22, నవంబర్ 2019, శుక్రవారం

రేడియో రోజులు -22 – భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 22-11-2019, Friday)

వార్తలు చదువుతున్నది దుగ్గిరాల పూర్ణయ్య
ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు చదివినవారిలో మరో ప్రసిద్ధులు దుగ్గిరాల పూర్ణయ్య

(శ్రీ దుగ్గిరాల పూర్ణయ్య)

ఆరోజుల్లో రేడియో కళాకారులకు, న్యూస్ రీడర్లకు సినీ రంగంతో పాటు దీటైన ఆకర్షణ వుండేది. వారిని సాంస్కృతిక కార్యక్రమాలకు, వేడుకలకు ముఖ్య అతిధులుగా ఆహ్వానించి సత్కరించేవారు. అయితే స్వతహాగా నిరాడంబర జీవితం గడిపే పూర్ణయ్య వీటన్నిటికీ దూరంగా వుండేవారు. ప్రముఖులతో సాన్నిహిత్యం పెంపొందించుకోగల అవకాశాలు వృత్తిపరంగా ఎన్నో ఉన్నప్పటికీ ఆయన మాత్రం  తన పనేదో తనేమో అన్నట్టు జీవితం సాగించారు.
సినిమా రంగంలో ఒక మాట వినబడుతూ వుంటుంది. డాక్టర్ కాబోయి యాక్టర్ అయినాడని. దుగ్గిరాల వారిది కూడా ఓ మోస్తరుగా ఇదే కధ. కృష్ణా జిల్లా నుంచి బతుకు తెరువు కోసం ఢిల్లీ వెళ్ళిన పూర్ణయ్య గారికి ఒక చిన్న కొలువు దొరికింది. బీజేపీ అగ్ర నాయకుడు ఎల్.కే.అద్వాని (అప్పుడు జనసంఘం) నడిపే ఒక పత్రికలో పనిచేస్తున్నప్పుడు పూర్ణయ్య గారి పనితీరు వారికి నచ్చింది. వారిరువురి నడుమ సాన్నిహిత్యం పెరిగింది. అద్వానీ గారి మాట సాయంతో ఆలిండియా రేడియోలో ఉద్యోగం వచ్చింది. ఆ విధంగా ఆయన న్యూస్  రీడర్ కాగలిగారు.   
రేడియో ఉద్యోగం కొత్త. అయినా ఆయన త్వరగానే ఆ కొత్త కొలువులో ఒదిగిపోయారు. ఇంగ్లీష్ నుంచి వార్తల్ని తెలుగులోకి తర్జూమా చేసి, స్టూడియోలో లైవ్ చదవడంపై పట్టు సాధించారు. మనిషి పీలగా కనిపించినా వారిది కంచు కంఠం. వేరే ధ్యాసలు లేకుండా కేవలం వృత్తి ధర్మాన్ని నిర్వహించే స్వభావం కావడం వల్ల దుగ్గిరాల పూర్ణయ్య గారికి రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాలేదని బాధ పడే అభిమానులు కూడా వున్నారు.
నేను మాస్కో వెళ్ళేటప్పుడు ఢిల్లీలో పూర్ణయ్య గారిని కలుసుకున్నాను. మాస్కో రేడియోలో పనిచేసే అవకాశం ఆయనకే ముందు వచ్చినా ఆయన కాదనుకుని ఢిల్లీలోనే వుండిపోయారు.
ఎనభై పదులు దాటిన  పూర్ణయ్య గారు, అనేక దశాబ్దాల క్రితం వదిలి వెళ్ళిన స్వగ్రామం, గుడివాడ దగ్గర అంగలూరులో భార్య  శ్రీమతి లక్ష్మితో కలిసి ఇప్పుడు శేష జీవితం గడుపుతున్నారు.
(ఇంకా వుంది)       


21, నవంబర్ 2019, గురువారం

రేడియో రోజులు - 21 - భండారు శ్రీనివాసరావు

(Published in SURYA daily on 21-11-2019, Thursday)
వార్తలు చదువుతున్నది అద్దంకి మన్నార్  
“మన్నార్. అంటే మన  తెలుగు వాడేనా. కాకపొతే  తెలుగులో ఈయన చేత వార్తలు ఎందుకు చదివిస్తున్నారు? ఇంటి పేరు అద్దంకి కదా! తెలుగువాడే అనడానికి వేరే రుజువెందుకు?’
ఇలా సాగేవి చిన్నప్పుడు ఊళ్ళల్లో పంచాయతీ  రేడియో వింటూ చర్చలు.
అద్దంకి మన్నార్ పదహారణాల తెలుగువాడు.  పూర్తి పేరు అద్దంకి ఎంబెరు మన్నార్. మాటా, పలుకూ, ఆహార్యం ఇలా అన్నింటా తెలుగుతనం తొణికిస లాడేది. పైగా సంప్రదాయానికీ, ఆచార వ్యవహారాలకు పెద్ద పీట వేసే కుటుంబం నుంచి వచ్చిన వాడు.
మన్నార్ కుమారుడు అద్దంకి రాం కుమార్ కూడా రేడియోలోనే పనిచేసి రిటైర్ అయ్యాడు. తాను రూపొందించిన అనేక కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో సైతం పురస్కారాలు అందుకున్నాడు. నేను రేడియోలో పనిచేసిన రోజుల్లో మా వార్తా విభాగంలోనే పనిచేస్తూ అందరికీ తలలో నాలిక మాదిరిగా ఉండేవాడు. ఎప్పుడో పూర్వ కాలంలో  రేడియోలో తమ గొంతు వినిపించిన అనేక మంది ప్రసిద్దుల స్వరాలను రాం కుమార్ భద్రపరిచి ఉంచాడు. తండ్రికి నిజమైన వారసుడు అనిపించుకున్నాడు. 
ఆయన మన్నార్ గురించి చెప్పిన ఓ కధనం ఆసక్తిదాయకంగా వుంది.
“చాలా ఏళ్ళ క్రితం రాజీవ్ గాంధి ప్రధాన మంత్రిగా వున్నప్పుడు ఓసారి ఢిల్లీలోని పార్లమెంటు  భవనంలోని ఒక సమావేశ మందిరంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేశారు. భోజన విరామానికి కొద్దిసేపటికి   ముందు, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  ఎన్టీ రామారావు గారు కాసేపు అనర్ఘలంగా తెలుగులో ప్రసంగించారు. ఎన్టీఆర్ మాట్లాడిన అంశాలను రాజీవ్ గాంధి తనపక్కనే కూర్చున్న పీవీ నరసింహారావు గారిని అడిగి తెలుసుకున్నారు.
“భోజన విరామ సమయంలో పీవీ పనుపున ఇద్దరు అధికారులు పక్కనే వున్న రేడియో స్టేషన్ కు వెళ్ళారు. తెలుగు విభాగంలో అప్పుడు దుగ్గిరాల పూర్ణయ్య, అద్దంకి మన్నార్ కూర్చుని పనిచేసుకుంటున్నారు. అనువాదపు పని అని చెప్పగానే పూర్ణయ్య గారు నేను బులెటిన్ చూసుకుంటాను, మీరు వెళ్లండని మన్నార్ గారికి పురమాయించారు. మన్నార్ వెళ్లి పీవీ గారిని కలిసారు. భోజనాలు అయిన తర్వాత మళ్ళీ ఆయన (ఎన్టీఆర్) మాట్లాడతారు, అదేదో తెలుగులో రాసి తనకిమ్మన్నారు, పీవీ.  ఆయనతో ఉన్న చనువుతో మన్నార్, ‘అయ్యా. నేను ముక్కస్య ముక్క అనువాదం చేయలేను. అందులో ఎన్టీఆర్ గారిది గ్రాంధిక తెలుగు’ అనడంతో పీవీ నవ్వేశారు.
ఎన్టీఆర్  తో  మన్నార్ కి కూడా పరిచయం వుంది. తన ప్రసంగాన్ని తెలుగులో అనువదించేందుకు మన్నార్ ని పిలిపించారని ఎన్టీఆర్ కి  అర్ధం అయింది. భోజన విరామం తర్వాత ఆయన తెలుగు జోలికి పోకుండా మొత్తం ఇంగ్లీష్ లోనే ప్రసంగం పూర్తి చేశారు”
అద్దంకి మన్నార్ ఆకాశవాణి తరపున మాస్కో వెళ్లి రేడియో మాస్కోలో కొంతకాలం పనిచేశారు. ఆరోజులలో తన అనుభవాలను వివరిస్తూ ‘ప్రావ్దా’ అనే చిన్ని పుస్తకాన్ని రచించారు.     
మల్లాది సూరిబాబు గారు ఆంద్రభూమి పత్రికలో ధారావాహికంగా రాసిన వ్యాస పరంపర ఒకదానిలో అద్దంకి మన్నార్ గారి ప్రసక్తి వుంది. ఈ వ్యాసం చదివిన తర్వాతనే మన్నార్ న్యూస్ రీడర్ కాకముందు విజయవాడ రేడియో కేంద్రంలో కొన్నేళ్ళు అనౌన్సర్ గా పనిచేసిన విషయం తెలిసింది.
అందులో మల్లాది గారు ఇలా రాసారు.
“మాటల్లో గంభీరత, స్పష్టత, చక్కని శ్రుతి, మాధుర్యం ఎనౌన్సర్‌కుండవలసిన లక్షణాలు. మనిషి ఎదురుగా లేకుండా కంటికి కనిపించకపోయినా గొంతు మాత్రం చెవికి ఆకర్షణగా వినాలనిపించేలా వుండాలి.
ఎనౌన్సర్ వేరు. న్యూస్ రీడర్ వేరు. చదివే విధానంలో తేడా వుంటుంది. విజయవాడ రేడియో కేంద్రం ప్రారంభమైన తొలి రోజుల్లో 1959లో ఎనౌన్సర్‌గా చేరి న్యూస్ రీడర్‌గా ప్రసిద్ధుడైన ఎంబెర్ మన్నార్ ని  ఈతరం వారెరుగరు.
విలక్షణమైన గొంతు, 20 నిమిషాల్లో చదవవలసిన వార్తల్ని పదే పది నిమిషాల్లో వేగంగా అత్యంత స్పష్టంగా చదవగలిగిన ఏకైక వ్యక్తి ఈ అద్దంకి మన్నారు. స్వగ్రామం నూజివీడు సమీపంలోని చిన్న గ్రామం కానుమోలు. రేడియోకు కొన్ని ప్రమాణాలున్నాయి. బహిరంగంగా మనం ఇష్టపడి అభిమానించి ఎన్నుకున్న రాజకీయ నాయకులు చేసే ఉపన్యాసాల్లో తోలు తీస్తా, తాట తీస్తాలాంటి మాటలున్నా యథాతథంగా వార్తల్లో చెప్పరు. చెప్పకపోవటమే రేడియోకున్న గౌరవం. ఖండించారనో, గర్హించారనో, కొన్ని సున్నితమైన అందమైన పదాలు వాడి సరిపెట్టి, హుందాగా తప్పుకుంటారు. కల్పలత, చిత్రతరంగిణి లాంటి సినిమా పాటల కార్యక్రమాలను సమర్పించటంలో మన్నార్‌కు సాటి మరొకడు లేడనిపించుకున్న ఎనౌన్సర్ అనతికాలంలోనే న్యూస్ రీడరై, ఢిల్లీ నుంచి వార్తలు చదివేవాడు.
వార్తల లైవ్స్టూడియోలో కూర్చుని చివరి నిమిషంలో అందే వార్తనైనా అందంగా, అనువదించేసి, తొట్రుపాటు పడకుండా ఆ వార్త చదవటం మన్నార్ ప్రత్యేకతగా చెప్పేవారు. వార్తలు చదివే వారిలో నాటకీయతఉండదు. ఉండకూడదు కూడా. వార్తలను ఒక ప్రవాహంలా, ధారలా, సొగసుగా, స్పష్టంగా చదివి కీర్తిని మాత్రమే సంపాదించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి అద్దంకి మన్నార్”
(మల్లాది సూరిబాబు గారికి కృతజ్ఞతలతో)
(ఇంకా వుంది)

20, నవంబర్ 2019, బుధవారం

రేడియో రోజులు – 20 – భండారు శ్రీనివాసరావు



(Published  in SURYA  daily on 20-11-2019, Wednesday, today)

“ప్రాంతీయ వార్తలు  చదువుతున్నది డి. వెంకట్రామయ్య ....”
నా జీవితంలో రేడియో ఉద్యోగం ఓ ప్రధాన అధ్యాయం అనుకుంటే అందులో అన్ని పేజీల్లో కనిపించే పేరు  డి. వెంకట్రామయ్య.
నేను చిన్నతనం నుంచీ అభిమానించే ఈ  కధారచయితే నాకు భవిష్యత్తులో  సహోద్యోగి కాగలడని నేను ఎన్నడు వూహించలేదు.
'డి వెంకట్రామయ్య' కధలపై నేను మరింతగా యిష్టం పెంచుకుంటున్న రోజుల్లోనే  ఆయన రాయడం బాగా తగ్గించారు.  తగ్గించారు అనడం కంటే రాయడం మానేశారు అంటే బాగుంటుందేమో! 
వస్తున్న కధల్లో రాశి పెరిగివాసి తగ్గి,  ఆ బాపతు వాటిని 'చదవడం ఎందుకు మానేస్తే పోలాఅని అనేకమంది చదువరులు అనుకుంటునట్టే , 'కాగితంపై కలం పెట్టగలిగినవాళ్ళందరూ కధలు రాయడం మొదలుపెట్టేసరికి,  'రాయడం మానేస్తే పోలాఅనిపించి  ఆయన రచనా వ్యాసంగానికి దూరమయ్యారేమోనని నా అనుమానం. 
రచయితగా నాకు తెలిసిన వెంకట్రామయ్య గారు, నాకు వృత్తిపరంగా తెలిసివచ్చేనాటికే  'కలం సన్యాసంస్వీకరించినట్టున్నారు.  అడిగినవారి కోసం అడపా దడపా రాయడం తప్పిస్తే, అప్పటినుంచీ కధా రచయితగా ఆయన రాసిందీరాస్తున్నదీ ఏమీ లేదనే చెప్పాలి.

1975 నవంబర్ పద్నాలుగో తేదీన నేను  తొలిసారి వెంకట్రామయ్యగారిని హైదరాబాద్ ఆకాశవాణి వార్తా విభాగంలో సహోద్యోగిగా కలుసుకున్నాను.  ప్రాచుర్యం పొందిన రచయితతో ఏ అభిమానికయినా సాన్నిహిత్యం ఉండవచ్చుకానీ,  పాతికేళ్ళకు పైగా ఒకే కార్యాలయంలో కలిసి పనిచేయడం మాత్రం  అరుదు.
మా ఇద్దరివీ వృత్తిరీత్యా కలసి పనిచేసే ఉద్యోగాలు. ప్రవృత్తి రీత్యా  మావి ఉత్తర దక్షిణ ధృవాలు.  ఆయనకూనాకూ నడుమ శతసహస్ర వైరుధ్యాలు.
ఆయనకు నిశ్శబ్దం యిష్టం. వార్తలు ఎంపిక చేసేటప్పుడూవాటిని అనువాదం చేసేటప్పుడూ పనిచేసే వాతావరణం ప్రశాంతంగా వుండాలని  ఆయన కోరుకుంటారు.
నేను ఇందుకు  పూర్తిగా విరుద్ధం. పనిచేసేచోట,  పనిచేసేవాళ్ళందరూ హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ పనిచేస్తుంటే అలుపూ సొలుపూ వుండదన్నది నా థియరీ.
వైరుధ్యాలు ఇంతేనా అంటే ఇంతే కాదు ఇంకా వున్నాయి.
టేబుల్ పై కాగితాలన్నీ ఒక పధ్ధతి ప్రకారం సర్దిపెట్టుకోవడం ఆయనకలవాటు.
చెత్తబుట్టకూరాతబల్లకూ తేడా తెలియనంతగా, నానా చెత్త మధ్య కూర్చుని చెత్త రాతలు రాస్తూ వుండడం నా ప్రత్యేకత.
'ఆయన వార్తలు చదువుతుంటే వార్తలు చదువుతున్నట్టు అనిపించేది కాదు. చక్కగా చెబుతున్నట్టు వుండేది. నిజంగా రేడియో వార్తలు చదవడం అంటే  ఏమిటో వెంకట్రామయ్య వార్తలు వింటే తెలుస్తుంది' అనేవారు ప్రసిద్ధ జర్నలిస్ట్ జీ.కృష్ణ గారు. ఆయన అన్నారంటే అది ఆస్కార్ అవార్డ్ తో సమానం. ఎందుకంటే కృష్ణ గారు అల్లాటప్పాగా  రాయరు, మాట్లాడరు.
నిజానికి వెంకట్రామయ్య అసలు ఉద్యోగం న్యూస్ రీడర్. అంటే వార్తలు అనువదించి చదవడం వరకు మాత్రమే. బులెటిన్లు తయారు చేయడం కాదు. కానీ ఆయన తనంతట తానే అన్నిరకాల బాధ్యతలు భుజానికి ఎత్తుకునే వారు.
ఆ రోజుల్లో ఎవరయినా వార్త పట్టుకు వస్తే, అది ఆయన చేతులో పడితే ఇంతే సంగతులు. రేడియో మార్గదర్శిక సూత్రాలనూఆనాటి బులెటిన్ ప్రాధాన్యతలనూ అప్పటికప్పుడు బేరీజు వేసుకుని 'ఈ వార్త యివ్వడం కుదరద'ని మొహమ్మీదే చెప్పేసేవారు. ‘అంత నిష్టూరంగా అలా చెప్పకపోతే ఏం’  అనిపించేది కానీ ఆయన మాత్రం లేనిపోని భేషజాలు తనకు సరిపడవన్న తరహానే ప్రదర్శించేవారు. స్నేహితులనో, పరిచయస్తులనో ఏదో పేరుతొ వచ్చిన వారితో మొహమాటంగా వ్యవహరించడం ఆయనకు చేతకాని పని. ఇలాంటి విషయాల్లో ఆయనకూ నాకూ మధ్య కొన్నిసార్లు అభిప్రాయ బేధాలు బయటపడేవి. బయట తిరిగే విలేకరులకు కొన్ని కొన్ని రకాల మొహమాటాలు  ఉండడానికి అవకాశం ఉండొచ్చన్న అభిప్రాయంతో ఆయన ఏకీభవించేవారు కాదు. దానితోవార్త ఎందుకు యివ్వలేకపోయామో అన్నది సంజాయిషీ ఇచ్చుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్తితి నాది.
పని పట్ల ఆయన చూపే నిజాయితీనిబద్దతా అందర్నీ కట్టిపడేసేవి. బులెటిన్ ఆయన తయారుచేసారంటే,  దానిపై ఆయన ముద్ర స్పష్టంగా వుండేది. అందులో యితరుల జోక్యం చేసుకోవడం ఆయనకు ఇష్టం వుండేది కాదు.  ప్రజాసంబందాలకు పెద్దపీట వేసే మా బోంట్లకు ఆయన ఈ మొండి వైఖరి కొండొకొచొ కొన్ని చిక్కులు తెచ్చి పెట్టేది. అయినా ఆయన ధోరణి ఆయనదే. సిద్దాంతాలూసూత్రాలూ వల్లించేవాళ్ళల్లో, వాటికి కట్టుబడి వ్యవహరించేవాళ్ళని చాలా తక్కువమందిని చూస్తాం! ఆ కొద్దిమందిలో వెంకట్రామయ్యగారు ముందుంటారు.
వార్తల విషయంలో ఎటువంటి మడులూ, దడులూ కట్టుకోకుండా, ఎటువంటీ దడుపూ లేకుండా నిర్భయంగా,  స్వేచ్చగా రేడియో వార్తలు ఇచ్చే నేను ఒక్క వెంకట్రామయ్య గారి విషయంలో కాస్త వెనుకా ముందూ చూడడానికి కారణం ఆయనలోని ఈ నిబద్దతే.  

ఆకాశవాణి ప్రాంతీయ వార్తావిభాగంలో చేరిన చాలా కాలం తర్వాత నాకు ఆయన కధలు రాయడం పూర్తిగా తగ్గించిన సంగతి తెలిసింది. పత్రికల్లో, మీడియాలో పనిచేసే 'రచయితల'కు సొంత రచనలు చేసే తీరిక తక్కువన్న అభిప్రాయం ఒకటి ఉంది. నిజమేనేమో!
'పని రాక్షసుడి'గా పేరు పడ్డ వెంకట్రామయ్యగారు,
విధి నిర్వహణకు మాత్రమే ప్రాధాన్యం యిచ్చే వెంకట్రామయ్యగారు,
ఉద్యోగిగా తన కర్తవ్యాన్ని వొదిలిపెట్టి,
'వెంకట్రామయ్య'గా కధలు రాసుకోగలరని అనుకోవడం భ్రమ. అందుకే ఆయన 'రాయని రచయితగా మిగిలిపోయారు.
ఆయన మిత్రుల్లో చాలామంది మాదిరిగానే నాకూ ఇది ఏమాత్రం నచ్చలేదు. ఆయనతో పెంచుకున్న చనువునీసాన్నిహిత్యాన్నీస్నేహాన్నీ ఉపయోగించుకుని, వీలుదొరికినప్పుడల్లా కధలు రాయమని పోరేవాడిని. అలా వెంట పడగా పడగా బద్ధకం వొదుల్చుకుని  చివరికి ఒక కధ రాసారు. దాన్ని గురించి స్నేహితులతో చెప్పేవారు 'యిది శ్రీనివాసరావు పుణ్యమేఅని. నిజానికి  పాపపుణ్యాల పైనాదేవుళ్ళూ దెయ్యాల పైనా ఆయనకు  ఏమాత్రం నమ్మకం లేదు. అయినా ఆయన నోట పుణ్యం అనే మాట అనిపించగలిగాను.
అతికొద్ది 'మంచికధలు రాసిన రచయితగా 'డి వెంకట్రామయ్యఅసంఖ్యాక చదువరులకు పరిచయం. కానీ ఆయన తన పేరుపెట్టు కోకుండానో, లేదా కలం పేరులాగా  'గళం' పేరుతోనో (కార్మికుల కార్యక్రమంలో రాంబాబుగా) రేడియోకి అసంఖ్యాకంగా రచనలు చేసిన సంగతి అందులో పనిచేస్తున్నవారికే తెలియదు. పేరు మీద వ్యామోహం పెంచుకోకపోవడంవల్లనే ఆయనకు రావాల్సిన పేరు ప్రఖ్యాతులు రాలేదని అనుకునేవారు కూడా వున్నారు. రాసినవి 'కొద్దేఅయినప్పటికీపుస్తక ప్రియులను 'పెద్దగాఆకట్టుకున్నవే ఆయన ఖాతాలో చేరాయి. అందుకే 'ఎన్నిరాసారన్నది కాకుండా, 'ఏమిరాసారన్నదానికి విలువ కట్టి పురస్కారాలు ఇస్తారనే మంచి పేరున్న 'రాచకొండ రచనా పురస్కారంఎంపిక కమిటీ  ఒక ఏడాది తన వార్షిక  పురస్కారాన్ని డి వెంకట్రామయ్యగారికి ప్రకటించింది.  పురస్కారానికి వున్న విలువ పురస్కార గ్రహీతను బట్టి మరింత పెరుగుతుంది అనడానికి ఇదో మంచి ఉదాహరణ. అలాగేరావిశాస్త్రి గారికి వీరాభిమానిగా చెప్పుకోవడానికీఒప్పుకోవడానికీ సంకోచించని వెంకట్రామయ్యగారికి ఇదో కలికితురాయి. మరెన్నో మంచి రచనలు చేయడానికి ఈ పురస్కారం ఆయనకి తగిన ప్రోత్సాహకారకం కాగలదని  ఆశించాను కాని(రచన ఇంటింటి పత్రికలో సాయిగారు పట్టుబట్టి  నెలనెలా  రాయించిన రేడియో అనుభవాలు తప్పిస్తే) నాది పేరాశ అనే ఆయన తేల్చేసారు.
కాకపోతే, రచన సాయి గారి పుణ్యమా అని ఆయన రాసిన రేడియో అనుభవాలను ఎమెస్కో వారు ఒక పుస్తకంగా వేశారు. సంతోషం.
చక్కటి విషయాలు, ఎవరికీ తెలియనివి అనేకం రాసారు. మరింత సంతోషం.
ఈ పుస్తకాన్ని ఏకబిగిన చదివినప్పుడు చాలా మంచి పుస్తకం అనిపించక తప్పదు. అయితే  అదే సమయంలో స్వోత్కర్ష కొంత మోతాదు మించింది అనే అభిప్రాయం కూడా కలగక తప్పదు. తనని తాను  ఎలివేట్ చేసుకునే క్రమంలో కొందరు రేడియో సహోద్యోగులను చిన్న చూపు చూసారా అని కూడా అనిపించక మానదు.
నిర్మొహమాటంగా వుండడం తన సహజ లక్షణమని నమ్మే వెంకట్రామయ్య గారు నా ఈ విమర్శను సరయిన రీతిలో స్వీకరిస్తారనే నమ్మకం నాకు  వుంది.


(శ్రీ డి. వెంకట్రామయ్య)

(ఇంకా వుంది)   


19, నవంబర్ 2019, మంగళవారం

రేడియో రోజులు - 19 - భండారు శ్రీనివాసరావు

(Published in SURYA daily on 19-11-2019, Tuesday, today)
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మాడపాటి సత్యవతి
సాయంత్రం ఆరుగంటల పదిహేను నిమిషాలకల్లా తెలుగునాట లోగిళ్ళలో ఈ మధుర స్వరం వినబడేది. మెల్లగా, సౌకుమార్యంగా వినవచ్చే ఆ కంఠస్వరం చాలామందికి సుపరిచితం.
‘శ్రీనివాసరావు గారు ఎలావున్నారు బాగున్నారా!’
పాతికేళ్ళ సుదీర్ఘ పరిచయ కాలంలో ఆవిడ నోటినుంచి నేను విన్న అతి పెద్దవాక్యం ఇదే.
మాడపాటి సత్యవతి గారు ఎంతో క్లుప్తంగా మాట్లాడుతారు. మాటలు తూచినట్టే వచ్చేవి ఆవిడ గారి నోటినుంచి. అంతటి మితభాషి. మరి పది నిమిషాలు విడవకుండా ఏకబిగిన వార్తలు యెలా చదివేవారో అనిపించేది. కానీ ఆవిడ స్వరాన్ని భగవంతుడు కేవలం రేడియో కోసమే తయారు చేసాడేమో అనిపిస్తుంది. ఒక రకమైన మార్ధవంతో, సంగీతం వినిపిస్తున్నట్టుగా మాడపాటి సత్యవతిగారు వార్తలు చదువుతుంటే మరీ మరీ వినాలనిపిస్తుందని చెప్పేవాళ్ళు బోలెడుమంది. ఒకరు అనువాదం చేసిన వార్తలు చదవడం కన్నా తాను సొంతంగా అనువదించి చదవడానికి ఆవిడ ఇష్టపడేవారు. నిజానికి ఆవిడ న్యూస్ రీడర్ కాదు. న్యూస్ ఎడిటర్. కానీ వారంలో కొన్ని రోజులు విధిగా వార్తలు చదివేవారు. వీటికి తోడు వారానికి ఒకమారో రెండుసార్లో వీలునుబట్టి ‘వార్తావాహిని’ కార్యక్రమాన్ని రూపొందించి సమర్పించేవారు.
ఆకాశవాణి వార్తావిభాగం పనితీరు గురించి ఇక్కడ ఒకమాట చెప్పుకోవాలి. హిందీలో చెప్పాలంటే (నిజానికి నాకూ ఆ భాషకు చుక్కెదురు) అక్కడ వాతావరణం ‘బహుత్ బహుత్ గంభీర్.’ 1975 నవంబరులో నేను అక్కడ కుడికాలు పెట్టేంత వరకు పరిస్తితి అదే. పని అయిపోయేంతవరకు అందరూ ముక్తసరిగా మాట్లాడుకునేవారు. అంతా రొటీన్ గా ‘స్క్రీన్ ప్లే’ పుస్తకంలో రాసివున్నట్టు జరిగిపోయేది. వార్తల్లో ఎలాటి తభావతు రాకుండా బులెటిన్ల తయారీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవారు. ఒక వార్త ఇవ్వాలా వద్దా, ఇస్తే ఎన్ని వాక్యాలు ఇవ్వాలి, యెంత ప్రాధాన్యం ఇవ్వాలి అని ఒకటికి రెండు సార్లు ఆలోచించేవాళ్లు. మరీ ముఖ్యంగా సత్యవతిగారికీ, డి. వెంకట్రామయ్య గారికీ ఈ విషయంలో పట్టింపులు మెండు. అన్నిటినీ చాలా తేలిగ్గా తీసుకునే నా తత్వం వారికి అంతగా రుచించకపోయినా ఇంట్లో చిన్నవాడిని ముద్దు చేసినట్టు నన్ను చూసీ చూడనట్టు వొదిలేసేవారు. దానితో నాది ఆడింది ఆట పాడింది పాట అయింది. అంతకు ముందు దినపత్రికలో పనిచేసిరావడం వల్ల కొంత స్వేచ్చను ప్రదర్శించే ప్రయత్నం చేసేవాడిని. బహుశా నాతో పడ్డన్ని తలనొప్పులు వాళ్లు ఎవరితోనూ పడివుండరేమో కూడా.
నేను చేరిన కొత్తల్లో అనుకుంటాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జట్ గురించి వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలతో కూడిన ప్రత్యేక వార్తావాహిని తయారు చేస్తున్నారు. అభిప్రాయాలు రికార్డ్ చేసుకొచ్చే బాధ్యత నా మీద పడింది. అన్నీ తీసుకొచ్చి ఆ టేపులన్నీ సత్యవతిగారికి వొప్పచేప్పేసి చక్కాపోయాను. రాత్రి ఏడుగంటల నలభై అయిదు నిమిషాలకు ప్రసారం. లోపల డబ్బింగు స్టూడియోలో సత్యవతి గారు నానా అవస్థ పడుతున్నారు. గొంతులు వినబడుతున్నాయి. ఎవరి గొంతు ఎవరిదో తెలియచెప్పే ‘క్యూ షీట్’ సత్యవతి గారికి ఇవ్వడం మరచిపోయాను. ఓపక్క టైం దగ్గర పడుతోంది. ఆవిడకి నరాలు తెగిపోయే టెన్షన్. నేనెక్కడో ఎవరితోనో కబుర్లు చెబుతూ కూర్చున్నాను. ఇప్పట్లా సెల్ ఫోనులు లేని రోజులాయె. ఆవిడ అనుభవమే ఆవిడకు అక్కరకు వచ్చింది. కాని ఆరోజు, డబ్బింగు పని పూర్తిచేసి టేపు స్టూడియోలో వొప్పగించేసరికి ఆవిడ తల ప్రాణం తోకకు వచ్చివుంటుంది.
మరునాడు ఆఫీసుకు వెళ్ళిన తరువాత కాని నాకు విషయం తెలియలేదు. కనబడగానే బాగా కోప్పడాలి. కోపడ్డారు కూడా. యెలా అనుకున్నారు? నోరు తెరిచి ‘ఇదేంటి శ్రీనివాసరావు గారూ’ అన్నారు. అంతే! ఆ ఒక్క ముక్క చాలు. కర్రు కాల్చి వాత పెట్టినా దానికి సరిపోదు.
రేడియోలో పనిచేసేవారికి ముందుగా ఓ నీతి పాఠం బోధిస్తారు. యెంత క్లుప్తంగా (వార్త) చెబితే భావం అంత ఖచ్చితంగా అర్ధం అవుతుంది అని. (Brevity is sole of expression).
ఆ రోజు సత్యవతి గారి భావం నాకు చాలా బాగా అర్ధం అయింది. తీరు పూర్తిగా మార్చుకోకపోయినా కొంత గాడిలో పడ్డాను. (అని అనుకున్నాను)
(ఇంకావుంది)



మాడపాటి సత్యవతి


18, నవంబర్ 2019, సోమవారం

బతికే వున్నాను – భండారు శ్రీనివాసరావు




దాదాపు యాభయ్ లక్షల మంది కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు ప్రతి ఏడాది నవంబరులో తమ పెన్షన్ renewal కోసం ఈరోజువరకూ ‘బతికే ఉన్నాము’ అని తమకు తాము సర్టిఫై చేసుకుని దాన్ని సంబంధిత అధికారులకి సమర్పించుకోవాలి. వివిధ రాష్ట్రాల సిబ్బందిని కూడా లెక్కలోకి తీసుకుంటే ఈ లెక్క లక్షల నుంచి కోట్లలోకి చేరుతుంది.
ఈ ఇబ్బంది నుంచి కొంత వెసులుబాటు కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం UMANG అనే App ని వాడుకలోకి తీసుకువచ్చింది. సంబంధిత కార్యాలయానికో, బ్యాంకుకో వెళ్ళే పని లేకుండా ఇంటి నుంచే ఈ తప్పనిసరి తంతు పూర్తి చేసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఈ విషయం తెలుసు కానీ, ఆ యాప్ ఎలా వాడాలో తెలియక ఈ రోజు కోటీ లోని స్టేట్ బ్యాంకుకు వెళ్లాను. 1975 నుంచీ నా ఖాతా అందులోనే వుంది. లోగడ వెళ్ళినప్పుడు మురళి గారనే ఓ అధికారి పరిచయం అయ్యారు. నిజానికి ఆయనే నావద్దకు వచ్చి పరిచయం చేసుకున్నారు. టీవీ చర్చల్లో తటస్థంగా వుండే వైఖరి ఆయనకు బాగా నచ్చిందట. రండి మీ పని నేను దగ్గరుండి చేయిస్తాను అని నిమిషాల్లో ఆ పని పూర్తిచేసి పంపించారు.
ఈరోజు బ్యాంకుకు వెళ్లాను. ఇద్దరు ముగ్గురు తప్ప పెద్ద రద్దీగా లేదు. అంచేత మురళి గారికి ఫోన్ చేసి ఇలా వచ్చాననీ, పని అయిన తర్వాత వచ్చి కలుస్తాననీ చెప్పడానికి ఫోన్ చేసాను. ఆయన కాశీలో జరుగుతున్న మహారుద్రాభిషేకంలో వున్నారు. నా వంతు వచ్చేలోగా మరొకరు కలిసారు. పేరు కొండపల్లి రామమోహనరావు గారు. ఆయనే పరిచయం చేసుకుని వివరాలు చెప్పారు. ఈ మధ్య టీవీల్లో రావడం లేదేమిటని వాకబు చేసారు. విషయం తెలిసి బాధ పడ్డారు. ఆయన లోగడ స్టేట్ బ్యాంకులో పెన్షన్ సెక్షన్ లోనే పనిచేసారుట. ఆయన నన్ను ఒక చోట కూర్చోబెట్టి దగ్గరుండి ఫారం ఫిలప్ చేయించారు. వేలి ముద్రలు చెక్ చేయించారు. ఇదంతా జరుగుతుండగానే హుందాగా నడుచుకుంటూ, మంచి వర్చస్సు ఉన్న ఓ పెద్దమనిషి నాదగ్గరకు వచ్చి బాగున్నారా అని పలకరించారు. షరా మామూలుగానే నాకు ఆయన ఎవరన్నది చప్పున గుర్తు రాలేదు. నేనండీ అనంత కృష్ణని. మీ అన్నగారు రామచందర్రావు గారు నాకు బ్యాంకులో గురువు’ అని పరిచయం చేసుకున్నారు. ఆయన గతంలో స్టేట్ బ్యాంక్ స్పాన్సర్ చేసిన శ్రీ విశాఖ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ గాను. ఆతర్వాత అయిదు గ్రామీణ బ్యాంకులను విలీనం చేసి వరంగల్ ప్రదానకార్యాలయంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ మొదటి చైర్మన్ గాను పనిచేసారు. రేడియోలో పనిచేసే రోజుల్లో వృత్తిరీత్యా అనేక సార్లు కలిసాను. ఏమిటో ఈ మతి మరపు అందర్నీ దూరం చేస్తోందనే భయం వేసింది. రామ్మోహన రావు గారు గాయత్రి అనే అమ్మాయి (అక్కడ ఉద్యోగి)తో నా ఫోన్లో యాప్ డౌన్ లోడ్ చేయించి అది ఎలా పనిచేయించాలో నాకు చెప్పించారు.
ఇంటికి తిరిగివస్తూ అనుకున్నాను. ఈ UMANG యాప్ నాకు అనవసరం అనిపించింది. ఏడాదికో మారు ఇలా బ్యాంకుకు వెళ్లి వస్తుంటే పాత పరిచయస్తులు కలుస్తూ వుంటారు. ఇప్పుడు ఈ వయసులో అంతకు మించింది ఏమి కావాలి.


Life certificate వ్యవహారం అంతా సజావుగా ముగిసిపోయింది.
బ్యాంకు వాళ్ళు ఇచ్చిన ఫారం ఫిలప్ చేసేటప్పుడు ఒకచోట చేయి వణికింది. నామినీ కాలంలో ఏపేరూ రాయకుండా - అలా వదిలేయాల్సివచ్చినప్పుడు ఎలాగో అనిపించింది.



17, నవంబర్ 2019, ఆదివారం

చట్టబద్ధం కాని విజ్ఞప్తి – భండారు శ్రీనివాసరావు



“భాషకు సంబంధించి ప్రస్తుతం సాగుతున్న వివాదాలకు దీనికీ సంబంధం లేదు”
ముక్కోటి దేవతలు పరమేష్టి వద్దకు కట్టగట్టుకుని వెళ్లి మొరబెట్టుకున్నారు.
“రాజకీయాల్లో హుందాతనం అనేది కలికానికి కూడా కానరావడం లేదు. అతల, సుతల, పాతాల లోకాల దిగువకు జారిపోయింది. ఇక దాన్ని కనుగొనడం బ్రహ్మతరం కాదు”
“నాకు చేతకాదని తెలిసీ నా వద్దకు ఎందుకు వచ్చారు?” అని ఘీంకరించబోయి, ప్రస్తుతాంశం హుందాతనం అన్నది గుర్తుకు వచ్చి తమాయించుకుని వినసాగాడు విధాత.
“మీరు సృష్టించిన మానవులే  అలా హుందాతనం కోల్పోయి  ప్రవర్తిస్తుంటే ఆ నామర్దా తమరికే కదా” అని అందుకున్నారు సురులు.
“తక్షణ కర్తవ్యమ్” అడిగాడు వాణీపతి.
“తిరిగి మరికొంత  హుందాతనాన్ని సృష్టించి, అలనాడు విష్అణువు  మోహినీ అవతారంలో అమృతాన్ని మాకు పంపిణీ చేసినట్టు  దాన్ని రాజకీయ రంగంలోని వారికి ప్రసాదించడమే” అన్నారు దేవతలు ఒక్క మాటగా.
“అది సాధ్యం కాని పని. హుందాతనం అనేది అంగడి సరుకు కాదు, అయిపోయినప్పుడల్లా కొనుగోలు చేయడానికి. వారు మానవులు. మీకంటే తెలివిపరులు. వారి సంగతి వాళ్ళు చూసుకుంటారు. మీకు రంభాదికాంతలు అందించే అమర సుఖాలను వాళ్ళు హుందాతనాన్ని కోల్పోవడం ద్వారా వెతుక్కుంటున్నారు. వాళ్ళ పాట్లు వాళ్ళని పడనివ్వండి. ఎటూ వాళ్ళు పోయేది రౌరవాది నరకాలకే కనుక, మీకొచ్చిన నష్టం ఏమీ లేదు.”
బ్రహ్మదేవుడితో ఇక పనికాదనుకుని వాళ్ళు వీణావాణి వైపు తిరిగారు. జరుగుతున్నదంతా క్రీగంట గమనిస్తున్న హాటకగర్భురాణి వారితో ఇలా అన్నది.
“భయం లేదు, వెళ్లి రండి. అందుకే నేను అనేక భాషలు సృష్టించాను. ఒక భాషలో కటువుగా, కర్ణకఠోరంగా వినిపించే పదాలు, మరో భాషలో కర్ణపేయంగా వుంటాయి. సొంత భాషలో మాదిరిగా పరాయి భాషా పదాలు సులభంగా అర్ధం కావు కనుక, ఆ పదాలలోని కరకుతనం వెంటనే ఆకళింపు చేసుకోవడం కష్టం. అదే మాతృభాష అయితే భావం ఇట్టే బోధపడుతుంది. ప్రస్తుతం భూలోకంలో జరుగుతోంది అదే” అంటూ వారి చేతిలో ఓ కాగితం పెట్టింది. అది ఆదివారం నాటి ఒక ఆంగ్ల పత్రిక. అందులో కొన్ని తెలుగు పదాలు, ఇంగ్లీష్ లో వాటికి సమానార్ధకాలు వున్నాయి.
“సన్నాసి” (Block Head, Dunce)
“వాడమ్మ మొగుడు” (His mother’s husband)
“పిచ్చవాగుడు” ( Stupid Rants)
“చెత్త నాకొడకా” ( Good for nothing yokel)
“దుర్మార్గుడు” ( Nefarious, Mendacious person)
కాబట్టి, కావున తిట్లు శాపనార్ధాలు పెట్టేటప్పుడు తెలుగు కంటే, ఇంగ్లీషే మేలు అని వాటిని విన్నవాళ్ళు అనుకుంటారు, అని చెప్పి  సాగనంపింది సరస్వతి.
(నోట్ : ఆ పత్రిక డెక్కన్ క్రానికల్. ఆ వార్తను ఇలా మొదలు పెట్టింది. దాన్నే దేవతలు కాపీ కొట్టి కొద్దిగా మార్చి చతుర్ముఖ బ్రహ్మతో చెప్పినట్టున్నారు)
No low  in Indian politics remains the lowest for long)

రేడియో రోజులు – 18 – భండారు శ్రీనివాసరావు



(Published in SURYA daily on 17-11-2019, SUNDAY, today)

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుమలశెట్టి శ్రీరాములు
– ఢిల్లీ నుంచి ప్రసారం అవుతున్న ఈ వార్తల్ని మద్రాసు, విజయవాడ, హైదరాబాదు కేంద్రాలు రిలే చేస్తున్నాయి”
ఉదయం ఏడుగంటల సమయంలోనో, లేదా రాత్రి ఏడు కొడుతున్నప్పుడో ఈ కంఠస్వరం తెలుగు లోగిళ్లను పలకరిస్తూ వుండేది. వార్తల్లో విషయం కన్నా ఆయన వార్తలు చదివే పధ్ధతి, వాక్యాలను విరుస్తూ, అక్కడక్కడ నొక్కుతూ ఉచ్చరించే తీరుకోసమే వింటున్నామనే వాళ్లు నాకు చిన్నతనంనుంచీ తెలుసు. అయితే, రేడియోలో వినబడే ఆ స్వరం తప్ప శ్రీరాములు గారు యెలా వుంటారో తెలియని వాళ్ళే కాని ఆయన్ని తెలియని తెలుగు వాళ్లు అంటూ ఎవ్వరు వుండరు. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, ఆసేతుహిమాచలం హై పవర్ రేడియో ట్రాన్స్ మీటర్లు వున్న ప్రతిచోటా ఆయన గొంతు వినబడేది.
ఆ రోజుల్లో ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు చదివే ఒక్కొక్కరిదీ ఒక్కొక్క బాణీ. ఎవరి స్టైల్ వారిదే. దుగ్గిరాల పూర్ణయ్య, కందుకూరి సూర్యనారాయణ, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు, జోలిపాళ్యం మంగమ్మ, మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి ఇలా ఎందరో మహానుభావులు. ఎవరికి ఎవరు తీసిపోరు. వార్తలు మధ్యనుంచి విన్నా చదువుతున్నది పలానా అని చెప్పగలిగేలా తమదయిన తరహాలో వార్తలు చదివేవాళ్ళు. (సందర్భాన్నిబట్టి కొన్ని పేర్లు మాత్రమే ప్రస్తావించడం జరిగింది. మిగిలిన వారిని కూడా వీలువెంట గుర్తుచేయడం జరుగుతుంది. దురదృష్టం ఏమిటంటే రేడియో అభిమాని అనే బ్లాగులో, మాగంటి వారు నిర్వహించే బ్లాగులో తప్ప వీరిలో కొందరి ఫోటోలు సంపాదించడం అనేది గగన కుసుమంగా మారింది)
శ్రీరాములు గారి గురించి చెప్పుకుంటున్నాం కదా! ఆయన ఢిల్లీ నుంచి కొన్నాళ్ళు మాస్కో వెళ్ళి ఆ తరువాత తిరిగి ఢిల్లీ వెళ్ళకుండా హైదరాబాదు బదిలీపై వచ్చారు. వార్తలు చదివే పద్దతే కాదు ఆయన ఆహార్యం కూడా ప్రత్యేకమే. ఎప్పుడు ఫుల్ సూటులో కనబడేవారు. ఆరోజుల్లో ప్రాంతీయ వార్తా విభాగం ప్రస్తుతం క్యాంటీన్ వున్న షెడ్లలో వుండేది. అందులో రెండు విశాలమైన గదులు – ఒకదానిలో న్యూస్ బులెటిన్లు తయారుచేసే సిబ్బంది, అంటే న్యూస్ ఎడిటర్లు, రిపోర్టర్లు, బులెటిన్ టైప్ చేసే వాళ్లు, రెండో గదిలో తెలుగు, ఉర్దూ న్యూస్ రీడర్లు ఆఫీసు అసిస్టెంట్లు కూర్చునే వారు.
నేను చేరినప్పుడు న్యూస్ ఎడిటర్ పన్యాల రంగనాధ రావు గారు, కరస్పాండెంట్ ఎం ఎస్ ఆర్ కృష్ణా రావు గారు అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ మాడపాటి సత్యవతి గారు, న్యూస్ రీడర్ గా వుంటూనే బులెటిన్లు తయారు చేసే బాధ్యతను ఐచ్చికంగా భుజాలకు ఎత్తుకున్న డి. వెంకట్రామయ్యగారు, సరే, ఆ వరసలో నేనూ. చివర్లో ‘ఈ నేను’ ఎందుకంటే అసలు నేను ఆఫీసుకు వచ్చి పోయేదే చాలా తక్కువ. రిపోర్టింగ్ పని మీద రోజులో ఎక్కువ భాగం బయటే తిరిగేవాడిని.
మరో గదిలో తిరుమలశెట్టి శ్రీరాములు గారు, ఉర్దూ న్యూస్ రీడర్ వసీం అక్తర్ కూర్చునే వారు. శ్రీరాములు గారు వార్తల టైము కాగానే ఒక చేతిలో వెలిగించిన సిగరెట్, మరో చేతిలో న్యూస్ బులెటిన్ పట్టుకుని స్టూడియోకు బయలుదేరేవారు. మేమున్న చోటునుంచి స్టూడియోకి కొంతదూరం నడిచి వెళ్ళాలి. శ్రీరాములు గారు అడుగులో అడుగువేసుకుంటూ స్టుడియో దగ్గరికి వెళ్లేసరికి సిగరెట్ అయిపోయేది. వార్తలు చదవడానికి స్టూడియోకి వెళ్లేటప్పుడు యెంత టైం పట్టేదో తిరిగివచ్చేటప్పుడు కూడా సరిగ్గా అంతే సమయం పట్టేదని చెప్పుకునేవారు. వేసే అడుగులు కూడా లెక్కబెట్టినట్టు వుండేవి. ఒక్కోసారి ఏదయినా తాజా సమాచారం అందివ్వడానికి నేను స్టూడియో వైపు పరిగెత్తుకుంటూ వెడుతుంటే శ్రీరాములు గారు మాత్రం నింపాదిగా నడుస్తూ మధ్యలోనే కనిపించేవారు. ఆ కాగితం ఆయన చేతిలో పెడితే దాన్ని చదువుకుంటూ అలాగే అంతే తాపీగా నడుస్తూ వెళ్ళేవారు కాని ఆయనలో ఏమాత్రం ఆందోళన కాని, కంగారు కాని ఏనాడు చూడలేదు. అలాగే ఒక్కోసారి చివరి నిమిషంలో మొత్తం వార్తని తిప్పిరాసి ఇచ్చినా ఏమాత్రం అసహనం ప్రదర్శించకుండా దాన్ని అనువాదం చేసేపనిలో నిమగ్నం అయ్యేవారు. అన్నట్టు చెప్పడం మరిచాను. ప్రాంతీయ వార్తా విభాగంలో మాస్టర్ బులెటిన్ ను ఇంగ్లీష్ లో తయారుచేసి ఇచ్చేవాళ్ళం. దాన్ని కాపీలు తీసి ఇస్తే తెలుగు న్యూస్ రీడర్, ఉర్దూ న్యూస్ రీడర్ తమ భాషల్లోకి అనువదించుకునేవారు.
పొతే, తిరుమలశెట్టి శ్రీరాముల గారికి సంబంధించిన మరో జ్ఞాపకం మనసులో పదిలంగావుంది. ఆయన రేడియోలో చేరి వార్తలు చదవడం మొదలు పెట్టి పాతికేళ్ళు అప్పటికి పూర్తయ్యాయి. శ్రీరాములు గారి రేడియో కంఠస్వర రజితోత్సవం జరిపితే ఎలావుంటుందని నర్రావుల సుబ్బారావు గారికి ఆలోచన వచ్చింది. ఆహ్వాన సంఘం చైర్మన్ గా నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారిని ఒప్పించే బాధ్యతను నాపై పెట్టారు. నేను వెళ్లి అందుకు సంబంధించిన లేఖను ముఖ్యమంత్రికి అందచేసాను. ఆయన ఒకసారి పైనుంచి కింది వరకు చదివి ఆ కాగితాన్ని మడిచి లాల్చీ జేబులో పెట్టుకున్నారు. తర్వాత పెద్దగా నవ్వి “ఇందులో గొప్పేమిటో నువ్వే చెప్పు. ఎవడయినా ఒకడు ఈరోజు సర్కారు నౌకరీలో చేరాడనుకో. పాతికేళ్ళ తర్వాత అతడి సర్వీసుకూడా పాతికేళ్ళు పూర్తవుతుంది”.
ఆ మాటతో నేను వచ్చిన పని ఇంతే సంగతులు అనుకున్నా. కానీ కొన్నాళ్ళ తర్వాత, మా విజ్ఞప్తిని చెన్నారెడ్డి గారు అంగీకరించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాకు జాబు అందింది.
(ఇంకా వుంది)
కింది ఫోటో : కీర్తిశేషులు తిరుమల శెట్టి శ్రీరాములు గారు.