గతి తప్పిన వర్తమానం
‘ఇలా కాదు, ఒకరోజు మీ ఇంటికి వస్తాను, చాలా రోజులుగా వాయిదా పడుతోంది. ఈసారి తప్పకుండా వస్తాను’ అన్నారు నాతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.
హడావిడిలో వుండి కూడా కాసేపు నిలబడి ఆప్యాయంగా మాట్లాడారు. బాధ్యతలు ఎక్కువ. ఈరోజు హైదరాబాదు, మర్నాడు ఢిల్లీ. మరో రోజు ఖమ్మం. మధ్య మధ్యలో గంటలకు గంటలు సమీక్షా సమావేశాలు. అనుకుంటారు కానీ మంత్రుల కష్టాలు మంత్రులవి.
‘మీ ఇంటికి వస్తాను’ అన్నవారిని గట్టిగా ‘అవును, రండి’ అని అనలేని పరిస్థితి నాది. ఇంట్లో కప్పు కాఫీ ఇచ్చే దక్షత లేదు. చాలా మంది ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటారు, ‘రేపు కలుద్దాం’ అని. నేనే ఏదో వంక చెబుతాను. 'దాటవేస్తున్నాను' అని తెలిసిపోతూనే వుంటుంది.
పాతికేళ్ళ నాటి లిఫ్ట్ పడకేసి పక్షం రోజులు అయింది. బాగు చేయించే, బాగుపడే సూచనలు ప్రస్తుతానికి కనపడడం లేదు. మూడు అంతస్తులు ఎక్కి దిగాలంటే అదో ప్రయాస. ఎక్కిదిగమని చెప్పడానికి నామోషీ. ఇవన్నీ వెళ్ళబోసుకోవడం ఇష్టం లేక ఏదో కారణం చెబుతాను.
మిత్రుడు Ramnath Kampamalla మొన్నొకరోజు నన్ను చూద్దామని వచ్చి మూడు అంతస్తులు ఎక్కి కాలింగ్ బెల్ కొట్టి, రెస్పాన్స్ లేక పాపం మళ్ళీ అన్ని మెట్లు దిగి వెళ్లిపోయారట. ఇట్లావుంటుంది నాతోని.
అందుకే నెలకో రెండు నెలలకో ఒకసారి మిత్రులను కలిసే సందర్భం చూసుకుని ఇటువంటి సమావేశాలకు వెడుతుంటాను.
నిన్న అలాగే కేవీపీ రామచంద్రరావు గారు పిలిస్తే, జ్వాలాతో కలిసి వై.ఎస్.ఆర్. అవార్డు ప్రదానోత్సవానికి వెళ్లాను. దశపల్లా హోటలు హాలు మొత్తం వచ్చిన అతిధులతో కిటకిటలాడుతోంది.
వై.ఎస్. చనిపోయి పదహారేళ్ళు. రాజకీయాల్లో ప్రాణం కాదు, పదవి పోతేనే మొహం చాటేసే రోజుల్లో ఇంతమంది జనం. నిజంగా అబ్బురం.
అనుకున్నట్టే ఒకనాటి పాత్రికేయ మితృలు అందరూ ఒక చోటనే కలిసారు. వీరువారని లేదు. చాలామందిమి కలిశాము. ఒకానొక రోజుల్లో రోజూ కలిసేవాళ్ళం సచివాలయంలోనో, పార్టీల ఆఫీసుల్లోనో. ఒకరినొకరం పలకరించుకుని సంతోష పడ్డాము. అలాగే పాత తరం రాజకీయ నాయకులు. కొత్తతరం వాళ్ళు. పాత వారితో గట్టి పరిచయం. కొత్తవారితో ముఖ పరిచయం.
కేవీపీ గారు అమ్మాయి పెళ్లి చేసే వధువు తండ్రి మాదిరిగా అందరినీ పేరుపేరునా పలకరిస్తున్నారు. బాగా అలసిపోయినట్టు మొహం చూస్తేనే తెలుస్తోంది. కానీ వై.ఎస్. తో ఆయనకు వున్న మిత్రబంధం అలసటను అధిగమించిందని అనిపించింది.
ప్రసంగం మధ్యలో షర్మిల రాక గమనించిన ముఖ్యమంత్రి రేవంత రెడ్డి గారు, ‘వేదిక మీదకు వచ్చి కూర్చోండి, నా కుర్చీ ఖాళీగానే వుంది’ అనడం ఒక విశేషం.
గతంలో ముఖ్యమంత్రిగా వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారు చేసిన అనేక మంచి పనులను గురించి వక్తలు అందరూ ఏకధాటితో ప్రసంశలు కురిపిస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేదిక మీదనే దాదాపు రెండు గంటలు ప్రశాంతచిత్తంతో వినడం, కేవీపీ గారు తన ప్రసంగంలో ప్రస్తావించినట్టు, ఈనాటి రాజకీయాల్లో గొప్ప విషయమే.
మాట్లాడిన వాళ్ళు, విన్న వాళ్ళు వై.ఎస్. గురించిన తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
ఘనమైన మనిషికి ఘనమైన నివాళి.
“బాగా తగ్గిపోయారు” అన్నారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారు సభ ముగిసిన తర్వాత నేను కనిపిస్తే.
“అవునండీ! టీవీ చర్చలు పూర్తిగా తగ్గించుకున్నాను” అనబోయాను.
“యంగెస్ట్ జర్నలిస్ట్. ఏజ్ ఎనభై ఓన్లీ" అన్నారు పక్కనుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు.
“నిజమా! ఏమిటి రహస్యం”
“అది ఇక్కడ చెప్పేది కాదు లెండి” అని తప్పించుకున్నాను.
వై ఎస్. జీవితంలో చిరస్మరణీయమైన ఘట్టాలతో ఫోటోగ్రాఫర్ మిత్రుడు రవీంద్ర రెడ్డి సారధ్యంలో ఏర్చి కూర్చిన ఫోటో ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది.
చాలా రోజుల తర్వాత ఆహ్లాదంగా, ఆనందంగా గడిచిన సాయంత్రం.
ఇంతకీ చెప్పాలి అనుకున్నది ఏమిటంటే...
నేను రేడియో విలేకరిని.
నా పరిధి మించి ఒకరిని పొగుడుతూ రాయలేను. అలాగే హద్దులు దాటి తెగడలేను.
గోడమీద పిల్లి అన్నా బాధ పడను.
ఈ విషయం నా కంటే, నాతో మంచి పరిచయం వున్న రాజకీయ నాయకులకే బాగా తెలుసు.
నేను నా స్కూటర్ కిందే పడి కాలు విరగగొట్టుకుని, ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగి కోలుకుంటున్నప్పుడు అప్పుడు మొదటిసారి ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు నాయుడు గారు, అతి కీలకమైన లోకసభ మధ్యంతర ఎన్నికల ప్రచారంలో తలమునకలుగా వుండి కూడా తీరిక చేసుకుని నన్ను చూడడానికి ఆసుపత్రికి వచ్చారు. యోగక్షేమాలు కనుక్కున్నారు.
వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా వున్నప్పుడు, విలేకరుల ఇష్టాగోష్టి సమయంలో నా గురించి ఒక విలేకరి, ‘శ్రీనివాసరావు పొద్దస్తమానం సీ ఎం చంద్రబాబు ఆఫీసులోనే వుంటాడు’ అని వ్యంగ్యంగా అంటే, వై.ఎస్. ఆర్. గారు ఆప్యాయంగా నా భుజం మీద చేయి వేసి, ఆ విలేకరిని వారించిన సందర్భం, నన్ను సమర్థిస్తూ మాట్లాడిన వైనం నేనెన్నడు మరచిపోలేను.
వారి హోదాలకు తగిన రీతిలో పిలవకపోయినా, ఆ ఇద్దరు, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా వుంటూ, పాత్రలు మారిన తర్వాత కూడా నా ఇద్దరు పిల్లల పెళ్లిళ్లకు వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించడం వారి మంచితనం, గొప్పతనం.
2005 డిసెంబరు 31 వ తేదీన హైదరాబాదు దూరదర్సన్ నుంచి రిటైర్ అయ్యేవరకు, ఏ పత్రికకు ఏనాడు రాజకీయ వ్యాసాలు రాయలేదు. ఏ టీవీ చర్చల్లో పాల్గొనలేదు. ఒక మీడియాలో పనిచేస్తూ వేరే మీడియాలో పాల్గొనడం నాకు ఇష్టం వుండేది కాదు.
ఆ తర్వాత నేను పాల్గొనని టీవీ లేదు, రాయని పత్రిక లేదు.
అలా సంవత్సరాల తరబడి మూడు పూటలా రోజుకో టీవీ చర్చలకు వెడుతుండే నాకు వారాలబ్బాయి అని పేరు కూడా పెట్టారు. ఇక వెబ్ ఛానల్స్ అనంతం. వాళ్ళు ఏ అంశం మీద అడిగినా చప్పున వ్యాఖ్యానించడానికి ఎప్పుడూ సిద్ధంగా వుండేవాడిని. అనేక ఛానల్స్ మా ఇంటి నుంచే ఓబీ వ్యాన్లు పంపి లైవ్ తీసుకునేవి.
రా వద్దని ఏ టీవీ అనలేదు, రాయవద్దని ఏ పత్రిక వాళ్ళు అనలేదు.
మాట్లాడడం ఎప్పుడు ఆపాలో తెలిసిన వాడే మంచి వక్త కాగలుగుతాడు. రాయడం ఎప్పుడు ఆపాలో గ్రహించిన వాడే మంచి రచయితగా మిగిలిపోతాడు. ఇలాంటి సూక్తులు అన్నీ అనేకం రాసిన నేను, ఒకరోజు శుభ ముహూర్తం చూసుకుని రాజకీయ చర్చలకు మంగళం పాడేసాను. మారిన పరిస్థితులు, మారుతున్న పరిస్థితులు, మారబోయే పరిస్థితులు కొంత కారణం అనుకోండి. ఇక చాలు అనుకున్న తరువాత, ఆశ్చర్యంగా దిగజారుతున్న నా ఆరోగ్యం బాగుపడింది. హాయిగా ఇంటిపట్టున కూర్చుని, నా మానాన నేను నా సొంత సంగతులు రాసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను.
ఇప్పటికి నా బిగ్ జీరో అక్షరాలా రెండువందల పన్నెండు భాగాలు పూర్తయ్యాయి. తరువాత కొంత గ్యాప్ వచ్చింది. కారణం నా మనుమరాలు జీవిక.
తనని చూడడానికి గణేష్ చతుర్థికి కటక్ వెళ్ళాను. వున్నది నాలుగు రోజులే. సెలవులు కావడం వల్ల తనతోనే కాలక్షేపం. దానితో సర్వం మరచిపోయాను. తాతా తాతా అంటూ నా చుట్టూనే తిరిగేది. నా పక్కలోనే నిద్రపోయేది. నిద్ర పట్టని నాకు ఒకటే ఆలోచన. నా పిల్లలతో కూడా నేనిలా సన్నిహితంగా, ప్రేమగా మసలిన సందర్భాలు అతి తక్కువ. కాదు, కాదు, అసలు లేవనే చెప్పగలను. అసలు కంటే వడ్డీ ముద్దు అంటారు. సృష్టి చేసే మాయల్లో ఇదొకటి.
(ఇంకా వుంది)