20, జనవరి 2026, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (255)

అయాం ఎ బిగ్ జీరో (255): భండారు శ్రీనివాస రావు 

యూనియన్లు

చదువుకుండే రోజుల్లో మొదటిసారి ఈ మాట విన్నాను. యూనియన్ అంటే  స్టూడెంట్స్ యూనియన్ అనుకునేరు.

ఆంధ్రపత్రికలో కాబోలు ఓ వార్త వచ్చింది. ఎల్.ఐ.సీ. (జీవిత బీమా సంస్థ)లో కంప్యూటర్లు ప్రవేశపెట్టాలనే యాజమాన్యం ప్రతిపాదన, యూనియన్ల వ్యతిరేకత కారణంగా బుట్ట దాఖలు అయిందని. అప్పటికి కంప్యూటర్ అనే పదమే తెలుగు నిఘంటువులో చేరినట్టు లేదు. ఎవరో కాని ఆ దార్శనికుడు, ఆ కాలంలోనే  కంప్యూటర్ గురించి  ఆలోచించాడు అన్నమాట.

కంప్యూటర్లు  ఇనుప  బీరువాల కంటే 
పెద్ద సైజులో ఉంటాయని ఆ రోజుల్లో చెప్పుకునే వారు. 

అవి వస్తే,  పదిమంది పని ఒక్కటే చేస్తుందని, అంచేత తమ ఉద్యోగాలకు ముప్పు అని సిబ్బంది భయం. అప్పటికి కంప్యూటర్ అంటేనే తెలియదు కనుక యూనియన్ల భయం ఏమిటన్నది కూడా జనాలకు పట్టలేదు. 

తర్వాత ఎప్పటికో దశాబ్దం తర్వాత, మొదటి ఉద్యోగం ఆంధ్రజ్యోతిలో చేరిన తర్వాత, బీమా ఏజెంటు మాధవరావు గారి పుణ్యమా అని  నేనో ఎండోమెంటు  పాలసీ తీసుకున్నాను. పదేళ్లకో, పదిహేనేళ్లకో   మెచూర్ అయ్యే పాలసీ.  ఆ పాలసీ డబ్బులు తీసుకోవడానికి నేను  పడ్డ ఇబ్బందులు ఒకటీ రెండూ కాదు.

పైగా డివిజినల్ మేనేజర్ల స్థాయి అధికారులతో మంచి పరిచయాలు వుండి కూడా నానా తిప్పలు పడాల్సి వచ్చింది. ఏ కాగితము ఒక పట్టాన దొరికేది కాదు. వెతికి పెట్టి కబురు చేస్తాం అని పంపించేవాళ్లు.

ఎవరు పాలసీ తీసుకున్నా  చిన్న వయసులో తీసుకుంటారు. ఎప్పుడో నలభయ్ యాభయ్ ఏళ్ళ  తర్వాత  పాలసీ డబ్బులు రావాలి. అప్పటిదాకా ఆ పత్రాలు పదిలంగా వుంచుకోవాలి. ఈ ప్రయాస లేకుండా ఆయనెవరో కంప్యూటర్లు అంటే ఆ ఆలోచన పడనివ్వలేదు.

కాలక్రమంలో ఏం జరిగింది? ఇప్పుడు ఆ  సంస్థలో అన్నీ కంప్యూటర్లే. చకచకా పనులు జరిగిపోతున్నాయి.

అది ఏ సంస్థ అయినా  దాని  వినియోగదారులు తమకు దొరికే సేవలు గురించి ఆలోచిస్తారు. అక్కడ  పనిచేసే ఉద్యోగులు సంస్థతో  పాటు తమ గురించి కూడా అలోచిస్తుంటారు. సహజం కూడా.

ఒకప్పుడు హైదరాబాదు నుంచి రైల్లో వైజాగు పోవాలంటే రిజర్వేషన్ నేరుగా చేయించుకోవడానికి వీలుండేది కాదు.  చార్టులో పేరు రాకపోతే ఇంతే సంగతులు.

కంప్యూటర్ల ప్రవేశంతో ఇప్పుడు దేశంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా టిక్కెట్టు కొనుక్కోవచ్చు. ఇలాగే ఎన్నో రంగాల్లో కంప్యూటర్లు మనిషి జీవనంలో వున్న సంక్లిష్టతలను బాగా తగ్గించివేసాయి.

అయితే,  ఒకానొక కాలంలో వీటికి ఉద్యోగ సంఘాల నుంచి గట్టి వ్యతిరేకత ఎదురయిన సంగతి బహుశా ఈ కాలపు సంఘాలవారికే తెలియకపోవచ్చు.

నేను పుష్కరం క్రితం యాక్టివ్ జర్నలిజం నుంచి బయట పడ్డాను కాబట్టి  బ్యాంకుల్లో ఇప్పటి పరిస్థితి పట్ల అవగాహన లేదు.
ఓ పాతిక ముప్పయి ఏళ్ళ క్రితం ప్రభుత్వరంగ  బ్యాంకుల్లో యూనియన్లదే రాజ్యం.

రేడియో విలేకరిగా నాకు అనేక బ్యాంకుల యూనియన్ నాయకులతో సన్నిహిత పరిచయం వుండేది. అలాగే బ్యాంకు యాజమాన్యాలతో కూడా. అంటే అత్యున్నత స్థాయి అధికారులు అన్నమాట.

ఈ నేపధ్యంలో  మా కుటుంబానికి బాగా దగ్గరైన వారి నుంచి ఆర్డర్ లాంటి అభ్యర్ధన వచ్చింది. వాళ్ళ అబ్బాయికి కొత్తగా పెళ్లయింది. అతడికి హైదరాబాదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదులో ఉద్యోగం. అతడ్ని చేసుకున్న అమ్మాయికి కూడా అదే బ్యాంకులో ఉద్యోగం. కాకపోతే ఎక్కడో సుదూర గ్రామీణ ప్రాంతంలో. ఆ అమ్మాయిని కూడా హైదరాబాదుకు బదిలీ చేయించాలి. అదీ నా మీద పడ్డ భారం.

ఒకరోజు గన్ ఫౌండ్రీ లోని  బ్యాంకు హెడ్ ఆఫీసుకు వెళ్లి   మేనేజింగ్ డైరెక్టర్ ని కలిసాను. కాఫీ బిస్కెట్లు తెప్పించి మర్యాద చేస్తున్న ఆ పెద్దాఫీసరు, నా అభ్యర్ధన సంగతి  తెలపగానే కొంచెం అనీజీగా ఫీలయ్యారు.
నన్ను వెంటబెట్టుకుని వెళ్ళిన బ్యాంకు పీఆర్వో  నన్ను బయటకు తీసుకువచ్చి, ఎండీకి చెప్పారు కదా! ఏదో విధంగా పని జరుగుతుంది లెండి అని హామీ ఇచ్చాడు.

ఇస్తూనే  ఒక సలహా చెప్పాడు. బ్యాంకుకు రోడ్డు అవతలే యూనియన్ ఆఫీసు వుంది. ఎందుకైనా మంచిది, ఇక్కడి దాకా వచ్చారు కదా, వారి చెవిలో కూడా ఒక మాట వెయ్యండని  కర్ణుడి జన్మ రహస్యం నా చెవిలో ఊదాడు.

యూనియన్ నాయకులతో నాకు మంచి పరిచయం వుంది కానీ అసలు తాళం చెవి వారిదగ్గర వుందని అప్పటిదాకా నాకు తెలవదు. 

వెళ్లి కలిస్తే, వాళ్ళు 'అయ్యో ఇదెంత పని, ఇందుకోసం ఇక్కడి దాకా రావాలా' అంటూ ఏదో ఫైలు చూసి, 'ఆ అమ్మాయి మెంబర్ షిప్ తీసుకున్నట్టు లేదు, ఆ మాట చెప్పండి ఆమెతో. వచ్చే బదిలీల్లో తప్పకుండా అవుతుంది. ఆర్డర్ రాగానే ఫోన్ చేసి నేనే చెబుతాను' అన్నాడు ఆ నాయకుడు. అన్నట్టే ఆ బదిలీ జరిగింది. 

ఆమె సభ్యత్వం తీసుకున్నదో లేదో తెలియదు. పని అయినందుకు నేను ఎవరికి కృతజ్ఞత చెప్పాలో తెలియలేదు. ఒక విషయం మాత్రం తెలిసింది. బ్యాంకు ఉద్యోగుల బదిలీల్లో యూనియన్లదే చివరి మాట. 

అలాగని యూనియన్ల మీద నాకు చిన్న చూపేమీ లేదు. ఉదాహరణకు గ్రామీణ బ్యాంకుల్లో పనిచేసే సిబ్బందికి పేరెంట్ బ్యాంకు సిబ్బంది, అధికార్లతో సమానంగా జీతాలు పెరగడానికి, పెన్షన్ సౌకర్యం  ఏర్పడడానికి కారణం ఆ బ్యాంకుల  యూనియన్లు దశాబ్దాల పాటు చేసిన న్యాయపోరాటం అని  నాకు బాగా తెలుసు. వారి పేరెంటు బ్యాంకు స్టేట్ బ్యాంకులో పనిచేసే వారికన్నా ఎక్కువ పెన్షన్ వాళ్ళు  పొందుతున్నారు అంటే నమ్మడం కష్టమే. ఇదంతా యూనియన్ల చలవే.

(ఇంకా వుంది )

16, జనవరి 2026, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (254) : భండారు శ్రీనివాసరావు

 అయాం ఎ బిగ్ జీరో (254) : భండారు శ్రీనివాసరావు

జీవితంలో కధలు
జీవితంలో కొన్ని సంఘటనలు కధలకు ఏమాత్రం తీసిపోవు.
చాలా ఏళ్ళ క్రితం, 2005లో కాబోలు, తానా వారి ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లాను.
‘ఎంతకాలం అమెరికాలో వుంటారు’ అనే ఇమ్మిగ్రేషన్ అధికారి ప్రశ్నకు ‘అయిదు రోజులు’ అని జవాబిచ్చాను. ‘ఫైవ్ డేస్ ఓన్లీ’ అన్నాడతగాడు ఒకింత ఆశ్చర్యంతో. నిజానికి నా రిటర్న్ ఫ్లైట్ కూడా ఐదో రోజునే వుంది. తీసి చూపించాను. ఆల్ ది బెస్ట్ అన్నాడు స్టాంప్ వేస్తూ.
బయటకి వచ్చి చూసుకుంటే ఆరు నెలలు అని వుంది. పదేళ్ల మల్టిపుల్ విజిటర్స్ వీసా నాది. అమెరికాలో ఉండడానికి ఎక్కువలో ఎక్కువ అనుమతించే ఆరు మాసాల వ్యవధిని నాకిచ్చినట్టన్నమాట.
తానా సభలు జరిగే డెట్రాయిట్ నగరంలో విదేశాల నుంచి వచ్చిన అతిధులకు కొన్ని హోటళ్ళలో బస ఏర్పాటు చేశారు. పెద్ద ఆడంబరంగా లేకపోయినా గదిలో అన్ని వసతులు వున్నాయి. ఒక్కో గదిని ఇద్దరిద్దరికి చొప్పున కేటాయించారు.
నాతో పాటు గదిలో ఉన్న వ్యక్తి వచ్చినప్పటి నుంచి చాలా టెన్షన్ తో వున్నట్టు కనిపించాడు.
మర్నాడు డెట్రాయిట్ మాజీ మేయర్ , కీర్తిశేషులు ఆల్బర్ట్ కోబో పేరిట నిర్మించిన సువిశాల సభామందిరంలో తానా సభలు మొదలవుతాయి.
అతడితో పెద్దగా మాట్లాడానికి నా దగ్గర కూడా విషయాలు లేవు. అంత పరిచయమూ లేదు. అయినా అతడి మొహంలో కనబడుతున్న టెన్షన్ తగ్గించడానికి వివరాలు అడుగుతూ మాటల్లో పెట్టాను.
‘ఎవరికీ చెప్పకండి. నేను ఈ ఒక్క రాత్రే హోటల్లో వుంటాను. తెల్లారేసరికల్లా వెళ్ళిపోతాను’ అన్నాడు. నాకు ఆశ్చర్యం. సభలకోసం వచ్చి తెల్లారి వుండననడం ఏమిటి?
ఎక్కడికి అని అడిగేలోగా అతడే చెప్పాడు.
‘ఎక్కడికి పోవాలో సరిగ్గా నాకే తెలియదు. పలానా చోటుకి వెళ్ళమని హైదరాబాదులో చెప్పారు. అదేమిటో ఎక్కడో అక్కడికి ఎలా వెళ్ళాలో తెలియదు. కానీ వెళ్లి తీరాలి’ అన్నాడు.
కొమ్మూరి సాంబశివరావు డిటెక్టివ్ నవలలో ఒక పాత్ర దిగివచ్చి మాట్లాడుతున్నట్టు అనిపించింది.
‘సరిపడా డబ్బులు ఉన్నాయా అని అడిగాను. అడిగితే ఇవ్వడానికి నా దగ్గరా ఎక్కువేమీ లేవు. ఏదో అయిదు రోజులు, అదీ వాళ్ళ ఆతిథ్యంలో. పెద్ద ఖర్చులు ఏముంటాయి అనే అభిప్రాయంతో ఎక్కువ డాలర్లు కూడా తెచ్చుకోలేదు.
‘అక్కరలేదు. నేను ఆ ఏర్పాటుతోనే వచ్చాను. ఓ మూడు నెలలకు సరిపడా డబ్బులు వున్నాయి. తర్వాత నా అదృష్టం’ అన్నాడతను.
మాటల్లో వివరాలు చెప్పాడు. అతడో ఎలిమెంటరీ స్కూలు టీచరు. పెద్ద సంసారం, చిన్న జీతం. ఎన్నాళ్ళిలా అనుకుంటూ వుంటే ఎవరో చెప్పారు, ‘అమెరికా వెళ్ళు, అది అవకాశాల దేశం, ఏదో ఒక పని దొరక్కపోదు అని.
‘ఎలా వెళ్ళడం?’ అంటే ...
‘అది కూడా అతడే చెప్పాడు. ఏదో ఒక విధంగా విజిటర్ వీసా సంపాదించి వెళ్ళు. ఒక్కసారి అమెరికాలో అడుగుపెడితే రోజుకిన్ని డాలర్లు, గంటకిన్ని డాలర్లు చొప్పున ఇచ్చే వాళ్ళు వుంటారు. నీ ఖర్చులకు పోను ఇంటికి డబ్బులు కూడా పంపుకోవచ్చు అని ఉత్సాహపరిచాడు’
‘ఏమి చేయాలని ఆలోచిస్తున్న నాకు అతడిచ్చిన ఈ సలహా మరేదీ ఆలోచించకుండా చేసింది. అంతే! ఉన్న కొంత పొలం, అమ్మ, అమ్మవద్దంటున్నా అమ్మేసాను. అప్పటినుంచి చేయని ప్రయత్నం లేదు, వీసా సంపాదించడానికి. ఇన్నేళ్ళకు కుదిరింది. ఇంట్లో బయలుదేరిన దగ్గరి నుంచి ఒకటే బెంగ. మళ్ళీ మా ఊరికి తిరిగి వెడతానా! మా వాళ్ళను మళ్ళీ నా కళ్ళతో చూడగలుగుతానా!’
నాకు ఏమి చెప్పాలో తెలియలేదు. మౌనంగా వుండిపోయాను.
అతడే మొదలు పెట్టాడు మళ్ళీ.
‘ఎవరిదో తెలుగు వాళ్లది ఫాం హౌస్ వుందట, దానికి కేర్ టేకర్ కావాలిట. ఎక్కడో అటవీ ప్రాంతంలో వుందట. పలానా చోటు వరకు రాగలిగితే వాళ్ళే తీసుకు వెడతారట. ఆరు నెలలు స్టాంప్ వేశారు. ఈలోగా ఏదో ఒక ఉద్యోగం పట్టుకోవాలి’
మనిషిని చూస్తే పిరికివాడిలా వున్నాడు. ఇంత ధైర్యం ఎలా చేశాడు? దేశం కాని దేశంలో, ఊరు కాని వూళ్ళో భాష కూడా సరిగా రాకుండా ఎలా నెగ్గుకు రాగలడు?
డబ్బు అవసరాలవల్ల, మరీ పచ్చిగా చెప్పాలంటే డబ్బు యావలో పడి జీవితంలో ఇంత రిస్క్ తీసుకోవాలా!
ఆ రాత్రి ఎక్కడో డిన్నర్ ఏర్పాటు చేశారు. అతడు రాలేదు. ఏదో కొనుక్కుని తింటాను రానన్నాడు. వచ్చేసరికి నిద్ర పోతున్నాడు.
తెల్లారి చూస్తే పక్క మీద లేడు, అసలు గదిలోనే లేడు.
ఇంత పెద్ద సువిశాల దేశంలోకి అతడు ఒంటరిగా నడుచుకుంటూ వెడుతున్న దృశ్యమే నా ఊహకు మిగిలింది.
అతడు ఉద్యోగం సంపాదించుకున్నాడా! ఆ దేశంలో స్థిర పడ్డాడా! ఎప్పటికయినా మన దేశానికి వచ్చి భార్యాబిడ్డలను చూడగలిగాడా! అలా జరిగితే ఎంత బాగుంటుందో కదా!
ఆ తర్వాత ఎప్పుడు అమెరికా వెళ్ళినా, నా మదిలో ఈ ప్రశ్నలు తలెత్తేవి. కాకపోతే జవాబు దొరకని ప్రశ్నలు.
అక్రమ వలసలపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కొరడా అనే వార్తలు వినవచ్చినప్పుడల్లా నాకీ సంఘటన గుర్తుకు వస్తుంది.
(ఇంకా వుంది)

2, జనవరి 2026, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (253): భండారు శ్రీనివాస రావు

 

రేడియో వార్తలు విన్న రాష్ట్రపతి
పురుషులలో ఉత్తమ పురుషుల మాదిరిగా జర్నలిష్టులలో హిందూ విలేకరులను అలా పరిగణించే రోజులు నాకు తెలుసు.
అలాంటి ఒకానొక రోజుల్లో హిందూ కరస్పాండెంట్ (ముందు ముందు విలేకరి అంటాను, టైప్ చేయడం ఇబ్బందిగా వుంది) గా పనిచేస్తున్న దాసు కేశవరావు అనే చిన్నగా కనబడే ఈ పెద్దమనిషికి, కొన్ని రోజులపాటు నా చిలిపితనాన్ని భరించాల్సిన పరిస్తితి ఏర్పడింది. దీనికి కారణం ఆ నాటి రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవరెడ్డి.
సంజీవరెడ్డి గారు రాష్ట్రపతి అయిన తర్వాత తొలిసారిగా అనంతపురం వచ్చారు. ఆ పట్టణానికి దగ్గరలోనే వారి స్వగ్రామం ఇల్లూరు వుంది. అనంతపురంలో ఉన్న వారి సొంత ఇల్లు తాత్కాలికంగా రాష్ట్రపతి నిలయం అయింది. అంతటి పెద్దాయన మొదటిసారి సొంతూరు వస్తుంటే పత్రికలు ఊరుకుంటాయా! హైదరాబాదు నుంచి విలేకరులను పంపించాయి. ఇక ఆకాశవాణి సంగతి చెప్పేదేముంది. నేనూ వాలిపోయాను.
అనంతపురంలో మెయిన్ రోడ్డుపైనే ఉన్న హోటల్లో మా బస. చెప్పానుకదా నాకు చిలిపితనం ఓ పాలెక్కువ అని. దాసు కేశవరావు గంగిగోవు లాంటి జర్నలిష్టు. మేమిద్దరం చాలా ఏళ్ళుగా స్నేహితులం. అంచేత నా గోల ఆయన మౌనంగా భరించేవాడు.
ఇద్దరమూ బయటకు పోయేవాళ్ళం. కాసేపు అటూ ఇటూ తిరిగేవాళ్ళం. మధ్యలో ఓ పబ్లిక్ కాల్ ఆఫీసు నుంచి నేను హోటల్ రిసెప్షన్ కు ఫోను చేసేవాడిని.
‘ రాష్ట్రపతి క్యాంప్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాము. మీ హోటల్లో, కేశవరావు, శ్రీనివాసరావు, హైదరాబాదు జర్నలిష్టులు వుంటే ఒకసారి కనెక్ట్ చేస్తారా! అర్జంటుగా మాట్లాడాలి’ అనే వాడిని.
హోటల్లో అడుగుపెడుతూ ఉండగానే మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ‘మీకోసం ప్రెసిడెంటు గారి ఆఫీసు వాళ్ళు ఫోన్ చేసారు’ అని చెప్పేవాళ్ళు ఆదుర్దాగా.
‘వాళ్ళు అలానే చేస్తారు. అవసరం వుంటే మళ్ళీ వాళ్ళే చేస్తారు, ఏం పర్వాలేదు’ అనేవాడిని నిర్లక్యంగా.
ఈ ట్రిక్కు బాగా పనిచేసింది. ఆ రోజు నుంచీ హోటల్లో మాకు మర్యాదలు పెరిగాయి. ఉదయం సాయంత్రం కనుక్కునేవారు. రూమ్ సర్వీసు బాగు పడింది.
‘ఇది అవసరమా’ అనేది కేశవరావుగారిలోని గంగిగోవు. ‘అవసరమే’ అనేది నాలోని పోట్లగిత్త.
ఒక రోజు ఇల్లూరు ప్రయాణం కట్టాము. ఎందుకంటే సంజీవరెడ్డి గారు అక్కడికి బయలుదేరారు.
ఇల్లూరులో నీలం వారిల్లు పెళ్లివారిల్లులా హడావిడిగా వుంది. తన ఈడువారిని ఆయన ఆప్యాయంగా ‘ఏమప్పా’ అంటూ పేరుపెట్టి పలకరిస్తున్నారు. చిన్నవారితో ఎప్పటి సంగతులో ముచ్చటిస్తున్నారు. వూరు ఊరంతా అక్కడే వుంది.
సాయంత్రం ఆరవుతోంది. నేను వారింటి నుంచే హైదరాబాదు ఫోన్ చేసి వార్త చెప్పాను. రాష్ట్రపతి మకాం చేస్తున్న సందర్భం కాబట్టి వెంటనే లైను కలిపారు. అది మొదటి వార్తగా వస్తుందని నాకు తెలుసు. వెంటనే సంజీవరెడ్డి గారిని ( రాష్ట్రపతి కార్యదర్శి పేరు కూడా సంజీవరెడ్డే. పీ.ఎల్. సంజీవ రెడ్డి గారు. ఐ.ఏ.ఎస్. అధికారి)ని ఒక రేడియో తెప్పించమన్నాను. ఆయన నావైపు అదోలా చూస్తూ రేడియో తెప్పించారు. దాన్ని అక్కడ ఉన్న మైక్ సెట్టుకు కలిపారు.
వార్తలు మొదలయ్యాయి. అంతా నిశ్శబ్దం. రాష్ట్రపతి స్వగ్రామం వచ్చిన వార్తా విశేషాలతో బులెటిన్ మొదలయింది.
ఈ మారుమూల గ్రామంలో వార్త ,అంత త్వరగా రేడియోలో ఎలా వచ్చిందని జనం ఆశ్చర్యంగా గుసగుసలాడుకున్నారు.
నేను ఇప్పటికీ గర్వపడే మరో విషయం ఏమిటంటే, ఆ నాటి శ్రోతల్లో నీలం సంజీవ రెడ్డి గారు కూడా ఒకరు.
ముందు కొంచెం రుసరుసలాడినట్టు కనిపించిన పీ.ఎల్. సంజీవరెడ్డి గారు కూడా ఖుషీ.
భుజం తట్టారు, మెచ్చుకోలుగా.
పొడుగు తోక టపా:
నువ్వు నువ్వే కావచ్చు, కానీ రుజువేదీ!
రోడ్డు మీద పోతుంటే పోలీసు ఆపి, నువ్వెవరు అంటే పలానా అని చెబితే సరిపోదు. జేబులోనుంచి ఓ కార్డు తీసి ఇదిగో ఇది నేను అని చెప్పాలి. అప్పుడే అతడు నమ్మే వీలుంది, నమ్ముతాడని నమ్మకం లేకపోయినా. అంటే ఏమిటన్నమాట. మనమెవరో మనమే మన నోటితో చెప్పినా నమ్మని వాడు, మనం మన కార్డు తీసి ఇచ్చి నేను పలానా అంటే నమ్మే చాన్స్ వుంది. అందుకే ఈ కలియుగంలో మనుషులకన్నా కార్డులకే విలువ ఎక్కువ. అవి మనకి ఒక గుర్తింపు ఇస్తాయి.
జ్ఞానపీఠాలు, పద్మశ్రీలు, దాదా సాహెబ్ లు, స్వర్ణ నందులు ఒక రకం గుర్తింపులే. అవి పెట్టిపుట్టిన వారికి.
పుట్టి కూడా పుట్టినట్టు దాఖలా కోసం కావాల్సిన గుర్తింపులు మరి కొన్ని. ఉదాహరణకు బర్త్ సర్టిఫికేట్. స్కూలు ఫైనల్ లేదా టెన్త్ క్లాస్ (పుట్టిన తేదీ నిర్ధారణ కోసం), కులం సర్టిఫికేట్ (అవసరాన్ని బట్టి), నివాస స్థలం గుర్తింపు, బ్యాంకు (ఏటీఎం) కార్డు, ఇక ఆధార్ సరేసరి. ఇవన్నీ ఓ మోస్తరు బతుకులకోసం.
ఇంకొంచెం ముదిరితే పాస్ పోర్టు, వీసా, బ్యాంక్ క్రెడిట్ కార్డు ప్లాటినం, గోల్డ్ ఎట్సెట్రా ఎట్సెట్రా.
పాతికేళ్ళు వచ్చేవరకు ఈ కార్డుల గోల పెద్దగా లేదు. పుట్టిన తేదీ పదో తరగతి సర్టిఫికేట్ లోనే వుంది కాబట్టి ఉద్యోగ పర్వం వరకు దానితోనే నెట్టుకొచ్చాను.
హైదరాబాదులో రేడియో విలేకరి ఉద్యోగం వచ్చిన తర్వాత మొదట అవసరం పడింది రేషన్ కార్డు. అదీ గుర్తింపు కోసం. పాస్ పోర్టు కావాలన్నా ఆ రోజుల్లో రేషన్ కార్డు అడిగేవాళ్ళు.
అందరిలాగే ప్రయత్నించాను. లాభం లేకపోయింది. చేస్తున్న ఉద్యోగం దుర్వినియోగం చేయక తప్పలేదు. వెళ్లి అప్పటి రెవెన్యూ మంత్రి పి. నరసారెడ్డి గారితో చెప్పాను. ఆయన పియ్యేను పిలిచి నాకు సంబంధించిన ఏరియా తాసీల్దారును ఆఫీసుకు పిలిపించారు. అధికార ముద్రతో సహా రమ్మని చెప్పారు. ఆయన ఆఘమేఘాల మీద సచివాలయానికి వచ్చారు. నన్ను కూర్చోబెట్టుకుని వివరాలు తీసుకుని స్టాంపు వేసి రసీదు ఇచ్చారు. సాయంత్రం కల్లా రేషన్ కార్డు నాకు ఆఫీసులో ఇచ్చి వెళ్ళారు.
తరువాత కౌలాలంపూర్ తెలుగు మహాసభలకు వెళ్ళడానికి పాస్ పోర్టు అవసరం వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి అంజయ్య గారు. సీఎం ఆఫీసు చొరవతో అది ఇంటికే వచ్చింది, ఇరవై నాలుగ్గంటల్లో.
అమెరికా వెళ్ళడానికి పదేళ్ల వీసా కూడా చెన్నై వెళ్ళకుండా, ఇంటర్వ్యూ కు హాజరు కాకుండా చెన్నై ఎంబసీ వాళ్ళే పోస్టులో పంపారు. అలాగే మా ఆవిడ వీసా కూడా. అదీ నేను చేస్తున్న ఉద్యోగం చలవే.
బ్యాంకు కార్డు వద్దనుకున్నాను. కానీ ఒక బ్యాంకు వాళ్ళు ఆఫీసుకు వచ్చి మొహమాట పెట్టి మరీ ఇచ్చారు. ఇవ్వడం ఇచ్చారు కానీ దానితో పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కాదు. ఆ క్రెడిట్ కార్డు లేకపోతే బహుశా నాకు జీవితంలో బీపీ రోగం వచ్చేది కాదేమో! అది మాత్రం ఆ బ్యాంకు వాళ్ళ పుణ్యమే.
బ్యాంకుల వాళ్ళు కూడా డబ్బు(బాకీ) వసూళ్ళకు ప్రైవేటు ఏజెన్సీల (గూండాల) ను నియమించుకుంటారని అప్పుడే తెలిసింది. దాంతో క్రెడిట్ కార్డు వదుల్చుకుని డెబిట్ కార్డు తీసుకున్నాను.
ఆధార్ కార్డుకు పెద్ద ప్రయాస పడలేదు. ఆధార్ కార్డుల శకం మొదలయిన కొత్తల్లోనే తీసుకున్నాను, పెద్ద ఇబ్బంది పడకుండా. ఇంటిపక్కనే ఆధార్ నమోదు కేంద్రం పెట్టారు. వెళ్లి పదిహేను నిమిషాల్లో నేనూ మా ఆవిడా వేలిముద్రలు, కనుపాప ముద్రలు ఇచ్చి కార్డులు తెచ్చేసుకున్నాం.
కాకపోతే దానిమీద ఫోటో మాది అంటే మేమే నమ్మే పరిస్థితి లేకుండా, కింద పేరు రాస్తే కాని పలానా అని గుర్తు పట్టడానికి వీలు లేకుండా గొప్ప అసహ్యంగా వచ్చింది.
కొన్నేళ్ళు ఆ ఆధార్ ఆధారంగానే రోజులు నెట్టుకువచ్చి, సాంకేతికంగా పరిస్థితులు కాస్త బాగుపడ్డతర్వాత ఇంటి నుంచి కంప్యూటర్ ద్వారా ప్రయత్నించి మరో కార్డు తీసుకున్నాము.
అలాగే ఓటరు గుర్తింపు కార్డు.
విధిగా తీసుకోవాల్సి వచ్చిన మరో రెండు కార్డులు వెహికిల్ రిజిస్ట్రేషన్ కార్డు, PAN కార్డు, స్కూటర్ కొన్న కొత్తల్లో డ్రైవింగ్ లైసెన్స్ కార్డు. ఈ మూడు కూడా పెద్ద కష్టపడకుండానే నా కార్డుల సంతానంలో చేరాయి.
ఇక వృత్తి రీత్యా అవసరమైన ప్రెస్ అక్రిడి టేషన్ కార్డు. 1975 నుంచి ఇప్పటివరకు అవిచ్చిన్నంగా కొనసాగుతోంది, గత యాభై ఏళ్లుగా. మరి ఇప్పుడు ఏవో మార్పులు, చేర్పులు అంటున్నారు.
ఈ కార్డుకు అనుబంధ కార్డులు మరి కొన్ని వుంటాయి. ఆర్టీసీ వాళ్ళు ఇచ్చే ఉచిత సిటీ బస్సు కార్డు, రాష్ట్రంలో ఎక్కడికైనా మూడో వంతు టిక్కెట్టు ధరతో బస్సుల్లో తిరిగే మరో కార్డు. స్కూటరు యోగం పట్టిన తర్వాత సిటీ బస్సు పాసు వదిలేసాను. కారు కొన్న తర్వాత రెండోదానికీ నీళ్ళు వదిలాను.
వృత్తికి అవసరమైన మరో కార్డు వుంది. విజిటింగ్ కార్డు. ఈ శ్రీనివాసరావు పలానా సుమా అని తెలియచెప్పే కార్డు. అయితే దానితో నాకు ఎప్పుడూ అవసరం పడలేదు. నా పేరే నా విజిటింగ్ కార్డు అనుకునేవాడిని. ఎవరినైనా కలవాల్సినప్పుడు చీటీ మీద నా పేరు రాసి పంపేవాడిని. అయితే ఈ పప్పులు ఈ కాలంలో ఉడకవు అనుకోండి.
పొతే, సగం ధరతో దేశంలో ఏ తరగతిలో అయినా ప్రయాణించే రైల్వే పాసు. అదేదో గుర్తుకోసం అన్నట్టుగా వుండేది కానీ వాడిన సందర్భాలు బహు తక్కువ.
మాస్కోలో వున్న అయిదేళ్ళూ మాస్కో రేడియో వారి గుర్తింపు కార్డు (ప్రోపుస్కా) వుండేది. రేడియోలో ప్రవేశానికే కాదు, మాస్కోలో తిరిగేటప్పుడు కూడా గుర్తింపు కోసం హమేషా అది దగ్గర ఉంచుకోవాల్సి వచ్చేది.
ఇప్పుడు పరిస్తితులు ఎలావున్నాయో తెలియదు కానీ, నలభై ఏళ్ళ క్రితం మాస్కోలో మేమున్న రోజుల్లో సోవియట్ యూనియన్ లో నియమ నిబంధనల అమలు చాలా ఖచ్చితంగా వుండేది.
నేను మాస్కో రేడియోలో చేరిన మొదటి రోజునే ఆఫీసువాళ్ళు మా కుటుంబంలో ఉన్న నలుగురికీ ప్రొపుస్కాలు (ఫోటో గుర్తింపు కార్డులు) తయారు చేసి ఇచ్చారు. వాటిని హమేషా దగ్గర ఉంచుకోవాలని, లేని పక్షంలో ఇబ్బందులు పడతారనే హెచ్చరిక కూడా చేసారు. నేను చాలా లైట్ గా తీసుకున్నాను.
సంక్రాంతి గంగిరెద్దుల మీద కప్పే బట్టల మాదిరిగా చలి దుస్తులు ఒకదాని మీదొకటి వేసుకుని వెళ్ళే హడావిడిలో, ఆ ప్రోపుస్కాను కోటులో ఏ జేబులో పెట్టుకున్నానో మరచిపోయేవాడిని.
ఒక రోజు ఆఫీసు ప్రధాన ద్వారం దగ్గరే నన్ను నిలిపేశారు, ప్రొపుస్కా లేదని. అక్కడ వుండే గార్డులు నన్ను రోజూ చూస్తుండే వాళ్ళే. గుర్తు పట్టేంత పరిచయం వుండేది. అయినా లోపలకు పంపడానికి వాళ్ళు సుతరామూ ఒప్పుకోలేదు.
వార్తలకు టైం అవుతోంది, నన్ను వెళ్ళనివ్వకపోతే ఇబ్బంది అవుతుందని సైగలతో చెప్పి చూసినా లాభం లేకపోవడంతో రిసెప్షన్ నుంచే కొంచెం కొంచెం తెలుగు తెలిసిన మా రష్యన్ సహోద్యోగి గీర్మన్ కు ఫోన్ చేసి విషయం చెప్పాను. అతడు వెంటనే కిందికి వచ్చాడు. అతడి చేతిలో నేను తర్జూమా చేయాల్సిన వార్తలు, కొన్ని తెల్ల కాగితాలు బాల్ పాయింటు పెన్ను వున్నాయి. రిసెప్షన్ గదిలో ఓ కుర్చీలో కూర్చోబెట్టి పని చేసుకోమని చెప్పాడు. ఇంటికి ఫోన్ చేసి ప్రొపుస్కా తెప్పించుకోమని సలహా ఇచ్చాడు. వార్తలకు సమయం ఆట్టే లేదని అంటే పర్వాలేదు, అవసరం అయితే నిన్నటి వార్తల రికార్డు వుంది, అంటాడు కాని నన్ను లోపలకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయలేదు.
ఒక్కసారి చెప్పి చూడమంటే గీర్మన్ అటువైపు చూడమని సైగ చేశాడు. ద్వారం దగ్గర ఓ పొడవాటి పెద్దమనిషి నిలబడి తన ప్రోపుస్కా చూపించి లోపలకు వెడుతున్నాడు. అతడ్ని చూపుతూ గీర్మన్, ‘ఆయన ఎవరో తెలుసా! మన రేడియో మంత్రి. ఎవరైనా సరే రూలు రూలే’ అన్నాడు.
నాకు పరిస్తితి అర్ధం అయింది. ఈ నిబంధనల పాటింపు చూస్తుంటే మెదడు మోకాల్లో వుంది అనే సామెత గుర్తుకు వస్తుంది. లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు గేటు దగ్గరవారికి గుర్తింపు కార్డు చూపాలి. రెండు మెట్లు దిగి ఏదైనా మరచిపోయి మళ్ళీ లోపలకు వెళ్ళాలన్నా చూపించాలి. ఇప్పుడే కదా బయటకు వచ్చింది అంటే కుదరదు.
ఇక చేసేది లేక ఇంటికి ఫోన్ చేసి చెప్పాను. పిల్లలు స్కూలుకు వెళ్లిపోయారు. మా ఆవిడే టాక్సీ వేసుకుని ఆఫీసు కు వచ్చి ప్రోపుస్కా నా చేతిలో పెట్టి అదే టాక్సీలో ఇంటికి పోయింది.
ఇదంతా అయ్యేసరికి వార్తల సమయం ముంచుకువచ్చింది. పైకి వెళ్లి స్టూడియోలో వార్తలు ఆ పూటకు మమ అనిపించేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది.
నేను సుదీర్ఘ కాలం పనిచేసిన హైదరాబాదు రేడియో, దూరదర్శన్ లలో కూడా సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చేవాళ్ళు. కానీ నేను తీసుకోలేదు. ఇక ప్రెసిడెంట్, ప్రధాని వంటి వీవీఐపీల పర్యటనల సందర్భంలో ప్రత్యేకంగా జారీ చేసే ఫోటో గుర్తింపు కార్డులు. సరే. ఇవి తాత్కాలికం అనుకోండి.
రిటైర్ అయిన తర్వాత పెన్షనర్ కార్డు, సీ.జీ.హెచ్.ఎస్. కార్డు అదనంగా వచ్చి పర్సులో చేరాయి.
మరోటి వుంది. అది ప్రెస్ క్లబ్ కార్డు. ఢిల్లీ, బెంగుళూరు క్లబ్బుల్లో పనికొస్తుంది కాబట్టి అదొకటి వుంటుంది ఎప్పుడూ.
జేబులు కొట్టేవాడి కన్ను నా వాలెట్ మీద పడితే ఆశ్చర్యం లేదు, ఎందుకంటే అన్ని కార్డులు కడుపులో పెట్టుకుని నా పర్సు బలిసిన పిల్ల పందిలా వుంటుంది. కానీ అదేమిటో విచిత్రం చాలా ప్రాంతాలు తిరిగాను, కొన్ని దేశాలు కూడా తిరిగాను. ఒక్కసారంటే ఒక్కసారి కూడా నా జేబు కొట్టే జేబుదొంగ నాకు తారసపడలేదు. బహుశా ఈయన పర్సులో కార్డులు తప్ప పనికొచ్చే సరుకు ఏమీ ఉండదని వాళ్లకు తెలుసేమో!
ఇప్పుడు కొన్ని కాలనీల్లో నివసించేవారికి లోపలకు వచ్చేందుకు కొత్తరకం ఎలెక్ట్రానిక్ కార్డులు ఇస్తున్నారట. వుండేది మామూలు కాలనీ కాబట్టి ఇంతవరకు ఆ కార్డు అవసరం పడలేదు.
ఒక్క బతుక్కి, ఒక్క మనిషికి ఇన్ని కార్డులు అవసరమా!
కింది ఫోటో కధ:
1989లో రేడియో మాస్కోలో పనిచేసేటప్పుడు రేడియో వాళ్ళు ఇచ్చిన గుర్తింపు కార్డు కోసం తీసిన ఫోటో. న్యూస్ పేపర్ సైజులో వందో నూట యాభయ్యో ఫోటోలు ఇలా ప్రింట్ చేసి ఇచ్చారు. వాటిని కత్తిరించుకోవడం మాత్రం మన పనే. ఇలా జంటగా వున్న ఫోటో ఒకటి మిగిలిపోయి మాతో పాటు ఇండియాకు వచ్చింది.



(ఇంకా వుంది)

1, జనవరి 2026, గురువారం

జీరో కాస్తా లక్ష – భండారు శ్రీనివాసరావు

 

‘అయాం ఎ బిగ్ జీరో’ ఏడాది క్రితం మొదలు పెట్టినప్పుడు నా బ్లాగు https://bhandarusrinivasarao.blogspot.com/2025/12/252.html వీక్షకుల సంఖ్య పదహారు లక్షలు వుండేది. ఇది ప్రారంభించిన తర్వాత ఆ సంఖ్య పదిహేడు లక్షలు దాటింది.

నా జీవితంలో సాధించింది ఏమీ లేకపోయినా, నా జీవితం గురించి రాస్తున్న విషయాలకు ఇంతటి పాఠకాదరణ లభించడం ఎనభయ్యవ ఏట నన్ను పట్టుకున్న అదృష్టం.

ఈ విధంగా నన్ను  లక్షాధికారిని చేసిన మీ అందరికి నా గుండె లోతుల్లో నుంచి కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాను.







01-01-2026