“చదవాలని అనిపించిన ప్రతి పుస్తకం కొనతగ్గదే!”
ఈ కొటేషన్ నాది కాదు.
నిన్న ఆదివారం ఉదయం ఒక పుస్తక ఆవిష్కరణ
కార్యక్రమానికి వెళ్లాను. వెళ్ళే సరికి వేదిక మీదికి అతిధులను ఆవిష్కరించే క్రతువు
కొనసాగుతోంది. బయట పుస్తకాన్ని అమ్మే ఏర్పాటు
ఏమైనా చేశారా, కొనుక్కుని వెడదామని ఒకపరి పరికించి చూసి, అలాంటిదేమీ లేదని నిర్ధారించుకుని లోపలకు
వెళ్లాను.
మిత్రుడు, పాత్రికేయుడు, బహురూపి,
సౌమ్యుడు ములుగు రాజేశ్వరరావు రాసిన ( “నేను –
బహువచనం,
అధినాయక జయహే” గేయ సంపుటి) రెండు పుస్తకాలను ఒకే వేదిక మీద, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ మోహన్ కందా
ఆవిష్కరించారు. తెలంగాణా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కె. శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథి.
వేదిక మీద జర్బలిస్తులే కాదు, వివిధ రంగాలకు చెందిన ఘనాపాటీలు వున్నారు.
అందరూ తమ ప్రసంగాలలో, రాజేశ్వరరావు గురించి నేను పైన పేర్కొన్న విశేషణాలనే
ప్రముఖంగా ప్రస్తావించారు. అది సహజం. పాతిక ముప్పయ్ ఏళ్ళకు పైగా ఆయనతో పరిచయం వున్న
మాబోంట్ల అభిప్రాయం అదే. అయితే ఈ పుస్తకంలో అంటే తన ఆత్మ కధలో ఆయన రాసుకున్న
రాజేశ్వరరావు వేరే. అయన లోపలి మనిషి గురించి మాలో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు.
తెలిసిన తర్వాత, ఇంటి పేరు
ములుగు, కానీ రాజీపడని రాజేశ్వరరావు అని
పేరు పెట్టుకుని వుంటే బాగుండేది అనిపించింది.
పుస్తకానికి వేసిన ముఖచిత్రంలో ఆయన ఈ రెండో
వ్యక్తిత్వం స్ఫుటంగా కనిపిస్తుంది. ఒక నిచ్చెన, దాని మూడో మెట్టు మీదనే కాటు
వేయడానికి సిద్ధంగా వున్న పాము. దాని నుంచి తప్పించుకుని కిందికి జారడం. మళ్ళీ ఎక్కే ప్రయత్నం మాత్రం మానలేదు. చివరికి నిచ్చెన చివరి మెట్టు ఎక్కాడా అంటే అదీ
లేదు. ముప్పయి ఏళ్ళ క్రితం ఎక్కడ ఉన్నాడో అక్కడే వున్నాడు. నిఖార్సయిన
జర్నలిస్టులు చాలా మంది పరిస్థితి ఇదే. దీనికి ప్రధాన కారణం వాళ్ళ ఎడమ కాలు
గట్టిది. నచ్చకపోతే, ఎంతో నచ్చి సంపాదించుకున్న ఆ ఉద్యోగాన్ని ఎడమకాలితో తన్ని బయటకు వస్తారు.
రాజేశ్వర రావు అదే బాపతు కనుక ఎన్నో పత్రికల్లో పనిచేసినా ఎక్కడా కుదురుకున్నది
లేదు. అలాగని రాజీ పడి జీవితాన్ని సరిదిద్దుకున్నదీ లేదు.
నేను ఈ పుస్తకాన్ని సమీక్షించడం లేదు. ఎందుకంటే
ఎవరికి వారు చదువుకుంటే ఇందులోని థ్రిల్ అర్థమవుతుంది.
ఇది చదివిన తర్వాత ధన్యవాదాలు చెప్పాల్సిన
వ్యక్తి ఒకరున్నారు. అతడి పేరు కూడా నాకు తెలియదు.
అతడు రాజేశ్వర రావు పెద్ద కుమారుడు.
“నాన్నా! నువ్వు జర్నలిష్టువి. ఎన్నో
రాస్తుంటావు. మరి నీ ఆటో బయాగ్రఫీ రాయొచ్చు కదా!”
“నేనేంటో మీకు తెలుసు కదా! మళ్ళీ అదెందుకు”
“ మాకు తెలిసిన నాన్న గురించి కాదు. తెలియని
నాన్న గురించి”
ఈ షాక్ నుంచి పుట్టిందే ఈ పుస్తకం.
“నేను”
దీనికి ఓ ట్యాగ్ లైన్ “ బహువచనం”
అంటే నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది వున్నారని కవి
హృదయం కావచ్చు.
“అఖండ విజయాలు, ఘోర వైఫల్యాలు” ఏదీ దాచుకోలేదు. ముళ్ళ
బాట మీద పూలు చల్లుకుంటూ నడవడానికి వెనుకాడ లేదు.
కాపీ రైట్ హక్కులు రచయితవి. సమీక్ష పేరుతొ మొత్తం
రాస్తే బాగుండదు. కనుక ఇంతటితో స్వస్తి.
అందరూ, ముఖ్యంగా జర్నలిజంలో చేరాలని ఆసక్తి
వున్నవారందరూ చదవాల్సిన పుస్తకం. వెల: రు. 180/- (ముచ్చటగా ముద్రించిన తీరుకు ఇవ్వొచ్చు ఈ ఖరీదు) ఆన్
లైన్ లో దొరికే చిరునామా: Active Citizens Club, Flat 3-B, Sai
Savitri Apartments, SBI Officers Colony, Bagh Amberpet, Hyderabad- 500013
తోక టపా:
ఉబెర్లో పడి ఇంటికి చేరి
ఆత్రంగా పుస్తకం తెరిచి చూస్తే, మొదటి
పుటలోనే కర్రు కాల్చి పెట్టిన వాత.
“చదవాలని అనిపించిన
ప్రతి పుస్తకం కొనతగ్గదే”
దటీజ్ రాజేశ్వర రావ్ !
(08-12-2025)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి