15, డిసెంబర్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (248) : భండారు శ్రీనివాసరావు

 

మా పెళ్లి రోజు ఓ చేదు జ్ఞాపకం
ఆరేళ్ల క్రితం ఆగస్టు నెల మొదటి వారంలో మిత్రుడు జ్వాలా, మా మేనకోడలు విజయలక్ష్మి దంపతుల యాభయ్యవ వివాహ వార్షికోత్సవం జరిగింది. హితులు, సన్నిహితులు, చుట్టపక్కాల నడుమ జ్వాలా దంపతుల పిల్లలు ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగలా నిర్వహించారు.
“మరో రెండేళ్లలో మీ గోల్డెన్ జూబిలీ. రెడీగా వుండు దుర్గత్తయ్యా!” అంది మా మేనకోడలు మా ఆవిడ నిర్మలతో.
దేవతలకు ఉన్నట్టే మాఆవిడకు అనేక పేర్లు. పుట్టినప్పుడు కన్న తలితండ్రులు బియ్యంలో రాసి పెట్టిన పేరు కనకదుర్గ. కానీ ఆమె పుట్టింటి వాళ్ళందరూ చిట్టి అనే పిలిచేవాళ్ళు. పెళ్లి అయిన తర్వాత మా బామ్మ గారు నిర్మల అని మార్చింది. స్నేహితులందరికీ ఇదే పేరు వాడుక. చుట్టాల్లో చాలామందికి చుట్టరికం ఏదైనా అందరికీ ఆవిడ దుర్గత్తయ్యే.
సిల్వర్ తప్పితే మా ఆవిడకు గోల్డ్ ఇష్టం లేనట్టుంది. అందుకే అప్పటిదాకా ఆగకుండా వెళ్ళిపోయింది.
రేపు డిసెంబరు పదహారు మా పెళ్లిరోజు.
ఆ రోజు గురించి తలచుకుని మురిసిపోయే మంచి సంగతులేవీ మాకు లేవు. ఎందుకంటే అది కన్నీళ్ళ పెళ్లి.
1971 డిసెంబరు 15 వ తేదీ రాత్రి మద్రాసు నుంచి అంబాసిడర్ కారులో తిరుపతి ప్రయాణం. దారిలో భోరున వాన. అట్లా ఇట్లా కాదు, ఉరుములు, మెరుపులు, పిడుగులు. నా వంటి వాడితో తన భవిష్యత్ జీవితం ఎలా వుండబోతోందో సూచనాప్రాయంగా మా ఆవిడకి చెప్పడానికా అన్నట్టు వుంది ప్రకృతి బీభత్సం.
మధ్య మధ్యలో ఆగుతూ, తెల్లారేలోపునే తిరుమల చేరాము. ఒక కాటేజీలో పైన గదులు తీసుకున్నాము.
మా ఆవిడ పిన్నివసుంధర కొన్న నీలం రంగు ఫారెన్ నైలెక్స్ చీరే పెళ్లి చీరె. నేను ధోవతి కట్టుకున్నానో, ప్యాంటు షర్టుతో పెళ్లి చేసుకున్నానో గుర్తు రావడం లేదు. ఎందుకంటే సందర్భం, సన్నివేశం అలాంటివి. ప్రత్యేకంగా ముహూర్తం అంటూ లేదు కనుక, తొమ్మిదీ పది గంటల నడుమ పెళ్లి జరిగిపోయింది. వెంటనే వెళ్లి బాలాజీ దర్శనం చేసుకున్నాము.
ఇప్పట్లోలా క్యూ లైన్లు లేవు. కొండ దిగి వచ్చి భోజనం చేసి వచ్చిన కారులోనే మళ్ళీ మద్రాసు వెళ్ళాము. మా ఆవిడ స్నేహితులు టీ నగర్ హోటల్లో విందు ఇచ్చారు. అటునుంచి మా మామగారి వద్దకు వెళ్లాం. కూతుర్ని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. “నీకు ఏం తక్కువ చేస్తానని అనుకుని ఇలా పెళ్లి చేసుకున్నావ”ని మా ఆవిడను అడిగారు. కన్నీళ్ళే జవాబు.
రైళ్ళలో రిజర్వేషన్ల గొడవ లేని రోజులు. అంచేత 16 వ తేదీ రాత్రి రైల్లో బయలుదేరి మర్నాడు ఉదయం బెజవాడ చేరుకున్నాము. రిక్షా చేసుకుని మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారింటికి వెళ్ళాము. మా అమ్మగారు కూడా అక్కడే వుంది.
మమ్మల్ని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. కాళ్ళకు దణ్ణం పెట్టగానే దగ్గరకు తీసుకుని మనసారా ఆశీర్వదించింది.
‘పెళ్లి వద్దు! పెళ్ళాం కావాలి’ అనే నా మొండి పట్టుదల ఫలితం మా ఈ పెళ్లి. ఇరువైపుల పెద్దల చేత కళ్ళ నీళ్ళు పెట్టించింది కూడా, బహుశా అదే ఆఖరిసారి కావచ్చు.
పెళ్లి అనేది ఇద్దరి మధ్య వ్యవహారం. మూడో వ్యక్తికి ఇందులో సంబంధం లేదు. పెళ్లి మీద ఖర్చుచేయడం వృధా అనే సిద్దాంతాన్ని నాకు నేనే ప్రతిపాదించుకుని, దాని మీదే భీష్మించుకుని కూర్చోవడంతో, మా ప్రేమ పెళ్ళికి పెద్దల ఆమోదం లభించినా, కొన్నేళ్ళు గా వాయిదా పడుతూ వచ్చింది.
ఒక్కగానొక్క పిల్లకు గుళ్ళో పెళ్లి చేయలేను అనే మా మామగారి వాదన నేను పట్టించుకోలేదు.
అందుకే ఆయన ఇష్టపడిన పెళ్లిని, ఇష్టం లేని గుళ్ళో పెళ్ళిగా చేసుకోవాల్సి వచ్చింది.
పెద్దతనంలో ఇప్పుడు తలచుకుంటే అప్పుడు చేసిన పని చిన్నతనంగా అనిపిస్తుంది.
ఏదిఏమైనా అన్నింటినీ నా జ్ఞాపకాలకు వదిలేసి తాను తప్పుకుని వెళ్ళిపోయింది. పెళ్ళంటే నా ఇష్టప్రకారం చేసుకున్నాను. ఇది నా చేతిలో లేదుగా!
నా గురించి తప్ప తన గురించి ఆలోచించుకోవడానికి సుతరామూ ఇష్టపడని ఓ వింత మనిషి, 1971 డిసెంబరు పదహారు నుంచి నా జీవితంలో ఒక విడరాని ప్రధాన భాగమై పోయింది. నేను ఎన్నటికీ తీర్చుకోలేని రుణం ఈ ఒక్క వ్యక్తికే!
గ్రహపాటున తీర్చుకుంటానేమో అనే సందేహం కలిగిందేమో, నాకు ఆ అవకాశం ఇవ్వకుండా ముందుగానే దాటిపోయింది.
ప్రతి ఏటా డిసెంబర్ 15 వ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటలకు నన్ను నిద్ర లేపి మృదువుగా షేక్ హాండ్ ఇచ్చేది. మర్నాడు ఉదయం అంటే డిసెంబర్ 16 ఉదయం మళ్ళీ నిద్ర లేపి కాళ్ళకు దణ్ణం పెట్టేది. అప్పుడు కానీ నాకు లైట్ వెలిగేది కాదు డిసెంబర్ 16 మా పెళ్లి రోజని. కలిసి గుడికి పోవాలని తనకు మనసులో కోరిక. నాకేమో టీవీ చర్చలతో సమయం దొరికేది కాదు. తానే ఒంటరిగా వెళ్లి అర్చన చేయించి వచ్చేది.
ఒక ఏడు కాదు రెండేళ్ళు కాదు ఇలా 48 సంవత్సరాలు ఇదే విధంగా గడిచిపోయాయి.
బుద్ధి తక్కువ వాడిని, ఇన్నేళ్ళలో ఒక్కటంటే ఒక్కరోజయినా గుర్తు పెట్టుకుని నేనే ముందుగా ఆమెకు షేక్ హాండ్ ఇచ్చివుంటే....
ఇప్పుడిలా ఆ విషయాలను గుర్తుచేసుకుని మధన పడే అవకాశం వుండేది కాదేమో!
బ్యాడ్ లక్!
దండలు కూడా లేని పెళ్ళికి ఫోటోలు ఏమి వుంటాయి?
కింది ఫొటోలు: పెళ్లి కాక ముందు, పెళ్ళయిన కొత్తల్లో, ఇప్పుడు, మూడేళ్ల క్రితం కాబోలు తిరుపతి వెళ్ళినప్పుడు మేము పెళ్లి చేసుకున్న కాటేజీ ముందు ఒంటరిగా నిలబడి తీసుకున్న ఫోటో









(ఇంకా వుంది)
15-12-2025

కామెంట్‌లు లేవు: