AP State New Capital Amaravathi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
AP State New Capital Amaravathi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, జులై 2015, ఆదివారం

అదిగో నవలోకం


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 23-07-2015, THURSDAY)

ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని 'అమరావతి' రూపురేఖలు గురించి సింగపూర్ ప్రభుత్వం రూపొందించిన 'సీడ్ క్యాపిటల్' ప్రణాళిక  రాష్ట్ర ప్రభుత్వానికి  అందింది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ నాయకత్వంలో హైదరాబాదు వచ్చిన అధికారుల బృందం, ప్రత్యేక విమానంలో రాజమండ్రి  వెళ్ళి,  గోదావరి పుష్కర ఏర్పాట్ల పర్యవేక్షణ నిమిత్తం గత కొద్ది రోజులుగా అక్కడే మకాం వేసివున్న  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుసుకుని ఈ ప్రణాళికను  అందచేసింది. అంతకుముందే 'సీడ్ క్యాపిటల్' గురించిన  ఊహా చిత్రాలను కొన్నింటిని  ఆ రాష్ట్ర ప్రభుత్వం మీడియాకు విడుదలచేసింది. ఇటువంటి అద్భుతమైన  రాజధానిని సొంతం చేసుకోబోతున్న ఆ రాష్ట్ర ప్రజలు ఎంతటి అదృష్టవంతులో కదా అని ఇతరులకు కన్నుకుట్టే  రీతిలో ఊహలకు రూపకల్పన చేశారు. ఈ ఊహల్ని వాస్తవం చేయగలిగితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల గుండెల్లోనే కాకుండా చరిత్ర పుటల్లో కూడా  శాశ్వితంగా మిగిలిపోతారు. రాజధానిని నిర్మించగలగడం అనే  అపూర్వ సువర్ణావకాశం ఒక్క  చంద్రబాబుకే  లభించింది. సమకాలీన రాజకీయ నాయకుల్లో ఎవ్వరికీ ఈ అవకాశం దక్కలేదన్న సంగతి గమనార్హం. ఈ రకంగా చూస్తే, ఈ కలని నిజం చేయగలిగితే  ప్రజలే కాదు ఆయన కూడా అదృష్టవంతుడే.   
'కలలు కనండి. ఆ కనే కలలు కూడా  గొప్పగా కనండి. కన్న  ఆ గొప్ప కలల్ని నిజం చేసుకోండి' అంటూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం  యువతీ యువకులకు సలహా ఇస్తుండడం అందరికీ తెలిసిందే.  ఈ ఊహా చిత్రాలు చూసిన వారికి చంద్రబాబు కూడా కలాం గారు చెప్పినట్టే గొప్ప కలలే కంటున్నారు అనిపిస్తుంది.  కాకపోతే వాటిని వాస్తవం చేసి చూపడం అన్న బాధ్యత ఒక్కటే ఆయన భుజ స్కంధాల మీద మిగిలివుంది. మరో రకంగా కూడా ఆయన అదృష్టవంతుడు.  ఆయన సమర్ధత మీద ఆయనకు వున్న నమ్మకాన్ని మించి ఆయన అభిమానులు మరింత నమ్మకం పెంచుకున్నారు. ఆయన ఒక్కరే రాజధాని నిర్మాణం పూర్తిచేయగలరన్న విశ్వాసంతో వున్నారు. ఫేస్ బుక్ వంటి మాధ్యమాల్లో ఈ విషయం ప్రస్పుటంగా కానవస్తుంది.   
ఈ ఊహా చిత్రాలతో పాటు విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం భవిష్యత్తులో నిర్మించబోయే ఆంధ్ర రాజధాని నగరం ఇలా వుంటుంది.




"కృష్ణానది ఒడ్డున గుంటూరు జిల్లా పరిధిలో ప్రధాన రాజధాని నగర నిర్మాణం జరుగుతుంది. దీని విస్తీర్ణం సుమారు పదిహేడు చదరపు కిలోమీటర్లు. (ఇది మరికొంత పెరిగిందని తాజా సమాచారం వల్ల తెలుస్తోంది) ఇందులో కొంత భాగంలో ప్రధానమైన ప్రభుత్వ పరిపాలనా భవన సముదాయాలు వుంటాయి. మిగిలిన ప్రదేశంలో ఐటీ సంబంధిత కార్యాలయాలు, కార్పోరేట్ సంస్థల ఆఫీసులు ఏర్పాటు అవుతాయి. రాజధాని నగరంలోని ప్రధాన రహదారులకు సమాంతరంగా కాలువలు  నిర్మిస్తారు. కృష్ణా నది నుంచి ఇందుకోసం నీటిని వాటిలోకి మళ్లిస్తారు. ఈ నీళ్ళు మళ్ళీ వెళ్ళి మరో వైపు కృష్ణా నదిలోనే కలుస్తాయి. కాలువలు, రహదారులకు ఇరువైపులా ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తారు. భవన పరిసరాలను మాత్రమే కాకుండా వాటిపైన కూడా ఆకు పచ్చని తివాచీ పరిచినట్టు పచ్చదనం తొణికిసలాడేలా పధకాలు సిద్ధం చేశారు. విహంగ వీక్షణం చేసేవారికి పైనుంచి కిందికి చూస్తే యావత్తు రాజధానీ  నగరం హరితవనం మాదిరిగా కానవస్తుంది. భవిష్యత్తులో సయితం భవననిర్మాణాలు, ఇతర నిర్మాణాలు     ప్రణాళికాబద్ధంగా  జరిగేందుకోసం మొత్తం ప్రధాన రాజధాని ప్రాంతాన్ని సెక్టార్లుగా విభజిస్తారు. ఆరు వరసల రహదారులు, వాటి పక్కనే నడక దారులు,  సర్వీసు రోడ్లు వుంటాయి. నగరం మధ్య నుంచి మెట్రో రైలు నిర్మాణం జరిగేలా రూపకల్పన చేశారు. మెట్రో స్టేషన్లు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా వుంటాయి.  రాజధాని నగరం మధ్యలో స్వచ్చమైన నీరు పారే కాలువలు, అక్కడక్కడా జలాశయాలు, వాటిని దాటి వెళ్ళడానికి వీలుగా ఊయల వంతెనలు ఓహ్! అమరావతి అంటే 'దేవతల  నగరం' అన్న పేరు సార్ధకం అయ్యేలా అనేక సుందర నిర్మాణాలకు ఈ కొత్త రాజధాని ఆవాసం కాబోతోంది. కృష్ణా గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణా నదిపై ఎత్తయిన వంతెన నిర్మాణం  కూడా ఈ పధకంలో భాగం. ఇంతేనా అంటే ఇంకా చాలా వుంది. ఈ సీడ్ క్యాపిటల్ కు అభిముఖంగా గుంటూరు జిల్లా వైపు నది మధ్యలో ఒక  ద్వీపాన్ని అత్యంత సుందరంగా అభివృద్ధి చేస్తారు. ఈ మొత్తం ప్రణాళికను రూపొందించింది సింగపూరు ప్రభుత్వం కాబట్టి ఆ దేశపు పొరుగున వున్న మలేసియాలోని జంట టవర్లను పోలిన రెండు ఎత్తయిన ఆకాశహర్మ్యాలు కూడా నూతన రాజధానికి అంతర్జాతీయ సొగసులను అద్దబోతున్నాయి."           
భారీగా నిర్మించిన సినిమాలను  విడుదల చేసే  ముందు 'టీజర్' పేరుతొ లఘు చిత్ర ప్రకటనలు  టీవీల్లో చూపించడం ఈరోజుల్లో అలవాటు. ఈ ఊహా చిత్రాలు చూస్తుంటే ఆ  విధానాన్ని  ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకు కూడా వర్తింపచేస్తున్నారేమో అనిపించేలా వున్నాయి.
మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడి ఆస్థానంలో పనిచేసే గురువు, ఆయన శిష్యులు కలిసి నిమిషాల్లో ఓ మాయానగర్ నిర్మిస్తారు. ఆరోజుల్లో ప్రేక్షకులకు  ఆ దృశ్యాలు పరమాద్భుతంగా తోచాయి. ఇప్పుడీ ఊహా చిత్రాలు టీవీల్లో చూసిన వారికి అవి స్పురణకు వస్తే తప్పు ఎంచడానికి లేదు. అంత గొప్పగా వున్నాయి. అంతే కాదు  వీటిని నిజం చేయడం మానవ మాత్రుడుకి సాధ్యమా అనిపించేలా అపూర్వంగా అపురూపంగా వున్నాయి.
తెలుగుదేశం పార్టీ  అభిమానులనే కాదు, ప్రజలందరినీ అలరించేలా వున్నాయి ఈ ఊహా చిత్రాలు. ముందే చెప్పినట్టు ఈ విధంగా కాకపోయినా ఇందులో కొంతయినా నిజం చేస్తూ రాజధాని నిర్మాణం త్వరలో పూర్తి చేయగలిగితే 'ఆంధ్రులు యెంత అదృష్ట వంతులు' అని దేశవిదేశాల్లో గొప్పగా చెప్పుకోవడం ఖాయం. సమర్ధుడయిన ముఖ్యమంత్రి అన్న పేరు ఇప్పటికే తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబుకు, అమరావతి  రాజధాని నిర్మాణం సకాలంలో పూర్తిచేయగలిగితే ఆయనకు అంతకన్నా గొప్ప కీర్తి మరొకటి వుండదు.
కానీ, ఇది సామాన్యమైన వ్యవహారం కాదు. ప్రతిదీ డబ్బుతో ముడిపడి వుంటుంది. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంతో చూస్తారు. ప్రతి స్వల్ప విషయాన్ని భూతద్దంతో శోధిస్తారు. ప్రతిపక్షాల సంగతి సరే సరి. కాలం గడిచే కొద్దీ వీలును బట్టి  పుట్టుకొచ్చే 'విభీషణుల'తోనే అసలు చిక్కు.  పడగ నీడల్లో కొత్త రాజధాని నిర్మాణం సాగాల్సి వుంటుంది. నిజానికి ఇదంతా కత్తి మీద సాము.
సమర్ధుడన్న ఒక్క పేరు మినహా రాజధాని నిర్మాణంలో చంద్రబాబుకు కలిసి వచ్చే అంశాలు అంతగా లేవు. రాష్ట్ర ఖజానా బోసిపోయి వుంది. రాష్ట్ర విభజన వల్ల విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కలిసి వచ్చిందేమీ లేదు. ఇలాటి భారీ ఆలోచనలు సకాలంలో ఆచరణలోకి రావాలంటే ప్రధానంగా కావాల్సింది  కేంద్ర సాయం . కేంద్రంలో అధికారంలో  వున్నది టీడీపీ  మిత్ర పక్షమే అయినప్పటికీ, గత ఏడాది అనుభవాల నేపధ్యంలో  ఆ దిక్కుగా చూస్తే అంతగా కలిసివచ్చే అవకాశాలు కానరావడం లేదు. అధవా ఏదయినా చేసినా ఆ అరకొర సాయం ఇంతటి  భారీ ప్రణాళికలకు అక్కరకు రాకపోవచ్చు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుడికి రాజధాని విషయంలో సలహా ఇచ్చినట్టు పత్రికల్లో వచ్చింది. సింగపూరుతో పాటు ఈ మధ్య ఆయన పర్యటించి వచ్చిన కజకిస్తాన్, కీర్గిస్తాన్,  తుర్కుమిస్తాన్ మొదలయిన దేశాల రాజధానీ నగరాలను కూడా పరిశీలించడం మంచిదని ప్రధాని తనకు సూచించినట్టు చంద్రబాబే స్వయంగా తమ పార్టీ ఎంపీ లతో చెప్పినట్టు ఆ వార్త సారాంశం. పైగా  ప్రధాని సలహా మేరకు ఆ నగరాల పర్యటనకు ఏర్పాట్లు చేయాల్సిందని ఆదేశించినట్టు ఆ వార్త తెలుపుతోంది.
ఇప్పటికే అమరావతి రాజధాని విషయంలో అనేక విదేశాల పేర్లు వినబడుతూ వస్తున్నాయి. ఇప్పుడు అదనంగా మరికొన్ని దేశాలు అంటే,  మరికొంత కాలయాపన తప్పనిసరి అవుతుంది. అమరావతి అని పేరు పెట్టి తెలుగుతనం లేని మరో విదేశీ నగరాన్ని నిర్మించ బోతున్నారని ఇప్పటికే కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.   
ప్రభుత్వం చెబుతున్నట్టు  రాజధాని నిర్మాణం కోసం సమీకరణ పేరుతొ ప్రజలనుంచి సేకరించిన కొన్ని వేల  ఎకరాల  భూమి సిద్ధంగా వుంది. ఆ విషయంలో తలెత్తిన  రాజకీయ వివాదాలు యెలా వున్నా చివరికి ప్రభుత్వాల మాటే చెల్లుబాటు అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇక కావాల్సింది నిధులు. ఇక్కడే అసలు చిక్కు ఎదురవుతుంది.
గారెలు వండాలంటే నూనె, మూకుడు, పిండి వంటి సంబారాలు అనేకం కావాలి. గారెకు చిల్లి పెట్టడానికి 'వేలు' తప్ప వేరే ఏమీ లేదన్న చందంగా 'చంద్రబాబు సమర్ధత' తప్ప రాజధాని నిర్మాణానికి అవసరమైనవి ఏమీ ఆయనకు ప్రస్తుతం అందుబాటులో లేవు. ఇది వాస్తవం. ఇన్నిన్ని నిర్మాణాలు ఇంత అధునాతనంగా రూపుదిద్దుకోవాలంటే ఆషామాషీ  విషయం కాదు.
రాజమండ్రిలో ముఖ్యమంత్రిని కలవడానికి సింగపూరు బృందం వచ్చిన సందర్భంలో రాష్ట్ర సమాచార సలహాదారుడు పరకాల ప్రభాకర్ ఈ విషయంలో కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్టోబరు నెలలో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ముందుగానే 'మాస్టర్ డెవలపర్' ని ప్రభుత్వం ఎంపిక చేస్తుందని చప్పారు. జపాన్ తో సహా కొన్ని దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. దీనిని బట్టి రాజధాని నిర్మాణం డెవలపర్ల చేతిలో వుంటుందని అర్ధం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత భూమి చూపించడం వరకు పరిమితం కావచ్చు. ప్రభుత్వానికి నిధుల భారం తగ్గిపోవచ్చు. స్విస్  ఛాలెంజ్ పద్ధతిలో అయితే రూపాయి ఖర్చు కూడా లేకపోవచ్చు. కానీ, ప్రజలనుంచి  సేకరించిన భూమిని మాస్టర్ డెవలపర్ చేతిలో పెట్టడం వల్ల  కొత్త వివాదాలు ఉత్పన్నం కావచ్చు. అందుకే కీడెంచి, అన్ని అంశాలను  అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా, వివాద రహితంగా చేయడం మంచిది. నిధుల లేమి కారణంగానే ప్రభుత్వం, ఇప్పటికే 'రియల్ ఎస్టేట్' రంగంలో చలామణిలో వున్న 'డెవలప్ మెంటు'  విధానాన్ని 'స్విస్ ఛాలంజ్' అనే కొత్త పేరుతొ  ఎంచుకుని వుండవచ్చు. కానీ అవతల నిర్మాణ భాగస్వామి 'విదేశీ సంస్థ' అయినప్పుడు మరిన్ని జాగ్రత్తలు అవసరం.        
ప్రభుత్వం ఇవ్వచూపే భూమికి ఆకర్షితులై రాజధాని నిర్మాణానికి పెట్టుబళ్ళు పెట్టేవాళ్లు గొంతెమ్మ కోర్కెలు కోరడం సహజం. నిజంగానే చంద్రబాబు  నిజాయితీగా    ప్రయత్నాలు చేసినా సరే, ఈనాటి రాజకీయాల వరస చూస్తుంటే,   నిప్పులేకుండానే  పొగ రాజుకోవడం అంతే  సహజం. రాజకీయాల్లో కాకలు తీరిన చంద్రబాబుకు ఈ విషయం తెలియదనుకోలేము. అయినా సరే ఆయన ముందడుగు వేసే ధోరణిలోనే ముందుకు సాగుతున్నారు. అన్ని సందేహాలకు   ప్రభుత్వం దగ్గర, ఆయన దగ్గర  సమాధానాలు వుండి వుండవచ్చు. కానీ  సంతృప్తి కరమైన వివరణ మాత్రం ఇంతవరకు బయటకు రాని  మాట కూడా నిజమే. ఈ లావాదేవీల్లో ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకుని వ్యవహారాలు చక్కబెట్టి వుంటే అనవసరమైన రాద్ధాంతాలు కొన్ని తప్పేవి అన్న వాదన వుంది. అలా చేసివుంటే  భవిష్యత్తులో ఎదురయ్యే మంచి చెడులకు చంద్రబాబును ఒక్కరినే బాధ్యులను చేసే పరిస్తితి ఉత్పన్నం అవ్వదు కూడా.   
రాజధాని లేకుండా వేరు పడిన ఆంధ్ర రాష్ట్రానికి ఇంత చక్కని, భేషయిన రాజధాని నిర్మిస్తానని అంటుంటే అభ్యంతర పెట్టడం, విమర్శలు చేయడం  కూడా మంచిది కాదు. ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఇలాటి ప్రయత్నాలను  మనఃస్పూర్తిగా స్వాగతించాలి. అయితే ముఖ్యమంత్రి కూడా, రాజధాని యెలా వుంటుందో ప్రజలకు ముందుగానే  చూపెట్టినట్టే, వారిని విశ్వాసంలోకి తీసుకుని ఆ  రాజధాని నిర్మాణం యెలా జరుగుతుందో వెల్లడిస్తే అనుమానాలన్నీ పటాపంచలవుతాయి. కానిపక్షంలో,  ఇప్పుడున్న సందేహాలు ముదిరి అనుమానాలుగా మారతాయి. ఆ అనుమానాలు కాలక్రమంలో ఆరోపణలుగా రూపాంతరం చెందే అవకాశం కూడా వుంటుంది. ముఖ్య మంత్రి సమర్ధత మీద లేశ మాత్రం అనుమానం లేదని చెబుతున్నవారు కూడా ఈ మొత్తం వ్యవహారంలో తమకు ఎలాటి అనుమానాలు లేవని  గట్టిగా చెప్పలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు, ఆయన సలహాదారులు ఈ విషయం గమనంలో పెట్టుకోవాలి.
ముందే చెప్పినట్టు,  రాజధాని నిర్మాణం ఆయనకు ఒక్కరికే సాధ్యం అని నమ్మే వాళ్లకు ఈరోజుల్లో  కొదవ లేదు.ఈ రకంగా ఆయన అదృష్టవంతులు.   హైదరాబాదులో ఆయన హయాములో నిర్మితమైన హై టెక్ సిటీ గురించి ఇప్పటికీ జనాలు గొప్పగా చెప్పుకుంటూ వుంటారు. ఇంత నమ్మకం ప్రజల్లో  వున్నప్పుడు మరింత పారదర్శకంగా వ్యవహరిస్తే ఆయనకే మేలు జరుగుతుంది.          
రాజధాని అమరావతి ఊహా చిత్రాలు, ఇవన్నీ  ఉత్తుత్తి ప్రచారార్భాటం కింద ప్రత్యర్ధులు కొట్టివేస్తున్నారు. అరచేతిలో స్వర్గం చూపించడంలో చంద్రబాబుకు  సాటి రాగలవారు లేరని చెప్పడానికి కూడా ఈ ఊహా చిత్రాలను వారు ఉదహరిస్తున్నారు. ఆయన అభిమానులు సయితం అదే అంటున్నారు. సమర్ధత విషయంలో చంద్రబాబుకి ఎంతటి మంచి పేరు వుందో, ప్రచారం విషయలో ఆయనకు అంతటి బలహీనత వుందన్న విషయం రహస్యమేమీ కాదన్నది వారి ముక్తాయింపు.
రాజధాని విషయంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు ఎవరివి యెలా వున్నా, సామాన్య జనం అందరూ ముక్త కంఠంతో కోరుకునేది మాత్రం, వేరుపడ్డ  రాష్ట్రానికి ఏదో ఒక రాజధాని తక్షణం కావాలనే. ఇక ఆ రాజధాని చంద్రబాబు ఊహల్లో వున్న అపురూప నగరం అయితే అంతకంటే కావాల్సింది వారికి మరోటి వుండదు.    
సమర్ధుడైన వాడికి లక్ష్యం ఒక్కటే ముఖ్యం. లక్ష్యశుద్ధి వుంటే గమ్యం చేరడం సులభం కాకపోయినా అసాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రస్తుత రాజకీయ వాతావరణం తీరుతెన్నులు చూస్తుంటే ఇదొక్కటే సరిపోకపోవచ్చు. వచ్చే ఎన్నికలదాకా ఈ ఊహల ప్రచారం రాజకీయంగా కొంత వూపు ఇవ్వొచ్చు. సాధారణ రాజకీయ నాయకులు ఇలాగే ఆలోచిస్తారు. వారికి ఈరోజు గడిస్తే చాలు.
మరి చంద్రబాబు ఈ కేటగిరీ కిందికి రావాలని అనుకుంటున్నారా? తనదయిన తరహాలో మరో మార్గాన్ని కోరుకుంటున్నారా?
కాలమే సమాధానం చెప్పాలి.
(21-07-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595



Image Courtesy Culte.com