12, డిసెంబర్ 2019, గురువారం

కొత్తా జబ్బులండీ ...... భండారు శ్రీనివాసరావు


బ్రహ్మలోకంలో దేవుడుగారు కొలువు తీరాడు. భటుడుగారు ప్రవేశించి, నడుము వరకు వొంగి వినయంగా నమస్కరించి చెప్పాడు.  'స్వామీ! ఒక మానవాధముడు తెల్లని ఉడుపులు ధరించి వచ్చాడు. శివుడి మెడలో నాగుపామును బోలిన ఒక వస్త్ర విశేషము అతడి మెడలో కూడా  వేలాడుచున్నది. అనుమతించిన లోపలకు తోడ్కొని వత్తును'
దేవుడు అంతఃచక్షువుతో పరికించి  చూశాడు. తోలుపటకా సంచీతో దిక్కులు చూస్తున్న మెడికల్ రిప్రెజెంటేటివ్ కానవచ్చాడు. అతడిని చూడగానే బ్రహ్మగారికి తన శిరోవేదన జ్ఞాపకం వచ్చింది. తక్షణం ప్రవేశపెట్టడమే కాకుండా సభలో వున్న యావన్మందినీ బయటకు పంపేయమని ఆజ్ఞాపించాడు.
మె.రి. దిక్కులు చూస్తూనే లోపలకు వచ్చాడు. వస్తూనే దేవుడు గారు తలనొప్పితో బాధపడుతున్న విషయం చిటికెలో గ్రహించాడు. పటకా సంచీ తెరిచి మందుల సాంపిల్స్ అన్నీ దేవుడుగారి ఆసనం ముందు పరిచాడు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన మందుల్లో తలనొప్పి గోలీ వుందని, అది రాత్రి వేసుకుని పొద్దున్న లేస్తే,  నొప్పి సరే, తల వుందన్న సంగతి కూడా గుర్తుకురాదనీ విరించికి వివరించి చెప్పాడు. మాత్ర వేసుకోగానే నొప్పి  మాయం, గాయబ్ అంటూ సంస్కృతంలో ఏమంటారో తెలియక ఆగిపోయాడు.
బ్రహ్మగారు మూడు తలలు పంకించి మందహాసం చేశారు. మూడు తలలతో ఆలోచించాడు. మనవాడు వుత్తుత్తిగానే ఇంతదూరం రాలేదనీ. ఏదో కారణం  ఉండేవుంటుందని  గ్రహించినవాడై,  అదేదో చెప్పమని సూటిగా అడిగాడు.
మె.రి. భేషజాలకు పోకుండా వున్నవిషయం చెప్పాడు.
'మీరు పరబ్రహ్మ మూర్తులు. మీ రాతకు తిరుగులేదు. అలాఅని అర్ధం కూడా కాదు. అందుకే బ్రహ్మరాత అంటారు. మీలాంటి వాళ్ళు మాలోకంలో కూడా వున్నారు. కాకపొతే వాళ్ళని డాక్టర్లు అంటారు. వారి దస్తూరీ మెడికల్ షాపుల వాళ్లకు తప్ప వాళ్ళ పెళ్ళాలకు కూడా అర్ధం కాదని బోలెడు జోకులు ప్రచారంలో వున్నాయి. అయినా వాళ్ళు మా మందులు రాయకపోతే మేము విషం మందు కొనుక్కుని  మింగి చావాలి. మా బతుకులు వారి రాతతో ముడిపడివున్నాయి. వాళ్ళు అలా మందులు రాస్తూనే వుండాలి. జనాలు వాటిని కొని మింగుతూనే వుండాలి. మరి రాయాలంటే ఉత్త మందులు వుంటే సరిపోదు, వాటికి సరిపడా రోగాలు కూడా వుండాలి. వీటిని ఇతోధికంగా పెంచడానికి మా వంతు తిప్పలు మేము పడుతూనే ఉన్నాము. కానీ మా ప్రయత్నాలు సరిపోవడం లేదు. కాబట్టి మీరు సృష్టి కార్యంతో పాటు, పెద్ద మనసు చేసుకుని అలాగే  మరో చేయి చేసుకుని మరి కొన్ని కొత్త జబ్బులను కూడా సృష్టించి భూమ్మీదకు వదిలితే కాని మా ఉద్యోగాలకు భరోసా వుండదు. కావున ఓ దేవదేవా కాసింత ఈ సాయం కానీ చేస్తివా, మీ మేలు మా మందుల కంపెనీల వాళ్ళు మరచిపోరు. మీ శ్రీమతి గారికి లక్ష్మీదేవి గారితో సమానంగా ఏడువారాల నగలు చేయించి పెడతారు. ఇక మీకంటారా మూడు తలలకూ నిఖార్సయిన బంగారు తొడుగులు వేయిస్తారు. భూలోకంలో మీకు గుళ్ళు ఎలాగూ లేవు, అంచేత మీ లోకంలోనే ఆ భోగాలన్నీ అందిస్తారు.”
మె.రి. ఇచ్చిన సాంపిల్ గోలీతో బ్రహ్మగారి ‘తలల’ నొప్పి తగ్గింది.
కానీ భూమ్మీద కొత్త కొత్త రోగాల నొప్పి జనాలకు  మొదలయింది.                  

రేడియో రోజులు - 40 - భండారు శ్రీనివాసరావు


ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ నెల్లూరు? ఎక్కడ ఆలిండియా రేడియో, ఎక్కడ బీజేపీ, ఎక్కడ వెంకయ్యనాయుడు, ఎక్కడ శ్రీనివాసరావు? ఎక్కడ 2005 ఎక్కడ 2017?
అదంతా గతం. అని నేను అనుకున్నాను. కాదని నాయుడు గారు అనుకుంటున్నారు (ట).
ఆలిండియా రేడియో అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా పదవీ విరమణ చేసిన డాక్టర్ పద్మనాభరావుగారు ఈ సంగతి చెప్పారు కనుక నమ్మక తప్పదు. వెంకయ్య నాయుడుగారు  గౌరవించి ఆదరించే ఆత్మీయులలో డాక్టర్ పద్మనాభరావు గారు ఒకరు. రేడియో గురించి అనేక గ్రంధాలు రాశారు. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి ఆలిండియా రేడియోలో ఉన్నత స్థానానికి చేరుకోగలిగారు.
కొంత కాలం  క్రితం పద్మనాభరావు గారు స్వర్ణభారతి ట్రస్టుకు వెళ్ళారు. ఉపరాష్ట్రపతి హోదాలో నాయుడు గారు ట్రస్టులో ఇద్దరు ముగ్గురు సన్నిహితులకు సాదాసీదాగా ఇచ్చిన విందులో పద్మనాభ రావు గారు కూడా  పాల్గొని, నాయుడి గారితో ఉన్న  పాత పరిచయంతో మాటామంతీ జరిపారు. ఆ సంభాషణల్లో వెంకయ్యనాయుడు నాయుడు గారు నా ప్రసక్తి కూడా తెచ్చారని  పద్మనాభ రావు గారు పేర్కొంటే  సంతోషం అనిపించింది.
వెంకయ్య నాయుడు గారితో నా మొదటి పరిచయం 1972 – 73 లో ప్రత్యేక ఆంద్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల నాటిది. నేను బెజవాడ నార్లవారి ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాను.  బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఇప్పుడు స్వరాజ్ మైదానం అనుకుంటా, అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రధాన వక్తలు మాట్లాడిన తరువాత ఒక యువకుడు మైకు అందుకున్నాడు. నిమిషాల వ్యవధిలోనే సభికులను తన వాగ్దాటితో మైకంలో ముంచి తేల్చాడు. ఎవరని ఆరా తీస్తే వెంకయ్య నాయుడు అన్నారు. పేరు చూస్తే వయసుమళ్ళినవాడనిపించేది కానీ, మనిషి మాత్రం చాలా  చిన్నకారువాడే.
1975 లో హైదరాబాదు ఆలిండియా రేడియోలో విలేకరిగా చేరిన మూడు సంవత్సరాలకు వెంకయ్యనాయుడు ఎమ్మెల్యేగా శాసన సభలో అడుగుపెట్టారు. ఆయనకు జోడీ ఎస్. జైపాల్ రెడ్డి.  ఇక వాళ్ళు సభలో ప్రసంగం మొదలు పెట్టినా, ప్రశ్నలు లేవనెత్తినా, ప్రభుత్వాన్ని నిలదీసినా మొత్తం ప్రెస్ గ్యాలరీ పూర్తిగా నిండిపోయేది. వింటూ రాసుకోవడం విలేకరులకి అలవాటే అయినా వాళ్ళిద్దరూ చెబుతున్నది ఆసక్తిగా వినాలా,  శ్రద్ధగా వింటూ పొల్లుపోకుండా రాసుకోవాలా అనేది అందరికీ  ఒక సమస్యగా వుండేది. ఆ రోజుల్లో ‘శాసన సభలో ఛలోక్తులు’ అనే శీర్షికతో  ప్రతి పత్రికా ఒక కాలం ప్రచురించేది.  వాటిల్లో సింహభాగం వారిద్దరివే  ఉండేవి. ఈ విషయంలో ఇద్దరూ ఇద్దరే.  వెంకయ్యనాయుడి విశ్వరూపం నేను చూసింది అసెంబ్లీలోనే. అంత్య ప్రాసలతో  ఉపన్యాసాన్ని రక్తి కట్టించే ఆ సాంప్రదాయాన్ని ఆనాటి నుంచి ఈనాటివరకూ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ప్రసంగాల్లో కూడా  ఆయన కొనసాగిస్తూ వస్తూనే  వున్నారు.     
ఇక ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో ఆయన పాత్ర ఇంతా అంతా కాదు. ప్రజల్లో రగిలిన అసహనానికి ఆయన వాగ్ధాటి ఆజ్యం పోసిందనడంలో అతిశయోక్తి లేదు.
మరోసారి కలిసింది ఢిల్లీలో. మాస్కో రేడియోలో పనిచేస్తూ సెలవుపై హైదరాబాదు వస్తూ ఢిల్లీలో దిగాను. పూర్వ పరిచయం పురస్కరించుకుని వెడితే గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించారు. మాస్కో విశేషాలు అడిగి ఆసక్తిగా విన్నారు.
వై.ఎస్. రాజశేఖర రెడ్డి మొదటి విడత  ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో నేనూ జ్వాలా నరసింహారావు ఒకసారి ఢిల్లీ వెళ్ళాము. ఏపీ భవన్ లో దిగిన మమ్మల్ని కలవడానికి సీనియర్ జర్నలిష్టులు చంద్రకాంత్, ఆనంద్ వచ్చారు. మాటల మధ్యలో వెంకయ్యనాయుడు గారి ఇంటికి వెడుతున్నట్టు చెప్పి మమ్మల్ని కూడా రమ్మన్నారు. ఆయన ప్రతి సంక్రాంతి పండక్కు కాబోలు తన ఇంట్లో చక్కటి విందు భోజనం ఏర్పాటుచేసి, ఢిల్లీలోని తెలుగు కుటుంబాలను ఆహ్వానిస్తారు. పిలవని పేరంటంగా వెళ్లిన మా ఇద్దర్నీ కూడా వెంకయ్యనాయుడు చాలా ఆదరంగా కనుక్కున్నారు. అద్వానీని చాలా దగ్గరగా ఆ సందర్భంలోనే చూడడం తటస్తించింది. అందరూ వెళ్ళిన తరువాత వెళ్లి కలిస్తే, ‘ఢిల్లీ వచ్చిన పనేమిటని’ ఆయనే  ఆరా తీసారు. అప్పుడు జ్వాలా 108 లో పనిచేస్తున్నాడు. రాజస్థాన్ రాష్ట్రంలో విస్తరణ గురించి జ్వాలా చెబితే అక్కడి ముఖ్యమంత్రితో మాట్లాడుతానని చెప్పి, అప్పటికప్పుడే  మాట్లాడారు కూడా.
నాయుడి గారితో  నా రేడియో అనుబంధం ఇంకా విచిత్రం. ఎమ్మెల్యేగా, పార్టీలో అతి వేగంగా ఎదుగుతున్న నాయకుడిగా వున్న రోజులనుంచి పరిచయం.  ఏదైనా వార్తను పత్రికలకు ఎలా కూర్చి చెప్పాలో, రేడియోకు ఎలా మార్చి  చెప్పాలో ఆయనకు కరతలామలకం. రేడియో వార్తలకు వున్న పరిమితులు ఆయనకు మాకన్నా బాగా తెలుసేమో అనిపించేది. ఎందుకంటే ఆయన ఏదైనా వార్తను  రేడియో కోసం ఫోనులో చెబితే మళ్ళీ తిప్పి రాసుకోవాల్సిన అవసరం వుండేది కాదు. అంత క్లుప్తంగా, సూటిగా వార్తను మలిచి చెప్పేవారు.   మధ్యాన్నం పూట,  మళ్ళీ సాయంత్రం రేడియోలో ప్రాంతీయ వార్తలు ప్రసారం అయ్యేవి. ఆయన ఇరవై మూడు జిల్లాల్లో ఎక్కడ వున్నా ఫోనుచేసి వార్త చెప్పేవారు. మేము ప్రసారం చేసింది విని, మళ్ళీ ఫోను చేసి ‘బాగానే చెప్పారు కానీ మరో వాక్యం జత చేస్తే బాగుండేది, సాయంత్రం వీలుంటే చెప్పండి’ అనేవారు, మేము  ‘కాదు’ అనడానికి అవకాశం ఇవ్వకుండా. అంత మన్ననగా వుండేది ఆయన వ్యవహార శైలి. తదనంతర కాలంలో ఏకంగా రేడియో, దూర దర్శన్ లను ప్రత్యక్షంగా పర్యవేక్షించే కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు కూడా ఆయన తీరులో ఇసుమంత మార్పును నేను చూడలేదు. 
ఇక ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా  వెంకయ్యనాయుడు గారు పదవీ రీత్యా చాలా బిజీ. కానీ వారికి జర్నలిస్టులు అంటే తగని అభిమానం. అందులోను గతంలో ఈ రంగంలో ఎంతో కాలం పనిచేసి, ఉద్యోగ విరమణ అనంతరం ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్న వయోధిక పాత్రికేయులంటే మరింత వాత్సల్యంతో కూడిన అభిమానం. అందుకే వయోధిక పాత్రికేయ సంఘం సభ్యులం కొంతమందిమి వారిని కలవాలని ఉందనే  ఆకాంక్షను ఉపరాష్ట్రపతి ప్రెస్ సెక్రెటరి శ్రీ మల్లికార్జున్ (ఒకప్పుడు హిందూ పత్రిక విలేకరి) ద్వారా తెలపగానే ఆయన  వెంటనే అంగీకరించారు. ఇచ్చిన సమయానికి ముందే మేము, హైదరాబాదులోని  జూబిలీ హిల్స్ లోఉన్న  వారి నివాస గృహానికి చేరుకున్నాము. తేనీటి వంటి అతిధి మర్యాదలు ఆయనే  స్వయంగా కనుక్కున్న తర్వాత మేము వచ్చిన పని చెప్పాము. ఈ ఏడాది ప్రసిద్ధ సంపాదకులు గోరా శాస్త్రి గారి  శతజయంతి సంవత్సరం. ఈ సందర్భంగా ఆయన స్మృత్యర్ధం ప్రచురించిన ఒక పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరింప చేయాలనేది మా సంఘం తరపున చేసిన అభ్యర్ధన. రెండో మాటకు తావివ్వకుండా అంగీకరించి,  అందుకు సంబంధించిన ఆదేశాలను వ్యక్తిగత సిబ్బందికి అక్కడికక్కడే జారీ చేసి, ‘ఇహ చెప్పండి ఏమిటి విశేషాలు’ అంటూ ముచ్చట్లకు స్వీకారం చుట్టారు. వచ్చిన వారినందరినీ పేరు పేరునా పలకరించి మా పూర్వాశ్రమాలలో మాతో వారి అనుభవాలను, జ్ఞాపకాలను చాలాసేపు గుర్తు చేసుకున్నారు. అవన్నీ ఒకచోట రాయాలంటే పెద్ద వ్యాసమే అవుతుంది. వీలువెంట రాయాలనేది నా సంకల్పం. తరువాత ఇచ్చిన మాట ప్రకారమే  గోరా శాస్త్రి గారి శత  జయంతి కార్యక్రమానికి హాజరై చక్కటి ప్రసంగం చేశారు.
వెంకయ్యనాయుడి గారిని కలిసిన వాళ్ళలో నాతోపాటు శ్రీయుతులు జీ.ఎస్. వరదాచారి, ఉడయవర్లు, లక్ష్మణ రావు,  దాసు కేశవరావు, నందిరాజు రాధాకృష్ణ, శ్రీనివాసరెడ్డి (మాజీ ఈనాడు) ఉన్నాము. 
ఉపరాష్ట్రపతి గా ఎంపిక కావడానికి పూర్వం మోడీ మంత్రివర్గంలో సభ్యుడిగా వున్న కాలంలో హైదరాబాదులో ఏదో కార్యక్రమానికి హాజరయి, జనాల హర్షద్వానాల నడుమ ఆసక్తికర ఉపన్యాసం ముగించుకుని, విమానం టైం అయిందని మధ్యలోనే వెడుతుంటే దారిలో నాకు కనిపించారు. ‘ఎలా వున్నావు శ్రీనివాసరావు’ అంటూ అదే ఆదరణతో కూడిన పలకరింపు. నడుస్తూనే నా గురించి మంచీచెడూ కనుక్కుంటూ కారెక్కి వెళ్ళిపోయారు.
పరిచయం ఉన్నవారిని ఆయన మరచిపోరు. ఆయనతో పరిచయం ఉన్న వారు ఆయన్ని మరచిపోరు.
అలాంటి విలక్షణ వ్యక్తిత్వం వెంకయ్యనాయుడు గారిది.
(ఇంకా వుంది)

రేడియోలో శ్రీ గొల్లపూడి


ఒకానొక కాలంలో ఇద్దరు రచయిత్రులు ముప్పాళ్ళ రంగనాయకమ్మ, యద్దనపూడి సులోచనారాణి తమ నవలలతో తెలుగు పాఠక లోకాన్ని ఉర్రూతలూగించారు. రంగనాయకమ్మ గారి బలిపీఠం నవలని రేడియోలో ధారావాహిక శ్రవ్యనాటికగా ప్రసారం చేసారు. రేడియో ఊర్వశిగా ప్రసిద్ధి చెందిన శ్రీమతి శారదా శ్రీనివాసన్ ఇందులో నటించారు. సులోచనారాణి గారు రాసిన సెక్రెటరీ నవలను అలనాటి రేడియో అక్కయ్య న్యాయపతి కామేశ్వరి గారి పూనికపై  రేడియో నాటికగా మార్చి ప్రసారం చేసారు.  సెక్రెటరీ నవలను రేడియో నాటకంగా మార్చి రాసిన వారు నిన్న ఈరోజు గురువారం చెన్నై లో కన్నుమూసిన శ్రీ గొల్లపూడి మారుతీ రావు గారు, శ్రీ డి. వెంకట్రామయ్యగారు. (అప్పుడప్పుడే సినిమా అవకాశాలతో బిజీ అయిన మారుతీరావు గారు  ఈ మొత్తం భారాన్ని తనపైనే మోపినట్టు శ్రీ డి. వెంకట్రామయ్య గారు తన రేడియో అనుభవాల గ్రంధంలో పేర్కొన్నారు) వీరిద్దరూ ఇంచుమించు కొన్ని మాసాల తేడాతో 1963 లో హైదరాబాదు ఆలిండియా రేడియోలో ఉద్యోగాల్లో చేరారు. గొల్లపూడి వారు డ్యూటీ ఆఫీసర్ గా, ఎనౌన్సర్ గా వెంకట్రామయ్య గారు అనేక సంవత్సరాల పాటు కలిసి పనిచేసారు. రవీంద్రభారతి రంగస్థలంపై కలిసి నాటకాలు వేసారు. వాటిల్లో ఒకటి భమిడిపాటి రాధాకృష్ణ గారు రాసిన ‘దంత వేదాంతం’ హాస్య నాటిక ఒకటి.
గొల్లపూడి మారుతీ రావు గారికి మంచి పేరు తెచ్చిన నాటిక ఆయనే రాసిన ‘రాగరాగిణి’ నాటకం.
శ్రీ కే. రామచంద్ర మూర్తిగారు హెచ్.ఎం.టీ.వీ. ఛానల్ సీ.ఈ.ఓ. గా వున్నా రోజుల్లో గొల్లపూడి వారి చేత ‘వందేళ్ళ కధకు వందనం’ అనే పేరుతొ ధారావాహిక కార్యక్రమాన్ని నిర్వహించారు. లబ్ధప్రతిష్టులైన అనేకమంది కధకులను గొల్లపూడి మారుతీరావు గారు ఈ కార్యక్రమంలో ఇంటర్వ్యూ చేసారు.   

రేడియో రోజులు - 39- భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily  on 12-12-2019, Thursday)

ఈ రేడియో డైరెక్టర్ కి రేడియో ఉద్యోగం అంటే పడదట ......
వేమూరి విశ్వనాధ శాస్త్రి అంటే వాళ్ళ కుటుంబంలో తెలుసు. వీ.వీ. శాస్త్రి అంటే రేడియోలో పనిచేసేవారికి తెలవకుండా పోదు. ప్రోగ్రాం సైడులో అతి చిన్న కింది మెట్టు అంటే  డ్యూటీ ఆఫీసర్ (ట్రాన్స్ మిషన్ ఎక్జిక్యూటివ్) నుంచి అదే స్టేషన్ కు డైరెక్టర్ గా ఎదిగిన అనుభవశాలి. హైదరాబాదులోనే కాదు భోపాల్ వంటి చోట్ల కూడా పనిచేసారు. రేడియోని స్కాచివడబోశారు. చిత్రం ఏమిటంటే ఆయన అరవయ్యవ దశాబ్దంలో రేడియోలో చేరినప్పుడు, ఇష్టం లేని పెళ్ళికి తల వంచి తాళి కట్టించుకున్న వధువులా, విధి లేక చేరానని చెబుతారు. ఎవరన్నా ఏదన్నా అనబోతే,  తన వాదనకు మద్దతుగా బీబీసీ   సీనియర్ అధికారి  లయొనెల్  ఫీల్డెన్ (Lionel Fielden) రాసిన బెంట్ ఆఫ్ మైండ్పుస్తకాన్ని ఉదహరిస్తారు. ఇంకో చిత్రం ఏమిటంటే ఆయనకు రేడియో ఉద్యోగం పడదు కానీ రేడియో అంటే ప్రాణం, అందులో  ముఖ్యంగా రేడియో వార్తలు ఆయనకు మరీ మరీ ఇష్టం. సుమారు నలభయ్ ఏళ్ళ సుదీర్ఘ రేడియో ప్రస్థానంలో  రేడియో గురించిన  మధురమైన ఎన్నో  జ్ఞాపకాలు ఆయన మదిలో పదిలంగా వున్నాయి. 


(శ్రీ  వీ.వీ. శాస్త్రి)
  
చిన్నప్పుడు ఆయన ఇంట్లో రేడియో వుండేది కాదు. రేపల్లెలోని శంకర్ విలాస్ కాఫీ హోటల్లోని  రేడియో ఒకటే దిక్కు. అక్కడికి వెళ్లి వార్తలు వినాలంటే కాఫీ టిఫిన్లకు చిల్లర డబ్బులు కావాలి. అందుకని నాన్నగారి లాల్చీ జేబులో నుంచి చిల్లర కొట్టేసే చిల్లరమల్లర దొంగతనాలకు కూడా వెనుతీయలేదు. ఇంతా చేసి ఆలిండియా రేడియో వార్తల్లో వచ్చే జాతీయ అంతర్జాతీయ సమాచారం పట్ల ఆయనకు  ఆసక్తి వుండేది కాదు. జోలిపాల్యం మంగమ్మ వంటి న్యూస్ రీడర్లు వార్తలు చదివే విధానం అంటే చెవి కోసుకునేవారట. ఇంటికి వెళ్ళిన తరువాత కూడా రేడియో న్యూస్ రీడర్ల మాదిరిగానే వార్తలను  అనుకరిస్తూ బిగ్గరగా చదవడం శాస్త్రిగారి హాబీ.
ఎమ్మే పాసయిన తరువాత రేడియోలో ట్రాన్స్మిషన్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఆయనతో పాటు ఇరవై రెండు మంది సెలక్ట్ అయితే ఈయన కడమాఖరిలో ఇరవై రెండోవారు. ఢిల్లీలోఇంటర్వ్యూ . ఆ కమిటీకి  ఆనాటి  రేడియో డీజీ శ్రీ నారాయణ్  మీనన్ చైర్మన్.  ఆయనకు ఎందుకో శాస్త్రి గారిపట్ల వాత్సల్యం కలిగింది. సంగీత, నృత్యాలు గురించి అడిగిన  ఏ ప్రశ్నకూ ఆయన సరయిన సమాధానం ఇవ్వలేకపోయారు. చివరికి ఆ అధికారే కల్పించుకుని ‘ఢిల్లీ నీకు కొత్తా, ఏమేం  చూసావు ఇక్కడ’ అంటూ చనువుగా అడిగారు. ఢిల్లీలో తాను  చూసిన హుమాయున్ సమాధి గురించి చెప్పారు. అనేక విషయాలు గురించి ఈ కుర్రవాడికి అవగాహన  లేకపోయినా తెలిసిన విషయాలు గురించి పరిపూర్ణ పరిజ్ఞానం వుందని ఆయన అభిప్రాయపడ్డట్టు శాస్త్రిగారికి తోచింది. సరయిన జవాబులు చెప్పలేకపోయినా చెప్పిన పద్దతి నచ్చిందేమో తెలియదు.  శాస్త్రిగారి బెంట్ ఆఫ్ మైండ్  రేడియో పట్ల లేకపోయినా,  శాస్త్రి గారిని మాత్రం ఆ ఉద్యోగానికి  సెలక్ట్ చేసారు. దీన్నే డిస్టినీ అంటారు శాస్త్రి.
అప్పుడు శాస్త్రిగారికంటే మంచి మార్కులతో ముందు వరసలో  ఎంపిక అయినవారిలో ధిగ్గనాధీరులు వున్నారు. శ్రీయుతులు  గొల్లపూడి మారుతీరావు, శంకరమంచి సత్యం మొదలయిన వాళ్ళు వారు. అందరికీ హైదరాబాదులో పోస్టింగు ఇచ్చారు.
ఇక ఆ రోజుల్లో హైదరాబాదు రేడియో స్టేషన్ కవిపండిత బృందంతో వెలిగిపోతూ వుండేది. శ్రీయుతులు దేవులపల్లి కృష్ణ శాస్త్రి, గోపీచంద్, బుచ్చిబాబు, మునిమాణిక్యం నరసింహారావు, స్థానం నరసింహారావు, రేడియో అన్నయ్య న్యాపతి రాఘవరావు, రేడియో అక్కయ్య కామేశ్వరి, మంచాల జగన్నాధరావు, మల్లాది నరసింహ శాస్త్రి మొదలయిన వారితో రేడియో ప్రాంగణం విరాజిల్లుతూ వుండేది.
ఆలిండియా రేడియోకి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ విషయాన్ని గురించి శాస్త్రి గారు చెప్పేది వినసొంపుగా వుంది.   
1935 లో బెంట్  ఆఫ్ మైండ్ రచయిత లయొనెల్  ఫీల్డెన్ ఇండియాకు వచ్చారు. ఇండియన్ స్టేట్ బ్రాడ్ కాస్టింగ్ సర్వీసెస్ (ISBS) అని కొత్తగా ప్రారంభించిన సంస్థకు ఆయన మొదటి కంట్రోలర్.
ఎందుకో ఆయనకు ఆ పేరు నచ్చలేదు. ఏదైనా చక్కటి పేరు కోసం అయన తపన పడ్డాడు. ఒకరోజు వైస్రాయ్ గౌరవార్ధం ఇచ్చిన విందులో Lord Linlithgow ని కలుసుకుని ఈ మాట చెప్పారు. ఆయన కూడా కాస్త ఆలోచించి ఆలిండియా..అని ఆగిపోయారు. మళ్ళీ ఆయనే బ్రాడ్ కాస్టింగ్ బదులు రేడియో అంటే ఎలా ఉంటుందని అడిగారు. ఆ రెంటినీ కలిపితే  ఆలిండియా రేడియో. ఆ పేరు లయొనెల్  ఫీల్డెన్ గారికి తెగ నచ్చింది. అదే స్థిరపడి పోయింది (ట). దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ఆలిండియా రేడియో భారతీయ భాషల్లో ఆకాశవాణిగా మారిపోయింది (తమిళాన్ని మినహాయిస్తే).
సాయంత్రాలు తీరిగ్గా  కూర్చుంటే ఇలాటి కబుర్లు విశ్వనాధ శాస్త్రి గారు అలవోకగా బోలెడు చెబుతారు.
(ఇంకా వుంది)


11, డిసెంబర్ 2019, బుధవారం

రేడియో రోజులు - 38 - భండారు శ్రీనివాసరావు





(Published in SURYA daily on 11-12-2019, Wednesday)
చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రోజులు.
హైదరాబాదులో ఎర్రమంజిల్ కాలనీ నుంచి జూబిలీ హాల్ కు బయలుదేరాను. అసెంబ్లీ సమావేశాలకు ముందు స్పీకర్ సంప్రదాయంగా ఇచ్చే అల్పాహార విందుకు వెళ్ళాలి. రోడ్డు దాటి అవతల వైపు వెళ్ళి ఆటో పట్టుకోవాలి. ఇవతల ఎక్కుదామంటే ఒక్కడూ రాకపోగా సనత్ నగర్ అయితే తీసుకుపోతా అంటాడు. వాళ్ళతో పనికాదనుకుని సగం రోడ్డు దాటాను. ఇంతలో ముఖ్యమంత్రి వస్తున్న దాఖలాగా పోలీసుల హడావిడి కనిపించింది. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడివాళ్ళను అక్కడే నిలిపేశారు. దాంతో నేను డివైడర్ మీదనే నిలబడిపోయాను. ఈలోగా సీఎం కాన్వాయ్ రావడం పోవడం క్షణాల్లో జరిగిపోయింది. కాన్వాయ్ వెళ్లడం ఆలశ్యం, రోడ్డుమీద ఎక్కడలేని హడావిడి. అప్పటిదాకా నిలబడిపోయిన వాహనాలన్నీ ఒక్కమారుగా బయలుదేరాయి. అంతా అస్తవ్యస్తం. ఒకదానికొకటి అడ్డం. అడిగే నాధుడు లేదు. అప్పటిదాకా ట్రాఫిక్ కంట్రోల్ చేసిన పోలీసులందరూ మంత్రం వేసినట్టు మాయం అయిపోయారు. సీఎం వెళ్ళగానే తమ డ్యూటీ అయిపోయినట్టు వాళ్ల లెక్క కాబోలు. పోలీసులు మరికొద్ది నిమిషాలు వుండి వాహనాల రాకపోకలు అదుపుచేసి వుంటే ఈ పరిస్తితి వుండేది కాదు. నేను ఆటో పట్టుకుని వెళ్ళేటప్పటికే అల్పాహార విందు మొదలయింది. విందు పూర్తి కావస్తుండగా సీఎం సెక్యూరిటీ అధికారి ఇక్బాల్ నాతో అన్నారు, ‘వస్తుంటే దారిలో డివైడర్ మీద నిలబడ్డ మిమ్మల్ని చూసాము, ఒక్కసారి సీఎం గారిని కలవండి, అని. చంద్రబాబు నన్ను చూస్తూనే వచ్చారా సంతోషం, బ్రేక్ ఫాస్ట్ చేశారా, ఎవరక్కడ, వీరిని కనుక్కోండిఅంటూ రోడ్డు మీద నన్ను గమనించిన విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించారు. సిటీలో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది, గట్టిగా ఏదైనా చేయాలి, చూద్దాం అన్నారు.
నేను మళ్ళీ ఇక్బాల్ దగ్గరికి వెళ్లి, 'మరికొద్ది నిమిషాలు పోలీసులు అక్కడ వుంటే కొంపలు మునగవు కదా' అన్నాను. ఆయన నవ్వుతూ, 'అవును మీ సలహా బాగానే వుంది, కమీషనర్ గారితో చెప్పి చూస్తాను' అన్నారు మర్యాదగా.
సలహా బాగానే వుందన్నారు అందరూ. కానీ, ఎన్నేళ్ళు గడిచినా అది పట్టించుకున్నట్టు దాఖలా నాకయితే కనిపించడం లేదు.
ట్రాఫిక్ కు సంబంధించి వై ఎస్ రాజశేఖర రెడ్డితో మరో జ్ఞాపకం వుంది.
హైదరాబాదు ప్రెస్ ఫొటోగ్రాఫర్ల సంఘం వాళ్ళు ఏటా ఒకసారి సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో ఫోటో ఎగ్జిబిషన్ పెడుతూ వుండడం రివాజు. అది జరిగినన్నాళ్ళు ప్రతిరోజూ ఒక అతిధిని ఆహ్వానిస్తుంటారు. అలాగే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా వున్న వైఎస్ రాజశేఖరరెడ్డిని పిలిచారు. రిసీవ్ చేసుకోవడానికి మేమంతా క్లబ్ మెయిన్ గేటు దగ్గర నిలబడి ఉన్నాము. వైఎస్ కారులో కేవీపీ కూడా వున్నారు. రోడ్డుకు అటువైపు వున్న ఈనాడు మీదుగా వెళ్లి యూ టర్న్ తీసుకుని రావాలి. టర్న్ తీసుకునేలోగానే, సీఎం వస్తున్నారని పోలీసులు ట్రాఫిక్ నిలిపి వేసారు. ఎదురుగా వున్న రోడ్డులో వాహనాల నడుమ నిలిచివున్న వైఎస్ కారుని ఇటువైపునుంచి మేము చూస్తూనే ఉన్నాము. కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ రావడం, సచివాలయం వైపు దూసుకు పోవడం జరిగింది. ట్రాఫిక్ కదిలింది. మలుపు తీసుకు వచ్చిన వైఎస్ కారు క్లబ్ దగ్గర ఆగకుండా గేటు దగ్గర నిలబడి వున్న మా కళ్ళ ముందే, ముందుకు వెళ్ళిపోయింది. వెంటనే నేను కేవీపీ మొబైల్ కి ఫోను చేశాను. ఆయన అరెరే! బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ అనుకున్నాముఅని నొచ్చుకుంటూ చెప్పారు. ఆ వెంటనే విశ్వేశ్వరయ్య చౌరాస్తాలో మళ్ళీ వెనక్కి తిరిగి క్లబ్ కి చేరుకున్నారు.
ఒకసారి ఏదో ప్రెస్ మీట్ కి వెళ్లి తిరిగి రేడియో స్టేషన్ కు వెడుతున్నాను. లక్డికా పూల్ దగ్గర స్కూటర్ తో సహా ట్రాఫిక్ లో చిక్కుకు పోయాను. ఎంతసేపు చూసినా వాహనాలు కదిలే సూచన కనబడడం లేదు. విసుగనిపించి అటూ ఇటూ చూస్తున్నాను. నా పక్కన ఓ కారు ఆగివుంది. అద్దం వెనుక మనిషిని చూడగానే నా చిరాకంతా పటాపంచలు అయిపొయింది. ఆయన ఎవరో కాదు, రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ శ్రీ హెచ్.జే. దొర.
ఆఫీసుకు వచ్చిన తర్వాత ఫోన్ చేసి ఏమిటి మీకూ తప్పవా ఈ ట్రాఫిక్ కష్టాలు అని అడిగితే దొరగారు చెప్పిన మాట నాకిప్పటికీ ఓ భగవద్గీత.
నేను ట్రాఫిక్ లో చిక్కుకుంటే మీకు వార్త. కానీ నాకది ఓ పాఠం. ఏదైనా సరిదిద్దాలి అనుకుంటే పనికొచ్చే అనుభవం. అప్పుడు వందల మంది అలాగే చిక్కుకు పోయి వున్నారు. నేనూ  అలాగే. కాకపోతే సెట్లో చెప్పి వెంటనే ట్రాఫిక్ సజావుగా సాగేట్టు చూశాను. 
(ఇంకా వుంది)

9, డిసెంబర్ 2019, సోమవారం

రేడియో రోజులు - 37 - భండారు శ్రీనివాసరావు


ఓ ముప్పయ్యేళ్ళ క్రితం, నేనే నా స్కూటరు కిందపడి కాలు విరగ్గొట్టుకున్నాను.
ఆ విరిగిన కాలుతో ఇంట్లోనే  కాలుక్షేపంచేస్తున్న ఆ రోజుల్లో,  నాకు పొద్దుగడవడం కోసం జ్వాలా పూనికతో ఎంసీఆర్ హెచ్ ఆర్డీ డైరెక్టర్ జనరల్ పీవీఆర్కే ప్రసాద్ గారు, తెలుగు మాతృభాష కాని ఐఏఎస్ ట్రైనీలకి తెలుగు బోధించే పని నాకు అప్పగించారు.  ఇంట్లోనే  వుండి కాలు బయట పెట్టకుండా చేసే సద్యోగం. ఆ ఐ.ఏ.ఎస్. ట్రైనీలు అప్పుడు తాత్కాలికంగా గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్ లో వుంటుండేవాళ్ళు. మేము వుండే దుర్గానగర్ కు దగ్గర. అంచేత ఉదయమో, సాయంత్రమో వీలు చేసుకుని ఆ యువ అధికారులు అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. చాలా కలివిడిగా వుండేవాళ్ళు. నా దగ్గర నేర్చుకున్న తెలుగు వారికి యెంత ఉపయోగపడిందో తెలియదు కాని పోటీ పరీక్షలు రాసి జీవితంలో అనుకున్నది సాధించిన కొందరు యువకులతో సన్నిహితంగా వుండే అవకాశం మాత్రం నాకు లభించింది. తెలుగు సంగతి అలా పెడితే, మా ఆవిడ మాత్రం వారికి అచ్చ తెలుగు వంటకాలను బాగానే పరిచయం చేసింది. అలాగే, మా ఆవిడ చేసిపెట్టే తెలుగు చిరుతిండ్లకు మాత్రం బాగా అలవాటు పడ్డారు.
వారిలో ఒకరు తదనంతర కాలంలో విజయవాడ సబ్ కలెక్టర్ అయ్యారు. అప్పట్లో కూడా ఇసుకకు బాగా గిరాకీ వుండేది. గిరాకీ వున్నా చోట మాఫియా కూడా వుంటుంది. ఈ యువ అధికారి ఆ మాఫియాకు గొంతులో వెలక్కాయ కావడంతో బదిలీ తప్పలేదు. మంచి అధికారి, నా దగ్గర తెలుగు నేర్చుకున్నాడు అనే భావనతో నా అంతట నేనే వెళ్లి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని  కలిసి చెప్పాను. ఆయన రవీంద్ర భారతిలో జరిగే ప్రజాప్రతినిధులు, మునిసిపల్ అధికారుల సమావేశానికి వెళ్ళే హడావిడిలో వున్నారు. ఆ సమావేశంలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి చెప్పారు.
ఇంతవరకు మునిసిపల్ కమీషనర్లుగా ఐఏఎస్ అధికారులను నియమించలేదు. మునిసిపాలిటీలలో పరిస్తితులను మెరుగుపరచడానికి ఇప్పుడాపని చేద్దామనుకుంటున్నాను. ముందు ఏలూరుతో మొదలెడతాను. సంజయ్ అని సమర్దుడయిన అధికారిని ఏలూరు మునిసిపల్ కమీషనర్ గా వేస్తున్నాను
సబ్ కలెక్టర్ గా పనిచేసిన అధికారికి మునిసిపల్ కమీషనర్ పదవి ఇష్టమో కాదో నాకు తెలవదు. కానీ, మంచి పనులు చేయడానికి ఆ ఉద్యోగం కూడా పనికి వస్తుంది అని తెలుసు. పైగా సిఎం అంతటి వాడే సమర్ధుడుఅని ఇచ్చిన కితాబు ఇంకా గొప్పది కదా!
 పొతే, బెన్ హర్ మహేష్ ఎక్కా. ఐ.ఏ.ఎస్.
ఆయన్ని చివరిసారి  చూసి కాస్త అటూ ఇటూగా ముప్పయ్యేళ్ళు.  మనిషి రూపం సరే, పేరు కూడా గుర్తులేదు. రాత్రి అన్నంలో వేసుకుంది ఏ కూర అంటే చప్పున చెప్పలేని గొప్ప జ్ఞాపక శక్తి నాది.
ఆ విషయంలో జ్వాలాని మెచ్చుకుని తీరాలి. స్నేహితులు, సన్నిహితులవే కాక అప్పటికప్పుడు పరిచయం అయిన వ్యక్తుల పేర్లు, ఫోను నెంబర్లు అన్నీ ఆయనకి కరతలామలకం. నిజానికి ఆయన ఫోను చేసి చెప్పబట్టే బెన్ హర్ ఎక్కాని కలవడం జరిగింది. నీకు ఆయన తెలుసు, ఐఏఎస్ ప్రోబెషనర్లగా వున్నప్పుడు ఆయన బ్యాచ్ కి నువ్వే తెలుగు పాఠాలు చెప్పావు, మరచిపోయావాఅని కూడా అన్నాడు. నాకయితే ఈ బెన్హర్ మహాశయుల రూపం కూడా గుర్తుకు రాలేదు.
సరే! ఒకరోజు ముందు ఫోను చేసి టైం తీసుకుని, పల్లె ప్రాంతాలలో పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు రూపొందించే  క్రియ సంస్థ సీఈఓ డాక్టర్ బాలాజీని తీసుకుని సచివాలయానికి వెళ్లాను.
డాక్టర్  బాలాజీ మామేనల్లుడు డాక్టర్ రంగారావు (108, 104 రూపశిల్పి)కు  స్నేహితుడు. పైగా 104 కు సీయీఓగా కూడా పనిచేశారు.
అనుకున్న టైంకి బెన్ హర్ ఎక్కాను వారి ఆఫీసులో కలిశాము. 
గిరిజనుల ఆరోగ్యాలకు సంబంధించిన అంశంపై డాక్టర్ బాలాజీ బెన్ హర్ మహేష్ ఎక్కాకు వివరిస్తున్నారు. మధ్య మధ్యలో బెన్ హర్ ఎక్కా నా వైపు చూస్తున్నారు. నేను కూడా తేరిపార చూసాను కానీ నా దగ్గర తెలుగు నేర్చుకున్న అధికారులు ఎవ్వరూ ఆ క్షణంలో నాకు స్పురణకు రాలేదు. లేచి వస్తున్నప్పుడు బెన్ హర్ నాతో అన్నారు.
నేను, సంజయ్, వెంకటేశం ఇంకా కొంతమందిమి మీ ఇంటికి వచ్చే వాళ్ళం. ఆ రోజుల్లో మీకు కాలు ఫ్రాక్చర్ అయి ఇంట్లో వున్నారు
నాకు లైట్ వెలిగింది. అయన ఎవరో గుర్తుకు వచ్చింది.
అప్పుడు మా ఇంటికి వచ్చి వెళ్ళే రోజుల్లో ఆయన  ఐ.ఏ.ఎస్. ట్రైనీ. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రభుత్వ శాఖకు ప్రిన్సిపల్ సెక్రెటరీ.
అయినా ఇంతకాలం గడిచిన తర్వాత కూడా నేను ఆయనకు గుర్తున్నాను అంటే ఆశ్చర్యమే మరి.
బహుశా బెన్ హర్ ఎక్కా అనే ఆ యువకుడు  ఐ.ఏ.ఎస్., అందుకే  అయ్యారేమో.
(ఇంకా వుంది)  


8, డిసెంబర్ 2019, ఆదివారం

రేడియో రోజులు – 36 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 08-12-2019, SUNDAY)

రేడియోలో పనిచేయడం వల్ల ఉషశ్రీకి పేరు ప్రఖ్యాతులు లభించాయా లేక  ఉషశ్రీ ద్వారా రేడియోకి శ్రోతల ఆదరణ పెరిగిందా అని వాదులాడుకునే రోజులు నాకు తెలుసు. నేతికి గిన్నె ఆధారమా లేక గిన్నెకు నెయ్యి ఆధారమా అనే ఎడతెగని మీమాంసల జాబితాలో ఇది కూడా చేరిపోయి వుంటుంది.
అసలు రేడియో ఏమిటి ? ఈ ఉషశ్రీ ఎవరు? ఏమిటి ఆయన గొప్పతనం అని ప్రశ్నించే నవతరం వారికి అర్ధం కావడం కోసం ఒక ఉదాహరణ చెబుతాను.
దూరదర్శన్ ఒక్కటే ఆసేతుహిమాచలం రాజ్యమేలుతున్నకాలంలో, అప్పుడప్పుడే కలర్ టీవీలు మార్కెట్లలో కుడి కాలు మోపుతున్న  రోజుల్లో హిందీ చలనచిత్ర రంగాన్ని తన కనుసన్నల్లో శాసిస్తున్న రామానంద సాగర్ అనే చిత్ర ప్రముఖుడి కన్ను, బుడిబుడి నడకల బుల్లితెరపై పడింది. తాను మొదలు పెట్టిన ఆ ప్రయత్నం తన శేష జీవితాన్ని సార్ధకం చేయబోతున్నది అనే ఎరుక అప్పట్లో ఆయనకు కలిగిందో లేదో తెలియదు కానీ, యావత్ భారత దేశప్రజలు భాషతో నిమిత్తం లేకుండా ఆయన నిర్మించిన రామాయణ, భారతాలను వీక్షించడానికి ఇళ్ళల్లో టీవీలకు అతుక్కుపోయేవాళ్ళు. టీవీలు లేని వాళ్ళు పొద్దున్నే హడావిడిగా కాఫీలు, టిఫిన్లు పూర్తిచేసుకుని ఇరుగిల్లలో, పొరుగిళ్లలో రామాయణం చూడడానికి టైముకు ముందే చేరుకునేవాళ్ళు. వీధులన్నీ నిర్మానుష్యంగా బోసిపోయినట్టు, అప్రకటిత కర్ఫ్యూ విధించినట్టు ఉండేవి. ప్రతిఇల్లూ ఓ  రామాయణ లోగిలిగా మారిపోయేది. ఆ సమయంలో ఏదైనా జరూరు పని వుండి బయటకు వెళ్ళాల్సిన వాళ్ళకు  రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ళల్లో టీవీల నుంచి రామాయణం డైలాగులు వినబడుతుండేవి. వెనుకటి రోజుల్లో రేడియోలో ఆదివారం మధ్యాన్నం సంక్షిప్త శబ్ద చిత్రం విన్నట్టు దారిపొడుగునా పెద్దగా వినబడే రామాయణం శబ్దాలు వింటూ సాగిపోయేవారు, ఆ వారం రామాయణం చూడలేదనే బాధ లేకుండా.
అలనాడు, రేడియోలో ఉషశ్రీ రామాయణ, భారతాలు ప్రసారం అయ్యే రోజుల్లో కూడా దాదాపు ఇదే పరిస్తితి. ప్రసార సమయానికల్లా అందరూ పనిపాట్లు ముగించుకుని రేడియోల చుట్టూ మూగేవారు. పల్లెటూళ్ళలో సంగతి చెప్పక్కరలేదు. రామాయణ, భారత ప్రవచనాలు వింటున్నట్టుగా పరవశించి పోయేవారు.              
మరో ఉదాహరణ చెప్పుకుందాం.
వాల్మీకి రామాయణం, మొల్ల రామాయణం లాగా ఉషశ్రీ రామాయణం ఒక బ్రాండుగా మారిపోయింది. ప్రత్యేకంగా ఆ కార్యక్రమంకోసమే రేడియో వినే శ్రోతల సంఖ్య నానాటికీ పెరుగుతూ పోయింది. 1980లో జరిగిన కృష్ణా పుష్క‌రాల‌కు ఉష‌శ్రీ త‌న గంభీర గ‌ళంతో ప్ర‌త్య‌క్ష వ్యాఖ్యానం ఇచ్చారు. అది కూడా బాలాంత్రపు ర‌జ‌నీకాంత‌రావుగారి ప్రోద్బ‌లంతో. పుష్క‌రాల‌కు ప్ర‌త్య‌క్ష వ్యాఖ్యానం చెప్ప‌డం అదే మొద‌లు. పుష్క‌ర స్నానాలకు వెళ్ల‌లేనివారికి ఆ న‌దీసంరంభాన్ని క‌ళ్ల‌ముందుంచారు ఉష‌శ్రీ‌. ప్ర‌ముఖ క‌థా ర‌చ‌యిత శ్రీ‌ర‌మ‌ణ‌గారు ఈ పుష్క‌రాల విష‌యం వ‌చ్చిన‌ప్పుడు ఒక మాట చెప్పేవారు. విజ‌య‌వాడ న‌గ‌రానికి పుష్క‌ర స్నానం చేయ‌డానికంటే ఉష‌శ్రీ గారిని చూడ‌టానికి చాలామంది వ‌చ్చార‌న్నది ఆ మాటలోని భావం.
సహజంగానే ఇటువంటి పేరు ప్రఖ్యాతులు ఆఫీసులో పైవారికి కంటగింపుగా మారుతుంటాయి. ఒక రోజు రేడియోలో ఓ పెద్దాయన ఉషశ్రీ గారిని మర్యాదగానే అడిగారట, ‘ఏమిటండీ మీ భారతం ఇంకా ఎన్నాళ్ళు? ఎప్పుడు ముగుస్తుంది’ అని. ఉషశ్రీ గారికి అందులోని శ్లేష అర్ధం అయింది. ఈయన పండితుడాయే. అంత సుతిమెత్తగానే నెత్తిన మొట్టినట్టు, ‘అబ్బే! అప్పుడే ఎక్కడండీ! ఇంకా చాలా వుంది. ఇప్పుడేగా సైంధవుడు అడ్డం పడింది’ అన్నారుట.
మరి వీరి మాటల్లోని శ్లేష ఆయనకు అర్ధం అయిందో లేదో తెలియదు.
ఎందుకంటే అయన అధికారే కానీ, పండితుడు కాదుకదా!
ఉషశ్రీ  అసలు పేరు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు అగ్రహారంలో 1928 (ప్రభవ) సంవత్సరం మార్చి 16 (ఫాల్గుణ బహుళ త్రయోదశి) న జన్మించారు. తండ్రి పురాణపండ రామ్మూర్తి. ఆయుర్వేద వైద్యులు, తల్లి కాశీ అన్నపూర్ణ. జాతీయోద్యమ సమయంలో కాకినాడలో కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా పనిచేశారు. ఆ తరువాత పురాణపండ రామ్మూర్తి  గారు ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక వేదికల మీద రామాయణంమహాభారతం మహాభాగవతం ప్రవచనాలు చేశారు. బహుశా ఈ ప్రవచన ప్రతిభను తండ్రి నుంచే వారసత్వంగా ఉషశ్రీ గారు పుణికి పుచ్చుకుని వుంటారు. తదనంతర కాలంలో ఆకాశవాణిలో చేరినప్పుడు ఒక వ్యాఖ్యాతగా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఆర్జించడానికి ఈ ప్రతిభే ఉషశ్రీ గారికి ఉపయోగపడి వుంటుంది. వారం వారం రామాయణ మహా భారతాలను ఆకాశవాణి నుండి తన స్వరంతో ప్రవచించారు. 1973 లో రేడియోలో భారత ప్రవచనం ప్రారంభించారు. అప్పట్లోదూరదర్శన్ లేదు. ఉషశ్రీ పురాణ పఠన కార్యక్రమం వారానికి ఒకసారి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం అయ్యేది.  ఆ సమయానికల్లా శ్రోతలు గంట కొట్టినట్టు  రేడియోల ముందు మూగేవారు. ఆ అరగంటసేపు బయట ప్రపంచాన్ని మరచి ఆ పురాణ గాధలలో మునిగి తేలిపోయేవారు.
రేడియో వ్యాఖ్యాతగా,  సాహిత్య రచయితగా ప్రఖ్యాతి గాంచిన ఉషశ్రీ గారు తన రామాయణ భారత ప్రవచనాల ద్వారా తెలుగునాట అందరికీ సుపరిచితులయ్యారు. ఆప్పట్లో ఆయన గొంతుని, మాట సరళిని గుర్తు పట్టలేని తెలుగు శ్రోత లేరంటె అతిశయోక్తి కాబోదు.
‘బ‌య‌లు దేరింది ర‌థం..’ అంటూ త‌న ప్రవ‌చ‌నాన్ని ప్రారంభించేవారు ఉష‌శ్రీ‌. ప్రవ‌చ‌న రూపంలో హైంద‌వ ధ‌ర్మాన్నీ, విలువ‌ల‌నూ అంద‌రికీ చేర్చాల‌ని త‌పించారాయ‌న‌. ఇందుకోసం ఏనాడూ రాజీ ప‌డ‌లేదు. అవ‌స‌ర‌మైన చోట వారు వీరూ అని చూడ‌కుండా ప్ర‌ముఖుల‌ను సైతం మంద‌లించేవారు.  అందుకు ఎవ్వ‌రూ ఏనాడూ నొచ్చుకున్న  దాఖలా లేదు. అలా దారి వెంట వెళ్ళే వారు సైతం ఉష‌శ్రీ కంఠ‌స్వ‌రంలోని అద్వితీయ‌మైన స‌మ్మోహ‌న త‌త్వానికి ఆక‌ర్షితుల‌య్యేవారు. అప్ర‌య‌త్నంగా కాళ్ళు వారిని ఆ వేదిక‌కు చేర్చేవి. ముఖ్యంగా యువ‌త‌రం అంటే ఆయ‌న‌కు చాలా ఇష్టం. భావిభార‌త పౌరులుగా హిందూ ధ‌ర్మ బాధ్య‌త‌ను మోయాల్సినది వారేన‌ని ప్ర‌తి చోట చెప్పేవారు. ఓసారి భీమ‌వ‌రం క‌ళాశాల‌లో ఉష‌శ్రీ ప్ర‌సంగిస్తుండ‌గా విద్యార్థులు గోడ‌పై కూర్చుని గొడ‌వ చేశార‌ట‌. వెంట‌నే ఉష‌శ్రీ‌.. కోతుల్లా ఏమిటీ గోల అన్నార‌ట‌. వారికెంతో కోపం వ‌చ్చినానా యాగీ చేశారట. మీలాంటి వానర సైన్యంతోనే రాముడు రావ‌ణుడిని జ‌యించాడు, మీరు లేనిదే దేశ‌ప్ర‌గ‌తి సాధ్య‌ప‌డ‌దు అనగానే వారి కోపం చ‌ల్లారిపోయింద‌ట‌. అంత‌వ‌ర‌కూ గొడ‌వ చేసిన విద్యార్థులు మెత్త‌బ‌డి, ఉషశ్రీ  ప్ర‌సంగం మొత్తాన్ని ఆస‌క్తిగా విన్నార‌ట‌. పూర్త‌యిన త‌ర‌వాత విద్యార్థులు గుంపుగా ఉష‌శ్రీ‌గారి ద‌గ్గ‌ర‌కు గ‌బ‌గ‌బ వెడుతుండ‌డం గ‌మ‌నించిన నిర్వాహ‌కుల‌కు గుండె ద‌డ‌ద‌డ‌లాడింద‌ట‌. కానీ ద‌గ్గ‌ర‌కు వెళ్ళే స‌రికి జ‌రిగింది వేరు. అంద‌రి చేతుల్లో నోట్ పుస్తకాలు. ఉష‌శ్రీ ఆటోగ్రాఫ్ కోసం ఎగ‌బ‌డ‌డం చూసి అంతా నివ్వెర‌పోయార‌ట‌. అదీ ఉష‌శ్రీ‌. భార‌తంలో స‌హ‌దేవుణ్ణి మొట్ట‌మొద‌టి న‌క్స‌లైట్ అని ఉష‌శ్రీ విశ్లేషించిన‌ప్పుడు ప‌త్రిక‌లు ఆ అంశాన్ని మొద‌టి పేజీల్లో బాక్స్ ఐట‌మ్‌గా ప్ర‌చురించాయి. భార‌తాన్నీ, స‌హ‌దేవుణ్ణీ కించపరిచారని ఎవరూ వివాదాలు సృష్టించలేదు. ఉష‌శ్రీ‌ని త‌ప్పు ప‌ట్ట‌లేదు.
భువ‌న విజ‌యం. ఇదొక అద్భుతమైన  సాహిత్య ప్ర‌క్రియ‌. 16వ శ‌తాబ్దంలో కృష్ణదేవ‌రాయల‌ ఆస్థానంలో అష్ట దిగ్గ‌జాలు కొలువుదీరి నిర్వ‌హించిన‌ సాహిత్య గోష్టే భువ‌న విజ‌యం. ఆ త‌ర‌వాత అది కొంత‌కాలం క‌నుమ‌రుగైంది. అదే ప్ర‌క్రియ‌ను తిరిగి ఉష‌శ్రీ ప్రారంభించారు.  తొలిసారిగా ఉష‌శ్రీ స్వ‌స్థ‌లం ఆల‌మూరులో ఆధునిక భువ‌న విజ‌యాన్ని నిర్వ‌హించారు. ఉద్దండులైన విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ, జ‌మ్మ‌ల‌మ‌డ‌క మాధ‌వ‌రామ శ‌ర్మ‌, వెంప‌రాల సూర్య‌నారాయ‌ణ‌ వంటి వారు ఇందులో పాల్గొన్నారు. ఇది 1956కు పూర్వం ప్రారంభించి సుమారు నాలుగు ద‌శాబ్దాల పాటు వంద‌ల సంఖ్య‌లో భువ‌న విజ‌యాల‌ను ప్ర‌ద‌ర్శించారు. తెలుగు రాష్ట్రం న‌లుచెర‌గులాఈ ప్ర‌క్రియ‌ను ఆవిష్క‌రించారు. భువ‌న విజ‌య ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో ఉష‌శ్రీ తిమ్మ‌రుసు పాత్ర పోషించారు.
ధ‌ర్మ‌సందేహాలు కార్య‌క్ర‌మంతో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన పేరును సంపాదించుకున్న ఉష‌శ్రీ గారి గ‌ళంతో రామాయ‌ణ-భార‌త మ‌హేతిహాసాలు క్యాసెట్ల రూపంలో యావ‌దాంధ్రుల‌కూ చేరాల‌ని పారుప‌ల్లి శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తిగారు సంక‌ల్పించారు. ఆ ప్ర‌య‌త్న ఫ‌లిత‌మే ఉష‌శ్రీ భార‌తం, ఉషశ్రీ రామాయ‌ణం. ఈ రెండిటికీ ఆ సంస్థ చెల్లించింది చాలా త‌క్కువ మొత్తం. ఈ క్యాసెట్ల‌లో ప‌ద్యాల‌ను పారుప‌ల్లి శ్రీ‌రంగ‌నాథ్‌గారు పాడారు. ఆయ‌న శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తిగారి సోద‌రులే. తిరుమ‌ల‌-తిరుప‌తి దేవ‌స్థానం అన్న‌మాచార్య ప్రాజెక్టులో ప‌నిచేశారాయ‌న‌.
ఆకాశ‌వాణి విజ‌య‌వాడ కేంద్రం నుంచి వారం వారం ధ‌ర్మ‌సందేహాలు కార్య‌క్ర‌మం ద్వారా శ్రోత‌ల‌కు సుప‌రిచితులైన ఉష‌శ్రీ త‌న గంభీర గ‌ళంతో యావ‌దాంధ్ర దేశాన్ని నైమిశ‌త‌పోవ‌నంగా మార్చారు. ఆయ‌న విల‌క్ష‌ణ‌మైన గాత్ర‌మే ఆయ‌నను అంద‌రికీ చేరువ చేసింది.
జీవించి ఉన్న ప్ర‌ముఖులపై ప్ర‌త్యేక సంచిక‌ల‌ను తేవాల‌నేది ఉష‌శ్రీ సంక‌ల్పం. అందుకు మిత్రులు, పెద్ద‌లులతో పాటు ఆయన  తండ్రి గారి ప్రోత్సాహం కూడా ల‌భించింది. పురాణ‌పండ రామ‌మూర్తిగారి సంపాద‌క‌త్వంలో విశ్వ‌శ్రీ ప‌త్రిక స్థాపించారు ఉష‌శ్రీ‌. 1954 జ‌న‌వ‌రిలో విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ‌గారిపై ప్ర‌త్యేక సంచిక‌ను తీసుకొచ్చారు. ఉష‌శ్రీ వ‌య‌సు అప్ప‌టికి 28.
ఉషశ్రీ గారి సాహిత్య అభిలాష, సనాతన ధర్మంపై ఆయనకు ఉన్న మక్కువ అంతాఇంతా కాదు. వారి ఆశయాల కొనసాగింపు కోసం వారి కుటుంబసభ్యులు, డాక్ట‌ర్ గాయ‌త్రి, ప‌ద్మావ‌తి, డాక్ట‌ర్ వైజ‌యంతి, క‌ల్యాణ‌ల‌క్ష్మి కలిసి  ఉషశ్రీ మిషన్  పేరుతొ ఒక సంస్థను నిర్వహిస్తున్నారు. ఆయన గళం అజరామరం. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషిని నాలుగు కాలాలపాటు పరిరక్షించడం ఈ ఉషశ్రీ మిషన్ ధ్యేయం.
(ఇంకా వుంది)