30, డిసెంబర్ 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (252) : భండారు శ్రీనివాసరావు

 

నేను నిలబెట్టుకోలేని నా మాట
నిలబెట్టుకోలేని మాట అనగానే రాజకీయుల వాగ్దానాలు గుర్తొస్తే చేసేదేమీ లేదు. అసలు నేను రాజకీయ పోస్టు పెట్టి ఏండ్లు గడిచిపోయాయి. ఆ కాడి కిందపారేసి నా ఆరోగ్యం కాపాడుకుంటున్నానని ఏనాడో మనవి చేశాను. ఈ విషయంలో నాకు సాయపడ్డ ట్రోలర్లకి సదా సర్వదా కృతజ్ఞుడిని. వాళ్ళు ఇంకా నా స్నేహితుల జాబితాలోనే వున్నారు. వారిని తప్పు పట్టను. వారికి ఒప్పచెప్పిన బాధ్యతను తుచ తప్పకుండా నెరవేర్చినందుకు అభినందిస్తున్నాను.
కానీ, నేను ఇప్పుడు చెప్పబోయే 'ఈ మాట' ఎవరికి వారు ఇచ్చుకునే మాట. కొత్త ఏడాదిలో 'ఇది చేస్తాం అది మానేస్తాం' అంటూ మనకు మనమే ఇచ్చుకునే మాట అన్నమాట.
కాసేపు ఈ మాట్లాట మానేసి అసలు విషయానికి వద్దాం.
న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పేరుతో ఎన్నో చేయాలని అనుకుంటాం. అదేం పాపమో ఏడాది మొదట్లోనే వాటికి పురిటి సంధి కొడుతుంది.
చాలామంది మగ పురుషులు ప్రతి ఏడాది కామన్ గా తమకు తాము ఇచ్చుకునే వాగ్దానం కామన్ గా ఒకటుంది. అదేమిటంటే ‘మందు కొట్టడం మానేస్తాం, సిగరెట్లు తాగడం ఆపేస్తాం’ అని. కానీ, కామన్ గా జరిగేది ఏమిటంటే, మర్నాడు సీను షరా మామూలే.
హాల్లో పీఠం మీద విలాసంగా మఠం వేసుకుని కూర్చుని మందహాసంతో ఒక చేత్తో సిగరెట్టు వెలిగించి, మరో చేత్తో మందు గ్లాసు పట్టుకున్న తరువాత కూడా ఎందుకో ఏమిటో ఈ మాట అస్సలు గుర్తు రాదు. ఆవిళ్ళు (అనగా ఆవిడలు, అనగా భార్యలు) పనిగట్టుకుని గుర్తుచేయబోయినా 'ఆ మాట నిరుడు కదా చెప్పాను' అనేస్తారు అదేదో పూర్వ జన్మ వృత్తాంతం అన్నట్టు.
కావున, కావుకావుమని చెప్పేదేమిటంటే, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన తరువాత నిలబెట్టుకోలేదెందుకని రాజకీయ నాయకులను నిలదీసే హక్కు మనకు బొత్తిగా లేదని.
అయితే, మనం మాట తప్పడానికి కూడా ఓ కారణం వుంది. ఈ కొత్త ఏడాది పాతపడి గిర్రున తిరిగి మరో కొత్త ఏడాది మళ్ళీ వస్తుందని. అప్పుడు కొత్తగా మరో మాట ఇచ్చుకునే అవకాశం ఎలాగు వుంటుందని.
వాళ్ళు మాట తప్పడానికి కూడా దాదాపు ఇదే కారణం.
అయిదేళ్ళ తరువాత మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు మరో మాట ఇస్తే పోలా అని.
కావున, అల్లా ఆలోచించి ఎన్నికల్లో ఇచ్చిన పాత మాటలన్నీ (వోట్ల కోసం పెట్టిన వొట్లు అన్నమాట) మూటగట్టి మన గట్టునే పెట్టి వెడుతున్నారు.
వాళ్ళని కాసేపు మనమూ పక్కన పెడదాము. ఇంకా చాలా సమయం వుంది, వాళ్ళు మన జోలికి రావడానికి.
ఒకరిని అంటే పడే రోజులు కావివి. అంచేత నామీదే వేసుకుని చెబుతున్నాను.
కొన్నేళ్ళ క్రితం అమెరికా నుంచి మా అబ్బాయి ఏదో పనిమీద హడావిడిగా వస్తూ చుట్ట పక్కాలకు, స్నేహితులకు కొన్ని కానుకలు పట్టు కొచ్చాడు. వాటి మీద వున్న ప్రైస్ టాగ్స్ తీసేస్తుంటే నేనన్నాను, ‘అలా వుంచి ఇస్తే తీసుకున్న వాళ్లకు వాటి విలువ తెలుస్తుంది కదా’ అని. వాడన్నాడు, ‘ఏదో గొప్ప కోసం తేలేదు, అభిమానం కొద్దీ తెచ్చాను’. నాకేమనాలో తోచలేదు. కానీ భేషజాలకు సంబంధించిన ఒక పాఠాన్ని ఆ రోజు మావాడి నుంచి నేర్చుకున్నాను.
ఆ రోజు గుడికి వెళ్ళాము. అక్కడ తిరిగే ఫ్యాన్ల మీదా, వెలిగే ట్యూబ్ లైట్ల మీదా వాటిని విరాళంగా ఇచ్చిన దాతల పేర్లు రాసివున్నాయి. చేసిన పనిని గొప్పగా చెప్పుకోవడంలో తాపత్రయమే నాకు వాటిలో కనిపించింది.
ఇంటికి వస్తే టీవీలో సినిమా వస్తోంది.
‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా!’
బందీఖానాలో కొరడా దెబ్బలు తింటూ కంచెర్ల గోపన్న (భక్త రామదాసు) పాడుతున్నాడు. తాను భద్రాద్రి రాముడికి, సీతమ్మకు చేయించిన నగల జాబితాతో పాటు వాటి ఖరీదు గురించి వివరిస్తున్నాడు.
ఏవిటో ఒకదానికొకటి సంబంధం లేని అంశాలు అనిపిస్తోంది కదూ. సహజం.
అనేక అభివృద్ధి, సంక్షేమ పధకాల క్రెడిట్ తమకు దక్కాలంటే తమకు దక్కాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పడే తాపత్రయం నేపధ్యంలో చూస్తే వీటికి ఉన్న సంబంధం బోధపడుతుంది.
ప్రాజెక్టుల మీదా, పధకాల మీదా, అనేకానేక అభివృద్ధి కార్యక్రమాల మీదా ఆయా ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు భరిస్తున్నది నిజానికి ఆయా పాలక పార్టీలు కాదు, పన్నులు కడుతున్న ప్రజలు. అంటే మనము.
ప్రజలు చూసి చూసి విసుగెత్తి ఎప్పుడో అప్పుడు, రామదాసు గారు ఎద్దేవా చేసినట్టు, ‘ఎవడబ్బసొమ్మని కులుకుతూ తిరిగేరు’ అని ప్రభుత్వాలని నిలదీయకుండా జాగ్రత్త పడడం మంచిదేమో!
కొత్త సంవత్సరంలో పాలకులకు ఇదొక ఉచిత సలహా! వింటారనే నమ్మకం నాకు బొత్తిగా లేదనుకోండి.
తోకటపా:
అయిదు దశాబ్దాల పాటు రాజకీయులతో అంట కాగినందుకు ఫలితంగా నాకూ మాట తప్పే అలవాటు వచ్చినట్టుంది.
గతంలోకి జారిపోతున్న ఈ 2025 ఏడాదిలో మీరు, మాట తప్పిన ఎంతోమందిని మంచి మనసు చేసుకుని క్షమించే వుంటారు. అలాగే నన్నూ ఈ ఒక్కసారికి మన్నించండి.
అలాగే, రానున్న ఏడాది 2026 లో అయినా, మనం మనకిచ్చుకున్న మాటని నిజం చేసే ప్రయత్నం మరోసారి చేసుకుందామని ఇంకో మాట ఇచ్చుకుందాం.
పనిలో పనిగా మళ్ళీ రాజకీయ పోస్టుల్లోకి పునః ప్రవేశ ప్రయత్నం ఇది ఎంత మాత్రం కాదని మనవి చేసుకుంటున్నాను.
నా ఆరోగ్యం నాకు ముఖ్యం కదా!
కొత్త ఏడాదిలో ఆనందంగా, ఆరోగ్యంగా వుండండి అంటూ నా ఆత్మీయుల శుభాకాంక్షలు వాస్తవం చేయడం కోసమైనా నేను నా మాట నిలబెట్టుకోవాలి.
ఎల్లరకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు 🌹
కింది ఫోటో :
నేను రాజకీయ పోస్టులకు, టీవీ చర్చలకు దూరం జరిగిన ఏడాదిని గుర్తు చేసుకుంటూ





Note: Courtesy Image Owner
(ఇంకావుంది)

29, డిసెంబర్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (251) : భండారు శ్రీనివాసరావు

 

'పేరులో’నేముంది
“ఆకాశవాణి, జీవన స్రవంతి, ప్రత్యేక వార్తలు, చదువుతున్నది భభండారు శ్రీనివాసరావు.....”
“ఇంటి పేరు అంతగా ఒత్తి పలకాలా ! భండారు అంటే సరిపోతుందిగా!’
యాభయ్ ఏళ్ళ క్రితం రేడియో సహోద్యోగి వ్యాఖ్య.
ఇలా స్వరం పెంచి, నా ఇంటి పేరులో మొదటి అక్షరం వత్తు భ ను మరింత గట్టిగా వత్తి పలికినా ఫలితం లేకుండా పోయింది.
అదేమిటో నేనే కాదు చాలామందికి పేరు మీదే కాదు, ఇంటి పేరు మీద కూడా వల్లమాలిన మమకారం. బహుశా వ్యక్తిగత గుర్తింపుకు అది దగ్గరి దారి కావచ్చు.
శ్రీనివాసరావులు చాలామంది వుండవచ్చు. భండారు శ్రీనివాసరావులు పెక్కురు వుండకపోవచ్చు. వుంటే ఎడ్వర్డ్ చక్రవర్తుల మాదిరిగా ఎడ్వర్డ్ వన్, ఎడ్వర్డ్ టు అని తగిలించుకోవాలేమో!
ఇంతకీ నా ఘోష ఏమిటంటే నేను (ఒకప్పుడు) ప్రతి రోజూ వెళ్ళే టీవీల్లో కానీ, కధాచిత్ గా నా పేరు పడే పేపర్లలో కానీ ఏనాడూ నా పేరును చిత్రవధ చేయకుండా ఒదిలిన దాఖలా లేదు. బందరు శ్రీనివాస్ అనీ, బండారు శ్రీనివాసరావనీ, బండారి శ్రీనివాస్ అనీ ఇలా పలు రూపాల్లో నా పేరు దర్శనమిస్తూ వుంటుంది.
టీవీల్లో చర్చ ప్రారంభానికి ముందు మైక్ టెస్ట్ చేసేటప్పుడు అందరూ మైక్ టెస్టింగ్ వన్, టు, త్రీ అని చెబితే నేను మాత్రం ‘భండారు శ్రీనివాసరావు, భ వత్తు భ. Is it OK?’ అని అడుగుతూ వుంటాను. అయినా సరే అనేక సంవత్సరాలుగా క్రమం తప్పకుండా వారానికి రెండుసార్లు వెళ్ళే టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా ‘బండారు’ అని వత్తు లేకుండానే వేస్తుంటారు. వారిది చాలా సరళ హృదయం. పరుషపు గుండె కాదని నేనే సమాధానం చెప్పుకునేవాడిని. పోనీలే వచ్చే జన్మలో అయినా లక్ష వత్తుల నోము నోచుకుంటారులే సమాధాన పడేవాడిని.
ఓసారి ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమం గురించి మర్నాడు పత్రికల్లో వచ్చింది.
నా పేరు ‘షరా మామూలే’. పైగా ఆ పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ మూర్తి గారు ఫొటోలో నా పక్కనే వున్నారు.
ఆ రాత్రి ఇంటికి చేరి, లిఫ్ట్ లో వుండగానే, జేబులో సెల్ మోగింది.
చిన్ననాటి స్నేహితుడు. ఆప్యాయంగా పలకరించాడు.
‘ఇన్నేళ్ళ స్నేహంలో నిన్ను ఏమీ కోరింది లేదు. ఆ మాటకు వస్తే కాలేజీ వదిలిన తర్వాత నిన్ను కలిసింది కూడా లేదు. మన కామన్ ఫ్రెండ్ స్వామి దగ్గర నీ నెంబరు తీసుకున్నాను’
‘నేను రిటైర్ అయి చాలా ఏళ్ళయింది. అయినా నా చేతిలో వున్నది అయితే నిక్షేపంగా చేస్తాను. ఎక్కడ పని? ఏం పని? అవుతుందో లేదో కానీ తప్పకుండా ప్రయత్నం అయితే చేస్తాను’
‘నీ చేతిలో పనే! నీ ఇంజినీరింగ్ కాలేజీలో మా మనుమడికి సీటు కావాలి’
‘నా ఇంజినీరింగ్ కాలేజీలోనా!’ నోరెళ్ళబెట్టాను.
‘భలేవాడివే! హైదరాబాదులో ప్రతి రోడ్డు మీదా మీ కాలేజీ బస్సులే కనబడుతుంటాయని చాలామంది చెప్పారు. భలే జోకులు పేలుస్తావే’ అన్నాడు అతగాడు.
అప్పటి నుంచి రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఇంజినీరింగ్ కాలేజీ బస్సును కనిపెట్టి చూడడం మొదలు పెట్టాను. చివరికది దొరికింది. దానిమీద “బండారి శ్రీనివాస్ ఇంజినీరింగ్ కాలేజి’ అని రాసి వుంది.
ఏమి చేతురా లింగా! అనుకున్నా.
నా ఇంటి పేరును ఇలా చిత్రవధ చేస్తుంటే కలిగిన బాధ కన్నా మించిన వేదన, నా పేరును ఒక పత్రిక సరిగ్గా ప్రచురించిన రోజు అనుభవంలోకి రావడం నా జీవితంలో గొప్ప పేరడీ.
స్వాతి వారపత్రిక వారే ఓ మాస పత్రికను కూడా అదే పేరుతొ ప్రచురిస్తూ వుంటారు. ఇప్పుడు వస్తున్నదో లేదో తెలియదు.
ఒకసారి ఫేస్ బుక్ మిత్రులు ఒకరు నాకు స్వాతి మాస పత్రిక సంచికను పంపారు. ‘అందులో ప్రచురించిన ‘మమజీవన హేతునా’ అనే నవలికలో మీ ప్రస్తావన వుంది చూసుకోండి’ అని పేజి నెంబరుతో సహా తెలియచేశారు.
నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక నవలలో ప్రస్తావించ తగిన స్థాయి నాకు లేదన్న సంగతి నాకు తెలుసు. అందుకే ఆసక్తిగా తిరగేశాను.
ఆ నవలలో ‘బండారి’ అనే పాత్ర వుంటుంది. ఆ పాత్ర పరిచయం ఇలా జరుగుతుంది.
“....వాళ్లకు ఏదో సోర్స్ వుంటే వేస్తారు. మనం అడిగితే ఇంకాస్త న్యూస్ జోరు పెంచుతారు. వదిలేద్దాం’ అన్నాడు బండారి. ఆయన పూర్తి పేరు బండారు శ్రీనివాస్ రావు. ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ విభాగంలో పనిచేసి ఇటీవలే రిటైర్ అయ్యారు.......బండారి ముఖంలో రంగులు మారడం గమనించాడు భరద్వాజ.
“పిచ్చివాళ్ళు. ఆ న్యూస్ మీడియాకు నేనే ఇచ్చానని తెలీదు” అనుకున్నాడు అతడు. అతడ్ని రెండు మూడు సార్లు మీడియా చర్చల్లో కూడా చూసిన గుర్తు”
ఇదీ ఆ పత్రిక ప్రచురించిన ఆ నవలికలోని ఒక పేరా.
ఎన్నిసార్లు చదివినా నా పేరు, చేసిన ఉద్యోగం తప్ప నాకేమీ అర్ధం కాలేదు.
ఇంటి పేరులో వత్తు మినహాయిస్తే మిగిలిన వర్ణనలు అన్నీ నాకు వర్తించేలానే వున్నాయి. నేను రేడియోలో వార్తా విభాగంలో పనిచేసి రిటైర్ అయ్యాను. అప్పుడప్పుడు టీవీ చర్చల్లో కనబడుతుంటాను. నా గురించి కాదని ఎలా అనుకుంటాను?
నిజానికి ఆ పాత్రకు నా నేపధ్యం లేకున్నా తేడా ఏమీ రాదు. మరి ఆ నవల రాసిన రచయిత్రి నన్నెందుకు ఈ నవల్లోకి దింపారు.
వివరాలు చూసాను. అది రాసింది శ్రీమతి తటవర్తి నాగేశ్వరి. ఊరు కొవ్వూరు. ఫోన్ నెంబరు కూడా ఇచ్చారు.
ఫోన్ చేసి అడిగాను.
ఒక జర్నలిస్ట్ పాత్రకు నా వివరాలు వాడుకున్నామని వివరణ ఇచ్చారు.
ఆ నవలలో రాష్ట్రపతి పాత్ర కూడా వస్తుంది. దానికి అరుణ్ ముఖర్జీ అని పేరు పెట్టారు. ముఖ్యమంత్రి పేరు శేఖర్ నాయుడు. నా పేరునేమో ఇలా మార్చారు. అదీ వారి వివరణ.
రచయిత్రి తటవర్తి నాగేశ్వరి గారు కూడా బాధ పడ్డారు. అది ఆవిడ కంఠంలో ధ్వనించింది. నాకిచ్చిన మెసేజ్ లో కూడా మరోమారు కనబడింది.
“శ్రీనివాస్ రావు గారి కి నమస్కారాలు.
మీ పేరు ఒక పాత్రకు వాడాను. అన్యధా భావించకండి
మన్నించండి.
ఒక వేళ మీరు మనస్థాపానికి గురి అయితే నన్ను హృదయ పూర్వక న్గా ఛమించండి.."
(నాగేశ్వరి గారు పేరున్న రచయిత్రి. మరి ఈ భాషాదోషాలు ఏమిటి? వాట్సప్ లో తెలుగు టైప్ చేసేటప్పుడు కొన్ని ముద్రారాక్షసాలు దొర్లుతూనే వుంటాయి, అది సహజం అని సరిపుచ్చుకున్నాను)
ఇలా కూడా జరుగుతాయా అంటే జరుగుతాయి.
ఎందుకంటే ఇది జీవితం. కల్పన కాదు.
కింది ఫోటో: విషయం చెప్పక్కరలేదు, అందులోనే వుంది



(ఇంకా వుంది)

26, డిసెంబర్ 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (250): భండారు శ్రీనివాస రావు

అయాం ఎ బిగ్ జీరో ( 250): - భండారు శ్రీనివాస రావు

యోగా - రష్యన్ కనెక్షన్ 

మిహాయిల్ గోర్భచెవ్  లక్ష్మణ కుమార్ 

అరవై పడిలో పడిన వారికి గోర్భచెవ్ ఎవరో తెలిసే వుండొచ్చు. కానీ లక్ష్మణకుమార్ అనే అచ్చ తెలుగు పేరున్న కన్నడిగుడైన వ్యక్తికి ఏం సంబంధం?

తొంభయ్యవ దశకంలో రేడియో మాస్కోలో పనిచేస్తూ వున్నప్పుడు ఆ అయిదేళ్ళ పాటు సోవియట్ ప్రైం  టైం టీవీలో అస్తమానం ప్రముఖంగా కనిపించే వ్యక్తులు ఎవరయ్యా అంటే సోవియట్ యూనియన్ అధినాయకుడు మిహాయిల్  గోర్భచెవ్, ఆయనతో పాటు ఇదిగో ఈ లక్ష్మణకుమార్ గారు. 

మాస్కోలోని  భారత రాయబార కార్యాలయంలో పనిచేసే సిబ్బంది పిల్లల చదువు సంధ్యల కోసం ఎంబసీ వారు నెలకొల్పిన ఇండియన్ సెంట్రల్ స్కూల్లో యోగా టీచర్. 

అలనాటి అంటే దాదాపు ముప్పయ్ ఆరేళ్ల క్రితమే సోవియట్ పౌరులకు యోగాలో శిక్షణ ఇచ్చేందుకు వారానికి ఒకరోజు సోవియట్ ప్రైం టైం  టీవీ ఛానల్ లో నిర్విరామంగా ఒక గంటకు పైగా యోగా పాఠాలు చెబుతూ కానవచ్చే వారు.

బహుశా ఒక విదేశీ ప్రైం ఛానల్లో ప్రముఖంగా కనిపించే అవకాశం సకృత్తుగా కొందరికే లభిస్తుందేమో. అలాంటిది సోవియట్ యూనియన్ వంటి ఇనుపతెరల దేశంలో ఇది మరీ అసాధ్యం.

అలాంటి అరుదైన మహత్తర అవకాశం లక్ష్మణ కుమార్ గారికి అయాచితంగా దొరికింది.

మా ఇద్దరు పిల్లలు మాస్కోలో అదే కేంద్రీయ పాఠశాలలో చదువుతున్నప్పుడు లక్ష్మణకుమార్ గారి పిల్లలు గిరిజ, గీతేశ్ మా పిల్లలు సందీప్, సంతోష్ క్లాస్ మేట్స్. 

సరే! మా జీవితంలో ఒక అద్భుత ఘట్టానికి,ఆ నాటి సోవియట్ యూనియన్ అంగ వంగ కళింగ దేశాల మాదిరిగా విడిపోవడానికి ఒకేసారి తెర పడింది. దాంతో ఎక్కడివాళ్ళం అక్కడ తట్టా బుట్టా సర్దుకుని స్వదేశానికి తరలి వచ్చాం. 

మాస్కోలో కలిసి మెలిసి ఉన్న మా రెండు కుటుంబాలు మళ్ళీ కలవడం అన్నది పాతికేళ్ళ తర్వాత ఒకసారి జరిగింది. ఏదో పనిమీద హైదరాబాదు వచ్చిన  లక్ష్మణ కుమార్ దంపతులు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. అప్పుడు మా ఆవిడ వుంది. మళ్ళీ రెండేళ్ల క్రితం కలిశాము, ఆవిడ లేకుండా. 

చాలా బాధ పడ్డారు విషయం తెలిసి. ఏమీ చేయగలిగింది లేదు వాళ్ళు, నేనూ కూడా.
ఆయనకు 88, మనిషిలో తేడా లేదు, కొంచెం వినికిడి శక్తి తగ్గింది.  నాకు  78. చిన్నప్పటి నుంచి ఎవరి మాటా  వినే అలవాటు లేదు. అంచేత నాకూ ఒకరకంగా చెవుడే.
కులాసాగా పాత కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశాము. భోజనం చేస్తూ పాత విషయాలు నెమరేసుకున్నాము.
ఇది జరిగి రెండేళ్లు.

మళ్ళీ ఈరోజు లక్ష్మణ్ కుమార్ గారి కుమార్తె గిరిజ ఒక వీడియో క్లిప్పింగ్ పంపింది ( కింద జోడించింది అదే) 
తొంభయ్ ఏళ్ళ వయసులో లక్ష్మణ్ కుమార్ గారికి భారత ప్రభుత్వ గుర్తింపు లభించింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ యోగా రంగంలో దశాబ్దాలుగా శ్రీ లక్ష్మణ్ కుమార్ చేస్తున్న విశిష్ట సేవలకు గాను వారిని అవార్డుతో సత్కరించారు. 
అలాంటి వ్యక్తి నా కుటుంబ సన్నిహితుడు కావడం నాకు గర్వ కారణం.

అభినందనలు లక్ష్మణ్ కుమార్ గారూ!

https://www.instagram.com/reel/DSfCAvhjsTA/?igsh=MXRkZng4YnBqNWFyYQ==

20, డిసెంబర్ 2025, శనివారం

చిన్న చిన్న సంతోషాలు



రాత్రి జ్వాలా పుస్తకం ఆవిష్కరణ సభకు వెళ్లి ఇంటికి చేరే సరికి పన్నెండు గంటలు దాటింది. సభ నిరాడంబరంగా జరిగినా దానికి హాజరైనవారు ఆషామాషీ బాపతు కాదు. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ శ్రీ రామ సుబ్రమణియన్, మంత్రి శ్రీ శ్రీధరబాబు, బీజేపీ అధ్యక్షులు శ్రీ రామచంద్ర రావు, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీ ఘంటా చక్రపాణి, ఎమ్మెల్సీ శ్రీమతి వాణి మొదలైన వారితో వేదిక కళకళ లాడింది.  వేదిక మీద వారే కాదు, ఆహూతులుగా వచ్చి వేదిక కింద కూర్చున్న వారు కూడా తమతమ రంగాల్లో సుప్రసిద్దులు.  తెలంగాణా ఆవిర్భావ తులాభారంలో  తులసి దళంలా ఉపయోగ పడ్డ ప్రముఖ రాజకీయ కురువృద్ధుడు శ్రీ కే. కేశవ రావు,  తెలంగాణా మొట్టమొదటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ, ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్. వీ. సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి, శ్రీ పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఐ ఏ ఎస్, ఐ పి ఎస్ అధికారులు శ్రీ లక్ష్మీనారాయణ,  శ్రీ రావులపాటి సీతారామారావు, ఇన్ కం టాక్స్ ప్రధాన కమిషనర్ గా పదవీ విరమణ చేసిన భాస్కర రెడ్డి, ప్రెస్ అకాడమి మాజీ చైర్మన్ శ్రీ దేవులపల్లి అమర్, స్టేట్ బ్యాంక్ మాజీ సీజీఎం భండారు రామచంద్ర రావు,  ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విజయ రాఘవాచారి, తొలి పుస్తక గ్రహీత మా మేనల్లుడు, జ్వాలా బావమరిది డాక్టర్ అయితరాజు వేణు గోపాల రావు మొదలైన వారు సభాకార్యక్రమానికి కొత్త సొగసులు అద్దారు.
వక్తలు జ్వాలా గురించి ప్రశంశల వర్షం కురిపిస్తుంటే బాల్య స్నేహితుడిగా గొప్పగా గర్వపడ్డాను. 

వచ్చిన వాళ్ళు అందరూ కార్యక్రమం జయప్రదంగా జరిగిన తీరును, జ్వాలా నిర్వహణ సామర్థ్యాన్ని ప్రశంసిస్తూ తిరుగుముఖం పట్టారు. 
 ఇరవై ఏళ్లుగా కలవని వ్యక్తులు, అధికారులు చాలా మంది కలిసి గుర్తుపట్టి పలకరించడం నాకు కూడా సంతోషాన్ని కలిగించింది. ఇంతమందిని ఒక్కచోట చేర్చిన గొప్పతనం దండలో దారం జ్వాలాదే. సందేహం లేదు. 

ఎన్నో ఏళ్ళ తర్వాత కలిసిన మాజీ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి వాత్సల్యంతో ఏర్పాటు చేసిన విందును ఆస్వాదించాము.

'ఎనభయ్ ఏళ్ళా నమ్మలేము' అని పాత పరిచయస్తులు నాతో అంటుంటే  ఓ రెండు అంగుళాలు పెరిగిన ఛాతీ, ఇంటి దగ్గర కారు దిగినప్పుడు అర అంగుళానికి కుంచించుకు పోయింది.

మా ఇంటి ఎదుట రోడ్డు నిర్మాణంలో ఉన్నందున అడ్డంగా వేసిన కాంక్రీటు స్థంభాలకు తగిలి కాలి బొటన వేలు చిట్లి దేవతలు కనపడ్డప్పుడు వయసు చేసే వింతలు అనుభవం లోకి వచ్చాయి. 

అంతటితో సరి అనుకోకుండా
లిఫ్ట్ నాలుగో అంతస్తులో ఇరుక్కుపోయి పనిచేయడం లేదు. ఈసురోమంటూ ఆ రాత్రి వేళ మూడు అంతస్తులు ఎక్కి ఫ్లాటు తాళం తీయబోతే అది తెరుచుకోలేదు. ఇంట్లో మా పెద్ద కోడలు భావన, కటక్ నుంచి వచ్చిన చిన్నకోడలు కజిన్ నందిక మంచి నిద్రలో వున్నారు. నా దగ్గర తాళం చెవి వుందని చెప్పాను కానీ లోపల నుంచి తలుపు గడియ పెట్టవద్దని చెప్పలేదు. ఇద్దరికీ కొత్త. తెలియక గడియ పెట్టుకుని పడుకున్నారు. ఇన్నాళ్లు కాలింగ్ బెల్ తో అవసరం పడక, అది సరిగా పనిచేయడం లేదన్న సంగతి అప్పుడు తెలిసింది. ఇద్దరూ ఐ టీ రంగం వాళ్ళు కాబట్టి మొబైల్స్ సైలెంట్ మోడ్ లో పెట్టుకుని పడుకున్నట్టున్నారు. బయట చలి. ఏం చేయాలో తెలియలేదు. ఈ పరిస్థితిలో తెల్లార్లు జాగారం చేయడం ఎల్లారా అనుకుంటూ మధ్య మధ్య కాలింగ్ బెల్ నొక్కుతున్నాను. వేడి పెనం మీద నీళ్లు పడితే సువ్వు మన్నట్టు అది నీరసంగా వినీవినపడని చప్పుడు చేస్తోంది. పట్టు విడవని విక్రమార్కుడిలా ప్రయత్నం చేస్తూ పోయాను. 
కొంతసేపటి తర్వాత తలుపు తెరుచుకుంది. మధ్యలో నిద్ర లేచిన నందికకు కాలింగ్ బెల్ చప్పుడు లీలగా వినపడి తలుపు తీసింది.

బతుకు జీవుడా అనుకుంటూ లోపలకు వెళ్లి కాలి బొటన వేలికి ఆయింటు మెంటు రాసుకుని మంచం మీద నడుం వాల్చిన తర్వాత తెలిసి వచ్చింది వయసు నిజంగా ఎనభయ్యే అని, లేనిపోని బడాయిలు పనికి రావని.

ఇలాంటివన్నీ ఇబ్బందులే, కష్టాలు కావని పెద్ద కోడలు భావన బోధించిన భగవద్గీత గుర్తుకు వచ్చిన తర్వాత స్వాంతన కలిగింది.

ఫంక్షన్ బ్రహ్మాండంగా జరిగిందని దాన్ని గురించి రాయకుండా మధ్యలో ఈ ఉపాఖ్యానం.

ఎలాగూ నిద్ర ఎగిరిపోయింది. 
అందుకే అర్ధరాత్రి ఈ అంకమ్మ శివాలు.
నిద్ర అంటారా! 
రేపు అనేది ఒకటి వుంది కదా నిద్ర పోవడానికి.

తోక టపా:
సభా కార్యక్రమం నడుమ ఒక దృశ్యం నా కంటిని ఆకట్టుకుంది. 
జ్వాలా అందరి ప్రసంగాలకు ఉచిత రీతిలో జవాబు చెప్పి కూర్చోగానే దాహం వేసిందేమో, నీళ్ల కోసం సైగ చేశాడు. సభామధ్యంలో వున్న జ్వాలా ఏకైక కుమారుడు ఆదిత్య, కోడలు పారుల్  ఆ విషయం గమనించి వెంటనే వాటర్ బాటిల్ తెచ్చి అందించారు. 

ఇదేమంత పెద్ద విషయం అంటారా.
అతి పెద్ద బహుళ జాతి కంపెనీల్లో మేమెవ్వరం ఊహించలేనంత అతి పెద్ద హోదాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళు. అయినా ఎలాంటి భేషజం లేకుండా బయటకు వెళ్లి నీళ్ల బాటిల్ వెతికి పట్టుకు వచ్చి ఇవ్వడం నాకు చాలా సంతోషం కలిగించింది.
ఒక వయసు వస్తే కానీ ఇటువంటి విషయాల్లో దాగున్న మధురిమ ఏమిటో అర్ధం కాదు.

17, డిసెంబర్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో : ( 249 ) : భండారు శ్రీనివాసరావు

 ఆకాశంలో సగం :  సగం అబద్ధం

‘ఆఫీసు పనిమీద మూడు రోజులు హైదరాబాదు వస్తున్నాను. అదీ మీ పెళ్లి రోజున.  మీకు ఏమి తేవాలి పాపా అన్నది నా పెద్ద కోడలు భావన అమెరికా నుంచి.  

‘నాకు ఇక్కడ లోటు ఏమున్నది? వచ్చి కొద్ది రోజులు వుంటాను అంటున్నావు, అంతకంటే నాకేమి కావాలి ఈ వయసులో’ అన్నాను నేను.

అన్నట్టే డిసెంబరు పదహారు సాయంత్రం వచ్చింది. విమానం ఆలస్యం కావడంతో ఇంటికి వచ్చేసరికి ఏడున్నర అయింది. కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేసరికి పొద్దు పోయింది.

మరునాడు ఉదయం లేచే సరికి ఇదీ సీను. మనసు ఎటో వెళ్ళిపోయింది.

   

మీరలా కాసేపు ప్రెస్ క్లబ్ కి వెళ్లి రండి. ఇంట్లో వుండి ఇలా కాళ్ళకు చేతులకు అడ్డం పడుతూ, వచ్చిన పనివాళ్ళని కసురుకుంటూ వుంటే ఇల్లు సర్దడం ఇప్పట్లో కాదు’ అనేది మా ఆవిడ మేము ఇల్లు మారినప్పుడల్లా.

అన్నీ ఒక పద్దతిగా చేయాలనేది నా థియరీ, అసలు ఏ పద్దతి నాకు తెలియకపోయినా.

ముందు బీరువాలు పెట్టాలి, తర్వాతే మంచాలు. అప్పుడు అన్నీ తేలిగ్గా అమరుతాయి. ఆ మాటే వచ్చిన వర్కర్లతో చెప్పాను అంటే మా ఆవిడ వినిపించుకునేది కాదు. ‘చెబితే చెప్పారు, అలా కసురుకుంటూ చెప్పడం ఏమిట’ని లా పాయింటు తీసేది. దాంతో ఆమె చెప్పినట్టే ఎక్కడో కాలక్షేపం చేసి ఇంటికి వచ్చేసరికి చిందరవందరగా వున్న ఇల్లు కాస్తా కడిగి తుడిచిన అద్దంలా కనిపించేది.

మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత నిద్ర లేచి చూసేసరికి ఇల్లు  కడిగిన అద్దంలా వుంది.

తెల్లవారుఝాము వరకూ ఆన్ లైన్ లో ఆఫీసు పని చేస్తూ, తెల్లవారగానే ఇల్లు సదిరే కార్యక్రమం పెట్టుకుంది. ఆడ దక్షత లేని ఇల్లు ఎలా వుండాలో అలా వుంది. విషయం గ్రహించిన పిల్ల కనుక పొద్దున్నే ఈ పని పెట్టుకుంది. ఎందుకమ్మా ఈ శ్రమ అని అడిగితే జెట్ లాగ్ తప్పించుకోవడానికి అని నా నోరు మూయించింది.    

స్త్రీ జాతిని 'ఆకాశంలో సగం' అంటూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తే వాళ్లు నేటి సమాజంలో ఎక్కువగానే కానవస్తారు. చేతల దగ్గరికి వచ్చేసరికి ఈ మాటలు నీటి మూటలుగానే మిగిలిపోవడం కద్దు.

కొన్నేళ్ళ క్రితం ఒక వార్త కొన్ని పత్రికల్లో చాలా చిన్నగా వచ్చింది. ఆ వార్తకు ఇవ్వాల్సినంత ప్రాముఖ్యం ఇవ్వలేదేమో, ఆ అంశానికి దొరకాల్సినంత ప్రాచుర్యం లభించలేదేమో అనిపించింది, చదివిన తర్వాత. ఆ వార్త ఏమిటంటే-

ఆన్ లైన్ వ్యాపారం చేస్తున్న ఫ్లిప్ కార్ట్ అనే ఒక సంస్థ యాజమాన్యం, తమ దగ్గర పనిచేసే మహిళా సిబ్బందికి కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఉద్యోగినులకు ఇచ్చే ప్రసూతి సెలవులను ఇరవై నాలుగు వారాలకు పెంచింది. అంటే సుమారు ఆరు మాసాలపాటు జీతంతో కూడిన సెలవు. అంతే కాదు, ప్రసూతి సెలవు అనంతరం తిరిగి విధుల్లో చేరే ఉద్యోగినులకు నాలుగు నెలలపాటు పనివేళల్లో, వారికి వీలయిన సమయాల్లో పనిచేసుకునే వెసులుబాటు కల్పించింది.

చట్టం ప్రకారం ఉద్యోగినులకు ఇవ్వాల్సిన సెలవుల్ని మించి ఈ కంపెనీ తమ మహిళా సిబ్బందికి ఈ సదుపాయాలను కల్పించడం విశేషం.

సరే. షరా మామూలుగానే ఈ రాయితీలకు వక్ర భాష్యాలు వెలువడ్డాయి. తమ సంస్థలో పనిచేసేందుకు అధిక సంఖ్యలో ఆడవారిని ఆకర్షించేందుకు ఫ్లిప్ కార్ట్ కంపెనీ ఈ నిర్ణయాలు తీసుకుందని వాటి తాత్పర్యం.

వెనుక కమ్యూనిష్టుల ఏలుబడిలో వున్న సోవియట్ యూనియన్ లో ఆడవారికి ఈ రకమైన రాయితీలు ఇవ్వడం నేను స్వయంగా చూసాను. గర్భవతులయిన ఉద్యోగినులకు, గర్భం ధరించిన సమాచారం తెలియచేసినప్పటి నుంచి, సుఖ ప్రసవం జరిగి, పుట్టిన బిడ్డ బుడి బుడి నడకలు నడిచే వయస్సు వచ్చేవరకు ఆ బిడ్డ ఆలనా పాలనా కనిపెట్టి చూసుకునేందుకు వీలుగా తల్లులకు జీతంతో కూడిన సెలవు ఇచ్చేవారు.

నిజానికి గత రెండు దశాబ్దాల కాలంలో మనదేశంలో మహిళలు గణనీయమైన పురోగతి సాధించడం కళ్ళారా చూస్తున్నాం. ఓ అరవై ఏళ్ళక్రితం ఆడపిల్ల ఇంటి గడప దాటి అడుగు బయట పెట్టడం కనాకష్టం. 'ఆడపిల్లకు చదువెందుకు, ఇంట్లో ఏవో పద్దులు రాసుకునే అక్షర జ్ఞానం వుంటే చాలు' అని పెద్దవాళ్ళు అంటూ వుండడం నాకెరుక. నూటికో కోటికో చదువుకున్న ఆడవాళ్లు కనిపిస్తే విడ్డూరంగా చూసే కాలం గడిచిపోయి ఎన్నో ఏళ్ళు కాలేదు. సైకిల్ తొక్కే ఆడపిల్లల్ని రౌడీ పిల్లలు అనేవాళ్ళు. లంగా ఓణీ కాకుండా చుడిదార్ వేసుకుంటే నోటితో కాకపోయినా నొసటితో వెక్కిరించేవాళ్ళు.

మార్పు అనేది కాల ధర్మం. అందుకే కాలం మారింది. ఇంకా మారుతోంది. మగా ఆడా తేడా చదువుల్లో లేకుండా పోయింది. కాకపొతే, చదువుకున్న ఒక తరం ఆడవాళ్ళు, చదివిన చదువుకు సార్ధక్యం లేకుండా మళ్ళీ గృహిణులుగానే ఇంటి పనులకు పరిమితం అయిపోయారు. దానితో, 'చదువుకుని ఏం చేస్తారు ఉద్యోగాలు చేస్తారా, వూళ్ళు ఏలాలా?' అనే కొత్త వ్యంగ్యాస్త్రాలు వ్యవహారంలోకి వచ్చాయి.

ముందే చెప్పినట్టు మారుతూ పోవడం కాల ధర్మం. తరువాతి తరం ఆడపిల్లలు మగ పిల్లలతో పోటీలు పడి చదువుల్లో రాణిస్తూ వస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. వేడి నీళ్ళకు చన్నీళ్ళ మాదిరిగా వారి సంపాదనలు కుటుంబ ఖర్చులకు అవసరం కావడంతో మగవాళ్ళే సర్దుకుపోయి, ఉద్యోగం చేసే ఆడపిల్లలకి పెళ్లి చూపుల్లో ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టారు. అంతటితో మార్పు ఆగలేదు.

మారుతున్న కాలానికి అనుగుణంగా, ఆర్ధిక సంస్కరణల పుణ్యమా అని రాత్రింబవళ్ళు పనిచేయాల్సిన కొత్త కొలువులు వచ్చి పడ్డాయి. వాటికి తగ్గట్టే మంచి మంచి జీత భత్యాలు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా ఆ జీతాలు కూడా సంసారాలకు తప్పనిసరి అవసరంగా మారిపోయాయి. ఈ ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లలు ఈనాడు లెక్కకు మిక్కిలిగా కనిపిస్తున్నారు. మగ పిల్లల మాదిరిగానే కన్న తలితండ్రులను, వున్న వూరినీ విడిచి వెళ్ళి పరాయి వూళ్లల్లోనే కాదు, పరాయి దేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ రీత్యా ఆర్దిక స్వాతంత్రం అయితే ఆడవారికి కొంత వరకు వచ్చింది. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఆ మేరకు వారికి లభిస్తోందా అంటే చప్పున జవాబు చెప్పలేని పరిస్తితి.

ఉదాహరణకు సినీ రంగంలో రాణిస్తున్న తారల సంగతే తీసుకుందాం. ఆదాయం బాగానే వున్నా మగ తారల మాదిరిగా సంపాదించుకున్న ఆస్తిపాస్తులను కాపాడుకోలేని పరిస్తితి ఆ రంగంలో ఎక్కువ. అన్నింటికీ ఎవరిమీదనో ఆధారపడాల్సిన స్తితే.

సరే! ఇవన్నీ బాగా చదువుకుని, బాగా సంపాదిస్తూ వున్న మహిళల సంగతి. కుటుంబ ఆర్థిక స్తితి గతులు మెరుగు పరచడంలోనే కాదు, దేశ ఆర్ధిక వ్యవస్థ పురోగమనంలో కూడా వీరి పాత్ర తక్కువేమీ కాదు. ఆ మేరకు వారికి జాతి రుణపడి వుండాలి.

మరో రకం ఆడవారు కూడా వున్నారు. నిజానికి వీరి జనాభానే అధికం. వీరు చదువు సంధ్యలు లేనివాళ్ళు. అధవా చదువుకున్నా ఏదో నాలుగు పొడి పొడి అక్షరం ముక్కలే. చిన్న చిన్న పనిపాట్లు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్న వారు. తమ కుటుంబాలకు ఆర్ధికంగా సాయపడుతున్నవారు. సంపాదన వుందన్న మాటే కాని దానిపై పెత్తనం బొత్తిగా లేనివాళ్ళు. గ్రామాల్లో పొలం కూలీలుగా పనిచేసుకుంటూ, బస్తీల్లో అయితే నాలుగిళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ, నాలుగు రాళ్ళు పోగేసి మొగుడి చేతిలో పోసి చేతులు దులుపుకునే వాళ్లు. తమ చెమటతో తడిసిన ఆ సొమ్మును వాళ్లు తాగుడు కోసం తగలేస్తున్నా నోరు తెరిచి అడగలేని మూగవాళ్ళు. వీరికి బొత్తిగా ఆర్ధిక స్వాతంత్రం లేదు, పోనీ వ్యక్తిగత స్వేచ్చ వుందా అంటే అదీ లేదు. మరబొమ్మల్లా కాయకష్టం చేసి నాలుగు డబ్బులు సంపాదించడం తప్ప.

మరో వివక్షకు కూడా వీరు గురవుతున్నారు. చేసేది ఒకే పని అయినా దినసరి కూలీ డబ్బులు ఆడవారికి వేరే, మగవారికి వేరే. ఆడవాళ్లు చేసే ఇంటి పనిని కూడా పరిగణనలోకి తీసుకుంటే, బయట పనిపాటుల్లో వారికి ముడుతున్నది నామమాత్రమే.

ఇలాటివారు నేటి సమాజంలో ఎల్లెడలా కనిపిస్తారు. పనికి తగ్గ వేతనాలు వుండవు. పని వేళలూ వుండవు. రాత్రీ పగలూ తేడా లేకుండా పనిచేస్తారు. పనిచేసిన రోజున బాగా చేసావు అనేవాళ్ళూ వుండరు. పనికి రాని రోజున 'మా నాగాల రాణి ఇవ్వాళ రాలేదు, ఎగనామం పెట్టింది' అనే సన్నాయి నొక్కులకు మాత్రం తక్కువ వుండదు. మరి వీరి జీవితాలు మారేదెన్నడో!

అరవై ఏళ్ళ క్రితం గడప దాటని ఆడవాళ్ళను చూసాను. అదే కళ్ళతో చదువుకుని ఉద్యోగాలు చేసేవాళ్ళను ఈనాడు చూస్తూ వున్నాను.

కాల ధర్మం మీద నమ్మకం వున్నవాడ్ని. చివర చెప్పిన బడుగు బలహీనవర్గాల ఆడవారికి కూడా మంచి కాలం రాకపోతుందా? నేను చూడక పోతానా?

కింది ఫోటో: ఇంటి సంప్రోక్షణకు నడుం బిగించిన పెద్ద కోడలు భావన ( వాళ్లకు సోషల్ మీడియాలో కనబడడం అస్సలు నచ్చదు. అందుకే యాంగిల్ మార్చి ఫోటో తీశాను)




(ఇంకావుంది)  

15, డిసెంబర్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (248) : భండారు శ్రీనివాసరావు

 

మా పెళ్లి రోజు ఓ చేదు జ్ఞాపకం
ఆరేళ్ల క్రితం ఆగస్టు నెల మొదటి వారంలో మిత్రుడు జ్వాలా, మా మేనకోడలు విజయలక్ష్మి దంపతుల యాభయ్యవ వివాహ వార్షికోత్సవం జరిగింది. హితులు, సన్నిహితులు, చుట్టపక్కాల నడుమ జ్వాలా దంపతుల పిల్లలు ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగలా నిర్వహించారు.
“మరో రెండేళ్లలో మీ గోల్డెన్ జూబిలీ. రెడీగా వుండు దుర్గత్తయ్యా!” అంది మా మేనకోడలు మా ఆవిడ నిర్మలతో.
దేవతలకు ఉన్నట్టే మాఆవిడకు అనేక పేర్లు. పుట్టినప్పుడు కన్న తలితండ్రులు బియ్యంలో రాసి పెట్టిన పేరు కనకదుర్గ. కానీ ఆమె పుట్టింటి వాళ్ళందరూ చిట్టి అనే పిలిచేవాళ్ళు. పెళ్లి అయిన తర్వాత మా బామ్మ గారు నిర్మల అని మార్చింది. స్నేహితులందరికీ ఇదే పేరు వాడుక. చుట్టాల్లో చాలామందికి చుట్టరికం ఏదైనా అందరికీ ఆవిడ దుర్గత్తయ్యే.
సిల్వర్ తప్పితే మా ఆవిడకు గోల్డ్ ఇష్టం లేనట్టుంది. అందుకే అప్పటిదాకా ఆగకుండా వెళ్ళిపోయింది.
రేపు డిసెంబరు పదహారు మా పెళ్లిరోజు.
ఆ రోజు గురించి తలచుకుని మురిసిపోయే మంచి సంగతులేవీ మాకు లేవు. ఎందుకంటే అది కన్నీళ్ళ పెళ్లి.
1971 డిసెంబరు 15 వ తేదీ రాత్రి మద్రాసు నుంచి అంబాసిడర్ కారులో తిరుపతి ప్రయాణం. దారిలో భోరున వాన. అట్లా ఇట్లా కాదు, ఉరుములు, మెరుపులు, పిడుగులు. నా వంటి వాడితో తన భవిష్యత్ జీవితం ఎలా వుండబోతోందో సూచనాప్రాయంగా మా ఆవిడకి చెప్పడానికా అన్నట్టు వుంది ప్రకృతి బీభత్సం.
మధ్య మధ్యలో ఆగుతూ, తెల్లారేలోపునే తిరుమల చేరాము. ఒక కాటేజీలో పైన గదులు తీసుకున్నాము.
మా ఆవిడ పిన్నివసుంధర కొన్న నీలం రంగు ఫారెన్ నైలెక్స్ చీరే పెళ్లి చీరె. నేను ధోవతి కట్టుకున్నానో, ప్యాంటు షర్టుతో పెళ్లి చేసుకున్నానో గుర్తు రావడం లేదు. ఎందుకంటే సందర్భం, సన్నివేశం అలాంటివి. ప్రత్యేకంగా ముహూర్తం అంటూ లేదు కనుక, తొమ్మిదీ పది గంటల నడుమ పెళ్లి జరిగిపోయింది. వెంటనే వెళ్లి బాలాజీ దర్శనం చేసుకున్నాము.
ఇప్పట్లోలా క్యూ లైన్లు లేవు. కొండ దిగి వచ్చి భోజనం చేసి వచ్చిన కారులోనే మళ్ళీ మద్రాసు వెళ్ళాము. మా ఆవిడ స్నేహితులు టీ నగర్ హోటల్లో విందు ఇచ్చారు. అటునుంచి మా మామగారి వద్దకు వెళ్లాం. కూతుర్ని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. “నీకు ఏం తక్కువ చేస్తానని అనుకుని ఇలా పెళ్లి చేసుకున్నావ”ని మా ఆవిడను అడిగారు. కన్నీళ్ళే జవాబు.
రైళ్ళలో రిజర్వేషన్ల గొడవ లేని రోజులు. అంచేత 16 వ తేదీ రాత్రి రైల్లో బయలుదేరి మర్నాడు ఉదయం బెజవాడ చేరుకున్నాము. రిక్షా చేసుకుని మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారింటికి వెళ్ళాము. మా అమ్మగారు కూడా అక్కడే వుంది.
మమ్మల్ని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. కాళ్ళకు దణ్ణం పెట్టగానే దగ్గరకు తీసుకుని మనసారా ఆశీర్వదించింది.
‘పెళ్లి వద్దు! పెళ్ళాం కావాలి’ అనే నా మొండి పట్టుదల ఫలితం మా ఈ పెళ్లి. ఇరువైపుల పెద్దల చేత కళ్ళ నీళ్ళు పెట్టించింది కూడా, బహుశా అదే ఆఖరిసారి కావచ్చు.
పెళ్లి అనేది ఇద్దరి మధ్య వ్యవహారం. మూడో వ్యక్తికి ఇందులో సంబంధం లేదు. పెళ్లి మీద ఖర్చుచేయడం వృధా అనే సిద్దాంతాన్ని నాకు నేనే ప్రతిపాదించుకుని, దాని మీదే భీష్మించుకుని కూర్చోవడంతో, మా ప్రేమ పెళ్ళికి పెద్దల ఆమోదం లభించినా, కొన్నేళ్ళు గా వాయిదా పడుతూ వచ్చింది.
ఒక్కగానొక్క పిల్లకు గుళ్ళో పెళ్లి చేయలేను అనే మా మామగారి వాదన నేను పట్టించుకోలేదు.
అందుకే ఆయన ఇష్టపడిన పెళ్లిని, ఇష్టం లేని గుళ్ళో పెళ్ళిగా చేసుకోవాల్సి వచ్చింది.
పెద్దతనంలో ఇప్పుడు తలచుకుంటే అప్పుడు చేసిన పని చిన్నతనంగా అనిపిస్తుంది.
ఏదిఏమైనా అన్నింటినీ నా జ్ఞాపకాలకు వదిలేసి తాను తప్పుకుని వెళ్ళిపోయింది. పెళ్ళంటే నా ఇష్టప్రకారం చేసుకున్నాను. ఇది నా చేతిలో లేదుగా!
నా గురించి తప్ప తన గురించి ఆలోచించుకోవడానికి సుతరామూ ఇష్టపడని ఓ వింత మనిషి, 1971 డిసెంబరు పదహారు నుంచి నా జీవితంలో ఒక విడరాని ప్రధాన భాగమై పోయింది. నేను ఎన్నటికీ తీర్చుకోలేని రుణం ఈ ఒక్క వ్యక్తికే!
గ్రహపాటున తీర్చుకుంటానేమో అనే సందేహం కలిగిందేమో, నాకు ఆ అవకాశం ఇవ్వకుండా ముందుగానే దాటిపోయింది.
ప్రతి ఏటా డిసెంబర్ 15 వ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటలకు నన్ను నిద్ర లేపి మృదువుగా షేక్ హాండ్ ఇచ్చేది. మర్నాడు ఉదయం అంటే డిసెంబర్ 16 ఉదయం మళ్ళీ నిద్ర లేపి కాళ్ళకు దణ్ణం పెట్టేది. అప్పుడు కానీ నాకు లైట్ వెలిగేది కాదు డిసెంబర్ 16 మా పెళ్లి రోజని. కలిసి గుడికి పోవాలని తనకు మనసులో కోరిక. నాకేమో టీవీ చర్చలతో సమయం దొరికేది కాదు. తానే ఒంటరిగా వెళ్లి అర్చన చేయించి వచ్చేది.
ఒక ఏడు కాదు రెండేళ్ళు కాదు ఇలా 48 సంవత్సరాలు ఇదే విధంగా గడిచిపోయాయి.
బుద్ధి తక్కువ వాడిని, ఇన్నేళ్ళలో ఒక్కటంటే ఒక్కరోజయినా గుర్తు పెట్టుకుని నేనే ముందుగా ఆమెకు షేక్ హాండ్ ఇచ్చివుంటే....
ఇప్పుడిలా ఆ విషయాలను గుర్తుచేసుకుని మధన పడే అవకాశం వుండేది కాదేమో!
బ్యాడ్ లక్!
దండలు కూడా లేని పెళ్ళికి ఫోటోలు ఏమి వుంటాయి?
కింది ఫొటోలు: పెళ్లి కాక ముందు, పెళ్ళయిన కొత్తల్లో, ఇప్పుడు, మూడేళ్ల క్రితం కాబోలు తిరుపతి వెళ్ళినప్పుడు మేము పెళ్లి చేసుకున్న కాటేజీ ముందు ఒంటరిగా నిలబడి తీసుకున్న ఫోటో









(ఇంకా వుంది)
15-12-2025