రాత్రి ఏదో ఛానల్ లో పాత చిత్రం ఈడూ జోడు వచ్చింది.
కొల్లిపర బాల గంగాధర తిలక్ అంటే ఎవరు వారు అనే వాళ్ళు వుండవచ్చేమో కానీ, కె.బీ.తిలక్ అంటే గుర్తుపట్టని వాళ్ళు వుండరు.
తెలుగు చిత్రసీమ గ్రంథంలో ఆయనకో పేజీ వుంది. అంతటి దిగ్డర్శకుడు. తాను తీసిన భూమికోసం సినిమాలో ప్రముఖ నటి జయప్రదకు తొలిసారి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత. ముద్దుబిడ్డ, ఎమ్మెల్యే, అత్తా ఒకింటి కోడలే, ఉయ్యాల జంపాల మొదలైన అనేక చిత్రాలు ఆయన ఖాతాలో వున్నాయి. హిందీలో ఛోటీ బహు, కంగన్ చిత్రాలు తీశారు.
ఈ చిత్రాలు గురించి కేబీ తిలక్ తనకు చెప్పిన విశేషాలతో,’అనుపమ గీతాల తిలక్’ అనే పేరుతొ మిత్రుడు జ్వాలా నరసింహారావు ఏకంగా ఒక పుస్తకాన్నే రచించాడు.
2010 లో అమెరికా వెళ్లి, కొన్ని మాసాలు మా పిల్లల దగ్గర గడిపి హైదరాబాదు తిరిగి వచ్చేందుకు సియాటిల్ విమానాశ్రయానికి బయలుదేరడానికి సిద్ధం అవుతున్న సమయంలో పిడుగులాటి దుర్వార్త తెలిసింది ‘తిలక్ గారు ఇక లేర'ని. నేను హైదరాబాదు చేరడానికే గంటలు పడుతుంది. చివరి సారి ఆయన్ని చూడగలుగుతానో లేదో అనే ఆందోళనతో, ఆయన గురించిన జ్ఞాపకాలతో నా ప్రయాణం సాగింది.
తెలుగు సినిమా పరిశ్రమకు కురువృద్ధుడయినా మా దగ్గర మాత్రం ఒక పిల్లవాడిలా వుండే వారు. ఒకరకంగా ఆయనా నేనూ ఇరుగుపొరుగు. నేను పనిచేసే రేడియో స్టేషన్ ను ఆనుకునే నిజాం క్లబ్. ఆ క్లబ్ సభ్యుడిగా తిలక్ గారు ఎక్కువ సమయం అక్కడే గడుపుతుండేవారు. ఆయనకదో కాలక్షేపం.
పేకేటి శివరాం, కేబీ తిలక్ మంచి స్నేహితులు. రేడియో స్టేషన్ కు మరో వైపున వున్న ఫతే మైదాన్ క్లబ్ లో శివరాం సభ్యులు. ఆయన సభ్యత్వం సంఖ్య, నాకు గుర్తు వున్నంతవరకు మూడంటే మూడు. అంటే ఆ క్లబ్ మొదలయినప్పటి నుంచి అందులో పేకేటి సభ్యులు అన్నమాట. అంత సీనియర్ సభ్యుడు కాబట్టి అక్కడ పనిచేసేవాళ్ళు అందరూ ఆయన్ని ఇట్టే గుర్తు పట్టేవాళ్ళు. నిజాం క్లబ్ లో తిలక్ గారి పలుకుబడి కూడా అంతే.
సాయంత్రం మా ప్రాంతీయ వార్తలు ముగిసే సమయంలో ఈ ఇద్దరూ కలిసి న్యూస్ యూనిట్ కు వచ్చేవారు. మా క్యాంటీన్ టీ తాగుతూ మేము చెప్పే కబుర్లు వినే వారు. ఆరూ ఇరవై అయిదుకి ప్రాంతీయ వార్తలు సమాప్తం అనగానే పదండి పోదాం అనే వారు. ఈ లోపల మా పక్కనే యువవాణి కార్యక్రమాలు చూసే డాక్టర్ పీ ఎస్ గోపాల కృష్ణగారు వచ్చి పొద్దుటి నుంచి (వార్తలకోసం) పడ్డ శ్రమ గాలిలో కలిపేసారు కదా! అనేవారు నవ్వుతూ. (ఆయన ఆ తర్వాత ఆలిండియా రేడియో అడిషినల్ డైరెక్టర్ జనరల్ గా రిటైర్ అయ్యారు)
ఈ లోపల బీ హెచ్ ఈ ఎల్ లో పనిచేస్తున్న మిత్రుడు జ్వాలా నరసింహారావు వచ్చి కలిసేవాడు. న్యూస్ ఎడిటర్లు ఆకిరి రామకృష్ణారావు, ఆర్వీవీ కృష్ణారావు అందరం కలిసి అటు ఫతే మైదాన్ క్లబ్ కో, ఇటు నిజాం క్లబ్ కో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. బహుశా ఆ క్లబ్ లకి కాలినడకన వెళ్ళింది మేమే అనుకుంటా.
క్లబ్ లు సరే! కేబీ తిలక్ వంటి పెద్ద వాళ్ళు మా ఇళ్లకువచ్చి పోతుండేవారని చెబితే జనం ఒక పట్టాన నమ్మేవారు కాదు.
జ్వాలా ‘తిలక్ జ్ఞాపకాలు’ రాస్తున్నప్పుడు, తిలక్ గారు తెలతెల వారుతూనే, ఎక్కడో రెడ్ హిల్స్ నుంచి ఖైరతాబాద్ వరకూ మార్నింగ్ వాక్ లాగా జ్వాలా ఇంటికి నడుచుకుంటూ వచ్చి కాఫీ తాగి, తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుని వెడుతుండడం నాకు తెలుసు. ఆ జ్ఞాపకాలు పుస్తకరూపంలో రావడానికి పూర్వం ప్రజాతంత్ర పత్రికలో సీరియల్ గా వచ్చాయి.
24x7 టీవీ ఛానళ్ళు రాకపూర్వమే, ఏరోజు వార్తలను ఆ రోజే వీడియో కేసెట్లో రికార్డ్ చేసి కేబుల్ టీవీ ద్వారా ప్రసారం చేయించాలని ఆయన చేసిన ఒక చిరు ప్రయత్నంలో జ్వాలా, నేనూ, ఎమ్మెస్ శంకర్ ప్రధాన సూత్రధారులం.
ఆ ప్రోగ్రాం పేరు స్పందన. అప్పట్లో ఇండియా టుడే వాళ్ళు ఇలానే న్యూస్ ట్రాక్ పేరుతో ఒక కార్యక్రమం ప్రసారం చేసేవాళ్ళు. కాకపోతే తిలక్ గారి ఆలోచన ఒక అరగంట కార్యక్రమం విజువల్స్ తో రికార్డు చేసి ఆ కేసెట్ కాపీలను స్థానిక కేబుల్ ఆపరేటర్ల ద్వారా ఉదయం ఆరుగంటలకల్లా ప్రసారం అయ్యేలా చూడడం. కేసెట్ రికార్డింగ్ విషయంలో మా అందరికి కామన్ ఫ్రెండ్ శ్రీ అట్లూరి సుబ్బారావు సాయపడేవారు.
కానీ అది పూర్తి స్థాయిలో కార్యరూపం ధరించలేదు. మ్యాన్ పవర్ వున్నా, మనీ పవర్ లేకపోవడమే ప్రధాన కారణం.
ఈ కార్యక్రమం కోసం నాచేత నాలుగు ముక్కలు రాయించడానికి ఆయన ఎంతో ప్రయాసపడేవారు. ‘నీ వెంటబడి రాయించడం నా చేతకావట్లేదు. నీకంటే సినిమా రైటర్లే ఎంతో నయం’ అనేవారు.
మా ముందు కూర్చున్నది ఎవరో కాదు, ఒకనాడు తన అద్భుత చిత్రాలతో తెలుగు చిత్ర రంగాన్ని ఒక మలుపు తిప్పిన పెద్ద మనిషి అని తెలిసి కూడా మేము లైట్ తీసుకునేవాళ్ళం. అది మా అజ్ఞానం. మమ్మల్ని ఓపికగా భరించగలగడం ఆయన గొప్పతనం. వయస్సులో చాలా తేడా వున్నా, మాతో ఆయన చాలా పొద్దుపోయేదాకా గడిపేవారు.
అహంకారం, అభిజాత్యం సుతరామూ లేని మనిషి. అంతటి పెద్ద మనిషితో, అంత పెద్ద మనసున్న ‘మహా మనీషి’ తో కొన్నేళ్లపాటు అతి సన్నిహితంగా మెలగగలిగిన అవకాశం రావడాన్ని మించిన అదృష్టం ఏముంటుంది?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి