మా కోడలు బంగారం
అక్టోబర్
రెండు, 2024.
వారాణాసి
నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం.
ఎనభయ్
ఏళ్ళ జీవితంలో నేను కాశీ వెళ్ళింది నాలుగంటే నాలుగు సార్లు. చాలాసార్లు ఎవరో
వెడుతూ రమ్మంటే తోడు వెళ్లినట్టు వెళ్లి తిరిగి రావడమే. ఒకసారి మాత్రం మా అమ్మగారి
మరణానంతర అంత్య క్రియలు అక్కడ జరపాలని మా
పెద్దన్నయ్య నిర్ణయించడంతో మా కుటుంబంలో పెద్దలు, పిన్నలం అందరం కలిసి, ముప్పయి
మందిమి రైల్లో కాశీ, ప్రయాగ, గయ క్షేత్రాలకు వెళ్లి వారానికి పైగా
అక్కడే గడిపాము. ప్రతిసారీ ఆంధ్ర ఆశ్రమంలోనే మా బస. యాత్రకు యాత్రకు నడుమ పదేళ్ల వ్యవధానం వున్నా
కూడా ఎప్పుడు వెళ్ళినా, కాశీ ఎలాంటి మార్పు లేకుండా ఒకే తీరున వుంది.
నిరుడు
కాశీ వెళ్ళినప్పుడు మేము మూడు రోజులు బస
చేసింది చెన్నైకి చెందిన ప్రముఖ నగల వ్యాపార సంస్థ GRT ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అతిథి
భవనంలో. ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి కారులో గంట ప్రయాణం. సెప్టెంబరు 29 సాయంత్రం లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ
విమానాశ్రయం బయటకు రాగానే, యాత్ర ఆరంభం అదిరింది. ట్రావెల్స్
తరపున కొందరు వచ్చి, హైదరాబాదు నుంచి వచ్చిన మా పద్నాలుగు మందికి మెళ్ళో దండలు వేసి మరీ స్వాగతం చెప్పారు, ఏదో స్టార్ హోటల్ మర్యాదల మాదిరిగా.
సిద్ధంగా వుంచిన మూడు ఇన్నోవా కార్లలో జీ ఆర్ టి గెస్ట్ హౌస్ కి చేరాము. భవనం
మొత్తం గ్రానైట్ తో తీర్చి దిద్దారు. ఎక్కడ చూసినా అంతా గ్రానైట్ మయం. లోపలకు అడుగుపెట్టగానే
గ్రానైట్ తో నిర్మించిన చిన్న వినాయకుడి గుడి. స్వామికి దణ్ణం పెట్టుకుని, పక్కనే గ్రానైట్ ఫ్రేం తో వున్న పెద్ద లిఫ్ట్ లో మాకు కేటాయించిన నాలుగో అంతస్తుకు
చేరాము. చివరికి మంచాలు కూడా గ్రానైట్ వే కావడం విశేషం. పరుపులు, దిండ్లు మాత్రం మామూలువే. మా అందరికీ ఒకే అంతస్తులో గదులు ఇచ్చారు. ప్రతి
గదిలో మూడు పడకలు. చక్కటి ఏసీ సదుపాయం. వారణాసిలో అక్టోబర్ మాసంలో అంతటి వేడి వాతావరణం వుంటుందని అస్సలు ఊహించలేదు.
GRT గెస్ట్
హౌస్ లో బస చేసినవారికి ఉదయం బెడ్ కాఫీ, తరువాత కాసేపటికి బ్రేక్ ఫాస్ట్, లంచ్, సాయంత్రం కాఫీ/ టీ, రాత్రి డిన్నర్ ఉచితం. గది అద్దె రోజుకు 1680 రూపాయలు. అయితే అన్నీ టైము ప్రకారం
జరుగుతాయి. కొంచెం ముందుగా కానీ, కాస్త ఆలస్యం అయినా కానీ సర్వీసు వుండదు. బయటకు
పోవాల్సిందే. డైనింగ్
హాల్, కుర్చీలు, బల్లలు అన్నీ శుభ్రంగా వున్నాయి. వంటలు
రుచిగా, శుచిగా
తయారు చేశారు. వేడివేడిగా అన్నం, ఒక కూర, పప్పు, పాయసం, సాంబారు, రసం. బ్రేక్ ఫాస్ట్ లో ఊతప్పం, దోసె, చట్నీ సాంబారు. సాంబారు మాత్రం
తప్పనిసరి. చెన్నై వంటవాళ్లు కాబట్టి సాంబారు రుచి స్పెషల్. బఫే పద్దతి. వడ్డన చేసే వాళ్ళు నవ్వు మొహంతో ఏదీ
కాదనకుండా, లేదనకుండా
అందర్నీ ఒకే మాదిరిగా కనుక్కున్నారు.
మా
కాశీ ప్రయాణానికి ఒక కారణం వుంది. సెప్టెంబర్ 30 మా అన్నయ్య రామచంద్ర రావు గారి పుట్టిన
రోజు. ఆ రోజున కాశీ వెళ్లి విశ్వేశ్వరుడి దర్శనం చేసుకోవాలి అనే ఆకాంక్షతో
పెట్టుకున్న యాత్ర ఇది. ఆ రాత్రి గెస్ట్ హౌస్ లోనే సింపుల్ గా కేక్ కట్ చేయించి, కుటుంబ సభ్యులు అందరం మా అన్నావదినల
ఆశీర్వాదం తీసుకున్నాం.
ఆన్
లైన్లో ముందుగానే బుక్ చేసిన హారతి దర్శనం కోసం అర్థరాత్రి రెండు
గంటలకు కాశీ విశ్వేశ్వరుడి దేవాలయానికి వెళ్ళాము. అలాగే పక్కనే అమ్మవారి దర్శనం. ఈ
దర్శనం కోసం బుక్ చేసుకున్న వాళ్ళు వెయ్యికి మించరు. కొంచెం క్యూ పద్దతి పాటిస్తే,
తోపులాట లేకుండా పదిహేను ఇరవై నిమిషాల్లో
అందరికీ చక్కటి దర్శనం లభించేది. గర్భగుడిలో లింగాన్ని చేతితో తాకి, స్పర్శ దర్శనం
చేసి బయటకు వచ్చాము.
ముప్పయ్యేళ్ల
క్రితం మాదిరిగా కాకుండా ఆలయ ప్రాంగణాన్ని విశాలంగా తీర్చి దిద్దారు. గర్భగుడిలో
తోపులాట గురించి కాస్త అసహనం వ్యక్తం చేసిన వారిని, మరో వైపు దేవుడ్ని దర్శించిన
తృప్తితో, భక్తి
పారవశ్యంతో బయటకు వచ్చిన వారిని ఒకే కంటితో చూస్తే ఒక సత్యం బోధపడింది. ఏదో గొప్పగా
జరుగుతుందని ఊహించుకుని వచ్చిన వారు మొదటి రకం. వారికి దేవుడి మీద కంటే కూడా
పరిసరాలను గమనించడంలోనే ఆసక్తి జాస్తి. ఇందులో నాబోటి వాళ్ళు కూడా వున్నారు. పొతే, మా బృందంలోనే చాలామంది, అలాగే భక్తుల్లో అనేకులు చక్కటి దర్శనం లభించింది అనే తృప్తితో గుడి
నుంచి బయటకు వచ్చారు. ఎందుకంటే వారి దృష్టి ఆ దేవదేవుడిపైనే లగ్నమై వుంది.
అర్ధనిమీలిత నేత్రాలతో శివ స్తోత్రాలు బిగ్గరగా చదువుతూ సాగుతున్న వారిని చూస్తే
వీరు కదా నిజమైన భక్తులు అనే భావన కలిగింది.
గంగమ్మ
తల్లి వరద మీద వున్న కారణంగా బోట్లు తిరగడం లేదు అనే సమాచారం కొంత నిరాశ పరిచింది.
బోటు నుంచి గంగా హారతి చూసే అవకాశం లేదు. చిన్న చిన్న సందుల్లో వెళ్లి చూసే
ప్రయత్నం చేశాము. పితృ పక్షాల సమయం ఏమో తెలియదు, శివుడికి ప్రీతికరమైన సోమవారం మహత్యమో తెలియదు, ఊరి మీద ఊరు పడ్డట్టు ఎక్కడ చూసినా
భక్త జన సందోహం. అంత జనంలో ఇంత మందిమి, అందులో ఒక చంటి పిల్ల మా మనుమరాలు జీవిక తప్పిపోకుండా చూసుకోవడం మరో పెద్ద సమస్య.
దేవాలయ
సందర్శన అనేది ఒక పర్యాటక వ్యవహారంలా కాకుండా ఆధ్యాత్మిక కోణంలో చూస్తే పరిసరాలు
కనపడవు, దేవుడు
తప్ప. అలాకాకుండా విహార యాత్ర మాదిరిగానో, వీ. వీ. ఐ. పీ దర్శనాలు చేసుకునే ఇతరుల
తోనో పోల్చి చూసుకోవడంతోనే సరిపెడితే పరిసరాలు కనపడతాయి కానీ, దేవుడు కనపడడు అనేవారు మా పెద్దన్నయ్య
పర్వతాలరావు గారు. కానీ జర్నలిస్టు బుద్ధి కదా! కనపడకూడనివి మాత్రమే కనపడతాయి.
దుర్గంధ భూయిష్టంగా వున్నఆ సందులన్నీ ఫోటో తీయాలనే తలంపు బలవంతాన మానుకున్నాను.
పైగా మర్నాడే స్వచ్చభారత్ వార్షికోత్సవం. భక్తుల ఓరిమి మీద అధికారులకు పూర్తి
నమ్మకం. పైగా
సెక్యూరిటీ జోన్ కారణమా అన్నది తెలియదు, మొబైల్ ఫోన్లకు కనెక్టివిటీ సమస్య. గుంపులో తప్పిపోతే ఒకరినొకరం కలుసుకోవడం ఇబ్బంది.
అంచేత వెంటనే బయలుదేరి గెస్ట్ హౌస్ కు వచ్చేశాము.
మర్నాడు
అయోధ్య ప్రయాణం. దాదాపు అయిదు గంటలు రోడ్డు మార్గంలో. దోవలో వరసగా అనేక ఫ్లై
ఓవర్లు నిర్మించారు. ఒకే రహదారిపై అన్ని ఫ్లై ఓవర్లు వెంటవెంటనే నిర్మించడం
ఆశ్చర్యం అనిపించింది. అటూ ఇటూ కలిపి నాలుగు లేన్ల రోడ్డు. మధ్యలో ఓ యాభయ్ కిలోమీటర్లు సింగిల్
రోడ్డు.
కాశీలో
మాదిరిగానే అయోధ్యలో కూడా గుడి చుట్టుపక్కల ఇరుకు సందులు. మాకిచ్చిన టైం స్లాట్
ఒంటి గంట నుంచి మూడు. సమయానికి చేరగలుగుతామా లేదా అనే సందేహం. మా అన్నయ్య కుమారుడు
సుభాష్ జీఎస్టీలో ఉన్నతాధికారి. ట్రాఫిక్ పోలీసులను ఒప్పించి దగ్గరి దారిలో తీసుకు
వెళ్ళడం వల్ల సరిగ్గా మాస్లాట్ టైం ముగిసేలోగా గుడికి చేరగలిగాము.
ముందుగానే
టిక్కెట్లు ఆన్ లైన్లో బుక్ చేసుకున్నoదు వల్ల శ్రమ లేకుండా బాల రాముడి
దర్శనం సులభంగా, చాలా
త్వరితంగా జరిగింది. 75 ఏళ్లు నిండిన మాలో ఆరుగురికి ఉచిత వీల్ చైర్ సౌకర్యం లభించింది. మాలో కొందరు రెండో
మారు కూడా దర్శనం చేసుకున్నారు. అక్కడ ఇంకా నిర్మాణాలు జరుగుతున్నాయి. అవన్నీ
పూర్తయిన నాడు, అయోధ్య
రామమందిరం కన్నుల పండువగా తయారవుతుంది. తర్వాత అయోధ్యలో కొత్తగా నిర్మించిన
స్టార్ హోటల్ రామాయణంలో భోజనాలు చేసి మళ్ళీ కాశీ చేరే సరికి బాగా పొద్దు పోయింది.
మర్నాడే
తిరుగు ప్రయాణం. ఈలోగా ఒక కబురు తెలిసింది. గంగలో పడవలపై ఆంక్షలు తీసేసారు అని.
వెంటనే పోలోమంటూ బయలుదేరి కేదార్ ఘాట్ చేరుకుని ఒక మోటారు బోటులో అన్ని ఘాట్లు
చూసుకుంటూ గంగలో కలయ తిరిగాము. చుట్టూ గంగ పారుతూ వున్నా కూడా ప్రతిఒక్కరికీ ఆ
ఎండలో దిగచెమటలు పట్టాయి. ఒకళ్లిద్దరం తప్పిస్తే మిగిలిన వాళ్ళు అందరూ బోటు దిగగానే గంగలో స్నానాలు చేశారు. గ్రీన్
ఆటోలు (బ్యాటరీతో నడిచేవి) పట్టుకుని అందరం గెస్ట్ హౌస్ కి తిరిగి వచ్చేసరికి
ఫ్లయిట్ టైమ్ అయింది. పన్నెండున్నర తర్వాత కానీ, గెస్ట్ హౌస్ లో లంచ్ మొదలు కాదు. నిరాహారంగానే
బయలుదేరి కార్లు ఎక్కి కూర్చున్నాము. ఇంతలో ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చి, కాశీకి వచ్చి భోజనం చేయకుండా
వెళ్ళడానికి వీలులేదు, మీకు అయిదు నిమిషాల్లో అన్నం వడ్డిస్తాను, రండి అని పిలిచాడు. అతని పేరు ముత్తు.
గెస్ట్ హౌస్ క్యాంటీన్ ఇన్చార్జి.
మాతా
అన్నపూర్ణేశ్వరి దయ, మన ప్రాప్తం అనుకుంటూ వెళ్లి, వేడి వేడిగా వడ్డించిన భోజనాలు చేసి
ఎయిర్ పోర్ట్ చేరుకున్నాము. అసాధ్యం అనుకున్న గంగాస్నానంతో పాటు అన్నపూర్ణమ్మ
తల్లి ప్రసాదం కూడా దొరకడం మా అదృష్టం.
ఇళ్ళల్లో
కళ్ళముందే పెరిగి పెద్దయిన పిల్లలు, తమ తలితండ్రులకు ఒక దశలో కుడి భుజం అవుతారు. భుజాలు ఒక్కటే కాదు, కాళ్ళూ చేతులు కళ్ళూ అన్నీ వాళ్ళే
అనడానికి మా ఈ కాశీ యాత్రే ఉదాహరణ. మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు, మా వదిన విమలాదేవి గారు ఈ విషయంలో మహా
అదృష్టవంతులు. వెళ్లిన గ్రూపులో దెబ్బయి దాటిన వాళ్ళం ఆరుగురం వున్నాం. మా అన్నయ్య
పిల్లలు జవహర్, సుభాష్, లాల్, వారి భార్యలు రేణు, హేమ, దీప, మా కోడలు నిషా, మా మేనల్లుడు రామచంద్రం భార్య కరుణ అస్తమానం వాళ్ళు కష్టపడుతూ, మేము ఏమాత్రం కష్టపడకుండా కనిపెట్టి చూసారు. వాళ్ళూ
మరీ చిన్నవాళ్లేమీ కాదు, కానీ పెద్ద మనసున్న వాళ్ళు.
హైదరాబాదు
నుంచి ఎప్పటికప్పుడు మా యోగ క్షేమాలు కనుక్కుంటూ అప్పటికప్పుడు అవసరమైన సాయం, లోకల్ ట్రాన్స్పోర్ట్, గంగలో తిరగడానికి బోటు వంటివి ఏర్పాటు
చేసిన మరో గొప్ప వ్యక్తి వున్నారు. వారి పేరు రమేష్ గారు. మా అన్నయ్య పెద్ద
కుమారుడు జవహర్ వియ్యంకులు. వీరందరికీ ఎన్ని ధన్యవాదాలు చెప్పినా
సరిపోదు. పోతే, రెండేళ్ల
పైచిలుకు వయసున్న నా మనుమరాలు జీవిక అర్ధరాత్రి లేపినా, ఏడిపించకుండా లేచి బుద్దిగా స్నానం
చేసి గుడికి వచ్చింది. వీల్ చైర్ లో నాతో పాటు కూర్చోమన్నా వినకుండా అంతంత దూరాలు
నడిచే తిరిగింది.
వీటన్నిటి
వెనుక మనకు తెలియని అర్థం కాని ఏదో అదృశ్య శక్తి వుంది అనుకోవడంలో తప్పేమీ లేదు.
అలాగే
అనుకుంటూ యాత్ర పూర్తి చేసుకుని, తిరిగి ఇండిగో ఎక్కి ముందు అనుకున్న విధంగానే
అక్టోబర్ రెండో తేదీ సాయంత్రానికి క్షేమంగా అందరం హైదరాబాద్ చేరాము.
కింది
ఫోటోల్లో వారణాసి ఎయిర్ పోర్టు వద్ద స్వాగతం, గంగలో పడవ ప్రయాణం, అయోధ్యలో రామాయణం హోటల్లో భోజనం, ప్రయాణం చివర్లో గ్రూపు సభ్యులు, చివర్లో కడుపు చల్లబరచి పంపిన గెస్ట్
హౌస్ కిచెన్ ఇన్ చార్జ్ ముత్తుతో నేను. అయోధ్యలో అన్న వితరణ సంస్థ వారు పంపిన
వీడియో లింక్ కూడా వుంది.
తోకటపా:
అయోధ్య వెళ్ళినప్పుడు నా కోడలు నిషా, మాకు ఎవరికీ తెలియకుండా, కూతురు
జీవికను వెంటబెట్టుకుని వెళ్లి చనిపోయిన నా కుమారుడు సంతోష్ పేరిట అక్కడి అన్నదాన
క్షేత్రానికి
విరాళం ఇచ్చింది. విచిత్రం ఏమిటంటే ఆ క్షేత్రం వారు సంతోష్ పేరిట అన్నదానం చేయడమే
కాకుండా ఆ వీడియోను పంపారు. కింది వీడియో అదే.
హిందీలో ఒక మెసేజ్ కూడా పెట్టారు.
“आज दिनांक ०२ अक्टूबर, बुधवार, आश्विन मास कृष्ण पक्ष अमावस्या श्राद्ध पक्ष तिथि पर श्री राम अन्न क्षेत्र श्री धाम अयोध्या जी में स्व•श्री स़ंतोष़ भण्डारू जी की पुण्य स्मृति के उपलक्ष्य में श्रीमती निशा अग्रवाल जी, राधा ज्वेलर्स, नया सड़क,कटक (उड़िसा) द्वारा आयोजित अस़हाय साधु संत महात्माओं के भण्डारे से पूर्व स्व•श्री स़ंतोष़ भण्डारू जी की आत्मिक शांति तथा श्रीमती निशा अग्रवाल जी और उनके सपरिवार के स्वस्थ सुखी समृद्धि दीर्घायु जीवन मंगल कामना के कल्याणार्थ श्री सीताराम नाम महामंत्र संकीर्तन होते हुए
Note: అయోధ్యలో నిర్మాణాలు అప్పటికి ఇంకా పూర్తి కానందువల్ల ఈ
కార్యక్రమాలను తాత్కాలిక షెడ్లలో నిర్వహిస్తున్నారు.
https://www.facebook.com/watch/?v=1742765339869689&rdid=96HFDkkQ3kzg4b7U
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి