుంటున్న వారి వ్యవస్థలకు వాటిని ఆపాదిస్తూ మాట్లాడతారు. ఆ వ్యవస్థలు, కులాలకు చెందినవాళ్ళు కూడా తమ వ్యవస్థలపై జరుగుతున్న దాడిగానే పరిగణిస్తారు. ఈ క్రమంలో వ్యక్తులకు సంబంధించిన అంశాలు వ్యవస్థలకు చెందిన విషయాలుగా రూపాంతరం చెందుతాయి. అసలు విషయం, అసలు మనుషులు మరుగున పడిపోయి అనవసరమైన అంశాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి.

రాజ్యాంగానికి మూల స్తంభాలు అయిన మూడు వ్యవస్థలు, వాటికి అనుబంధం అయిన నాలుగో స్తంభం మీడియా అలాగే ఈ సమాజంలోని అన్ని వ్యవస్థలలో ఇదే జరుగుతోంది. నిజంగా వ్యవస్థపై దాడి జరుగుతుంటే ఆ వ్యవస్థకు చెందిన వారు దానిని కాపాడుకోవడం కోసం ఎంతగా ఉద్యమించినా దాన్ని తప్పుపట్టలేము. కానీ జరుగుతున్న కధ వేరేగా వుంది. వ్యక్తుల లోపాలను వ్యవస్థల లోపాలుగా ఎత్తి చూపడం జరుగుతోంది. వ్యక్తులపై ఆరోపణలను వ్యవస్థలపై ఆరోపణలుగా పరిగణించడం వల్ల వ్యవస్థల నడుమ ఘర్షణలకు దారితీస్తోంది.

సున్నితంగా చెప్పే విషయం కనుక ఇంతకంటే సూటిగా చెప్పడం నాకు సాధ్యపడడం లేదు. (October,2020)

క్షణాల్లో లక్షలు - భండారు శ్రీనివాసరావు

న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఒక కోటి రూపాయలు సంపాదించాలంటే ఎన్నేళ్ళు కష్టపడాలి? యెంత కష్ట పడాలి?
అదే గంటకు అక్షరాలా తొంబై కోట్లరూపాయలు సంపాదించాలంటే –
ఇది కాలము, దూరము, కాలము, సమయము లెక్కకాదు, లెక్కకట్టి చెప్పడానికి. కానీ ఈ ప్రశ్నకూ ఈ మధ్య జవాబు దొరికింది.
అపర కుబేరుడు రిలయన్స్ సంస్థాపక అధినేత దీరూ భాయ్ అంబానీ పెద్ద కుమారుడు, ఆగర్భ శ్రీమంతుడు ముఖేష్ అంబానీ ఆదాయపు లెక్కల్లో ఈ లెక్క వెలుగులోకి వచ్చింది. ఈ లెక్కను నిమిషాల్లోకి, సెకన్లలోకి లెక్కకట్టి చూస్తే. ఈ చిన్ని పోస్టు చదివేలోగా ముఖేష్ అంబానీ రాబడి ఒక సగటు జీవి నెల జీతాన్ని దాటిపోతుంది.
కుబేరులు, కుచేలురు సహజీవనం చేస్తున్న భారతం మనది.

2, అక్టోబర్ 2020, శుక్రవారం

సర్వం జగన్నాధం – భండారు శ్రీనివాసరావు

 

సూత్రాలు లేవు, సిద్ధాంతాలు లేవు. సొంత అవసరాలే కానీ సొంత పార్టీల అవసరాలతో నిమిత్తం లేదు. ఇవ్వాల ఇక్కడ. రేపు అక్కడ. ఎల్లుండి మరెక్కడో! ఎక్కడికి పోయినా మడికట్టుకుని అక్కడే వుండాలని రూలేమీ లేదు. అక్కడ ఇమడలేకపోతే, కోరుకున్న పదవి రాకపోతే, అనుకున్నది అనుకున్నట్టు జరక్కపోతే, ఏదైనా తేడా పాళాలు వస్తే ఇబ్బందేమీ లేదు. ఎంచక్కా ఎగిరి మళ్ళీ గోడదూకవచ్చు. అడిగేవాళ్ళు లేరు, అడ్డుపెట్టేవాళ్ళు లేరు.

వెనకటి రోజుల్లో నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి సొంత బావాబావమరదులు అయినా ఒకరు కాంగ్రెస్ లో, ఇంకొకరు కమ్యూనిస్టు పార్టీలో లేరా అంటే వున్నారు. కానీ వారిది అవకాశవాదం కాదు, సిద్దాంత ప్రాతిపదిక.

ఇప్పుడు అలా కాదే. కొందరు వున్నారు. వాళ్ళు పార్టీ మారరు, పార్టీకి, పదవికి రాజీనామా చేయరు, పిల్లల్ని మాత్రం వెంటబెట్టుకువెళ్లి వేరే పార్టీలో చేర్పించి ఆ పార్టీ కండువాలు కప్పిస్తారు. మరొకాయన గెలిచిన పార్టీలోనే వుంటారు. అసెంబ్లీలో మాత్రం అధికార పార్టీకి మద్దతుగా మాట్లాడతారు. ఇంకొకాయన తరహానే వేరు. పార్టీలో వుంటూనే పార్టీ విధానాలను అస్తమానం పనిగట్టుకుని విమర్శిస్తూ వుంటారు. ప్రతిపక్షాలు కూడా ఆ స్థాయిలో గొంతు పెంచరు. ఉదయం సాయంత్రం విసుగూ విరామం లేకుండా అదేపనిగా ప్రతిపక్ష బాణీలో ఆయన తన వాణిని వినిపిస్తుంటారు.
ఇంకొందరు వున్నారు. తమ నాయకుడు పార్టీ మారగానే వీళ్ళూ పొలోమంటూ కొత్త పార్టీలో చేరిపోయారు. వీరిది కొంత వింత పరిస్థితి. ఏదో సామెత చెప్పినట్టు మనసొకచోటా మనువొక చోటా.
ఇప్పుడే మరొక మాజీ ఎంపీ ఎప్పుడో తనను వదిలించుకున్న పార్టీలో చేరిపోయాను అంటున్నారు. ‘ఇక నాదేమీ లేదు, పార్టీ అధిష్టానం ఇష్టం’ అని ముక్తాయింపు కూడా. ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించి కూడా ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. ఇన్నేళ్ళు ఏ పార్టీలో వున్నారు అంటే అది యక్ష ప్రశ్నే. బహిష్కరించిన పార్టీ వాళ్ళు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారా అంటే దాని ఊసే వుండదు.

బాపు ముత్యాల ముగ్గు సినిమాలో హలం పాత్ర రావు గోపాలరావు పాత్రతో అంటుంది, 'నాలుగు రోజులు ఒక చోట డూటీ వేయవుగదా, ఎంతమందిని అని గుర్తు పెట్టుకుంటాను' అని. సందర్భం కాకపోయినా ఎందుకో ఆ డైలాగు గుర్తుకు వచ్చింది.

ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాలేదు. వలస కోయిలలు ముందే కూయడం మొదలుపెట్టాయి. జమిలి ఎన్నికల మీద ఆశలు పెంచుకుంటున్నారేమో. ఇక ఎన్నికల ఘడియ దగ్గర పడితే పరిస్థితి ఏమిటి? శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు అన్నీ ఒక్కమారు ఎత్తిన దృశ్యం కనబడుతుందేమో.

శని సింగాపూర్ లో ఇళ్ళకు తలుపులు, గడియలు వుండవంటారు.
అలాగే, రాజకీయ పార్టీలవాళ్ళు ఎవరైనా సరే స్వేచ్ఛగా లోపలకు రావడానికి, బయటకు వెళ్ళడానికి వీలుగా తలుపులు, కిటికీలు, ద్వారబంధాలు కూడా పెరికి అవతల పారేసినట్టున్నారు.

ఎంత స్వేచ్ఛో భారత ప్రజాస్వామ్యంలో.
ప్రజలకు కాదు సుమండీ, పార్టీలకు, వాటి నాయకులకు.
(02-09-2020)

1, అక్టోబర్ 2020, గురువారం

వంటింట్లో నుంచి మీ ఇంట్లోకి

ఓ మంచి పని పెట్టుకున్న మా మేనకోడలు ఫణి  - భండారు  శ్రీనివాసరావు


ఒసేవ్ వెంకట్రాముడూ... ఏవైనా నోట్లో వేసుకోవడానికి పాలకాయలో, ఇంత కారప్పూసో నా మంచం పక్కన పెట్టి పోరాదే!’ అంటుండేది మా బామ్మ రుక్మిణమ్మగారు  వరండాలో మంచం మీద కూర్చుని  తావళం  తిప్పుకుంటూ. వెంకట్రాముడు అంటే ఆమెకు కోడలు, మాకు అమ్మ అయిన వెంకట్రావమ్మగారు.  ఓ పక్కన కూర్చుని విస్తళ్ళు  కుడుతున్న  మా అమ్మగారు  అత్తగారి మాట ఔదలదాల్చి, లేచి వెళ్లి,  మడి  బీరువాలో దాచి ఉంచిన కారప్పూస
, పాలకాయల వంటి  చిరుతిండ్లను  ఓ గిన్నెలో వేసి అందించేది.  
అదేమిటో ఏళ్ళు మీద పడుతున్న కొద్దీ చిరుతిళ్ళ మీద గాలి మళ్ళుతుందనే వారు, మా చిన్నప్పుడు పెద్దవాళ్ళు. అలా ఏదో ఒకటి నోట్లో వేసుకుని నములుతుంటే అదో కాలక్షేపం అనేవాళ్ళు కూడా వున్నారు.

ఇప్పుడయితే  చిరుతిండ్లదే రాజ్యం. పిల్లలూ పెద్దలూ వయసుతో సంబంధం లేకుండా గంటగంటకూ  ఏదో ఒకటి నోట్లో వేసుకోకపోతే తప్పేట్లులేదు.

పేరుకు చిరుతిండి అన్నమాటే కానీ ఈ గవ్వలూ, పాలకాయలూ, కారప్పూసా, సున్నుండలు, కజ్జికాయలు వగైరా  చేయాలంటే పెద్ద పనే. ఆ పని తెలిసిన వాళ్లకు కూడా చేసుకునే ఓపికలు, తీరికలు లేవు. పూర్వం ఏ అమెరికాలోనో వుండే వాళ్ళు ఇక్కడకు వచ్చినప్పుడల్లా వెళ్ళేటప్పుడు గుర్తు పెట్టుకుని మరీ కొనుక్కుని పోయేవారు. ఇప్పుడు అంటే ఇవన్నీ వాళ్లకు ఆన్ లైన్లో దొరుకుతున్నాయనుకోండి.

కోరిక వుండి ఇంట్లో ఈ చిరు వంటకాలు చేసుకోలేని వాళ్ళకోసం  మా మేనకోడలు ఫణికుమారి  ఓ పని పెట్టుకుంది. ఈ కరోనా తీరిక కాలంలో ఇంట్లోనే  తయారుచేసిన చిరుతిండ్లను తెలిసిన వారికి కొరియర్ ద్వారా పంపిస్తోంది. మా మేనకోడలు అని కాదు, ఇలాంటి వంటకాలు చేయడంలో చేయితిరిగిన మనిషి. డాక్టర్లకు హస్తవాసి మాదిరిగానే కొందరు చేసే వంటలకు వాళ్ళ చేతి మహిమేమో కానీ ఎక్కడలేని రుచి వస్తుంది. మా చుట్టపక్కాల్లో ఫణికి ఈ మంచి పేరు పుష్కలంగా వుంది. దానికి తగినట్టు ఓపికలో  ‘వండనలయదు వేవురు వచ్చిరేని’  అనే ప్రవరాఖ్యుడి భార్య సోమిదేవమ్మ  టైపన్నమాట. 


        

  చిరుతిండ్లే కాదు, నాలుగు రోజులు  నిలవ వుండే పచ్చళ్ళు, పొడులు ఇంకా ఎన్నో ఆన్ లైన్లో ఆర్డరు చేస్తే ఇంటికి వచ్చి వాలిపోతాయి. ఇదిగో లింకు:  

29, సెప్టెంబర్ 2020, మంగళవారం

అమెరికన్ ప్రత్యక్ష ప్రసారంలో మాటల యుద్ధం

 

అమెరికన్ కాలమానం ప్రకారం మంగళవారం నాడు ఆ దేశంలోని అత్యధికశాతం జనాభా టెలివిజన్ సెట్లకు అతుక్కుపోతారు. ప్రతి నాలుగేళ్ళకు ఓసారి ఇలా జరగడం అనేది గత అరవై ఏళ్ళుగా ఓ  ఆనవాయితీగా మారింది.

వచ్చే నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకోసం మంగళవారం నాడు ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎన్నికల్లో ఆయనతో తలపడనున్న ప్రత్యర్థి జో బిడెన్  ఓహియో  రాష్ట్రంలోని  క్లీవ్  లాండ్ లో  ఒకే వేదికపై తలపడనున్నారు. తమని గెలిపిస్తే దేశానికి ఏమి చేయబోతున్నారో  ప్రజలకు తెలియచెప్పడానికి ఈ ఏర్పాటు. రిపబ్లికన్ పార్టీ, డెమోక్రాటిక్ పార్టీ అభిమానులే కాకుండా యావత్ దేశ ప్రజలకు ఈ కార్యక్రమం పట్ల ఆసక్తి మెండు. బరిలో ఉన్న అభ్యర్ధుల ప్రసంగ  శైలి, హావభావాలు, వేదికపై వారి ప్రవర్తన ఇవన్నీ ఓటింగు సరళిపై ప్రభావం చూపుతాయనే నమ్మకం ప్రబలంగా ఉన్న కారణంగా రాజకీయ పార్టీలు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా సీరియస్ తీసుకుంటాయి. ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రసంగ పాఠాలను తయారు చేస్తారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్  ముఖాముఖి తలపడే ఈ చర్చకు ఫాక్స్ న్యూస్ ఛానల్ ప్రతినిధి క్రిస్ వాలెస్  మోడరేటర్ గా వ్యవహరిస్తారు. ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వీక్షిస్తారని అంచనా.   

1960  నుంచి ఈ ఆనవాయితీ మొదలయింది. ఆ కార్యక్రమాన్ని టీవీల ద్వారా దేశ వ్యాప్తంగా ప్రసారం చేశారు. ఈ చర్చలో నాటి డెమోక్రాటిక్ అభ్యర్ధి జాన్ ఎఫ్. కెనడీ, రిపబ్లికన్ అభ్యర్ధి రిచర్డ్ నిక్సన్  పాల్గొన్నారు. వయసు రీత్యా చిన్నవాడయిన కెనడీది  సహజంగానే పైచేయి అయింది. అప్పటికే అస్వస్థతకు గురై ఆసుపత్రిలో వుండి వచ్చిన నిక్సన్ నీరసంగా కనిపించారు. ఆ రోజుల్లో అమెరికాలో రంగుల టెలివిజన్లు లేవు. కెనడీ ధరించిన బ్లూ సూట్  బ్లాక్ అండ్ వైట్ టీవీల్లో చాలా ఆకర్షణీయంగా కనిపించింది. నిక్సన్ వేసుకున్న కోటు బూడిద  రంగు. స్టూడియోలో బ్యాక్ గ్రౌండ్ రంగు కూడా బూడిద రంగు కావడంతో అందులో కలిసి తేలిపోయింది. మొత్తం మీద కెనడీ గెలుపుకు ఆనాటి చర్చ చాలావరకు దోహదం చేసిందనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. చెప్పినదానికన్నా ప్రజలు చూసిందే గుర్తు పెట్టుకున్నారు అనే  వ్యాఖ్యలు వినవచ్చాయి.

మొత్తం మీద అరవై ఏళ్ళ క్రితం మొదలయిన ఈ ముఖాముఖి చర్చాకార్యక్రమం ఓ సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది.

2016 లో జరిగిన ఎలెక్షన్ డిబేట్  కొంత వివాదాస్పదం అయింది. అప్పుడు డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ పోటీ పడ్డారు. ట్రంప్ మహాశయుడు మాట తూలడంలో ప్రసిద్ధి. స్టేజీ మీదనే హిల్లరీ క్లింటన్ ను రాక్షసి అనేసారు. అంతేకాకుండా ఆమె మాట్లాడుతున్నంత సేపూ వెనకాలే తిరుగుతూ, దాదాపు  మీదకు ఒరిగినంత పనిచేశారు. ఇదంతా టీవీల్లో ప్రజలు చూసారు.

‘ఆ సమయంలో ట్రంప్ ప్రవర్తన నాకు ఏవగింపు కలిగించింది. వెనక్కు జరుగు అని గట్టిగా గద్దిద్దామనిఅనుకున్నాను. కానీ సభామర్యాదకు కట్టుబడి ఊరుకున్నాను.” అని ఆ తరువాత తన ఆత్మకధలో రాసుకున్నారు, మిసెస్ క్లింటన్.

ఈ సారి ఏమి జరుగుతుందో, ఎలా  జరుగుతుందో చూడాలి మరి. (29-09-2020)

కింది  ఫోటో : 1960 లో జరిగిన మొదటి డిబేట్ 


28, సెప్టెంబర్ 2020, సోమవారం

గుడిసెలో వాన – భండారు శ్రీనివాసరావు

 

చలి వొంటిని చుట్టినట్టు పట్టె పాడు ముసురు

వెలవదాయ  ఆగదాయ మనసంటది ఉసురు 

పొయ్యి తడిసె కట్టె బిగిసె ఎట్ట కాగు ఎసరు

గూటిపైన తడవనట్టి ఎండుటాకు గుంజి  

కూరనార దేవుడెరుగు, కాయాలిక గంజి

 

కలిగినింట గ్యాసువంట

లేదుకదా తంటా

చినుకులుతో ఆరదు కద

పేదకడుపు మంట

 

కడుపు చల్ల కదలకుండ
ఏసీల్లో టీవీలతో

గడిపెటోని

కేముంటది కడుపులోన దిగులు

వానయినా వొగ్గయినా పేదోడికె కద గుబులు