30, మార్చి 2020, సోమవారం

వెలుగు చూడని వార్తలు - 2 -


రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా రెండో దఫా ఎన్నికలకు సిద్ధం అవుతున్న రోజులు.
ఏదో కార్యక్రమానికి వెళ్లి బేగంపేట లోని సీఎం క్యాంపు ఆఫీసుకు తిరిగివస్తున్నారు. ముందు సీట్లో కూర్చుని వున్న వై.ఎస్. ఆర్., యదాలాపంగా వెనక సీట్లో కూర్చున్న వ్యక్తిగత సిబ్బందిని అడిగారు రాష్ట్రంలో పరిస్తితి ఎలావుందని. ఐ.ఏ.ఎస్. అధికారి తడుముకోకుండా చెప్పేశారు, పరిస్తితులు పాలక పక్షానికి అనుకూలంగా వున్నాయని.
‘ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్సులు జనంలోకి బాగా వెళ్ళాయి. అలాగే సేద్యపు నీటి ప్రాజెక్టులు. ప్రజల్లో రవంత కూడా వ్యతిరేకత ఉన్నట్టుగా నాకనిపించడం లేదు. ధైర్యంగా ఉండొచ్చు’
మాట్లాడుతుండగానే క్యాంపు ఆఫీసు వచ్చింది. కారు దిగబోతుండగా ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడు రవిచంద్ ఇలా అన్నారు.
‘దేనికయినా బుల్లెట్ ప్రూఫ్ వుంటుంది, పొగడ్తలకు తప్ప’
వై.ఎస్.ఆర్. కి రవిచంద్ మాటల్లో భావం బోధపడింది.
పెద్దగా నవ్వేశారు, తనదయిన స్టైల్లో.

వెలుగు చూడని వార్తలు – 1 -


అప్పుడు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక సభలో మాట్లాడుతూ సీపీ ఎం నాయకుడు రాఘవులు ఒక ఆరోపణ చేశారు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులో వంద కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకుందన్నది ఆ ఆరోపణ సారాంశం.
మర్నాడు ఒక ప్రముఖదినపత్రిక ఒక కార్టూన్ ప్రచురించింది. వై ఎస్ బొమ్మ పెద్దగా, పక్కనే చంద్రబాబు బొమ్మ చిన్నగా వుంటుంది. ఆయన వై ఎస్ ని ఉద్దేశించి ఏదో అంటుంటాడు. సీపీఎం నాయకుడు రాఘవులు వైఎస్ఆర్ నోట్లో చేయిపెట్టి ఒక డబ్బు మూట బయటకు తీస్తుంటాడు. వై ఎస్ ఆర్ అవినీతిని టీడీపీ కన్నా సీపీఎం బాగా బయట పెడుతోందన్న అర్ధం అందులో అంతర్లీనంగా వుంది.
అది చూసిన వై ఎస్ కి పట్టరాని కోపం వచ్చింది. దాన్ని ఆయన దాచుకోలేదు. ఆ కార్టూన్ వేసిన పత్రిక యజమానిపై మండిపడ్డారు. అప్పుడు అక్కడే వున్న కిరణ్ కుమార్ రెడ్డి, కేవీపీ నచ్చ చెప్పబోయినా ఆయన వినిపించుకోలేదు. ఆ పత్రిక రాసేవన్నీ అభూత కల్పనలు అనే పద్దతిలో ఎదురు దాడి మొదలు పెట్టడమే మంచిదని వైఎస్ నిర్ధారణకు వచ్చారు. ఎన్నికలకు ఇంకా చాలా వ్యవధి వున్నప్పుడు ఇప్పటి నుంచే పత్రికలతో తగాదా ఎందుకన్నదికిరణ్, కేవీపీ ల అభిప్రాయం. కానీ వైఎస్ ఒప్పుకోలేదు. ఇప్పటి నుంచి మొదలు పెడితేనే ఎన్నికల నాటికి ప్రజలు నమ్మే పరిస్తితి వస్తుందని ఆయన నమ్మకం. అప్పటి నుంచి వైఎస్ సందర్భం వచ్చినప్పుడల్లా ఆ పత్రిక రాతల్ని ఎండగట్టే ప్రయత్నం ప్రారంభించారు. తరువాత అది ఆ రెండు పత్రికలూ..అంటూ రెండు తెలుగు దిన పత్రికలని ఎద్దేవా చేసే ప్రచార కార్యక్రమంగా రూపు దిద్దుకుంది.

జస్ట్ ఫర్ చేంజ్


రాత్రి అమెరికా నుంచి మా పెద్దవాడు సందీప్ నుంచి వీడియో కాల్. చూస్తే వేరే మనిషి లాగా వున్నాడు.
‘నేనే డాడ్. ఎలా వున్నారు?’
‘ఇదేం వేషంరా!’
‘వేషం కాదు ఇదే ఒరిజినల్. సెల్ఫ్ ఐసొలేషన్. అందరం వర్క్ ఫ్రం హోం. పిల్లల చదువులు కూడా ఇంటి నుంచే కంప్యూటర్ లో. మొదటి వారం రోజులు మాత్రం ఆఫీసుకు పోయేవాళ్ళ లాగా పొద్దున్నే లేచి తయారై కంప్యూటర్ ముందు కూచునే వాళ్ళం. పోను పోను విసుగనిపించింది. జస్ట్ ఫర్ చేంజ్. గడ్డం పెంచుతున్నాను. కాదు అదే పెరుగుతోంది’ అన్నాడు వాడు నవ్వుతూ.

ఎలా వున్నారు?


పొద్దున్నే వెంకట్రావు గారి నుంచి ఫోను, ‘ఏం శ్రీనివాసరావు గారు ఎలా వున్నారు?” అని.
వెంకట్రావు గారు నేను 1970 ప్రాంతాల్లో విజయవాడ ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్లుగా కలిసి పనిచేశాం. లబ్బీ పేటలో మా ఇద్దరి ఇళ్లు కూడా దగ్గరిదగ్గరగానే ఉండేవి. వారి భార్య నిర్మల, నా భార్య నిర్మల సైతం మంచి స్నేహితులు.
తర్వాత నేను హైదరాబాదులో ఆలిండియా రేడియోలో చేరాను. ఆ తర్వాత వెంకట్రావు గారు కూడా హైదరాబాదు వచ్చేశారు ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ గా. కొన్నేళ్ళకు ఆ పత్రిక ఎడిటర్ అయ్యారు. ప్రెస్ అకాడమి చైర్మన్ అయ్యారు. మహా టీవీ చీఫ్ ఎడిటర్ అయ్యారు. ఆయన ఎన్ని మెట్లెక్కినా  మా స్నేహం కొనసాగుతూనే వుంది.
నా జీవితంలో కొన్ని నెలల క్రితం ఎదురయిన గొప్ప కష్టం తర్వాత ఐవీఆర్ అప్పుడప్పుడూ ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కుంటూ వుంటారు.
“సెల్ఫ్ ఐసోలేషన్ కి అలవాటు పడ్డారా?” ఐవీఆర్ అడిగారు.
ఏ ప్రశ్నకీ సూటిగా జవాబు చెప్పననే పేరు నాకు ఎలాగూ వుంది.
“ఒకడు జీవితంలో అష్టకష్టాలు పడుతూ జాతకంలో మంచి రోజులు వస్తాయేమో అనే ఆశతో జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్లి చేయి చూపించుకుంటాడు. యాభయ్ ఏళ్ళు వచ్చేవరకు అన్నీ కష్టాలే రాసి వున్నాయి అన్నాడా జ్యోతిష్కుడు. “ఆ తర్వాత” అడిగాడు ఆశగా మనవాడు. “తర్వాత ఏముంది ఆ కష్టాలకు అలవాటు పడిపోతావు”
గత కొన్ని నెలలుగా నాది ఒక రకంగా ఐసొలేషన్ జీవితమే. ఇప్పుడు కొత్తగా కొరానా వల్ల వచ్చిన తేడా ఏమీ లేదు. ఆల్రెడీ అలవాటు పడిపోయాను”
నా జవాబుకి ఆయన నవ్వేశారు. కానీ అందులో బాధ మిళితమై వుందని నాకు తెలుసని ఆయనకీ తెలుసు.           

దుగ్గిరాల పూర్ణయ్య ఇక లేరు


ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు చదివినవారిలో ప్రసిద్ధులు దుగ్గిరాల పూర్ణయ్య
ఆరోజుల్లో రేడియో కళాకారులకు, న్యూస్ రీడర్లకు సినీ రంగంతో పాటు దీటైన ఆకర్షణ వుండేది. వారిని సాంస్కృతిక కార్యక్రమాలకు, వేడుకలకు ముఖ్య అతిధులుగా ఆహ్వానించి సత్కరించేవారు. అయితే స్వతహాగా నిరాడంబర జీవితం గడిపే పూర్ణయ్య వీటన్నిటికీ దూరంగా వుండేవారు. ప్రముఖులతో సాన్నిహిత్యం పెంపొందించుకోగల అవకాశాలు వృత్తిపరంగా ఎన్నో ఉన్నప్పటికీ ఆయన మాత్రం తన పనేదో తనేమో అన్నట్టు జీవితం సాగించారు.
సినిమా రంగంలో ఒక మాట వినబడుతూ వుంటుంది. డాక్టర్ కాబోయి యాక్టర్ అయినాడని. దుగ్గిరాల వారిది కూడా ఓ మోస్తరుగా ఇదే కధ. కృష్ణా జిల్లా నుంచి బతుకు తెరువు కోసం ఢిల్లీ వెళ్ళిన పూర్ణయ్య గారికి ఒక చిన్న కొలువు దొరికింది. బీజేపీ అగ్ర నాయకుడు ఎల్.కే.అద్వాని (అప్పుడు జనసంఘం) నడిపే ఒక పత్రికలో పనిచేస్తున్నప్పుడు పూర్ణయ్య గారి పనితీరు వారికి నచ్చింది. వారిరువురి నడుమ సాన్నిహిత్యం పెరిగింది. అద్వానీ గారి మాట సాయంతో ఆలిండియా రేడియోలో ఉద్యోగం వచ్చింది. ఆ విధంగా ఆయన న్యూస్ రీడర్ కాగలిగారు.
రేడియో ఉద్యోగం కొత్త. అయినా ఆయన త్వరగానే ఆ కొత్త కొలువులో ఒదిగిపోయారు. ఇంగ్లీష్ నుంచి వార్తల్ని తెలుగులోకి తర్జూమా చేసి, స్టూడియోలో లైవ్ చదవడంపై పట్టు సాధించారు. మనిషి పీలగా కనిపించినా వారిది కంచు కంఠం. వేరే ధ్యాసలు లేకుండా కేవలం వృత్తి ధర్మాన్ని నిర్వహించే స్వభావం కావడం వల్ల దుగ్గిరాల పూర్ణయ్య గారికి రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాలేదని బాధ పడే అభిమానులు కూడా వున్నారు.
నేను మాస్కో వెళ్ళేటప్పుడు ఢిల్లీలో పూర్ణయ్య గారిని కలుసుకున్నాను. మాస్కో రేడియోలో పనిచేసే అవకాశం ఆయనకే ముందు వచ్చినా ఆయన కాదనుకుని ఢిల్లీలోనే వుండిపోయారు.
ఎనిమిది పదులు దాటిన పూర్ణయ్య గారు, అనేక దశాబ్దాల క్రితం వదిలి వెళ్ళిన స్వగ్రామం, గుడివాడ దగ్గర అంగలూరులో భార్య శ్రీమతి లక్ష్మితో కలిసి ఇప్పుడు శేష జీవితం గడుపుతూ ఈరోజు ఆదివారం (29-03-2020) మధ్యాహ్నం కన్నుమూశారు.

29, మార్చి 2020, ఆదివారం

ఓ తుపాను ముచ్చట

ఏదైనా సాపేక్షమే, కష్టమైనా, సుఖమైనా!
దివి తుపాను సంగతి చాలామందికి తెలిసిన సంగతే. నేనైతే అప్పటికే యాక్టివ్ రిపోర్టింగ్ లోనే వున్నాను.
ఈ తుపాను అదికాదు. దివి తుపానుకు చాలా ఏళ్ళ ముందే  నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక తుపాను వచ్చింది. అప్పటికి వార్తా ప్రచార సాధన సంపత్తి లేకపోవడం వల్ల ఆ తుపాను సంగతి ఎవరికీ తెలియలేదు.
ఓసారి వేసవి సెలవులకు మా వూరు వెళ్ళాము. మామూలుగా సెలవులు ఇవ్వగానే ఖమ్మం నుంచి, రెబ్బారం నుంచి పక్కనే ఉన్న పెనుగంచిపోలు నుంచి మా అక్కయ్యల పిల్లలు అందరూ కంభంపాడు చేరడం ఆనవాయితీ. ఆసారి మరో ప్రత్యేకత ఏమిటంటే మా ఇంటి చిన్న అల్లుళ్ళు ఇద్దరూ కుటుంబాలతో వచ్చారు. ఇల్లంతా పిల్లల ఆటపాటలతో, పెద్దవాళ్ళ చతుర్ముఖ పారాయణాలతో, అమ్మలక్కల పచ్చీసు ఆటలతో  హడావిడిగా వుంటే వంటింట్లో మా అమ్మ కట్టెల పొయ్యి ముందు కూర్చుని ఇంతమందికీ వండి వారుస్తుండేది.
ఒకరోజు ఉన్నట్టుండి మబ్బులు కమ్మి వర్షం మొదలైంది. వేసవి వాన కావడం కారణంగా అందరం సంతోషపడ్డాము. సాయంత్రం అయినా తగ్గలేదు. కరెంటు పోయింది. ఎప్పుడు వస్తుందో తెలవదు. మా అక్కయ్యలు ఇంట్లో ఓ  మూలన పడేసిన లాంతర్లు, బుడ్లు బయటకు తీసి శుభ్రం చేసి దీపాలు వెలిగించారు. ఆ వెలుగులోనే అన్నాలు. ఆరాత్రి గడిచింది. కానీ వాన తెరిపివ్వలేదు. వంటింట్లో నుంచి యధాప్రకారం కాఫీలు, టిఫిన్లు. సాయంత్రమయింది. పొద్దుగూకింది. అయినా వర్షం ఆగలేదు. ఆడవాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. విచారిస్తే తెలిసింది ఏమిటంటే వంటింట్లో పొయ్యి పైకి వున్నాయి. పొయ్యిలో పెట్టడానికే కట్టెలు తడిసిపోయాయి. ఎల్లా! ఆ పూటకి కొంత కిరసనాయిలు వాడి పొయ్యి వెలిగించారు. ఆ పూట ఎలాగో గడిచింది. మర్నాడు కూడా ముసురు తగ్గలేదు. పెరట్లో కూరగాయలు అయిపోయాయి. మూడు పాడి బర్రెల్లో ఒకటి ఇవ్వలేదు, మేత సరిగాలేక కావచ్చు.
తుపాను కష్టాలు మెల్లిమెల్లిగా అర్ధం అవుతున్నాయి. ఇంట్లో సరుకులు నిండుకుంటున్నాయి. పంచదార పరవాలేదు కానీ కాఫీ పొడుముకు కటకట. అల్లుళ్ళు ఇద్దరికీ సరిపోతే చాలు మిగిలినవాళ్ళు వాళ్ళే సర్దుకుంటారు అని తీర్మానించారు.
అలా పగలూ రాత్రీ తెలవకుండా వర్షం ధారాపాతంగా కురుస్తూనే వుంది. ఐదో రోజున కాస్త తెరిపి ఇచ్చింది.
వాన వెలిసిన తర్వాత దాని బీభత్సం కొద్దికొద్దిగా తెలుస్తూ వచ్చింది. మధిర రైల్వే వంతెన వరదల్లో కొట్టుకు పోయింది. హైదరాబాదు బెజవాడ మధ్య రైళ్ళ రాకపోకలు నిలిచి పోయాయి. బెజవాడ దగ్గరలో ఒక పాసింజరు రైలు పట్టాలమీద నిలిచిపోయింది. వాళ్లకు ఆహార పానీయాలు లేవు. రైలు ఎప్పుడు కదులుతుందో తెలవదు. వాళ్ళంతా బిక్క చచ్చి రైల్లోనే వుండిపోయారు. పక్క వూరి గ్రామస్తులు ఆ కష్ట కాలంలో వాళ్ళని ఆదుకున్నారు. తుపాను హడావిడి తగ్గిన  తర్వాత కేంద్ర రైల్వే శాఖవారు ఒక స్టేషనుకు ఆ ఊరి పేరు పెట్టారు.
మా ఒక్క కుటుంబమే కాదు, మా ఒక్క ఊరే కాదు, అనేక గ్రామాల వాళ్ళు మేము పడ్డ కష్టాలే పడ్డారు. ఏం చేస్తాం మన ఖర్మ అనుకున్నారు.
తిట్టడానికి గవర్నమెంటు ఒకటుందని అప్పుడు  తెలవదు.     

28, మార్చి 2020, శనివారం

ప్రెసిడెంట్ ట్రంప్ ప్రెస్ మీట్


గంటలు గంటలు ప్రెస్ బ్రీఫింగ్ అనగానే మనదగ్గర నవ్వులాటగా చెప్పుకుంటారు కానీ, అమెరికాలో కరోనా వైరస్ విస్తరించినప్పటినుంచి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్,  వైట్ హౌస్ లో  ప్రతిరోజూ సాయంత్రం రెండుగంటల పాటు విలేకరులతో మాట్లాడడం అనేది ఒక రొటీన్ అయిపొయింది. ప్రెసిడెంట్ తో పాటు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కూడా పాల్గొనే ఈ ప్రెస్ బ్రీఫింగ్ లో ఒకరిద్దరు వివిధ రంగాల నిపుణులు కూడా పక్కనే వుంటారు. మనకు విచిత్రంగా అనిపించే  విషయం ఏమిటంటే వీళ్ళు ఒక్కోసారి బహిరంగంగానే ప్రెసిడెంట్ చెప్పేదానితో తాము ఏకీవభించడం లేదంటూ బహిరంగంగానే తమ అనంగీకారం తెలియచేస్తుంటారు. ఈ రెండూ రెండున్నర గంటలసేపు ప్రెసిడెంట్ నిలబడే ఉంటాడు. ఇటీవల అంటే మార్చ్ 23 న జరిగిన ప్రెసిడెంట్ ప్రెస్ బ్రీఫింగ్ ని క్లుప్తీకరిస్తే ఇదిగో ఇలా వుంటుంది. మరో విచిత్రం ఏమిటంటే ఆ నాటి ప్రెస్ బ్రీఫింగులో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ గారికి కోపం వచ్చి మధ్యలోనే అంటే గంటన్నర కూడా కాకుండానే వెళ్ళిపోయారు. వైట్ హౌస్ లో మీడియా విభాగం అధికారి జేమ్స్ ఎస్. బ్రాడి జారీ చేసిన అధికారిక ప్రకటనకు ఇది సంక్షిప్త రూపం. అసలుది ఇరవై వేల పదాలకు పైగా వుంది. ప్రెస్ బ్రీఫింగ్ ఇలా సాగింది.
ప్రెసిడెంట్: మంచిది ధన్యవాదాలు. అందరూ వచ్చినట్టులేదు. బహుశా వైరస్ సమస్య కావచ్చు. సాధారణంగా అయితే చాలామందికి ఈ గదిలో స్థలం సరిపోయేది కాదు.
ఈ వైరస్ మీద పోరాటానికి మన సమాజంలో ప్రతి ఒక్కరినీ కలుపుకుపోయే ప్రయత్నాన్ని అమెరికా ఇక ముందు కూడా కొనసాగిస్తుంది. ఈ పోరాటంలో మనం విజయం సాధిస్తామని అమెరికన్లు విశ్వసించాలని నేను కోరుకుతున్నాను. మళ్ళీ సాధారణ పరిస్తితులు వస్తాయి. కష్టాలు ఇబ్బందులు త్వరలోనే తొలగిపోతాయి. మన ఆర్ధిక వ్యవస్థ కూడా బాగా కోలుకుంటుంది. అయితే ప్రస్తుతం మాత్రం ఈ జాతీయ విపత్తు నడుమ చిక్కుకుపోయిన మనందరం  ఈ పోరాటంలో విజయం సాధించడంపైనే దృష్టి కేంద్రీకరించాలి.
ప్రతి ఒక్క అమెరికన్ ఒక సంగతి గమనంలో పెట్టుకోవాలి. ఈ సమయంలో మనం చేస్తున్న త్యాగం అనేకమంది ప్రాణాలు కాపాడుతుందని తెలుసుకోవాలి.
అమెరికాలోని అమెరికన్లతో సహా, ఇతర ఆసియా అమెరికన్ల ప్రాణాలను కాపాడడం చాలా చాలా ముఖ్యం. ఈ వ్యాధి /వైరస్ విస్తరించడానికి వాళ్ళు కారణం కాదు.
ఈ వైరస్ తలెత్తినప్పటి నుంచి దేశంలోని అత్యుత్తమ శాస్త్రవేత్తలు, వైద్య నిపుణుల సలహాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ  ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ వైరస్ ని తుదికంటా నిర్మూలించేవరకు ఈ కృషి కొనసాగుతుంది. మన ప్రజారోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు పరిస్తితిని గమనిస్తూ దేశంలో ఈ వ్యాధి విస్తరిస్తున్న పోకడను అధ్యయనం చేస్తూ తగిన సమయంలో దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి అహరహం పనిచేస్తున్నారు. తరువాత ఏం చేయాలి? మన తదుపరి అడుగులు  ఏమిటి అనే విషయంలో పెద్దపెద్ద బృందాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. ఒక్కసారి వాళ్ళు  ఓకె చెబితే మళ్ళీ మనం మన పాత జీవన విధానం వైపు మళ్లిపోతాము.
మన దేశాన్ని నిర్మించుకున్నది షట్ డౌన్ చేయడానికి కాదు.
లక్షలాదిమంది అమెరికన్ శ్రామికులకు, చిన్న వ్యాపారులకి, ప్రపంచంలో అమెరికాకు ఒక సమున్నత స్థానం కల్పించిన బడా పారిశ్రామిక వేత్తలకు  ఈ సంక్షుభిత సమయంలో సత్వర సాయం అందించే బిల్లు విషయంలో ఏకాభిప్రాయ సాధనకోసం నా ప్రభుత్వం డెమోక్రాట్లతో, రిపబ్లికన్స్ తో కలిసి పనిచేస్తుంది.
మూడు నాలుగు మాసాలు లేదా అంతకంటే ముందుగానే, ఇంకా త్వరగానే  అమెరికా తన వ్యాపార కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుంది. వీలయితే ఇంకా ముందుగానే. సమస్యకంటే పరిష్కారం ప్రమాదకరమయ్యే పరిస్తితిని అమెరికా కొనితెచ్చుకోదు.
 రెండు వారాల క్రితమే ప్రజలకు జీతంతో కూడిన సిక్ లీవ్, ఫ్యామిలీ లీవ్ ఇవ్వడానికి ఎనిమిది బిలియన్ల డాలర్లు ఖర్చయ్యే బిల్లు ఆమోదానికి రికార్డు స్పీడ్ తో పనిచేసాము. ఇందులో వైద్యం ఖర్చులు, వాక్సిన్ల ఖర్చులు కూడా వున్నాయి. కాబట్టి ఈ బిల్లును ఆమోదింప చేయడంలో పార్టీలకి అతీతంగా అమెరికన్ కాంగ్రెస్ పనిచేయాలి.
వైరస్ వ్యతిరేక పోరాటంలో ఏం జరుగున్నదో చెబుతాను. ఎనిమిది లక్షల N95 మాస్కులను, కోటీ ముప్పయి లక్షలకు పైగా సర్జికల్ మస్కులను  పంపిణీ చేస్తున్నాము. ఈ బృహత్తర కార్యక్రమంలో ఫెడరల్ ప్రభుత్వంతో ఆయా రాష్ట్రాల గవర్నర్లు, మేయర్లు పార్టీలకి అతీతంగా చేయీ చేయీ కలిపి పనిచేస్తున్నారు.
నా ఆదేశాల ప్రకారం క్లోరోక్విన్ మందును పెద్ద పెద్ద పరిమాణాల్లో తెప్పించడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటి నుంచి ఏ నిమిషంలో నైనా హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాలు న్యూయార్క్ చేరతాయి.
మీరు కూడా ఈరోజు వచ్చిన వార్తల్ని చదివారనుకుంటా. ఒక పెద్దమనిషి ప్రాణాపాయంలో పడ్డాడు. బతికే చాన్స్ లేదని అతడూ నమ్మాడు, ఆయన కుటుంబమూ నమ్మింది. ఏదో ఉపశమన వైద్యం కింద అతడి కుటుంబం అతడికి ఆ మాత్ర వేసింది. అందరూ అంతా అయిపోయిందనే అనుకున్నారు. కానీ కొన్ని గంటలు గడవక ముందే అతడులేచి కూర్చున్నాడు. అతడిప్పుడు మామూలుగా వున్నాడు. ఈ వ్యాధికి ఈ మందు పనిచేస్తుంది అని ఆమోదం తెలిపే ప్రక్రియకు మేము ఎక్కువ సమయం తీసుకోనందుకు అతడిప్పుడు సంతోషిస్తున్నాడు.
మలేరియా వ్యాధితో కునారిల్లిన దేశాల్లో ఈ మందును ఆ వ్యాధి నిరోధానికి వాడారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆదేశాల్లో ఈ వైరస్ ప్రభావం చాలా తక్కువగా వుంది.
మరో విషయం. ఈ రోజు ఉదయమే నేను అధ్యక్షుడిగా నాకున్న అధికారాలను ఉపయోగించుకుని ఒక ఆర్డరు మీదసంతకం చేసాను. ముఖ్యమైన వైద్య పరికరాలను, మాస్కులను  అక్రమంగా దాచిపెట్టడాన్ని నిషేధించే ఉత్తర్వు ఇది.
ఈ సమావేశంలో ప్రెసిడెంట్ ట్రంప్ ప్రశ్నలు అడిగేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఇచ్చారు. విలేకరులను పేరుతో పిలిచి ప్రశ్న వేయమని కోరారు. ఒక్కొక్కరూ ఒకటి కంటే ఎక్కువగానే అడిగారు. “వ్యాధి కంటే చికిత్స ప్రమాదకరం కాకూడదు” అంటూ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యపై విలేకరులు బాణాలు సంధించారు.