17, జులై 2020, శుక్రవారం

నిలువెత్తు వెంకన్న

మూడేళ్ళ నాటి ఓ పచ్చి జ్ఞాపకం - ఓ పచ్చని జ్ఞాపకం

నిలువెత్తు వెంకన్న
అండపిండ బ్రహ్మాండాలను మించినవాడు, అణువులో కూడా ఇమిడేవాడు ఆయనకి చిన్నా పెద్దా తేడాలు ఏమిటి?
అయినా మనిషి కళ్ళకు, మనిషి మనసుకు అన్నీ కొలతలే! యెంత పెద్దగా వుందో అని అనుకోకుండా ఉండలేం.
ఈ వేంకటేశ్వర స్వామి కొయ్య విగ్రహం మా అన్నయ్య మూడో కుమారుడు లాల్ బహదూర్ భండారు ఇంట్లో కొలువు తీరింది.
ఈ చక్కని చెక్క బొమ్మ లాల్ వాళ్ళ ఇంటికి చేరడానికి ఓ చిన్న నేపధ్యం వుంది. అదేదో మా అన్నయ్య భండారు రామచంద్ర రావు గారి మాటల్లోనే:

"ఇంత పెద్ద స్వామి వారి విగ్రహం మా అబ్బాయి లాల్ ఇంటికి రావడానికి ఒక చిన్న సంఘటన ఉంది . ఆ విగ్రహాల షాప్ లో విధేయుడుగా చాలా సంవత్సరాల నుంచీ పనిచేస్తున్న వ్యక్తికి ఆ షాపు యజమాని ఈ విగ్రహాన్ని బహుమతి గా ఇచ్చాడు . ఆ వ్యక్తి మా అబ్బాయి ఇంట్లో కూడా చిన్న చిన్న పనులు చేస్తూ మా అబ్బాయికి , కోడలుకు సన్నిహితం గా ఉంటాడు .మా అబ్బాయి కుటుంబం పట్ల అభిమానం , కృతజ్ఞతలతో ఒకరోజు చెప్పకుండా వచ్చి ఈ దేవుడు మీ ఇంట్లోనే ఉండాలి అంటూ పెట్టిపోయాడు .చాలా గొడవ చేసి ,బలవంతం చేస్తే ఏదో కొంచెం డబ్బులు అతి కష్టం మీద తీసుకున్నాడు .
చిన్న వాళ్లకు కూడా పెద్ద హృదయాలు ఉంటవి అనటానికి ఆ షాప్ ఓనర్ మరియు చిన్న పనులు చేసుకునే ఆ వ్యక్తి ఇద్దరూ నిదర్శనం .
మా తమ్ముడి భార్య మా పిల్లలను తన పిల్లలాగా చూసుకొనేది. తను ముచ్చట గా తీయించుకున్న ఫోటో ఇది.



15, జులై 2020, బుధవారం

అనుకున్నామని జరగవు అన్నీ .......

రాత్రి మిత్రుడు భగీరధ ఫోన్ చేసాడు.  క్షేమ సమాచారాలు కనుక్కున్నాడు. ఆయనకీ నాకూ ఓ బాదరాయణ సంబంధం వుంది. ఇద్దరమూ ఒకప్పుడు ఆంధ్రజ్యోతి ఉద్యోగులమే. ఆయన సినిమా విలేకరి. నేను అది కాక మిగిలినవి. హైదరాబాదు వచ్చినప్పుడు చిక్కడపల్లిలో దగ్గర దగ్గరలో అద్దెకు వుండేవాళ్ళం. సినిమాలకు సంబంధించి చాలా విషయాలు ఆకళింపు చేసుకున్నవాడు. సహృదయుడు కావడం వల్ల  వృత్తిగతంగా ఏర్పడ్డ పరిచయాలను నాలుగు కాలాల పాటు పదిలపరచుకోగలిగాడు. ఆ అనుభవసారంతో అనేక పుస్తకాలు రాశాడు. మనిషి వున్నప్పుడు లేనప్పుడు కూడా ఆమనిషిని గుర్తు చేసేవి ఆ పుస్తకాలే అంటాడు గర్వంగా.

మాటల్లో అడిగాడు మీ రేడియో అనుభవాలను కూడా గ్రంధస్తం చేయొచ్చుకదా అని. ఫేస్ బుక్ మిత్రుల్లో కూడా అనేకమంది నాకు ఈ సలహానే ఇచ్చారు. సినిమాలు చూసేవాడు చూడాలి. సినిమాలు తీయాలని అనుకోకూడదు, అనుకుంటే  చేతులు కాల్తాయి అనేది నా రొటీన్ జవాబు.

ఈ జవాబుకు జవాబా అన్నట్టు అమెరికా నుంచి ప్రసిద్ధ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారు నాకొక మెసేజ్ పంపారు.  ఫేస్  బుక్ లో  నా రేడియో రోజుల అనుభవాలు చదివాననీ, వాటిని తాము ఒక పుస్తకంగా తీసుకు వస్తాననీ. ఆయన పనుపున ఓ పెద్ద మనిషి మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. అన్నీ కంప్యూటర్ లో వున్నాయి. ఎవరినైనా అడిగి కాపీలు తీసి పంపిస్తానని చెప్పి పంపించేశాను. ఈలోగా కరోనా లాక్ డౌన్ వచ్చి పడింది. ఆ ప్రతిపాదన ప్రస్తుతానికి అటక మీద పదిలంగా వుంది.

వినాయకుడి పెళ్లి అంటే మాటలా! ఎన్నో కలిసిరావాలి.                    


13, జులై 2020, సోమవారం

ఆడని సినిమాలు


నాకు ఊహ తెలిసినప్పటినుంచి, తెలియక ముందు నుంచి గత డెబ్బయి అయిదేళ్లకు పైగా సినిమాలు ఆడుతూనే వున్నాయి. వాటిల్లో బాగా ఆడిన సినిమాలు, సరిగా ఆడని సినిమాలు అంటూ ఉండేవి కానీ అసలు సినిమాలు  ఆడని రోజులు ఉండేవి కావు. కర్ఫ్యూలు, బంద్ ల సందర్బాలలో సినిమాహాళ్ళు మూసేసినా అది తాత్కాలికం. చిన్నప్పుడు మా వూళ్ళో సినిమా హాలు లేదు కాని పొరుగున మూడుమైళ్ళ దూరంలో వున్న ఊళ్లలో టూరింగు టాకీసులు ఉండేవి. అలాంటిది జీవితంలో మొట్టమొదటిసారి  ఉంటున్న ఊళ్లోనే కాదు యావత్ దేశంలో ఎక్కడా సినిమాలు ఆడని పరిస్తితి కనిపిస్తోంది. ఒక్కరోజు కాదు, నాలుగు మాసాలుగా ఇదే పరిస్తితి. ఈ శతాబ్దంలోనే కాదు,  గత శతాబ్దంలో సయితం  ధియేటర్లు వుండికూడా  ఎక్కడా సినిమాలు ఆడకపోవడం అన్నది  ఇదే  మొదటిసారి. గతంలో టీవీలు వచ్చిన కొత్తల్లో అనుకునేవాళ్లు ఇక సినిమాల శకం ముగిసిపోయిందని. అలా జరగలేదు. పైగా సినీరంగం మరింత విస్తరించింది.

ఇప్పుడు కరోనా పుణ్యమా అని ఆ దశ కూడా చూస్తున్నాం. ఇది తాత్కాలికం కావాలని కోరుకుందాం. ఎందుకంటే ఈ రంగంలో కోటికి పడగలెత్తినవాళ్ళతో పాటు పూటగడవని వాళ్ళు కూడా వున్నారు. (13-07-2020)       


8, జులై 2020, బుధవారం

ఎప్పటికీ గుర్తుండే పేరు వై.ఎస్.ఆర్.


దేశవ్యాప్తంగా, మీడియాలో, పత్రికల్లో అత్యధికంగా వినపడ్డ, కనపడ్డ పదం వైఎస్సార్. ఆ పేరు వినబడుతూనే వుంటుంది కానీ, ఇక ఆ రూపం కనబడే అవకాశమే లేదు. ఒక వ్యక్తి గుణగణాలను సమాజం సంపూర్తిగా అవగాహన చేసుకోవడం జరిగేది అతడి మరణం తర్వాతనే అన్నది రాజశేఖరరెడ్డి గారి విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజమైంది.

'రాజశేఖరా!నీపై మోజు తీరలేదురా!' అని తెలుగు ప్రజానీకం రెండోపర్యాయం ఆయనకు అధికార పగ్గాలు అప్పగించి వంద రోజులు నిండీనిండకుండానే, రాజశేఖరుడికి నూరేళ్ళు నిండిపోవడం అత్యంత విషాదకరం.

'రాజసాన ఏలరా!' అని మనసారా కోరుకున్న ప్రజలకు ఆయన ఆకస్మిక మరణం విధి విధించిన శాపం.

అర్థవంతమైన జీవితాలెప్పుడూ అర్ధంతరంగానే ముగిసిపోతుంటాయి. మాట తప్పని మనిషిగా, మడమ తిప్పని వీరుడిగా పేరు తెచ్చుకున్న వైఎస్సార్-అరవై యేళ్ళు రాగానే రిటైర్ అయిపోతానన్న మాటని నిలబెట్టుకుంటూ, జీవితం నుంచే రిటైర్ కావడం అన్నది-ఆయన పధకాల ద్వారా బతుకులు పండించుకుంటున్న బడుగు జీవుల దురదృష్టం.

1978 నుంచి ఇప్పటివరకూ ఒక జర్నలిష్టుగా ఆయన్ని కలుసుకున్న సందర్భాలు అనేకం వున్నాయి. విలేకరులను విందు సమావేశాలకు ఆహ్వానించినప్పుడు ఆయన తరహానే వేరుగా వుండేది. బిగుసుకుపోయినట్టు వుండడం, మర్యాద కోసం మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికే విరుధ్ధం. నవ్వులో స్వచ్చత, పిలుపులో అత్మీయత వుట్టిపడేవి. నమ్మినవాళ్ళని నట్టేట ముంచకపోవడం, నమ్ముకున్నవాళ్ళకోసం యెంతకైనా తెగించడం జన్మతః అబ్బిన గుణాలు. వీటివల్ల, రాజకీయ జీవితంలో మేలు కన్న కీడే ఎక్కువ జరిగిన సందర్భాలు వున్నా, ఆయన లెక్కపెట్టింది లేదు. తీరు మార్చుకున్నదీ లేదు. ఈ విలక్షణ లక్షణమే వైఎస్సార్ కు రాష్త్రవ్యాపితంగా అభిమానులను తయారుచేసిపెట్టింది. ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా, రాష్త్రంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ తరపున ప్రచారం చేయగల ఖలేజాను ఆయనకు కట్టబెట్టింది.
1975 లో నేను రేడియో విలేకరిగా హైదరాబాదులో అడుగుపెట్టిన మూడేళ్ళ తరవాత రాజశేఖరరెడ్డి గారు తొలిసారి శాసన సభకి ఎన్నిక కావడం, మంత్రి పదవి చేపట్టడం జరిగింది. వయస్సు మళ్ళినవాళ్ళే రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయానికి భిన్నంగా యువరక్తం రాజకీయ రంగంలోకి రావడం అప్పుడే మొదలయింది.

కొంచెం అటు ఇటుగా రాష్త్ర రాజకీయాల్లో అడుగిడిన రాజశేఖరరెడ్డి గారు, చంద్రబాబు నాయుడుగారు ప్రాణ స్నేహితులుగా మసలిన రోజులకు నేను కూడా సాక్షిని కావడం యాదృచ్చికం. మంత్రి పదవి తనను ముందు వరించినప్పటికీ- చంద్రబాబు నాయుడు గారు సైతం మంత్రి అయ్యేంత వరకూ ఆయన పడ్డ ఆరాటం, ఆనాటి జర్నలిష్టులందరికీ తెలుసు.



రాజశేఖర రెడ్డిగారిని నేను మొదటిసారి చూసింది, ఆ రోజుల్లొ సచివాలయానికి కూతవేటు దూరంలో వున్న సరోవర్ హోటల్ (ఇప్పుడు మెడిసిటి హాస్పిటల్) టెర్రేస్ మీద. సచివాలయంలో జరిగిన ఒక కాల్పుల సంఘటన దరిమిలా వివరణ ఇచ్చేందుకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భం అది. అప్పట్లో ఆయన ఒక తరహా మీసకట్టులో కనిపించే వారు. కానీ, కపటం లేని మందహాసానికి మాత్రం అప్పటికీ, ఇప్పటికీ ఆయనదే కాపీ రైట్.

ఇటు హైదరాబాదులోనూ, అటు ఢిల్లీలోనూ వైఎస్సార్ నివాసాలు జర్నలిష్టులతో కళకళలాడుతూవుండేవి. వేళాపాళాతో నిమిత్తంలేకుండా ఆ ఇళ్ళకి వెళ్ళివచ్చే చనువు వుండేది. సుదీర్ఘకాలం రాజకీయరంగంలో కొనసాగడం వల్ల, పేరుతో పిలిచి పలకరించగల జర్నలిష్టు స్నేహితులు ఆయనకు రాష్త్రంలోని అన్ని ప్రాంతాల్లో వుండడం సహజమే.

2004 లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి కాగానే, ఆయనతోవున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని, కేవీపీ గారి ద్వారా నా మనసులోని మాటని ఆయన చెవిన వేశాను. అప్పటికే కొన్ని ప్రైవేటు టీవీ ఛానళ్ళు రంగప్రవేశం చేసినందువల్ల, రేడియో కేంద్రానికి వచ్చి తొలి సందేశం రికార్డు చేయడం అన్నది కొత్త ముఖ్యమంత్రికి కొద్దిగా ఇబ్బందే. అయినా, ఆయన నా మాట మన్నించి, నేరుగా ఆకాశవాణి కేంద్రానికి వచ్చారు. అలాగే, హైదరాబాదు దూరదర్శన్ లో నేను రిటైర్ కావడానికి ముందు కూడా ఆయన స్టూడియోకి వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన రెండేళ్ళకే నా విలేకరిత్వానికి తెరపడింది. అయినా, ఆ తర్వాత కూడా, వార్షికంగా నిర్వహించే విందు సమావేశాలకు నాకు ఆహ్వానం అందుతూనే వుండేది. రిటైర్ అయిన తర్వాత చాలా రోజులకు జరిగిన, నా రెండో కుమారుడి వివాహానికి, ముఖ్యమంత్రిగా యెన్నో పని వొత్తిళ్ళు వున్నప్పటికీ హాజరై ఆశీర్వదించి వెళ్ళడం, నా పట్ల వారికున్న వాత్సల్యానికి మచ్చుతునకగా భావిస్తాను.

ఆయన ప్రతిపక్షనాయకుడిగా వున్నరోజుల్లో ఎప్పుడైనా కాలక్షేపంగా కలుసుకున్న సందర్భాల్లో రాజకీయాల ప్రస్తావన వచ్చినప్పటికీ, ఆయన నాతో సరదా కబుర్లనే ఇష్టపడేవారు. రేడియో విలేకరిగా నాకున్న పరిమితులను ఆకళింపు చేసుకోవడమే కాకుండా, 'శ్రీనివాసరావుని ఇబ్బంది పెట్టకండయ్యా!' అని తోటి జర్నలిష్టులకి సర్దిచెప్పేవారు.

ఒక విలేకరికి, ఒక రాజకీయనాయకుడికి నడుమ సహజంగావుండే సాధారణ సంబంధాన్ని మహోన్నతంగా పెంచి పెద్ద చేసిన పెద్దమనసు ఆయనది.

రాజశేఖరరెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి నా కైమోడ్పులు.

5, జులై 2020, ఆదివారం

అస్వతంత్రుడైన స్వతంత్రుడు శ్రీ రోశయ్య

ఈరోజు (04-07-2020) శ్రీ రోశయ్య పుట్టినరోజును పురస్కరించుకుని సూర్య పత్రికలో .....
 
తొలిసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు, మళ్ళీ తరవాత రోశయ్య ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పుడు,  వారికి ముందున్న ముఖ్యమంత్రులు, అంటే నందమూరి తారక  రామారావు, రాజశేఖరరెడ్డి  ఈ ఇరువురు కూడా ప్రజల మనస్సులను ముందు గెలుచుకుని తరువాత ఎన్నికల్లో గెలిచి  అధికారంలోకి వచ్చినవారే కావడం గమనార్హం. ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన పధకాలే కాకుండా, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదనంగా  అనేక   ప్రజాకర్షక పధకాలను ప్రకటించి, అమలు చేసిన ఘనత వారిది. తాము  మాత్రమే వాటిని అమలు చేయగలరన్న విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించి, పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని రగిలించి అధికార పీఠం అధిరోహించిన చరిత్ర కూడా  వారిదే.
పోతే, ఇక ప్రస్తుతానికి వస్తే, 
ఒక విపత్కర, అనూహ్య దారుణ సంఘటన కారణంగా రాష్ట్రం యావత్తూ  చేష్టలుడిగివున్న పరిస్తితిలో  కాంగ్రెస్ పార్టీ అదిష్టానం, హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన రాజశేఖరరెడ్డి స్తానంలో, వయస్సు పైబడుతున్న కారణంగా క్రమేపీ రాజకీయాలనుంచి తప్పుకోవాలన్న నిర్ణయానికి ఏనాడో వచ్చి,  ఆ దృష్టి తోనే  ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా శాసన మండలికి పరిమితమై మంత్రిమండలిలో సీనియర్ సభ్యుడిగా కొనసాగుతున్న రోశయ్యను ముఖ్యమంత్రిగా నామినేట్ చేసింది. ఈ విషయంలో ఆయన ఎంతో అదృష్టవంతుడయిన కాంగ్రెస్ నాయకుడనే చెప్పాలి. ఎందుకంటె, రాజకీయాల్లో ఈనాడు ఎంతో ప్రధానంగా పరిగణిస్తున్న కులం, ధనం, వర్గం  వీటిల్లో ఏ కోణం నుంచి చూసినా,  ఏ రకమయిన ప్రాధమిక అర్హతా  లేకుండా, కనీస స్తోమత కూడా  లేకుండా,  రోజు రోజుకూ మీదపడుతున్న వయస్సు ఒక అడ్డంకి కాకుండా,  అదిష్టాన దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు చోటా మోటా కాంగ్రెస్ నాయకులందరూ హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన సంప్రదాయం బలంగా వేళ్ళూనుకునివున్న పార్టీలోవుంటూ కూడా, అధిష్టానం కొలువైవున్న  కొత్త డిల్లీలో ఒక్క మారు కూడా కాలుపెట్టకుండా ముఖ్యమంత్రి  పీఠం ఎక్కగలిగారంటే ఆయనకు వున్న సీనియారిటీకి తోడు  అదృష్టం కూడా  కలిసివచ్చిందనే అనుకోవాలి. ఈ వాస్తవాన్ని బయటవారు కాకుండా ఆయనే స్వయంగా పలుమార్లు ప్రస్తావించడం గమనార్హం. ఇటు ప్రభుత్వాన్నీ , అటు పార్టీ అధిష్టానాన్నీ తన కనుసన్నల్లో వుంచుకోగల శక్తియుక్తులు, ప్రతిభాసామర్ధ్యాలు కలిగిన రాజశేఖరరెడ్డి వారసుడిగా పాలన సాగించడం అంటే కత్తిమీద సాము  అన్న వాస్తవం తెలిసిన మనిషి కనుక, 
 పార్టీలో  ఎవరు ఏమిటి? అన్న విషయాలు పుక్కిట పట్టిన దక్షుడు కనుక,
అధిష్టానం మనసెరిగి మసలుకునే తత్వం వొంటబట్టించుకున్న వ్యవహారశీలి కనుక,
 బలం గురించి బలహీనతలు గురించి  స్పష్టమయిన అంచనాలు వేసుకోగలిగిన సమర్ధుడు కనుక, అన్నింటికీ మించి రాజకీయాలలో ‘కురువృద్ధుడు’, ‘పెద్దమనిషి’ అన్న ముద్రతో పాటు, అందరూ అర్రులు చాచి అందుకోవాలని తాపత్రయపడే ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించే సంసిద్దతను వ్యక్తం చేయగలిగిన ధీమంతుడు కనుక,
 పరిశీలకులు తొలినాళ్ళలో  ఊహించిన  స్తాయిలో ఆయన పట్ల వ్యతిరేకత  వెల్లువెత్త లేదు. ఇవికాక, కాకలు తీరిన నాయకులకు ఏ మాత్రం కొదవ లేని కాంగ్రెస్ పార్టీలోని సహజసిద్ద వర్గ రాజకీయాలు సైతం,  రోశయ్య ముఖ్యమంత్రిత్వానికి ఎవరూ ఎసరు పెట్టకుండా కాపాడుకుంటూ వచ్చాయి.  మూన్నాళ్ళ ముఖ్యమంత్రి అనీ, మూన్నెళ్ల ముఖ్యమంత్రి అనీ ఎవరెన్ని రాగాలు తీసినా, మంత్రులను మార్చకుండా,  వైఎస్సార్ పధకాలను ఏమార్చకుండా గుంభనగా నెట్టుకొస్తూనే వచ్చారు.  లోగడ కనీవినీ ఎరుగని ప్రకృతి వైపరీత్యాలు, ప్రాంతీయ ఉద్యమాలు రాష్ట్రాన్ని చుట్టుముట్టినా, ఆయన తనదయిన శైలిలో నిబ్బరంగా పాలనపై క్రమంగా పట్టుబిగించే ప్రయత్నం చేసారు. వై.ఎస్. మరణం తర్వాత గడిచిన ఎనిమిది మాసాల కాలంలో  ముఖ్యమంత్రిగా ఆయన చేసిన నియామకాలు వేళ్ళమీద లెక్కపెట్టదగినవే.  కానీ వాటి విషయంలో ఆయన ఎవరినీ సంప్రదించి చేసిన దాఖలాలు లేవు. ఉదాహరణకు ప్రెస్ అకాడమి చైర్మన్ గా తిరుమలగిరి సురేంద్రను, సాంస్కృతిక మండలి అధ్యక్షునిగా రమణమూర్తిని, ఏ పీ ఐ ఐ డి సీ అధినేతగా శివసుబ్రమణ్యంను నియమిస్తూ జారీ చేసిన ఆదేశాలు ఈ కోవలోకే వస్తాయి. సమర్ధులయిన ముఖ్యమంత్రులుగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు, రాజశేఖరరెడ్డి సయితం ప్రెస్ అకాడమి విషయంలో రోశయ్య మాదిరిగా  స్వతంత్ర నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు. అలాగే, జర్నలిష్టు సంఘాలన్నీ ముక్తకంఠంతో వద్దన్నప్పటికీ విజయవాడ పోలీసు కమీషనరుగా పీఎస్సార్ ఆంజనేయులును బదిలీ చేసిన తీరుని కూడా ఈ సందర్భంలో గుర్తుచేసుకోవచ్చు.



(నా పుస్తకం 'మార్పు చూసిన కళ్ళు ఆవిష్కరించిన నాటి తమిళనాడు గవర్నర్ శ్రీ రోశయ్య, పక్కన ప్రసార భారతి సీఈఓ శ్రీ కే.ఎస్. శర్మ )







1, జులై 2020, బుధవారం

మొన్న బాబు, నిన్న వై.ఎస్. నేడు మోడీ, రేపు జగన్ – భండారు శ్రీనివాసరావు

ఫేస్ బుక్ వంటి సాంఘిక మాధ్యమాలు లేని రోజులు అవి. కంప్యూటర్ అంటే అదేదో మన దేశానికి సంబంధించిది కాదనుకునే రోజులు. ఆరోజుల్లో పెళ్ళీ పేరంటాళ్ళలో, విందులు వినోదాల్లో నలుగురు చుట్టపక్కాలు కలిసినప్పుడు ఎవరైనా పొరబాటున చంద్రబాబును పల్లెత్తు మాటన్నా ఎవరూ ఊరుకునేవారు కాదు, వెనకేసుకొచ్చేవారు. 2004 లో ఆయన (టీడీపీ) ఓడిపోయినప్పుడు మా కుటుంబంలోనే వనం గీత వంటి వాళ్ళు కన్నీళ్లు పెట్టారు, ఆ పూట వంటలు వండుకోలేదు.

వై.ఎస్.ఆర్. రెండో మారు పూర్తికాలం పరిపాలించి వుంటే జనం అలాంటి బాబును కూడా  పూర్తిగా మరచిపోయేవారేమో అన్నవాళ్లు  వున్నారు. కార్పొరేట్లకు దోచిపెడుతున్నారంటూ ఎంత గగ్గోలు పెట్టినా ప్రజలు పెడచెవిన పెట్టారు. ఆయన ప్రారంభించిన 108, 104 ఆరోగ్య శ్రీ పధకాలు సామాన్య జనం దృష్టిలో ఆయన్ని చిరంజీవిని చేశాయి.

తరవాత మోడీ శకం. ఆయన గురించి కూడా సామాన్య జనంలో ఇదే భావన. ఆయన ఏది చెప్పినా ప్రజలు వింటూనే వున్నారు. పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు పడిన కష్టాలన్నీ పెద్ద మనసుతో పంటి బిగువన ఓర్చుకున్నారు. కొవ్వొత్తులు వెలిగించమంటే వెలిగించారు. చప్పట్లు కొట్టమంటే కొట్టారు. కరోనా కష్టాలు వచ్చే నవంబర్ దాకా తప్పవేమో అనే మోడీ మాటను స్వీకరించారు.

ఇక ఈరోజు విజయవాడలో 108, 104 వాహనాలు ఊరేగింపుగా వెడుతున్న దృశ్యాలు టీవీల్లో చూసిన వారికి కూడా అనిపించి వుంటుంది. రేపటి రోజులు జగన్ వే అని.       


30, జూన్ 2020, మంగళవారం

వేణీ దానం అను సతీ పూజ – భండారు శ్రీనివాసరావు

చాలా ఏళ్ల క్రితం మేము సకుటుంబంగా అంటే దాదాపు ముప్పైమందిమి కాశీయాత్ర చేసాము. మార్గమధ్యంలో ప్రయాగ త్రివేణీ సంగమం వద్ద తర్పణ కార్యక్రమాలకు ముందు మా బృందంలోని దంపతుల చేత ఈ వేణీ దానం (పూజ) చేయించారు.
త్రివేణీ సంగమం దగ్గర గంగా, యమునా, సరస్వతి (అంతర్వాహినిగా) మూడు నదులు కలుస్తాయి. ఆడవారి పొడవైన తల వెంట్రుకలను మూడు పాయలుగా చేసి జడ అల్లడం తెలిసిందే. దానికీ దీనికీ ముడిపెట్టి ఈ పూజలు చేయిస్తారు. ఏడుజన్మల పాపాలు కొట్టుకుపోతాయని ఐతిహ్యం. సరే అదలా ఉంచుదాము.
నాకు ఈ పూజలో నచ్చినదేమిటంటే మొగుడి చేత భార్యకు సపర్యలు చేయించడం. అది చూసిన తర్వాత ఈ జన్మలో మొగుళ్ళు చేసిన పాపాలకు ప్రక్షాళన జరగడం ఖాయం అనిపించింది.
ఈ ప్రక్రియలో భర్త తన ఇల్లాలిని తొడపై కూర్చుండబెట్టుకోవాలి. ఆమె మొహాన్ని కడిగి తుడవాలి. కుంకుమ బొట్టు పెట్టాలి. వధువుగా మరి కొన్ని అలంకరణలు చేయాలి. లాలనగా మాట్లాడుతూ, భార్య జుట్టును మూడు పాయలుగా చేసి జడ అల్లాలి. ఇలా కొన్ని పనులు చేయించి మగవాడి ఆధిపత్య, అహంకార ధోరణికి అడ్డుకట్ట వేసే విధానం నాకీ క్రతువులో కనిపించింది.