17, నవంబర్ 2013, ఆదివారం

ఎవరీ అంకుల్ టామ్ ? - 3


ఎవరీ అంకుల్ టామ్ ? అన్న ప్రశ్నకు టెలివిజన్ రంగంలో నిష్ణాతులయిన తోట భావనారాయణ గారు సవివరమైన సమాధానం ఇచ్చారు. నలుగురూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో వున్నాయన్న  ఉద్దేశ్యంతో, ఆయనతో నాకున్న పరిచయాన్ని ఉపయోగించుకుని ఆయన రాసిన ఈ  వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. దీనిపై ‘కాపీ రైట్లు’,  ‘కాపీ కొట్టే రైట్లు’  సమస్తం ఆయనవే. 


(శ్రీ తోట భావనారాయణ)

రేటింగ్స్ లెక్కింపు విధానం
టీవీ ప్రేక్షకులందరూ ఏయే ఛానల్స్ ఏ సమయంలో ఎంతసేపు చూస్తున్నారన్నది నేరుగా తెలుసుకోవడం సాధ్యమయ్యేపని కాదు. ఎన్నికల సర్వే తరహాలో ఇక్కడ కూడా ఒక శాంపిల్ సర్వే మాత్రమే నిర్వహించడం కుదురుతుంది. ఒక శాంపిల్ సైజ్ నిర్ధారించుకుని, వాళ్లు ఎంతసేపు ఏ ఛానల్ చూస్తున్నారో లెక్కించి, ఆ ఫలితాలను మొత్తం ప్రేక్షకులకు వర్తింపచేయటమే రేటింగ్స్ పని. శాంపిల్ గా ఎంచుకున్న ప్రేక్షకుల ఇళ్లలో టీవీ మీద మీటర్లు పెట్టి, అన్ని మీటర్లలోని సమాచారాన్ని ఆయా ఛానల్స్ ప్రసారం చేస్తున్న కార్యక్రమాల డేటాకు జత చేసి ఏ కార్యక్రమాన్ని ఎవరు ఎంతసేపు చూశారో విశ్లేషిస్తారు. Nielsen సంస్థ  అమెరికాలో 5 వేల ఇళ్లను శాంపిల్ గా తీసుకుంది. నిజానికి అమెరికాలో పదికోట్ల టీవీలు ఉన్నప్పటికీ 5 వేల శాంపిల్స్ మాత్రమే తీసుకోవటం చాలా తక్కువగానే కనిపిస్తుంది. అయితే  ఆ ఐదువేల ఇళ్లు మొత్తం జనాభాకు ప్రాతినిధ్యం వహించేందుకు వీలుగా ఉన్నాయని నీల్సన్ సంస్థ  తమ ఎంపికను సమర్ధించుకుంటోంది.

ఈ మీటర్ వలన ఏ ఛానల్ ఎంత సేపు చూశారన్నదే తెలుస్తుంది. ఎవరు చూశారో తెలియదు. ఏ వయోవర్గానికి చెందిన వారు చూశారో, వారు పురుషులో, స్త్రీలో తెలియదు. అందుకే ఈ సమాచారం కోసం మరో ఏర్పాటు అనివార్యమయింది. ఈ ఇళ్లలో టీవీల దగ్గర మరో చిన్న బాక్స్ అమర్చాల్సి వచ్చింది ఎవరు చూడటం మొదలెట్టినా ఆన్ బటన్ నొక్కాలి. కుటుంబ సభ్యులందరికీ వేరు వేరుగా ఆన్, ఆఫ్  బటన్స్ ఉంటాయి. అందువలన ఎవరు టీవీ చూడబోతుంటే వాళ్లు వెళ్లి టీవీ ఆన్ చేసి కూర్చుంటారు. చూడటం ఆపేసి వెళ్లాలనుకున్నప్పుడు ఆఫ్ చేసి వెళ్తారు. ఆ విధంగా ఆ కుటుంబంలోని ఫలానా సభ్యుడు ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకు టీవీ చూసినట్లు నమోదవుతుంది. దీని ఆధారంగా వివిధ వయోవర్గాల వారు టీవీ చూసిన సమయాన్ని లెక్కగడతారు.
ఇదంతా ఒక వంతయితే ఫోన్ సాయంతో సమాచారం సేకరించడం మరో వంతు. Nielsen సంస్థ వేలాది మంది ఇళ్లకు ఫోన్ చేసి ఆ సమయంలో వాళ్లు టీవీ చూస్తున్నారా, చూస్తుంటే ఏ కార్యక్రమం చూస్తున్నారు అనే సమాచారం సేకరిస్తుంది. ఈ సమాచారాన్ని తమ మీటర్ల సమాచారంతో సరిపోల్చుకోవటం కూడా గమనించవచ్చు. ఈ సమాచారాన్ని విశ్లేషించి ప్రతి ఛానల్ లో ప్రతి కార్యక్రమాన్ని ఎవరెవరు ఎంత సేపు చూశారో ఒక నివేదిక తయారుచేస్తారు.  ఇందులో మొదటి దశలో ప్రాథమిక సర్వే జరుగుతుంది. ఇది కొంత భారీ స్థాయిలోనే జరుగుతుంది. దీని వలన రేటింగ్స్ కు సరిపడే ప్రతినిధులు ఎవరనే విషయం తేలుతుంది. ఆ తరువాత, ప్రాతినిధ్యపు టీవీ యజమానుల ఇళ్లకు వెళ్లి, వాళ్లకు నచ్చజెప్పి, సర్వేకు సహకరించాల్సిందిగా  కోరతారు. వాళ్ల ఇంట్లో మీటర్, దానికి అనుసంధానంగా ఒక టెలిఫోన్ సెట్ పెట్టుకునేందుకు కూడా అనుమతి తీసుకుంటారు. అలా ఏర్పాటు చేసిన మీటర్, టెలిఫోన్ సాయంతో కేంద్ర కార్యాలయానికి ఏరోజుకారోజు పూర్తిస్థాయిలో డేటా అందుతుంది. అదే సమయంలో టీవీ కేంద్రాల వారి కార్యక్రమాల వివరాలు కూడా కేంద్ర కార్యాలయం అందుకుంటుంది. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఏ కార్యక్రమాన్ని ఎవరెవరు ఎంత సేపు చూశారో లెక్కించి, దాన్ని మొత్తం ప్రేక్షకులకు వర్తింపచేసి సమగ్ర సమాచారాన్ని టీవీ సంస్థల కంప్యూటర్లకు అందజేయటం ఆఖరి దశ.

దీని ఆధారంగా మొత్తం ప్రేక్షకులలో ఎంత శాతం మంది ఏ ఛానల్ చూస్తున్నారో కూడా లెక్కగట్టే వీలుంది. ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉన్నట్టు తేలిన కార్యక్రమాలకు ఎక్కువ ప్రకటనలు వస్తాయి. ఎక్కువ ప్రకటనలు వచ్చే కార్యక్రమాన్ని మరింత నాణ్యంగా రూపొందించేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తుంది. రేటింగ్స్ ఆధారంగానే ఛానల్ యజమానులు ఆయా కార్యక్రమాల్లో ఇచ్చే ప్రకటనలకు రేట్లు నిర్ణయించి వసూలు చేస్తారు. (ఇంకావుంది)

16, నవంబర్ 2013, శనివారం

ఎవరీ అంకుల్ టామ్ ? - 2


(ఎవరీ అంకుల్ టామ్ ? అన్న ప్రశ్నకు టెలివిజన్ రంగంలో నిష్ణాతులయిన తోట భావనారాయణ గారు సవివరమైన సమాధానం ఇచ్చారు. నలుగురూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో వున్నాయన్న  ఉద్దేశ్యంతో, ఆయనతో నాకున్న పరిచయాన్ని ఉపయోగించుకుని ఆయన రాసిన ఈ  వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. దీనిపై ‘కాపీ రైట్లు’,  ‘కాపీ కొట్టే రైట్లు’  సమస్తం ఆయనవే. అంటే కింద ఫోటోలో కనిపిస్తున్న తోట భావనారాయణ గారివే)

  

ఎ.సి నీల్సన్ కంపెనీ ( AC Nielsen Company ) : రేటింగ్స్ మాట వినగానే గుర్తుకొచ్చేది ఎ.సి.నీల్సన్ కంపెనీ. ఈ సంస్థ నీల్సన్ మీడియా రీసెర్చ్ పేరుతో మార్కెట్ విశ్లేషణ మీద దృష్టి సారించింది. 1923లో ప్రారంభమైనప్పటికీ,  1930 తర్వాతే ప్రేక్షకుల మీద అధ్యయనం మొదలెట్టింది. అప్పట్లో రేడియో శ్రోతలతో దీన్ని
మొదలుపెట్టింది. ఏ ఫ్రీక్వెన్సీని శ్రోతలు ఎంతసేపు వింటున్నారో సర్వే చేయటం ద్వారా కార్యక్రమ నిర్వాహకులకూ, ప్రకటన కర్తలకూ ఈ సమాచారాన్ని అందజేయటం దీని పని. అయితే పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు విడివిడిగా ఎవరు వింటున్నారో తెలుసుకునే సౌకర్యం మాత్రం లేదు. అప్పటివరకు కొంత మంది శ్రోతలకు డైరీ ఇచ్చి, వాళ్ళచేత నమోదు చేయించే విధానం అమలులో ఉంది. శ్రోతల ఆసక్తి, నిజాయితీ, అందుబాటు అనే మూడు ప్రధాన అంశాల మీద ఆధారపడి రేటింగ్ నిర్ణయించడం కన్నా ఆటోమేటిక్ గా ఏ ఫ్రీక్వెన్సీ ఎంతసేపు ఆన్ చేసి ఉందో తెలుసుకోవడమే మెరుగైన, కచ్చితమైన విధానమనే అభిప్రాయం కలగడానికి నీల్సన్ సంస్థ దోహదం చేసింది.
కొద్దిపాటి పరిశోధన, మార్పుల అనంతరం Nielsen Audi meter సిద్ధమైంది. అమెరికా తూర్పు ప్రాంతంలోని 800 ఇళ్లను శాంపిల్ గా తీసుకుని సర్వే చేపట్టారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రేడియోల వినియోగంతో పాటు శాంపిల్ సైజ్ కూడా గణనీయంగా పెరిగింది.  1949  నాటికి 97 శాతం అమెరికన్ రేడియో శ్రోతలకు ప్రాతినిధ్యం వహించే సరైన శాంపిల్ సైజ్ తయారయింది. అదే సమయంలో మరో పోటీ సంస్థ రేడియో రేటింగ్స్ రంగం నుంచి తప్పుకుంది. దీంతో Nielsen సంస్థకు డిమాండ్ మరింత పెరిగ చందాదారులు ఎక్కువయ్యారు. చందాదారులు  చెల్లించే డిపాజిట్లు ప్రధాన ఆదాయ వనరు కావడంతో కొత్త డిపాజిట్ల ఫలితంగా Nielsen శాంపిల్ సైజ్ ఇంకా పెంచుకోగలిగింది. మరోవైపు టెలివిజన్ రంగం విస్తరించడం ఎక్కువైంది. రేడియోను పక్కనపెట్టి టీవీ మీద దృష్టి సారించిన నీల్సన్ సంస్థ  1964 నాటికి రేడియోను పూర్తిగా వదులుకుంది.
ఆన్ చేయడం, ఆఫ్ చేయడం మొదలుకుని టీవీ ఛానల్స్ మారుస్తూ ఉన్నప్పుడు సైతం సమగ్రంగా సమాచారం నమోదు చేయగలిగే పరికరాన్ని రూపొందించడంతో సంస్థ విజయం సాధించింది. ఈ సమాచారన్ని ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి పంపేందుకు ప్రత్యేకమయిన టెలిఫోన్ లైన్లు కూడా లీజుకు తీసుకోవడం మరో ప్రత్యేకత. నీల్సన్ బ్లాక్ బాక్స్  ( Nielsen Black Box ) పేరుతో ప్రసిద్ధమైన ఈ మీటర్లు టెలివిజన్ రేటింగ్ లెక్కగట్టడంలో కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చాయి. అయితే ఏ టీవీ కార్యక్రమాలు ఎంతసేపు చూస్తున్నారన్న విషయాలు మాత్రమే ఇందులో నమోదయ్యే అవకాశం ఉండగా ఏయే వర్గం వారు ఆ కార్యక్రమాలు చూస్తున్నారు? వారిలో స్త్రీలెంత మంది? పురుషులెంత మంది? అనే విషయాలు మాత్రం స్పష్టంగా తెలిసే అవకాశం లేకపోవటం ఒక లోటుగా కనిపించింది. ఇందుకోసం ప్రత్యేకంగా డైరీలు వాడటం మొదలెట్టారు.
కొంత మంది ప్రేక్షకుల ఇళ్లలో ఈ డైరీలు ఉంచి అందులో వివరాలు నమోదు చేయాలని కోరేవారు. టీవీ ఆన్ చేసిన ప్రతిసారీ ఏ ఛానల్ ఎంతసేపు ఎవరెవరు చూసారో అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది యంత్రసాయంతో జరిగేది కాదు గనుక శాంపిల్ సైజు చాలా తక్కువగా ఉంటుంది. పైగా అందరూ శ్రద్ధగా నమోదు చేయకపోతే ప్రయోజనం ఉండదు.

సామాన్య ప్రేక్షకులకు వీరు ప్రతినిధులు కాకపోవచ్చుననేది మరో వాదన. ఈ విధానం లోపభూయిష్టమైనదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకు కారణం నీల్సన్ సంస్థ వారి పీపుల్స్ మీటర్స్ ఇచ్చిన డేటాకు, డైరీల డేటాకు పొంతన లేకపోవటమే. సహజంగానే పరిశ్రమలో ఇదొక వివాదాస్పద అంశంగా మారింది. రేటింగ్స్ ఆధారంగానే ప్రకటనల రేట్లలో బేరసారాలు జ
రుగుతాయి కనక ఇందులో తేడాల వలన చాలా ఇబ్బందులొచ్చిపడ్డాయి. ఏమైనప్పటికీ ఈ వివాదాల మధ్యలో రేటింగ్స్ ఇచ్చేందుకు మరికొన్ని చిన్నాచితకా సంస్థలు ముందుకొచ్చినా ఈ రంగంలో ఒక్కరే ఉండటం సమంజసమని, అన్ని టీవీలూ అదే సంస్థ రేటింగ్స్ ను ప్రామాణికంగా తీసుకోవడం మంచిదనే విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది. ఆ విధంగా నీల్సన్ వారి పీపుల్స్ మీటర్ విధానానికే అమెరికన్ ఛానల్స్ పట్టం కట్టాయి.  Nielsen Television Index ( NTI )  పేరుతో ఇస్తున్న రేటింగ్స్ అక్కడ ప్రామాణికంగా మారాయి. (ఇంకా వుంది)
(16-11-2013)

15, నవంబర్ 2013, శుక్రవారం

ఎవరీ అంకుల్ టామ్ ?


ఎవరీ అంకుల్ టామ్ ? అన్న ప్రశ్నకు టెలివిజన్ రంగంలో నిష్ణాతులయిన తోట భావనారాయణ గారు సవివరమైన సమాధానం ఇచ్చారు. నలుగురూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో వున్నాయన్న  ఉద్దేశ్యంతో, ఆయనతో నాకున్న పరిచయాన్ని ఉపయోగించుకుని ఆయన రాసిన ఈ  వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. దీనిపై ‘కాపీ రైట్లు’,  ‘కాపీ కొట్టే రైట్లు’  సమస్తం ఆయనవే.


(శ్రీ తోట భావనారాయణ)

పత్రికల ప్రజాదరణ లెక్కించడానికి అవి అమ్ముడుపోయే ప్రతుల సంఖ్యను ఆధారంగా తీసుకుంటారు ఆడిట్ బ్యూర్ ఆఫ్ సర్క్యులేషన్ ( ABC ) సంస్థ ప్రతి ఆరునెలలకొకసారి లెక్కలు వేసి ఈ సంఖ్యలను నిర్ధారిస్తుంది. స్థూలంగా ఈ సమాచారం ఆధారంగా పత్రికలకు ప్రకటనలిచ్చే వారు నిర్ణయం తీసుకుంటారు. అదే విధంగా ఒక్కో పత్రిక ఎంత మంది చదువుతున్నారో అంచనా వేసేందుకు నేషనల్ రీడర్ షిప్ సర్వే( NRS ) పేరిట మరో అధ్యయనం కూడా జరుగుతుంది.
అయితే టెలివిజన్ ఛానల్స్ కార్యక్రమాల విషయంలో మాత్రం  ప్రత్యేకమయిన లెక్కింపు విధానాన్ని అనుసరించాల్సి వస్తుంది.  సర్వే పద్ధతిలో కొన్ని ఎంపిక చేసిన శాంపిల్స్ ఆధారంగా వివిధ ఛానల్స్ లో ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాల ఆదరణ అంచనా వేస్తారు. దీన్ని నిర్వహించే TAM India  సంస్థ ఇచ్చే రేటింగ్స్ ఆధారంగా ప్రకటన కర్తలు ఆయా ఛానల్స్ లో ఆయా కార్యక్రమాల సమయంలో ఆ సంస్థలు నిర్దేశించిన రేట్ల ప్రకారం ప్రకటనలు ఇవ్వటానికి సిద్ధపడతారు.
ఒక నిర్ధిష్ట సమయంలో టీవీ చూస్తున్న ప్రేక్షకులందరిలో ఆ కార్యక్రమం చూస్తున్న వారి శాతమే స్థూలంగా రేటింగ్ అని చెప్పవచ్చు. ఒక నిర్దిష్టమైన సమయంలో ఉన్న ప్రేక్షకుల మొత్తం సంఖ్యను శాంపిల్స్ ను దృష్టిలో ఉంచుకుని రేటింగ్స్ నిర్ణయిస్తారు. ఒక ఛానల్ లో వారం మొత్తంలో సంపాదించిన రేటింగ్స్ మొత్తమే స్థూల రేటింగ్ పాయింట్లు (Gross Rating Points – GRPs ) అంటారు. ఉదాహరణకు ఒక వారంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రసారమయ్యే అన్ని ఛానల్స్  జిఆర్ పిలలో ఒక నిర్ధిష్టమైన ఛానల్ సంపాదించిన జిఆర్ పిల మొత్తాన్ని మార్కెట్ వాటాగా చెబుతారు. ప్రకటనలిచ్చే వాళ్లకు సౌకర్యంగా ఉండటానికి వీలుగా స్త్రీ పురుషులను వివిధ వయో వర్గాలుగా  విభజించి రేటింగ్స్ తీస్తారు. అందువలన ఒక కార్యక్రమానికి మహిళల నుంచి లేదా పురుషుల నుంచి లేదా పిల్లల నుంచి ప్రత్యేకమైన ఆదరణ ఉంటే రేటింగ్స్ లో ఆ విషయం స్పష్టమవుతుంది. (ఇంకా వుంది)
(15-11-2013)

Telugu TV

హే రాం!




భద్రాచలాన్ని తెలంగాణా నుంచి విడతీసి సీమాంధ్రలో విలీనం చేస్తారా లేక తెలంగాణాలోనే వుంచుతారా అనేదానికంటే ఆశ్చర్యపరిచే అంశం ఏమిటంటే - కలసి వుందామని వాదించే సమైక్యవాదులు 'విడతీయాలని' అంటున్నారు. విడిపోవాలని వాదించే విభజనవాదులు, కలిపే వుంచాలని అంటున్నారు.


(15-11-2013)




12, నవంబర్ 2013, మంగళవారం

బ్రాడ్ కాస్టింగ్ డే

జర్నలిస్ట్ డైరీ సతీష్ బాబు గురించి చెప్పాల్సిన పని లేదు. అలాగే రేడియో గురించి తెలియని వాళ్లు లేరు.
ఈ రెంటికీ లింకేమిటంటారా ? పై లింకే!



ఈరోజు  అంతర్జాతీయ ప్రసార దినోత్సవం (బ్రాడ్ కాస్టింగ్ డే). ‘ఏదీ రేడియో!’ అంటూ తనదయిన శైలిలో చురకలు అంటిస్తూ అలనాటి పాత రోజుల్ని రీవైండ్ చేస్తూ టీవీ -9  లో నిరుడు ఇదే రోజు అందించిన రేడియో కధ ఇది. మరీ పెద్దదేమీ కాదు.  రేడియో వార్తల మాదిరిగా అయిదే అయిదు నిమిషాల్లో హాయిగా వినేయొచ్చు. రేడియో ప్రియులందరికీ నచ్చుతుందని నా హామీ. వింటారు కదూ. సారీ కంటారు కదూ. (టీవీ కదా!) -  భండారు శ్రీనివాసరావు   (12-11-2013)

11, నవంబర్ 2013, సోమవారం

‘నోటా’ లు నోళ్ళు తెరవాలి! – భండారు శ్రీనివాసరావు

తొండ ముదిరితే ఊసరవెల్లి అయినట్టు  వాదం ముదిరితే పిడివాదం అవుతుంది.
రాష్ట్రంలో ఈనాడు నెలకొనివున్న పరిస్థితులు గమనిస్తున్న ‘మౌన వీక్షకులు’ నోరు తెరవలేని దుస్తితిలో వుండడానికి కారణం ఈ పిడివాదులే.
రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని కోరేవారు, విభజించాలని కోరేవారు ఇరుప్రాంతాల్లో అధిక సంఖ్యలో వున్నారు. అలాగే కలసివుంటే పోలా అనుకునేవాళ్ళు ఇటు తెలంగాణలో, విడిపోతే పోలా అనుకునేవాళ్ళు అటు సీమాంధ్ర లోనూ వున్నారు. కాకపొతే వీరు అల్పసంఖ్యాకులు. వీరే ఇప్పుడు నేను ప్రస్తావిస్తున్న ‘నోటా’ (NONE OF THE ABOVE) కేటగిరీ వాళ్లు. విభజన వద్దూ, సమైక్యం వద్దూ అనే వారన్న మాట. వీరికి కావాల్సింది ప్రత్యేక రాష్ట్రమూ కాదు, కలసి వుండడమూ కాదు. బతుకులు వెళ్ళదీసుకోవడం.   
ప్రత్యేక  తెలంగాణావాదం తాటి ప్రమాణంలో వున్న రోజుల్లో కూడా వీరున్నారు. సీమాంధ్రలో ఈ మధ్య సమైక్య  ఉద్యమం వువ్వెత్తున ఎగసిన రోజుల్లో కూడా వీరు ఆ ప్రాంతంలో కూడా వున్నారు. కానీ వీరు కనబడరు. వీరి గోడు ఎవ్వరికీ  వినపడదు.
ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడాన్ని ఎవ్వరూ ఆక్షేపించరు. అలాగే సమైక్యంగా వుండాలని అనుకోవడం కూడా ఆక్షేపణీయం కాదు. కానీ ఈ నినాదాలను అడ్డు పెట్టుకుని పిడివాదం చేసేవాళ్ళతోటే అసలు తంటా.
సమస్య ఏదో కొలిక్కి వస్తోందని అనుకుంటే, సమస్యను తీర్చేవాళ్ళూ, సమస్యలో భాగం అయినవాళ్ళూ రాజకీయం తప్పితే రాష్ట్ర ప్రజల క్షేమం గురించి ఆలోచిస్తున్నట్టులేదు.
రాష్ట్ర విభజన దిశగా కేంద్రం త్వరితగతిన అడుగులు వేస్తుంటే, అదీ రాజకీయమే సందేహం లేదు, సీమాంధ్ర పిడివాదులు ‘యెలా జరుగుతుందో చూస్తాం, ప్రాణాలు పోయినా వొప్పుకోం’ అంటారు. ‘హైదరాబాదు సంగతి తేల్చకుండా యెలా’ అంటారు. హైదరాబాదు విషయం రాగానే ‘అది లేని తెలంగాణా మాకెందుకు మేం వొప్పుకోం’ అంటారు వేర్పాటు పిడివాదులు.
అసలు ఈ ఇరుపక్షాలు వొప్పుకోవడం, వొప్పుకోకపోవడం అనే ప్రాతిపదికపైన పరిణామాలు ఈ దశ వరకూ రాలేదన్న సంగతి ఇరువురికీ తెలుసు. అయినా మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తూనే వుంటారు.
హైదరాబాదును  అభివృద్ధి చేసింది మేమే అని చంకలు కొట్టుకునే సీమాంధ్ర పిడివాదులు అలాటి మరో రాజధాని నగరాన్ని అధ్బుతంగా నిర్మించుకోగల సామర్ధ్యం లేనివాళ్ళు అనుకోలేము  కదా.     
అలాగే, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని నిలువునా విభజిస్తున్నారన్న ఆగ్రహంతో కాంగ్రెస్ అధినేత్రికి సీమాంధ్రలో ‘సమాధి’ కట్టినప్పుడు కోపంతో వూగిపోయిన తెలంగాణా పిడివాదులు, రేపు ఖర్మం కాలి హైదరాబాదును సరిహద్దులు పెంచి ఉమ్మడి గవర్నర్ పాలన కిందకు తీసుకువచ్చే ప్రతిపాదన తీసుకువస్తే  మళ్ళీ  అలాటి అనాగరిక చర్యకు పూనుకోబోమని  ఏమైనా హామీ ఇవ్వగలరా? అందుకే అనేది ఈ  విధేయతలు, వినయాలు అన్నీ నిర్ణయాలు తమకు అనుకూలంగా వున్నప్పుడు మాత్రమే.
రాష్ట్రాన్ని రెండుగా చేస్తారో, కలిపి వుంచుతారో తెలియదు కాని కాంగ్రెస్ తో సహా అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్ని నిప్పుల కొలిమిలోకి నెట్టి, వినోదం చూస్తున్నాయి. బహుశా ఇటువంటి వికృత, పైశాచిక రాజకీయ క్రీడ ఒక్క మన దేశంలోనే సాధ్యమేమో!
అందుకే -  ‘నోటా’ లు నోళ్ళు తెరవాలి.

(11-11-2013)          

రారండోయ్ రారండోయ్ రేడియో విందాం రారండోయ్ - 4


రెండేళ్ళ తరువాత అంటే 1935 లో డెక్కన్  రేడియో కేంద్రాన్ని నిజాం స్వాధీనం చేసుకున్నారు. నిజాం సంస్థానంలోని వైర్  లెస్ విభాగం కింద డెక్కన్ రేడియో పనిచేయడం మొదలు పెట్టింది.  నవాబ్ ఆలీ యవార్ జంగ్ ఆధ్వర్యంలో డెక్కన్ రేడియో కేంద్రానికి  మరిన్ని హంగులు సమకూరాయి. ఇంగ్లాండ్ లోని మార్కొనీ కంపెనీ తయారు చేసిన శక్తివంతమైన రెండువందల వాట్ల రేడియో ట్రాన్స్ మిటర్ ను దిగుమతి చేసుకున్నారు. రేడియో కేంద్రాన్ని చిరాగ్ ఆలీ లేన్ నుంచి ఖైరతా బాద్ లోని యావర్ మంజిల్  అనే భవనంలోకి మార్చారు. కొత్త రికార్డింగ్ స్టుడియోలను నిర్మించారు.  నగర పొలిమేరల్లోని సరూర్ నగర్ ప్రాంతంలో పెద్ద యాంటీనా నెలకొల్పారు. దానిమీద వున్న యెర్ర విద్యుత్ దీపాలు నగరంలో సుదూరంగా వుండే అనేక ప్రాంతాలకు కనబడేవని చెప్పుకునే వారు. డెక్కన్ రేడియోలో పనిచేసే ఒక ఉద్యోగిని లండన్ పంపించి బీబీసీ లో శిక్షణ ఇప్పించారంటే   డెక్కన్ రేడియో పట్ల నవాబ్ ఆలీ యవార్ జంగ్  ఎంతటి శ్రద్ధ తీసుకున్నదీ అర్ధం అవుతుంది.


  
(డెక్కన్ రేడియో స్టూడియోలో అలనాటి సంగీతకారులు)

తరువాతి రోజుల్లో డెక్కన్ రేడియో సంగీత కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. వాటికి శ్రోతల నుంచి  విశేషమైన ఆదరణ లభించడం అందుకు కారణం. ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ఉస్తాద్ బడే గులాం ఆలీ ఖాన్హీరా బాయ్  బరడేకర్, ఆవిడ సోదరి సరస్వతీ రాణే  వంటి సుప్రసిద్ధ సంగీతకారులు డెక్కన్ రేడియో కళాకారుల జాబితాలో వుండేవారు. మరో ప్రసిద్ధ సంగీత కారుడు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ రెండు పర్యాయాలు హైదరాబాదు వచ్చి డెక్కన్ రేడియోలో   ప్రోగ్రాములు ఇచ్చారు.
డెక్కన్ రేడియో నుంచి తెలుగు, కన్నడం, మరాఠీ భాషల్లో కూడా కొన్ని కార్యక్రమాలు ప్రసారం అయ్యేవి కాని వాటి వ్యవధి చాలా పరిమితం.