17, మార్చి 2015, మంగళవారం

ఆసక్తి కలిగించే 'అదృశ్యాలు'

(Published in 'SURYA' telugu daily in it's edit page on 19-03-2015, THURSDAY)

నిత్యం మీడియాలో కనబడాలని రాజకీయ నాయకులు అనుకోవడం కద్దు. కనబడకపోయినా అది ఒక వార్తగా మారి సంచలనం కావడం కూడా కొత్తేమీ కాదు.
కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ ఈ మధ్య చెప్పాపెట్టకుండా ఎటో వెళ్లిపోయారని వార్త గుప్పుమంది. అలిగివెళ్ళారని కొన్ని వార్తలు చెబుతుంటే ఏకంగా హిమాలయాలకు వెళ్ళారని మరికొన్ని వదంతుల సారాంశం. అలిగి వెళ్ళిన మాట నిజం కాకపోవచ్చు. హిమాలయాలకు వెళ్ళిన మాటలో కూడా వాస్తవం లేకపోవచ్చు. కానీ కనబడకుండా వెళ్ళిన మాట నిజం. రోజుల తరబడి ఆయన ఎవ్వరికీ దర్శనం ఇవ్వని మాటా నిజం. ఆ మాటకు వస్తే పార్లమెంటు సమావేశాలు మొదలై ఇన్ని రోజులు గడుస్తున్నా రాహుల్ గాంధీ మాత్రం ఒక్క రోజుకూడా చట్టసభ గుమ్మం తొక్కిన జాడలేదు. కనబడకుండా పోయిన ఈ యువనేత గురించి ట్విట్టర్ వంటి ఆధునిక ప్రసార మాధ్యమాల ద్వారా మాత్రమె సంగతులు తెలుసుకోవాల్సి వస్తోంది. ఇదొక చిత్రం.
రాహుల్ గాంధీ అనామకుడు కాదు. ఆయన్ని గురించి తెలిసిన వారు ఎక్కువ. పటిష్టమైన వ్యక్తిగత భద్రత కలిగిన రాజకీయ నాయకుడు. ఆయన ఎక్కడకు వెళ్ళాలన్నా క్షణాలమీద బందోబస్తు ఏర్పాట్లు జరిగిపోతాయి. చుట్టూ అంగరక్షకులు నిరంతరం కాపలాగా వుంటారు. వారి చేతుల్లోని వాకీ టాకీలు రాహుల్ రాకపోకల్ని ఎప్పటికప్పుడు తెలియచేస్తుంటాయి. గతంలో టీవీల్లో రాహుల్ భద్రతాఏర్పాట్లు చూసిన వారికి రాహుల్ అదృశ్యం వార్త ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆయన అంగరక్షకులను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. కనబడకుండా పోయిన ఈ యువనేత, అనుక్షణం తన వెంటవుండి తనని కంటికి రెప్పలా కాపాడాల్సిన  'బాడీ గార్డుల'ని  కూడా వెంటబెట్టుకు పోయాడా లేదా తెలియదు. రాహుల్ అదృశ్యం గురించి రకరకాల వ్యాఖ్యానాలు మాత్రం అనుదినం మీడియాలో వస్తుంటాయి. సోషల్ మీడియా సంగతి చెప్పనక్కరలేదు. ఆయన ఆనుపానులు కనుక్కోవాలంటే పోలీసులకు నిమిషాల్లో పని. మీడియాకు కూడా ఇదేమంత కష్టమైన పనికాదు. అయినా కానీ, అదృశ్యం గురించిన వ్యాఖ్యానాలు, విరుపులతో కూడిన సమాచారమే కాని రవంత అదనంగా ఎవ్వరూ ఏ సమాచారం ఇవ్వని పరిస్తితి. ఒక మాజీ ప్రధాన మంత్రి కుమారుడు ఏకంగా కొన్ని రోజులపాటు కనబడకుండా పొతే ఇదా పరిస్తితి అనుకోవాల్సి వస్తోంది. 'ఇదొక చిత్రం' అన్నది అందుకే.
సరే! రాహుల్ కనబడడం లేదు. ఇంట్లో లేరు. బయట లేరు. ప్రతిరోజూ వార్తలు వస్తున్నాయి కాబట్టి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి విచారించడం మరో సంచలన వార్త అయింది. వెళ్ళిన పోలీసులు 'అదృశ్యం' గురించి వాకబు చేశారంటే అదీ లేదు. వెళ్ళిన సందర్భం కంటే అడిగిన సమాచారం మరింత సంచలనం అయింది.  వెళ్లి ఎలాటి సమాచారం అడిగారు? 'రాహుల్ యెంత ఎత్తు ఉంటాడు? కళ్ళ రంగు ఏమిటి? కాలిజోడు కొలతలు ఏమిటి?'
రాజకీయాల్లో సీరియస్ నెస్ తగ్గించడం కోసం ఇలా కాస్త 'హ్యూమరసం' వొలకబోశారేమో అని సమాధానపడేలోగా పోలీసులే సందేహ నివృత్తి చేసారు. అత్యంత ప్రముఖుల వివరాలను సేకరించి తమవద్దవున్న సమాచారంతో సరిపోల్చుకుని  వాటిని  తాజాగా సవరించుకునే పనిలో వెళ్ళారని అధికారిక  వివరణ. ఇది కొత్తేమీ కాదని, ప్రముఖుల వివరాలను సేకరించడం 'అనాది'గా వస్తున్న ఆచారమే అని దానికి ముక్తాయింపు. అంతటితో ఆగితే ఏ పేచీలేదు. 1991 లో తమిళనాడులోని శ్రీపెరంబదూరు ఎన్నికల సభలో శ్రీలంక ఉగ్రవాది మానవ బాంబుగా మారి రాజీవ్ గాంధీని పొట్టనబెట్టుకున్న  దుర్ఘటనలో ఆ పేలుడు  ధాటికి యువ గాంధీ శరీరం తునాతునకలు అయినప్పుడు, 'రాజీవ్' ఆనాడు ధరించిన కాలిజోడు సాయంతోనే ఆయన  ఆనవాళ్ళు పోల్చుకున్న 'చరిత్ర'ను  ఓ కేంద్ర  మంత్రి గుర్తు చేయడం ఈ యావత్ 'ఎపిసోడు'కి కొసమెరుపు.
ఇంతకీ రాహుల్ ఎక్కడ వున్నట్టు? త్వీట్ చేయగలగాలంటే  అది కారడువుల్లోనో, హిమాలయ సానువుల్లోనో కుదిరేపని కాదు. ఆయన ఆనుపానులు కనుక్కోలేనివేమీ కావు. అయినా, సరే ఆచూకీ తప్ప ఆయన గురించిన  అన్ని విషయాలు మీడియాలో వస్తుంటాయి. 'చిత్రం' అని అన్నది ఇందుకే.
సరే! ఇదేదో మన దేశానికి మాత్రమే ప్రత్యేకం అని అనుకోవడానికి వీల్లేకుండా సరిగ్గా ఈ సమయంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జాడలేకుండా పోయారు. ఆయనేమీ చిన్నా చితకా మనిషి కాదు. నిన్నమొన్నటి దాకా అంతర్జాతీయ రాజకీయ గూఢచర్యంలో అందెవేసిన చెయ్యి అనిపించుకున్న 'కేజీబీ' పుట్టిన దేశానికి సాక్షాత్తు అధ్యక్షుడు. తొంభయ్యవ దశకం పూర్వార్ధంలో రాజకీయాల్లోకి రావడానికి ముందు 'కేజీబీ' సంస్థలో పుతిన్ పదహారేళ్ళపాటు సీనియర్ అధికారిగా పనిచేశారు కూడా. అయినా పదిరోజులపాటు 'అదృశ్యం' అయిపోయిన  పుతిన్ అచూకీ మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఊహాగానాలు మాత్రం ఆరున్నొక్క రాగం అందుకున్నాయి.  క్రమంగా ముదిరి పాకానపడి వదంతులుగా రూపాంతరం చెందాయి. పుతిన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని ఓ పుకారు షికారు చేస్తే,  కాదు అసలు ప్రాణాలతోనే లేడని మరో పుకారు పురుడు పోసుకుంది. సైనిక కుట్ర  జరిగి నిర్బంధంలో ఉన్నాడని మరో వదంతి వచ్చి దానికి  జత చేరింది. ఇవేవీ కావు  పుతిన్ అదృశ్యానికి అసలు కారణం ఆయన ప్రేయసి అని, విదేశంలో బిడ్డకు జన్మ ఇస్తున్న ఆమెను చూడడానికి రెక్కలు కట్టుకుని వెళ్ళాడని  ఇంకో ఊహాగానం రెక్కలు విప్పుకుంది. ఇలా రోజుకో పుకారు ప్రాణం  పోసుకుంటూ వుంటుంటే, సరిగ్గా పదిరోజుల తరువాత పుతిన్ అజ్ఞాతాన్ని వీడి తనపై వస్తున్న వదంతులకు తనే స్వయంగా  తెర దించాడు. తన ఆకస్మిక అదృశ్యానికి  మాత్రం ఏ కారణం చెప్పకుండా, వస్తున్న ఊహాగానాలను మాత్రం కొట్టిపారేసే ప్రయత్నం చేసారు. 'పుకార్లు లేకపోతే జీవితం రొటీన్ గా మారి విసుగు పుడుతుంది'. ఇదీ చివరకు ఆయన చిరు మందహాసంతో విలేకరులకు ఇచ్చిన వివరణ. బహుశా ఏ నల్ల సముద్ర  తీరంలోనో హాయిగా విశ్రాంతి తీసుకుంటూ, మీడియాలో తనపై వస్తున్న వదంతులను ఆస్వాదిస్తూ పది రోజులూ  పది నిమిషాల్లా గడిపి ఉంటారని అనుకోవాలి. నిజంగానే  'చిత్రం' అనిపిస్తోంది కదూ.
ఇలాటి అదృశ్య సంఘటనలు  చాలా దేశాల్లో దేశాల్లో జరిగాయి. ప్రస్తుతం చైనా అధ్యక్షుడిగా వున్న క్సీ జిన్పింగ్ (విదేశీ పేర్లను ఇష్టం వచ్చినట్టు రాసుకునే స్వేచ్ఛ ఉందన్న భావం బలపడుతున్న కాలం ఇది. లోగడ ఇలాటి పేర్లు రాయాల్సి వచ్చినప్పుడు ఆలిండియా రేడియో ఇంగ్లీష్ వార్తలు విని రాయమని పాత రోజుల్లో ఎడిటర్లు చెప్పేవాళ్ళు) అధ్యక్ష పదవికి నామినేట్ అయిన కొద్ది రోజులకే కనిపించకుండా పోయారు. రాడార్ కూడా పసికట్ట లేనంతగా ఆయన 'అదృశ్యం' అయ్యారని అప్పట్లో మీడియా కోడై కూసింది. సరే మళ్ళీ బయటకు వచ్చి ఆ దేశపు అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అది వేరే విషయం. కానీ కనబడకుండా అన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారన్న గుట్టు ఇప్పటికీ బయటకు రాలేదు.
కాకపోతే, కనబడకుండా పోయిన ఇలాటి సంచలన రాజకీయ నాయకులు మనకు చరిత్రలో అనేకమంది కానవస్తారు. 
హ్యూగో చావెజ్ ఆషామాషీ నాయకుడు కాదు. దక్షిణ అమెరికాలోని వెనిజులా దేశాధ్యక్షుడిగా వున్నప్పుడు ఏకంగా ఓ నెల రోజులపాటు ఎవ్వరి కంటికీ కనిపించకుండా పోయి సంచలనం సృష్టించారు. 2011 జూన్ నెలలో ఇది జరిగింది. అప్పుడు అయన అనారోగ్యం గురించిన వార్తలే సంచారం చేసాయి. అనుదినం టీవీ తెరలపై కానవస్తూ, ట్విట్టర్లో దర్శనం ఇచ్చే ఛావెజ్, అన్ని రోజులు కనబడకుండా పోవడం ఆ రోజుల్లో పెద్ద వార్తగా తయారయింది. ఆయనపై వెలువడిన వదంతులను ఖండించడానికి ఆయన ప్రభుత్వం చాలా శ్రమ పడింది. క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో తో కలిసి ఛావెజ్ వాహ్వ్యాళి గా నడిచివెడుతున్న ఫోటోలను పత్రికలకు విడుదల చేసినా కూడా  పుకార్ల 'పటిమ' ఏమాత్రం తగ్గలేదు.
అమెరికాకు చెందిన మరో రాజకీయ నాయకుడిది నిజానికి సాధారణ సమస్యే. కాని అయన దాన్ని దాచిపెట్టి తన అదృశ్యానికి వేరే కారణాలు చెప్పడమే అసలు సమస్య అయి కూర్చుంది. సౌత్ కరోలినా గవర్నర్ మార్క్ సాన్ ఫర్డ్  2009 జూన్ లో వున్నట్టుండి నాలుగు రోజులపాటు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. 'మా ఆయన ఏదో పుస్తకం రాయడానికి  వెళ్ళాడు, ఇంట్లో పిల్లల గోలతో ఆయనకు  రాసుకునే  ప్రశాంతత కరువై అజ్ఞాతంలోకి వెళ్ళార'ని మార్క్ సాన్ ఫర్డ్  భార్య కూడా  ఏవేవో సాకులు చెప్పింది. కానీ ఈలోగా ఆయనే బయట పడి తన మనసులో మాట కూడా  బయటపెట్టాడు. 'నేను నా భార్యకు ద్రోహం చేసాను. నాకెంతో ప్రాణప్రదం అయిన నా ప్రియురాలితో గడపడానికి ఇలా అజ్ఞాతం లోకి  వెళ్లాన'ని చెప్పి ఆయనే తన తప్పు ఒప్పుకుని లెంపలు వేసుకున్నాడు.  అయితే ఆయన 'బుద్ది'  ఏడాది తిరక్కుండానే  మరో వంకర తిరిగింది. మొదటి ఎపిసోడుతో చిన్నబుచ్చుకున్న మొదటి భార్య విడాకులు తీసుకుంది. దాంతో మరింత ధైర్యం పుంజుకున్న  సాన్ ఫర్డ్ దొరవారు మళ్ళీ కనబడకుండా పోయారు. అలా మాయమై పోయిన మనిషి  తన వారసుడిగా వచ్చిన కొత్త  గవర్నర్ ప్రమాణ స్వీకార  కార్యక్రమంలో హఠాత్తుగా ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్య పరిచారు. అంతే కాదు, నలుగురు చూస్తుండగానే అక్కడ కనబడ్డ  తన మాజీ భార్య బుగ్గపై ముద్దు పెట్టుకుని తనలో దాగున్న 'ప్రబంధ నాయకుడి'ని మరోమారు ప్రపంచానికి  ప్రదర్శించి చూపారు.
మరి 'చిత్రం ' అనిపించకుండా ఎలా వుంటుంది చెప్పండి.
(bhandarusr@gmail.com)


(18-03-2015)

14, మార్చి 2015, శనివారం

బడ్జెట్లు వరమా? భారమా?


(Published by 'SURYA' telugu daily in it's edit page on 15-03-2015, SUNDAY)

ఒక టీవీ ఛానల్ చర్చలో  నాతొపాటు పాల్గొన్న ప్రొఫెసర్ హరగోపాల్ చెప్పారు, గతంలో బడ్జెట్ రోజుకు ముందుగానే దుకాణాల్లో సిగరెట్లు, అగ్గిపెట్టెలు, పాలపొడి డబ్బాలు మాయమై పోయేవని. కొత్తగా  పన్నులు వేస్తే,  పాత రేటుకు కొన్న సరకుల్నే  హెచ్చు ధరలకు  అమ్ముకుని లాభాలు సంపాదించవచ్చని వ్యాపారులు అలా చేసేవాళ్ళు. మార్కెట్ మీద ప్రభుత్వాలకు పట్టు వున్న కాలమది. ఇప్పుడో, మార్కెట్ శక్తులే ప్రభుత్వాలని శాసిస్తున్న రోజులాయె!
అందుకే బడ్జెట్లు ఈనాడు ఓ తంతుగా ముగిసే ప్రభుత్వ  కార్యక్రమాలు అయ్యాయి. వాటి మీద మీడియాకు తప్ప మామూలు జనాలకు ఆసక్తి లేకుండా పోతోంది. లోగడ కేంద్ర బడ్జెట్ అంటే రేడియో పెట్టుకుని వినేవారు. గ్యాస్  సిలిండర్  ధరలు, పెట్రోలు రేట్లు ఏవన్నా పెరిగాయా, కుక్కర్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీల  ఖరీదులు కొండెక్కి కూర్చున్నాయా లేదా తెలుసుకోవాలనే  ఆసక్తితో. ఇప్పుడు బడ్జెట్లకు, ధరల పెరుగుదలకు వున్న  లంకె తెంపేసారు. వేటి దోవ వాటిదే. 'కోడి గుడ్డు ధర' మాదిరిగా, ఏరోజు రేటు ఆ రోజుదే!


పొతే, ఈసారి మరో విశేషం ఏమిటంటే - రెండు తెలుగు రాష్ట్రాలు, మూడు రోజుల వ్యవధిలో మూడు బడ్జెట్లు.
పది జిల్లాల తెలంగాణా రాష్ట్రానికి లక్షా పదిహెను వేల  కోట్ల రూపాయల బడ్జెట్. పదమూడు జిల్లాల ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి లక్షా పదమూడు వేల కోట్ల  రూపాయల బడ్జెట్. 'ఇదేమిటి' అనే ప్రశ్న వస్తుందనుకున్నారేమో, మరునాడే ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం 'వ్యవసాయం'  పేరుతొ ఇంకో  ప్రత్యెక బడ్జెట్ సభకు సమర్పించి మరో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కలిపి, బడ్జెట్  అంచనాల్లో, కేటాయింపుల్లో తానూ  తక్కువ తినలేదు అనిపించింది.
ఉమ్మడి రాష్ట్రంలో లక్షలతో మొదలయిన బడ్జెట్ అంచనాలు కాలక్రమంలో పెరిగి పెరిగి లక్షల కోట్లల్లోకి చేరుకున్నాయి. ప్రతియేటా పెరుగుతూ  పోవడం తప్పనిసరిగా తయారయింది. ఆర్ధిక ప్రగతికి ప్రభుత్వాలు కూడా దీన్ని ఒక కొలమానంగా పరిగణిస్తున్నాయి. బడ్జెట్ మొత్తం యెంత గొప్పగా వుంటే అభివృద్ధి కూడా ఆ స్థాయిలో ఉంటుందని నమ్మే రోజులు వచ్చాయి.
వాస్తవానికి  ప్రతి ప్రభుత్వం, అది ఏ పార్టీ ప్రభుత్వం అయినా సరే, ప్రతి ఏటా బడ్జెట్ పై గట్టి కసరత్తే చేస్తుంది. తమ విధానాలకు అనుగుణంగా ప్రాధాన్యతాక్రమంలో  కేటాయింపులు చేస్తుంది. యెంత ఖర్చు చేయాలన్నా ఎంతో కొంత రాబడి వుండాలి. ఖజానాలో చేరే రూపాయలు తగ్గిపోయి పెట్టె ఖర్చు పెరిగిపోతే అదనపు ఆదాయ వనరుల అన్వేషణ తప్పనిసరి అవుతుంది. ఇందుకోసం అప్పులన్నా చేయాలి. లేదా పన్నులన్నా వేయాలి. మొదటిది అంటే అప్పు దొరకడం కష్టం. దొరికినా సవాలక్ష నిబంధనలు. షరతులు. ఇక రెండో వెసులుబాటు పన్నులు వేయడం. ఇది  తేలికే కాని, రాజకీయ కోణాల దృష్ట్యా కొంత ఇబ్బందికర  వ్యవహారం. కాబట్టి, అంచనాలు పెంచుకుంటూ పోయి వాటికోసం  దొరికినంత అప్పులు చేయడం, విధి లేకపోతే పన్నులు వేయడం ప్రభుత్వాలకు ఆనవాయితీగా మారింది. దీనికి కూడా రానురాను ' రామ్ రామ్' చెబుతున్నారు. బడ్జెట్లో పన్నులు వేయడం అన్న పద్దతికి స్వస్తి పలుకుతున్నారు. ఏడాది పొడుగునా వేయగల వీలూ చాలూ  వున్నప్పుడు వాటిని బడ్జెట్లో చూపించి లేని తలనొప్పులు కొని తెచ్చుకోవడం ఎందుకన్న నిర్ధారణకు ప్రభుత్వాలు  వచ్చేసాయి.
సరే! రెండు రాష్ట్రాలలోని రెండు ప్రభుత్వాలు వచ్చే నెల నుంచి మొదలయ్యే ఆర్ధిక సంవత్సరానికి జమాలెక్కలు శాసన సభలకి సమర్పించి చేతులు దులుపుకున్నాయి. ప్రతి పక్షాలు కూడా తమ శక్త్యానుసారం ప్రభుత్వ పద్దుల్ని దులపరించి,  తమ విధి తాము అవధులు మించి నిర్వర్తించాయి. దేవుడు మేలు చేసి నాలుగేళ్ల తరువాత జరిగే ఎన్నికల్లో జనం తమ తల రాత మారిస్తే అప్పుడు  ఆ పార్టీలు  ఇప్పుడు చెప్పిన వాటిని మరిచిపోయి,  కాదన్న వాటినే చేసి చూపిస్తాయి. పాత్ర  మారితే,  ప్రస్తుత ప్రభుత్వాలు కూడా మారిన పాత్రలో ఒదిగిపోయి ఇప్పుడు ప్రతిపక్షాలు చెబుతున్న మాటల్నే అక్షరం పొల్లుపోకుండా వల్లె వేస్తాయి. ఇదొక  విష చక్రభ్రమణం. ఎన్ని ఏళ్ళుగానో ఏటేటా మీఎదియాలో  చూస్తున్న, పత్రికల్లో చదువుతున్న సంగతులే ఇవి.           
బడ్జెట్ అంచనాలు లక్షలు కోట్లు అంటున్నారు. చిన్న అంకెలు పాలకుల కంటికి ఆనడం లేదు. మిగులు రాష్ట్రం అయిన తెలంగాణాలో అంచనాలు అధికంగానే కానవస్తున్నాయి. తరుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లో కూడా అంకెలు కొట్టొచ్చినట్టు పెద్దవిగానే కనబడుతున్నాయి. ప్రాధాన్యతల దగ్గరే పాలక ప్రతిపక్షాలకు శ్రుతి కుదరడం లేదు. 'అంకెల గారడీ' అని విపక్షాలు విమర్శిస్తుంటే వాటి మాటల్ని 'అవగాహనారాహిత్యం'గా పాలక పక్ష సభ్యులు కొట్టి పారేస్తున్నారు. 'చెప్పింది ఏమిటి? చేస్తున్నది ఏమిటి? సరయిన వనరులు లేకుండా  ఈ అరకొర కేటాయింపులతో ఏవి సాధిస్తారు' అని ప్రతిపక్షాల ప్రశ్న. 'మనసుంటే మార్గం  వుంటుంది' అని సర్కారు వారి షరా మామూలు జవాబు.  ఇటు ఈ రాష్ట్రంలో, అటు ఆ రాష్ట్రంలో ఇదే వరస. ఇదే బాణీ. ఎక్కడో ఎప్పుడో ఈ మాటలే తామే చెప్పినట్టు అనిపించినా అవి పట్టించుకోవు.  వినేవారికి చెప్పేవారు లోకువ అంటారు. కానీ ఈ నానుడి తిరగబడింది. తమ మాటలతో, తమ పధకాలతో జనాలను ఊహాలోకాల్లో తిప్పి చూపించేవారికి చూసే జనాలు లోకువ.
రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల్లో బడ్జెట్ పై చర్చలు ఎలా సాగుతాయో తెలియదు కానీ, టీవీ ఛానళ్ళలో మాత్రం చర్చోపచర్చలు అనుదినం సాగిపోతూనే వున్నాయి. నిన్న ఉదయం కాబోలు 'అసలు బడ్జెట్ అంటే ఏమిటి?' అని ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యే అడిగారు. నిజానికి బడ్జెట్లు రూపొందించి, ఆమోదించే  సభలో ఆయన సభ్యుడు.
బడ్జెట్ అంటే కొన్ని ఆలోచనలు, ఆలోచనలకు తగ్గ అంచనాలు, అంచనాలకు తగిన కేటాయింపులు. అంతటితో బడ్జెట్ పని పూర్తి చేసామని చెప్పుకోవచ్చు. అయితే, కేటాయింపులకు అనుగుణంగా  ఆ నిధులను  సకాలంలో విడుదల చేసి  ఖర్చు చేస్తున్నారా అంటే  అవునని చెప్పడం ఏ ప్రభుత్వానికయినా కష్టమే. ఆర్ధిక సంవత్సరం ముగియవచ్చే తరుణంలో హడావిడిగా నిధులు ఇబ్బడిముబ్బడిగా విడుదల చేయడం, సకాలంలో వాటిని ఖర్చు చేయలేక మురగబెట్టడం ఓ ఆనవాయితీగా మారిపోయింది.  ఖర్చు చేయనిదానికి కేటాయింపులు చేయడం ఎందుకు? కేటాయింపులు చేయలేదని, లేదా సరిగా చేయలేదని ప్రశ్నించడం ఎందుకు? అటు చూసినా, ఇటు చూసినా, అటుఇటు చూసినా అంతా  రాజకీయమే!
బడ్జెట్ ప్రసంగం పేరుతొ ప్రతి ఆర్ధికమంత్రి యాభయ్, అరవై పేజీల పుస్తకం శాసన సభలో చదవడం రివాజు. మరో రెండు పేజీలు  అదనంగా జతచేసి, నిరుడు బడ్జెట్లో, కనీసం కొన్ని ప్రధాన రంగాలకు యెంత కేటాయించారు, వాటిల్లో యెంత ఖర్చు పెట్టారు అనే వివరాలు జోడిస్తే - లక్షల కోట్ల బడ్జెట్లకు అంకెల అలంకారంతో పాటు కొంత విశ్వసనీయత దానికి అబ్బుతుంది.        
ఉపశ్రుతి:
చాలా కాలం నాటి ముచ్చట.
తెలుగు దేశం పార్టీ  వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రాన్ని పాలిస్తున్నప్పుడు మహేంద్రనాథ్ అనే ఓ పెద్దమనిషి ఆర్హ్దిక మంత్రిగా వుండేవారు. వారికి వినికిడి సమస్య. చెవిలో చిన్న యంత్రం అమర్చుకుని బడ్జెట్ ప్రసంగ పాఠం నెమ్మదిగా, చిన్న గొంతుకతో చదువుకుంటూ పోయేవారు. బడ్జెట్ పై చర్చలో ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధిస్తుంటే ఆయనగారు నెమ్మదిగా చెవిలోని వినికిడి యంత్రం తీసేసి నిరాసక్తంగా తన సీటులో కూర్చుండిపోయేవారు.  (14-03-2015)

(bhandarusr@gmail.com)

NOTE: Courtesy Image Owner

12, మార్చి 2015, గురువారం

బతికి పోయాను సుమా!





'చాలా సార్లు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. ఎందుకో ఏమిటో చేసుకోలేదు. బ్రహ్మచారిగానే వుండిపోయాను' - నోయెల్ కవార్డ్

'ఒకటిమాత్రం నిజం. ఏ పురుషుడికయినా పెళ్లి చేసుకున్న తరువాతనే అతడి జీవితానికి పరిపూర్ణత లభిస్తుంది. మరో నిజం ఏమిటంటే, పరిపూర్ణత లభిస్తుంది కానీ, పెళ్ళితో అతగాడి పాత్ర ముగిసిపోతుంది' - జ్సా జ్సా గబర్



'ఇంటి పని, వంటపని వీటిల్లో నేను మొనగాడిని. విడాకులు తీసుకున్న ప్రతిసారీ ఈ పనులన్నీ నామీదే పడేవి. దాంతో వాటిల్లో రాటు తేలిపోయాను' - జ్సా జ్సా గబర్


'ఆవిడ చాలా చాలా మంచిది. ఆమెకు చక్కటి భర్త దొరకాలి. అలాటివాడు ఎవరన్నా ఆవిడకు తటస్థపడేలోగా ఆవిడను పెళ్ళాడిన వాడు అదృష్ట వంతుడు' - ఆస్కార్ లెవంట్


'అమెరికాలో ఎనభై శాతం మంది మగవాళ్ళు ఆడవాళ్ళను మోసం చేసేవాళ్ళే. మిగిలిన ఇరవై శాతం యూరోపులో వుంటారు' - జాకీ మాసన్


'వివాహం అనేది ఓ పంజరం లాంటిది. బయట వున్న పక్షులేమో ఎప్పుడెప్పుడు లోపల దూరదామా అని చూస్తుంటాయి.  లోపల వున్న పక్షులు ఎలా బయట పడాలా అని ఆలోచిస్తుంటాయి' - మాంటేన్


'పెళ్లి తరువాత మొగుడూ పెళ్ళాం ఇద్దరూ ఒకే నాణేనికి బొమ్మా బొరుసులుగా మారతారు. కలిసే వుంటారు కాని, విడివిడిగానే మిగిలి పోతారు'- హేమంత్ జోషి


'పెళ్లి చేసుకోవడం మాత్రం మానకండి. ఎందుకంటె మంచి భార్య దొరికింది అనుకోండి హాయిగా సుఖపడతారు. పెళ్ళాం గయ్యాళిది అయిందనుకోండి. ఎంచక్కా  నాలా వేదాంతిగా తయారవుతారు. ఇంతకంటే జీవితానికి  ఏం కావాలి చెప్పండి?' - సోక్రటీసు


'తెలివయిన మగవాడు భార్య ఖర్చుకు మించి సంపాదిస్తాడు. తెలివయిన ఆడది అలాటి మగవాడినే మొగుడిగా చేసుకుంటారు'  - లానా టర్నర్

'భార్యలు ఓ పట్టాన అర్ధం కారు. మా ఆవిడ చూడండి. పెళ్లి కాగానే పట్టుబట్టి పోరి పోరి నా పాత అలవాట్లన్నీ మానిపించింది. ఇప్పుడేమో పెళ్లి చేసుకున్నప్పటి మనిషి కాదని నస పెడుతోంది.' - సగటు మొగుళ్ళలో తొంభయ్ శాతం మంది మనసులో మాట.



NOTE: Courtesy 'Cartoon a Day.com'

11, మార్చి 2015, బుధవారం

బడ్జెట్లు


ఒక టీవీ చానల్ డిబేట్ లో నాతొ పాటు పాల్గొన్న ప్రొఫెసర్ హర గోపాల్ చెప్పారు. గతంలో బడ్జెట్ రోజుకు ముందుగానే దుకాణాల్లో సిగరెట్లు, అగ్గిపెట్టెలు, పాల పొడి డబ్బాలు మాయమై పోయేవని. కొత్త పన్నులు పడితే పాత రేటుకు కొన్న సరకులు కొత్త రేట్లకు అమ్ముకుని లాభాలు సంపాదించవచ్చని వ్యాపారులు అలా చేసేవాళ్ళు. మార్కెట్ మీద ప్రభుత్వాలకు పట్టు వున్న రోజులవి. ఇప్పుడో, మార్కెట్ శక్తులే ప్రభుత్వాలని శాసిస్తున్న రోజులాయె!
అందుకే బడ్జెట్లు ఈనాడు ఓ తంతుగా ముగిసే ప్రభుత్వ  కార్యక్రమాలు అయ్యాయి. వాటి మీద మీడియాకు తప్ప మామూలు జనాలకు ఆసక్తి లేకుండా పోతోంది. లోగడ కేంద్ర బడ్జెట్ అంటే రేడియో పెట్టుకుని వినేవారు. గాస్ సిలిండర్  ధరలు, పెట్రోలు ధరలు ఏవన్నా పెరిగాయా, కుక్కర్లు, ఫ్రిజ్  ల ఖరీదులు పెరిగాయా అనే ఆసక్తితో. ఇప్పుడు బడ్జెట్లకు, ధరల పెరుగుదలకు లంకె తెంపేసారు. వేటి దోవ వాటిదే. 'కోడి గుడ్డు ధర' మాదిరిగా, ఏరోజు రేటు ఆ రోజుదే!


లక్షలు కోట్లు అంటున్నారు. చిన్న అంకెలు పెద్ద ప్రభువులకు ఆనడం లేదు. మిగులు రాష్ట్రం కనుక కొన్నేళ్ళు పరవాలేదేమో. కానీ, తింటూ కూర్చుంటే కొండలు కూడా తరిగిపోతాయని అంటారు. కాస్త కళ్ళెం బిగబట్టడం అవసరమేమో.  (11-03-2015)    

సిగరెట్లు మానడం ఎలా?



(ఈరోజు 'నో స్మోకింగ్ డే')
ఇదేమన్నా బ్రహ్మ విద్యా! నేను చాలాసార్లు మానేశానుఅనే జోకులు వింటూనే వుంటాము.
చాలా సంవత్సరాల క్రితం అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మ్యాగజైన్ సంపాదక బాధ్యతలు నిర్వహించిన కీర్తిశేషులు శ్రీ పీవీ రావు నాచేత ఈ అంశంపై ఒక వ్యాసం రాయించి పత్రికలో అచ్చు వేయించి ఓ నూటపదహార్లు అనుకుంటాను తాంబూలం కూడా ఇచ్చారు. ఏదయితేనేం అప్పుడా డబ్బులు ఓ వారం పదిరోజులు సిగరెట్ల ఖర్చుకు పనికొచ్చాయి.
సిగరెట్లను సిగరెట్టు మాదిరిగా తాగే మా స్నేహితులు నా గురించి చెప్పుకునేమాట వేరు. శ్రీనివాసరావు సిగరెట్లు తాగడు, తగలేస్తాడుఅన్నది వాళ్ల థియరీ, ‘హార్లిక్స్ తాగడు తింటాడుఅనే వాణిజ్య ప్రకటన టైపులో.
సిగరెట్లు అలవాటు కావడానికి నేను చెప్పుకునే కారణం వేరే వుంది. ఇండియాలో వున్నప్పుడు కొని తాగే అలవాటు అలవడని నేను, మాస్కో వెళ్ళేక డబ్బులు తగలేసి మరీ సిగరెట్లు తగలేయడం మొదలు పెట్టాను. దానికి కారణాలు రెండు. ఒకటి మన దగ్గర అతి ఖరీదైన సిగరెట్లు కూడా మాస్కోలో అతి తక్కువ ధరకు దొరకడం. భాష ఎంతమాత్రం  తెలియని  ఆడామగా రష్యన్   సహోద్యోగులతో కాసేపు మాటామంతీలేని కాలక్షేపం చేయడానికి  ఈ సిగరెట్లు చక్కగా  అక్కరకు రావడం. దానాదీనా నా కొనుగోళ్ళు   సిగరెట్ ప్యాకెట్ల నుంచి  ఏకంగా  కార్టన్ల స్థాయికి పెరిగాయి. 


(అలనాటి మా మాస్కో అపార్ట్ మెంట్లో)

2004లో అమెరికా వెళ్ళినప్పుడు  ఒక పెద్ద సూటుకేసు నిండా మా ఆవిడ వూరగాయ పచ్చళ్ళ ప్యాకెట్లతో, మరో పెద్ద సూటుకేసు నిండా సిగరెట్ల ప్యాకెట్లతో దిగబడ్డ మమ్మల్ని చూసి అమెరికా కష్టమ్స్ వాళ్లు నోళ్ళు వెళ్ళబెట్టారు. నా మీద కార్టూన్లు వేసే స్థాయికి నేను జీవితంలో ఎదిగివుంటే అంజయ్య గారి వేలుకు హెలికాఫ్టర్ బొమ్మ ముడివేసినట్టు నా బొమ్మకు చేతిలో సిగరెట్ తగిలించేవాళ్లేమో!
మరి ఇప్పుడేవిటి ఇలా అయిపోయారు? ‘ఏవి తండ్రీ నాడు విరిసిన  రింగు రింగుల  పొగల మేఘాలుఅని మా స్నేహితులు భారంగా నిట్టూర్పులు విడుస్తుంటారు. నా ఈ దుస్తితికి కారకులు ఎవరయ్యా అంటే నిమ్స్ డైరెక్టర్ గా పనిచేసిన డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు.
దీనికి ముందు ఓ పిట్ట కధ చెప్పాలి. దూరదర్శన్ విలేకరిగా పనిచేస్తున్న రోజుల్లో  ఓ రోజు తెల్లగా తెలవారక మునుపే, కప్పు కాఫీ కూడా కడుపులో పడకుండానే జూబిలీ హిల్స్ లోని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కెమెరామన్ తో సహా  చేరుకున్నాను. మిగిలిన జాతీయ చానళ్ళ బృందాలు కూడా బిలబిల మంటూ అక్కడికే చేరాయి.  మామూలుగా అయితే బాబుగారి ఇంట్లో  విలేకరులకు రాజభోగాలు. కానీ ఆ రోజు విలేకరులది పిలవని పేరంటం. బీజేపీతో టీడీపీకి ఎన్నికల పొత్తు విషయం గురించి తేల్చడానికి  ఆ రెండు పార్టీల నాయకుల నడుమ  ఎడతెగని చర్చలు లోలోపల సాగుతున్నాయి. బయట ఫుట్ పాత్ మీద నిలబడి కొందరం,  కూలబడి కొందరం పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటున్నాం. ముందు జాగ్రత్త చర్యగా వెంట తెచ్చుకున్న సిగరెట్లను ఒకదాని వెంట మరోటి తగలేస్తూ, తెచ్చుకోని వాళ్లకు ఉదారంగా పంచిపెడుతూ నా మానాన నేను కాలక్షేపం చేస్తుండగా సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. కడుపులో ఎలుకలు. మరో పక్క సిగరెట్ల పొగతో కళ్ళ కలకలు. అలా నిలబడి సిగరెట్ తాగుతూ వున్నవాడ్ని వున్నట్టుండి  స్లో మోషన్ లో కిందకు వొరిగి పోతూ వుండడం వరకే గుర్తు.
కట్ చేస్తే నిమ్స్ ఆసుపత్రిలోని  ప్రత్యేక గదిలో డాక్టర్ల పర్యవేక్షణలో. ఆందోళనగా నా వైపే చూస్తున్న నా భార్య. ఆమెతో పాటు నా ఇద్దరు పిల్లలు. ముఖ్యమంత్రి గారా మజాకా. జరిగిన విషయం  విలేకరుల ద్వారా తెలుసుకుని హుటాహుటిన అంబులెన్స్ తెప్పించి నన్ను నిమ్స్ లో అడ్మిట్ చేయించారట. అందుకే కాబోలు  కాకర్ల వారు కూడా స్వయంగా వచ్చి చూసారు. రిపోర్టులన్నీ తిరగేశారు.  కళ్ళు తిరగడానికి, వొళ్ళు తూలడానికీ నా సిగరెట్లే కారణం అని ఆయన తన అనుభవంతో ఇట్టే కనుక్కున్నారు. ఆ విషయం మా ఆవిడతో చెప్పి, ‘నెమ్మదిగా ఈ అలవాటు మానిపించమని సలహా ఇచ్చారు.  కళ్ళు తెరిచి  ఇదంతా చూస్తూ, చెవులు వొగ్గి ఇదంతా వింటున్న నేను హఠాత్తుగా   ముందుకు వొంగి,  ‘నేను సిగరెట్లు మానేశాను డాక్టర్ గారుఅని ఒక బహిరంగ ప్రకటన చేసాను. ఆయన విలాసంగా మందహాసం చేసి,  నెత్తి మీది వెంట్రుకలు చేత్తో పట్టి చూపిస్తూ, ‘ఇలాటి వాళ్ళను నా సర్వీసులో  ఇంతమందిని చూసానుఅంటూ,  ‘అదంత తేలిక కాదని ఆయనే చెబుతూ,  నేను తాగే బ్రాండ్ సిగరెట్ ప్యాకెట్ ఒకటి అప్పటికప్పుడే తెప్పించి మా ఆవిడ చేతిలో పెట్టి,  ‘రాత్రి అందరూ  నిద్ర పోయిన తరువాత నీ మొగుడు  నీ మెదడు కొరుక్కు తింటాడు, ఎందుకయినా మంచి ఇది దగ్గర వుంచుకోమ్మాఅని వెళ్ళిపోయారు.
అంతే! ఎంతయినా నేనూ పట్టుదల కలిగిన  మనిషిని కదా! ఇంటికి వెళ్ళినప్పటినుంచి ఆ ప్యాకెట్టూ ముట్టుకోలేదు. అప్పటినుంచి సిగరెట్టూ అంటించలేదు.
మరో వింత ఏమిటంటే, ఆనాటి నుంచి  సిగరెట్ తాగాలని కూడా అనిపించలేదు.          
 (11-03-2015)
  


10, మార్చి 2015, మంగళవారం

ఏవిటి పరిష్కారం? ఇదా పరిష్కారం?

(Published by 'SURYA' Telugu Daily in it's Edit Page on 12-03-2015,THURSDAY)

పైకి విభిన్నంగా కనిపిస్తూ, సారూప్యం కలిగిన  కొన్ని వార్తలు గత కొద్ది రోజులుగా వెలుగు చూస్తున్నాయి. మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని స్త్రీ శక్తి, మహిళా సాధికారత, వారి భద్రత గురించి రాజకీయ  నాయకులు చేసిన ప్రసంగాలు,  అంతకు కొద్ది రోజులముందు బీబీసీ డాక్యుమెంటరీ 'ఇండియాస్ డాటర్' సృష్టించిన అలజడి, అత్యాచార నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టడం పట్ల హైకోర్టు ఆగ్రహం, నాగాలాండ్ లో ఒక బాలికను లైంగికంగా వేధించాడన్న ఆరోపణతో జైల్లో వున్న నిందితుడిపై  ఆగ్రహోదగ్రులైన దిమాపూర్ ప్రజలు తీసుకున్న పాశవిక ప్రతీకార చర్య, ఇవన్నీ పెను సంచలనాలకు కేంద్ర బిందువులుగా మారాయి.
మహిళా దినోత్సవం యధావిధిగా ఒక తంతులా ముగిసింది. పత్రికల్లో ప్రత్యెక వ్యాసాలు, మీడియాలో ప్రత్యెక కార్యక్రమాలు, వివిధ రంగాల్లో వినుతికెక్కిన వనితా మణులకు సర్కారు సత్కారాలు, మహిళల గొప్పతనాన్ని శ్లాఘిస్తూ ప్రసంగాలు, స్త్రీలకు చేయబోయే సేవలను వివరిస్తూ వాగ్దానాలు ఇవన్నీ, బుల్లి తెరలపై  చూసీ, వినీ  ఆడంగులందరూ తిరిగి తమ పనిపాటల్లో పడిపోయివుంటారు. బహుశా ఈ జన్మకు ఇంతే అని కూడా మనస్సులో అనుకునివుంటారు.
నిజమే కావచ్చు.  ఒకప్పటి కంటే ఈనాటి మహిళలు  కొంత మెరుగయిన స్వేచ్చను అనుభవిస్తూ ఉండవచ్చు. మగవారికి దీటుగా ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు నిర్వహిస్తూ, రాజకీయాల్లో రాణిస్తూ ఉండవచ్చు. కానీ,  అతివల  అభ్యున్నతికి చదువొక్కటే కొలమానం అయితే, ఆర్ధిక స్వావలంబన ఒక్కటే గీటురాయి అయితే, చదువుకున్న మహిళలు, సంపాదిస్తున్న ఆడవారు ఈనాటికీ పైకి చెప్పుకోలేని అభద్రతాభావంలోనే వుండిపోవడానికి కారణం ఏమిటి?  రోజురోజుకూ వారిపై  పెరిగిపోతున్న అత్యాచారాలకు హేతువు ఏమిటి? స్త్రీలు సంచరించే చోట దేవతలు నర్తిస్తారు అనే పుణ్యభూమిలో నరరూప రాక్షసుల వికృత పోకడలకు అర్ధం ఏమిటి?
మహిళా దినోత్సవం సందర్భంగా చక్కటి స్పూర్తిదాయకమైన లఘు చిత్రం రూపొందించాలని బీబీసీ వంటి ప్రసిద్ధ ప్రసార మాధ్యమం తలపెడితే అందులో తప్పు పట్టాల్సింది ఏమీ వుండదు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలే ప్రధానాంశంగా తీసుకుని డాక్యుమెంటరీ తీసినా ప్రశ్నించాల్సిన  అగత్యం లేదు.  ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నిర్భయ' అత్యాచారం కేసులో శిక్షపడి జైల్లో వున్న ఖైదీని ఇంటర్వ్యూ చేసి ప్రసారం చేసినా ఎందుకని అడగాల్సిన అవసరం లేదు. కానీ, మహిళా దినోత్సవం నాటికి కొద్ది ముందుగా యూ ట్యూబ్ లో ఆ పేరుతొ ప్రత్యక్షమైన అంశాలే ముక్తకంఠంతో ఖండించాల్సిన విషయాలుగా పరిణమించడం ఇందులోని విషాదం.


నాగరిక సమాజం నివ్వెరపడే విధంగా, సిగ్గుతో తలదించుకునే విధంగా  అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపి నేరస్తుడిగా జైల్లో వున్న వ్యక్తి -  'ఆ అమ్మాయి సహకరించి వుంటే ఇంతటి దుస్తితి ఆమెకు పట్టేది కాదు' అనే రీతిలో వ్యాఖ్యానించాడు అంటే దాన్ని మరో పెద్ద నేరంగా పరిగణించి శిక్ష విధించాల్సిన చట్టాలు మన దేశంలో లేకుండా పోయినందుకు దేశ ప్రజలు సిగ్గుపడాలి. తమ ముష్కర చర్యలద్వారా, అన్నెం పున్నెం ఎరుగని ప్రజల ప్రాణాలు నిలువునా తీసే ఉగ్రవాదుల దుశ్చర్యలు ఎంతటి ఘాతుకమైనవో, ముక్కూ మొహం తెలియని ఒక అమాయకపు ఆడపిల్ల మానాన్ని దోచుకునే ఇటువంటి నేరస్తుల నీతిమాలిన చర్యలు కూడా అంతే హేయమైనవి. నిజానికి అటువంటి వ్యాఖ్యలు చేసిన నిందితుడికి యావజ్జీవ శిక్షకంటే పెద్ద శిక్ష వేయాల్సిన అవసరం వుంది. కానీ జరిగింది ఏమిటి? దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. మహిళా సంఘాలు ఖండించాయి. ప్రజాసంఘాలు నిరసించాయి. ప్రభుత్వం కదిలింది. తక్షణం యూ ట్యూబ్ నుంచి ఆ డాక్యుమెంటరీ కి సంబంధించిన ప్రచార భాగాన్ని తొలగించారు. అయితే అప్పటికే దానికి లభించాల్సిన ప్రాచుర్యం ఇబ్బడి ముబ్బడిగా లభించింది.
మన దేశంలో నిషేధానికి గురయిన ఈ లఘు చిత్రానికి అమెరికాలో లభించిన గౌరవాదరాలు అన్నీ ఇన్నీ కావు. మూడు పర్యాయాలు అకాడమీ అవార్డు గెలుచుకున్న ప్రఖ్యాత హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ ఈ చిత్రం ప్రీమియర్ షోకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. 2012 లో ఢిల్లీ లో నడుస్తున్న బస్సులో దారుణంగా అత్యాచారానికి గురయిన ఢిల్లీ యువతి పట్ల గౌరవంతో అసలు పేరు బయట పెట్టకుండా మన మీడియా కొంత మర్యాద పాటిస్తే, అమెరికాలో జరిగిన కార్యక్రమంలో ఆమె అసలు పేరుతోనే నివాళులు అర్పించారు. 'ఆమె భారతీయ తనయ (ఇండియాస్ డాటర్). కానీ ఈరోజు నుంచి ఆమె మన కుమార్తె కూడా' అంటూ వక్తలు మాట్లాడారు. భారతీయ తనయ అయినా అమెరికా అమ్మాయి అయినా ఆ నిర్భాగ్యురాలు వీటన్నిటికీ అతీతంగా మరో లోకానికి తరలి వెళ్ళింది. బహుశా అక్కడివాళ్ళయినా ఆ అభాగ్యురాలిని అక్కున చేర్చుకున్నారేమో తెలియదు.
ఈ డాక్యుమెంటరీ తీసిన బ్రిటిష్ మహిళ లెస్లీ ఉడ్విన్ కూడా ఒకప్పుడు అత్యాచార బాధితురాలే కావడం యాదృచ్చికం కావచ్చు. మహిళలపై పెచ్చు పెరుగుతున్న అత్యాచారాలను ఖండించే  లక్ష్యంతో తీసిన లఘు చిత్రం కావచ్చు. కానీ అసలు విషయం కంటే కూడా నిందితుడు చేసిన అసందర్భ, అవాంఛిత వ్యాఖ్యలకు ఎక్కువ ప్రచారం లభించినట్టయింది.
'గౌరవ మర్యాదలు కలిగిన కుటుంబం నుంచి వచ్చిన యువతులు ఇలా అర్ధరాత్రి, అపరాత్రి  బజార్న పడి తిరగరు. మగవారిని తేలిగ్గా ఆకర్షించే వస్త్ర ధారణ ఆడవారికి అసలు  పనికి రాదు.'
చేసిన నిర్వాకానికి జైల్లో శిక్ష అనుభవిస్తూ, చేసిన పనిని సమర్ధించుకుంటూ ఆ ఖైదీ పలికిన  మాటలు ఇవి.
'అర్ధరాత్రి ఆడపిల్ల ధైర్యంగా ఇంటికి రాగలిగిన నాడే మన దేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చినట్టు లెక్క' అన్న మహాత్మా గాంధీ బోధనలకు, చేసిన పనికి ఇసుమంతయినా పశ్చాత్తాపం  లేకుండా ఆడపిల్లల ప్రవర్తన గురించి ఆ నేరస్తుడు నోటికి  వచ్చినట్టు చెప్పిన  మాటలకు ఏమైనా పొంతనవుందా!'

'స్త్రీలపై లైంగిక దాడులు' అనేవి ఒక్క భారత దేశానికి మాత్రమే   పరిమితం కావు. అన్ని దేశాలను వేధిస్తున్న సమస్య ఇది' అని అమెరికాలో ఈ డాక్యుమెంటరీ ప్రీమియర్ సందర్భంగా నిర్వాహకులు చెప్పారు. నిజమే కావచ్చు. అలాంటప్పుడు, ఇలాటి అత్యాచారాలు జరుగుతున్న మరో దేశం ఏదీ, ఈ చిత్ర నిర్మాణానికి ముందు వారికి కనబడలేదా అన్నది జవాబు రాని, జవాబు లేని ప్రశ్న. (10-03-2015)

7, మార్చి 2015, శనివారం

శాసనసభల సమావేశాలు


(Published by 'SURYA' telugu daily in it's edit page on 08-03-2015, SUNDAY)

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల శాసనసభల సమావేశాలు  మొదలయ్యాయి. ఈ రెండూ కొత్త రాష్ట్రాలుగా ఏర్పడి తొమ్మిది నెలలు గడిచిపోయాయి. గతంలో కూడా ఈ రెండు శాసన సభల సమావేశాలు జరిగాయి కాని, అవి వేర్వేరుగా వేర్వేరు తేదీల్లో జరిగాయి. కానీ ఈసారి పూర్తి బడ్జెట్ సమావేశాలు, అవీ ఉభయ సభల సంయుక్త సమావేశాలు  కొన్ని గంటల తేడాతో ఒకే ఆవరణలో జరగడం ఒక విశేషం. అంతే  కాదు, ఉభయ రాష్ట్రాలకు గవర్నర్ గా వున్న శ్రీ నరసింహం, విడివిడిగా  రెండు సభలను ఉద్దేశించి ప్రసంగించారు. 'నా ప్రభుత్వం' అంటూ ఆ రెండు ప్రభుత్వాల ఉద్దేశ్యాలు, కార్యాచరణ  ప్రణాళికలు వివరించారు.  ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, చంద్రశేఖర రావులు లోగడ అనేక సందర్భాలలో చెబుతూ వచ్చిన అనేక విషయాలను గుదిగుచ్చి రూపొందించిన ప్రసంగాల మాదిరిగా అనిపిస్తే ఆశ్చర్య పడాల్సింది లేదు. ఎందుకంటె ఆయా  రాష్ట్ర ప్రభుత్వాల మంత్రివర్గాలు ఆమోదించిన ప్రసంగపాఠాలనే గవర్నర్  శాసన సభల్లో చదువుతూ రావడం అనేది సంప్రదాయం.

గంటల తేడాతో మొదలయిన రెండు రాష్ట్రాల శాసన సభల ప్రారంభ పర్వం కూడా కొంత తేడాగా వుండడం యాదృచ్చికం కాకపోవచ్చు. ముందు మొదలయిన ఆంద్ర ప్రదేశ్ శాసనసభలో గవర్నర్ ప్రసంగం, ఆదినుంచి తుదివరకు హుందాగా సాగిపోయింది. గవర్నర్ కూడా నింపాదిగా హాయిగా తమ ప్రసంగ ప్రతిని దాదాపు గంటపాటు చదువుకుంటూ పోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన అనేక సంక్షేమ పధకాలను ఏకరువు పెట్టడంతో పాటు, కొత్త రాజధాని నిర్మాణం, ప్రత్యెక హోదా మొదలయిన అంశాలే కాకుండా 'రాష్ట్ర విభజన జరిగిన తీరు సమంజసంగా లేద'న్న ముఖ్యమంత్రి అభిప్రాయం సయితం గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావనకు నోచుకుంది. గవర్నర్ ప్రసంగం ముగియగానే జాతీయ గీతాపలాపన అనంతరం ఆంద్ర ప్రదేశ్ శాసన సభ సోమవారానికి వాయిదా పడింది.
దీనికి పూర్తి భిన్నంగా తెలంగాణా శాసన సభ సమావేశాలు కాసేపటి తరువాత మొదలయ్యాయి. ప్రసంగం చదువుతున్నప్పుడు  టీవీల్లో గవర్నర్ నరసింహన్ హావభావాలు గమనించినప్పుడు,  సభలో అంతా సజావుగా సాగడం లేదేమో అన్న భావం కలిగింది. త్వరత్వరగా పేజీలు  తిప్పుతూ, గబగబా  చదువుతూ, మొత్తం ప్రసంగాన్ని పదిహేను నిమిషాల్లోనే ముగించిన తీరు చూసినవారికి  సభలో జరగరానిదేదో  జరుగుతోందన్నఅనుమానం తలెత్తింది. అది నిజమేనని ఆ తరువాత మీడియా పాయింటు వద్దనుంచి వివిధ టీవీ ఛానళ్ళల్ల ప్రతినిధులు ప్రత్యక్ష ప్రసారంలో  మాట్లాడినప్పుడు ధృవపడింది. గవర్నర్ ప్రసంగం మొదలెట్టగానే, కాంగ్రెస్, టీడీపీ సభ్యులు పోడియం ముందుకు దూసుకు వెళ్ళారనీ, ప్రసంగం ప్రతులను చించి గవర్నర్ పై విసిరి వేసే ప్రయత్నం చేసారనీ, కొందరు టీ.ఆర్.యస్. సభ్యులు కూడా ముందుకు  తోసుకురావడంతో ఉభయుల నడుమ తోపులాట జరిగిందనీ విలేకరుల కధనం. సరే! ఆయా రాజకీయ పార్టీలకు చెందిన శాసన సభ్యులు కూడా మీడియా పాయింటు నుంచి మాట్లాడారు. సభలో జరిగినదానిని తమ పార్టీల వైఖరులకి అనుగుణంగా సమర్ధించుకునే ప్రయత్నం చేసారు. తమ సభ్యులను టీ.ఆర్.యస్. సభ్యులు కిందపడవేసి కొట్టారని టీడీపీ ఆరోపిస్తుంటే, జాతీయగీతాన్ని ప్రతిపక్ష సభ్యులు అగౌరవ పరిచారని టీ.ఆర్.యస్. అంటోంది.  సమావేశాలకు ముందుగానే తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీలు సభలో అనుసరించబోయే వ్యూహాలను రచించడమే కాకుండా వాటిని బట్టబయలు కూడా చేయడం వల్ల ఇలాటిదేదో జరుగుతుందన్న అభిప్రాయం ముందే ఏర్పడిపోయింది. పార్టీ మార్పిళ్ళ పై ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్దమైనట్టు ఆ పార్టీలు ముందే ప్రకటించాయి. శాసన సభ స్పీకర్, శాసనమండలి చైర్మన్ సమక్షంలో గవర్నర్ ప్రసంగించే సమయాన్ని ఆ పార్టీలు ఇందుకు తగిన తరుణంగా ఎంచుకున్నాయి. ఆ పార్టీలు నిరసన కోసం ఎంచుకున్న అంశం ప్రజాస్వామ్య కోణం నుంచి చూస్తే  చాలా ప్రాముఖ్యత కలిగినదే. సందేహం లేదు. ఒక పార్టీ గుర్తుపై  ఎన్నికైన వ్యక్తి,   ప్రత్యర్ధి పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా మరో పాత్ర పోషించడం చూడడానికి ఎబ్బెట్టుగానే  వుంటుంది. నిజానికి , ఇలాటి సంస్కృతికి  అన్ని పార్టీలు స్వస్తి చెప్పినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ నాలుగు కాలాలపాటు మనగలుగుతుంది. కానీ, ఇలా తప్పులెన్నే పార్టీలే  తమకు అవకాశం లభించినప్పుడు అదే తప్పును ప్రోత్సహిస్తున్నాయి.  ఇందులోని  విషాదం ఇదే!. రాష్ట్ర విభజన అనంతరం ఇటు తెలంగాణాలో, అటు ఆంద్ర ప్రదేశ్ లో పాలక పక్షాలు  ఈ దుష్ట సంస్కృతిని పెంచి పోషిస్తున్నాయన్న అపవాదును అవి ఇప్పటికే  మోస్తున్నాయి. తెలంగాణాలో, అనేకమంది  తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను  ప్రలోభపెట్టి టీ.ఆర్.యస్. తమలో కలుపుకుందని టీడీపీ లెక్కలు చెబుతుంటే, అటు ఆంద్ర ప్రదేశ్ లో అధికార తెలుగు దేశం పార్టీ  చేర్చుకున్న ప్రత్యర్ధి పార్టీ వారి వివరాలను గోత్ర నామాలతో సహా టీ.ఆర్. యస్.  వెల్లడిస్తోంది. సరిగ్గా, ఈ కారణం వల్లనే, నిస్సిగ్గుగా సాగిపోతున్న పార్టీ మార్పిళ్లను గట్టి గొంతుకతో  ఖండిస్తున్న పార్టీలకు సరయిన నైతిక బలం చిక్కడం లేదు. 'మేమూ చేసాముకాని, మరీ ఇలా బరి తెగించి చేయలేదు' అనే వాదం వినేవారి విశ్వాసాన్ని పొందడం లేదు.
తెలంగాణా అసెంబ్లీలో తొలి రోజున ఏం జరిగిందన్నదానిపై   ఇప్పటికే కొంత స్పష్టత వచ్చింది. అధికారిక వీడియోల్లో  నిక్షిప్తం అయిన దృశ్యాలు  బయటకు వస్తే ఎవరు బాధ్యులో తేటతెల్లం అవుతుంది. దానివల్ల మూల సమస్యకు పరిష్కారం దొరకదు. సభలో వివిధ రాజకీయ పక్షాల వాళ్ళు స్వయం నియంత్రణ ఏర్పరచుకుంటే అంతకంటే కావాల్సింది వుండదు. అయితే నేటి రాజకీయాల తీరుతెన్నులు గమనిస్తున్నవారికి ఈ ఆశ పేరాశగా అనిపించవచ్చు కూడా.  

ఉభయ రాష్ట్రాల శాసన సభల తొలిరోజు ప్రతిపక్ష పార్టీగా వై.యస్.ఆర్.సీ.పీ. ఒక పాయింటు తన ఖాతాలో వేసుకుంది. గవర్నర్ ప్రసంగం సాగుతున్నంత సేపూ ఆ పార్టీ ప్రతినిధులు ఒక పద్దతి ప్రకారం సభ సాగడానికి సహకరించారు. ఇదే వైఖరి ముందు కూడా కొనసాగిస్తే ఆ పార్టీకి దీర్ఘకాలంలో మేలు జరుగుతుంది. దానితోపాటే, సభ గౌరవం ఇనుమడిస్తుంది. (07-03-2015)