ఒకరోజు కోటీశ్వరుడు
కలర్ బ్లైండ్ నెస్.  దీన్ని తెలుగులో ఏమంటారో తెలవదు. రంగులు సరిగా
గుర్తుపట్ట లేకపోవడం అని విన్నాను. ఈ కంటి జబ్బు నాకు లేదు. అయినా చప్పున కలర్లు
గుర్తుంచుకోలేను. అంటే నిన్న కలిసిన మనిషి ఏ రంగు చొక్కా వేసుకున్నాడు అని మర్నాడు
ఎవరైనా అడిగితే నేను చప్పున జవాబు చెప్పలేను.
రవికాంచనిచో కవిగాంచును అన్నట్టు
కొన్ని అత్యల్ప స్వల్ప విషయాలు కూడా జర్నలిస్టుల దృష్టిని దాటిపోలేవని ఒక్కోసారి
అనిపిస్తుంది. 
ఏపీ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు వై.ఎస్.  జగన్ మోహనరెడ్డి తిరుమల
తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు.
అంతకు ముందు ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి నుదుటిమీద తిరునామాలు దిద్ది ఆయన తలకు
పరివట్టం (పట్టు వస్త్రంతో తలపాగా) చుట్టి శేష వస్త్రాన్ని మెడపై ధరింప చేశారు.
సరే ఈ విశేషాలన్నీ టీవీల్లో ప్రసారమయ్యాయి. అయితే ఒక  టీవీ జర్నలిస్టు తలపాగా రంగును పసికట్టి, అది
అధికార వైసీపీ రంగును పోలి వుందని పాయింటు తీశారు. అంతటితో ఆగకుండా గతంలో
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పసుపు రంగు పరివట్టం చుట్టారని
గుర్తు చేస్తూ, టీటీడీ
అధికారులు కూడా ఏ ఎండకాగొడుగు మాదిరిగా పాలక పక్షాలను బట్టి తలపాగా రంగులు
మారుస్తున్నారా అంటూ  మరో  పాయింటు లేవదీశారు. ముందే చెప్పినట్టు
నాకు రంగులు గుర్తుండవు కనుక నేనేమీ చెప్పలేను.
అయితే ఈ సందర్భంలో నాకు ఓ సొంత అనుభవం గుర్తుకు
వచ్చింది.
చంద్రబాబునాయుడు దాదాపు పదేళ్లు ముఖ్యమంత్రిగా
పనిచేసి దిగిపోయిన తర్వాత వై.ఎస్. రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ
అధికారంలోకి వచ్చింది. నేను అప్పుడు దూరదర్సన్ కరస్పాండెంటుగా
పనిచేస్తున్నాను. ముఖ్యమంత్రిగారి స్వాతంత్ర దినోత్సవం సందేశం కాబోలు రికార్డు
చేయాలి. షరా మామూలుగా ఆ సందేశం స్క్రిప్ట్ కాపీ ఓ ప్లాస్టిక్
ఫోల్డర్ లో పెట్టుకుని సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రిగారి ముఖ్య పౌర సంబంధాల
అధికారికి అందచేసాను. ఆయన దాన్ని అందుకుంటూ మందహాసం చేస్తూ ‘ఏమండీ రాష్ట్రంలో
ప్రభుత్వం మారిన సంగతి మీరింకా గుర్తించినట్టు లేదు’ అన్నారు సరదాగా. 
ఏమిటా అని చూస్తే ఆ ప్లాస్టిక్ ఫోల్డర్ రంగు
పసుపు. ఆయన రెడీ విట్ కి నాకూ నవ్వు వచ్చింది.
ఇది ఎందుకు చెబుతున్నాను అంటే ముఖ్యమంత్రులు, ప్రధాన
మంత్రుల కొలువుల్లో పనిచేసేవారికి అంతటి నిశిత పరిశీలన వుండాలి. దాన్ని మనం
తప్పుపట్టలేము కూడా.
కొన్నేళ్ళ క్రితం ప్రముఖ నటుడు చిరంజీవి, అప్పటి  ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన రెడ్డిని
కలుసుకున్నప్పుడు ఆయన మర్యాదపూర్వకంగా
ముఖ్యమంత్రికి కప్పిన
శాలువ రంగుపై కొంత చర్చ నడిచింది. ఆ శాలువా రంగు పసుపు రంగు కావడం ఈ చర్చకు కారణం.
అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా  ధరించిన
దుస్తుల రంగు నీలివర్ణం అని మరో మిత్రుడు చెప్పారు.  ఏవో కానీ,  ఈ రెండు వాదనలు నాకు నచ్చవు. రాజకీయాల్లో రంగులు
మార్చేవారు ఉండవచ్చు. కానీ, రంగుల్లో
రాజకీయాలు వుండవు.
నిజానికి పసుపు రంగు అనేది తెలుగు దేశం
ఆవిర్భావానికి ముందు నుంచి వుంది. అలాగే నీలి రంగు వైసీపీ పుటకకు ముందు నుంచీ
వుంది. మరి ఎందుకీ వర్ణ వివక్ష!
మనం పెట్టుకున్న కళ్ళజోడు రంగుబట్టి మనకు
కనబడే రంగు వుంటుంది.
ఈ రంగులతో నేనూ ఓ సారి ఇబ్బంది పడ్డాను. 
దాదాపు నలభయ్ ఏళ్ళయింది నేను  కోటు
వేసుకుని. అదీ మాస్కో చలికోసం. అక్కడ మన ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా దుస్తులు
వేసుకోవాల్సిందే. లేకపోతే అక్కడ చలికి గడ్డకట్టుకుని పోతాం. మళ్ళీ చాలా ఏళ్ళ
తర్వాత కోటు వేసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. 
జెమినీ టీవీలో చర్చాకార్యక్రమాలు నిర్వహించే పాత
రోజుల్లో సంగతి ఇది. జెమినీ
వాళ్ళు ఆ ఒక్కరోజు నన్ను కోటీశ్వరుడిని చేశారు.
బ్లూ మాట్ నేపధ్యంలో బ్లూ కలర్ అక్కడ స్టుడియోలో
పనికిరాదు. మామూలుగా షూట్ చేసే స్టూడియో కాకుండా వేరే స్టూడియోలో చర్చ పెట్టడం
వల్ల,  ఆ రోజు
నేను వేసుకున్న బ్లూ కలర్ బుష్ షర్ట్ అక్కడి కెమెరా కంటికి బొత్తిగా నచ్చలేదు.
అంచేత అప్పటికప్పుడు వాళ్ళ వాడ్రోబ్ నుంచి ఒక కోటు తెచ్చి నాకు కప్పారు. చలికాలం
బాగానే వుంది కానీ మాట్లాడింది రైతుల ఆత్మహత్యల మీద. ఆ చర్చాంశానికి ఈ కోటు అవతారం
బొత్తిగా పొసగదని నాకనిపించింది. కానీ ఏం చేస్తాం కెమెరా కంటికి తలవంచక తప్పలేదు.
అదృష్టం ఏమిటంటే మా ఆవిడ ఇటువంటి చర్చలు బొత్తిగా
చూడదు. లేకపోతే ఈ చొక్కా మార్పిడి, పాత కోటు కప్పుడు  వ్యవహారం మా
ఇంట్లో చర్చనీయాంశం అయ్యేదేమో! మనలో మాట. ఆవిడ ఈ ఫేస్ బుక్ వైపు కూడా కన్నెత్తి
చూడదు. (చూసేది కాదు)
అదన్నమాట!
Disclaimer
: ఇది ఏవిధంగాను రాజకీయ పోస్టు కాదు
 
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి